[box type=’note’ fontsize=’16’] శత్రువుల సైన్యానికి చిక్కిన వీర సిపాయిలు సంవత్సరాల తరబడి విడుదలకు నోచుకోక జైళ్ళల్లో రోజుకొక గండంగా ఉన్నా ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. కాని వారికోసం ఎదురుచూస్తూ ఉన్న కుటుంబాల గురించి తలుచుకోగానే బాధ కలుగుతుందంటున్నారు మాలా కుమార్ ఈ కథలో. [/box]
[dropcap]టైం[/dropcap] రాత్రి పదకొండైంది. హాల్లో టి.వి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. చదువుతున్న నవలను మూసి, హాల్లోకి వచ్చాను. ఏమండీ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ నుంచి విడుదల అవుతున్న క్లిప్స్‌ను దీక్షగా చూస్తున్నారు.
పక్కనే కూర్చుంటూ, “వచ్చేసాడుగా ఇంకెంత సేపు చూస్తారు? పదకొండైంది పడుకోండి” అన్నాను.
నా మాట పట్టించుకోకుండా “లక్కీ గై” అన్నారు.
“ఎవరు? అభినందనా? ఎందుకలా అనుకుంటున్నారు?” అని అడిగాను.
“ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. సెల్ ఫోన్, జి.పి.యస్ మొదలైన మోడ్రన్ టెక్నాలజీతో క్షణాల మీద ఎక్కడున్నాడో తెలుసుకొని, వెంటనే మనవాళ్ళు స్పందించగలిగారు. పాకిస్తాన్ ముందు బుకాయించినా, ఋజువులు చూపించగలిగాము. దానితో మన దేశమే కాదు ప్రపంచమంతా బాసటగా నిలిచింది. ఆ ఒత్తిడితో విడుదల చేయక తప్పలేదు. మూడు రోజులు బందీగా ఉన్నా క్షేమంగా వచ్చేసాడు. అదే మా రోజులల్లో పొరపాటున సరిహద్దు దాటితే అంతే. అసలు మేమెక్కడున్నమో తెలిపేందుకు కూడా అవకాశం లేదు. వార్‌కు వెళ్ళినా, ఎక్సర్‌సైజ్‌లకు వెళ్ళినా మేము తిరిగి వచ్చేవరకు మా గురించి కుటుంబాలకు తెలిపే అవకాశమే లేకుండింది” అన్నారు.
“అవును. ముఖ్యంగా బార్మీర్ (రాజస్తాన్‌లో ఒక డిస్ట్రిక్ట్, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర) ఎడారిలోకి ఎక్సర్‌సైజ్‌కు వెళ్ళినప్పుడు, రెండు నెలలకు మీరు తిరిగి వచ్చేదాకా ఏ విషయమూ తెలీక ఎంత టెన్షన్‌గా ఉండేదో. అప్పుడు కనీసం ఉత్తరం రాసి పోస్ట్ చేసే వీలు కూడా లేదు. మీరు తిరిగి వచ్చాక, నల్లగా కప్పుపడిపోయి అట్టలు కట్టిన మిమ్మలిని చూస్తే, అమ్మయ్య క్షేమంగా తిరిగివచ్చారు అన్న సంతోషంతో పాటు ఎంత ఏడుపొచ్చేదో! ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తోంది అంటే గుండె గుబగుబలాడిపోయేది. మీరు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా భయం భయంగానే ఉండేది” అని అన్నాను.
