రాజకీయ వివాహం-17

1
4

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 17వ భాగం. [/box]

అధ్యాయం- 17

[dropcap]అ[/dropcap]దొక సుందరమైన సముద్ర తీరం, మానుష సంచారం చాలా తక్కువగా అక్కడ సముద్రం నుండి వచ్చే అలల హోరుతో నిశ్శబ్దమైనప్పటికీ ఒక రకమైన చైతన్యం కలిగి ఉంది. అక్కడ కేవలం వారిద్దరు మాత్రమే ఉన్నారు. ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఇద్దరూ ఆకాశం వంక చూస్తూ గడుపుతున్నారు, అది ఏ సమయం అనేది వారికి తెలీకుండా ప్రకృతితో మమేకం అయిపోయినట్లు ఉన్నారు వారు.

“ఇంత దూరంగా మనం రావడానికి కారణమేంటి” అడిగాడు అతను. అటునుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

“నీ మనసు, హృదయం ఎప్పటికీ నాకు అర్థం  కావు, వాటికి అర్థం  వెతకటం బహుశా మూర్ఖత్వం అవుతుందేమో” ఇంకా నిశ్శబ్దంగానే ఉంది ఆమె.

“ఇక్కడ నువ్వూ నేను తప్ప మరొకరు లేరు, వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా నా దృష్టినుంచి తప్పించుకోలేరు, మరుక్షణం వారిని నేను మన ప్రపంచం నుండి తప్పించగలను. నువ్వు ఎవరి గురించీ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్రపంచంలో ఒంటరి వాళ్ళము, నామాటను హామీగా తీసుకో. నీ హృదయాక్రందనలను నాకు తెలియపరుచు. సహాయం ఆశించడం నీ హక్కు, నీ భయాన్ని దూరం చెయ్యడం నా కర్తవ్యం. నీ మాట కోసం నేను ఎదురుచూస్తున్నాను ఆలశ్యం చెయ్యకు” అతను చెప్పాడు. ఆమె తదాత్మ్యంలో ఎటువంటి మార్పు లేదు.

“నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో” ఆమె నోటి నుండి మొదట వచ్చిన మాట అది

“నీకోరిక మీదట మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడకన్నా మనోహరమైన ప్రదేశం మరొకటి ఉంటుందా, ఈ సువిశాల ప్రపంచంలో నువ్వునేను భాగస్వాములం, మనమే ప్రపంచం ప్రపంచమే మనం. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా తరిగి మనం ఏదో ఒకచోట కలుసుకోవలసినదే, అదేదో ఇక్కడే ఉండడం మంచిది” అతని మాటలు ఆమెకు అర్థం  కాలేదు, అయినా ఆమె జవాబివ్వలేదు.

“నాకు నీనుంచి ఒకే ఒక్క సమాధానం కావాలి” ఆఖరిగా ఆమె అడిగింది

“నీకు సహాయం చెయ్యడమే నా జీవితధ్యేయం, ఏమి కావాలో అడుగు” అతడి స్వరంలో ఎటువంటి మార్పూ లేదు

“దీనికి ముగింపు ఎప్పుడు” అడిగింది ఆమె.

“అర్థం లేని ప్రశ్న” అతడు సమాధానం ఇచ్చాడు

“అర్థం లేనిదా జవాబు లేనిదా” ఆమె అతడిని అడిగింది.

ఈసారి మౌనం అతని వంతయ్యింది. ఆమె సమాధానం కోసం రెట్టించలేదు, అక్కడ పక్షులు కిలకిలారావాలు తప్ప వేరే శబ్దం వినిపించడం లేదు. సముద్రం కూడా ఒక క్షణం నిశ్శబ్దంగా మారింది. ఇప్పటివరకూ అలలతో సందడి చేసిన సముద్రం ప్రశాంతంగా మారింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, పక్షులు గూళ్ళకు చేరుకుంటూ శబ్దాలు చేస్తున్నాయి.

తన కళ్ళు ఒక్కసారిగా తెరిచింది ప్రియాంక, ఎదురుగా తన ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన రాహుల్‌ని చూసేసరికి కానీ ఆమెకు అర్థం  కాలేదు, తాను ఇప్పటివరకూ కలలో ఉన్నాను అన్న విషయం. ఆరోజు చక్రధర్ తనను కలిసిన తరువాత ఆమె సాయంత్రం రాహుల్‌ను కలవడానికి వాళ్ళింటికి వెళ్ళింది, అక్కడ రాహుల్ తల్లిగారు ఆమెను చూసి చాలా సంబరపడింది.

జోగేశ్వరరావు గారు చనిపోయిన సమయంలో రావడమే తరువాత మళ్ళీ ఆమె ఎక్కువగా రాహుల్ వాళ్ళింటికి రాలేదు, పైగా ఇద్దరూ ప్రతిపక్షాల్లో ఉండడం వల్ల చాలాకాలం ఒకరిపై ఒకరు విమర్శించుకోవడంతోనే సరిపోయింది. ఎలక్షన్స్ ఇంక సరిగ్గా మూడు నెలలు కూడా లేకపోవడంతో ఆమె ఈ సమయంలో ఇక్కడికి రావడం రాహుల్‌ని ఆశ్చర్యపరచింది, అయితే తన తల్లి ఆనందానికి అతను అడ్డు చెప్పలేకపోయాడు.

జోగేశ్వరరావుగారు చనిపోయిన దగ్గర నుంచీ ఆమె సరిగ్గా భోజనం చేసింది లేదు, ఆనందంగా గడిపింది లేదు, కేవలం ప్రియాంక ఒక్కపూట రాకతో తన తల్లికి చెప్పలేని ఉత్సాహం కలిగింది, వారిద్దరూ ప్రతిపక్షం అన్న విషయం ఆమెకు పట్టనే లేదు. అందుకే ఆ రోజు బలవంతం చేసి ప్రియాంక వాళ్ళ అమ్మగారిని కూడా వారింటికి రప్పించింది ఆమె, అదంతా మంచి విషయం కాదు అని రాహుల్ వారించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.

పెద్దవారి మనసు బాధపెట్టడం ఇష్టంలేక, మీడియావారి హడావిడి అలాంటివేమి లేకుండా, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రియాంక తల్లి శాంతాదేవి గారిని తమ ఇంటికి రప్పించాడు రాహుల్. ఆరోజు రాత్రి వాళ్ళు నలుగురూ చాలా ఆనందంగా భోజనం చేసారు, తన తల్లి ఆనందంగా ఉండడంతో రాహుల్ చాలా మురిసిపోయాడు.

ఇన్నాళ్ళు రాజకీయాల్లో పడి అతను ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు అని అతనికి అనిపించింది. ఆరోజు రాత్రికి అక్కడే ఉండిపోవలసినది రాహుల్ తల్లిగారు బలవంతం చెయ్యడంతో పాటు శాంతాదేవితో పాటు తను కూడా ఇక్కడ ఉండిపోక తప్పలేదు. రాహుల్, ప్రియాంక వేరే వేరే గదులలో నిద్రపోగా తమ తల్లులు ఇద్దరూ ఒకేచోట నిద్రించారు. జోగేశ్వరరావు కుటుంబం, నకునారెడ్డి కుటుంబం ఒకే ఊరివారు అవ్వడంతో వారిద్దరూ చాలా చక్కగా కలసిపోయారు.

 “గుడ్ మార్నింగ్ కాబోయే ముఖ్యమంత్రిగారు, రాత్రి బాగా నిద్ర పట్టిందా” రాహుల్ కాఫీ కప్ ఆమెకు అందిస్తూ అడిగాడు. ఒక్కసారిగా నిద్రమత్తు వదలడంతో లేచి కూర్చుంది ప్రియాంక

“నిజమా రాహుల్, నిజంగా ఈ సమయంలో నీకు ఆ మాటలు అనాలి అనిపిస్తోందా. నీ అంతట నువ్వే మమ్మల్ని విమర్శించి పూర్తిగా ప్రజలు మాపట్ల నమ్మకం కోల్పోయే విధంగా చేసి మమల్ని నేరస్తులుగా అభివర్ణించావు.

