[dropcap]జీ[/dropcap]వితంలో మనుషులకి అత్యంత ఆవశ్యకమైన వాటిల్లో కడుపునిండా తిండీ, కంటి నిండా నిద్ర ముఖ్యమైనవి.
కారణాలు ఏవైనా ప్రస్తుతం జనాలు నిద్రపోయే సమయం తగ్గుతోంది. ఫలితంగా నిద్రలేమితో వచ్చే రుగ్మతలు మన సమాజాన్ని వెంటాడుతున్నాయి. ప్రపంచీకరణ ఫలితంగా ఉద్యోగాల్లో షిప్ట్ సిస్టమ్ వచ్చి ఉద్యోగుల జీవగడియారాలను డిస్ట్రర్బ్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల బారిన పడిన యువత రాత్రుళ్ళు సరిగా నిద్రపోకుండా ఇంటర్‌నెట్ ఉపయోగిస్తూ చాలాసేపు మేల్కొనే ఉంటున్నారు. మనిషికి తగినంత నిద్ర లేకపోతే ఏం జరుగుతుందో నిపుణులు చెబుతునే వున్నారు, కానీ ఎవరూ పెద్దగా లక్ష్యపెట్టడం లేదు.
నిద్రని నిర్లక్ష్యం చేసి అనారోగ్యాల పాలుకాకుండా అవగాహన కల్పించేందుకు గాను 2008 నుంచి మార్చి నెలలో వసంత విషవత్తు (మార్చ్ ఈక్వినాక్స్)కు ముందు వచ్చే శుక్రవారం నాడు ప్రపంచ నిద్రా దినోత్సవం (వరల్డ్ స్లీప్ డే) జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది. ఈ సంవత్సరం వరల్డ్ స్లీప్ డే 15 మార్చి 2019 నాడు వచ్చింది. వరల్డ్ స్లీప్ సొసైటీ వారి వరల్డ్ స్లీప్ డే కమిటీ జరిపే ఈ దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. చక్కని నిద్ర ఎంత ముఖ్యమో సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు, సెలెబ్రిటీలు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారు. నిద్రలేమి ఎంత ప్రమాదకరమో తెలియజేస్తారు. ప్రతి సంవత్సరం ఒక నినాదం తీసుకుని, బోధనా సామాగ్రి ద్వారా, ప్రదర్శనల ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోనూ, ఆన్‌లైన్‍లోనూ ప్రచారం చేస్తారు (ఆ నినాదాల వివరాలు ఇంటర్‍నెట్‌లో లభిస్తాయి).
ఈ నినాదాలను చదువుతుంటే, నాకు తెలుగు హిందీ సినిమాలోని కొన్ని పాటలు గుర్తొచ్చాయి. చాలా పాటలలో నిద్ర ప్రయోజనాలను సరళంగా, సులువుగా అర్థమయ్యేలా చెప్పారు.
***
“జో అచ్యుతానంద జోజో ముకుందా” అంటూ అన్నమయ్య లాలిపాటని పాడుతూ పిల్లల్ని నిద్రపుచ్చని తల్లులు ఉండరేమో. దేవుళ్ళను నిద్ర లేపడానికి పాడే సుప్రభాతాలు ప్రసిద్ధమైనట్టే వారిని నిద్రపుచ్చడానికి పాడే పాటలూ ప్రఖ్యాతి గాంచాయి. “నిద్దుర బుచ్చరే శ్రీరాముని నిద్దుర బుచ్చరే” అంటూ శ్రీ తూము నరసింహదాసు గారు రచించిన గీతం రసరమ్యంగా ఉంటుంది.
‘సూత్రధారులు’ సినిమాలో సినారె వ్రాసిన “జోలాజోలమ్మ జోలా… జేజేలా జోలా… జేజేలా జోలా… నీలాల కన్నులకు నిత్య మల్లే పూలజోలా” ఒకే పాటలో ఎస్.పి. శైలజ గారు దేవుళ్లందరికీ జోల పాడుతూంటే వినసొంపుగా ఉంటుంది. ‘శ్రుతిలయలు’ సినిమాలో “కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి, అలసిన దేవెరి అలమేలు మంగకూ …. తెలవారదేమో స్వామీ” అన్నారు సిరివెన్నెల.
