శివతాండవలక్ష్మి

2
4

[box type=’note’ fontsize=’16’] పరమశివుడు విభిన్న రసాలని తన మనసులో నిలుపుకుని వాటికనుగుణంగా అభినయింస్తున్నట్లుగానే మన జీవితంలో కలిగే సుఖదుఃఖాలూ, కష్టసుఖాలనే తాండవాన్ని ఆనందంగా ఉండి అభినయించగలగాలని పరిమి శ్రీరామనాథ్ ఈ వ్యాసంలో చెబుతున్నారు. [/box]

శివోపాసన భారతీయ సంస్కృతిలో పురాతనమైనది. ‘శివుడు’ అన్న వస్తువుని ఆధారంగా చేసికొని భారతీయులు సాధించిన బహుముఖీత తలచుకుంటే ఒడలు జలదరించకపోదు. అసలు భారతీయతే అంత – వైదికమైన ప్రతీవస్తువూ ఆసేతుహిమాచలం విస్తరించిన భిన్నత్వంలో కలగలిసిపోయి, నానావిధాల సొబగులు పోతుంది. ఆ వస్తువు అనే కాండం ప్రతీ ప్రాంతానికీ తన కొమ్మలను చాచి, రకరకములైన పండ్లు పండించి, ఏ ఫలాన్ని రుచిచూసినా మైమరపు కలిగిస్తుంది.

ప్రాచీన భారతదేశంలో ప్రకృతి ఉపాసన ఇతోధికంగా వెల్లివిరిసింది. భారతీయుల బుద్ధి మారాకులు తొడిగి  పంచభూతాలని భగవత్స్వరూపంగా దర్శించి ఉపాసించింది. వేదంలో ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని  మనకి ప్రధాన దేవతలుగా కనిపిస్తారు. అదేవిధంగా వేదప్రతిపాదితమైన శివతత్వం గ్రామాల వరకూ విస్తరించింది. శివుడు గిరిదేవతగా, ప్రకృతిలో భాగంగా పశుపతి రూపంలో మొదట ఉపాసించబడినట్లు తెలుస్తోంది.

[పశుపతి, మొహంజోదారో circa 2000 బి.సి]

శివుని ఆటవికరూప వర్ణనలు, కథలు మన వాఙ్మయంలో చాలా ఎక్కువ. శివుని పాశుపతమంత్రం అత్యంత సుప్రసిద్ధమైనది. భారవి కిరాతార్జునీయంలో శివుడు కిరాతుడిగానే కనిపిస్తాడు. ఆ లీలే మనోహరమైనది. మారేడు, వేప, నిమ్మ, పంచామృతాలు ఇత్యాది శివశక్తుల పూజలలో వాడటం ఎప్పటినుంచో వస్తున్నదే.

అలాగే, మన కళలకీ తొలిమానవులే ఆద్యులు. మానవుడు సంఘజీవియై చేసిన సల్లాపాలు, అంగవిన్యాసాలు లలితకళలకి తొలిరూపం. తాము ఉపాసించిన దేవతకై సమర్పణబుద్ధితో తమకి సొంతమైన వాటిని అర్పించడం కూడా సాంప్రదాయంగా వచ్చిన భారతీయ హృదయం.

శివాభినయము

భారతీయ విజ్ఞానమంతా ఉపాసనలో కలిసిపోయిందని చెప్పుకున్నాం కదా. సృష్టిని చూసిన భారతీయుల మస్తిష్కాలలో బయలుదేరిన ప్రశ్నలు , వాటికై వారు చేసిన దర్శనాలూ కూడా దేవతాత్మకమై వెలుగులీనాయి. భారతీయులు సర్వవ్యాపి అయిన శివుడిని నర్తన కళకి ఆద్యుడిగా దర్శించారు.

శివునికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే కదలనివాడు (సదా తిష్ఠతి అతః స్థాణుః) అని అర్ధం. ఆయనే నటరాజు కూడాను. ఏమాత్రమూ కదలనివానికి, కదలకుండా ఉండటం ఏమాత్రమూ కుదరని నాట్యమెలా కుదిరింది అంటే దానికి కారణం అమ్మవారు అని సమాధానం. ఆయన శక్తే ఆయనలోని పులకింతకీ; దరిమిలా సృష్టికీ కారణం. తదనుగుణంగానే శివునికి దేనితోనూ పొత్తుపెట్టుకోని ఉపాధిరహితమై, సర్వమూ తానే అయిన అవ్యక్తరూపమొకటీ;  లీలగా మాయోపాధి స్వీకరించి, వేటికీ లొంగక, స్వతంత్రుడై, సర్వసమర్ధుడై, సర్వాంతర్యామిగా ఉన్న వ్యక్తరూపమొకటీ కలిగాయి. చిహ్నరూపమైన లింగరూపమెలాగూ ఉండనే ఉన్నది. అవ్యక్తంగా ఉన్న శివుడు శక్తితో కలిసి వ్యక్తమై నాట్యానికీ, అభినయానికీ, కళకీ – అంటే అసలు వ్యక్తపరచడం అన్న మనోభావానికే ఆద్యుడిగా కనపడుతున్నాడు. దీన్ని మనోహరంగా వర్ణించిన ఈ శ్లోకాన్ని చూడండి –

జయత్యేకపదాక్రాంత సమస్తభువనత్రయః।

ద్వితీయపదవిన్యాస వ్యాకులాభినయః శివః॥ (రాజశేఖరుని కావ్యమీమాంస)

తన ఒక పాదముతో సమస్త లోకాలనీ ఆక్రమించి, రెండవ కాలిని ఎక్కడ ఉంచాలో తెలియక వ్యాకులమైన మనస్సుతో శివుడు అభినయం చేయవలసి వచ్చిందట! శివుడనే కాదు, నర్తనము మనయొక్క వివిధ దేవతోపాసనలలో చొచ్చుకుని పోయింది. మన దేవతలలో నృత్యం చేసే దేవతలు చాలా మంది ఉన్నారు. కృష్ణుడు, కాళీ, రేణుక,లక్ష్మి, మోహిని ఇత్యాది. కానీ నటరాజ విగ్రహాలు మాత్రమే ప్రధానంగా ఈ భావాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక పాదమే కింద ఆన్చబడి ఉన్నట్లు చెక్కబడినవి అనిపిస్తుంది.