మీ విధానాల మీద నమ్మకంపోయి, అందరికీ భూమి కార్యక్రమానికి వస్తున్న పాపులారిటీని భరించలేక, నీమీద నీకు నమ్మకం పోయి ఎక్కడ ఓడిపోతానో అని మామీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నావ్. ఇప్పుడు ఇదొక కొత్త నాటకమా?” విసుగ్గా అతడి చేతి నుంచి కప్ అందుకుంటూ అడిగింది ప్రియాంక.

“ఓకే, ఓకే కొంచెం శాంతించు, ఇంకా పూర్తిగా పొద్దెక్కలేదు అప్పుడే మొదలుపెట్టడం ఎందుకు. ఈరోజంతా మనకు సమయం ఉంది, మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నీకున్న అనుమానాలన్నీ నేను నివృత్తి చేస్తాను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో, నీ ఉద్దేశం ఏంటో, నా ఉద్దేశం ఏంటో ఎవరు ఎవరి మీద బురదజల్లారో, దానివల్ల ఎవరు ఎక్కువగా లాభాపడ్డారో, ఎవరెవరి వ్యక్తిగత లక్ష్యాలు ఏమిటో అన్నీ, మొత్తమన్నీ మాట్లాడుకుందాం.

ఈరోజుతో మన ఇద్దరి రాజకీయజీవితాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది అని నాకు కూడా అనిపిస్తోంది. నువ్వు హడావిడి పడకుండా కొంచెం నిదానంగా ఆలోచించు, నేను ఎక్కడికీ పారిపోను కదా. నువ్వు నిన్న మా సెక్రెటరీతో మాట్లాడినప్పుడే నాకు అర్థం అయ్యింది, ఏదో కొత్త విషయం జరగబోతోంది అని, కానీ నిన్న మనం మాట్లాడుకోవడానికి సమయం దొరకలేదు. సో డోంట్ వర్రీ వీ విల్ టేక్ ఇట్ వెరీ స్లోలీ. ముందర కాఫీ తాగు” ఆమె వంక నవ్వుతూ చూస్తూ చెప్పాడు, అతడి నవ్వు చాలా స్వచ్చంగా అనిపించింది ఆమెకు.

ఏమాత్రం చెక్కుచెదరకుండా అతను తనకి సమాధానం చెప్పిన తీరు ఆమెకు అతడిని చాలా కొత్తగా పరిచయం చేసింది. అతను పూర్తిగా తయ్యారయ్యి వైట్ షర్ట్ వైట్ కలర్ కాటన్ ఫాంట్‌లో చాలా హాండ్సంగా కనిపిస్తున్నాడు, కొద్దిగా పెరిగిన అతని గెడ్డం, గిరజాల జుట్టు అతని ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపించాయి. తాను ఇంకా రెడీ అవ్వకపోవడం ఆమెకు చాలా నమార్దాగా అనిపించి, తన వాచ్ చూసుకుంటే సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు అని చూపించింది.

వేగంగా కాఫీ తాగుతూంటే అతను గమనించి “అయ్యో ఖంగారు పడకు, ఈరోజు సండేనే కదా. అఫ్కోర్స్ మనలాంటి వాళ్ళకి వాటితో సంబంధం ఉండదు అనుకో, అయితే నేను మీ సెక్రటరీ, మా సెక్రటరీతో మాట్లాడి ఈరోజు మన ప్రోగ్రామ్స్ అన్నిటినీ వాయిదా వేయించడానికి చాలాచాలా కష్టపడాల్సి వచ్చింది. కనీసం ఏడాదిలో ఒక్కరోజైనా ఇలా గడపాలి కదా, ఆ తరువాత మళ్ళీ మనం ఎక్కడ ఎప్పుడు ఎలా కలుస్తామో కదా. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు హాలీడే తీసుకున్నావ్ చెప్పు” అడిగాడు రాహుల్.

 ఆమెకు అస్సలు హాలిడే అనే ఆలోచనే రాలేదు, తన తండ్రి మరణించిన దగ్గర నుంచీ ఒక్కరోజు ఖాళీగా గడిపింది లేదు.అందుకే తెలీదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. అది గమనించిన రాహుల్

“నాకు కూడా గుర్తు లేదు, సరే నువ్వు కాఫీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యిన తరువాత తరువాత గార్డెన్ లోకి రా, బ్రేక్ఫాస్ట్ అక్కడే చేద్దాం, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు అవసరమైన బట్టలు అవీ మీ మెయిడ్ పంపించింది, క్లాజెట్‌లో ఉన్నాయి చూసుకో” అని ఆమెకు చెప్పి అక్కడ నుండి వెళ్ళాడు రాహుల్. సరిగ్గా ఒక గంట తరువాత ఆమె వెళ్లి అతడిని గార్డెన్ లో కలుసుకుంది.

దాదాపు పదెకరాలు విస్తీర్ణంలో నిర్మించబడిన రాహుల్ ఇల్లు ఒక రాజభవనాన్ని తలపిస్తోంది. ఆమె తల స్నానం చేసి హైర్ డ్రై చేసుకున్న తరువాత చిన్న క్లిప్ పెట్టుకుని, హెయిర్‌ను లూజ్ గా వదిలేసింది. గాలికి ఎగిరే ఆమె కేశాలు ముగ్ధమనోహరంగా ఉన్నాయి. రాహుల్‌తో పోటీ పడినట్లు ఆమె కూడా తెలుపురంగు చుడిదార్ వేసుకుంది. ఆమె వెళ్లేసరికి అతను ఏదో పుస్తకం చదువుతున్నాడు. అక్కడ న్యూస్ పేపర్లు ఏమీ కూడా ఆమెకు కనిపించలేదు. పనివారు అప్పుడే వచ్చి అక్కడ నాలుగు రకాల బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ పెట్టి వెళ్ళారు. చుట్టూ చెట్లు ఉండడం వలన ఆ ప్రదేశం అంతా చల్లగానే ఉంది.

“ఏమి చదువుతున్నావు, ఇక్కడ న్యూస్ పేపర్లు లేవేంటి?” ఒక ప్లేట్లో తనకి కావలసినవి ఉంచుకుని తింటూ అడిగింది ఆమె.

“ఒక ఆధ్యాత్మిక గ్రంథం, న్యూస్ క్రియేట్ చేసేమనకి న్యూస్ చదవాల్సిన అవసరం ఉందంటావా, అదంతా టైం వేస్ట్ అని నా అభిప్రాయం, నీకు కావాలంటే తెప్పిస్తాను” అని సర్వెంట్స్‌ని పిలవడానికి ఉద్యుక్తుడు అవుతున్న అతడిని

“నో నో డోంట్ బాదర్, న్యూస్ తెలియకపోయినా అట్లీస్ట్ విజ్ఞానం కోసం అయినా చదవచ్చు కదా ఎనీవే లీవిట్” ఆమె అన్నది, ఒకసారి ఆమె వంక చూసి వెంటనే తిప్పుకున్నాడు. అది ఆమె గమనించింది అయినా ఏమీ మాట్లాడలేదు.

“ఇప్పుడు చెప్పు, నీ రాకకు కారణం ఏంటి?” కొంతసేపు నిశ్శబ్దం తరువాత అడిగాడు రాహుల్.

“నాకు నువ్వంటే చాలా ఇష్టం రాహుల్, ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందామా?” ఒక్కసారిగా ఆమె అడిగింది. రాహుల్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అస్సలు ఒక్కక్షణం ఆమె ఏమి మాట్లాడుతోందో అతనికి అర్థం  కాలేదు. అర్థం  అయ్యిన వెంటనే పెద్దగా స్పందించలేదు, ఆమె నిజం చెప్తోందా లేదా తనని టీజ్ చేస్తోందా అని తెలుసుకోవాలి అనుకున్నాడు.

