జీవన రమణీయం-47

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఇ[/dropcap]క్కడ ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కి యువకళావాహిని వారు అంటే వై.కె. నాగేశ్వరరావు గారి సంస్థ ‘ఉత్తమ మాటల రచయిత’ అవార్డు ప్రకటించారు. ఇంతకు ముందే వంశీ రామరాజు గారు నాకు ‘రేపల్లెలో రాధ’కి గాను వంశీ బర్కిలీ అవార్డును ఇచ్చారు, ‘ఉత్తమ కథ’ అని.

కె.ఎస్. రామారావు గారు, నా నవలల హక్కులు ‘మొగుడే రెండో ప్రియుడు’కే కాదు, ఇంకా, ‘ప్రేమించాకా ఏమైందంటే’, ‘అవునంటే కాదంటా’, ‘ఆలింగనం’లకి ఎడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. నా దురదృష్టం కొద్దీ ఒక్కటి కూడా సినిమాగా రాలేదు! ఈ మధ్యలో హీరో శ్రీకాంత్ అక్క నిర్మల గారు టీ.వీ. సీరియల్ నిర్మించదలచి, ఈయనని కలిసి సలహా అడిగితే, ఈయన “‘ఆలింగనం’ అని బలభద్రపాత్రుని రమణి గారి నవల చాలా బావుంటుంది… తీస్కోండి” అని చెప్పారుట.

నిర్మల గారు వెంటనే “నాకు చాలా ఇష్టమైన రచయిత్రి ఆవిడ. ఆవిడ నవలలన్నీ చదివాను… ‘ఆలింగనం’ మరీ మరీ ఇష్టం!” అని నాకు ఫోన్ చేసారు. నేను ‘సరే’ అన్నాను. ముఖ్యంగా నేను మరిచిపోకుండా చెప్పాల్సిన విషయం ఒకటి వుంది… సంవత్సరం కాలం పాటు, నేను టీచర్ వుద్యోగం మానేసాకా, కాంతిశిఖర లోని కె.ఎస్. రామారావుగారి ఆఫీస్ నుండి నాకు నెల నెలా ఐదువేలు జీతం ఏర్పాటు చేసారాయన! ఐదువందల వుద్యోగం పోతే… నెలకి ఐదువేలు సంపాదించా… అరవై వేల దాకా ముట్టింది కదా అందుకే ఆ తర్వాత ఆయన ‘ఎవరే అతగాడు’ సినిమా మొదలయ్యాకా డబ్బులు పంపడం మానేసారు. నేను సినిమా చివర్లో, ఈ కథకి మీరు ఏం ఇస్తారని ఫోన్ చేసి డైరక్ట్‌గా అడిగితే, “నేను ఇప్పటిదాకా ఇచ్చినది, దీనికి జమ కట్టుకోండి” అన్నారు. నేను మళ్ళీ అడగలేదు… ఆ డబ్బులకి గాను టీ.వీ. సీరియల్ స్క్రిప్ట్ ‘లేడీస్ హాస్టల్’, డైలాగ్స్‌తో సహా రాసాను… అదీ తియ్యలేదు. అందుకే వూరుకున్నాను. పైకి ఏమీ అనలేదు… ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ దాకా నేను షూటింగ్ విశేషాలని కూడా కనుక్కోలేదు.

ఆ సమయంలో శ్రీకాంత్ గారి అక్కగారితో, అతని కుటుంబంతో పరిచయం… పాపం పాతికవేలు ఎడ్వాన్స్ ఇచ్చి, స్క్రిప్ట్ రాయించినట్లు గుర్తు! వెంకటపతిరాజు అని ఓ డైరక్టర్‍ని పెట్టారు. ఆయన కూడా నా స్క్రిప్ట్ చదివి చాలా ఆనందపడ్డారు. ఆయనకి ‘నంది’ అవార్డు వచ్చిందని తెలిసి, నేను ఆయన్ని చాలా గౌరవించేదాన్ని! ‘అసలింత పెద్ద పెద్ద అవార్డులు ఎలా వస్తాయో కదా!’ అని కూడా అనుకునేదాన్ని!

గంటి వెంకట రమణ గారిది అనుకుంట, స్వాతిలో ‘అద్దె తల్లి తండ్రులు’ అనో ఏదో నవల వచ్చింది, ఆ నవల హక్కులు కొని, కె. ఉషారాణిగారిని డైలాగ్స్‌కి పెట్టి, ఆ సీరియల్ స్క్రిప్ట్ కూడా రాయించారు నిర్మలగారూ, భర్తా.  వీళ్ళు చాలా మంచి మనుషులూ, స్నేహశీలురూ, శ్రీకాంత్ గారి తల్లి తండ్రులు కూడా చాలా సంస్కారులు. ఈ నిర్మల గారి అమ్మాయి ‘రేష్మ’నే తర్వాత గోపీచంద్ అనే హీరో పెళ్ళి చేసుకున్నాడు. నేను సీరియల్ రాసే రోజుల్లో చాలా చిన్నపిల్ల, స్కూల్‍కి వెళ్ళేది. మా ఉమా కూతురు దీప్తికి క్లాస్‌మేట్!

