ప్రాంతీయ దర్శనం -21: కోసలీ – నాడు

0
4

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కోసలీ సినిమా ‘భూకా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘బజ్నియాలూ మనుషులే!’

‘భూకా’

[dropcap]మొ[/dropcap]దటి కోసలీ సినిమా 1989లో నిర్మించారు. 1936లో ఒరిస్సా రాష్ట్రంగా ఏర్పడక ముందు పశ్చిమాన కోసల రాజ్యంగా వుండేది. ఇక్కడి కోసలీ భాషకి ఇండో ఆర్యన్ మూలాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి ఓడిశాలోని కటక్ కేంద్రంగానే కోసలీ భాషలో సినిమాలు నిర్మిస్తున్నారు. మొదటి సినిమాగా ‘భూకా’ (ఆకలిదప్పులు) నిర్మించారు. పశ్చిమ ఒడిశా గిరిజన గూడేలు చాలా వెనుకబడిన ప్రాంతాలు. ఉంటే ఎక్కడో ఒక ఆసుపత్రి వుంటుందేమో గానీ పాఠశాలలు అసలుండవు. రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడి గిరిజనులది ఒకటే వృత్తి. శుభకార్యాల్లో డప్పు మేళాలు వాయించడం. కొన్ని రాగాలతో కూడిన వీళ్ళ సాంప్రదాయ సంగీతం తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. పవిత్రంగా భావించే దీన్ని వదిలి వేరే వృత్తి చేపట్టలేరు. అలాటి నిష్ఠాగరిష్టులైన వీళ్ళకి మారిన కాలమాన పరిస్థితుల్లో ఈ వృత్తికే ముగింపు పలకాల్సి వస్తే? ఇది కూటికి హామీ నివ్వలేని వృత్తిగా మారితే? వీళ్ళ జీవితాలేమవుతాయి? ఈ ఇతివృత్తంతో నిర్మించిన ఈ గిరిజన వాస్తవిక చిత్రం అంతర్జాతీయ అవార్డుని కూడా పొందింది. దీని కథాకమామిషు ఏమిటో చూద్దాం…

ఆ గిరిజన గూడంలో బజ్నియా తెగకి చెందిన డప్పు వాయించే గిరిజన కుటుంబాలుంటాయి. ఒక బృందంగా ఏర్పడి శుభకార్యాల్లో డప్పులు వాయించి జీవిస్తూంటారు. వాళ్ళ సాంప్రదాయ సంగీత రాగాలయిన డాల్కాయ్, రసర్ కేళీ, మైలాజుడా రాగాల్లో సన్నాయిలాంటి ముహరీ వాయిస్తూంటారు. వీళ్ళకి పెద్ద ఐంతా. ఇతడికి భార్య వుండదు, చెల్లెలు కస్తూరి వుంటుంది. ఆమెకి భర్త వుండడు, ఐదేళ్ళ కొడుకుంటాడు. ఆమెని అమితంగా ప్రేమిస్తాడు. బజ్నియాగా వెళ్లి డప్పు వాయిస్తే లభించేది అందరూ తినగా మిగిలిన చాలీ చాలని ఒట్టి అన్నమే. అది తిన్నట్టు అబద్దమాడి చెల్లెలికి, మేనల్లుడికీ పెడుతూంటాడు. పిష్పిణీ పండక్కి ఈసారి చెల్లెలికి చీర పెట్టలేకపోయినందుకు విపరీతంగా బాధ పడతాడు. తన కోసం ఇవన్నీ చేయవద్దని ఆమె చెప్పినా వినడు. ఆమెకీ అన్నంటే చాలా ప్రేమ.

గూడెంలోనే ప్రభుత్వ డాక్టర్ వుంటాడు. ప్రభుత్వం మందులు సరఫరా చేయక వైద్యం చేయాలంటే ఇబ్బంది పడుతూంటాడు. మందులు బయట కొనుక్కోమని రాస్తూంటాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న వాళ్ళ సంగతి ఇక అంతే. బంధువులు పట్టణానికి వెళ్లి మందులు తెచ్చేలోగా చనిపోవడమే.

మహాజన్ అనే ఒక గుడి పూజారీ వుంటాడు. గుళ్ళో ఇతను తన కోసం తనే విగ్రహాలమీద పడి కోరికలు కోరి ప్రార్థించుకుంటూ వుంటాడు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. వ్యభిచారం చేస్తాడు.

