రాజకీయ వివాహం-18

0
4

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 18వ భాగం. [/box]

అధ్యాయం- 18

[dropcap]అ[/dropcap]నూహ్యంగా తెరపైకి వచ్చిన రాహుల్, ప్రియాంకల వివాహం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నవారు ఇప్పుడు ఒక్కసారిగా ఏకమైపోవడం ప్రజల్లో ఒక వర్గం జీర్ణించుకోలేకపోయింది. ప్రియాంక స్వతంత్రంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని జె.హెచ్. పార్టీ సమర్థించలేదు.

సిద్ధార్థ అయితే ప్రియాంకను అన్ని పత్రికల్లోనూ ఇతర మాధ్యమాల్లోనూ అవకాశవాదిగా అభివర్ణించాడు, ఇంకా అనేక రకాలుగా విమర్శించాడు. ఇంతకాలం తను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఇవన్నీ  గాలిలో మాటలని, సందర్భం వచ్చేసరికి ఆమె కూడా రాజకీయ నాయకురాలిగా ప్రవర్తించింది అని  తను  జె.హెచ్. పార్టీ ఎన్నికల ప్రచారం కోసం సంచరించిన అన్ని ప్రదేశాల్లో ఘంటాపదించాడు.

ఈ సంఘటన తరువాత అనతికాలంలోనే సిద్ధార్థ జె.హెచ్.పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసాడు, అంతేకాకుండా జె.హెచ్.పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా అతనే ఎన్నికయ్యాడు. తమ పార్టీను గెలిపించడానికి పూనుకున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ సిద్ధార్థ వెనకే ఉండడం వలన ప్రసాద్ గారికి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది, ఆయన కూడా సిద్ధార్థను మాత్రమే సపోర్ట్ చేసారు.

అప్పటినుంచీ అతను తన పంథాను మార్చుకుని ఎక్కడికి వెళ్ళినా కేవలం రాహుల్ ప్రియాంకలను టార్గెట్ చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొన్ని కొత్త స్టాటిస్టిక్స్ సేకరించి ప్రభుత్వం ధరణికోట లాంటి ప్రాజెక్టులను ఆపుచెయ్యడం వల్ల ప్రతీ ఒక్కపౌరునిపై ఎంత భారం పడనుందో వివరించాడు. ప్రియాంక ఉన్న సమయంలో భూ ఉద్యమానికి నేతృత్వం వహించిన అతను ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా పరిశ్రమల యొక్క ఆవశ్యకతను, ఉపాధి గురించీ అదే పనిగా ప్రజలకు నూరిపోయడం ప్రారంభించాడు. గతంలో ప్రియాంకను బలపరిచిన అతని ఇన్వెస్టర్లు ఇప్పుడు సిద్ధార్థను బలపరుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామంతో ప్రజలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

“రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీ కుటుంబ వ్యవహారం అనుకుంటున్నారా. మీ మీదే నమ్మకం పెట్టుకున్న ప్రజలను వెన్నుపోటు పొడుస్తారా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉంది మీ వ్యవహారం. రాహుల్ కూడా తక్కువ వాడేమీ కాదు, ఇంతకాలం రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొత్తగా చేరిన ప్రియాంక సూచన మీదట అర్ధాంతరంగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.

ఈ విషయం ప్రజలు గ్రహించలేరు అనుకున్నారా, మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టులు పునఃప్రారంభం కావని మీరు హామీ ఇచ్చిన భూములు మళ్ళీ అదేవిధంగా వెనక్కు తీసుకోరని ప్రజలు ఏ విధంగా నమ్మగలరు, ప్రజలకి ఈ విషయంలో స్పష్టత అవసరం. అందుకే నేను ప్రజల తరఫున కోరుకుంటున్నాను ఈ వృథా ప్రయత్నాలు, అవకతవక నిర్ణయాలు  మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యండి.

అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మొదటినుంచీ నష్టం కలిగిస్తూనే ఉంది. తన తండ్రి గురించి ఇప్పటివరకూ పట్టించుకోని రాహుల్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన మంత్రిత్వశాఖ నిర్వహించడం ఖండించదగిన విషయం, ఆ సందర్భంలో జరిగిన అల్లర్లు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇలాంటి సమయాల్లో ప్రజలు ఏ విధంగా గుండెల మీద చెయ్యివేసుకుని నిదురించగలరు. ఏదైనా విమర్శలు చేసినా, ఎదురు తిరిగి ప్రశ్నించినా మీ అధికారంతో లాఠీఛార్జీలు అరెస్టులు చేయ్యిస్తారా. ఇదెక్కడి న్యాయమండీ, మీ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించడానికి రాష్ట్రం మీ ఉమ్మడి ఆస్తి అనుకుంటున్నారా?” ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అతను అన్న  ఆఖరిమాటలు వారిలో  విపరీతమైన స్పందన తీసుకువచ్చాయి.

అందరూ రాహుల్, ప్రియాంకల కలయిక ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇప్పుడిప్పుడే వారు సిద్ధార్థ మాటలను నమ్మడం ప్రారంభించారు, అలా నమ్మడానికి సిద్ధార్థ కొంచెం సమాజ వ్యతిరేక పద్ధతలు అవలంభించి, కొంతమందికి డబ్బు ఆశ చూపించి వారి మన్నలను చూరగొన్నాడు.

“నేను ఆమెకు సలహాదారుగా ఉన్నప్పుడు ఈ పరిశ్రమల యొక్క ఆవశ్యకతను వివరించడానికి నాకు సాధ్యమైనంతగా ప్రవర్తించాను. అయితే ఎప్పుడూ ఆమె నా మాటలను లెక్క చేసింది లేదు, ఎప్పుడు చూసినా అందరికీ అన్నిటికీ అడ్డంకులు కల్పిస్తూనే ఉంది. తన లక్ష్యం ప్రజలను నిర్వీర్యం చేసి తనకు బానిసలుగా చేసుకోవడమే.

ఇంకా తన తండ్రి పేరు చెప్పి ‘అందరికీ భూమి’ అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు పురోగమనాన్ని కోరుకుంటున్న ఈ సమయంలో స్వార్ధంతో కూడుకున్న ఇటువంటి రాజకీయాలు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుంటే త్వరితగతిన ఆ ధరణికోట ప్రాజెక్టును ఆరంభించి పూర్తిచెయ్యాలి.

ఈ విషయంలో మరెటువంటి చర్యలు తీసుకున్నా అది ప్రజావ్యతిరేకమే అవుతుంది. కనుక విజ్ఞత కలిగిన పౌరులందరూ అలోచించి నిర్ణయం తీసుకుని ఈ లక్ష్యాన్ని నెరవేర్చి తమకు న్యాయం చేకూర్చగల జె.హెచ్. పార్టీకి మాత్రమే వోట్ వెయ్యాల్సిందిగా కోరుతున్నాను” మరొకచోట పర్యటనలో చెప్పాడు సిద్ధార్థ.