“ఇది ఎప్పటి నుంచో” అడిగాడు రాహుల్.

“ఒక అమ్మాయి ఇంత డైరెక్ట్‌గా కుండబద్దలు కొట్టినట్లు నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తే కారణాల కోసం వెతుక్కునే వాడిని నిన్నే చూస్తున్నాను” అతడినింకా ఉడికించడానికి అన్నది ప్రియాంక

“మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాన్ని పెద్దగా పట్టించుకోను. ఒక అల్లరిచిల్లరి చిలిపి చేష్ట కింద కొట్టిపడేస్తాను. కారణం మనం ఇప్పుడు టీనేజర్స్ కాదు. కానీ అవతల వ్యక్తి నువ్వు అవ్వడం వల్ల నా అభిప్రాయం చెప్పడం సులభం కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే దానితో కొన్ని కోట్ల జీవితాలు ముడిపడి ఉన్నాయి, అందుకే నీకు నాపైన ప్రేమ ఎప్పటినుంచీ ఉందో చెప్తే నా నిర్ణయం అంత త్వరగా నీకు లభిస్తుంది” గంభీరంగా అన్నాడు రాహుల్.

“నిజమే మనం టీనేజర్స్ కాదు అందుకే మ్యారేజ్ ప్రపోజల్‌తో నీ దగ్గరకు వచ్చాను. ఎక్కడ ఏ క్షణంలో ఇది నా మనసులో చిగురించింది అనే దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ బయటపడడానికి ఇంత సమయం పట్టింది. అసలు నేను నిన్న నీతో గొడవపడడానికి వచ్చాను కానీ బహుశా నిన్న రాత్రి మన రెండు కుటుంబాలు కలిసినప్పుడు మాత్రమే నా అభిప్రాయాలు తారుమారయ్యి నాకీ ఆలోచన కలిగి ఉండవచ్చు. మనిద్దరి మార్గాలు వేరై ఉండవచ్చు కానీ చేరుకోవాల్సిన గమ్యం ఒకటే అలాంటప్పుడు ఇద్దరం కలిసి ఎందుకు ప్రయాణించకూడదు.

విడివిడిగా ఉండి ఒకరికొకరం అడ్డంకులు కలిపించుకోవడం వలన ఎవరికీ లాభముండదు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కోట్ల జీవితాలు ముడిపడి ఉన్నాయి అన్నది కేవలం నీ భ్రమ మాత్రమే, ఒక నిర్ణయానికి అంత విలువ ఉందని నేను అనుకోను. ఎందుకంటే మనిషి జీవితం మొత్తం అనుక్షణం నిర్ణయాల పరంపర మీదే ఆధారపడి ఉంటుంది.

సరే నా సంగతి పక్కనపెట్టు నువ్వు నీ జీవితంలో కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచించలేదా. నీ లక్ష్యం గురించి, నీ రాజకీయాలు, నీ పార్టీ, నీ ప్రజలు ఇవన్నిటి గురించి మర్చిపో కేవలం నువ్వు నేను మాత్రమే ఇక్కడ ఉన్నామనుకో నీ సమాధానం ఏమిటి.” వారిద్దరి మధ్యా దూరం తగ్గుతున్నట్లుగా అనిపించింది.

ఏమి జరిగిందో తను అర్థం  చేసుకునే లోపలే తన నడుము మీద చెయ్యేసి, ఇంకొక చేత్తో తన చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు రాహుల్. ఆశ్చర్యపోయి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నది ప్రియాంక ఒకరకమైన మెరుపు ఆ కళ్ళలో గమనించింది ఆమె. అతను తన పెదవులను కొంచెం ముందుకు చేర్చి ఆహ్వానం కోసం ఎదురుచూసాడు, ఆమె మరికొంత దూరం తన ముఖం ముందుకు జరిపింది. అతడిని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. వారి ఇరువురి పెదవులకూ మధ్య దూరం తగ్గి శూన్యం అయ్యింది. రాహుల్ ఆమె పెదవులను చుంబించిన మరుక్షణం ఆమె తన్మయత్వంతో ములిగిపోయింది, అతనికి అడ్డుచెప్పలేదు. చుట్టుపక్కల ఎవరైనా తమను గమనిస్తారు అనే విషయాన్ని మర్చిపోయి వారిద్దరూ కొంత సమయం ఆ మధురమైన క్షణాన్ని ఆస్వాదించారు. ఆమెకు తనకి ఆ ఉదయం వచ్చిన కల జ్ఞాపకం వచ్చింది. కొంతసమయానికి వారిద్దరూ మామూలు స్థితికి చేరుకున్నారు

“నా ప్రశ్నకు సమాధానం లభించింది అని నీ చర్యతో ఋజువైంది. ఇంక నీ నిర్ణయంతో నాకు పనిలేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఇప్పుడు చెప్తాను విను. నువ్వు ఏ ఉద్దేశంతో గణేష్ విషయంలో మా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావో తెలీదు, సిబిఐ వాళ్ళని మామీదకు ఉసిగొల్పడం కూడా బాగాలేదు.” ఆమె ఇంకా ఏదో చెప్పబోతోంటే మధ్యలో అడ్డుపడి

“వెయిట్ వెయిట్ నేను ఉసిగొల్పడం ఏంటి, వారి డ్యూటీ వారు చేస్తున్నారు. గణేష్ ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని నీకు లేదా, ఎవరో అతడిని పావుగా వాడుకున్నారు. సిబిఐ వాళ్ళు గణేష్ మరణానికి ముందర నా దగ్గరకి కూడా వచ్చారు, అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలీదు, నాకు తెలిసిన సమాచారం వారికి అందించి సహకరించాను, అంతమాత్రం చేత నేను దోషి అయిపోను కదా మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి.

ఊరికే మాటలు చెప్పగానే సరిపోదు, అందుకు తగినట్లుగా మన చేతలు ఉండేలా చూసుకోవాలి. నీకులాగే మీ పార్టీలో ఎమ్మెల్యేల దృష్టి ఎప్పుడు చూసినా నన్ను వ్యతిరేకించడంలో ఉంటుంది, వారికి సహకరిస్తున్నట్లుగా ఉంటాయి నీ చేతలన్నీ, కాకపోతే మీ ఉద్యమానికి అంత ప్రాముఖ్యత ఎలా వస్తుంది. ఆ ధరణికోట ప్రాజెక్ట్ ఇప్పటికే సగం పూర్తయ్యింది, దానిని ఆపడమే ధ్యేయంగా పెట్టుకున్న మీకు నిజనిజాలతో పనిలేదు.

ప్రజలు మంచేదో చెడేదో అవగాహన కోల్పోయే స్థాయికి చేరుకున్నాయి మీ పనులన్నీ. అది చాలదన్నట్లు రాజకీయ హత్యలు చేయించే స్థాయికి దిగజారారు” ఆవేశంగా అన్నాడు రాహుల్. తను ఇంతక ముందర చూసినది ఇతడినేనా అని ఆమెకు అనుమానం కలిగింది.

