[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap] ప్రోగ్రామ్‌లోనే నా అభిమాన రచయిత్రి, ఆరాధ్య దేవత ‘యద్దనపూడి సులోచనారాణి’గారిని కలిసాను. ఆవిడ ఎంతో అభిమానంగా, ఆత్మీయంగా పలకరించడమే కాకుండా, ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, మా పిల్లల్ని ‘అమ్మమ్మా’ అని పిలవమనేవారు! వాళ్ళల్లో ఆవిడ తన మనవడిని చూసుకునేవారు. ఆ తర్వాత ఆవిడ తను ప్రెసిడెంట్‌గా వున్న ‘లేఖిని’ సంస్థ ద్వారా ఆవిడ తల్లిగారు ‘నెమలికంటి మహాలక్ష్మమ్మ’ అవార్డు నాకు ఇచ్చారు.
ఆవిడ ఆ ప్రోగ్రామ్‌లో అవార్డే కాదు, ఒక ఉత్తరం కూడా నాకిచ్చారు – ‘నేనెంతో ప్రేమించిన మా అమ్మ అవార్డు, నేను ఎంతో అభిమానించే నా కూతురు లాంటి రమణికి ఇవ్వడం ఎంతో ఆనందంగా వుంది… నవలా రచనలో నా వారసురాలు ఈ రమణి’ అని. అది నాకు సరస్వతీమాత స్వయంగా వచ్చి ఇచ్చిన దీవెన లాంటిది.
ఒకనాడు మా అత్తగారిని శంకరమఠం తీసుకువెళ్ళి, అనుకోకుండా, సులోచనారాణిగారిని కలిసి ఎంతగా ఆనందపడ్డానో, అంతే ఆనందపడ్డాను ఆ జ్ఞాపికకీ. ఆవిడ చేతుల ద్వారా శాలువా కప్పి పూలదండ వేసి చేసిన ఆ సన్మానానికీ! నేను ఆ ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో సన్మానాలు పొంది వుండవచ్చు… నంది అవార్డులు కూడా తీసుకున్నప్పటికీ నేను ఆరాధించిన సులోచనారాణి చేతుల మీదుగా పొందిన ఈ సన్మానం నేనెన్నటికీ మరిచిపోలేనిది! నా డయిరీలో అక్కినేనిని మొదటిసారి కలిసినప్పుడు ఆయనిచ్చిన గులాబీ పూల రేకలు ఎలా దాచుకున్నానో, ఈవిడిచ్చిన ఈ గ్రీటింగ్స్‌నీ అలాగే దాచుకున్నాను!
సుబ్బిరామిరెడ్ది గారు “రమణీ ఏదీ, రమణీ రాలేదా?” అని అడిగేవారట, నేను మానేసాకా గూడా. ఒక లేడీస్ ఆర్మీలా, డిసిప్లిన్డ్‌గా, అందరం ఒకే విధంగా పట్టుచీరల్లో ఆకర్షణీయంగా కనిపించేవాళ్ళం. ప్రోగ్రామ్ అవగానే, ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, రవీంద్ర భారతి పక్కనే వున్న కామత్ హోటల్‌కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం. నాకు కారు లేని రోజుల్లో ఎంతో కష్టపడి ఈ మారుమూల సైనిక్‌పురి వచ్చి చేరేవాళ్ళం. అమ్మ ఎప్పుడు నాకు తోడుండేది… నా భర్త దేనికీ అడ్డు చెప్పేవారు కాదు! అదొక లైఫ్… ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో అలాగే పరిచయం అయింది!