ఈ రెండు స్క్రిప్ట్‌లూ పక్కాగా రాయించి, ఈ.టీ.వీలో సుమన్ గారికి సబ్‍మిట్ చేయించారు. కానీ ఏమీ పని కాలేదు! చాలా రోజులు శ్రీకాంత్ కూడా స్వయంగా సుమన్ గారికి ఫోన్ చేసినా, ప్రయోజనం కనిపించలేదు.

***

అక్కినేని నాగేశ్వరరావు గారితో ‘లీడర్’ పుస్తకం ద్వారా నాకు పరిచయం కలిగాకా, ఆయన వున్నంత కాలం ఎక్కడా, మా స్నేహానికి విఘాతం రాలేదు. ఆయన ఎఫ్.డి.సి.కి డైరక్టర్ అయినప్పుడు, నన్ను టీ.వీ. నంది అవార్డులకి జ్యూరీలో మెంబర్‌గా వేసారు. ఆయన గురించిన ఏ కార్యక్రమం అయినా నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు! అలాగే ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల పాత్రల మీద ఒక సమాలోచనం జరిగింది సిటీ సెంట్రల్ లైబ్రరీలో. దానికి తుర్లపాటి కుటుంబరావు గారూ, కె.బి.లక్ష్మిగారూ, ఇలా చాలా మంది వ్యక్తలొచ్చి మాట్లాడారు. నేనూ, మా అమ్మా మొదటి వరుసలో కూర్చుని, వక్తలు ఆయన దేవదాసూ, అర్ధాంగీ మొదలైన సినిమాల గురించి  మాట్లాడ్తుంటే ఎంతో ఆసక్తిగా విన్నాం… ప్రోగ్రాం చివరలో తుర్లపాటి కుటుంబరావు గారు “సభకి వక్తలు మాత్రమే కాదు… ఈ ముందు వరుసలో కూర్చున్న వీళ్ళలాంటి శ్రోతలూ చాలా అవసరం!” అన్నారు.

అప్పుడు నాకు రాగసప్తస్వరం రాజ్యలక్ష్మి పరిచయం అయింది. నాగేశ్వరరావు గారు నన్ను చూపించి ఆవిడతో, “ఈ రమణీ ప్రభాకర్, నాకు చాలా ఆప్తురాలు, మంచి రచయిత్రి” అన్నారు. అప్పుడు కలిసిన ఆ స్నేహం రమారమి 20 ఏళ్ళు చాలా వుధృతంగా సాగింది. నేను ఆ సంస్థకి ‘ఆర్గనైజర్’గా వుండి నా సినీ సంబంధాలతో ఆవిడకి మంచి మంచి సినిమాల సక్సెస్‍ మీట్‌లూ, విజయోత్సవ సభలూ ఇప్పించి, బాగా లాభం కూర్చిపెట్టే ప్రోగ్రామ్‌లు చేయించాను. నా ‘రేపల్లెలో రాధ’ సక్సెస్ మీట్ ఆవిడ సరిగ్గా చెయ్యలేదని అలిగాను కూడా. శివలెంక కృష్ణప్రసాద్ గారిని అడిగి ‘ఊయల’, ఈవీవీ గారి ‘చాలా బాగుంది’, ఎం.ఆర్.వి. ప్రసాద్ గారి ‘రేపల్లెలో రాధ’ ఇలా అన్న మాట.

రాగ సప్తస్వరం ముఖ్యంగా ఏ.ఎన్.ఆర్. గారి గోల్డ్ మెడల్ ఒక ఏక్టర్‌కీ, ఒక డాక్టర్‌కీ ప్రతీ ఏటా ఏ.ఎన్.ఆర్. గారి బర్త్ డే కి ఇచ్చేవారు. ఆ ప్రోగ్రామ్‌కి మేం కొత్త చీరలు కొనుక్కుని, ఎంతో శ్రద్ధగా తయ్యారయి, నేనే స్టేజి మీద వుండాలి అనే వారాయన. అందుకని కంపీర్ చేసేదాన్ని! దానికి స్క్రిప్ట్ రాసుకోడం, చెయ్యడమే కాకుండా భానుమతి గారూ, శారద గారూ, లక్ష్మి గారూ లాంటి ప్రముఖ నటీమణులను హోటల్ రూమ్ నుండి తీసుకురావడం, దింపడం లాంటివి కూడా చేసేదాన్ని! ఎంతో సందడి, ఎంతో ఉత్సాహం… అదంతా ఒక ఫేజ్! గుమ్మం దగ్గర నిలబడి ప్రముఖులను ఆహ్వానించడం, నాగేశ్వరరావుగారికి ఎందరున్నా నేనే బాడ్జ్ పెట్టడం… అలాంటికి కిక్ ఇచ్చేవి! కాని ఒకనాడు వీరేంద్రనాథ్ గారు నన్ను పిలిచి, “నువ్వు ఈ గుమ్మాల దగ్గర నిలబడి ఈ ప్రోగ్రామ్‌లకి ఆహ్వానించడం అవసరమా?” అన్నారు. అంతే… మానేసాను. కాని అక్కడ చాలామంది స్నేహితురాళ్ళయ్యారు. బోలెడు మంది మెంబర్లు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here