“ఒకే రాహుల్, నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది”

“నిజమా ఏది నిజం, నీ కోరిక మీదట గణేష్ విశాఖపట్నం వెళ్ళాడు అన్నది నిజం కాదా. నాకు నిన్న సిబిఐ ఆఫీసర్ చక్రధర్ ఫోన్ చేసి అతని అనుమానం చెప్పాడు. నీ లక్ష్యం ఏమిటి, ఎందుకు ఈ విషయం సిబిఐ వారికి చెప్పకుండా దాచావు. ఎక్కడ నీ పాపులారిటీ తగ్గిపోతుందో అని నా దగ్గరకు వచ్చిన మాట నిజం కాదా? చెప్పు చెప్పు”

“నువ్వు నీ పదవి కోసం భూషణరావు లాంటి క్రిమినల్‌ని సపోర్ట్ చెయ్యడం నిజం కాదా, అతనికి అవసరమైన ప్రాజెక్ట్ కోసం నీ అధికారాన్ని దుర్వినియోగ పరచడం నిజం కాదా. మీ తండ్రిగారి మరణం వెనక ఉన్న కారణాన్ని మరుగునపడేలా చెయ్యడం నిజం కాదా. నాచిరెడ్డి మీ పార్టీలో జేరి సిబిఐ నుండి తప్పించుకోవడం నిజం కాదా? మీ పార్టీ భూషణరావు చేతుల్లోకి వెళ్ళిపోవడం నిజం కాదా? చెప్పు చెప్పు” తను కూడా ఏ మాత్రం తగ్గకుండా అతడిని ప్రశ్నించింది ప్రియాంక.

“లోపాలు ప్రతీ ఒక్కరిలో ఉంటాయి రాహుల్, కానీ కొంతమందికి వాటిని సులభంగా కప్పిపుచ్చుకోవడానికి అవకాశం అధికారం ద్వారా లభిస్తుంది, కొంతమంది అదే అవకాశాన్ని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు నా లక్ష్యం ఏంటని అడిగావు కదా ఆ అధికారం చేజిక్కించుకోవడమే నా లక్ష్యం, మిగతావన్నీ ఎప్పుడో మరుగునపడిపోయాయి” చెప్పింది ప్రియాంక

“అంటే ఇందాకా నన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలో ఎంతవరకూ నిజం ఉంది?” సూటిగా అడిగాడు

“నిజం ఏంటో ఇందాకే ప్రూవ్ అయ్యింది అని ఇద్దరికీ తెలుసు. ఇక ఈ జరుగుతున్న కాలయాపన అంతా కేవలం గెలుపు ఎవరిది అని తెలుసుకోవడానికే, అయితే నేను అన్నిటికీ సిద్ధపడే నీ ముందు ఈ ప్రపోజల్ ఉంచాను. ఇప్పుడు నాకు నిజం కన్నా గెలుపు ముఖ్యం” అంతే సూటిగా చెప్పింది ప్రియాంక.

“అప్పుడు నాచిరెడ్డి చేసినదానికి నువ్వు చేసినదానికీ తేడా ఏంటి?” ఎదురు ప్రశ్నించాడు రాహుల్.

“చెప్పానుగా అవన్నీ ఎప్పుడో మరుగునపడిపోయాయి, నిజాన్ని ప్రజలు కూడా కోరుకోవడం లేదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది, నేను గెలిచిన తరువాత నేను చెప్పినదే నిజం. గెలుపే నిజం అన్నది నా కొత్త యోచన. అందుకే మనం పెళ్ళిచేసుకోవడం ఒక్కటే ఈ సమస్యకు, దీనితో ముడిపడి ఉన్న సమస్యలకు పరిష్కారం” చెప్పింది ప్రియాంక. నమ్మలేనట్లుగా చూసాడు రాహుల్

“అయితే నువ్వు గెలవాలి అనుకుంటున్న పక్షంలో నాకు కొన్ని షరతులు ఉన్నాయి దానికి నువ్వు అంగీకరిస్తే నేను నీ గెలుపుకి సహకరిస్తాను” నెమ్మదిగా చెప్పాడు రాహుల్

“ఏంటవి” అర్థం కానట్లుగా అడిగింది ప్రియాంక.

“మన పెళ్లి జరగాలంటే నువ్వు ముఖ్యమంత్రి పోటీ నుంచి తప్పుకోవాలి. మనిద్దరికీ ఈ విషయంలో క్లాషెస్ రావడం నాకు ఇష్టం లేదు. మన తల్లిదండ్రులు వెళ్ళిన మార్గంలోనే నేను వెళ్ళాలనుకోవడం లేదు. అలా ఉండడం వలన వారి పరిస్థితి ఏమయ్యిందో గమనించావు కదా, ఉన్నంతకాలం ఒకరిపై ఒకరు పన్నాగాలు పన్నడంతోనే జీవితం సరిపోయింది, దురదృష్టవశాత్తు ఆ సమయంలో వారికి నా సహాయం కూడా నాన్నగారికి అందించాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు నీకీ షరతు సమ్మతమేనా?” అడిగాడు రాహుల్

“మన ప్రేమ, వివాహం విషయంలో కూడా నీకు రాజకీయం చెయ్యాల్సి వస్తుందని నేను అనుకోలేదు” ఆమె స్వరం బాధపడుతున్నట్లుగా ఉంది. అతను ఆ మాటలకు పగలబడి నవ్వాడు. ఆమె అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది. కొంతసమయం తరువాత అతనే అన్నాడు

“మనం ఏ కాలంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించు. మనందరి మార్గాలు వేరు అని నువ్వన్న మాటలు నిజమే, కానీ అంతిమంగా మన ఆలోచనలన్నీ ఒకదాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయో, అదే సర్వైవల్. దానికి ఒకొక్కరు ఒకొక్క విధమైన పేరు పెట్టుకుంటారు.

అసలు నా దృష్టిలో వివాహం అంటేనే రాజకీయం ప్రియాంక, మనకి అన్ని విధాల సముజ్జీలైన వారితో రాజీ కుదుర్చుకోవడానికి మనం ఉపయోగించే ఆఖరి అస్త్రమే ఈ వివాహం, ఒకొక్క క్రైటీరియాలో ఒక పాజిటివ్‌నూ ఒక నెగటివ్‌నూ న్యూట్రలైజ్ చేసేదే ఈ వివాహం. పురాణాల్లోనూ, చరిత్రలోనూ యుగయుగాలుగా తరతరాలుగా ఇది నిరూపించబడుతూ వస్తోంది. దీన్ని అందరూ తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, మనమందరం ఆ ఆటలో ఒకరిని మించి ఒకరు ఆరితేరిన వాళ్ళము.

నీకు మన వివాహం వల్ల లాభం ఎంతుందో నాకు కూడా అంతే ఉంది, అందుకే మన మధ్య ఈ సంబాషణ సజావుగా సాగుతోంది. ఇంక నేను ఈ విషయంగా నీతో ఎక్కువ డిస్కషన్ చెయ్యను. మై ఆఫర్ స్టాండ్స్ క్లియర్ మనిద్దరి ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఉపయోగపడాలంటే నా ఆంక్షలకు నువ్వు ఒప్పుకోక తప్పదు. నీ లక్ష్యం సంగతి నాకు తెలీదు కానీ అవసరమైతే నువ్వు శాశ్వతంగా రాజకీయాల నుండి తొలగిపోవాలి” అతని ఆఖరిమాట చాలా కఠినంగా వచ్చింది

“నేనే ఎందుకు తప్పుకోవాలి, ఆ పనేదో నువ్వే చేయ్యచ్చుగా?” కోపంగా అడిగింది ప్రియాంక

“కమాన్ నేను ఆ పని చెయ్యడం అనేది అర్థం లేని వాదన, ఎవరు ఎవరి దగ్గరకి వచ్చి సహాయం కోరారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు నాతో కలవకపోవడం, మన పెళ్లి జరగకపోవడం వలన నాకు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తరువాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నదాని మీద నేను నీకు హామీ ఇవ్వలేను.” ఖరాఖండీగా చెప్పాడు రాహుల్.

“అంటే సిబిఐ వాళ్ళ విషయంలో నన్ను బెదిరిస్తున్నావా?” కోపంగా అడిగింది ప్రియాంక. ఆమె తను చేసినవాటి పరిణామాల గురించి ఆలోచించడానికి మనస్కరించడం లేదు.