నిజమేంటో, అబద్ధమేంటో ఆలోచించే స్థితిలో ఎవరూ, ఎవరకి నచ్చింది వారు మాట్లాడుతున్నారు,ఎవరికి అనుకూలమైనది వారు వింటున్నారు. ఇలాంటి వాదనలకు బలం చేకూరడంతో సమీరకరణాలను తారుమారు చేస్తూ భూషణరావు మళ్ళీ సిద్ధార్థ పంచన చేరాడు. నిజం చెప్పాలంటే సిద్ధార్థ భూషణరావుని తమతో చేరేలా చేసుకున్నాడు. ఎవరికి వారు వ్యక్తిగత స్వార్థాలనూ, లాభాలనూ చూసుకునే స్థాయికి చేరుకొని గెలుపోక్కటే లక్ష్యంగా పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు.

“ప్రజల కనీస అవసరం ఏంటో నిర్ణయించే హక్కు మీకు ఎవరిచ్చారండీ, ఇదంతా కేవలం మీ అవగాహనా రాహిత్యం వల్లనే జరుగుతోంది. కష్టపడి పనిచేసే వారి కష్టం మీకు హాస్యాస్పదంగా ఉంది, పరిశ్రమల అవసరం ఉన్నప్పటికీ ప్రధానమైన  భూమి అందరికీ లభించిననాడే మిగిలినవాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అలాకాకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మమ్మల్ని నిర్ణయాలు తీసుకోమనడం ఎంతవరకూ సమంజసం, ఇలాంటి వాళ్లకు ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి సమ్మెలూ, రాస్తారోకోలూ, అల్లర్లూ,  అలజడులూ సృష్టించేవారికి శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు లేదు.

నేను జె.హెచ్. పార్టీలో ఉన్నప్పటినుంచీ ఇటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం. ఇవన్నీ సిద్ధార్థగారి అధ్యక్షతన జరుగుతూ ఉండడం దురదృష్టకరం. వీటికి స్వస్తి చెప్పడానికే నేను ప్రభుత్వంవారితో చేరడం జరిగింది” ప్రియాంక తన నిర్ణయాన్ని  విశదీకరించడానికి రాహుల్‌తో కలిపి చేసిన ఒక పర్యటనలో పైవిధంగా పేర్కొన్నది. ఆ సభలో హనుమంతరావుగారు, నాచిరెడ్డి కూడా ఉన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నట్లుగా అక్కడ వారు అభిప్రాయపడ్డారు.

“ఎక్కడున్నాయండీ పరిశ్రమలు, కర్షకుల శ్రమను హరించి వేస్తూ కష్టం అంటే ఏంటో తమకు తాముగా నిర్ణయించుకుని అలా ప్రవర్తించని ఇతరులను తమకు వ్యతిరేకులుగా భావించే సిద్ధార్థలాంటి వారి చెప్పుచేతల్లో ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమ అనే పదానికి విపారీతార్థం తీసి తమకు తాము అన్వయించుకుంటారు. ఇంతకాలం అలాంటివారితో కలిసి పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను.

మా నాన్నగారి చిరాకాల లక్ష్యాన్ని నేను నెరవేర్చే వరకూ నిద్రపోను, అభివృద్ది సాధించడానికి అడ్డదారులు అంటూ లేవు, మొదట కింది స్థాయినుంచి మాత్రమే అది సాధ్యం అవుతుంది. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లు ప్రతీ మండలానికీ, గ్రామానికీ అందరికీ చేరువలో ఉండేలా, సాంకేతికతను గ్రామీణ స్థాయిలో అందిపుచ్చుకునేలా చూస్తుంది మా ప్రభుత్వం.

వీటికి అనుసంధానంగా మన కనస్ట్రక్టివ్ ఫోర్సు పనిచేస్తుంది, తమకి ఎటువంటి సమస్య ఉన్న క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రదేశంగా ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుంది మా జనసమాజ్ ప్రభుత్వం. దీనికి సహకరించి మళ్ళీ మన ప్రభుత్వాన్నే ఎన్నుకోవలసినదిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన అభిమాన నాయకుడు రాహుల్ గారు మాట్లాడతారు” అని చెప్పి దాదాపు లక్షమంది పైగా ప్రజలు సమావేశమై ఉన్న ఆ సభా ప్రాంగణంలో రాహుల్‌కు మైకు అందించింది ప్రియాంక.

“ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలుపుతున్నాను. మీకు తెలుసు మొదటినుంచీ మా నాన్నగారు స్వర్గీయ జోగేశ్వరరావు గారు కార్మికునికీ, కర్షకునికీ ఎప్పుడూ వెన్నంటి ఉండేవారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న నేను కేవలం ఏదో ఒకరికి మాత్రమే లాభం చేకూర్చేటటువంటి ధరణికోట ఇత్యాది ప్రాజెక్టులకూ, పరిశ్రమలకూ ఏ విధంగా ఆమోదం తెలుపగలుగుతాము.

పైగా అందరికీ తెలిసినట్లుగా మొదటినుంచీ లోపభూయిష్టంగా ఉన్న టెండర్ల ప్రక్రియ ఒకెత్తు, దీనికి కారణం ఎవరో మీకు ఈపాటికే అర్థం అయ్యి ఉండాలి” అతను భూషణరావుని ఉద్దేశించి ఆ మాట అన్నాడని గ్రహించిన ప్రజలందరూ

“భూషణరావు, భూషణరావు, భూషణరావు” అంటూ హాహాకారాలు చెయ్యడం ప్రారంభించారు. వారందరినీ శాంతింపజేసి తిరిగి తన ప్రసంగం కొనసాగించాడు రాహుల్

“మరి అలాంటివారు చేరిన జె.హెచ్. పార్టీ ఇప్పుడు పూర్వపు విలువలను కోల్పోవడంలో విచిత్రమేమీ లేదు. కనుక వారు హామీ ఇస్తున్న పరిశ్రమలు ఎవరికీ ఉపయోగపడతాయో నేను ప్రత్యేకంగా ప్రజలందరికీ తెలియచేయ్యాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతల విషయంలో వారు చేస్తున్న విషప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఇటువంటివాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అందరినీ సమన్వయ పరచగల ఒక శక్తీ లేకపోవడం వల్ల, ఈ సందర్భంగా నేను దివంగత నేత మా తండ్రిగారు జోగేశ్వరరావుగారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను, ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు అధికారం అనేది దానిమీద ఆశపడిన వాడికి ఎప్పుడూ లభించకూడదు దాని ద్వారా ఆశించినవాడితో కలిపి అందరికీ నష్టం కలుగుతుంది అని.

ఇది ప్రజలకు ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. అందుకే మా పార్టీకూడా ఆయన జాడల్లోనే నడుస్తూ మన అభిమాన నాయకుడు హనుమంతరావుగారిని  తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్ధి క్రింద ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నేను పోటీ నుండి తప్పుకుంటూ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన అభ్యర్దిత్వాన్ని బలపరుస్తున్నాను” రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రియాంకతో కలిపి ఎవరూ ఊహించలేకపోయారు.

కానీ ప్రజల్లో ఈ విషయం పట్ల మంచి స్పందన లభించింది, దానికి కారణం ప్రజలు ఇప్పుడు రాహుల్, సిద్ధార్థ, ప్రియాంక వీరి ముగ్గురినీ కూడా నమ్మే స్థితిలో లేరు. అయితే తెలివిగా రాహుల్ హనుమంతరావు పేరుని ప్రతిపాదించడం వలన అతనిపట్ల నమ్మకం ఏర్పడింది ఎందుకంటే హనుమంతారావుకి ప్రజల్లో ఎప్పుడూ మంచిపేరు ఉంది, అతడినొక న్యూట్రల్ అభ్యర్ధిగానే వారు గుర్తించారు. ఇప్పటివరకూ పోటీ చేసిన ప్రతీ ఎలక్షన్‌లో అతను గెలుస్తూనే వస్తున్నాడు.

