కథల్లో స్త్రీ స్వేచ్ఛ, నైతిక విలువలు

0
4

[box type=’note’ fontsize=’16’] “శాస్త్రీయమైన, హేతుబద్దమైన ఆలోచనలు సాహిత్యంలో రావాలంటే కథనే బలమైన సాధనంగా ఎంచుకోవాలి. దీనికి రచయితకి సరైన ప్రాంపంచిక ధృక్పథం అవసరమౌతుంది” అంటున్నారు ఎం.కె. కుమార్కథల్లో స్త్రీ స్వేచ్ఛ, నైతిక విలువలు‘ అనే వ్యాసంలో. [/box]

నేపథ్యం

[dropcap]క[/dropcap]థ బలమైన సాహిత్య ప్రక్రియగా వ్యక్తమైన తర్వాత కథల్లో కథనం, శిల్పంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. కథ చివర్లో ఒక కొసమెరుపుతో కథను ముగించడమనే సాంప్రదాయక పరిమితిని కథ ఎప్పుడో దాటింది. జీవిత శకలంలోని అత్యంత సూక్ష్మమైన విషయాన్ని కథ ద్వారా కథా రచయిత చెప్పగలుగుతున్నాడు. అందువల్ల కథకు పాఠకుల సంఖ్యపెరిగింది. కథల్లోని ఈ కొత్త మలుపుల వల్ల కథా రచయితకు సూక్ష్మమైన పరిశీలనా దృష్టి, చారిత్రక అంశాల పట్ల అవగాహన కావలసి వచ్చింది. తెలుగులో గురుజాడ అప్పారావు 1910లో దిద్దుబాటు అనే తొలి ఆధునిక కథ రాశాడని విశ్లేషకులు భావిస్తున్నారు. కథ ఎంతో ప్రాచీనమైనప్పటికీ కథకు వుండ వలసిన ప్రాధమిక లక్షణాలు దిద్దుబాటు కథకు వున్నాయని విమర్శకుల భావన. అందుకే దీన్ని తొలి ఆధునిక కథగా గుర్తిస్తున్నారు. మొదట్లో తెలుగు కథలన్నీ సంస్కృత సాహిత్యం నుండి అరువు తెచ్చుకున్నవే. తొలితరం కథల్లో బ్రాహ్మణ భావజాలం, మతం, భక్తి, శృంగారం ఎక్కువుగా వుండేవి. సామాజిక అంశాల సృజన తక్కువుగా వుండేది. దిద్దుబాటు కథ వాడుక భాషలో వుండటం వల్ల కూడా ఇది ఆధునిక కథ అయింది. రచయిత స్వరం, పాత్రల స్వరం ఒకటిగా వుండటం ఇందులో గమనించదగిన విషయం. చరిత్రలోని ఒక సంఘటనలో, ఒక కాలంలో వున్న పాత్ర స్వభావాన్ని, అంతర్గత, బాహ్య పరిస్థితులతో ఆ పాత్ర సంఘర్షణను చిత్రీకరించడం ఆధునిక కథల్లో ఎక్కువుగా జరిగింది.

తొలితరం కథా రచయితలుగా చెప్పుకొంటున్న గురుజాడ, చలం, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి ఆధునిక కథల్లో విప్లవం తీసుకొచ్చారు. స్త్రీల జీవితాలను, నైతిక విలువల గురించి కొత్త కోణాలను ఆవిష్కరింపజేశారు. కథ మనుగడకు దాన్ని పోషించేవాళ్ల అవసరం వుంది. తెలుగు సాహిత్యం కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువుగా రావడానికి అక్కడ పోషకులు వుండటమే ప్రధాన కారణం. కథా సాహిత్యం, తెలుగు పత్రికలు కూడా ఎక్కువ ఈ కోస్తా జిల్లాల నుండి వెలువడ్డాయి. సంపదలో మిగులు కోస్తా జిల్లాలో ఎక్కువ వుండటం వల్ల సాహిత్యపోషకులు పెరగడం, ఎక్కువ సాహిత్య ఉత్పత్తికి దారితీసింది. కరువులతో, వరదలతో దారిద్య్రం తాండవిస్తున్న తరుణంలో బ్రిటీష్‌ ప్రభుత్వం వరద నీటిని నిల్వచేయడానికి చర్యలు చేపట్టింది. దక్షిణాది ప్రాంతం ధాన్యాగారంగా, పాడిపంటలతో తులతూగే విధంగా గోదావరి జిల్లాలు రూపొందాయి. 1852లో ధవళేశ్వరం, 1855లో కృష్ణానది మీద ఆనకట్టలు కట్టండం వల్ల రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో పొలాలకు నీళ్లు దొరికాయి. వ్యవసాయ ఉత్పత్తి ఇతోధికంగా పెరిగింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. విలాసవంతమైన జీవనానికి ఒక వర్గం అలవాటు పడింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ దేశంలోకి తీసుకువస్తున్న కొత్త వస్తువులు, ఆధునిక విలువలు, పద్దతులును ఈ శిష్టవర్గం నేర్చుకుంది. అలాగే మెకాలే తీసుకువచ్చిన ఇంగ్లీషు చదవుల పట్ల వ్యామోహం పెరిగింది. వ్యవసాయంలో వచ్చిన మిగులు పంట పొలాల మీద పెట్టడం ఆరంభించారు. భూమి సరుకుగా మారింది. వ్యవసాయం మిగలు సంపదను ఈ జిల్లాల్లో ఎక్కువ సృష్టించింది. అప్పుడు బుద్దిజీవులు రాజకీయం, కళలు, సంస్కృతి, సాహిత్యం లాంటి వాటిపై దృష్టి ఎక్కువుగా సారించారు. తీరిక వేళల్లో పత్రికలు చదవడం అలావాటై, రాజకీయ చర్చలు, సాహిత్య చర్చలు చేయడం సమాజంలో హౌదాగా మారిపోయింది. పాశ్చాత్యులు తీసుకొచ్చిన ఆధునికత హిందూమతంలోని కొన్ని అనాచారాలను, మూఢనమ్మకాలను వ్యతిరేకించడానికి ఉపయోగపడింది.