“ఆ రోజులల్లో సెల్ ఫోన్ లేదు, సెక్యూరిటీ ఏరియా నుంచి లాండ్ కమ్యూనికేషన్ కూడా ఉండకపోయేది. వైరెలెస్ కమ్యూనికేషన్ మాత్రమే ఉండేది. కనుక ఆఫీసర్స్‌లకు ఇళ్ళకు ఫోన్ చేయటానికి వీలుండకపొయేది. అసలు ఆ రోజులల్లో సరిహద్దులన్నిచోట్లా ఫెన్సింగ్ కూడా ఉండేది కాదు. మేము వెళ్ళిన చోట వకవైపు వెళ్ళబోయి ఇంకోవైపు వెళ్ళామంటే దారి తప్పిపోయేవాళ్ళం. అలా దారి తప్పి సరిహద్దు దాటినవాళ్ళు ఎంతమందో! ఆ ఎడారిలో చీకట్లో దారి తెలియక , మెస్‌లో డిన్నర్ చేసాక కొంచం దూరంలో ఉన్న మా టెంట్‌కు వెళ్ళాల్సిన దారి నుంచి కొంచం పక్కకు తిరిగినా దారి తప్పే ప్రమాదం ఉండేది. బయట అంతా లైట్ అవుట్. అందుకే వెలుతురు ఉండగానే అందరం భోజనం కానిచ్చేసి, టెంట్స్‌కు వెళ్ళిపోయేవాళ్ళం. రాత్రిళ్ళు దీపాలు కూడా వెలిగించేవాళ్ళం కాదు. తప్పనిసరై లాంతర్ వెలిగించాల్సి వస్తే, దానికి మూడు పక్కలా కాగితం అంటించి వెలిగించేవాళ్ళం. టిన్డ్ ఫుడ్, ఆలూ రోజూ అవే ఎక్కువగా భోజనంలో ఉండేవి. ఫ్రెష్ ఐటమ్స్ చాలా తక్కువగా సప్లై అయ్యేవి” అని బార్మీర్ లోని అనుభవాలు గుర్తుచేసుకున్నారు ఏమండి.
“అందుకే ఇప్పటికీ ఆలూ అంటే ఇష్టం ఉండదు మీకు” అని నవ్వుతుంటే, జ్ఞాపకాల దొంతరలో దొర్లుకుంటూ నా మనసు అరవైల దశకంలోకి వెళ్ళింది.
సరిగ్గా ఏ సంవత్సరమో గుర్తులేదు. అప్పట్లో మేము భుజ్‌లో ఉండేవాళ్ళం. భుజ్ గుజరాత్ లోని పాకిస్తాన్ వైపు ఉన్న టౌన్. భుజ్ సమీపంలో సముద్రం నీళ్ళు లో-ఏరియా కొచ్చి, నిలువ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని చోట్ల లంకల లాగా ఎత్తుప్రదేశాలున్న లంకలాంటి ప్రదేశాలుంటాయి. ఎండాకాలంలో అక్కడ భూమి గట్టి పడుతుంది. సముద్రం నీరు ఉన్న ప్రదేశము ఫ్లాట్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ సమయంలో భుజ్‌కు లంకలకు వెహికిల్స్ వెళుతాయి. భుజ్‌లో అర్మీ యూనిట్‌లు ఉండేవి. అర్మీ ఫామిలీస్ కూడా ఉండేవి. సముద్రపు లాండ్‌లో ‘కావడా’ అనే లంకలాంటి ప్రదేశంలో ఆర్మీ గస్తీ యూనిట్లు ఉండేవి.
ఒకసారి కావడాలో ఉన్న యూనిట్లో ఒక ఫంక్షన్ జరిగింది. భుజ్‌లో ఉన్న ఆఫీసర్స్‌ను పిలిచారు. కావడా ఫార్వర్డ్ (సెక్యూరిటీ) ఏరియా కాబట్టి మేము రాకుడదన్నారు. సరే మరి రూల్ అంటే రూలే కదా. అందులోనూ మిలిటరీ రూల్! మా పక్క క్వార్టర్‌లోనే కాప్టెన్ దీక్షిత్, అతని భార్య ఉండేవాళ్ళు. ఆయన భార్య వేదా, నేనూ దాదాపు ఒకే వయసు వాళ్ళం కావటంతో మాకు స్నేహం బాగానే కలిసింది.
“వాళ్ళు అక్కడే డిన్నర్ కూడా చేసి వస్తారు కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి. ఇక్కడే డిన్నర్ కలిసి చేద్దాము” అంది వేదా. మా ఏమండీలు అట్లా వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరి ఇంట్లో డిన్నర్ చేసి, వీలైతే వాళ్ళు వచ్చేదాకా ఉండటం మాకు అలవాటే. ఒక్కళ్ళమే ఉంటే బెంగగా, భయంగా కూడా ఉంటుంది.
మా ఏమండీ వాళ్ళు వెళ్ళాక, తీరికగా ఇల్లు సద్దుకొని, అంతకు ముందే చేసి ఉంచిన డబల్కామీఠా తీసుకొని వేద దగ్గరకు వెళ్ళాను.
“ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను రా రా” అంది వేదా.
నేను తెచ్చిన డబల్కామీఠా చూసి “వావ్ తుమారీ హైదరాబాదీ స్పెషల్” అంటూ, “డిన్నర్‌కు ఏమి చేయను?” అని అడిగింది.
“నీ ఇష్టం. ఏదైనా సరే” అన్నాను.