ఇటువంటి సమయంలో తమను కాపాడుకోవడానికి అంతకన్నా పెద్ద మార్గం కనపడలేదు పైగా ఎన్ని గొడవలు పెట్టుకున్నప్పటికీ అతనికి నకునారెడ్డి గారి కుటుంబం పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ప్రియాంక తమ పార్టీలో చేరడం వల్ల వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం ఉన్నా అది పూర్తిగా దీనిద్వారా శూన్యం అయిపోయి ప్రజల్లో తమ స్థానం సుస్థిరంగా ఉంటుంది. దీనికి బలం చేకూరుస్తున్నట్లుగా హనుమంతరావు కూడా ప్రజాస్వామ్యంపైనా, భూ వ్యవస్తపైన రాహుల్ ప్రోద్బలంతో ఎడాపెడా ప్రసంగాలు చేస్తూ ప్రజల్లోకి చేరుకోగలిగాడు.

ఇంక సిద్ధార్థ విషయానికి వస్తే అతని పార్టీలో కూడా ఇప్పటికే సందిగ్ధత ఏర్పడింది. ఎవరికివారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది, అయితే వారికి లాభించే విషయం ఏంటంటే తమ ఎమ్మెల్యేలను తాము నష్టపోకుండా జె.హెచ్.తో మాత్రమే ఉండగలిగేలా చూసుకున్నారు, దానికితోడు నమ్మకంగా ఉన్న ప్రసాద్ గారు ఇంకా అదే పార్టీని అంటిపెట్టుకుని ఉండడం.

సిద్ధార్థ ఆయనను ఏదో ఆశ చూపించి తమనుండి విడిపోకుండా చూసుకుని ఉంటాడు అని ప్రజలందరికీ తెలుసు, ఆయన వయసు మీదపడుతూ ఉండడం వలన ప్రసాద్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగితించారు. ఒకరోజు సాయంత్రం హడావిడిగా జనసమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి రావడం జరిగింది.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాల వల్ల పార్టీ ఇమేజ్ జాతీయస్థాయిలో దెబ్బతింటుందని ఎవరిని సంప్రదించి తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని రాహుల్‌ను వారు ప్రశ్నించారు.

“చూడండి ముఖర్జీగారు మా రాష్ట్ర రాజకీయాల గురించీ, ప్రజల గురించి వారి కష్టనష్టాల గురించి మీకు అసలు కొంచెం కూడా తెలీదు. హనుమంతరావుగారిని ప్రకటించడం వల్ల మనకి ఎంతో లాభం చేకూరింది, దాన్ని ఋజువు చెయ్యడానికి మనకి ఈ ఎలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. మనం ఇలా అంతర్గతంగా వాదులాడుకుంటూ ఉంటే మనల్ని పక్కకి తోసి ఆ సిద్ధార్థ సీ ఎం అయ్యి కూర్చుంటాడు.

ఎన్నో సార్లు కేంద్రంలో అవిస్వాసంతో ఉన్న ప్రభుత్వానికి మా రాష్ట్ర లోక్‌సభ సభ్యుల ద్వారా బలం చేకూర్చింది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. అందుకే ఈ విషయంలో నా నిర్ణయాన్ని హై కమాండ్ స్వాగతిస్తుంది అని ఆశిస్తున్నాను” కొంచెం కఠినంగా ఆయనతో చెప్పాడు రాహుల్.

ఆ సమయంలో పార్టీ ఆఫీసుకు ప్రియాంక, నాచిరెడ్డి, హనుమంతరావుతో కలిపి వారి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు.

“కావచ్చు మిస్టర్ రాహుల్, కానీ విధేయత అనేది ఒకటుంటుంది. మీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవడానికి, ఇష్టమైన వాళ్ళను చేర్చుకోవడానికి, ఇది మీ సొంత పార్టీ కాదు కదా, దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజల సమస్యలు అంటూ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆపుచెయ్యడం వలన మన రెవిన్యూకి తీరని నష్టం జరుగుతోంది అని తెలిసింది” జె.హెచ్. పార్టీ ప్రాంతీయ పార్టీ కావడంతో ఆయన ప్రియాంక పార్టీలో చేరడం ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేసాడు.

“ఐ యాం సారీ సార్, మా రాష్ట్ర రెవిన్యూ పట్ల కేంద్రం జోక్యం అనవసరం అని నా అభిప్రాయం. ఒకవేళ అంతగా ఆలోచించాలి అనుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఇంకా అనేక స్థాయిల్లో ఉన్న ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి అని నా మనవి.

ఇకపోతే ఎవరితో కలవాలి, ఏమి చెయ్యాలి అన్నది మీరు మాకు వదిలేసి, మీ పర్యటనలో ఇక్కడ మా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గమనించి అందుకు సహాయపడితే మంచిది. అంతేకానీ ప్రతిపక్షం వాళ్ళు ప్రొవైడ్ చేసిన  తప్పుడు స్టాటిస్టిక్స్‌తో మోసపోవడం వల్ల ప్రయోజనం లేదు” చెప్పాడు రాహుల్.

ఇంక అతనితో మాట్లాడడానికి విషయాలేమీ లేవని గ్రహించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖర్జీ రాష్ట్రంలో తన పర్యటన ముగించుకుని అసంతృప్తిగానే ఢిల్లీ చేరుకున్నాడు, అతణ్ణి సాగనంపిన దగ్గరనుంచీ తరువాత ఏమి జరుగుతుందా అని ప్రియాంక ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

“ఇంకొక నెలరోజుల్లో మన భవితవ్యం ఏమిటో తేలనుంది. ఆలోచిస్తే మనం చాలా విషయాల్లో తొందరపడ్డామేమో అనిపిస్తోంది రాహుల్. కానీ సిద్ధార్థ ఈ విధంగా నాకు ఎదురు తిరుగుతాడు అని నేను అస్సలు ఊహించలేదు. మొదటినుంచీ నాకు ప్రతీ విషయంలో సహకరించింది, నా ఆలోచనలు రూపాంతరం చెందేలా చేసినది అతనే. మరి అలాంటిది నేను నీతో చేరడం అతనికి ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు. అధికారం కోసం ప్రాకులాడుతూ మన పరస్పర వివాదాలు ఈ రాష్ట్రప్రజలకు ఎంత నష్టం కలిగిస్తున్నాయో మనం గమనించలేకపోతున్నాం” రాహుల్‌తో అంతరంగికంగా ఉన్న ఒకానొక సమయంలో బాధపడింది ప్రియాంక.

“ఇప్పుడు ఇలాంటి ఆలోచనల వల్ల మనకి లాభం తప్ప నష్టం జరగదు, మనం ప్రస్తుతానికి ఒక రేసులో ఉన్నామన్న విషయం మర్చిపోకు. ఈసమయంలో ప్రత్యర్ధుల బలం, బలహీనతల గురించి తెలుసుకోవడం మీద మన కాన్సంట్రేషన్ పెడితే మనకి ప్రయోజనం ఉంటుంది. అవతల వాళ్ళకి కాన్షన్స్ లేనప్పుడు మనకి ఉండడంలో అర్థం లేదు అది మన వెనకబాటుకే దారి తీస్తుంది.