‘జీవనజ్యోతి’ సినిమాలో సినారె వ్రాసిన “ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు… ష్. సద్దు చేసారంటే వులికులికి పడతాడు” అనే పాటకి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. పి. సుశీల పాడిన ఈ పాటలో అప్పట్లో సూపర్ హిట్!
‘ముత్యాల ముగ్గు’ సినిమాలోని “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది” అనే పాట తన్మయత్వానికి గురిచేస్తుంది. గుంటూరు శేషేంద్ర శర్మగారి సాహిత్యానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. పి.సుశీల పాడిన ఈ పాట శేషేంద్రశర్మ గారు రాసిన ఏకైక చిత్ర గీతం కావడం విశేషం.
‘నాటకాల రాయుడు’ సినిమా కోసం ఆత్రేయ రాసిన “నీలాల కన్నుల్లో మెల మెల్లగ.. నిదురా రావమ్మ రావె… నిండార రావె… నెలవంక చలువల్లు వెదజల్లగా.. నిదుర రావమ్మా రావె… నెమ్మదిగా రావె..” అనే పాటని పి సుశీల, స్వరంలో వింటే నిద్ర రాకుండా ఉంటుందా. ఈ గీతానికి జి.కె. వెంకటేష్ సంగీతం అందించారు. ఇదే బాణీలో హిందీలో ‘अलबेला’ సినిమాలో धीरे से आजा री अँखियन में निंदिया आजा री आजा, धीरे से आजा छोटे से नैनन की बगियन में निन्दिया आजा री आजा, धीरे से आजा” అంటూ లతా మంగేష్కర్ పాడారు. రాజిందర్ కృష్ణ సాహిత్యానికి సి. రామచంద్ర సంగీతం సమకూర్చారు. ఏ భాషలో విన్నా వీనుల విందే.
‘బ్రహ్మచారీ’ అనే సినిమాలో శైలేంద్ర రాసిన “मैं गाऊँ तुम सो जाओ सुख सपनों में खो जाओ” పాట ఆర్ద్రంగా సాగుతుంది. శంకర్ జైకిషన్ సంగీతంలో రఫీ పాడారాపాట. ఆశావాదం నిండుగా ఉన్న పాట ఇది.
‘చక్రపాణి’ సినిమాలో రావూరి రంగయ్య గారు రాసిన “మెల్ల మెల్లగా చల్ల చల్లగా…రావే నిదురా హాయిగా….” అనే పాటని స్వీయ సంగీతదర్శకత్వంలో పి. భానుమతి గారు పాడారు. ఆ గాన మాధుర్యానికి రెప్పలు వాటంతటే అవే మూతలు పడతాయి.
‘రాజమకుటం’ సినిమాలో మాస్టర్ వేణు సంగీతం సమకూర్చిన “సడిసేయ కో గాలి సడిసేయబోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే” అంటూ సాగే పాట పి. లీల స్వరంలో మనసుకి హయిని కలిగిస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం భావుకుల్ని రంజింపజేస్తుంది. “నిదుర చెదరిందంటే నే నూరుకోనే” అంటారొక చోట ఈ పాటలో. అలసిన శరీరానికి, మనసుకి నిద్ర ఎంత ముఖ్యమో చెబుతారు.
జీవితమన్నాక సమస్యలొస్తాయి, కలతలు రేగుతాయి. నిద్రపట్టని స్థితి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులకూ నప్పే పాటలూ ఉన్నాయి.
‘మూగమనసులు’ చిత్రానికి ఆత్రేయ వ్రాసిన “పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా” ఇందుకు చక్కని ఉదాహరణ. “కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతదీ” అంటారు. నిద్ర ప్రయోజనాన్ని ఒక వాక్యంలో చెప్పేశారు. ఇదే తరహా సన్నివేశం ‘మిలన్’ అనే హిందీ సినిమాలోనూ ఉంది. ఈ సన్నివేశంలో “राम करे ऐसा हो जाए मेरी निंदिया तोहे मिल जाए मैं जागूँ तू सो जाए मैं जागूँ” అనే పాట బావుంటుంది. ఆనంద్ బక్షీ గీతానికి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు.
