తిరుమలేశుని సన్నిధిలో… -5

0
8

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్వేతద్వీపం

[dropcap]2[/dropcap]005 ఫిబ్రవరి 28న నేను ఢిల్లీలో దూరదర్శన్‌లో డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా (ఇప్పుడు ఆ పోస్టును అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా పిలుస్తున్నారు) రిటైరయ్యాను. ఆ రోజు సాయంకాలం 4 గంటలప్పుడు హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ కంగారుగా నాకు ఫోన్ చేశాడు.

“సార్! మీరు పెన్షన్ కోసం ప్రారంభించిన కొత్త ఎకౌంట్‌లో ఈ రోజు ఒక ఎంట్రీ  పొరబాటున క్రెడిట్ అయ్యింది సార్!” అన్నాడు.

“ఎంత అమౌంట్?” అన్నాను

“పన్నెండు లక్షల పై చిలుకు సార్!” అన్నాడు.

ఒక్క క్షణం ఆలోచించాను. వెంటనే – “అది పొరపాటు కాదు. నాకు జి.పి.ఎఫ్‌లో వున్న మొత్తం రిటైర్‌మెంట్ రోజు క్రెడిట్ అయ్యింది. మా ఆఫీసు వాళ్ళు నాకు ఇప్పుడే శాంక్షన్ లెటర్ పంపారు” అన్నాను.

మేనేజర్ కుదుటపడ్డాడు.

“సారీ సార్! మరోలా అనుకున్నాను” అని సంభాషణ ముగించాడు.

ఆ సాయంకాలం నాకు వీడ్కోలు సభ జరిగింది. అందులో మా డైరక్టర్ జనరల్ నవీన్ కుమార్ నా గురించి మంచిమాటలు చెప్పి శాలువాతో సత్కరించారు. అప్పుడే డి.డి.జి.గా డైరక్టరేటులో చేరిన మిత్రులు ఆర్. వెంకటేశ్వర్లు నా పరిచయాలు, పరపతి గురించి ఘనంగా మాట్లాడారు.

‘రిటైరయిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ సెటిల్ అవుతార’నే ప్రశ్న మిత్రులు వేశారు. రిటైరయిన తర్వాత రెండు నెలలు అక్కడే వుండి ప్రయత్నిస్తే, కన్సల్టెంట్‌గా ప్రసారభారతిలో అవకాశం వుండేది. కాని, నేను మార్చి 17న హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాను.

మార్చి 17 ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి నేను, మా ఆవిడ శోభాదేవి చేరుకున్నాము. అక్కడ లౌంజ్‌లో ఏ.పి.వి.యన్.శర్మగారు మదరాసు ఫ్లయిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిని లోగడ నేను రెండుసార్లు మాత్రమే కలిశాను.

“నమస్కారం సార్” అన్నాను.

“హైదరాబాద్ టూర్ మీద వెళ్తున్నారా?” అని ప్రశ్నించారు.

“రిటైరయ్యాను సార్!”

ఆశ్చర్యంగా చూశారు.

అప్రయత్నంగా నా నోటివెంట ఈ మాటలు వచ్చాయి. “అవకాశం లభిస్తే, నేనూ తిరుపతి దేవస్థానంలో పనిచేయాలని కోరిక సార్!” అన్నాను.

శర్మగారు ఫిబ్రవరి 2005లో తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా చేరారు. ఇంతలో మదరాసు విమానం చెకింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఆయనకు వీడ్కోలు చెప్పాను.

యథాలాపంగా నేను మాట్లాడిన మాటలు భగవంతుడే పలికించాడు. హైదరాబాద్ వెళ్లగానే నేను శర్మగారికి ఒక అప్లికేషన్, బయోడేటా పంపాను. ఏప్రిల్ నెలాఖరులో జరిగిన టి.టి.డి. బోర్డు మీటింగ్‌లో నా దరఖాస్తు ప్రవేశపెట్టబడి కో-ఆర్డినేటర్‌గా నియాకం చేయడానికి తీర్మానించడమైనది.

మే మొదటివారంలో ఆర్డరు వచ్చింది. సంవత్సర కాలం నిర్ణయించారు. మే 11వ తేదీ అక్షయ తృతీయ రోజున తిరుపతిలో దేవస్థానం పరిపాలనా భవనంలో చేరాను.

