[dropcap]వ[/dropcap]సిష్ఠ మహర్షి రావిచెట్టు కింద ఉన్న తిన్నె మీద కూచుని ఏదో గ్రంథం తిరగవేస్తున్నాడు.
ఇంతలో “ఏమండీ, మీరు ఇంత కూడా పట్టించుకోకపోతే ఎట్లా” అంటూ వచ్చి అరుంధతీ దేవి పక్కన కూలబడింది.
“దేన్ని పట్టించుకోవాలి చెప్పు” అంటూ నవ్వుతూ గ్రంథాన్ని మడిచి పక్కనబెట్టాడు.
“మీరు అవీ ఇవీ చెప్పి బుర్ర చెడగొట్టిన నా మనవడిని గురించి పట్టించుకోండి.”
“పరాశరుడా? వాడికి ఏమైంది?”
“మీకు ఏమీ పట్టవు, వాడు సరిగ్గా భోజనం చేసి నెలరోజులు అయ్యింది”
“నిజంగానా?”
“అవును, మీ వేదాంతం మప్పి ఇట్లా చేశారు”
“పరాశరా, ఇటురా” అని గట్టిగా పిలిచాడు మహర్షి.
పక్కనే ఉన్న కుటీరం లోంచి పరాశరుడు వచ్చాడు. చిక్కినట్టు అతని ముఖమే చెబుతోంది. మహర్షి దగ్గరికి వచ్చి దణ్ణం పెట్టాడు. వెళ్ళి మామ్మ పక్కన కూర్చున్నాడు.
“ఏరా తండ్రీ, నువ్వు అలా చిక్కిపోయావు”
“…”
“చెప్పరా తండ్రీ, ఏమిటిది? నువ్వు అన్నం సరిగ్గా తినటల్లేదని మీ మామ్మ చెబుతోంది. నిజమేనా”
“అవును తాతయ్యా”
“కారణం?”
“పొద్దున్నే లేవటాలూ, అన్నం తినటాలూ, ఏవేవో చదవటాలూ, నేర్చుకోవటాలూ ఇవి అన్నీ వ్యర్థం అని నా ఉద్దేశ్యం తాతయ్యా. క్షణికమైన వీటి అన్నిటి మీదా ఆసక్తి నశించింది. ఇవి అన్నీ అనవసరం అనిపిస్తోంది తాతయ్యా.”
మహర్షి పెద్దగా నవ్వాడు. పిల్లవాడికి కష్టం అనిపించింది.
ఇంతలో అరుంధతీ దేవి “చూశారా మీ పిచ్చి వేదాంతం వీణ్ణి ఎక్కడికి తెచ్చిందో?” అంది.
మహర్షి సునిశితంగా మనవణ్ణి చూశాడు.
“నేనెప్పుడన్నా నీకు కర్మలని వదలమని చెప్పానా?”
“లేదు తాతయ్యా”
“మరి?”
“ఇది నా అభిప్రాయం తాతయ్యా.”
“ఎందువల్ల?”
“అశాశ్వతమైన ఈ ప్రపంచంలో, ఈ నాలుగు రోజుల నాటకంలో ఉన్న వాటికి విలువ ఇవ్వటం అనవసరం అని నా అభిప్రాయం తాతయ్యా.”
“ఎవరు మొదలెట్టారు ఈ నాటకం? ఎవరు నడిపిస్తున్నారు ఈ నాటకం?”
“తెలీదు తాతయ్యా.”
“ఒకసారి నాటకం మొదలెట్టాక దాంట్లోంచి బయటికి పోవటానికిగానీ, పాత్రని మార్చటానికి గానీ నటులకి అవకాశం లేనే లేదు. దాని నిర్వాహకుడిదే ఆ అధికారం. అంతేకదా?”
“అవును”
“మరి నీ జీవిత నాటకంలో నువ్వు చేస్తున్నదేమిటి?”
“….”
“పరాశరుడి పాత్ర వేయటానికి వచ్చి మధ్యలో పాత్ర మారిస్తే ఎలా?”
“ఇది సరి అనిపించింది.”