“నీ మది చల్లగా స్వామీ నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో-నీ మది చల్లగా” అంటూ ‘ధనమా? దైవమా?’ చిత్రంలో డా. సి. నారాయణ రెడ్డి గీతాన్ని పి.సుశీల పాడారు. టి. వి. రాజు సంగీతంలోని ఈ పాటలో ఒకచోట “చీకటి ముసిరినా?… వేకువ ఆగునా?” అని అంటారు సినారె. కష్టాలు కలకాలం ఉండవు, దానికి కలత చెంది నిద్ర పాడు చేసుకోవద్దు అనే భావాన్ని నాలుగే నాలుగు పదాల్లో చెప్పి తీరు అద్భుతం.
‘సంతానం’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన “నిదురపో..నిదురపో..నిద్దురపో.. నిద్దురపోరా తమ్ముడా, నిద్దురపోరా తమ్ముడా” అనే పాట పాట ఎందరినీ అలరిస్తుంది. ఎస్. దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ గీతంలో “నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా, కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా” అన్నారు రచయిత అనిశెట్టి పినిశెట్టి.
‘బంగారు పిచుక’ సినిమా కోసం “పో పో నిదురపో నిదుర వచ్చినా రాకున్నా నిదురపో” అంటూ ఆరుద్ర వ్రాసిన పాటకి కె.వి. మహదేవన్ స్వరకల్పన చేయగా పి.సుశీల ఆలపించారు. “తలపులలో నాటినదే మొలకెత్తును రేపటికి” అని ఆరుద్ర చెప్పిన మాటలు ఎంతో నిజం!
‘తులాభారం’ సినిమాలో “నిద్దురపో బాబు నిద్దురపో” అనే పాట ఉంది. ఆరుద్ర రాసిన ఈ పాటని పి.సుశీల పాడారు. పాటలో “నిద్దురలో కలతలు మరచిపో” అంటారు రచయిత.
హిందీలోనూ మధుర గీతాలెన్నో ఉన్నాయి. ‘జిందగీ’ సినిమా కోసం సైగల్ పాడిన “సో జా రాజకుమారీ” వంటివి అజరామరాలు.
‘బేటీ బేటే’ అనే సినిమాలో “आज कल में ढल गया, दिन हुआ तमाम तू भी सो जा, सो गई, रंग भरी शाम” అనే పాటని లతా మంగేష్కర్ పాడారు. శైలేంద్ర రాసిన గీతానికి శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. తన తోబుట్టువుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఓ పాప పాడే పాట ఇది. మనకెవరూ లేరు, మనకి మనమే తోడు అనే అర్థంలో సాగుతాయి చివరి వాక్యాలు.
‘గాజుల క్రిష్ణయ్య’ సినిమాలో హీరోని ఓదారుస్తూ కథానాయిక పాడే పాట ఒకటుంది. “రారయ్యా పోయినవాళ్ళు” అంటూ సాగే ఆ పాటలో “నిదురల్లే వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి” అని అంటుందామె. ఎంత అద్భుతమైన భావన! ఆత్రేయ రాసిన ఈ పాటని కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో పి. సుశీల పాడారు.
***
సినిమాల్లో ‘నిద్ర’ని రొమాంటిక్ సన్నివేశాల పాటల్లోనూ, విరహ వేదనా గీతాల్లోనూ ఉపయోగించారు.
‘భలేరాముడు’ సినిమాలో సదాశివబ్రహ్మం గారు వ్రాసిన “ఓహో మేఘమాల నీలాల మేఘమాల” అనే పాటలో మేఘాలను చల్లగా, మెల్లగా రమ్మంటాడు కథానాయకుడు. ఎందుకంటే, కథానాయిక నిద్రలో ఉంది, “నిదుర పోయె రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది” అంటారు రచయిత. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో ఘంటసాల, పి. లీల ఆలపించారీ పాటని. ఇదే తరహా సన్నివేశం ‘కిస్మత్’ అనే హిందీ సినిమాలో ఉంది. అక్కడ పాట “धीरे धीरे आ रे बादल धीरे आ रे बादल धीरे धीरे जा मेरा बुलबुल सो रहा है शोर-गुल न मचा” అని సాగుతుంది. కవి ప్రదీప్ రాసిన ఈ పాటకి అనిల్ బిస్వాస్ సంగీతం అందించారు. ఈ పాట కూడా చక్కని మెలొడీనే.