(బాదామిలోని 18 చేతుల నటరాజు శిల్పము. ఇందులో మొత్తం 81 (9*9) భంగిమలున్నాయట)

ఈ సృష్టి అంతా పరమశివుడు వ్యక్తమై చేసిన అభినయమే అని మన పెద్దవాళ్లు దర్శించారు. ఆ శివాభినయానికే నృత్తము అని పేరు. ఆయన అవ్యక్తమైతే జ్ఞానము, వ్యక్తమైతే కళ. ఆ మహాకాలుడు కళాకారుడై, శూన్యమనే పలకమీద గీస్తున్న కళాఖండమే ఈ జగత్తు. రకరకాల పరిమాణాలలో విస్తరించి పొంగులు వారుతున్న ఈ బ్రహ్మాండమంతా శివుడి వివిధ భంగిమలు. ఆయన చేసిన వికటాట్టహాసాలే మహాశబ్దాలు. దానికి విశ్వమే వేదిక. ఆనందస్వరూపుడైన ఆయన వాంఛలే రకరకాల నిర్మాణాలు. ఆయనే అభినేత, ఆయనే ప్రేక్షకుడు (సృష్ట్యాదిలో ఇతరుల లేమి చేత). ఈ భయంకర విశ్వమూర్తిని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తమ శివతాండవంలోని నంది చేసిన నాందిలో అమోఘంగా వర్ణించారు –

కాష్ఠా ఆస్ఫోటయన్తం కహకహనినదైః భీషణైరట్టహాసైః

హస్తవ్యాక్షేపభంగైః ప్రసభమపద్రుతం వ్యోమ కుర్వంతముచ్చైః।

పాదాఘాతైరధోగాం సవనగిరిగుహాకోటిముత్కంపయన్తం

ధిం ధిం ధిం శబ్దఘోరం హృది వికటమహాకాలమాలోకయామః॥

(తన భయంకరమైన కహకహరవాలతో కూడిన అట్టహాసాలతో దిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్నటువంటివాడినీ, తన చేతులని అటుఇటూ అలలలాగా కదుల్చుతూ ఆకాశమంతా అత్యున్నతంగా చేస్తున్నవాడినీ, తన పదఘట్టనలచేత క్రింద ఉన్న అడవులు, గుహల సమూహాలని కంపింపచేస్తున్నవాడినీ, ధిం ధిమ్మను ఘోరమైన రావాలు కలిగిన వికటమైన మహాకాలుడిని హృదయంలో దర్శిస్తున్నాము)

ఛటచ్ఛటనదచ్ఛిఖాపటలపోషణం భీషణం

బహిర్హుతవహం సృజన్విషమలోచనాఽభ్యంతరాత్।

ప్రమత్త ఇవ నృత్యతి ప్రచలితాఽఖిలాంఽగ స్స య

స్సమాఽఽపతతు మానసే తుహినశైలకూటోచ్ఛ్రితః॥

(ఛటచ్ఛటరవాలతో శిఖలని పోషిస్తున్న భయంకరమైన అగ్నిని మూడవకంటినుండి పుట్టిస్తున్నవాడూ, తన దేహంలోని ప్రతీ అంగమూ బాగుగా కదిలిస్తూ ప్రమత్తుడై నాట్యమాడుతున్న మంచుకొండలలో సముద్భవించిన శివుడు నా మనస్సులోకి వచ్చుగాక)

బధ్నన్ నృత్తాంఽతరాంతః ప్రగళితమహిపాఽఽకల్పితం పట్టబంధం

సంబాధోద్భిన్నఘోరశ్వసితహుతవహాఽఽదీప్త దంష్ట్రావిటంకమ్।

ప్రోత్తాలస్వైరధీరైః పదయుగలమహాఽఽస్ఫోటనైః కల్పయన్తం

నానాభంగాన్ లయాఽబ్ధౌ భ్రుకుటితనిటలం శూలినం సంస్మరామః॥

(తాండవకేళి మధ్యమధ్యలో జారిపోతున్న నాగరాజుతో తయారైన తన బాసికాన్ని సవరించుకుంటున్నవాడినీ, నర్తనలోని ప్రయాస వలన ఉస్సురని వదలబడిన భయంకరమైన అగ్నిసమానమైన నిశ్వాసలచేత ప్రకాశిస్తున్న తన కోరల అంచులు కలవాడినీ; స్వేచ్ఛగా సంభ్రమంతో కూడిన తన పాదాల కదలికల వల్ల పుట్టిన శబ్దాల చేత లయ అనే సముద్రంలో రకరకములైన అలలు సృష్టిస్తున్నవాడినీ, ముడిపడిన నొసలు కలిగిన శూలిని చక్కగా స్మరిస్తున్నాము)