ఐంతా డప్పు బృందంలో ఇంకో ఏడుగురు వుంటారు. ఈ ఏడుగురిదీ చాలీ చాలని బతుకులే. వీళ్ళల్లో బిదేశీ అనే వాడి కొడుకు మందుల్లేక చనిపోతాడు. భార్య ఘాసీని ఓదార్చడం వల్లగాదు.

ఇలావుండగా గూడెంలోకి ఒక పట్టణ యువకుడు వస్తాడు. డాక్టర్‌ని కలిసి తన గురించి చెప్పుకుంటాడు. సంబల్‌పూర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న తను ఇక్కడి బజ్నియాల సంగీతం మీద పరిశోధన చేయడానికొచ్చాడు. డాక్టర్‌కి అభ్యంతరం లేకపోతే అతడి క్వార్టర్స్‌లో వుంటానంటాడు. తన పేరు అసీమ్ అని చెప్తాడు. డాక్టర్ సంతోషంగా అంగీకరిస్తాడు.

అసీమ్ ఐంతాని కలిసి సంగీతం గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. తమకి వచ్చిన ఈ అనూహ్య గుర్తింపుకి ఐంతా ఉబ్బి తబ్బిబ్బు అవుతాడు. సంగీతం గురించి పూసగుచ్చినట్టు చెప్తూంటాడు. గుడిసెకి ఈ రాకపోకలతో ఐంతా చెల్లెలు కస్తూరికి దగ్గరవుతాడు అసీమ్. ఆమె ప్రేమలో పడుతుంది.

ఇలా రోజులు గడుస్తూంటే ఒకరోజు డాక్టర్ అడుగుతాడు – ‘నీ రీసెర్చి వల్ల నీకో పీహెచ్‌డీ వస్తుంది, గొప్ప వాడివవుతావ్, ప్రభుత్వోద్యోగం వచ్చి సెటిలవుతావ్. ఈ గిరిజనులకేం ఒరుగుతుంది? వాళ్ళ జీవితాలింతేగా?’ – అని.

దీంతో అసీమ్ కి చెంప మీద కొట్టినట్టయి రీసెర్చి మానేసే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న అతణ్ణి ఆందోళనగా ఆపుతుంది కస్తూరీ. పని చూసుకుని మళ్ళీ వస్తానని అబద్ధం చెప్తాడు. తను ఒకటి చెప్పాలనుకుంటున్నాననీ, ఐతే అతను మళ్ళీ వస్తేనే చెప్తాననీ అంటుంది. ఇరుకునపడి అలాగే వెళ్లిపోతూంటాడు. ఐంతా బృందం బాధగా సాగనంపుతుంది. అప్పటికి అతనంటే ఎంతో గౌరవ భావం ఏర్పడుతుంది. తమ సంగీత కళని లోకానికి చాటుతున్నాడని.

అతను వెళ్ళిపోవడం తట్టుకోలేక కస్తూరి భోరున ఏడ్చేస్తూంటే ఐంతా షాక్ తింటాడు. ఆమె ప్రేమ వ్యవహారం ఇప్పుడు తెలిసొచ్చి తిడతాడు, కొడతాడు. ఇప్పుడు నల్గురికి ఎలా మొహం చూపించుకోవాలా అని ఏడుస్తాడు.

ఒక పెళ్ళికి వెళ్లి డప్పులు వాయిస్తూంటే, ఇంకో పెళ్లి ఊరేగింపు వస్తూంటుంది. బ్యాండు మేళంతో యూనిఫారాల్లో వున్న ఆధునిక వాద్యకారులు దిక్కులు పిక్కటిల్లేలా వాయిస్తూంటారు. ఐంతా బృందం నిర్ఘాంతపోతుంది.

ఇక శుభకార్యాలకి పిలుపులు రావు. పిలుపులన్నీ ఆ బ్యాండు మేళానికే. ‘మేరే మన్ కీ గంగా, ఔర్ తేరే మన్ కీ జమునాకా… బోల్ రాధా బోల్ …సంగమ్ హోగాకీ నహీ’… అంటూ సినిమా పాటలు వాయిస్తున్న వాళ్ళకే గిరాకీ.