‘బోయ్ ఫ్రెండ్’ సినిమాలో శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడిన హస్రత్ జయ్‌పురీ రచించిన “धीरे चल ऐ भीगी हवा” అనే పాట బావుంటుంది. అత్యంత వేగంగా సాగే ఈ పాటలో “नींद के साग़र टूट न जाएँ मेरी क़सम तुझे (शोर न मचा) अरे हो बादल बड़े पहरे हैं खड़े दिल भी क्या करे ” అని అంటాడు కథానాయకుడు.
1960లో విడుదలైన ‘కాలాబాజార్’ అనే హిందీ సినిమాలో దేవానంద్, వహీదా రెహ్మాన్‌లపై ఒక పాట ఉంటుంది. ఊటీలో చిత్రీకరించిన “खोया-खोया चांद, खुला आसमां आँखों में सारी रात जाएगी तुमको भी कैसे नींद आएगी” అంటూ సాగే ఈ పాటని శైలేంద్ర రాయగా, ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడారు. “చంద్రుడు అదృశ్యమయ్యాడు, ఆకాశం శూన్యమయింది, నీకు నిద్రెలా పడుతుంది? కనుల ముందే రాతిరి గడచిపోతుంది” అనే అర్థంలో సాగుతుందీ పాట. ఇంచుమించు ఇలాంటి బాణీలోనే తెలుగులోనూ ఓ పాట ఉంది. 1963లో విడుదలైన ‘బంగారు తిమ్మరాజు’ జేసుదాసు పాడారా పాటని. “ఓ నిండు చందమామ నిగ నిగలా భామా ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా ఓ.. నిండు చందమామ” అనే ఈ పాటని ఆరుద్ర రచించగా, ఎస్.పి. కోదండపాణి సంగీతం సమకూర్చారు. “నిదుర రాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి, మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయె” అంటారు ఆరుద్ర ఒకచోట. వాహ్ అనిపిస్తాయి ఈ వాక్యాలు!
‘మేరే మెహబూబ్’ సినిమాలో “ऐ हुस्न ज़रा जाग तुझे इश्क जगाये बदले मेरी तकदीर जो तू होश में आये” అనే పాటని రఫీ పాడారు. షకీల్ బదాయూని రాసిన ఈ గీతానికి నౌషాద్ సంగీతం అందించారు. ప్రేమ భావనని ఎంతో సున్నితంగా చెప్పిన పాట ఇది.
‘అభినందన’ సినిమాలో “ఎదుటా నీవే ఎదలోనా నీవే” అనే పాటలో.. “కలలకు భయపడిపోయాను/ నిదురకు దూరం అయ్యాను/వేదన పడ్డానూ” అంటాడు ప్రేమికుడు. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గానం. ఈ సినిమాలో పాటలన్నీ మధురాలే.
చిరంజీవి నటించిన ఆరాధన సినిమాలో “అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ” అనే పాట ఉంది. ఆ ఎగిరిన మనసు తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలిందట… అది అతని లోని మమతను నిద్దురలేపిందట… ఒక్కో వాక్యం నెమ్మదిగా వింటుంటే రచనలో ఎంత భావుకత ఉందో అనిపిస్తుంది. ఆత్రేయ రచనకి సంగీతం ఇళయరాజా. గానం బాలు, జానకి.
‘6 టీన్స్’ అనే సినిమాలో “దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే హా … నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే” అంటాడు హీరో. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ గీతానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాటకి ఎంతో క్రేజ్ వచ్చింది.
‘నువ్వే నువ్వే’ సినిమాలో “చెలియా నీవైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా” అనే పాటలో ప్రియురాలిని వెతుకుతున్న ప్రియుడు ఆమె చిరునామా కోసం ‘నిద్దరపోతున్న రాతిరినడిగా’నంటాడు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు.
‘కలుసుకోవాలని…’ సినిమాలో “ఆకాశం తన రెక్కలతో నను కప్పుతు ఉంటే” అనే పాటని సుప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రాశారు. “భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి / జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి / రేయంతా తెగ అల్లరి చెయ్యాలి / ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి / అవి రేపో మాపో నిజమవ్వాలి” అంటూ సాగే ఈ పాటని సుమంగళి పాడారు.