1965లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థిగా తిరుపతి గడప తొక్కిన నేను, మళ్ళీ సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత 2005 మే లో తిరుపతి దేవస్థానోద్యోగిగా చేరతానని కలలో కూడా ఊహించలేదు. 1997లో నా జాతక పరిశీలన చేసిన రాచగుండ్ల చెంచలరావు ఆనాడే చెప్పారు: “రిటైర్‌మెంట్ తర్వాత మీరు మరో ఉద్యోగం చేస్తారు” అని. అది సఫలమైంది. నాకు మూడేళ్ళ వయస్సులో ఆయన మా ఊరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చి నా జాతకం వేసి  “మీవాడు దేశ రాజధాని దాకా ఎదుగుతాడు” అని భవిష్యత్తు చెప్పారు.

తి.తి.దే ఉద్యోగం:

తిరుపతిలోని పరిపాలనా భవనంలోకి అడుగుపెట్టగానే మహాద్వారం లోపలే వున్న నిలువెత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహానికి మోకరిల్లి నమస్కరించాను. శర్మగారు తిరుమలో మీటింగ్‌లో వున్నారు. నేను పక్కనే జె.ఈ.వో ముక్తేశ్వరరావును కలిసి నా జాయినింగ్ రిపోర్ట్ యిచ్చాను.

“మీ గురించి ఈవో గారు గొప్పగా చెప్పారు. మీ ఆఫీసు ‘శ్వేత’ బిల్డింగ్‌లో వుంది. మీరు దృశ్య శ్రవణ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు” అన్నారు ముక్తేశ్వరరావు. ఆయన సాహితీప్రియుడు.

బోర్డువారు ఆమోదించిన తీర్మానం ప్రకారం – నేను దేవస్థానంలోని వివిధ సాఫ్ట్ ప్రాజెక్టుల పర్యవేక్షణ చేయాలి. కాని, దాని అమలుపరిచే విషయంలో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు, వ్యక్తుల అభ్యంతరాలు తోడ్పడ్డాయి. చివరకు నా హోదా డైరక్టరు లేదా కో-ఆర్డినేటర్ – అనే అంశంపై చర్చ జరిగింది. లోగడ డైరక్టర్ వుండేవారు. ఇప్పుడు దానిని కో-ఆర్డినేటర్‌గా ఖాయపరిచారు. ఆఫీసు కారు, క్వార్టర్సు ఇచ్చారు.

శ్వేతభవనం:

ఇది White House కాదు. కాని, అప్పట్లో అది కీలక భవనం. 1980 దశకంలో మహనీయులు, మార్గదర్శి అయిన  పి.వి.ఆర్.కె. ప్రసాద్ హయాంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ మహాద్వారానికి ఎదురుగా, పద్మావతీ అతిథి గృహానికీ, ఈవో నివాసబంగళాకు ఆనుకొని మూడంతస్తుల భవనం నిర్మించారు. రామకృష్ణమఠం అధిపతి స్వామీ రంగనాథానంద ఆ భవనం ప్రారంభం చేశారు. అందులో తొలి అంతస్తులో ప్రధానంగా గ్రంథాలయం ఉంది. దాదాపు లక్షకు పైగా గ్రంథాలు, ఒక లైబ్రేరియన్‌తో ఆ సంస్థ పని మొదలుపెట్టింది. దిన, వార, మాస పత్రికలు చదవడానికి సకృత్తుగా పాఠకులు వస్తారు.

తిరుపతి పట్టణానికి ఒక చివరలో ఈ భవనం ఉండటాం మూలాన సాధారణ పాఠకులు అంతగా ఈ సౌకర్యం వినియోగించుకోవడం లేదు. శ్రీమతి లీలావతి ఈ భవనంలో లైబ్రేరియన్‌గా రెండు దశాబ్దాలు పని చేశారు. డాక్టరేట్ కూడా సంపాదించారు.

SVETA:

ఈ భవనానికి Sri Venkateshwara Employees Training Academy అని సంక్షిప్తంగా ‘శ్వేత’ అని నామకరణం చేశారు. దేవస్థానం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. 2005లో ఈ భవనంలో క్రింది భాగంలో దృశ్య, శ్రవణ ప్రాజెక్టు విభాగం కో-ఆర్డినేటర్‌గా చేరాను. ఈ అంతస్తులోనే ‘శ్వేత’ డైరక్టర్‌గా ‘భూమన్’ పనిచేస్తూ, ఆ కార్యాలయానికి జవజీవాలు పోశారు. శిక్షణకు ఊపునిచ్చారు. ఈ మూడంతస్తుల భవనంలో తలదాచుకునే వివిధ సంస్థల గురించి తర్వాత ప్రస్తావిస్తాను.