“నువ్వు ఎలా అనుకున్నా నా నిర్ణయం మాత్రం ఇదే. మ్యూచువల్లీ బెనిఫిషియల్‌గా ఉండాలి కదా ఎప్పుడైనా అసోసియేషన్ అనేది. నేను ఇంక మీ పార్టీ నుంచి ఎటువంటి రిస్క్స్ తీసుకోదలుచుకోలేదు. చెప్పు నీ నిర్ణయం ఏమిటి?” రెట్టించి అడిగాడు. కొంతసేపటి మౌనం తరువాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పింది

 “నాకు సమ్మతమే. కానీ నీ అంక్షలల్లో ఒక చిన్న సవరణ చెయ్యాల్సి ఉంది. నేను రాజకీయాల్లో ఉండడం ఎంతవరకూ శ్రేయస్కరం అన్నది నీకు ఇప్పుడిప్పుడే అర్థం  కాదు. దానికి కొంత సమయం పడుతుంది. కనుక రెండవ అంక్ష విషయంలో నువ్వు కొంచెం బెట్టుతగ్గించుకోవాలి, అది అభ్యర్ధన అనుకో మరింకేమైనా అనుకో.

ప్రస్తుతానికి మన పెళ్లి విషయం మాత్రమే మనం ఆలోచించాల్సినది. అందుకని నేను ముఖ్యమంత్రి పోటీ నుంచి వైదోలగుతున్నాను. ఈరోజే ఈ విషయం పత్రికలవాళ్ళకి, మీడియావాళ్లకి తెలియజేసి నీ అభ్యర్ధిత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా చెప్తాను” ధృడ నిశ్చయంతో చెప్పింది ప్రియాంక

“తొందరపడకు నువ్వు ఇక్కడికి వస్తున్నట్లుగా, మీ పార్టీ వాళ్ళకి కానీ. సిద్ధార్థకి కానీ తెలుసా. వాళ్ళు నీ నిర్ణయాన్ని ఆమోదిస్తారో లేదో ఒక్కసారి ఆలోచించుకో” ఆమెతో నిదానంగా అన్నాడు రాహుల్.

“ఇప్పుడు అవన్నీ ఆలోచించే అంత సమయం లేదు. సిద్ధూ ఇప్పుడు ఊళ్ళో లేడు, అయినా అతనెప్పుడూ నా నిర్ణయానికి ఎదురు చెప్పడు అని నాకు గట్టి నమ్మకం. ఇకపోతే పార్టీ అధ్యక్షురాలు అయిన నా మాటను బలపరచడానికి పార్టీలో ముఖ్యులైన ప్రసాద్ గారు లాంటి వారి సహాయం నాకు ఎప్పుడూ ఉంటుంది.

ఇదంతా ప్రజలు శ్రేయస్సు కోసం చేస్తున్నదే కదా, మన ఇద్దరి కలయిక వల్ల కనస్ట్రక్టివ్ ఫోర్సు, స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్‌లు కూడా కలిసి పని చేసి రాష్ట్రంలో ప్రజలందరూ ఏకీకృత లక్ష్యాన్ని కలిగి ఉండి పురోగమనం వైపు దారి తీస్తారని నాకు అనిపిస్తోంది. ఇంక మనం దేని గురించీ భయపడాల్సిన పనిలేదు.ఆ ధరణికోట ప్రాజెక్ట్‌ను కూడా ప్రజలకి అంకితం చెయ్యడానికి అవసరమైన సహకారం అందిస్తాను.

అక్కడ ప్రజల భూమి అవసరాలను మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల అవసరాలను కూడా మన ఇద్దరం కలిసి ఉమ్మడిగా పరిష్కరిద్దాం. దానికి తగిన డ్రాఫ్ట్ బిల్ ఈపాటికే నా దగ్గర సిద్ధంగా ఉంది” ఉద్వేగంతో చెప్తోంది ప్రియాంక.

ఆమెవంక మెచ్చుకోలుగా చూస్తున్నాడు రాహుల్. వాళ్ళిద్దరి కలయిక ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడానికే కొంచెం కష్టంగా అనిపించింది. తమ ఇద్దరి వివాహం విషయం ఎలాబయటకి వెళ్లిందో తెలీదు కానీ సాయంత్రం ఆరుగంటల సమయానికల్లా జాతీయ అంతర్జాతీయ మీడియావారు తమ ఇంటిముందర ప్రత్యక్ష్యం అయ్యారు.

తమ ఇంటి వద్దనే పెద్ద వేదికను ఎర్పాటు చేయించాడు రాహుల్. కనీసం మూడు వందల మంది వివిధపత్రికా విలేఖరులు, ఇతర మీడియా వర్గాలు వివిధ రకాల కెమేరాలతో, సాంకేతిక పరికరాలతో అక్కడ హాజరయ్యి ఉన్నారు. అదేదో పెళ్లివేడుకలా ఆ ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చెయ్యడానికి కొంతమంది స్పోన్సర్స్ కూడా అక్కడికి వచ్చారు.

“ముందుగా మీ వివాహం ఖాయం అయ్యినందుకు శుభాకాంక్షలు మేడం. మా అందరికీ ఇదొక పెద్ద షాక్ లాంటిది” ఒక మహిళా విలేఖరి పుష్పగుచ్చం బహూకరించి చెప్పింది.“దీని వల్ల మీ పొలిటికల్ ఫ్రంట్ ఏ విధంగా ప్రభావితం కాబోతోంది. మీరు మీ పార్టీని అధికార పక్షంతో విలీనం చెయ్యబోతున్నారా” అడిగారు ఇంకొక పత్రికవారు.

“నిశ్చయం అయితే జరిగింది, కానీ మా పార్టీవారిని సంప్రదించే లోపలే మీకు విషయం తెలియడంతో మీరు మమ్మల్ని పట్టుకున్నారు” చిన్నగా నవ్వులు వినిపించాయి

“ఇప్పటివరకు వ్యతిరేకించిన ప్రభుత్వ విధానాల గురించి మీరు ప్రభుత్వంలో చేరిన తరువాత అభిప్రాయం ఏ విధంగా ఉండబోతోంది. ‘అందరికీ భూమి’ ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న పరిశ్రమలు, ఉపాధి మార్గాలు ఇవన్ని విషయాల్లో ప్రభుత్వం పట్ల మీరు సంతృప్తి చెంది ఉన్నారా” ఎవరో ప్రశ్నించారు.

“నేను పక్షం అయితే మారాను కానీ నా లక్ష్యం మారలేదు. ఇప్పటికీ ప్రభుత్వ విధానాలలో నాకు ఎటువంటి లోపాలు కనిపించినా నేను వాటిని ముఖ్యంగా ఎత్తిచూపుతాను. అన్నిటికన్నా ఎక్కువగా ఆ ధరణికోట ప్రాజెక్ట్ పైన ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించడానికి, మేము కలిసిన ఈ సుభ సందర్భంగా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడివక్కడ ఆపుచేయ్యవలసినది నిర్ణయం తీసుకుంటున్నాము.

ఎందుకంటే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ఇలా మొదటినుంచీ లోపభూయిష్టంగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించేదాకా పూర్తిచేయ్యకూడదు అనుకుంటున్నాము. దీనికి మంత్రి రాహుల్ గారి పూర్తి సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను” ఆమె చెప్పగానే ఒక్కసారి ఆ ప్రదేశం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. రాహుల్ నమ్మలేనట్లుగా ప్రియాంక వైపు చూసాడు. అక్కడ ఆ సమావేశానికి హాజరయిన హనుమంతరావు కూడా ఆశ్చర్యపోయాడు.

***

“మనకి సముద్రతీర నగరాలతో ఏదో విడదీయలేని అనుబంధం ఉన్నట్లు ఉంది” డ్రైవింగ్ సీట్లో కూర్చున్న చక్రధర్ చెప్పాడు.