ఈ భయంకరరావాలే శబ్దాలుగా వర్ణించబడినాయి. ప్రతీ జీవిలోనూ శబ్దము పరగా అంతర్లీనమైన నాదమై, పశ్యంతిగా ధ్వనిగామారి, హృదయస్థానంలో ఆలోచనతో కలిసి మధ్యమయై, వైఖరీ రూపంలో వాక్కుగా బయటికి వస్తున్నది. ఈ మార్పు శబ్దంలో కలిగి ప్రయాణిస్తున్నది. ఈ వాగ్రూపాలని చెప్పేదానికి ‘స్ఫోటసిద్ధాంతం’ అని వ్యాకరణంలో పేరు. ఈ స్ఫోటానికి కారణం ఆయన ‘ఆస్ఫోటన’లే. శివుని డమరుకనాదమే పాణిని వ్యాకరణానికి మూలకారణమని మనకి తెలిసిందే. శివుడు పదిహేను మార్లు చేసిన ఢమరుకధ్వనులని శబ్దాలుగా విని, పాణిని శివసూత్రాలని రచించి వ్యాకరణ నిర్మాణం గావించాడు. పాణిని చూపు మనకి అందేది కాదు. ఆయన ప్రతిభ పట్టుకుందామన్నా చిక్కనిది. చూసి విస్తుపోవలసిందే.

అది అలా ఉండగా, ఈ నటరాజతత్వం పాశ్చాత్యుల బిగ్ బ్యాంగ్ థియరీకి సిద్ధాంతపరంగా సరితూగుతుంది. అయితే ఆ సిద్ధాంతం స్థితినీ, లయాన్నీ చెప్పలేదు. కానీ శివుడు కాలస్వరూపుడై ఇప్పటికీ తన విభిన్న ముద్రల ద్వారా, సృష్టి, స్థితి లయాలను అభినయిస్తూనే ఉన్నాడు. (అవారిత తాండవకేళికి – పోతన)

తాండవము

తండువు చెప్పినదే తాండవము. శివుడు తన నృత్తాన్ని తండువుకి బోధించినట్లూ , ఈ తండువు శివుని ఆజ్ఞ మేర భరతునికి అంగహార్యముల ప్రయోగాలు చెప్పినట్లూ నాట్యశాస్త్రంలో చెప్పబడింది. తండువు శివుని ప్రథమగణాలలో ముఖ్యుడు. ఈ తండువూ, నందికేశ్వరుడూ ఒక్కరేనట! నందికేశ్వరుడు నాట్య ప్రవర్తకులలో ప్రముఖమైనవాడు. ఆయన శివుని నృత్తాన్నీ, పార్వతీదేవి లాస్యాన్ని వచిస్తూ అభినయదర్పణమనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథమే నాట్యశాస్త్రాన్ని మొట్టమొదట అక్షరబద్ధం చేసిన రచనగా మనకి దొరుకుతూంది.

ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్।

ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివమ్॥ (అభినయదర్పణం)

ఎవని శరీరము ఈ ప్రపంచమో, ఎవని వాక్కు సారస్వతమో, ఎవని ఆభరణాలు చంద్రనక్షత్రాది పదార్ధాలో అటువంటి సాత్వికుడైన శివునికి నమస్కారము అని అర్ధం. అభినయం మొట్టమొదట శివునికి సహజంగా వచ్చిన మనోవికారం.ఇక్కడే శివతాండవానికీ, మానవులు చేసే నాట్యానికీ భేదం గమనించవచ్చు. శివుడు తన అభినయంతో ప్రపంచాన్ని చూపుతుంటే, మనం ప్రపంచాన్ని మన అభినయంతో చూపిస్తూ ఉంటాము.

ఇప్పుడు కొంచెం పక్కదారి పడదాం.

బ్రహ్మదేవుడు నాలుగువేదాలలోనుంచి ఒక్కొక్క అంశాన్ని (ఋక్కు – పాఠ్యము, యజుర్వేదము – గీతము, సామము – అభినయము, అధర్వణవేదం – రసము) గ్రహించి, ‘నాట్యము’ అన్న కళని తయారు చేశాడు. దానికి నాలుగు కావ్య వృత్తులు వరుసగా – భారతి, సాత్వతి, కైశికి, ఆరభటి. ఈ విద్యని భరతునికి ఉపదేశించి, ఆయనయొక్క వందమంది కొడుకులకీ నేర్పించి వారితో ప్రయోగము చేయించమని ఆదేశించాడు. అందులో మృదువైన కైశికీ వృత్తి లేకపోవుటచేత, అప్సరసలని సృష్టించాడు. అతిపెద్ద సభా మంటపాన్ని ప్రయోగార్ధమై నిర్మింపజేశాడు. మొదట రాక్షసులని ఇంద్రుడు జయించిన సందర్భంగా దేవతలు దానవులని జయించటాన్ని ప్రయోగించాడు భరతుడు.

తరువాత శివునిముందు ఈ నాట్యకళని ప్రదర్శింపచేశాడు బ్రహ్మదేవుడు. అది చూసిన శివుడు సంతోషించి, ఈ ప్రయోగములో వైచిత్రిలేదనీ, ఈ నాట్యానికి తాను సంధ్యాకాలంలో చేసిన నృత్తము లోని వైచిత్రిని కలిపితే పరిపుష్టమవుతుందనీ అన్నాడట. భరతుని రీతి ఉద్ధతం కాబట్టి, తన నృత్తానంతరం పార్వతీదేవి సౌకుమార్యతతో చేసిన కరణాంగహారాలని కలపనీ, అప్పుడు అసలైన ‘భరతమ’నే పద్ధతి తయారవుతుందనీ చెప్పి తండువుని నియోగించాడట! అలా భరతనాట్యం పరిపూర్ణత సాధించిందని భరతుని నాట్యశాస్త్రం చెబుతోంది.