“ఐతే ముందు సూప్ తాగుదాము. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి సూప్ తాగుతే బాగుంటుంది. మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేస్తాను” అని కూరగాయలు, టమాటో పూరీ టిన్ తీసింది. వేదా టిన్ మూత తీస్తుంటే నేను కూరగాయలు కొన్ని తీసుకొని కడిగి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేస్తూ “మనం ఇక్కడ వేడి సూప్ తాగుతుంటే వాళ్ళక్కడ విస్కీ తీసుకుంటూ ఉంటారు” అన్నాను నవ్వుతూ.
“ఊఁహూ లేదు. మా ఏమండీ డ్రింక్ తీసుకోరు. నాకు తాగేవాళ్ళు ఇష్టం లేదని ముందే చెప్పాను” అంది.
ఎందుకో తాగేవాళ్ళు అన్న మాట నాకు చివుక్కుమనిపించి “లేదు వేదా మన ఊళ్ళల్లోలా ఇక్కడ అట్లా తాగి గోల చేయరు.లిమిటెడ్‌గా తీసుకుంటారు. నువ్వు ఏ పార్టీలోనైనా ఎవరైనా తాగి గోల చేయటం చూసావా లేదు కదా?” అన్నాను.
“ఐనా సరే నాకిష్టం లేదు” అని ఖచ్చితంగా అంది. పోనీలే ఎవరిష్టం వాళ్ళది దానికోసం వాదనలెందుకు అనుకున్నాను. సూప్ తయారుకాగానే, “డిన్నర్‌కు రాజ్మా, జీరా రైస్ చేయనా?” అంది.
“ఓకే” అన్నాను నవ్వుతూ.
వేడివేడి మిక్స్డ్ వెజిటబుల్ సూప్, రాజ్మా, జీరా రైస్, డబల్కామీఠాతో, కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించాక సమయం చూస్తే తొమ్మిదిన్నరైంది. “మనవాళ్ళు ఇంకో గంటకు కాని రారు. నువ్వైనా ఇంటికి వెళ్ళి ఏమి చేస్తావు? పపులూ ఆడుకుందామా?” కార్డ్స్ డ్రా లో నుంచి తీస్తూ అంది వేదా.
ఇద్దరమూ కార్డ్స్‌లో మునిగిపోయాము.
ఎక్కడ నుంచో కుక్క అరుపులు వినిపించి “గ్రామ సింహం ఎందుకో అరుస్తోంది” అనుకుంటూ రిస్ట్ వాచ్‌లో టైం చూసాను. పన్నెండు. బాబోయ్ ఏమిటి ఇంత సేపు కార్డ్స్‌లో మునిగిపోయాము. ‘అవునూ ఏమండీ వాళ్ళు ఇంకా రాలేదేమిటీ?’ అని వేదా వైపు చూసాను.
తను కూడా నావైపు చూస్తూ “అర్ధరాత్రైంది, ఇంకా రాలేదేమిటి? ఎప్పుడూ ఇంతసేపు వెళ్ళలేదు” అంది. ఇద్దరమూ బయట వరండాలోకి వచ్చి చూసాము. అంతటా నిశబ్దం. ఎక్కడా అలికిడి లేదు. ఇద్దరమూ మొహామొహాలు భయంభయంగా చూసుకున్నాము. ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన ‘వెళ్ళింది ఫార్వర్డ్ ఏరియాకు. ఏమైనా కాలేదు కదా!’ ఎట్లా తెలుస్తుంది? ఏమి చేయాలి? కాసేపు మౌనంగా ఉన్నాము. బయట నిలుచోలేక లోపలికి వెళ్ళాము. వేద నా చేయి పట్టుకొని “ఏం చేద్దాం?” అంది టెన్షన్‌గా. ఏమో నాకు మటుకు ఏమి తెలుసు? జవాబు ఇవ్వలేదు. కాసేపు ఆగి “వీళ్ళు క్షేమమే అంటావా?” అంది.
“అబ్బ ఉండు తల్లీ, అసలే నాకు పిచ్చి టెన్షన్‌గా ఉంది. ముందే చిన్నచిన్నవాటికే టెన్షన్ పడిపోతుంటాను. ఇప్పుడు బుర్ర కూడా పని చేయటం లేదు. ఇంకా నువ్వు కూడా టెన్షన్ పెట్టకు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు.చిన్నగా వస్తారులే” అన్నాను కాస్త తమాయించుకొని.
