[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
ప్రథమాఙ్కః
(తతః ప్రవిశతి శిఖాం పరామృశన్ సకోప శ్చాణక్యః)
చాణక్య: క ఏష మయి స్థితే చన్ద్రగుప్త మభిభవితు మిచ్ఛతి? పశ్య –
అర్థం:
తతః= (ప్రస్తావన) అనంతరం, ముక్తాం+శిఖాం= విడిపోయిన శిఖను, పరామృశన్=తడుముకుంటూ, చాణక్యః+ప్రవిశతి= చాణుక్యుడు (స+కోపః=కోపంతో ఉన్నాడు)
మయి+స్థితే (సతి)=నేను (బతికి) ఉండగా, చన్ద్రగుప్తం+అభిభవితుం=చంద్రగుప్తుణ్ణి అవమానించాలని అనుకోవడానికి,కః+ఏషః=వీడేవడు, ఇచ్ఛతి=కోరుకుంటున్నాడు?
పశ్య= చూడు
శ్లోకం:
ఆస్వాదిత ద్విరద శోణిత శోణశోభాం
సంధ్యారుణా మివ కలాం శశ లాంఛనస్య
జృమ్భావిదారిత ముఖస్య ముఖాత్ స్ఫురన్తీమ్
కో హర్తు మిచ్ఛతి హరేః పరిభూయ దంష్ట్రామ్ -8
అర్థం:
ఆస్వాదిత=రుచిమరిగిన, ద్విరద+శోణిత=ఏనుగు రక్తపు, శోణ+శోభాం=అరుణకాంతిని, శశలాంఛనస్య=చంద్రుని (యొక్క), సంధ్యా+అరుణాం=మలిప్రొద్దు ఎరుపును పోలిన, కలాం+ఇవ+స్ఫురన్తీమ్=రేకవలె మెరుస్తున్న, దంష్ట్రామ్=కోరను, జృంభా+విదారిత+ముఖస్య=ఆవులింత కారణంగా తెరుచుకున్న, సింహస్య+ముఖాత్=సింహం నోటి నుంచి, పరిభూయ+హర్తుం=లక్ష్యపెట్టకుండా ఊడలాగడానికి, కః+ఇచ్ఛతి=ఎవడు తలపెడుతున్నాడు?
తాత్పర్యం:
అప్పుడే ఏనుగు రక్తం త్రాగిన సింహం నోటిలోని కోర – ఆ రక్తపు ఎరుపు అంటుకుని – సాయంకాలపు ఎరుపురంగు సోకిన చంద్రరేఖలాగా వుంది. సింహం ఆవులించింది కదా అని ఆ కోరను దాని నోటి నుంచి ఊడబెరకడానికి ఎవడు సాహసిస్తున్నాడు?
వృత్తం:
వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు
అలంకారం:
రూపకాతిశయోక్తి (రూపకాతిశయోక్తిస్స్యాత్ నిగీర్యాధ్య వసానతః – అని కువలయానందం).
చాణక్యుడు ‘జృంభావిదారిత ముఖం’గాను, చంద్రగుప్తుడు ‘ద్విరద శోణిత శోణశోభాదంష్ట్ర’గాను రూపించడం గమనించవచ్చు. ‘సంధ్యారుణా మివ కలాం’ అనే వాక్యంలో ‘ఇవ’ అనే ఉపమా వాచకం ఉంది గనుక ఉపమాలంకారం. (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః – అని కువలయానందం).
వ్యాఖ్య:
తాను ఏమరుపాటుగా ఉన్నాడనుకొని ఎవడైనా చంద్రగుప్తుణ్ణి లంకించుకోవాలని కోరుకుంటే జాగ్రత్త – అని చాణక్యుడి హెచ్చరిక. ‘ద్విరదం’ నందవంశం. దానిని అంతం చేసిన ‘శోణ శోభ’ చాణక్య వ్యూహానిది. సామ్రాజ్యానికి ఇంకా పూర్తిగా చంద్రగుప్తుడి శోభ – చల్లని వెన్నెల – సమకూరలేదు. అందుకే ‘సంధ్యారుణ శోణ శోభ’తో – కనిపించడం!!