చివరికి ఇందులో కొన్ని రకాలు మనకి తయారయ్యాయి. సులభంగా వాటిమధ్య తేడాలు (ప్రయోగ దృష్టితో ) చూద్దాం –

  • నృత్తము –  తాం-తై, తకిట-తక అనే శబ్దాలకి అనుగుణంగా చేసే నర్తన
  • నృత్యము – పాటని ఆలపిస్తూ, అర్ధాన్ని అభినయిస్తూ చేసే నర్తన
  • నాట్యము – ఎక్కువ మనుష్యులు వేషాలు వేసుకుని కథని ప్రదర్శించడం
  • తాండవం – శివుడు ఆర్భటీ వృత్తితో ఉద్ధతంగా చేసిన నృత్తము
  • లాస్యం – పార్వతీదేవి కైశికీ వృత్తితో సుకుమారంగా చేసిన నృత్తము.

తెలుగులో శివతాండవము వర్ణనలు

ఇలా నాట్యానికి శాస్త్రప్రతిపత్తి కలిగిన తరువాత, అది పురాణకాలం నుండీ మొన్నమొన్నటిదాకా వివిధరీతులలో పాదులు కట్టబడి, అసంఖ్యాకరీతులలో పుష్పించినది. మార్గ (ప్రయోగ) భేదాలతో, దేశి భేదాలతోనూ దేవాలయాలలో, ఉత్సవాలలో, ఆస్థానాలలో, జనసమ్మర్దస్థలాలో శివతత్వం వివిధరూపాలు దాల్చి నర్తకుల శరీరాభినయాల ద్వారా అనేక రకాలుగా జీవించింది. కావ్యాలలో,పురాణాలలో, స్తోత్రాలలో శివతాండవలీల కవుల మనసులలో బింబించి, కొత్త హొయలు పోయింది.

ప్రళయకాలంలో మహోగ్రుడై శివుడు చేసిన తాండవాన్ని తెలుగులో చూపించినవాడు పాల్కురికి సోమనాథుడు. ఈ సోమనాథుడు తెలుగుకి పూర్వపుణ్యాలు పుచ్చి అబ్బిన అదృష్టము. ఎక్కడో మారుమూల జనపదాలలోని తెలుగువాడి నాడి కదలిక ఈతని గుండెచప్పుడు. ఈతని భాష మన జాతి నిలువుటద్దము. ఈతని మనస్సు శివభక్తి గని. ఈతని బుద్ధి మహోన్నతము, కవనధార గంగాప్రవాహము. ఈయన తన రచనలలో వాడిన పదాలు తెలుగింటి పెరడులో విరబూసిన జాజులై గుప్పుమన్న పరిమళంతో తెలుగుదేశపు ఎల్లల వరకూ విస్తరించాయి. వాటిని దోసిళ్లనిండా ముఖానికి తీసుకుని ‘ఆహా’ అని అనగలిగిన నాథుడే ఈరోజు లేకపోవడం బాధాకరం.

జైనసాహిత్యం ప్రబలంగా ఉన్న రోజుల్లో, ప్రాకృతంలాగా తెలుగు ప్రజలకి చేరువ చెయ్యాలని ద్విపద, రగడ ఇత్యాదులని ఎంచుకుని మనజాతికి స్వతంత్రపురాణాన్నీ, స్వతంత్ర చరిత్రనీ మొట్టమొదట అందించినవాడు పాల్కురికి సోమనాథుడు. ఆయన కృతులని చదివిన అప్పటి తెలుగుజాతి వెన్నులో శివభక్తి విద్యుచ్ఛక్తిలా పాకింది.

అతడు రచించిన బసవపురాణంలో నాట్యనమిత్తండి కథలో శివుడు ప్రత్యక్షమై, తాను చేసిన తాండవస్వరూపాన్ని తానే వర్ణిస్తాడు. ఒకసారి ఆ రచనని చదవండి –

