తిరుమలేశుని సన్నిధిలో… -7

0
5

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

వేద విజ్ఞాన సంస్థ

శ్వేత భవనంలో (తిరుపతి) వేద విజ్ఞాన సంస్థ. గత 20 సంవత్సరాలుగా ఈ సంస్థ దేవస్థానం ఆధ్వర్యంలో ఈ భవనం తొలి అంతస్తులో పనిచేస్తోంది. లోగడ దీనికొక అధికారి వుండేవారు. ఏవో కారణాలతో ఆయనను తొలగించారు. ఆయన కోర్టుకు వెళ్ళారు. అందువల్ల శాశ్వత ప్రాతిపదిక మీద దానికొక అధికారిని నియమించలేదు. గోవిందరాజులు అనే సూపరింటెండెంట్ చాలా కాలం ఈ సంస్థ కార్యకలాపాలు హుందాగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‍గా పదోన్నతి పొంది ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

దేవస్థానంలో అనేక విరాళాల నిధులు పనిచేస్తాయి. అందులో ప్రధానంగా పేర్కొనదగినవి ఇవి: 80G క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

1. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు:

ఈ నిధి క్రింద పేదవారైన రోగులు భయంకరమైన హృద్రోగము, మూత్రపిండ వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటికి విపరీతమైన ధనవ్యయం భరించలేనప్పుడు వైద్య సౌకర్యం ఇస్తారు. దీనికి విరాళాలు అందించగలదలచినవారు ఫోన్ నెంబర్ 0877-2264258లో సంప్రదించాలి.

2. శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకం (SVIMS) క్రింద వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు విరాళాలు అందించవచ్చు. ఈ పధకం క్రింద ఆదాయపు పన్ను శాఖ వారి సెక్షన్ 35 (i) (ii) క్రింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

3. శ్రీ వేంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు:

తిరుమల, తిరుపతి, తిరుచానూరు క్షేత్రాలలో భక్తులకు నిత్యం అన్న ప్రసాదం సమకూర్చే నిధి ఇది. రోజు లక్ష మందికి పైగా సగటున ప్రసాదాలు స్వీకరిస్తారు. విరాళాలు అందించడానికి 0877-2264375లో లేదా 0877-2264237లో సంప్రదించాలి.

4. బి ఐ ఆర్ ఆర్ డి ట్రస్టు:

బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్. ఈ పథకం క్రింద తిరుపతిలో ఒక ఆసుపత్రి నడుస్తోంది. వివరాలకు ఫోన్ నెంబర్ 0877-2264619లో సంప్రదించాలి.

5. శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీం (SVIMS):

ఈ పథకం క్రింద శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో సామాన్యుడికి కూడా ఆధునిక వైద్యం అందేలా చూస్తారు. వివరాలకు ఫోన్ నెంబర్ 0877-2287152 లేదా 0877-2287777.

6. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు:

ఈ పథకం క్రింద నేత్ర వ్యాధులతో బాధపడేవారికి అత్యంత ఆధునిక చికిత్స లభిస్తుంది. విరాళాలకు 0877-2264258లో సంప్రదించాలి.

7. శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయో ట్రస్టు (బాల మందిర్ ట్రస్టు):

మానవసేవయే మాధవసేవ అనే లక్ష్యంతో దేవస్థానం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అనాథ బాలురు, నిరాశ్రయులకు రక్షణ కల్పించడానికి 1943లో బాల మందిర్ స్థాపించారు. తర్వాత దానికి సర్వ శ్రేయో నిధిగా నామకరణం చేశారు. ఈ పథకం క్రింద బాలురకు విద్య, వసతి (బాలబాలికలకు) అనాథలకు కల్పిస్తారు. విరాళాలకు 0877-2264258లో సంప్రదించాలి.

8. శ్రీ వేంకటేశ్వర వారసత్వ పరిరక్షణ ట్రస్టు:

భారతీయ సంప్రదాయంలో ఆలయాలు సంస్కృతికి, వారసత్వానికి, సనాతన ధర్మానికీ ప్రతీకలు. అవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే గాక కళలు, సంస్కృతి పరిరక్షణకు భాండాగారాలు. వీటిని పోషించడానికి దేవస్థానం నడుం కట్టింది. విరాళాలకు 0877-2264258.

9. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు:

1992లో ఈ నిధి ప్రారంభించబడింది. దేశీయ గోసంతతి బీజాలను కాపాడే ప్రయత్నంలో తిరుపతిలో గోశాలను నడుపుతున్నారు. ఏటా గోకులాష్టమిని ఈ ప్రాంగణంలో వైభవంగా జరుపుతారు. ఈ ప్రాంగణం చంద్రగిరి రోడ్ మీద రైలు గేటు దాటగానే విశాల ఆవరణలో వుంది. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయం వుంది. గోవులు, అశ్వాలు, గజాలు ఇక్కడ పోషించబడుతున్నాయి. స్వామివారి ఉత్సవాలలో వాహనాలకు ముందు నడిచే గజాశ్వ, వృషభాలు ఇక్కడ పోషించబడి ఆయా ప్రదేశాలకు తరలి వెళతాయి. ఇక్కడి గోవుల పాలు స్వామివారి శుక్రవారం అభిషేకానికి పంపుతారు. సుశిక్షుతుడైన ఒక వెటర్నరీ డాక్టరు పర్యవేక్షణలో ఈ అమూల్య పశు సంతతి పోషించబడుతోంది. గోవులకు గడ్డిని ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలో పెంచుతారు. గోవులకు స్నానాధికాలు చేయించి పవిత్ర భావంతో చూస్తారు. యంత్ర సహాయంతో పాలు పితుకుతారు. శంకరరెడ్డి ఈ గోశాల అధిపతి. వివరాలకు 0877-2264570.

10. వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టు:

దారిద్ర్య రేఖకు దిగువన ఉండే విద్యార్థులు ఉన్నత విద్య నభ్యసించడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. విరాళాలకు 0877-2264039.

11. CSR – కంపెనీల సామాజిక బాధ్యత పథకం:

కంపెనీల చట్టం ప్రకారం సామాజిక బాధ్యత పథకం అమల్లో వుంది. ఆ పథకం క్రింద దేవస్థానానికి విరాళాలు అందించవచ్చు. వివరాలకు 0877-2264258 లేదా cdms@tirumala.org లో సంప్రదించాలి.

12. విదేశీ ద్రవ్య విరాళం:

దేవస్థానానికి విదేశీ మారక ద్రవ్యం విదేశాలలో ఉండేవారు విరాళంగా అందించవచ్చు. వీరు ఒక కోటి, 50 లక్షలు, 10 లక్షల విరాళాలు విదేశీ ద్రవ్య రూపంలో అందిస్తే కొన్ని దర్శన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో కూడా విరాళాలు హుండీ ద్వారా (ఈ-హుండీ) సమర్పించవచ్చు. దీనికిగాను dyeodonorcell@tirumala.org లో సంప్రదించవచ్చు.

13. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు:

వేదాలను పరిరక్షించే వ్యవస్థలో భాగంగా ఈ నిధిని 2007లో ప్రారంభించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ దీని లక్ష్యం. విరాళాలకు 0877-2264258.

వేద విజ్ఞాన సంస్థ గూర్చి ఇంతకుముందు ప్రస్తావించాను. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేద పండితులకు మాస వారీ భృతి కల్పిస్తున్నారు. కిశోర విద్యా పథకం క్రింద వేదపండితుడు ఒకరు లేదా ఇద్దరికి వేదం కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేయిస్తారు. శిష్యులకు గురువునకు జీవన భృతి కలిగిస్తారు. వివిధ దేవాలయాలలో వేద పండితులు వేదం పఠించేందుకు ఆయా ఆలయ అధికారుల పర్యవేక్షణలో మాస వారీ జీతాలు చెల్లిస్తారు. ఏటా వేదపండితుల ఎంపిక జరుగుతుంది.

ఈ పథకం అమలు ఎలా జరుగుతోందో క్షేత్రస్థాయిలో పరిశీలించి సలహాలు. సూచనలు అందించేందుకు 2008లో అప్పటి కార్యనిర్వహణాధికారి డా. కె.వి.రమణాచారి ఒక కమిటీని ఏర్పరచారు. అందులో నేనూ, ఆచార్య కె.సర్వోత్తమరావు సభ్యులం. మేము గుంటూరు, విజయవాడ పరిసరప్రాంతాలు వారం రోజులు పర్యటించి వేదపండితుల సూచనలు స్వీకరించి ఒక నివేదిక ఇచ్చాము. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని వైదన గ్రామంలో ఉన్న వయోవృద్ధ వేద పండితులు శ్రీ రామమూర్తిగారిని దర్శించి ఆశీస్సులు తీసుకున్నాము.

ఒక ఆలయంలో వేద పండితుడు వేదాన్ని నోట్లోనే స్మరించడం చూసి ఆయనను అలా చేస్తున్నారేమని అడిగాము. వేదం పైకి చదవకూడదని జవాబిస్తే ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. కొన్నిచోట్ల వేదపండితులు గైర్హాజరు అవుతున్నారు. వేతనాలు పెంచాలని కొందరు సూచించారు. ప్రతినెలా వారికి చెక్కులు బ్యాంకులో నేరుగా చేరుతుండటం హర్షణీయం.