అపి చ = ఇంకా…
శ్లోకం:
నన్దకుల కాలభుజగీం కోపానల బహుల నీలధూమలతామ్
అద్యాపి బధ్య మానాం వధ్యః కో నేచ్ఛతి శిఖాం మే -9
అర్థం:
నన్దకుల+కాలభుజగీం=నందవంశం పాలిక ఆడ నల్లతాచు వంటిదీ, కోప+అనల+బహులనీల+ధూమలతాం=(నా) కోపాగ్ని నుంచి లేచిన దట్టమైన నల్లని పొగతీగ వలె ఉన్నదీ, అద్య+అపి+బధ్యమానాం=ఇప్పుడిప్పుడే ముడిపడబోతున్నదీ, (అయిన) మే+శిఖాం=నా జుట్టు ముడిని, కః+వద్యః+న+ఇచ్ఛతి=చావు మూడిన ఎవడు కోరుకుంటున్నాడు?
అలంకారం:
అతిశయోక్తి. ‘శిఖ’ నల్లతాచు అనీ, నల్లని పొగతీగ అనీ చెప్పడం రూపకం కూడా. (రూపకాతిశయోక్తిస్స్యాత్ నిగీర్యాధ్య వసానతః – అని కువలయానందం).
వృత్తం:
ఆర్యావృత్తం. (పూర్వార్థంలో ఏడు చతుర్మాత్రా గణాలు, చివర ఒక గురువు. ఆరో గణం మాత్రం జ గణం లేదా నలం ఉండాలి. ఉత్తరార్థం కూడా ఇంతే కాని – ఆరో గణ స్థానంలో ఒకే లఘువు. ఆర్య – అయిదు రకాలు. వివరాలకు. చూ. ఛందఃపదకోశము.247 పేజీ).
అపి చ = ఇంకా…
శ్లోకం:
ఉల్లంఘయ న్మమ సముజ్జ్వలతః ప్రతాపం
కోపస్య నన్దకులకానన ధూమకేతోః।
సద్యః పరాత్మ పరిమాణ వివేక మూఢః
కః శాలభేన విధినా లభతాల వినాశమ్॥ – 10
అర్థం:
నన్దకుల+కానన+ధూమకేతోః= నందవంశమనే అడవికి దావాగ్ని వంటి, సముజ్జ్వలతః=మండుతున్న, మమ+కోపస్య+ప్రతాపం= నా కోపపు కాకను, పర+ఆత్మ+పరిమాణ+వివేకమూఢః=తన, పర, సామర్థ్యాల తాహతు నెరగని బుద్ధిహీనుడు, కః=ఎవడు, ఉల్లంఘన్=అతిక్రమిస్తూ, శాలభేన+విధినా=మిడత మాదిరిగా, సద్యః= వెనువెంటనే, వినాశమ్=సమసిపోవడాన్ని, లభతామ్=కోరుకుంటున్నాడు?
తాత్పర్యం:
నా కోపం నందవంశమనే అడవిని కాల్చేసే దావాగ్ని. తన, పర సామర్థ్యాల్ని అంచనా వేసుకోలేని ఏ మూర్ఖుడు మిడతలాగ మాడిపోదలుస్తున్నాడు?
అలంకారం:
అనుభయ తాద్రూప్య రూపకం (విషయ్యభేద తాద్రూప్య రఞ్జనం విషయస్య యత్ రూపకం తత్త్రిధాధిక్య న్యూనత్వానుభయోక్తిః అని కువలయానందం).