ఇది తాండవాకారమెట్టులంటేని – ముదమున నాట్యాభిముఖుడనై నిల్చి

హో’ యని డమరుకంబొగి నొక్కమాటు – వాయింపఁదడవ సర్వము లయంబొందఁ

జరణంబుఁ దొంగలి చలనగాఁజేసి – పరగంగ నక్షత్రపంక్తులు డుల్ల

వినుతమహోద్రేకవీక్షణాటోప – ముననజాచ్యుతదేవముఖ్యులడంగ

మూవలగంటల మ్రోతకు వెఱచి – దేవి యున్న సగంబు ధృతిఁదన్నుఁగలయ

ఖ్యాతమహోద్ధతకరతాడనముల – నాతతదిక్తతి యవలఁజనంగ

వడీ మహోచ్ఛాసనిశ్వాసోపనిహతి – బడబానలంబార జలనిధులింక

గతిని మెట్టెడు పాదఘట్టనచేత – నతులధాత్రీతలంబది ధూళి గాఁగ

నురవడిమై జిఱ్ఱ దిరిగి నిల్చుడును – బొరిమాలి దిగ్గజంబులు వొడవడఁగ

గ్రక్కున జాఱి టంకారంబు చేత – నెక్కొన్న కులగిరుల్ నెఱిఁబొడి గాగ

నొందంగఁ బాదాగ్రమూఁది నటింప – గ్రిందటి కూర్మంబు గిజిగిజిగాఁగ

మహిజజటాచ్ఛటానిహతి నజాండ –  బహులకటాహంబు వరియలు గాఁగ

నురుకిరీటవిఘాతనోద్వృత్తిఁ జేసి – పొరిఁ దత్త్వసందోహములు వెల్లగిలఁగఁ

దాండవోద్ధతిఁ జేసి ధరియింపబడిన – దండిఫణీంద్రుండు దలరిరోఁజంగ

నిటురోఁజుచున్న ఫణీంద్రునూర్పులకు – స్ఫుటఫాలనేత్రాగ్ని భుగులననెగయ

వడి నెగసెడి నేత్రవహ్నిరోచులకు – జడలపైఁ జంద్రుఁడాసగమును గరఁగఁ

గలయ సుధాసూతి గరఁగిన కతన – బలువిడి నమృతంబు దల డిగి పఱవఁ

దల డిగి పఱతెంచు దత్సుధాపూర – మలరి ముంచుడు జీవములు వచ్చి యంత

నురమున శిరముననొగి గళంబునను – గరముల భూషణోత్కరములై వెలిఁగి

పరగు సురాసురబ్రహ్మాచ్యుతాది – వరకపాలావళుల్ శరణువేడుచును

బొబ్బలు వొడువంగఁ బొంగి యార్వంగ – నుబ్బి యాళతిసేయ నొగిఁ దాళగింపఁ

గ్రీడవట్రిల జతిగీతముల్ వాడ – నాడుదుఁ బ్రమథులు సూడఁ దాండవము

ఇది తెలుగుసాహిత్యములో విపులంగా చేయబడిన అతితక్కువ శివతాండవ వర్ణనలలో ఒకటి. తాండవమూర్తి చేతనే స్వయంగా తన లీలని వర్ణింపజేయడం ఇందులోని మరొక విశేషము. సంక్షిప్తంగా భావమిదీ –

‘నేను ఆనందముతో నర్తనోద్యుక్తుడనై ‘హో’ అనే ధ్వానముతో డమరుకాన్ని మ్రోగించడమే ఆలస్యముగా సర్వప్రపంచమూ లయాన్ని పొందగా, నా పాదాన్ని వాల్చి ప్రయోగం చేయగానే నక్షత్రమండలం రాలిపడగా, అత్యుద్రేకముతో చూసిన నా చూపుకి బ్రహ్మదేవుడూ, విష్ణువూ మొదలగు దేవతలు నాశనాన్ని పొందగా, నా నూపురసవ్వడులకి భయపడి పార్వతి తన మిగిలిన సగభాగం కూడా నాలో కలిసిపోవగా, నా హస్తముల దెబ్బలకి దిక్కులన్నీ అవతలికి వెళ్లగా, నా యొక్క భయంకరమైన నిట్టూర్పుల నుండి బడబాగ్ని జనించి సముద్రాలింకగా, నాదు పాదఘట్టనలకి భూమీతలమంతా పొడిపొడి అయిపోగా, నాయొక్క గిరగిరాభినయాల ధాటికి దిక్కులని మోస్తున్న ఏనుగులు నిర్జీవములవగా,  తటాలున నాచే చేయబడిన వింటినారి ధ్వనికి కులపర్వతాలు పొడులయిపోవగా, నాయొక్క కాలికొనని ఆనించి నటించిన కారణాన క్రిందనున్న తాబేలు నుజ్జునుజ్జవగా, నాయొక్క జటల దెబ్బలకి ఈ బ్రహ్మాండమనే కడవ ముక్కలవగా, నాయొక్క కిరీటవిఘాతముల దెబ్బకి తత్వాలు(భూతాలు, తన్మాత్రలు ఇత్యాదిగా) ఊడిలేవగా; నేను చేసే తాండవానికి ఊగి, నేను ధరించిన ఫణీంద్రుడు ఆయాసముతో నిట్టూర్చగా; ఆ నిట్టూర్పు గాలులకి మూడవకంటిలో ఉన్న అగ్ని భుగభుమని పైకి లేవగా; ఆ అగ్నికీలల వేడిమికి శిరస్సుపై ఉన్న చంద్రఖండము కరిగిపోవగా; కరిగిన చంద్రుడి అమృతం శిరస్సునుండి జాలువారగా; జీవము వచ్చి హృదయం పైన,శిరస్సుపైన, కంఠము మీదా, చేతుల మీదా ఆభరణాలై కాంతినొందగా; సకలదేవతల కపాలాలు శరణు వేడుతూ బొబ్బలు పెడుతూ, సంతోషంగా అరుస్తూ రాగాలాపన తో తాళము వేయగా, లీలాద్భుతమై జతులు, గీతాదులు పాడగా; ప్రమధగణాలు చూస్తూ ఉండగా నేను తాండవమాడుతాను. ‘

బసవపురాణమొక ఎత్తైతే, పండితారాధ్యచరిత్ర మరొక ఎత్తు. మతపరమైన అంశాలని పక్కనపెడితే భాషాపరంగా ఈ కృతి యొక్క తెలుగులోని దగ్గరితనం మరెక్కడా మనకి దొరకదు. ఆ భాష ఇప్పుడు లేదు. ఆ భాష ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఆ సొగసులు మనకి దక్కేవి కావు.ఆ ప్రయోగాలలోని అందం మనకి తెలియదు. పాతదనీ, అర్ధమవదనే మసి పూయబడి  దూరంగా జరిగిపోయింది.పండితారాధ్యచరిత్రలో సోమనాథుడు వాదప్రకరణంలో అతిఘోరమైన మహాతాండవలీలని బసవపురాణం కంటే విస్తారంగా, అత్యద్భుతంగా వర్ణించినాడు.

కొన్నికోట్ల అండాండాలని పొడిచేసి, దానిని విభూతిగా పూసుకొని, తనముందు లయమైన బ్రహ్మ, విష్ణు, రాక్షస మొదలైన వాళ్ల ఎముకలు, కపాలాలను మాలలుగా ధరించి, భరతుడు, నందీశ్వరుడు నాట్యశాస్త్రానుసారం తాళములు వేయగా, శివుడు నాట్యము చేయునట.