దీంతో బృందం కూడా బాణీ మార్చి వాయిస్తూంటే తిడతాడు ఐంతా. ఇలా మారకపోతే పుట్టగతులుండవంటారు బృందం. వాగ్యుద్ధం జరుగుతుంది. కాలం మారింది, మనం కూడా మారాలంటారు. ‘కాలం మారుతుంది, అన్నీ మారిపోతాయి, దేవుడు మారతాడా? ఈ డప్పు మన దైవం’ అంటాడు ఐంతా. ‘దైవమైతే నీ దేవుడు చచ్చాడు’ అంటారు. ‘చస్తే ఉమ్మి వేయరా, చచ్చిన ఈ దైవం మీద ఉమ్మి వేయరా’ అని డప్పు ముందుకు తోస్తాడు ఐంతా. ‘తల నెరిసిందని, ముసల్దైందని అమ్మని చంపేస్తారా?’ అని అరుస్తాడు.

ఐతే ఏం చేయాలంటారు. ఓపిక పట్టాలంటాడు. బేరాలిక రావు. తినడానికి తిండి వుండదు. పరిస్థితి దైన్యంగా వుంటుంది. కస్తూరి పూజారి షాపు కెళ్ళి బియ్యం అప్పు అడుగుతుంది. కోరిక తీర్చమంటాడు. తిట్టి వచ్చేస్తుంది. కానీ విధిలేక రాత్రిపూట రహస్యంగా వెళ్లి, అతడి కోరిక తీర్చి బియ్యం తెచ్చుకుంటుంది. వెక్కివెక్కి ఏడుస్తుంది.

బృందం కూలి పనికెళ్ళి రాళ్ళు మోద్దామంటారు. డప్పు వాయించే చేతులు రాళ్ళెత్తవని తిడతాడు ఐంతా. అతడి ఆరోగ్యం చెడుతుంది. ఇంతలో అసీమ్ వస్తాడు. కస్తూరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టు డాక్టర్‌కి చెప్తాడు. ‘ఈ పెళ్లి చేసుకుని నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తావ్? రీసెర్చి మానేసి ఇక్కడుండి ఏం చేస్తావ్? వీళ్ళ జీవితాలు బాగు చేస్తావా? వాళ్ళు కాలం చెల్లిన డప్పు వాయించడం తప్ప ఏ పనీ చెయ్యరు. వాళ్ళే దిక్కులేక వున్నారు. వాళ్ళనేం ఉద్ధరిస్తావ్? మీ నాన్నని ఉద్ధరించు. చెల్లెలి పెళ్ళికి సహకరించు. సంఘ సంస్కర్త వైపోకు, వెళ్ళు’ అని మందలిస్తాడు డాక్టర్. అసిమ్ మౌనంగా వెళ్ళిపోతాడు. ఇటు ముహరీ వాయిస్తూ చనిపోతాడు ఐంతా. బృందం ఘొల్లుమంటుంది. కస్తూరీ గావుకేక లేస్తుంది. తేరుకుని, ఆ ముహరీ తీసుకుని, కొడుకుకి అందిస్తుంది…

     

దర్శకుడు సవ్యసాచి మహాపాత్ర దీన్నొక అద్భుత దృశ్యకావ్యం చేశాడు. రంగుల్లో తీసిన ఈ అరణ్య నేపథ్యపు కథకి తగిన నటీనటులతో గంటా 50 నిమిషాల అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆనాడే నిర్మించాడు. ఐంతాగా సాధు మెహర్ నటిస్తే, కస్తూరిగా స్వాతీ రాయ్ నటించింది. పూజారీగా ఒరియా ప్రస్దిద్ధ నటుడు శరత్ పూజారీ నటించాడు. చిత్త పట్నాయక్ అసీమ్‌గా నటించాడు. ఐదు పాటలు కూడా వున్నాయి. సంగీతం రమేష్ కుమార్ మహానందా. సతీష్ కుమార్ ఛాయాగ్రహణం. ‘భూకా’ పేరుతో మంగ్లూ చరణ్ బిస్వాల్ రాసిన కోసలీ నాటకం ఆధారంగా ఈ ఆర్ట్ సినిమా తీశారు. 1990లో స్పెయిన్‌లో జరిగిన చలన చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ జ్యూరీ అవార్డు దీనికి లభించింది.

తీసిన మారుమూల మొదటి కోసలీ సినిమా ఇంత ప్రతిష్ఠాత్మకం అవడం, ప్రయోజనకరంగా వుండడం, బజ్నియాలని ప్రపంచ దృష్టికి తీసికెళ్ళడం, ఈ దృశ్యకావ్యం సాధించిన ఘన విజయాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here