చిన్నగా కాలం కరిగిపోతోంది. లోపలికి బయటకు గాభరాగా తిరుగుతున్నాము. ఏమి చేయాలో, ఏమనుకోవాలో తోచటం లేదు. వేద ఏడుపు మొదలుపెట్టింది. చెప్పలేని, ఊహించలేని పరిస్థితి. ఒంటి గంట… రెండు… నాలుగు. సమయం భారంగా జరుగుతోంది. వేద ఏడ్చి ఏడ్చి సోఫాలో సొమ్మసిల్లిపోయింది. నేను అలోచించే ఓపిక లేక ఉబికి వస్తున్న కన్నీళ్ళను అపుకుంటూ, హనుమాన్ చాలిసా, అమ్మవారి స్తోత్రాలు భయంతో మర్చిపోయినా, అట్లాగే నట్టుకుంటూ చదువుకుంటూ, గుర్తొచ్చిన ముడుపులు కట్టుకుంటూ సోఫాలో నిస్త్రాణంగా తల వాల్చి కూర్చున్నాను. చూస్తుండగానే తెల్లవారిపోయింది!
ఇక టైం కూడా చూసేందుకు కూడా భయపడిపోయాము. బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు గడిచిందో తెలీదు. ఏదో వెహికిల్ వచ్చిన శబ్దం వచ్చినట్లై ఇద్దరమూ ఒక్క పరుగున బయటకు వచ్చాము. బయట వెహికిల్ ఆగి ఉంది కాని వీళ్ళు వెళ్ళిన జోంగా కాదు, ఇంకో వెహికిల్. ఏమైంది ఈ వెహికిల్ ఎక్కడిది అని ఒక్కసారే గుండె జారిపోయింది. అందులో నుంచి ముందుగా దిగిన ఏమండీని చూసి ఒక్క పరుగున ఆయన దగ్గరకు వెళ్ళాను. వెనుకనే కాప్టెన్.దీక్షిత్, మిగిలిన వాళ్ళు ఒక్కరొకరుగా దిగారు. వేదా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దీక్షిత్‌కు హత్తుకుపోయింది. అప్పటి దాకా ఆపుకున్న నా దుఃఖం జలజలా కన్నీళ్ళుగా బయటకు వచ్చేసింది. మా ఇద్దరి దుఃఖం చూసి ఇంకో ఆఫీసర్ కాప్టెన్.బెనర్జీ “మీరు చాలా భయపడ్డట్టున్నారు. ఏమీ కాలేదు బాభీ. రాత్రి సడన్‌గా పెద్ద వాన వచ్చింది. సముద్రం నీళ్ళున్న ప్రదేశం మెత్తబడింది. తెల్లవారి, వాన ఆగాక, ఆ బురదలో రాగలిగిన ఈ వెహికిల్ తీసుకొని వచ్చాము” అన్నాడు.
అది వినగానే గబుక్కున వేద దీక్షిత్ షర్ట్ పట్టుకొని గుంజి, “కావడాలో పార్టీ ఇచ్చారు బాగానే ఉంది. అందులో డ్రింక్ తీసుకొని నాన్ వెజ్ తిని, డాన్స్ చేసి వచ్చే ఆఫీసర్స్ వెళ్ళారు బాగానే ఉంది. మీరు వెజిటేరియన్. డ్రింక్ తీసుకోరు. మీరు తీసుకునేది నింబూపాని. మీకు ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చింది? నా కసలే భయం. మీరు వెళ్ళకుండా ఉంటే నా బి.పి. పెరిగేది కాదు. నా టెన్షన్ పెరిగేది కాదు. ఇక ముందు మీకు పార్టీకి వెళ్ళాలని ఉంటే చెప్పండి ఇంట్లోనే ఒక బాటిల్ నిండా నింబూపానీ తయారు చెస్తాను. మీ ఇష్టం వచ్చినంత తాగండి. కాని రిస్క్ ఉన్న ప్రదేశానికి వెళ్ళకండి” అంది ఏడుస్తూ.
ఊహించని ఈ పరిణామానికి అందరమూ బిత్తరపోయాము. ఒక్క క్షణం తరువాత “ఇక ముందు పార్టీలకు వెళ్ళను. నువ్విచ్చే నింబూపానీనే తాగుతాను. కానీ ఒక్క బాటిల్ వద్దు. ఒక్క గ్లాస్ చాలులే” అని అన్న దీక్షిత్ బిక్క మొహం చూడగానే అందరూ అప్రయత్నంగా బిగ్గరగా నవ్వేసారు. ఆ నవ్వులతో, ఒక్కసారిగా సృహలోకి వచ్చిన వేదా సిగ్గుపడి ఇంట్లోకి పరిగెత్తింది. అప్పటి నుంచి అందరూ వాళ్ళను మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూపానీ అని పిలిచి ఏడిపించేవారు.