ఉనికిలో వున్న విలువలలో గందరగోళం వుందని, వీటిని కొంతమేరకైనా మార్చాల్సి వుందని కొంతమంది సంఘసంస్కర్తలు అభిప్రాయపడ్డారు. భక్తి ఉద్యమాలు ఈ క్రమంలోనే ఊపందుకున్నాయి. బ్రహ్మ సమాజం లాంటివి ఏర్పడి ప్రజలలో చైతన్యాన్ని పెంచడానికి కృషిచేశాయి. సంపదను కల్గిన శిష్టవర్గానికి చెందిన విద్యావేత్తలే ఈ సంస్కరణోద్యమాలకు శ్రీకారం చుట్టారు. కోస్తా ప్రాంత రాజులు సాహిత్యానికి పెద్ద పీట వేశారు. సంపదలోని మిగులు మనుషుల్లో సృజనాత్మకతను పెంచడానికి దోహద పడుతుంది. మరోవైపు సాహిత్య పిపాస సంఘంలో మనిషికి గౌరవం తెచ్చిపెట్టింది. బ్రాహ్మణ, సంపద వర్గమే సాహిత్యానికి పెద్దపీట వేసింది. సాహిత్యమంతా వారి చేతుల్లో బంధీ అయింది. కింది, అట్టడగు వర్గాల సాహిత్యమంతా మౌఖికంగా వుంది. ఆ సాహిత్యాన్ని అందుకోవడంలో శిష్టవర్గం నిర్లక్ష్యం వహించింది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను లేవనెత్తారు. బ్రహ్మసమాజం, విగ్రహారాధన నిషేధం, ఏకోశ్వరోపాదన లాంటి వన్నీ మతంలోని భిన్న పార్శ్వాలను చర్చకు పెట్టాయి. సతీసహగమనాన్ని వ్యతిరేకించడానికి కావలసిన సామాజిక పరిస్ధితులు అప్పటికే ఆ కాలంలో వున్నాయి. వితంతువుల పట్ల చిన్నచూపు తగదని చెప్పడంతో పాటు పత్రికలను నడిపి సాహిత్యాన్ని కందుకూరి ఇతోధికంగా సృష్టించాడు. మరోవైపు ఇంగ్లీషు విద్య తీసుకొచ్చిన కొత్త విద్యావంతులు గ్రాంధిక భాషలో వున్న తెలుగు సాహిత్యంలో వాడుక భాష రావాలని భావిరచారు. వీళ్లమీద ఉత్తరభారతదేశానికి చెందిన రామమోహనరాయ్‌, విద్యాసాగర్‌ లాంటి సాహిత్యవేత్తలు ప్రభావం వుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వాణిజ్య వ్యాపారాల వల్ల పాశ్చాత్య సాహిత్యకారులైన షెల్లీ, షేక్స్‌స్పియర్‌ తదితరుల ప్రభావం ఇక్కడి రచయితలపై పడింది. వ్యవసాయంలోని మిగులును పరిశ్రమల్లో పెట్టించడానికి బ్రటీష్‌ పాలకులు ప్రయత్నించారు. పరిశ్రమలు రావడం మొదలయ్యాయి, దేశ ఆర్ధిక సంపద ఇంగ్లాడ్‌కు తరలిపోయింది. దేశీయంగా స్వదేశీ పారిశ్రామిక వేత్తలు ఎదగనీకుండా చేయడంలో బ్రిటీష్‌పాలకులు విజయం సాధించారు. సాంకేతికత సైతం స్వదేశీ బూర్జువాల చేతుల్లో లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా వలస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భూర్జువా విప్లవాలు రావడం మొదలుపెట్టాయి. వాటి ప్రభావం భారతదేశం మీద పడింది. అందులో భాగంగా నవలాప్రక్రియ విస్తృతంగా వచ్చింది. భూస్వామ్య సమాజంలో వున్న ఆధిపత్యం, ఖచ్చితత్వం, కనబడే దోపడీతో ప్రజానీకం ఇబ్బంది పడుతోంది. నవల ఈ అంశాలను ఎక్కువుగా స్పృశించింది. బ్రిటీష్‌ పాలకులు సృష్టించిన కార్మికవర్గం పరాయికరణకు గురౌడం జరిగింది. ఇది మనిషి మానవసంబంథాలను ప్రభావితం చేసింది. సమాజం అప్పటివరకు పెంపొందిచిన నైతిక విలువలు మారడం మొదలుపెట్టాయి.