వెనకబడిన నాయకుడిని నిజాయితీని గుర్తించడానికి ప్రజలకు అంత సమయంలేదు. ఒకప్పుడు నువ్వు చెప్పినదే మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను గెలవడమే నిజం, విన్ నౌ థింక్ లేటర్ దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ హీట్ ఆఫ్ ద మూమెంట్” చెప్పాడు రాహుల్, ఆమెకు అతను చెప్పినదానితో ఏకీభవించక తప్పలేదు.

ఎన్నికలు జోరు అందుకోవడంతో నాచిరెడ్డి గారు కూడా పూర్తిస్థాయిగా ప్రచారంలో పాల్గొని రాహుల్ కి తన సంపూర్ణ మద్దత్తు తెలియజేసారు, తన బావమరిది తేజా కూడా జనసమాజ్ పార్టీలో చేరి తన మీడియా నెట్వర్క్ ద్వారా వారికి సహాయపడుతున్నాడు. సోషల్ మీడియాలో ప్రజల్లోకి ప్రియాంక, రాహుల్ యొక్క ప్రసంగాలను చేరవేయడంలోనూ, వారి భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడంలో నాచిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.

వారి అందరి లక్ష్యం ఒకటే అదే హనుమంతరావుని ముఖ్యమంత్రిని చెయ్యడం. ఢిల్లీ చేరుకున్న ముఖర్జీగారు జాతీయంగా ఉన్న ఇతర నేతలతో చర్చల అనంతరం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కొత్తవ్యక్తిని ఎన్నుకోబోతున్నారని ఒక పుకారు వ్యాపించింది, అయితే ఎలక్షన్స్ మరికొద్దిరోజులే ఉండడంతో వారు అంత సాహసం చేస్తారని ఎవరూ అనుకోకపోవడం వలన అది నిజం కాదని పుకారు మాత్రమే అవుతుందని రాహుల్ వర్గం అభిప్రాయపడింది.

“ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఉద్యోగిని తీసుకుందాం, తన సంతానం ఏదో ఒక ప్రభుత్వ పాఠాశాలలో చదువుతూ ఉంటాడు, ప్రతీరోజు ఎనిమిది నుండీ పదిగంటల పాటు చాలీచాలని జీతంతో వెట్టిచాకిరీ చేస్తూ సంసారాన్ని వెళ్ళదీసే అతనికి ఓటింగ్ కేంద్రంలో ఒక లిస్టు కనపడుతుంది. అందులో మొదటి మూడు స్థానాల్లోని ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఉంటారు.

మొదటివ్యక్తి చాలా తెలివైనవాడు తన కుమారుడిలా అభ్యుదయ భావాలు కలిగినవాడు, అది చేస్తాం ఇది చేస్తాం ఆ పరిశ్రమలు తెప్పిస్తాం, ఈ పరిశ్రమలు తెప్పిస్తాం అని ఎన్నో నేరాలకు పాల్పడి ఎంతో మంది చావుకి పరోక్షంగా కారణం అయిన వాళ్ళని పక్కన ఉంచుకుని ప్రతీరోజూ సాయంత్రం తను భోజనం చేసే సమయానికి టీవీల్లో ప్రచారంతో తనని ఊదరగోట్టేస్తూ ఉంటాడు.

రెండవ అభ్యర్ధి చాలా నమ్మకమైన వాడు. అతను మొదటివ్యక్తి అంతగా ప్రసంగాలు అవీ చెయ్యకపోయినా ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి. తన శక్తి మీద నమ్మకమున్న మనిషి, రాష్ట్రానికి ఏదో చెయ్యాలనే తాపత్రయంలో ఇతర నమ్మకస్తుల సహాయంతో తన జీవితాన్నే పణంగా పెట్టి కెరటానికి ఎదురొడ్డుతున్న మనిషి, తన లక్ష్యసాధనలో ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయాడు, కొత్తకొత్త ఆలోచనలతో ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా, స్వశక్తిపై నమ్మకం కలిగే విధమైన ఆలోచనలు చేస్తూ కార్మిక, కర్షకులను ఒక తాటిమీదకి తీసుకువస్తూ ప్రజలే యజమానులు అనే నమ్మకం కలిగిస్తాడు ఈ వ్యక్తి.

ఇక మూడవది వ్యక్తిత్వంతో, ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా కేవలం తన విధేయత ద్వారానే ఆ స్థాయికి చేరుకున్న మనిషి, ఇతనికి ప్రజల కష్టనష్టాలతో కానీ జీవనవిధానాలతో కానీ ఎటువంటి పట్టింపు లేదు, ఇతని దృష్టిలో ఇదొక అనుకోకుండా తగిలిన వ్యాపార అవకాశం అంతే, ఉన్నాలేకపోయినా పెద్దగా ప్రభావం చూపడు ఈ పెద్దమనిషి. ఇతడిని ఎన్నుకోవడం అంటే రాష్ట్రాన్ని ఇంకొకరికి ధారాదత్తం చెయ్యడమే అవుతుంది.

ఇంకా వీరితోపాటుగా చిన్నా చితకా అభ్యర్ధులు చాలానే ఉంటారుకాకపోతే మొదటి ముగ్గురి గురించీ మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారిలో ఆ మధ్యతరగతి ఉద్యోగి ఎవరికి వోట్ వేస్తాడు అతడిని ప్రభావితం చేయగలిగే లక్షణాలు ఈ ముగ్గురిలో ఎవరికి ఉన్నాయి.ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రశ్న”

ఒక టీవీ ఛానెల్ వాళ్ళు ముఖ్యమంత్రి రేసులో ఉన్న ముగ్గురి గురించీ పరోక్షంగా తమ అభిప్రాయం వ్యక్తపరుస్తూ ప్రజల్లో బాగా ప్రాచుర్యం కలిగిన ఇద్దరు వక్తల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం చేసారు. రాహుల్‌ను పార్టీ అధ్యక్షత నుండి తొలగించి, హనుమంతారావు స్థానే మూడవ వ్యక్తిని ఉంచాలి అని హైకమాండ్ ఆలోచిస్తోంది అన్న ఊహాగానాలూ ప్రచారంలో ఉన్నవేళ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చెయ్యడం జరిగింది.

***

“అండర్ డాగ్ పాలిటిక్స్, వీటిని ఎలా డీల్ చెయ్యాలో నాకన్నా బాగా ఎక్కువగా ఎవరికీ తెలీదు. ఇలాంటివాటిని నమ్మడానికి ఎప్పుడూ చాలామంది ప్రజలు సిద్ధంగానే ఉంటారు. ఎవరైనా అధికారంలోకి వచ్చారంటే దానికి చాలావరకు ఇవే కారణం అవుతూ ఉంటాయి. వాటిని సపోర్ట్ చెయ్యడానికి లెక్కలేనన్ని టీవీ చానెళ్ళు ఒకటి, అయినా ఇప్పుడు మనకు కలిసొచ్చే విషయం ఏంటంటే రాహుల్ పార్టీ అతని అధ్యక్షత గురించి రెండో ఆలోచన కలిగి ఉంది.