టి.వి.లో నుంచి పెద్దగా శబ్ధం వచ్చేసరికి జ్ఞాపకాల జావళి లోనుంచి బయటపడ్డాను. కాని వేదా వాళ్ళను తలుచుకొని నవ్వుకున్నాను. “ఎందుకు నవ్వుతున్నావు? ఈ వార్తలో నవ్వేదేముంది” అన్నారు ఏమండి.
“ఇందులో ఏమీ లేదు. మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూపానీ గుర్తొచ్చారు” అన్నాను.
ఆ సంఘటన గుర్తు చేసుకొని ఏమండీ కూడా నవ్వుతూ “కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయిలు మొదట్లో అట్లాగే అమాయకంగా ఉంటారు” అన్నారు.
“మరి అప్పుడు నేను మాత్రం కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయిని కాదేమిటి? నేనేమి చేసినా కోపం చేసేవారు” అన్నాను నిష్ఠూరంగా.
“అప్పుడు నేనైనా కొత్తగా పెళ్ళైన అబ్బాయినే కదా! నువ్వు చేసే తింగిరి పనులకు అందరూ నవ్వుతుంటే నాకు మాత్రం ఉక్రోషం రాదా?” అన్నారు ఏమండీగారు.
“ఊఁ బాగానే ఉంది సమర్థింపు. మీరు ఏమైనా అననండి. నిజమే ఇప్పటి వాళ్ళు అదృష్టవంతులు. వెంటనే సహాయం అందుతుంది. కాని, అప్పట్లో మీరు బార్డర్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎంత భయం వేసేదో! రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. మిమ్మల్ని చూసేదాక మనసులో మనసు ఉండేది కాదు” అని చెపుతుంటే ఒక్కసారిగా ఆ కాళరాత్రులు గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. ఒక చిన్న సంఘటన, ఎక్సర్‌సైజ్‌లకు వెళ్ళిన రెండు నెలలు మాకు ఏ సంగతి తెలియకపోవటమే అంత బాధ కలిగింది. సరిహద్దుకు సమీపంలో ఉన్న సామాన్య ప్రజలు ప్రతి రోజూ టెరరిస్ట్ అటాక్స్, మిలిటరీ బాంబులు, విమాన దాడులతో నిరంతరం భయపడుతూ ఎట్లా ఉంటున్నారో! వారి మనోధైర్యమే మనకు స్ఫూర్తి. వారికి జోహార్. శత్రువుల సైన్యానికి చిక్కిన వీర సిపాయిలు సంవత్సరాల తరబడి విడుదలకు నోచుకోక జైళ్ళల్లో రోజుకొక గండంగా ఉన్నా ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. వారి సేవలు మరవరానివి. కాని వారికోసం ఎదురుచూస్తూ ఉన్న కుటుంబాల గురించి తలుచుకోగానే బాధ కలిగింది. నలభైఎనిమిది సంవత్సరాల క్రితం, భర్త యుద్ద ఖైదీ గా పట్టుబడ్డాడని మాత్రమే తెలుసు కాని ఎట్లా ఉన్నాడో తెలీదు, ఎప్పుడు విడుదల చేస్తారో అసలు చేస్తారో లేదో కూడా తెలియని ఓ వీరజవాన్ పత్ని, మనవడి చేయి పట్టుకొని, మీ తాతయ్య వస్తాడు, నిన్ను చూస్తాడు అంటూ, రెండో చేయి కళ్ళకు అడ్డంగా పెట్టుకొని, ఊరి శివారలల్లో భర్త కోసం ఎదురుచూస్తున్న స్త్రీరూపం కళ్ళముందు మెదిలి మనసు భారమైంది. ‘వీరపత్నీ నీకు మా వందనాలమ్మా!’ అనుకుంటూ ఉద్వేగముతో కంపిస్తున్న నా చేతిని ఏమండీ చేతి మీద వేసాను. నా భావోద్రేకాన్ని అర్థం చేసుకున్న ఏమండీ, రెండో చేతితో నా చేతిమీద చిన్నగా తట్టారు!