“గుర్తుపెట్టుకో ఇది. పరాశరుడు ఎప్పుడూ పరాశరుడే. పరాశరుడు బ్రహ్మం అయితే ఏమీ మారాల్సినది లేదు ఎందుకంటే అంతా తనదే కనక, పరాశరుడు జీవుడైతే, తాను చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే తాను విశాల విశ్వంలో ఒక సూక్ష్మ జీవి కనక.”
“కర్మలన్నీ త్యాగం చేసి…” అని మనవడు మొదలెట్ట గానే మహర్షి మళ్ళీ నవ్వాడు.
“కర్మలని త్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారు చూపించు? జనక మహారాజు రాజ్యం చేస్తున్నాడు, రాముల వారు యుద్ధం చేశాడు. నేను మీ మామ్మతో కలిసి కాపురం చేసి పిల్లలని కన్నాను.”
“సనక, సనందాదులు?”
“వాళ్ళు కూడా తపస్సులు చెయ్యటం లేదా? ప్రపంచం అంతా తిరగటం లేదా? అన్నం తినటం లేదా?”
“……”
“కావాల్సింది కర్మ త్యాగం కాదు, కావాల్సింది కర్త నేననే భావన వదలటం. కావాల్సింది కర్మ ఫల త్యాగం. పుట్టిన ప్రతివాడూ తన పని తాను చేసి తీరాల్సిందే. నాటకంలో తన పాత్ర తాను వెయ్యాలిసిందే. మధ్యలో పారిపోయేందుకు అవకాశమే లేదు.”
“మరి సన్యాసం తీసుకున్నవాళ్ళు?”
“వాళ్ళకి నాటకంలో ఆ పాత్ర ఉన్నదన్నమాట, అంతే.”
“అయితే, నేను కూడా..?”
“మొదట నీ బుర్రలో ఉన్న పిచ్చి ఆలోచనలని వదిలిపెట్టు. వేదాలూ, ఉపనిషత్తులూ చదువు. వాటిని సరిగ్గా అర్థం చేసుకో. పని నేను చేస్తున్నాను, ఫలితం నాది అన్న ఆలోచనలు వదిలి ఏ పని కావాలంటే అది చెయ్యి. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే అహంకార భావన వదిలావో, అప్పుడు సర్వ ప్రపంచమూ నీదవుతుంది. అన్ని పనులూ నీవే, అన్ని ఫలితాలూ నీవే అవుతయ్యి. కర్మల వల్ల గానీ, పిల్లల్ని కనటం వల్ల గానీ, ధనం సంపాయించటం వల్ల గానీ అమృతత్వం రాదు. త్యాగం వల్లనే వస్తుంది అంటోంది ఉపనిషత్తు. త్యాగం చెయ్యాల్సింది కర్మలనీ, ధనాలనీ, పిల్లలనీ కాదు. త్యాగం చెయ్యాలిసింది నేను చేస్తున్నాను అనే భావనని, త్యాగం చెయ్యాలిసింది కర్తనే, మిగతావి మామూలుగా జరుగుతుంటయ్యి. నువ్వు ప్రపంచ నాటకంలో నీ పాత్రని పోషిస్తూ, నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టు. ఈ ప్రపంచానికి ఆధారం ఏమిటో అర్థమౌతుంది.”
“అలాగే తాతయ్యా.”
“వెళ్ళి ముందర భోజనం చెయ్యి, మీ మామ్మ నన్ను తిడుతోంది.”
“తిట్టక, మెచ్చుకోవాలా ఇలా పిల్లలకి వేదాంతం చెబుతూంటే” అన్నది అరుంధతి.
“అమృత సమానమైన ఈ వాక్కులు ఎవడో అదృష్టవంతుడు వింటాడు, ఇంకా అదృష్టవంతుడు అర్థం చేసుకుంటాడు, ఇంకాస్త అదృష్టవంతుడు ఈ అమృతాన్ని తాగి స్థిరంగా ఉంటాడు. ఇలాంటి వేదాంతం ఎన్ని జన్మలు తపస్సు చేస్తేనో వినటం సంభవించదు. నీకు కూడా తెలుసు కదా” అన్నాడు వశిష్ఠుడు.
“తెలుసులెండి మీ ఘనత” అని మనవడికి వంట చేయటానికి వెళ్ళింది అరుంధతి.