జగదండకోట్లు భస్మముగఁ దద్భూతి-నగజార్ధధరుఁడు సర్వాంగముల్వూసి

హరివిరించిపురోగమాసురాస్థులును- వరకపాలావళుల్ వలయుచోఁ దాల్చి

భరతోక్తినానాప్రబంధతాళములు-భరతనందీశులేర్పడనుగ్గండింప

నన్నెచోడునిచే విరచితమైన కుమారసంభవంలోని ద్వితీయాశ్వాసంలో దక్షుడు చేసిన శివ స్తవము కనపడుతుంది. ఇందులో ఐదు పద్యములలో శివతాండవమూర్తి ప్రశంస చేయబడింది. ఔచిత్యానుసారంగా కవి లయగ్రాహి, లయహారిణి అనే వృత్తములని ఎన్నుకొన్నాడు. ఇవి భావం తెలుసుకుని వదిలివేయదగ్గవి కావు. పద్యం చదివితేనే కవి పట్టుకున్న లయా ఆతని ప్రతిభా మనస్సుని పట్టుకునేది. రెండు పద్యాలు కింద చూపిస్తున్నాను –

ఫాలతల-విస్ఫురిత-లోలతర-భాసుర

విశాల-భయదాసుర-కరాళ

              నయనాగ్నిజ్వాలలొకొ? పింగళ జటాళి యొకొ?

నా బెరసి తూలి, దివి భూషణ చయాఽఽలుళిత

               దీర్ఘవ్యాళ నికరంబొకొ? కరాళి యొకొ?

నాఁదనరి క్రాల, వరనృత్య పరిలోలుఁడగు

శ్రీకంకాలధరు, నుజ్జ్వలకపాలధరు,

సన్నిశిత శూలధరు, నీశ్వరు, దయాళు నుతింతున్.

నుదుటి మీద ప్రకాశిస్తూ రాక్షసులపట్ల భయంకరములైన నయనాగ్ని జ్వాలలా? లేక గోరోచనపు రంగులోనున్న జడలా? అన్నట్లుగా వ్యాపించి చలించి, ఆకాశంలో అలంకారాలుగా కదిలిన పొడవైన పాముల గుంపులా? లేక చేతుల గుత్తులా? అన్నట్లు ఒప్పిదమయి ప్రకాశించగా గొప్పదైన నాట్యంలో ఎక్కువ ఆసక్తి కలవాడూ, అస్థిపంజర, కపాలాలని ధరించినవాడూ, దయాళువూ అయిన వాడి శూలాన్ని ధరించిన ఈశ్వరుడిని స్తుతిస్తాను.

కఱ గళము-ఘనఘనము-తెఱఁగనగ, నుఱికలును

                గఱడియలు-ద్రిపుదలును-గఱిడియలుఁ- బెల్లై

యుఱుము లన-వడిఁజెలఁగ, గొఱ నెలయుఁ-దనురుచులు

                మెఱుగు లన-దశదిశల-మెఱవఁదల-మీఁదన్

వఱలు సురనది దొఁలకి – నెఱిఁ జినుకులను గురియఁ

                 దఱిమికొని-తొలుమొగులు-తఱియనగ-నృత్యం

బొఱ నమరు-లలితగతి-మెఱయు శివు-డజుఁ డమరుఁ

                 డుఱుఫలము-లొసఁగు నని-యెఱిఁగి- నుతియింతున్.

మొదటి పద్యం ప్రళయతాండవ వర్ణన అయితే రెండవ పద్యంలో శివుడి తాండవము వర్షర్తువుతో ఉత్ప్రేక్షించబడింది. శివుని నల్లని కంఠం మేఘం లా ఉందట. తాండవసమయంలో మ్రోగించబడే వాద్యాల ధ్వనులు ఉరుములలాగా ఉన్నవట. శివుని శిరస్సుమీద ఉన్న చంద్రరేఖ కాంతులు మెరుపుల వలే ఉన్నాయట. తాండవ సమయంలో చిందుతున్న గంగానది నీటి చుక్కలు వర్షధారలాగా ఉందిట.

ఏమి కల్పన! ఏమి విరుపులు!

ఇక, ఎక్కువ శివకావ్యములు రచించి ధన్యత పొందిన శ్రీనాథుడు శివతాండవాన్ని తన కావ్యాలలో చాలా చోట్ల ఉటంకించాడు. ఉదాహరణకి భీమేశ్వర పురాణంలోని ద్వితీయ, తృతీయ చరుర్థ ఆశ్వాసాలలో శివుని తాండవ వర్ణన కనిపిస్తుంది.  పరమశివుడు త్రిపురాసుర సంహారం చేస్తూ తన వింటినారిని కటకాముఖమనే ముద్రతో పట్టెనట! సంహారానంతరం బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మొక్కుతూండగా మహదానందంతో తాండవం చేశాడనీ వర్ణించబడి ఉన్నది. వుడు తాండవమాడుతుంటే ఆయన శిరస్సున ఉన్న గంగ చిందుతూ ఆయన మెడలోని దండలలో తమలో తాము ఒరుసుకుంటూ ధ్వని చేస్తున్న పుర్రెలలోకి జారి, పడుతూ, ఊగుతూ, తప్పెటల వలె విచిత్రమైన ధ్వనులు చేసిందట! ఆ మూర్తి శ్రీనాథుని మదిలో ఇలా మెరిసింది –

ఆడెందాండవమార్భటీ-పటహ-లీలాటోప-విస్ఫూర్జిత-

క్రీడాడంబరముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ-

క్రోడా-ఘాత-కఠోర-కోటక-రుటీ-కోటీ-లుఠత్-సింధు-వీ

చీ-డోలా-పటలీ-పరిస్ఫుటతర-స్ఫీతధ్వని ప్రౌఢిమన్.