“నిజమో కాదో నీకే తెలియాలి, ఎందుకంటే క్రితంసారి మనం ముంబై వెళ్ళడం నావల్ల జరిగినా కానీ ప్రియాంక కాల్ లిస్టు ట్రేస్ చేసి యా కాల్‌ను ఫైండ్ అవుట్ చేసింది నువ్వు. ఆ వ్యక్తితో కరెస్పాండ్ చేసి మనల్ని వైజాగ్ తీసుకు వచ్చినది నువ్వు. ఇంకా ముందు ముందు మనం ఏమి అన్‌కవర్ చేయ్యబోతున్నామో? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు” అతని పక్కన సీట్లో రిలాక్స్డ్ గా కూర్చున్న జగదీశ్వరరావు చక్రధర్‌ను అడిగాడు.

“అతని పేరు సుదర్శన్ సార్, బాక్ ఎండ్ మీడియా అని ఒక న్యూస్ కన్సల్టెన్సీ ఫర్మ్ నడుపుతూ ఉంటాడు. అతని బేస్ అఫ్ ఆపరేషన్స్ వైజాగ్ అయినా, అతని నెట్వర్క్ చాలా పెద్దది అక్రాస్ ఇండియా స్ప్రెడ్ అయి ఉంది. సుకన్య గారి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కూడా ఇతనిపేరు రెండు మూడు సార్లు బయటపడింది.

పాలిటిక్స్‌లో ఉన్నవారికి ఇతడి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అవుతూ ఉంటుందని అని అందరికీ తెలుసు. ఇతని పేరు ఎప్పుడూ పైకి కనిపించకపోయినా ఇన్ఫర్మేషన్ చాలా క్రెడిబుల్‌గా ఉంటుందని నమ్మకం పొలిటికల్ అండర్ గ్రౌండ్ సర్కిల్స్‌లో తిరుగుతూ ఉంటుంది. ఇతడి వాయిస్‌ను నేను సరిగ్గా గణేష్ చనిపోవడానికి ఒక నెలరోజుల ముందర ప్రియాంక కాల్ లిస్టులో ట్రేస్ చేసాను.

ఆమె ఇప్పుడు రాహుల్ గారితో కలిసిపోవడం వల్ల ఆమె నుంచి కూడా మనం ఎటువంటి సహాయం ఎక్పెక్ట్ చెయ్యలేము, అందుకే ఇది నేను ఆఫ్ ద రికార్డ్ చేసాను. అంతేకాకుండా నాకు ప్రియాంక గారి ఇంట్లో ఉన్న దుర్గాభవాని మీద కూడా కొద్దిగా అనుమానం ఉంది. ఆమె కూడా పుట్టి పెరిగింది విశాఖ లోనే కనుక ఆమె గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందని మనం ఇక్కడికి రావడం జరిగింది” సునాయాసంగా కారు నడుపుతున్న చక్రధర్ ఆయనతో చెప్పాడు

“అయితే మనం మొట్టమొదట ఇతడిని మీట్ అవ్వబోతున్నామా?” అడిగాడు జగదీశ్వరరావు. అవునన్నట్లు తలూపాడు చక్రధర్, సహజంగా ఇలాంటి మీటింగ్స్ సీక్రెట్ ప్లేసెస్‌లో చెయ్యడానికి ఇష్టపడతాడు సుదర్శన్. తాము ఇప్పుడు చేస్తున్నది అంతా కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా జరుగుతుండడం వలన వారు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి నిర్ణయించుకుని, తాము ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పకుండా వచ్చారు.

తమ కోసం బీచ్ రోడ్ లోని హోటల్ గ్రాండ్ బే లో ప్రత్యేకమైన రూమ్ బుక్ చేసి వారికోసం ఎదురు చూస్తున్నాడు సుదర్శన్, అప్పటికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. ఎయిర్ పోర్ట్ నుండి కాబ్ హైర్ చేసుకుని డైరెక్ట్‌గా హోటల్‌కి వచ్చారు వాళ్ళు. వారు ఫ్రెషప్ అయ్యిన తరువాత కలుస్తానని చెప్పి ఒక అరగంట తరువాత ప్రత్యక్షం అయ్యాడు సుదర్శన్. అతను వచ్చేసరికి వారి రూమ్‌లో అన్నీ అరేంజ్ చేస్తున్నాడు రూమ్ సర్వీస్ బాయ్, అక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అతను వెళ్ళిపోయినా తరువాత అన్నాడు సుదర్శన్

 “సార్ మీరు నా నెంబర్ ఎలా ట్రేస్ చెయ్యగలిగారు” అతని గొంతులో కొంచెం భయం తొంగి చూసింది, వారిద్దరూ సిబిఐ అఫీషియల్స్ అని అతనికి తెలీడంతో కొంచెం ఖంగారుగా కూడా ఉంది అతని ప్రవర్తన.

 “మీ మార్గాలు మీకున్నట్లే మా మార్గాలు మాకున్నాయి. మర్చిపోయారా మేము సిబిఐ కదా. మాకు కావలసిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఏ సమయంలో అయినా ఎవరి దగ్గర నుంచైనా తీసుకునే అధికారం మాకుంది” చెప్పాడు చక్రధర్, అతని చేతిలో విస్కీ ఉంది. జగదీశ్వరావు మాత్రం ఏమీ డ్రింక్ చెయ్యకుండా ఉన్నాడు.

“అది కాదు సార్, నేను ప్రియాంక గారికి ఆ కాల్ చాలా కాన్ఫిడెన్షియల్ నెంబర్ నుంచి చేసాను. ఆ నెంబర్ అసలు రికార్డ్స్‌లో ఉండే ఛాన్స్ లేదు. టెలిఫోన్ కంపనీ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అందుకే అడిగాను సర్” చెప్పాడు సుదర్శన్.

“మాకు కాన్ఫిడెన్షియల్ అలాంటి పదాలు వర్తించవు, బట్ ఈ విషయంలో మీరన్నట్లుగా మేము కొన్ని అన్యూజువల్ మీన్స్ ఉపయోగించవలసి వచ్చింది, యూనో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత హైప్రోఫైల్ మనుషులో మీకు తెలుసు కదా. అయినా కానీ మీరు భయపడాల్సినది ఏమీ లేదు. మేము జస్ట్ మీ సహాయం కోరి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది” చెప్పాడు జగదీశ్వరరావు.

గణేష్, సుకన్య, ముఖ్యమంత్రి జోగేశ్వరరావు ఇవన్ని కేసులు సాల్వ్ చెయ్యడానికి తమ డిపార్ట్మెంట్ పని చేసే సంప్రాదాయ పద్ధతులు వల్ల తాము ఎక్కువగా పురోగతి సాధించలేకపోతున్నామని చక్రధర్, జగదీశ్వరరావులు అభిప్రాయపడ్డారు. అడుగడుగునా ఏదో ఒకచోట ప్రభుత్వం నుంచో లేదా ఇతర అధికార వర్గాలనుంచో అడ్డంకులు తగులుతూ ఉండడం వలన తాము ముందు వెళ్ళలేకపోతున్నారని భావించి తామే స్వంతంగా ప్రైవేట్ వాళ్లద్వారా వీటిని సాధించాలు అనుకున్నారు.

అందులో భాగంగానే ప్రియాంక పర్మిషన్ లేకుండా ఆమెకు అనుమానం రాకుండా ఆమె మొబైల్‌ని ట్రేస్ చేసి అందులో వాళ్ళకి దొరికిన సుదర్శన్‌ను పట్టుకున్నారు. అతని గురించి ఆరాతీయగా అతనికి పొలిటికల్ కాంటాక్ట్స్ కూడా చాలా ఎక్కువే అని, ఇలాంటి విషయాల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఆరాతీయడం అతని ఒక్కడికే సాధ్యం అని తెలుసుకున్నారు. అందుకే ఆ రోజు అతడిని అక్కడ కలుసుకున్నారు చక్రధర్, జగదీశ్వరరావులు ఇద్దరూ. ఇప్పుడు తమ డిపార్ట్మెంట్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు సెలవులో ఉన్నట్లు.