వాళ్ళు దాన్ని పుకారు కింద అభివర్ణిస్తున్నారు కానీ ఢిల్లీలో నాకున్న సోర్సెస్ నుండి  తెలిసిన సమాచారం ప్రకారం అది నిజమయ్యే అవకాశం ఉంది” సిద్ధార్థ ఆ రోజు జె.హెచ్.పార్టీ అఖిలపక్ష సమావేశంలో పార్టీలో ఇతర నేతలను ఉద్దేశించి అన్నాడు. ఆ సమావేశానికి ప్రసాద్ గారు, భూషణరావు కూడా హాజరయ్యారు.

“ఏదేమైనా జనసమాజ్ పార్టీకి పలుకుబడి పెరుగుతోందనే నాకు అనిపిస్తోంది, ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రజలందరూ వారికే అనుకూలంగా ఉన్నట్లుగా సూచిస్తున్నాయి, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మన ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పడిపోయినట్లుగా తెలుస్తుంది” ఆందోళన వ్యక్తం చేసాడు ఎమ్మెల్యే ప్రసాద్.

“ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడూ అధికారంలో ఉన్నవారికి ఫేవర్ చేసేవిగానే ఉంటాయి సార్, కానీ ఆఖరి ఫలితాలు చూస్తే అందుకు భిన్నంగా ఉంటాయి, ఇది ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఆఖరి క్షణం వరకూ గెలుపు ఎవరిదో చెప్పలేము. డోంట్ వర్రీ సార్, వాళ్ళదగ్గర అధికారం, ప్రజలూ ఉంటే మన దగ్గర ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అవసరమైన ధనం బలగం ఉన్నాయి. కొనేద్దాం సార్” భూషణరావు వంక చూస్తూ చెప్పాడు సిద్ధార్థ

“మీరు ఏమి చేస్తారో తెలీదు కానీ మళ్ళీ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, దీనిమీదే నా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. నకునారెడ్డిగారి టైం నుంచీ దానికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. క్రితంసారి నేను ఆయనతో కలవడ వల్లనే నా భూమిని కోల్పోయేను. ఈసారి కూడా అదే తప్పు చేస్తే పశ్చాత్తాపపడడానికి కూడా అవకాశంలేని విధంగా నష్టపోతాను” భూషణరావు చాలా కాలం తరువాత మాట్లాడుతున్నట్లుగా అక్కడవారికి అనిపించింది.

“ఒకే భూషణరావుగారు దిగులుపడకండి, మనం ఈ విషయం అంతర్గతంగా చర్చిద్దాం. మీ డబ్బులు ఎక్కడికీ పోవు పెట్టినదానికి రెట్టింపు రాబట్టుకుంటారు. దానికి  నాదీ హామీ. నా మీద పూర్తిగా నమ్మకం ఉంచి మీరు ముందర ఎలక్షన్స్ మీద కాన్సంట్రేట్ చెయ్యండి. ఇందులో నేను గెలవడం ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు” చెప్పాడు సిద్ధార్థ. అతనివంక అపనమ్మకంగా చూసాడు ఎమ్మెల్యే ప్రసాద్.

ఆయనకు ఈ ఎన్నికల్లో తమ పార్టీ భవితవ్యం మీద దిగులు పట్టుకుంది తనకి ఎటూ పోలేని పరిస్థితి తనని నమ్ముకున్న ఎమ్మెల్యేలకి కూడా తను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.

“మీ వ్యాపారాలు, ప్రచారాలు అవీ బాగానే ఉన్నాయి బాబూ. కానీ ప్రజల గురించి ఆలోచించారా. ఎప్పుడు చూడు మీ వ్యాపార ధోరణి మీదేకానీ ఇతర పార్టీ వారి లాగ ప్రజల కనీస అవసరాలు గురించి పట్టించుకుంటున్నారా. శాంతిభద్రతలు అవీ ఇవీ అంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఒక్కోసారి వారిని కయ్యానికి ఎగదోస్తున్నారు. అందుకేనేమో మొదట నాచిరెడ్డి గారు ఆ తరువాత మీ స్నేహితులైన ప్రియాంక ఇలా ఒకరివెంట ఒకరుగా మన పార్టీ నుండి వేరైపోయారు” ఒళ్లుమండిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆ సమావేశంలో సిద్ధార్థతో అన్నాడు.

చాలామందిలో ఇదే ఆలోచన ఉన్నప్పటికీ ఎవరూ బయటపడలేదు, సిద్ధార్థను కొంతమంది తమ నాయకుడిగా అంగీకరించలేకపొతున్నారు అయినా కానీ గత్యంతరం లేక అతని మాటలే వినాల్సివస్తోంది.

“ఏంటండీ ప్రజలు, ప్రజలు అని ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలంటే మేము కాదా, మీరు అనుకున్నవాళ్ళు మాత్రమే ప్రజలా, ప్రజలు అవసరాలు ఏంటో నిర్ణయించడానికి మీరు నేనూ ఎవరూ సరిపోరు. ఎలా ప్రచారం చెయ్యాలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో మాకు తెలుసు. మీరు నిశ్శబ్దంగా మీ నియోజకవర్గంలో ప్రచారం గురించి ఆలోచించండి. మిగతావి మేము చూసుకుంటాం. ప్రసాద్ గారు చెప్పండి ఈయనికి” కోపంగా అన్నాడు సిద్ధార్థ.

ప్రసాద్ గారు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు, దానితో ఆ మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే  వెనక్కి తగ్గి కూర్చున్నాడు. అందరూ సిద్ధార్థ ఆ విధంగా మాట్లాడడం చూసి కొద్దిగా భయపడ్డారు. సిద్ధార్థ వాళ్ళను నియంత్రణలో ఉంచడానికి కొంతమంది రఫ్ క్యారెక్టర్లని కూడా అక్కడికి తీసుకువచ్చాడు.

తనకు కొత్తగా పరిచయం అయిన ఇన్వెస్టర్లు అందుకు సహాయపడ్డారు. అతని వాలకం చూస్తుంటే బెదిరించో, భయపెట్టో, బుజ్జగించో ఏదోక విధంగా అధికారానికి రావడానికి చూస్తున్నట్లు అక్కడున్నవారి అందరికీ అనిపించింది.

“ఇప్పుడు అవసరమైనది ఇలా మనలో మనం కుమ్ముకోవడం కాదు. మంచికో చెడుకో ఏదో ఒక కారణం చేత మనం సిద్ధార్థను నాయకుడుగా ఎన్నుకున్నాం. ఇప్పుడు దానిమీద పునరాలోచనలు చేసి నష్టపోవడం కన్నా అతనికి సహకరించి కనీసం మనం క్రితంసారి తెచ్చుకున్న మేజిక్ నంబర్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తే  మంచిది, లేదంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం” ప్రసాద్ గారు వారందరినీ సమాధాన పరుస్తూ మాట్లాడాడు.

వారికి ఆయన మాటలు రుచించకపోయినా పెద్దగా ఏమీ చెయ్యలేని పరిస్థితి వలన వారు మిన్నకుండిపోయారు.