(కటకాముఖ ముద్ర)

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవము తెలుగులో వచ్చిన మహోత్కృష్టమైన రచన. ఇందులోని సాహిత్య సంగీతపరమైన అంశాలని కానీ, నాట్యంలోని అంశాలని కానీ తూచగలిగే తరాజు నాదగ్గర లేదు. ఒకటి మాత్రం చెప్పగలను – ఉద్ధతం (గర్వము, కఠినము) అనే లక్షణం ప్రధానంగా ఉన్న శివతాండవం నారాయణాచార్యుల గారి వల్ల తీపిని, సున్నితమైన భావాలనీ,

అమోఘమైన కల్పనలనీ పులుముకొని కొత్త మాధుర్యాన్ని సంతరించుకొన్నది. శివతాండవంలోని భేదాలని కూడా వర్ణించిన సమగ్రమైన తెలుగు రచన కూడా ఇదే. ఒక్క ఉదాహరణ చూపిస్తాను –

కొండలును కోనలును కోల్మొసఁగి తలలూప – కొనగోలువలికి సాకూతంబుగాఁ జూచి

డక్కచెక్కును గీటి డంబుగాఁ బలికించి – యెక్కడను దననాట్యమే మాఱుమ్రోయంగఁ

దానె తాండవమౌనొ! తాండవమె తానౌనొ! – యేనిర్ణయము దనకె బూని చేయఁగ రాకఁ

దామఱచి, మఱపించి తన్నుఁ జేరినవారిఁ – గాములీలగ మూఁడు గన్నులను సృష్టించి

ఆడెనమ్మా శివుడు! పాడెనమ్మా భవుడు!

కొండలూ కోనలూ తాండవంలో లీనమై తలలూచగా, తన డమరు యొక్క చెక్కిలిని గీటి ధ్వని చేస్తూ ప్రతిచోటా తన నాట్యమే ప్రతిధ్వనించగా, తానే తాండవమయ్యెనా లేదా తాండవమే తానయ్యెనా అన్న నిర్ణయం తానే చేయలేక తాను మైమరచి, ప్రేక్షకులను మైమరపించి శివుడు తాండవము చేసెనట!

శతకాలలోనూ, చాటువులలోనూ శివస్తవాలు లేకపోలేదు. ఒక అజ్ఞాతకవి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు –

సాటోపారభటీ-కఠోరతర-సంధ్యానృత్త-కేళీ-నిరా

ఘాట-ప్రౌఢ-నిరూఢ-గూఢ-పదరాట్-గ్రైవేయ-భాస్వత్-జటా

జూటాంతర్-విలుఠత్-తరంగ-సుమనస్-స్ర్రోతస్వినీ-నిర్జర-

వ్యాటీకోత్కట-చాటువాక్యఘటనన్-వర్ణించెదన్ శారదన్.

కావ్యాలలోనే కాదు, తెలుగు పాటలలోనూ, యక్షగానాలలోనూ, కథలలోనూ శివతాండవమూర్తి వివిధ భంగిమలు పోయాడు. శైవనాట్యకళారీతులు ఆంధ్రదేశంలోని జనపదాలలో, గ్రామాలలో బహువిధాల నాట్యమాడాయి. ప్రభలు, వీరనాట్యాలు (వీరభద్రనర్తన), వీరకోలలు, పోతురాజు నృత్యాలు, గరగలు, పేరిణీ ఇత్యాది అనేకమైన రూపాలలో ప్రకాశించాయి.  ఒకే నర్తకుడు శరీరానికి మధ్యలో తెరని కట్టుకుని సగభాగము శివునిగా, సగభాగం పార్వతీదేవిగా అలంకరించుకుని ఉద్ధతసుకుమారరీతులలో అభినయించే అర్ధనారీశ్వరనృత్యమున్నది. ఇవేకాక, దేవాలయాలలో ప్రత్యేకమైన శివనర్తనల ప్రయోగాలు ఒకనాటి తెలుగుదేశంలో విరివిగా ప్రదర్శింపబడేవి. వీరి ప్రతిభని, మనోపుష్టినీ ఇప్పుడు ఏమని వర్ణించగలం?

శివతాండవభేదములు

శివతాండవం ఆర్భటీవృత్తి ఉన్నా, ప్రచండత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. నాట్యశాస్త్రంలో ఈ విధంగా తాండవవిభజన జరిగింది.

ఔద్ధత్యం లోని స్థాయీ భేదాన్ని అనుసరించి శివతాండవం మూడు రకాలు:

  1. చండము
  2. ప్రచండము
  3. ఉచ్చండము

ప్రయోగభేదాన్ని బట్టి తాండవము ఏడు రకాలుగా కనిపిస్తుంది.