***
‘ఎవరే అతగాడు’ రిలీజ్ అయింది కానీ ఫ్లాప్ అయింది. ‘రేపల్లెలో రాధ’ వల్ల నాకు చాలా గుర్తింపు వచ్చింది. వంద రోజులు ఆడకపోయినా, విజయవాడ గంగా థియేటర్‌లోనే 60 రోజులు ఆడింది. నన్ను అభినందిస్తూ ఎమ్.ఎస్. రెడ్డి గారూ, సత్యనారాయణ గారూ, గుమ్మడిగారూ లాంటి వాళ్ళు ఇంటికి కూడా వచ్చారు. కాని ఈ ఫ్లాప్ వల్ల తాత్కాలికంగా సినిమాకి దూరం అయి, మళ్ళీ నా సీరియల్స్, నవలలూ రాసుకుంటూ వుండిపోయాను. కానీ సినిమా జరుగుతున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారి పరిచయం అయి నన్ను లైఫ్ మెంబర్‌ని చేసారని చెప్పాను కదా!
ఒకసారి ఆయనకి ఫోన్ చేశాను. కథ చెప్తానని. అలాగే వింటానన్నారు, కానీ సెల్ నెంబర్ ఇవ్వలేదు. లాండ్ నెంబర్‌కి నేనెప్పుడు ఫోన్ చేసినా ఒక చిన్న పిల్లాడు తీసి రాష్‌గా మాట్లాడి పెట్టేయడం, పనివాళ్ళు మాట్లాడడం ఇలా జరిగేది.
ఇంతలో రైటర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎదురుగా కనిపించిన లేడీ రైటర్‌గా నన్ను ‘వైస్ ప్రెసిడెంట్’ చేసారు. ‘వైస్ ప్రెసిడెంట్’గా నేను ఆఫీస్‌కి వెళ్ళి, రిజిస్ట్రేషన్ అయిన కథలకి, ప్రతీ పేజీ మీద సంతకాలు పెట్టాలి. అప్పట్లో ఎప్పుడంటే అప్పుడే రిజిస్ట్రేషన్లు. ఇప్పటిలా గురువారం అని ఒక నిర్ణీతమైన రోజు లేదు!
పరుచూరి గారిని కలిసి, “ఇలా మీ ఇంటికి ఫోన్ చేస్తే, నాకు మీరు దొరకడం లేదు” అని చెప్పేసాను. అప్పుడు ఆయన “ఇదిగో… నా సెల్ నెంబరు… నాకే చెయ్యి” అని చెప్పారు.
నేను అలా ఫోన్ చెయ్యడం, ఆయన్ని పట్టుకుని, ‘నీకూ నాకూ మధ్య’ అని నవలగా నేను రాయాలనుకున్న సబ్జెక్ట్… అప్పటికింకా రాయలేదు, అది చెప్పాలనుకుని, ‘వీళ్ళు అన్నీ పెద్ద హీరోల సినిమాలు చేస్తారు… జూనియర్ ఎన్.టి.ఆర్. అప్పుడప్పుడే పెద్ద హీరో అవుతున్నాడు. అతనికి ఓ ఏక్షన్ సినిమా చెప్దాం’ అని ఒక కథ చెప్పాను. ఆయనకి అస్సలు నచ్చలేదు! నిర్మొహమాటంగా అదే మాట చెప్పేసారు…
వెళ్తూ వెళ్తూ నేను గుమ్మం దగ్గర ఆగి, “ఒక పాయింట్ వినండి గురువుగారూ… హీరో అదో రకం మనిషి… హిపోక్రసీ అంటే ఒళ్ళు మంట… అనుకున్నది అనే మనిషి… మరదలు ‘బావా రాత్రి రెండో ఆట సినిమాకి వెళ్దామా?’ అంటే, “నీకు ఇష్టమైతే ఆ తర్వాత లాడ్జికి కూడా వెళ్దాం, కానీ తర్వాత నన్ను పెళ్ళి చేసుకోమనకూడదు” అంటాడు అని చెప్పాను. ఆయన వెంటనే, “రామ్మా రా… ఈ పాయింట్ బ్రహ్మాండంగా వుంది… ఆ రవితేజ ఇలాంటి సినిమాలే చేస్తాడు…” అన్నారు. ‘ఈడియట్’ సినిమా వచ్చిన కొత్త అది! ఈ రవితేజ అనే హీరో కె.ఎస్. రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్‌లో నాకు పరిచయమే… సి.వి.ఎల్. గారు ఓ సీరియల్ డైరక్ట్ చేస్తుంటే దానికి ఏ.డీ.గా (అసిస్టెంట్ డైరక్టర్‌గా) పనిచేసాడు.