“మిస్టర్ సుదర్శన్ మాకు నిజం తెలుసుకోవడం ఒకటే కావాలి, మీరు అసలు ఆరోజు ప్రియాంక గారికి ఎందుకు ఆ విధంగా కాల్ చేసారు. గణేష్ జీవితం ప్రమాదంలో ఉండబోతోంది అని మీకెలా అనుమానం కలిగింది” తను ప్రియాంక, సుదర్శన్ ల మధ్య జరిగిన ఆ కాల్‌ను ఇంటర్సెప్ట్ చేసి వారి మధ్య సంభాషణ వినడం జరిగింది. వారికి పూర్తిగా సహకరించడానికి నిర్ణయించుకున్న సుదర్శన్

“అది తెలుసుకోవాలన్నా దాని వెనుక ఉన్న పూర్తి వివారాలు తెలుసుకోవాలన్నా, దానితో సంబంధం ఉన్న అందరి వివరాలు తెలుసుకోవాలన్నా రేపు మీరొకసారి మా ఆఫీస్‌కు రావాలి సార్. అక్కడే మీకు పూర్తి వివరాలు, నేను ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు చెప్పగలుగుతాను. మా ఇంటి దగ్గరే ఆఫీస్ కూడా” అని చెప్పి తన కార్డ్ ఇచ్చాడు. వారిద్దరూ దానిని తీసుకుని భద్రంగా దాచుకున్నారు.

ఆ మరుసటి రోజు వాళ్ళు సుదర్శన్ ఇంటికి వెళ్ళారు, ఊరికి దూరంగా ఉన్న ఆ ఇల్లు చాలా నూతనంగా ఉంది. వాళ్లకి ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే సుదర్శన్ వాళ్ళింటి అండర్ గ్రౌండ్‌లో అతని సీక్రెట్ ఆఫీస్ ఉంది.ముప్పైవేల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించబడిన ఆ అండర్‌గ్రౌండ్ కన్‌స్ట్రక్షన్ అధునాతమైన పరిశోధనాశాల లాగ ఉంది.

ఎక్కడ చూసినా పెద్దపెద్ద తెరలు, కంప్యూటర్లు వాటితో అనుసంధానం చెయ్యబడి ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్‌తో మినీ సాఫ్ట్‌వేర్ కంపనీని తలపిస్తోంది. ఆ భవనంలోని హాల్ చివరలో సినిమా తెర అంత పెద్దదిగా ఉన్న ఒక తెరమీద రకరకాల ప్రదేశాల యొక్క వీడియోలు కనిపిస్తున్నాయి. తాము ఏ మనుషులమీదైనా నిఘా ఉంచడానికి వారు ఈ పరికరాలను వాడుకుంటూ ఉండి ఉంటారు అనిపించింది చక్రధర్ కు.

వీరు చేసే పనులలో ఎంతవరకూ లీగల్, ఎంత ఇల్లీగల్ ఉంటుందో అని ఆలోచిస్తూ ఆ ప్రదేశం మొత్తం పరికిస్తున్నారు వారిద్దరూ. సుదర్శన్ వాళ్ళకి ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతలను ఒకొక్కటిగా వివరిస్తున్నాడు. ఆఖరికి ఐదుగురు యువకులూ, ముగ్గురు యువతులూ ఉన్న తమ బృందాన్ని వారికి పరిచయం చేసాడు.

“ఇదే సార్ మా ఆఫీస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన మా ఈ బేస్ సెంటర్ నుండి ఈ రాష్ట్రంలోనే కాదు మన దేశం మొత్తం మీద ప్రతిచిన్న కదలికనీ మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్యనే దీన్ని నిర్మించడం జరిగింది” చెప్పాడు సుదర్శన్.

“వెరీ వెల్ మిస్టర్, ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ప్రభుత్వాన్ని కూడా తలదన్నేటటువంటి సమాచార సాధనాలు ఉండడం చాల ఆశ్చర్యంగా ఉంది. ఎనీవే నిన్న మాకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అన్నారు. దానికోసమే మేము ఎదురు చూస్తున్నాం”

 “ప్లీజ్ కం విత్ మీ సార్” అని వారిని అక్కడ ఒక మూలగా ఉన్న కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు. దాదాపు ముప్పై మంది కూర్చోవడానికి వీలుగా ఒక రౌండ్ టేబుల్ అక్కడ ఎరేంజ్ చెయ్యబడి ఉంది, దానికి ఎదురుగా ఒక తెర దానిమీద కొన్ని బొమ్మలు కనిపించి ఉన్నాయి.

 “మా టీం మొదటినుంచీ అన్‌కవర్ చేసిన వివరాలు మేము మీకు ఇప్పుడు చూపబోతున్నాం సర్” అని సుదర్శన్ చెప్పగానే అక్కడ లైట్స్ ఆగిపోయాయి.

అక్కడ స్క్రీన్ మీద ఒకొక్కరుగా ఫోటోలు రావడం ప్రారంభించాయి

“ఇతను భూషణరావు భూషణ్ ఇండస్ట్రీస్, ధన్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంకా ఇలాంటి దేశవ్యాప్తంగా ఎన్నో బినామి సంస్థలు కలిగిన బడా పారిశ్రామికవేత్త, అది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు, డ్రగ్స్, మాఫియాతో ఇతనికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇతని మీద చాలా మర్డర్ కేసెస్ ఉన్నాయి.

అశోక్ త్యాగీ అనే ఒక కలెక్టర్ హత్య కేసులో ఇతని హస్తం ఉందని ఒక రూమరుంది, అయితే కోర్టులో ఏ విషయం నిర్ధారించబడలేదు. గత ఎన్నికల్లో నకునారెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి నష్టపోయి తన స్థలం పోగొట్టుకున్నాడు. ఇతను భూషణరావు కుమారుడు ప్రతాప్ తన తండ్రికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను, ఇల్లీగల్ ధందాలనూ చూస్తూ ఉంటాడు.

కేంద్రమంత్రి నాచిరెడ్డి భార్యకీ, టెన్నిస్ సంచలనం చరణ్‌కీ మధ్య రిలేషన్‌ని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం ద్వారా గవర్నమెంట్‌ను అన్‌స్టెబిలైజ్ చేసి తన స్థలం తిరిగి దక్కించుకోవడానికి చూసాడు భూషణరావు. అందుకోసం ప్రతాప్‌ను వాడుకున్నాడు, ప్రతాప్ దీనికోసం బ్యాక్ ఎండ్ మీడియా సహాయం కోరాడు.

అయితే రీసెంట్‌గా మేము తెలుసుకున్నది ఏంటంటే. ప్రతాప్ చరణ్, సుకన్యలను కిడ్నాప్ చెయ్యడానికి పథకం పన్నినప్పుడు అతనికి మూడవ వ్యక్తి సహాయం లభించింది. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇంకా మాకు తెలీదు. అయితే ఆ మూడవ వ్యక్తి ఎవరో తెలుసుకున్న చరణ్, సుకన్యలు తప్పించుకోవడంతో వారిని చంపడం తప్ప మరొక మార్గం భూషణరావు బృందానికి కనిపించలేదు.

అంతేకాకుండా ఆ సమయంలో మంచి ప్రాముఖ్యత గడించిన హిస్టరీ ప్రొఫెసర్ వరదరజన్‌ను అంతమొందించడానికి ఆయన నా సహాయం కోరాడు, ఇది నేను సిద్ధార్థకు తెలియజేశాను. అయినప్పటికీ వారికి తమ స్థలం దక్కకపోయేసరికి ముఖ్యమంత్రి జోగేశ్వరరావు గారిని చంపే పథకం పన్నారు అని మేము అనుమానిస్తున్నాము.