  1. ఆనందతాండవము: తన సృష్టిని చూసుకొని,ఆనందంతో సాత్వికుడై శివుడు చేసే తాండవము.
  2. ప్రళయతాండవము: ప్రళయసమయంలో మహాకాలుడు అత్యుగ్రుడై ప్రపంచాన్ని లయం చేసుకునే సమయంలో చేసే నాట్యము.
  3. సంధ్యాతాండవము: ప్రదోషకాలంలో ప్రతిరోజూ శివుడు చేసే తాండవం. ఈ తాండవవర్ణన చాలా చోట్ల మనం గమనించవచ్చు. దీనికి దేవతలందరూ ఆహూతులు. దీనికి బ్రహ్మదేవుడు తాళం వేస్తాడు. విష్ణువు మృదంగం మోగిస్తాడు. ఇంద్రుడు మురళీరవం చేస్తాడు. సరస్వతీదేవి వీణె పలికిస్తుంది. లక్ష్మీ, నారద, తుంబుర ఇత్యాదులు గానం చేస్తారు. శివుని తాండవానంతరం పార్వతీదేవి లాస్యాన్ని ప్రయోగిస్తుంది.
  4. కాళికాతాండవము: అజ్ఞానము, అవినీతి వంటి దుష్టశక్తులని నాశనం చేయడానికి శివుడు భద్రకాళీసమేతుడై చేసే తాండవం.
  5. విజయతాండవము: అసురులని నాశనం చేసినప్పుడు శివుడు చేసే తాండవం. ఇది త్రిపురాసుర, గజాసుర, ముయ్యకాసురాది రాక్షసులను సంహరించిన తరువాత శివుడు చేసినట్లు పురాణాల కథనం.
  6. గౌరీతాండవము: శివశక్తులు కలిసి చేసే నాట్యమే ఈ తాండవము. ఇది సృష్టికి చిహ్నము.
  7. ఊర్ధ్వతాండవము: శివునికీ పార్వతికీ నాట్యవిషయమై ఎవరు గొప్ప అన్న స్పర్ధ వచ్చినదట. ఇద్దరూ నాట్యాన్ని ప్రారంభించారు. దేవతలు తగువు తీర్చేందుకు వచ్చారు. శివుడు పార్వతిని ఓడించలేకపోయాడు. తన ఒక కాలుని నుదుటి వరకూ పైకి ఎత్తి వేరొకకాలిమీద నిల్చొని నాట్యం చేయడంమొదలుపెట్టాడట. ఈ పద్ధతి స్త్రీ అయిన పార్వతీదేవికి విరసంగా తోచి తన నాట్యాన్ని ఆపివేసిందట. శివుడు గెలిచాడు. ఈ తాండవానికే ఊర్ధ్వతాండవమని పేరు. శివునికి ఆ భంగిమ అత్యంత ప్రీతిపాత్రమైనది. దాని పేరు ‘నిశుంబిత’.
(‘నిశుంబిత’ భంగిమలో అయ్యవారు, నిశ్చేష్ట అయిన అమ్మవారు)

ముగింపు:

శివతాండవం మనకి ఇచ్చే సందేశం ఒక్కటే. తాను ఆనందరూపుడై ఉండి, పరమశివుడు విభిన్న రసాలని తన మనసులో నిలుపుకుని వాటికనుగుణంగా అభినయింస్తున్నట్లుగానే మన జీవితంలో కలిగే సుఖదుఃఖాలూ, కష్టసుఖాలనే తాండవాన్ని ఆనందంగా ఉండి అభినయించ గలగడం. ఈ ప్రపంచమొక నాటకరంగమని మహాకవి అన్నట్లుగా, ఈ జీవితాన్ని  చూస్తూ మన సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటూ బతకగలగడం. ఒక భక్తుడు భగవంతుడ్ని చేసిన ప్రార్ధన ఇది –

సంసారాఖ్యవిశాలనాటకగృహే సర్వాణి రూపాణ్యహో

ధృత్వాఽధోముఖయోనిజా యవనికా నిర్హృత్య నిర్గత్య చ।

సర్వజ్ఞస్య దయాకరస్య తవ దేవాగ్రే చిరాన్నృత్యతః

శ్రాంతస్యాఽపి మమాలమిత్యుచితవాగేకైవ విశ్రాణనమ్॥

ఓ దేవా! మాతృగర్భం నుండి జనించి, ఈ సంసారమనే నాటకగృహంలో కపటత్వంతోటి అనేక రూపాలు ధరిస్తూ, సర్వజ్ఞుడూ, దయాకరుడూ అయిన నీముందు చాలాకాలంనుండి నాట్యం చేస్తూ అలసిపోయాను. ‘ఇంక చాలు’ అన్న నీ మాటకోసమే నా ఎదురుచూపు.

When the Actor beateth the drum,

Everybody cometh to see the show;

When the Actor collecteth the state properties

He abideth in His happiness.

(ఎప్పుడైతే అభినేత మద్దెలను మ్రోగిస్తాడో

అప్పుడు అందరూ ప్రదర్శనను తిలకించడానికి వస్తారు.

ఎప్పుడైతే అభినేత తన సరంజామా అంతా సర్దుకుంటాడో,

అప్పుడతడు తన పరమానందంలో వసిస్తాడు.)

ఈ ప్రపంచంలో అందరికీ మనశ్శాంతి దొరకాలి. దానికి మానవుడికి నాట్యవిద్య దోహదపడాలి.

ఉపయుక్త గ్రంథసూచి:

  1. నాట్యశాస్త్రము, భరతముని
  2. బసవపురాణము, పాల్కురికి సోమనాథుడు
  3. పండితారాధ్యచరిత్ర, పాల్కురికి సోమనాథుడు
  4. నృత్తరత్నావలీ, జాయపసేనాపతి, జమ్ములమడక మాధవరామశర్మ(అను)
  5. శివతాండవము, పుట్టపర్తి నారాయణాచార్యులు
  6. భీమేశ్వరపురాణము, శ్రీనాథుడు
  7. కుమారసంభవము, నన్నెచోడుడు
  8. The dance of Shiva, ఆనంద కుమారస్వామి
  9. ఆంధ్రనాట్యం-గిరిజన, జానపదనృత్యాలు నటరాజ రామకృష్ణ
  10. నర్తన బాల, నటరాజ రామకృష్ణ
  11.  Google Images

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here