అలా ఆ కథ నచ్చాకా, “శారదగారి (ఊర్వశి) వియ్యంకుడు శేఖర్ బాబు అనే ప్రొడ్యూసర్ గారికి కథ కావాలటమ్మా… రవితేజ డేట్స్ వున్నాయి. నేను మాట్లాడ్తా” అన్నారు గోపాలకృష్ణగారు.
ఆ తర్వాత వేగంగా శేఖర్ బాబుగారికి కథ చెప్పడం, ఆయన పాతికవేలు ఎడ్వాన్స్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఇంక రవితేజకి కథ చెప్పాలి. అదీ ఏర్పాటయిపోయింది. నేనెళ్ళి రవితేజని కలవగానే, “రమణీగారా? పాత పరిచయమే… బాగున్నారా?” అని పలకరించాడు కూడా. అమ్మా, నాన్న అప్పట్లో హరిపురి కాలనీలో మా అన్నయ్య కొన్న ఇంట్లో వుండేవారు. ఓనాడు టి.వీ.లో రవితేజ మాట్లాడ్తుంటే అమ్మ ఫోన్ చేసి, ‘హేపీ బర్త్ డే… మా అమ్మాయి బలభద్రపాత్రుని రమణి కూడా జనవరి 26నే పుట్టింది’ అని చెప్పానంది నాతో. ఆ విషయం గుర్తు చేసుకుని నవ్వుకున్నాం. కథ వినగానే, రవితేజకి బాగా నచ్చిందన్నాడు. “మన టైపే అన్నమాట హీరో… కేరెక్టరైజేషన్ బావుంది” అన్నాడు. “చేద్దాం!” అని కూడా అన్నాడు.
కానీ అన్నీ ఇంత తేలిగ్గా అయిపోతే ఎలా? మనం కష్ట లక్ష్ములం కదా!… అందుకే ఎవరు వూహించని రీతిలో శేఖర్ బాబు గారి అబ్బాయి కిషోర్ అడ్డుపడ్డాడు… ఈ ప్రాజెక్టు నేను టేకప్ చేస్తానన్నాడు. అక్కడి నుండీ పరుచూరిగారిదీ, శేఖర్ బాబుగారిదీ ఏం నడవలేదు… ఆ అబ్బాయి నేనే డైరక్టర్‌ని డిసైడ్ చేస్తానన్నాడు.
ఈలోగా పరుచూరి గోపాలకృష్ణగారు “అమ్మా… హౌసింగ్ సొసైటీ వాళ్ళు మన కోసం నానక్‌రామ్‌గుడా దగ్గర ఇళ్ళు కడ్తున్నారు. డా. ప్రభాకరరెడ్ది గారు చాలా తాపత్రయపడి స్థలం శాంక్షన్ చేయించారు… మొదట ఓ పాతికవేలు కట్టాలి. తర్వాత శేఖర్ బాబు గారిని అడిగి మొత్తం మూడు లక్షలూ ఒకేసారి నేనిప్పిస్తా… కట్టుకుందువుగాని…” అన్నాను.
నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు నేను సైనిక్‌పురిలో ఎమ్.ఎన్.రావు బ్రిగేడియర్ హాలు పక్కనున్న లక్ష్మీనారాయణ గుడిలో ‘ఈ ఇల్లు నాకు వచ్చేటట్లు చేయమని’ చాలా ప్రదక్షిణాలు చేసాను.
మా ఆయన ఏ కళనున్నారో డబ్బు కట్టడానికి ఒప్పుకున్నారు కూడా!
(సశేషం)