“మీకేమండి మీరు ఎన్నైనా నీతులు చెప్తారు. మీకు ఆ సిద్ధార్థ మంత్రి పదవి ఆశ చూపి ఉంటాడని మాకే కాదు ప్రజలు అందరికీ కూడా తెలుసు. నేను ఏమన్నాను ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించమన్నాను అంతే. ఏమి చేసినా చెయ్యకపోయినా చివరకి మనకి వోటు వేసేది, వెయ్యాల్సింది కూడా వాళ్ళే కదా” మళ్ళీ ఇందాకా మాట్లాడిన ఎమ్మెల్యే మరొకసారి కొద్దిగా గట్టిగా అరిచాడు.

దానితో అక్కడ మళ్ళీ కలకలం మొదలైంది, అందరూ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఒకరిమీద ఒకరు అరుచుకోవడం, ఒకరి మీద ఒకరు అక్కడున్న దిండులను విసురుకోవడం ప్రారంభించారు.

“ఆగండి, ఆగండి ఎందుకు అలా గొడవలు పడతారు” పార్టీ అధ్యక్ష హోదాలో సిద్ధార్థ వారిని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు, చాలాసేపటి తరువాత కానీ అక్కడ గొడవ సద్దుకోలేదు. అప్పుడు కూడా సిద్ధార్థ ప్రోద్బలం వల్లనే జరిగింది.

“కంగారు పడకండి, ఎవరికి కావలసినది వాళ్లకి లభిస్తుంది, ఈ గొడవలన్నీ ఏ ఉద్దేశంతో జరుగుతున్నాయో నేను అర్థం చేసుకోగలను. మధ్యలో ప్రసాద్ గారిని ఎందుకు లాగుతున్నారు. ఈ విషయం బయట ఎవరైనా మీడియావారికి లేదా ఇంకెవరికైనా తెలిసింది అనుకోండి మనం ఇప్పటివరకు సాధించినది అంతా వృథాగా పోతోంది. ఆ తరువాత మనల్ని ఇంతకాలం సపోర్ట్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడం నావల్ల, మీవల్లా మరెవరివల్లా కాదు. ఇది గ్రహిస్తే మన అందరికీ మంచిది. లేదంటే ఇందాక భూషణరావు గారు అన్నట్లుగా గత చరిత్రే పునరావృత్తం అవుతుంది” సిద్ధార్థ చెప్పడంతో అక్కడ ఆ గొడవ సద్దుబాటు అయ్యింది.

అయితే పార్టీలో ముసలం ఇలానే ఉంటుందని అతను ఊహించగలిగాడు, అందుకే దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా తను ముందుగానే చేసుకున్నాడు, ఎవరెవరిని ఏ విధంగా సంతృప్తి పరచాలో అతనికి తెలుసు, అక్కడితో ఆనాటి  సభ ముగిసింది.

***

“ఇంకెన్ని చోట్ల వెతికితే నీకు సంతృప్తిగా ఉంటుంది చెప్పు” చిరాకుగా అడిగింది ఆ పాతికేళ్ళ అమ్మాయి, ఆమె తన స్నేహితుడు వంశీతో కలిసి విశాఖపట్నం ప్రదేశం అంతా దుర్గాభవానికి సంబంధించిన వివరాల కోసం వెతుకుతోంది. ఇప్పటివరకు చక్రధర్ తమకు ఇచ్చిన అడ్రెస్ ద్వారా చుట్టుపక్కల వాళ్ళదగ్గర నుంచి కొంత సమాచారం సేకరించారు.

“వాళ్ళది విజయనగరం జిల్లా బాబూ, కాకపోతే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు, ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడూ తన తండ్రి గురించి ఆమె చెప్పడమే కానీ ఆయనను ఎవరూ చూసినది లేదు. సడెన్‌గా ఒకరోజు ఆయన మరిణించినట్లుగా ఆమె చెప్పింది. అంత్యక్రియలు కూడా విజయనగరం ఏరియాలో జరిగినట్లుగా ఆమె చెప్పడం ద్వారానే తెలిసింది.

ఆ తరువాత తన తండ్రికి విజయనగరం చేరువలో ఉన్న ధరణికోట ప్రదేశంలో ఒక స్థలం ఉందని దాన్ని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకున్నారని. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడం కోసమే ఆమె ఎప్పుడూ ప్రభుత్వంతోనూ, కలక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండేది” దుర్గాభవాని వాళ్ళ ఇంటిపక్కన ఉన్న ఒకళ్ళు చెప్పారు.

“ఆ స్థలం ఏరియా సర్వే వివరాలు ఏమైనా తెలుసా మీకు. ఆమె ఫేమిలీ ఫోటో లాంటిది ఏమైనా ఉందా”  అడిగాడు వంశీ.

 “ఆ వివరాలు అన్నీ తెలీదు బాబూ, కానీ ఆమె ఎప్పుడూ లాండ్ విషయాలు చూసుకునే బ్రోకర్‌ని సంప్రదిస్తూ ఉండేది. అతడిని కలిస్తే మీకేమైనా సమాచారం దొరకవచ్చు” చెప్పాడు ఆ పక్కింటి యజమాని.

సుదర్శన్‌కి చెందిన బ్యాక్ ఎండ్ మీడియాలో పని చేసే వంశీ, సంధ్య వీళ్ళిద్దరూ అతని దగ్గరున్న వాళ్ళలో తెలివైనవాళ్ళు, వాళ్ళిద్దరూ మంచి మిత్రులు మాత్రమే కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా టెక్నాలజీతో అధ్బుతాలు సృష్టించగలిగిన నేర్పు కలవాళ్ళు. అది మాత్రమే కాకుండా మొదటినుంచీ ప్రతాప్, సుకన్య, భూషణరావు వీరి గురించిన మొత్తం సమాచారం సేకరించడంలో వీరి కదలికల మీద అనుక్షణం కన్నువేసి ఉంచడంలో కీలకపాత్ర పోషించారు.

“ఇప్పటికి ఏమైనా ఎక్కువైంది చెప్పు సంధ్యా, బాస్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని మనకు చెప్పాడు కదా, పైగా మొన్న సిబిఐ ఆఫీసర్స్ వచ్చిన సమయంలో మనకు చూపించిన వీడియో ప్రకారం రేపు జరగబోయే అండర్‌గ్రౌండ్ మీట్‌కి వస్తున్న ఆ మిస్టర్ X ని పట్టుకోవడం ఎంతో ముఖ్యం, దీనివెనకాల కాన్‌స్పిరసీ ఉండే అవకాశం ఉంది అని సిబిఐ ఆఫెసర్స్ చెప్పడం మనం విన్నాము కదా.

కాబట్టి మనం ఎంత సేపు వెతికినా ఇంకా తక్కువే అవుతుంది. ఆ బ్రోకర్ గాడిని పట్టుకుంటే ఏమైనా సమాచారం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆ అమ్మాయికి సంబధించిన ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న లాండ్ యొక్క వివరాలు తెలుసుకుంటే ఆమె బాక్‌గ్రౌండ్ ఏంటి తనకి అది ఏ విధంగా సంక్రమించింది అని తెలుసుకోవచ్చు. ఆమె చెప్పేనది నిజమో అబద్ధమో తెల్చుకోలేకే కదా చక్రధర్ గారు ఆమెను గురించి వివరాలు తెలుసుకోమని మనకు చెప్పారు” అన్నాడు వంశీ.

ఇప్పుడు వాళ్ళిద్దరూ బైక్ పైన కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వెళ్తున్నారు. ఆ బ్రోకర్ ఆఫీసుకి వెళ్ళగా అతడు ఒక లాండ్ విషయమై కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళాడు అని చెప్పగా వాళ్ళిద్దరూ ముందూ వెనకా ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయారు. అతడు ఎక్కడున్నాడో కనిపెట్టి పరుగున అతని దగ్గరకు వెళ్లి తన సెల్ఫోన్ లో ఉన్న దుర్గాభవాని ఫోటో అతనికి చూపించాడు వంశీ.

“ఆ ఈమె నాకు తెలుసు సార్, ఆమె లాండ్ ఇష్యూ నాతోనే చెప్పేది. దాని కోసం మేము కూడా చాలా ప్రయత్నం చేసాము. కానీ విషయం ఏంటంటే ఆ లాండ్‌కి సంబధించిన సరైన రికార్డ్స్ ఎవరికీ దొరకలేదు. ఆక్చువల్‌గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నికొన్ని ఏరియాలు విజయనగరం జిల్లాలోకి కొన్నికొన్ని ఏరియాలు విశాఖపట్నంలోకి మార్చేసారు సార్, మేము ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు కానీ ఒకవేళ మీరు విజయనగరం వెళ్ళగలిగితే మీకు అక్కడ ఈ లాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.” చెప్పాడు అతను. వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు

“పద ఇంకేమి చేస్తాం, వెళ్లక తప్పుతుందా” సరదాగా అన్నది సంధ్య. అప్పుడు సాయంత్రం ఆరు గంటలు అవుతున్నది.

“నో సంధ్యా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సీరియస్. నేను ఇప్పుడే ఈ విషయం మన బాస్ సుదర్శన్ గారికి చెప్తాను. అస్సలే ఆయన ముంబైకి వెళ్ళే హడావిడిలో హైదరాబాద్‌లో ఉన్నారు. మనం ప్రతీ మూమెంట్ ఆయనకు ఇన్ఫార్మ్ చెయ్యాల్సిన అవసరం ఉంది, నాకెందుకో వారికి ఇది ముఖ్యమైన ఉపయోగపడే సమాచారం అవుతుంది అనిపిస్తోంది”  అలా చెప్తూనే సుదర్శన్‌కు ఫోన్ చేసాడు వంశీ, రింగయ్యిన వెంటనే లైఫ్ చేసాడు సుదర్శన్

“ఆ చెప్పు వంశీ” అతనిప్పుడు చక్రధర్ ఇంకా జగదీశ్వరరావులను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు వాళ్ళు ముగ్గురూ కలిపి అదే రోజు సాయంత్రం ఫ్లైట్‌కి ముంబై వెళ్తున్నారు.

“సార్ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దుర్గాభవాని గురించి ఎంక్వయిరీ చేస్తున్నాం సార్, ఆమె చక్రధర్ గారు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌లో కొంచెం అవకతవకలు ఉన్నట్లు అనిపిస్తోంది, ఆమె తండ్రి గురించి మాకు కొంచెం అనుమానం ఉంది సార్, ఆమె లాండ్‌కి తన తండ్రి మరణానికీ ఏదో రిలేషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. మేము ఇప్పటివరకూ తెలుసుకున్న సమాచారం అంతా మీకు మెయిల్ చేస్తాను. మేము రేపు విజయనగరం వెళ్తాం సార్” చెప్పాడు వంశీ. అవతలి వ్యక్తి ఏమంటాడో అని ఆసక్తిగా అతనివైపు చూస్తోంది సంధ్య

“యా ఒకే నో ప్రాబ్లం, గుడ్ జాబ్ వంశీ. బాగా ఎంక్వయిరీ చెయ్యండి, బట్ నాకెందుకో ఈ విషయం మీరు మన మిగతా స్టాఫ్ ఎవరితోనూ షేర్ చేసుకోకుండా మీరిద్దరే తెలుసుకుంటే బెటర్ అని అనిపిస్తోంది. గణేష్ కేసులో దుర్గాభవాని మనకి ఇన్సిడెంట్ సైట్‌లో దొరకడం వలన నాకు కొంచెం అనుమానం కలుగుతోంది. ఎనీవే బెటర్ టూ బీ కేర్‌ఫుల్” ఫోన్ లోనే వంశీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాడు సుదర్శన్.

“ఒకే సార్ మేము మాగ్జిమం సేఫ్టీ మెజర్స్ తీసుకునే వెళ్తాం సార్. త్వరలోనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను సార్. ఉంటాను” అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసాడు వంశీ. సుదర్శన్ నేరుగా జగదీశ్వరరావు ఇంటికి చేరుకున్నాడు, తను వెళ్లేసరికి చక్రధర్ కూడా అక్కడే ఉన్నాడు. వారు ముగ్గురూ తన కారులో శంషాబాద్ వైపు వెళ్తున్నారు.

“ఏంటి సార్ వచ్చేముందర ఏదో మాట్లాడుకుంటున్నట్లు ఉన్నారు” అడిగాడు కార్ డ్రైవింగ్ చేస్తున్న సుదర్శన్. ఆ ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు వివిధ సుకన్య ఇంకా ఆ కేసుకి సంబంధం ఉన్న మిగిలిన కేసుల విషయమై తన నుండి సహాయం కోరిన దగ్గరనుంచీ అతనికి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వాళ్ళు ముగ్గురూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

“ఏమున్నాయి, మన కేసు గురించి కాకపోతే మన రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకునేది దగ్గరలో ఉన్న ఎలక్షన్స్ గురించే కదా” చెప్పాడు జగదీశ్వరరావు. ఆయన డ్రైవింగ్ చేస్తున్న సుదర్శన్ పక్కన కూర్చున్నాడు, వెనక సీట్లో ఉన్న చక్రధర్ అంగీకారసూచకంగా తల ఊపడం గ్రహించి చిన్నగా నవ్వాడు సుదర్శన్.

“ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సార్, మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన ముఖర్జీ గారు పార్టీ వ్యవహారాల పట్ల అసంతృప్తిగా ఉన్నాడట. ప్రియాంకను చేర్చుకోవడం, భూషణరావు పార్టీ నుండి వైదొలగి జె.హెచ్.లో చేరడం, ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా తాను తప్పుకుని హనుమంతరావుని ప్రకటించడం ఇవన్నీ పార్టీకి నష్టం చేకూరుస్తాయని అభిప్రాయంలో ఉంది హైకమాండ్ వారు.

రాహుల్ శృతి మించి పోతున్నాడని అతడిని తప్పించి వేరొక కాండిడేట్‌ను అధ్యక్షుడిగా నియమించాలి అని చూస్తున్నారు. ఇది పార్టీకి ఎంతో సన్నిహితుడైన నాకు తెలిసిన ఒక వ్యక్తి ఢిల్లీ నుండి పంపిన సమాచారం” చెప్పాడు సుదర్శన్.

“దానివల్ల వారికి పెద్దగా ఉపయోగం లేదని అందరికీ తెలుసు కదా మిస్టర్ సుదర్శన్. ఎందుకంటే రాహుల్‌ని మించిన పాపులారిటీ ఉన్న వ్యక్తి వారికి ఈ సమయంలో దొరకడం అసాధ్యం. సో రిస్క్ తీసుకుంటే కనుక వాళ్ళకు నష్టం జరగడం ఖాయం. ఏమంటారు” అడిగాడు జగదీశ్వరరావు.

“ఏమో సార్, ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలన్నిటిలోనూ రాహుల్ పాత్ర పెద్దగా లేదని, పైగా కేంద్రంతో సంప్రదించకుండా టెరిటోరియల్ టాక్సెస్ బిల్‌ను మూవ్ చెయ్యడం వల్ల పేదల్లో తమ ఇమేజ్ కొద్దిగా పడిపోయిందని వారు భావిస్తున్నారు. అందుకే ఒక కొత్త అభ్యర్ధి కోసం వెతుకుతున్నట్లుగా రూమర్, రూమరేంటి దాదాపు కన్ఫర్మ్ అనుకోండి. నాకు తెలిసి రేపే అఫీషియల్ న్యూస్ కూడా రావచ్చు” నమ్మకంగా చెప్పాడు సుదర్శన్.

అతనివైపు చూసి సాలోచనగా తలూపాడు జగదీశ్వరరావు. ఇంతలోపు ఎయిర్‌పోర్ట్ రావడంతో వారిమధ్య మాటలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇంకొక గంటలో ఫ్లైట్ ఉందని తెలుసుకుని దానికోసం వెయిట్ చేస్తున్నారు ముగ్గురూ.

“మరి ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ ఏమి చేస్తాడు అంటారు. ఈ పొలిటికల్ సర్కిల్ అంతా మీకు బాగా పరిచయం ఉంటుంది. వారు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి” కొంతసేపు పోయిన తరువాత అడిగాడు జగదీశ్వరరావు. చక్రధర్ ఏమీ మాట్లాడకుండా వారిద్దరి సంభాషణ నిశ్శబ్దంగా ఆసక్తితో వింటున్నాడు.

“ఒకవేళ హైకమాండ్ నేను చెప్పినట్లుగా అదే నిర్ణయం తీసుకున్న పక్షంలో రాహుల్ ప్రజల్లో తనకున్న సపోర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ నుండి బయటకి వచ్చేసి సొంత పార్టీ పెట్టినా లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. అతని వెనక చాలామంది రావచ్చు అని నా అభిప్రాయం. అప్పుడు రాహుల్ కోరిక మీదటే  హనుమంతరావుగారిని ముఖ్యమంత్రిని కూడా చెయ్యవచ్చు” తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు సుదర్శన్.  అదే నిజం అయ్యే అవకాశం ఉందని అతనితో పాటుగా ఉన్న ఇద్దరూ కూడా అభిప్రాయపడ్డారు.

ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ముగ్గురూ చెకిన్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకుని ఫ్లైట్‌లో వెళ్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యిన దగ్గరనుంచి ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నాడు.

కొంతసమయం తరువాత సడెన్‌గా జగదీశ్వరరావు అడిగాడు “మరి సిద్ధార్థ సంగతేంటి, లోకమంతా తెలుసు కదా రాహుల్, సిద్ధార్థ, ప్రియాంక వీళ్ళు ముగ్గురూ స్నేహితులనీ. అప్పటివరకూ ఆమె వెన్నంటి ఉన్న సిద్ధార్థ, ఆమె  రాహుల్‌తో చేరిన మరుక్షణంలో ‘యూ’ టర్న్ తీసుకుని ఆమెకు ఎందుకు వ్యతిరేకం అయ్యాడు. అంతేకాకుండా తన స్ట్రాటజీ కూడా పూర్తిగా మార్చేసి పరిశ్రమలు అవీ ఇవీ అంటూ భూషణరావుని తమతో చేర్చుకున్నాడు” అర్థం కానట్లుగా అడిగాడు జగదీశ్వరరావు.

“ఏమో సార్ ఈ పోలిటిక్స్‌లో ఏ మూమెంట్ ఎలా ఉంటుందో ఎవరు మాత్రం గెస్ చెయ్యగలరు చెప్పండి. అంతా ఆపర్ట్యునిజం మీద ఆధారపడి నడుస్తుంది, ఎవరి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటో మనకి ఆఖరివరకూ తెలీదు. కానీ ఈ సిద్ధార్థ విషయం నాకు మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతడు కొన్నిసార్లు నన్ను కాంటాక్ట్ చేసాడు. నేను కొన్నిసార్లు అతడిని కాంటాక్ట్ చేసాను.

ఒక్కోసారి ఆయనకీ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పెద్దగా రెస్పాండ్ అవ్వరు. ఒక్కోసారి తనంతట తానే స్పెసిఫిక్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఏంటో చాలా విచిత్రమైన క్యారెక్టర్” చెప్పాడు సుదర్శన్.

“అవునా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది” కుతూహలంగా అడిగాడు జగదీశ్వరరావు.

“అసలు నిజానికి ఈ విషయం మీకు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారేమో కూడా, ఎనీ వే వరదరాజన్ మీద భూషణరావు అటాక్ ప్లాన్ చేసినట్లుగా తెలుసుకున్న నేను అది సిద్ధార్థకు చెప్పాను ఆయనేమైనా రియాక్ట్ అవుతాడేమో అని, కానీ అదేమీ చెయ్యకుండా ఆయన సైలెంట్‌గా ఉండడంతో అతడు ఉద్దేశపూర్వకంగా వరదరాజన్ మీద ఎటాక్ జరగాలి అని కోరుకున్నాడేమో.

నెక్స్ట్ టైం జోగేశ్వరరావు గారు చాపర్ క్రాష్ సమయంలో ఆక్సిడెంట్ స్పాట్‌లో ఆయన బాడీకి సంబంధించిన వీడియోస్ కావాలని అడిగాడు. నాకు విచిత్రంగా అనిపించినా నేను అతనికి ఆ రెస్క్యూ టీంలో ఉన్న ఒక ఇన్ఫార్మర్ ద్వారా ఆ వివరాలు అందించాను” తమ కేసు గురించి వినిపించేసరికి చక్రధర్ కూడా అలర్ట్ అయ్యాడు.

 “అవునా వీడియోస్ అడిగాడా, దానితో అతనికి అవసరం ఏమై ఉండచ్చు” తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకి అన్నాడు జగదీశ్వరరావు.

“సార్ అదే సమయంలో రెండు రోజుల వ్యవధిలో నకునారెడ్డిగారు కూడా మరణించారు కదా సార్” అన్నాడు చక్రధర్ అవున్నట్లుగా తలూపాడు ఆయన. ఆయన మదిలో ఏదో మిణుకుమిణుకు మంటున్న భావన కలిగింది.

“ఆ సమయంలో దుర్గాభవాని ఎక్కడుండేది ఒక్కసారి కనుక్కో” చెప్పాడు జగదీశ్వరరావు. ఆయన వంక ఆశ్చర్యంగా చూసాడు చక్రధర్, వీరిద్దరివంక ఉత్సుకతతో చూస్తున్నాడు సుదర్శన్. తాము ఈ కేసులను సాధించడానికి దగ్గరలో ఉన్నట్లు అనిపించింది వారికి. ముగ్గురూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండగా ఫ్లైట్ గమ్యస్థానానికి చేరుకుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here