వ్యాఖ్య:
నందకులం అడవి. చాణక్య కోపం దావాగ్ని. తాహతు నెరగని మూర్ఖుడు మిడుత – ఈ శ్లోకంలో ‘అది అనే ఇది’ అనే తీరున వరుసగా రూపకాలు కూర్చడం వల్ల అలంకారం మాలారూపకం అని కూడా కొందరు అంటారు.
చాణక్యుడికి నందవంశం పట్ల ఉన్న కక్ష, తన సామర్థ్యం మీద తిరుగులేని నమ్మకం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక విధంగా నంద వంశ విధేయుడు, తన ప్రత్యర్థి అయిన రాక్షస మంత్రికి హెచ్చరిక.
వృత్తం:
వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు
చాణక్య: శార్ఙ్గరవ! శార్ఙ్గరవ!
అర్థం:
శిష్యుడైన శార్ఙ్గరవుడిణ్ణి పిలుస్తున్నాడు.
శిష్యః: (ప్రవిశ్య) ఉపాధ్యాయ, ఆజ్ఞాపయ.
అర్థం:
(ప్రవేశించి) ఆచార్య, ఆజ్ఞాపించండి.
చాణక్య: వత్స, ఉపవేష్టు మిచ్ఛామి
అర్థం:
వత్స=అబ్బాయీ, ఉపవేష్టం=కూర్చోవాలని, ఇచ్ఛామి= కోరుతున్నాను.
శిష్యః:
ఉపాధ్యాయ, న న్వియం సన్నిహితవేత్రాసనైవ ద్వార
ప్రకోష్ఠశాలా। తదస్యా ముపవేష్టు మర్హ త్యుపాధ్యాయః
అర్థం:
ఉపాధ్యాయ!=ఆచార్యా, ఇయం+ద్వారప్రకోష్ఠశాలా=ఇదే ఇంటి ముందరి వాకిలి, సన్నిహిత+వేత్రాసనా+నను= (ఇక్కడ) పేము చాప వేసి వుంది కద! తత్+ఉపాధ్యాయః=అందువల్ల గురువుగారు, అస్యాం=దానిమీద (లో), ఉపవేష్టం+అర్హతి=కూర్చోవచ్చును.
చాణక్య: వత్స, కార్యాభియోగ ఏవ అస్మాన్ వ్యాకులయతి,
న పునరుపాధ్యాయసహభూః శిష్యజనే దుఃశీలతా. (నాట్యేన ఉపవిశ్య)
అర్థం:
వత్స=నాయనా, కార్య+అభియోగః+ఏవ=పని ఒత్తిడి ఉన్నదే, అదే, అస్మాన్=మమ్మల్ని (పూర్వార్థంలో బహువచనం – హోదా సూచన -నన్ను), వ్యాకులయతి=కలవరపరుస్తోంది, (అన్యమనస్కంగా ఉన్నానయ్యా – అని), (అంతేగాని) ఉపాధ్యాయ సహభూః=గురువుతో (పాటు పుట్టిన) సమానమైన, శిష్యజనే=శిష్యులపట్ల (యందు), న+పునః+దుశ్శీలతా=సాధింపు మనస్తత్వం కాదు సుమా!
వ్యాఖ్య:
ఇక్కడ వాక్యంలో ‘నేను’ అనే అర్థంలో ‘అస్మాన్’ అని ఉపయోగించడానికి ప్రమాణం: అస్మదో ద్వయోశ్చ ఏకత్వే ద్విత్వేచ వివక్షితే అస్మదోబహువచనం వా స్యాత్. ఉదా: వయం బ్రూమః పక్షే బ్రవీమి… (వై.సి.కౌ)
ఇక్కడ చాణక్యుడి కోపమే కాదు, మంచితనం కూడా గమనించవచ్చు. “శిష్యులపట్ల ధాష్టీకం చేసేవాడిని కాను నాయనా; వేరే ఆలోచన కారణంగా (పని ఒత్తిడి మూలాన) ఎక్కడ కూర్చొను? అని – ఎదుట పేముచాప కనిపిస్తున్నా అడిగానని ఏమీ అనుకోవద్దు అని – శిష్యుడు కూడా గురువంతటి వాడేనని మన్నిస్తున్నాడు.
