[dropcap]వ[/dropcap]దలి వెళుతున్నా నేస్తమా
గుండె ఆవేదనని వర్షపు నీరు గా మార్చి
నా గురుతులని మిగిల్చి
నిన్ను వదిలి పోతున్నా మిత్రమా…..
మాట్లాడలేని నీ మౌనం
ప్రశ్నలకు సమాధానమీయలేను
నా వెంట రాకు
నిన్ను నేనెడబాయలేను
అనుమతినీయి బంధమా…..
ప్రకృతి మాత ఒడి చేర
బయలుదేరినాను
దారి లోన నిన్ను తలచి
కన్నీటి ధారనైనాను
ఆసరికే సగం కరిగిపోయాను
వెనుదిరగలేను…….
మనసు సాక్షి గా
మన బంధమె నిలువ గా
కారుమబ్బులు కమ్మనీ….
నిశీధి తనలో నను కలుపుకోనీ….
కలతపడకు ప్రియతమా…..
వెలుగునై నిన్నావరిస్తా
చినుకునై చిగురించే
పువ్వునై నిను పలుకరిస్తా…..
నను వెడలనీ నేస్తం
నను వెళ్ళనీ……