“ONCE AGAIN” : Thankfully oldworld romance is not dead!

0
3

[box type=’note’ fontsize=’16’] “గొప్ప చిత్రం కాకపోవచ్చు కాని మంచి అనుభూతిని మిగిల్చే చిత్రం!” అంటున్నారు పరేష్ ఎన్. దోషివన్స్ ఎగైన్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]గొ[/dropcap]ప్ప గొప్ప సినెమాలు తీసినవారు కూడా ఈ మధ్య నిరాశపరుస్తున్నారెందుకో. లఘు చిత్రానికి సరిపోయే సరంజామా తీసుకుని పూర్తి నిడివి చిత్రం అయిన “మేరే ప్యారే ప్రైం మినిస్టర్” తో రాకేశ్ మెహ్రా ఓంప్రకాశ్ నిరాశపరిచాడు. ఇక దాని గురించి యేమీ వ్రాయబుధ్ధికాలేదు. ఇక నెట్ ఫ్లిక్ శరణు తీసుకున్నా. ఈ మధ్య నెట్ ఒరిజినల్స్ వస్తున్నాయి. అలా చూడటం జరిగింది “once again” చిత్రాన్ని.

ఈ చిత్రానికి దర్శకుడు కఁవల్ సేఠి. ఇదివరకు విన్న పేరు కాదు. కానీ మొత్తం మీద సమర్థ దర్శకుడుగానే అనిపించాడు. కథ అని చెప్పుకోవడానికి యెక్కువ లేదు గాని వొంటరితనంలో వున్న ఇద్దరి మధ్య కొత్తగా ప్రేమ చిగురిస్తే యెలా వుంటుందో చాలా సున్నితంగా చూపించాడు. అసలు ఇలాంటి నెమ్మదైన, సున్నితమైన అనుభవాన్ని అదీ నడివయసు జంటలో చూపించడం అపురూపమే. అద్భుతంగా నటించిన నీరజ్ కబి (షిప్ ఆఫ్ థీసియస్ గుర్తుందా?), శేఫాలీ ఛాయా షాహ్ ల గురించైతే తప్పకుండా చూడాలి.

అమర్ (నీరజ్ కబి) వో నటుడు. (నడివయసులో వున్నా హీరోగా చూడటానికి మనమూ అలవాటు పడ్డాము కదా). విడాకుల అనంతరం వొక్కతే కూతురు సపనా (రసికా దుగల్) తన తల్లితో వుంటే, అమర్ వొక్కడే వుంటాడు. మరో పక్క తారా శెట్టి (శేఫాలీ ఛాయా షాహ్) భర్తను పోగొట్టుకుని, కొడుకు, కూతురినీ పెంచి పెద్ద చేస్తుంది. వో రెస్త్రాఁ నడుపుతుంది. అలాగే అమర్ కు టిఫిన్ కూడా పంపుతుంటుంది. ఆ విధంగా వాళ్ళ మధ్య సంభాషణలు సాగుతూ వుంటాయి. కొడుకు దేవ్ (ప్రియాంశు) పెళ్ళి జరిపించాలి. దానికి డబ్బు అవసరం. ఆమె లోన్ కోసం ప్రయత్నిస్తుంది, కాని ఇంటి దస్తావేజులు పెడితేనే ఇస్తామంటారు బేంక్ వాళ్ళు. ఆమెకిష్టం వుండదు. అర్థం చేసుకోలేని కొడుకు చిరాకు పడతాడు, “నాన్న వుంటే ఈ పర్తిస్థితి వచ్చేదే కాదు” అంటాడు. వొక్క కూతురు మాత్రం అర్థం చేసుకోగల పరిణతి కనబరుస్తుంది. వో సందర్భంలో అడుగుతుంది కూడా, “నాన్న పోయాక మళ్ళీ యెప్పుడూ తోడు గురించిన ఆలోచనే రాలేదా అమ్మా?” ప్రతిరోజూ రాత్రి ఫోన్ మీద ఇద్దరి సంభాషణలూ సాగుతుంటాయి. ఇద్దరి మధ్యా ఆర్థికంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం వున్న కారణంగా, పిల్లల కారణంగా కూడా ఇద్దరూ కలిసే వీలు తక్కువ. అలా కలిసి బయటకు వెళ్ళిన వొక రోజు వాళ్ళు విలేఖరుల కంట పడటం, మర్నాడు వాళ్ళ ఫొటో పేపర్లకెక్కడం, జరగాల్సిన గొడవా జరగడం అయిపోతుంది. వియ్యపురాలు యెగతాళి చేస్తుంది, ఇకనేం తల్లీ కొడుకులు ఇద్దరూ వొకే మంటపం మీద పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అని. వొకసారి వివాహం అయినవారు వేర్వేరు కారణాలవల్ల వొంటరిగా మిగిలిపోతే మళ్ళీ వాళ్ళ జీవితంలో కుదురైన వసంతమొస్తుందా? ఇది నెట్ ఫ్లిక్స్ లో చూడండి.