దివంగత ముఖ్యమంత్రిగారు మొదటినుంచీ భూషణరావుకి వ్యతిరేకమే. ఒక రకంగా చెప్పాలంటే అతడికి సంబంధం ఉన్న అశోక్ త్యాగీ కేసును హైలైట్ చెయ్యడం ద్వారానే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు అని ఒక అభిప్రాయం ఉంది.”

జగదీశ్వరరావు తన చెవులను తానే నమ్మలేకపోయాడు.

“ముఖ్యమంత్రి చాపర్ క్రాష్‌లో చనిపోయారు కదా, ఆయన మృతి వెనకాల భూషణరావు హస్తం ఉండచ్చు అని మీరు ఏ విధంగా అనుమానించారు” అడిగాడు ఆయన

“దానికి కారణం ఉంది సార్. మీరు మమ్మల్ని ఈ కేసెస్ మూడూ వివరించి సహాయం కోరినప్పుడే మాకు ఆ అనుమానం కలిగింది. దీనివెనుక ఆ మూడవ వ్యక్తి కూడా ఉంటాడని మాకు అనిపిస్తోంది. ఈ వీడియో ఒకసారి చూడండి” అని భూషణరావు ఆదిత్య నారాయణ నాయుడుపల్లి ప్రాంతంలో కలవడం అక్కడ ఆయన ప్రసంగం అంతా కనిపించింది. ఆ వీడియోలో రెడ్ కలర్‌లో హైలైట్ చెయ్యబడిన ఒక వ్యక్తిని వారు గమనించారు, అతను మరెవరో కాదు సూరి.

“ఇతని పేరు సూరి. ఇతని కుటుంబానికి ఈ ప్రాంతంలోని స్థలం ఉండడం వలన దాన్ని ప్రభుత్వం భూసేకరణలో చేజిక్కించుకోవడం వలన ఇతను భూషణరావు వర్గంతో చేతులు కలిపాడు. అనుకోకుండా కొంతకాలానికి ఇతని దగ్గర నుంచి మాకు ముంబై ప్రాంతం నుండి కాల్ వచ్చింది, ఎందుకో తెలీదు కానీ అతను ఎక్కువసేపు మాతో మాట్లాడలేదు, అతనేదో ప్రమాదంలో ఉన్నట్లుగా ఆయాసంగా వగరుస్తూ ఉన్నాడు.

ఇతనికి సహాయం కోసం నేను మా క్లయింట్‌లో ఒకరైన జనహిత పార్టీ సిద్ధార్థ సహాయం కోరాను, ఆ తరువాత సూరి ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలీదు, అతని తండ్రికి కూడా అతని ఆచూకీ తెలీదు.అతను మాట్లాడిన సెల్ఫోన్ సిగ్నల్స్ అయితే మేము ట్రేస్ చెయ్యగలిగాము కానీ ఆ సెల్ ఫోన్‌ను మేము కనిపెట్టలేకపోయాం” అతను ఇలా అనగానే జగదీశ్వరరావు ముఖం ప్రకాశవంతం అయ్యింది.

“అంటే ఆ సెల్ ఫోన్‌కి సంబంధించి అనానిమస్‌గా టిప్ అందించినది మీరే అన్నమాట” అడిగాడు జగదీశ్వరరావు.

“అవును సర్, అదే సమయంలో భూషణరావు కూడా ప్రతాప్‌తో కలిపి ముంబైలో ఉన్నట్లుగా మా నిఘాలో తెలిసింది, ఇది జరిగిన వారం రోజులకే ముఖ్యమంత్రి చాపర్ క్రాష్ అవడం జరిగింది, దాని తరువాత మా అనుమానాన్ని బలపరుస్తూ భూషణరావు జనసమాజ్ పార్టీలో చేరడం, జనహిత పార్టీ హనుమంతరావుగారు ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ చాలా త్వరితగతిన జరిగిపోయాయి” చెప్పాడు సుదర్శన్ అతను చెప్పదలచుకున్నది ముగించగానే అక్కడ తిరిగి లైట్లు వెలిగాయి.

“ఆ రోజు సూరి ప్రమాదంలో ఉన్న విషయం మీరు సిద్ధార్థకు చెప్పారు అన్నమాట. మీ టిప్ ద్వారానే మాకు ఆ సెల్ ఫోన్ లభించింది. దాని ప్రకారమే ఆ చాపర్ క్రాష్ వెనక ఉన్న కాన్స్పిరసీ తెలుస్తోంది. మీరు చెప్పినదాని ప్రకారం చూస్తే ముంబైలో సెల్ ఫోన్ దొరికిన ఏరియాకి కొంతదూరంలో భవనాన్ని హైర్ చేసుకున్నది ప్రతాప్ అనిపిస్తోంది, ఇదంతా వాళ్ళు అక్కడినుంచే ప్లాన్ చేసి ఉండాలి.”

అంగీకరిస్తున్నట్లుగా తలూపాడు సుదర్శన్.

“ఇక్కడ ఇంకొక కొత్త విషయం తెలిసింది సార్. ప్రతాప్ నా దగ్గర గణేష్ గురించి భయం వ్యక్తం చేసిన దగ్గరనుంచీ నా అనుమానం కొద్దీ నేను అతడిమీద నిఘా ఉంచాను. మాకు తెలిసింది ఏంటంటే భూషణరావు పర్యవేక్షణలో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ మీటింగ్ ఇంకొక నాలుగు రోజుల్లో ఒక చోట జరగబోతోంది. ప్రతాప్ మాటల్లో అక్కడకి అంతర్జాతీయంగా పలుకుబడి ఉన్న చాలామంది పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారని, వీరినందరినీ అక్కడ అసెంబుల్ చేయ్యబోయేది ‘పెద్ద బాస్’ అనీ తెలిసింది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని అక్కడేదో పెద్ద కుట్ర జరగబోతోంది అని మా అనుమానం సార్” చెప్పాడు సుదర్శన్.

“నిజంగానా ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ మిస్టర్ సుదర్శన్. మీరు చెప్పిన ‘పెద్ద బాస్’ మా ఊహల్లో ఉన్న ‘మిస్టర్ X’ ఒకరే అయ్యే అవకాశం ఉంది అనిపిస్తోంది. డెఫినెట్‌గా మన అనుమాలన్నిటికీ ఆ అండర్‌గ్రౌండ్ మీటింగ్‌లో సమాధానం లభించే అవకాశం ఉంది. కనుక మనం కూడా సీక్రెట్‌గా అక్కడికి వెళ్దాం.ఇంతకీ ఆ మీటింగ్ జరగబోయేది ఎక్కడ” అడిగాడు జగదీశ్వరరావు

“ముంబైలో” చెప్పాడు సుదర్శన్. చక్రధర్, జగదీశ్వరరావులు ఒకరినొకరు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.

“సరే అయితే మనం ముంబై వెళ్దాం. ఇకపోతే మీరు మాకొక చిన్న సహయం చెయ్యాలి” అన్నాడు జగదీశ్వరరావు.

 “చెప్పండి సర్”

“ఈ అమ్మాయి పేరు దుర్గాభవాని ఈమె గురించి ఎందుకో చక్రధర్ అనుమానం వ్యక్తం చేసాడు. సో మీరు మీ టీంలోని బెస్ట్ మెంబర్స్‌తో ఈమె బాక్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే ఏర్పాటు చెయ్యండి.

నిజానికి మేమే చెయ్యాలి అయితే మనకి ఇప్పుడు అంత సమయం లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఇమ్మీడియెట్‌గా ముంబై వెళ్ళాలి. లేదంటే మనకి ఈ అవకాశం మళ్ళీ రాదు” తన దగ్గర ఉన్న ఫోటో సుదర్శన్‌కి ఇచ్చి అతనితో అన్నాడు జగదీశ్వరరావు, అతను దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. అక్కడితో ఆ సమావేశం ముగిసింది, ఈ కేసెస్ సాల్వ్ అయ్యేవరకూ వారు సుదర్శన్‌తోనే ఉండడానికి నిశ్చయించుకున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here