దాదాపు 10 వేల మంది దేవస్థానం ఉద్యోగులకు ఆధ్యాత్మిక సంపద గూర్చి, ఆచార వ్యవహారాల గూర్చి, క్రమశిక్షణ గూర్చి, ఆలయాల విశిష్టత గూర్చి శిక్షణ యివ్వడం ‘శ్వేత’ లక్ష్యం. దేవస్థానం సీనియర్ అధికారులు, తిరుపతిలోని విద్యా సంస్థల అధ్యాపకులు, నిపుణులు ఉపన్యాసాలిచ్చే వ్యవస్థ వుంది. ఈ శిక్షణా వ్యవహారాల నిర్వహణకు సూపరింటెండెంట్ హోదా గల అధికారితో బాటు సిబ్బంది కూడా డైరక్టరేట్‌కు సహకరించేవారు.

భూమన్ క్రియాశీలవ్యక్తి. ఉద్యమ నాయకుడు. అప్పట్లో భూమన కరుణాకరరెడ్డి తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు. ఏ.పి.వి.యన్.శర్మగారు కార్యనిర్వహణాధికారి. కొండ మీద ఏ.వి. ధర్మారెడ్డి, తిరుపతిలో యన్. ముక్తేశ్వరరావులు సహాయ కార్యనిర్వహణాధికారులు.

భూమన్ శిక్షణా వ్యవస్థ రూపురేఖలు మార్చివేసి జవసత్వాలు తెచ్చారు. నేను కూడా ఐదేళ్ళ కాలంలో ‘శ్వేత’లో వివిధాంశాలపై యాభైకి పైగా పాఠాలు చెప్పాను. ఎక్కువగా నేను అభిమానించిన అంశం ‘పండుగలు – విశిష్టత’. దానికిగా చైత్రం మొదలు ఫాల్గుణ మాసం వరకు ఏ పండుగలు వస్తాయొ పంచాంగం చూసి ఒక ఛార్ట్ తయారు చేశాను. పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు వచ్చే పండుగల లిస్ట్ తయారు చేశాను. ఉద్యోగులు తమ నోట్‌బుక్‌లో అవి శ్రద్ధగా వ్రాసుకునేవారు.

అర్చక శిక్షణ:

భూమన్ ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం ఇది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి గిరిజన ప్రదేశాలలో హిందూత్వాన్ని బలపరచడానికి ఆయా గ్రామాలలో ఎంపిక చేసిన వ్యక్తులకు 10 రోజులు వసతి కల్పించి, అర్చనా విధానాన్ని నేర్పించేవారు. దాదాపు వెయ్యిమందికి ఈ శిక్షణ యివ్వగలిగారు. ఇప్పుడు అర్చక శిక్షణా సంస్థ ప్రత్యేక విభాగమై సుప్రసిద్ధ పండితులు పమిడికాల్వ సుబ్బయ్య ఆధ్వర్యంలో నెల నెలా శిక్షణ అందిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రామమునిరెడ్ది ఆయనకు సహకరిస్తున్నారు. ఇదొక ఉద్యమంగా నడుపబడుతోంది.

డిజిటలైజేషన్:

కార్నమెల్ విశ్వవిద్యాలయానికి చెందిన డా. రాజిరెడ్డి ఆధ్వర్యంలో లక్ష గ్రంథాల డిజిటలైజేషన్ ప్రాజెక్టుకు దేవస్థానం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. శ్వేతభవనంలో నాలుగైదేళ్ల పాటు దేశంలోని వివిధ గ్రంథాలను డిజిటలైజేషన్ చేశారు. దానికిగా యంత్రాలు, స్కానింగ్ చేసే వ్యవస్థ మొదటి అంతస్తులో ఏర్పరిచారు. పదిహేనుమంది ఆపరేటర్లు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇదొక అరుదైన కార్యక్రమం. ఈ ప్రక్రియ పరిశీలనకు దేవస్థానం నుండి ఒక బృందం చైనా పర్యటించి వివరాలు తెలుసుకొని వచ్చారు. ఇప్పుడే వేలాది గ్రంథాలు పాఠకులకు సులభంగా లభ్యమవుతున్నాయి.

మొదటి అంతస్తులో ఒక విశాల ఆడిటోరియం వుంది. అక్కడ తరచు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమయ్య జయంతులు, వెంగమాంబ జయంతులు, వర్ధంతులకు ఈ హాలు బాగా ఉపయోగపడుతోంది. ప్రముఖుల ప్రసంగాలు రికార్డు చేసే వ్యవస్థ కూడా వుంది. భూమన్ పదవీ విరమణాంతరం తాళ్ళూరి ఆంజనేయులు రెండేళ్ళు డైరక్టర్‌గా చేశారు. ప్రస్తుతం 2018 చివరి నుండి యన్. ముక్తేశ్వరరావు ఈ సంస్థ డైరక్టరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here