ఇలాంటి ఇతివృత్తంతో చాలా చిత్రాలు వచ్చాయి. తెలుగులో అప్పట్లో వచ్చిన క్రాంతి కుమార్ చిత్రం “స్వాతి” వొకటి. హిందీలో పాతకాలం హాస్యచిత్రం “హమారే తుమ్హారే”, ఇప్పటి కాలపు హాస్యం (?) “గోల్మాల్” సిరీస్. ఇంకా చాలా వున్నాయి. ఇప్పటి సమయానికి ఇది యెంతవరకు సంగతమైనది? వివాహాలు కూలిపోయినా, భంగమైనా మరో సారి, ముఖ్యంగా పిల్లలు కలిగాక, జీవితం ఆ అవకాశమిస్తుందా? ఇలాంటివి అంత సీరియస్ గా చర్చకు రాదు. ఇద్దరు నడివయస్కుల మధ్య రొమాన్సు మీద కెమెరా కేంద్రీకృతమై వుంది. అలాగే ఆ ఇద్దరూ అంతే నమ్మకం కలిగించేలా నటించారు కూడా. ఇద్దరి స్వభావాల ప్రసక్తి మొదట్లోనే పరిచయం చేస్తాడు. చిన్నప్పుడు ఆమెకు సముద్రం అంటే భయం. (ఇష్క్ కా దరియా హై, డూబ్ కే జానా హై.) అతనికి కొండలంటే చిన్నప్పుడు భయం. (వొక సారి వివాహంలో వైఫల్యాన్ని చూసిన అతనికి మరలా వివాహం అంటే చిన్నప్పటి కొండలలాంటి భయమే అతనికి.) అతను నటిస్తున్న చిత్రంలో వో డాన్స్ సన్నివేశం. మగదయ్యం వేషంలో అతను నర్తించాలి, అమ్మాయిలతో. అంటీ ముట్టకుండా. తనకు నాట్యం రాకపోయినా నేర్చుకుని చేయగల సాహసం అతనిది, కాని తన పని తనకే తృప్తికరంగా అనిపించదు. దర్శకుడు బాగుంది అని చెప్పినా కూడా.

శేఫాలి మంచి అభినేత్రి. వొక్క కళ్ళతోనే వేయి కథలు చెప్పగల సమర్థురాలు. (పా లో విద్యా బాలన్ చీరల తర్వాత) ఇందులో ఆమె ధరించే ప్లేన్ కాటన్ చీరలు కూడా ఆమె వ్యక్తిత్వాన్ని ప్రకటించేవిగా కనబడ్డాయి. comforting and gracefully stiff. యెక్కువసార్లు కలుసుకోకుండా, యెక్కువగా ఫోన్ల మీద మాట్లాడుకోవడం ద్వారానే ఇద్దరి మధ్య రొమాన్సు ను చూపించడం, ఈ మీడియా యుగంలో ఆశ్చర్యమే! గొప్ప చిత్రం కాకపోవచ్చు కాని మంచి అనుభూతిని మిగిల్చే చిత్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here