వేద రికార్డింగు ప్రాజెక్టు నాలుగు వేదాలను ప్రసిద్ధ ఘనాపాఠీలచే రికార్డింగ్ చేయించి ఆడియో సి.డి.లు విడుదల చేసింది.

ధర్మగిరి వేద పాఠశాల:

తిరుమలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ధర్మగిరిలో దశాబ్దాలుగా వేద పాఠశాల పనిచేస్తోంది. ఇక్కడ చిన్న వయసులోనే విద్యార్థులను ఆయా వేద విభాగాల్లో చేర్చుకుని 12 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేయిస్తారు. పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. వీరు వివిధ ప్రాంతాలలో వేద పండితులుగా జీవనం కొనసాగిస్తారు. వారికి తగిన జీవనాధారం లభించక పోతుందేమోనని దేవస్థానం ఒక్కొక్క విద్యార్థి పేరా వారు చేరగానే లక్ష రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వాళ్లు పాఠశాల వదిలి వెళ్లే రోజు వృద్ధి పొందిన మొత్తాన్ని వారి పేర బ్యాంకకు జమ చేస్తుంది. ఇది ప్రోత్సాహకం. స్మార్తం చదివిన వారు వివిధ ప్రదేశాలలో వ్రతాలు, కళ్యాణాలు, పూజలు చేయించి జీవనం గడుపుతారు.

సేవ్ టైగర్ ప్రాజెక్ట్:

2005-10 సంవత్సరాల మధ్య నేను దేవస్థానంలో పని చేశాను. వేద రికార్డింగ్ సందర్భంగా వేద పాఠశాల సహకారాన్ని తీసుకున్నాను. ప్రిన్సిపల్ రామమూర్తి గారు స్టూడియోకు వచ్చి రికార్డు చేశారు. అది సిడిగా విడుదల అయ్యింది. ఆయన శిష్యులు ఇద్దరు కూడా రికార్డు చేశారు. వారిలో ఒకరు పాఠశాల అధ్యాపకులుగా, మరొకరు వేద పండితులుగా తిరుమలలో స్థిరపడ్డారు. రోజూ సాయంకాలం వేళ దీపాలంకార సేవలో ప్రథమంగా వేదం చదివే ఆరుగురిలో ఈ పండితులొకరు.

వేద పాఠశాల ఆధ్వర్యంలో ఏటా వేద సదస్సులు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఘనాపాఠీలు చర్చలో పాల్గొంటారు. వేద సభలు నాలుగు రోజులపాటు దిగ్విజయంగా చేస్తారు. శలాక పరీక్షలు నిర్వహిస్తారు. జయ పత్రాలు బహూకరిస్తారు. పండితులను ఘనంగా కార్యనిర్వహణాధికారి సమక్షంలో సత్కరిస్తారు.

2008లో వేద సభలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారు విచ్చేశారు. ముగింపు సమావేశంలో అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా సందేశం అందించారు:

“దేవస్థానం వారు ఏటా వేద సదస్సు నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా వుంది. వేద ధర్మాన్ని, వేద సంస్కృతిని పరిరక్షించడం ఆలయాల బాధ్యత. అంతరించిపోతున్న వేదాధ్యయనం పరంపర, గురు శిష్య సంప్రదాయాన్ని కాపాడవలసి వుంది. భారత ప్రభుత్వం వారు సేవ్ టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న పులులను సంరక్షించే పథకం అది. దేశవ్యాప్తంగా తరిగిపోతున్న పులుల సంఖ్యను కాపాడుతున్నారు.

మా ఉద్దేశంలో అదేవిధంగా వేద పండితులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నారు. అధ్యయన, అధ్యాపనాలు కొనసాగడానికి వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పరిచిన దేవస్థానాన్ని అభినందిస్తున్నాను. వేద పండితులు కూడా పులుల లాంటి వారే. వారి జాతి, వారి సంపద క్షీణించకూడదు. వేదమాత మనల్ని రక్షిస్తుంది. వేదాలకు నిత్య సౌభాగ్యం కలగాలి.

చిన్నతనంలోనే విద్యార్థులను ఆకర్షించి వేద పాఠశాలను గురుతర బాధ్యతగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను, వేద పాఠశాల అధ్యాపకులను అభినందిస్తున్నాను.”

నమామి వేదమాతరం‘ అని సందేశం ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here