‘दिल’ సినిమాలో “मुझे नींद ना आये, मुझे चैन ना आये. कोई जाए ज़रा ढून्द्के लाये. न जाने कहा दिल खो गया” అని పాట ఉంది. హుషారెత్తించే ఈ గీతాన్ని సమీర్ రాసారు, ఆనంద్ మిళింద్ సంగీత దర్శకత్వంలో అనూరాధా పౌడ్వాల్, ఉదిత్ నారాయణ్ ఆలపించారు.
***
ఇక నిద్ర ఎంత అవసరమో, కొన్ని సందర్బాలలో మెలకువగా ఉండడమూ అంతే అవసరం. ఇలాంటి సందర్భాలకి సైతం నప్పే పాటలున్నాయి.
‘శ్రీకృష్ణపాండవీయం’ సినిమాలో “మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా” అనే పాట ఇలాంటిదే. ఘంటసాల పాడిన ఈ పాటలో “సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు, అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్ధంగా చెడతాడు” అంటారు రచయిత కొసరాజు.
వెంకటేష్ హీరోగా నటించిన ‘టు టౌన్ రౌడీ’ సినిమాలో ఇలాంటిదే ఒక పాట ఉంది. “వద్దుర నిద్దర / నిద్దరా వద్దురా / నిద్దరే మనిషికి మత్తురా” అనే ఆ పాటని దాసరి నారాయణరావు రాయగా, రాజ్-కోటి స్వరపరిచారు.
***
సినిమాలలో కాకుండా… సాహిత్య పరంగా నిద్ర గురించి అద్భుతమైన కవితలున్నాయి. “Do not go, my love, without asking my leave. I have watched all night, and now my eyes are heavy with sleep. I fear lest I lose you when I’m sleeping” అన్నారు విశ్వకవి రవీంద్రుడు ‘ది గార్డెనర్’లో.
దాదాపు ఇదే అర్థంలో కృష్ణశాస్త్రి గారు
“ఏను నిద్దుర వోదునో యేమొ, కరుణ
సెలవు గైకొన కేగగా వలదు; ఇన్ని
నాళ్ళ యెడలేని యెడబాటు నా నిరీక్ష
ణమ్ము బరువులు బరువులై నయనయుగళ
మయ్యె, దిగలాగు నిద్దురమరపులకును” అని అన్నారు ‘ఊర్వశి’లో.
ఇలాంటి మధుర భావాలను ఏ పుస్తకంలోనైనా చదువుతూ లేదా హాయిగొలిపే ఈ పాటలను వింటూ ‘సుఖ నిద్రా ప్రాప్తిరస్తు’ అని మనకి మనమే చెప్పుకుంటూ నిద్రలోకి జారుకోవచ్చు.
ఈ ఆర్టికల్‌ని ఎలా ముగించాలా అని ఆలోచిస్తూ, ఇంకా మంచి నిద్ర పాటలు ఉన్నాయా అని నెట్‌లో వెతుకుతుంటే, ఒక వార్త కనబడింది.
కేరళ రాష్ట్రంలోని తిరుచ్చూర్‌కు చెందిన మావటి శ్రీకుమార్ పెంచుకుంటున్న ఏనుగు కొద్ది కాలంగా నిద్రపోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. వైద్యులకు చూపించినా నయం కాలేదు. చివరగా శ్రీకుమార్ ఇళయరాజా స్వరపరిచిన ఓ పాటను పాడి ఆ ఏనుగును నిద్రపుచ్చగలిగాడు. ఆ పాటని వింటూ ఆ ఏనుగు మెల్లగా నిద్ర జారుకుంది. ఔత్సాహికులెవరో ఈ సంఘటనని వీడియో తీయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. “అల్లీలమ్ పూవో” అంటూ సాగే ఆ పాట 1984లో మమ్ముట్టి హీరోగా వచ్చిన మలయాళ చిత్రం ‘మంగళం నెరున్ను’ లోనిది, ఎం.డి. రాజేంద్రన్ రచన. సినిమా కోసం కృష్ణచంద్రన్ పాడారు. భావం అర్థం కాకపోయినా, మెలోడీ మాత్రం బావుంది. వినసొంపైన సంగీతానికి జంతువులకి కూడా తప్పకుండా నిద్ర వస్తుందని నిరూపించిన ఆ వీడియోని చూస్తే ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి’ అనే మాటలు గుర్తొచ్చాయి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు!