[dropcap]త[/dropcap]ను కేరాఫ్ గానే ఉంది
తండ్రిచాటు బిడ్డగా డాటరాఫ్‌గా పెరిగింది
బాల్యం మజిలీ దాటగానే
యవ్వనపు నాలుగురోడ్ల కూడలిలో
ఇష్టపడ్డ అక్షరాల చెలిమికి కష్టంగా కటీఫ్ చెప్పి
అనుబంధాల అందాల వేదికపై
జతగాని సహచర్యానికి జతకట్టుకుంది
ఏడడుగుల ఒప్పందంతో
“వైఫాఫ్ సో అన్డ్ సో” గా కొత్త అడుగు వేసింది
అసలు పేరు తనదేదో మరిచిపోయి
“మిసెస్ సో అన్డ్ సో” గా మారిపోయింది
పిల్లల తల్లిగా “మదర్ ఆఫ్” మాటను
మర్యాదల ముత్యాలమాలగా మెళ్ళో వేసుకుంది
ఇల్లు మారినా, ఇంటిపేరు మారిపోయినా
ఇంకా తను కేరాఫ్ గానే ఉండిపోయింది
మస్తకంలో మెదులుతూన్న
పుస్తకాలపై ప్రేమ పెల్లబికిందో ఏమో
అప్పుడెప్పుడో అటకెక్కించిన
అక్షరాలతో అప్పటి ఆనాటి చెలిమిని
ఆలా అలా పునరావృతం చేస్తూ
పదాలను పడుగూ పేకలగా పేర్చి
మాటల బంగారు వెండి జరీ బూటాలతో
వాక్యాల కొలతల కొంగొత్త డిజైన్లతో
అలంకారాల అద్దకం రంగుద్దిన దారాలతో
మానసం అనెడి మనోహరమైన మగ్గంపై
కవితల రవికలు రమణీయంగానూ
కట్టుకథల పట్టుచీరలు కమనీయంగానూ నేస్తోంది
అలవోకగా రచనల కలనేతలు చేస్తోంది
కాలగమనంలో
తను రాసిన రచనల రాసి పెరిగి పెరిగి
వాసి మరింత మెరిసి మెరిసి
తన పేరు పదిమందిలో పరిచయం అయ్యింది
ఇంటిపేరును వెంటేసుకుని ఓ ప్రతిష్ఠగా మారింది
కేరాఫ్ గా ఉన్న నేమ్ ప్లేటుపైని పేరు
కడుగబడి శుభ్రంగా తుడువబడి
కవయిత్రిగా రచయిత్రిగా
కొత్తగా తళతళలాడేలా రాయబడింది
తిరగరాసుకున్న తన బతుకు పుస్తకంలో
తనవాళ్ళందరూ తన పేరు ముందు
సన్నాఫ్, డాటరాఫ్
ఇంకా హస్బెండ్ ఆఫ్ గా నిలబడి ఉన్నారు
మదరాఫ్, ఫాదరాఫ్, బ్రదరాఫ్ గా
మర్యాదతో పిలవబడ్తున్నారు
ఇప్పుడు …
ఇప్పుడు తన ఇంటివారందరికీ తనే కేరాఫ్.