(నాట్యేన+ఉపవిశ్య=అభినయపూర్వకంగా కూర్చుని)
చాణక్య: (ఆత్మగతమ్) కథమ్! ప్రకాశతాం గతో ఽయ మర్థః
పౌరేషు, యథా కిల నన్దకుల వినాశజనిత రోషో రాక్షసః పితృవధా
మర్షి తేన సకల నన్ద రాజ్య పరిపణన ప్రోత్సాహితేన పర్వతక పుత్రేణ
మలయకేతునా సహ నన్దాయ, తదుపగృహీతేన చ మహతా
మ్లేచ్ఛ బలేన పరివృతో వృషల మభియోక్తు ముద్యత ఇతి।
(విచిన్త్య) అథవా, యేన మయా సర్వలోకప్రకాశం నన్దవంశవధం
ప్రతిజ్ఞాయ, నిస్తీర్ణా దుస్తరా ప్రతిజ్ఞాసరిత్, సోఽహ మిదానీం
ప్రకాశీభవన్త మ ప్యేన మర్థం న సమర్థః కిం ప్రశమయితుమ్?
కుతః, యస్య మమ…
అర్థం:
(ఆత్మగతమ్=తనలో) కథమ్=ఏమిటీ! యథా కిల=ఇలాగ జరిగిందా! నన్దకుల+వినాశ+జనిత+రోషః=నందవంశం నాశనమైపోయిందనే ఆగ్రహంతో ఉన్న, రాక్షసః (వారి మంత్రి అయిన) రాక్షసుడు, ప్రితృవధ+అమర్షితేన= తన తండ్రి వధింపబడ్డాడని కోపంతో రగిలిపోతున్న, సకల+నన్ద రాజ్య+పరిపణన+ప్రోత్సాహితేన=మొత్తం నందరాజ్యం వశపరుస్తామనే మాటతో సుముఖుడిగా పరిణమించిన, పర్వతక పుత్రేణ+మలయకేతునా+సహ=పర్వతక పుత్రుడైన మలయకేతువుతో కలిసి, నన్దాయ=నందనిమిత్తంగా, తత్+ఉపగృహీతేన+మహతా+మ్లేచ్ఛ+బలేన=తాను స్నేహంగా కలుపుకున్న పెద్ద మ్లేచ్ఛ సైన్యంతో, పరివృతః=చుట్టుకొని, (చుట్టూ చేర్చుకొని), వృషలం+అభియోక్తు=(ఈ) శూద్రరాజు చంద్రగుప్తుణ్ణి జయించడానికి, ఉద్యతః+ఇతి=(రాక్షసమంత్రి) సిద్ధమవుతున్నాడనే (వార్త), ప్రకాశతం+గతః=వెల్లడైంది, (విచిన్త్య=ఆలోచించి), అథవా= అయితే ఏమిలే, నన్దవంశవధం+ప్రతిజ్ఞాయం=నందవంశాన్ని హతమార్చడం గురించి ప్రతిజ్ఞ చేసి, (శపథం పట్టి), దుస్తరా+ప్రతిజ్ఞా+సరిత్=దాట శక్యంకాని శపథం అనే నదిని దాటడం పని, నిస్తీర్ణా=నెరవేరింది, (దాటబడింది), సః+అహం= (అంతటి పని సాధించిన) నేను, ఇదానీం=ఇప్పుడు, ప్రకాశీభవన్తం+అపి=వెల్లడైతున్న దానిని కూడా, ఏనం+అర్థం=ఈ అంశాన్ని, ప్రశమయితుం=చల్లబరచడానికి (నివారించదానికి), కిం+న+సమర్థః=తగనా ఏమి! కుతః=ఎందుకంటే, యస్య+మమ=ఇంత చేసిన నాకు…
శ్లోకం:
శ్యామీకృత్యాననేన్దూ నరియువతి దిశాం
సంతతైః శోకధూమై,
