[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత పలమనేరు బాలాజి 2014 – 2018 మధ్య వ్రాసిన 12 కథల సంపుటి ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’. గదిలోపలి గోడ (2009), చిగురించే మనుషులు (2014) వీరి ఇతర కథల సంపుటులు.
***
“మనిషి పట్ల మనిషి జీవిస్తున్న జీవితం పట్ల సమాజం పట్ల అపరిమితమైన ఆర్తి ప్రేమ నిబద్ధత వున్న రచయితగా బాలాజి యీ కథల్లో దర్శనమిస్తాడు. మనిషిని తన రచనకి కేంద్రంగా చేసుకొన్నాడు. కవిత్వంలో అనుభూతమయ్యే ఆర్ద్రతనీ సాంద్రతనీ కథల్లోకి సైతం అతను అలవోకగా వొంపుతున్నాడు. ఇంటా బయటా యాంత్రికమైపోయిన ఆధునిక జీవితాల్లో విచ్ఛిన్నమౌతున్న బంధాల్నీ మృగ్యమౌతోన్న సున్నితత్వాల్నీ అందుకు కారణమౌతోన్న దృశ్యాదృశ్య శక్తుల్నీ వొడిసిపట్టుకొని మానవీయమైన అంతశ్చేతనని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆధిపత్యాలెప్పుడూ మనుషులమధ్య గోడలే నిర్మిస్తాయి; అవి జీవన మాధుర్యాన్ని పంచుకోడానికి ఆటంకమే అవుతాయని నిరూపించాడు. నా అన్నవాళ్లకి దూరమై మానసికంగా భౌతికంగా పరాయీకరణకి గురయ్యే వ్యక్తులు తమ అంతరంగాల్ని తరచి లోపలికి చూసుకోడానికి తోడ్పడే కథనాలివి. మొత్తం సమాజమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అనివార్యతని అవి తెలియజేస్తాయి. మానవీయ స్పందనల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని సున్నితంగా గుర్తు చేస్తాయి.
మనుషులమధ్య వెల్లివిరియాల్సిన మానసిక సాన్నిహిత్యం గురించి ప్రేమ దయ వంటి వుదాత్త సంస్కారాల గురించి చెప్పే సందర్భాల్లో బాలాజి వచనంలో యెక్కడా కాఠిన్యం కనిపించదు. పాత్రల మధ్య బాహ్య సంఘర్షణ కన్నా అంతరంగ చిత్రణకే అతను యెక్కువ ప్రాధాన్యం యిస్తాడు.
ఒక సాయంత్రం మీరు కూడా త్వరగా యిల్లు చేరితే, మీకు తెలీకుండా మీలో యేర్పడ్డ ఖాళీల్ని గుర్తించి పూరించుకోవాలనుకుంటే, మానవ దూరాల్ని అధిగమించే మాటల వంతెనలు నిర్మించాలనుకొంటే, మనుషుల మధ్య మమతల మాలలల్లే సూత్రాల్ని పట్టుకోవాలంటే – రచయిత బాలాజిని అనుసరించండి.” అన్నారు ముందుమాట ‘కొన్ని ప్రేమలు, యెన్నో వెతలు -కాసిన్ని కథలు: వొక లోచూపు’ లో ఎ. కె. ప్రభాకర్.
***
“ఇవి మన కథలు. మన సంబంధాల కథలు. మానవ సంబంధాల కథలు. మానవ సంబంధాలు ఎంత దుస్థితిలో ఉన్నాయో చెప్పడం ద్వారా ఉదాత్త మానవ సంబంధాల వైపు మన ఆలోచనలను ప్రేరేపించగల కథలు. మానవ సంబంధాలలో, అనుభూతులలో, ఉద్వేగాలలో మనం కొనసాగించవలసిన, బలోపేతం చేసుకోవలసిన విలువల గురించి రేఖామాత్రంగా, ఉదాహరణప్రాయంగా, సూచనప్రాయంగా చెప్పిన కథలు.
మానవ సంబంధాలలోని లోపాలు, గుణాలు కూడా కొత్తగా ఆవిష్కృతమవుతు దిగ్భ్రాంతిపరుస్తున్న సందర్బం ఇది. ఆ సందర్భాన్ని చిత్రించడానికి, వివరించడానికి, విశ్లేషించడానికి పూనుకొన్న కథలివి. ఇవాళ మన సమాజానికి, ముఖ్యంగా సాహిత్య పాఠకులైన బుద్ధిజీవులకు అత్యవసరమైన ఆలోచనాస్ఫోరకమైన కథలివి” అని తమ ముందుమాట ‘మళ్ళీ ఒకసారి మానవ సంబంధాల కథలే’లో వ్యాఖ్యానించారు ఎన్. వేణుగోపాల్.
***
“బాలాజీ కథల్లో అస్తిత్వ స్పృహతో పాటు ఒక మానవీయ కోణం, ఒక స్త్రీతనం, ఒక అమ్మతనం ప్రత్యేకంగా కన్పిస్తాయి. బాలాజి కథల్లో కుటుంబ సంబంధాలు ప్రత్యేకంగా కన్పిస్తాయి. స్త్రీ పురుషుల సంబంధాలు, పెద్దల పిల్లల సంబంధాలు గ్లోబలైజేషన్ ప్రభావంతో మారుతున్న విలువలు తన కథల్లో చర్చకు పెట్టాడు బాలాజి. నగరీకరణ చెందిన కథలు ఇంత బాగా రాస్తున్న బాలాజి ఇంకా వెలుగులోకి రాని తన జీవన నేపథ్యంలోని స్త్రీల జీవితాలను ఇంకా కథలుగా మలచాల్సిన అవసరం ఉంది. సమాజానికి తెలియని అనేక జీవితాలని తన కథల్లో ఆవిష్కరించాలని అభిలషిస్తున్నాను” అన్నారు డా. ఎం. వినోదిని తన ముందుమాట ‘మానవీయంగా చెప్పిన సున్నితమైన కథలు’లో.
***
“కథలు రాయడం ద్వారా రచయితలుగానీ, వాటిని చదవడం ద్వారా పాఠకులుగాని ఏం ప్రయోజనం పొందుతారని ఒక్కసారి ఆలోచిస్తే – బహుశా రచయితగానీ, పాఠకుడు గానీ కథ ద్వారా తననీ, తన చుట్టూ ఉన్న సమాజ వాస్తవికతని దర్శించడం నేర్చుకుంటాడని సమాధానం చెప్పుకోవచ్చేమో. తన సంస్కారాన్నీ, జ్ఞానాన్నీ, మరింతగా మెరుగుపరుచుకుంటారేమో. రచయితగా ఆ దిశలో సాగుతున్న బాలాజి మరింత విస్తారంగా ‘దర్శనం’ చేయించగల కథలు రాయాలని ఆశిద్దాం” అన్నారు బద్దూరి ధర్మారెడ్డి ‘వైవిధ్యంలో కూడిన కొత్త కథావస్తువులు’లో.
***
ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు (కథా సంపుటి)
రచన: పలమనేరు బాలాజి
ప్రచురణ: స్వచ్ఛత ప్రచురణలు, బెంగుళూరు
పేజీలు: 158, వెల: రూ 100
ప్రతులకు: శ్రీమతి గండికోట వారిజ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010
ఇంకా నవోదయ, ప్రజాశక్తి, నవతెలంగాణ, నవచేతన, విశాలాంధ్ర బుక్ హౌజ్ శాఖలు.