కామం మన్త్రిద్రుమేభ్యో నయపవనహృతం
మోహభస్మ ప్రకీర్య,
దగ్ధ్వా సమ్భ్రాన్త పౌరద్విజగణరహితా
న్నందవంశ ప్రరోహాన్
దాహ్యాభావా న్నఖేదా జ్జ్వలన ఇవ వనే
శామ్యతి క్రోధవహ్నిః – 11
అర్థం:
క్రోధవహ్నిః=కోపమనే అగ్ని, అరి+యువతి దిశాం+ఆననేన్దూన్=శత్రురాజుల భార్యలనే చంద్రునివంటి ముఖాలను, జ్వలనః+ఇవ=మంట మాదిరి, సంతతైః+శోకధూమైః=నిరంతర దుఃఖాలనే పొగలతో, శ్యామీకృత్యా=నల్లబరిచి, మంత్రి+ద్రుమేభ్యః=మంత్రులనే వృక్షాలకు (కొరకు), నయపవన+హృతం=రాజనీతి అనే గాలి ద్వారా తీసుకువచ్చిన (తేబడిన), మోహభస్మ=ఏమరుపాటు అనే బూడిదను, కామం=ఇష్టం వచ్చినట్టు, ప్రకీర్య=వెదజల్లి, సమ్భ్రాన్త+పౌరద్విజగణ+రహితాన్=కలవరపాటు చెందిన నగరవాసులైన బ్రాహ్మణ క్షత్రియాది పక్షుల సమూహాలను (ద్విజగణ) దూరంగా తరిమివేసి, నందవంశ ప్రరోహాన్=నందకులమనే వెదురు మొలకల్ని, దగ్ధ్వా=కాల్చివేసి, దాహ్య+అభావాత్=మరి కాల్చదగినదేమీ మిగలక పోవడం వల్ల, శామ్యతి=ఆరిపోతున్నది. (శాంతి పొందుతోంది).
అలంకారం:
శ్లోకం నిండా రూపకాలంకారాలే. 1. క్రోధం అనే అగ్ని 2. దిక్కులనే సుందర ముఖాలు 3. శోకం అనే పొగలు 4. మంత్రులనే వృక్షాలు 5. రాజనీతి అనే గాలి 6. ఏమరుపాటు అనే బూడిద 7. ద్విజాతులనే పక్షులు 8. నందవంశమనే వెదురు మొలకలు. ఈ శ్లోకంలో ఉపమా, రూపకాలంకారాల కలయిక ఉంది. (జ్వలనః ఇవ – అనడం వల్ల ఉపమ).
వృత్తం:
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు
వ్యాఖ్య:
అడవిలో పుట్టే దావాగ్ని, మొలకలతో సహా చెట్టుచేమల్ని దగ్ధం చేసి, పక్షుల్ని తరిమి, దావాగ్ని బూడిదను వెదజల్లి బీభత్సం సృష్టించి – మరి తగులబెట్టడానికేమీ మిగలక, శాంతించినట్లుగా, చాణక్యనీతి శత్రువుల భార్యల ముఖాలు దుఃఖంతో నల్లబడేలా చేసింది. నందవంశాన్ని మూలమట్టుగా నిర్మూలించింది. (ఇక్కడ చాణక్య రాజనీతే దావాగ్ని) ఇక చంద్రగుప్తుణ్ణి సుస్థిరంగా నిలపడానికి తగిన వ్యూహాల గురించే ఆలోచించాలి. ఈ ఆలోచనే చాణక్యుడి అన్యమనస్కతకు (శిష్యుడి పట్ల పరాకుకు) కారణం.
అపి చ= ఇంకా చెప్పాలంటే…
(సశేషం)