స్వాతంత్య్రానంతరం పరిశ్రమల్లో వృద్ధి జరగింది. దేశీయ బూర్జువా వర్గం అనుబంధ పరిశ్రమలను నడిపింది. తర్వాతి క్రమంలో దేశీయ బూర్జువా వర్గం అంతర్జాతీయ పెట్టుబడీదారీ సమాజానికి ఏజెంటుగా మారింది. పత్రికలు పెరిగాయి. సాహిత్య పత్రికలు నడపబడ్డాయి. రాజకీయాలు, సాహిత్యంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. సామాజిక మార్పులకు అనుగుణంగా పత్రికల్లో పేజీలు తగ్గాయి. సాహిత్య పేజీలు మరీ తక్కువయ్యాయి. పెట్టుబడిదారీ సంబంధాలు భారత్‌లోకి ప్రవేశించడంతో ఈ మార్పు జరిగింది. 9 నెలల వరిపంట స్ధానంలో 4 నెలల పంట వచ్చేసింది. స్పీడు యుగంలో పెద్ద కథలను పాఠకులు చదవలేకపోవడంతో కథ నిడివి తగ్గిపోయింది. పత్రికల్లో సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. పాశ్చాత్యులైన ఓ హెన్రీ, మపాసా, చెకోవ్‌ల కథల్లో కొత్త కోణాలను, నైతిక విలువల్లో మార్పును చెప్తూ కథకున్న సామాజిక ప్రయోజనాన్ని ప్రపంచానికి తెలియచెప్పారు. కవిత్వంలో కూడా పాశ్చాత్య ధోరణులు వచ్చాయి. సామాజిక పరిస్ధితుల్లో కథ అవసరం పెరిగింది. నాటకం, నవల, కథ వరకు రావడం గురుజాడ దిద్దుబాటుతో మొదలైంది. వస్తువులో వైవిధ్యం, శిల్పంలో అభివృద్ది, కథల్లో వాడుక భాష రావడం మొదలైంది. తొలితరం కథల్లో భూస్వామ్యభావజాలంలోని ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ఎక్కువుగా ప్రశ్నించారు. ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న బాధలను, లైంగికవేధింపులను ప్రశ్నించారు. గురజాడ అప్పారావుతో పాటు చలం, శ్రీపాద లాండి ప్రముఖ కథకులు తమ కథల్లో స్త్రీ కథలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

స్త్రీ సాహిత్యం

మతం మహిళలను చిన్న చూపు చూసింది. తక్కువ చేసింది. అవమానాల పాలు చేసింది. పురాణాలు, ఇతిహాసాలు అన్ని బ్రాహ్మణీకరించబడ్డాయి. మనుధర్మశాస్త్రం స్త్రీని బానిసను చేసింది. సామాజిక స్వేచ్ఛలో స్త్రీ స్వేచ్ఛ లేకుండా పోయింది. సామాజిక సంక్షోభానికి సామాజిక అసమానతలతో పాటు భూస్వామ్య ఆధిపత్యం, పురుషాధికత్య, వర్గ స్వభావం ప్రధానకారణాలుగా వున్నాయి. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను తొలగించడానికి వ్యవస్ధలో అనేక ఉద్యమాలు నడిచాయి. స్త్రీల జీవితాలను సాహిత్యంలోకి తీసుకువచ్చే పనిని తొలితరం తెలుగు కథా రచయితలు బాగా చేశారు. స్త్రీ ఆలోచనలను, అభిప్రాయాలను సంస్కృతి నియంత్రిస్తుంది. అదుపులో వుంచడానికి మతం దోహదపుడుతుంది. వ్యవస్ధలో వున్న భూస్వామ్య శక్తులు స్త్రీలను వంటిటికే పరిమితం చేశాయి. పెట్టుబడి స్త్రీకి వంటింటి నుండి స్వేచ్ఛను ప్రసాదించింది. అయినప్పటికీ స్త్రీ పై వివక్ష తగ్గలేదు. పైపెచ్చు ఆధునిక రూపాలలో అది మరింత పెరిగింది. పురుషుని ఆధిక్యత వల్ల స్త్రీ తన భావాలను యధేచ్చగా పురుషునితో పంచుకోలేదు. తండ్రి, సోదరుడు, భర్త ఎవరైనప్పటికీ స్త్రీ భావపరంపరలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పటికీ స్త్రీ తన జీవితంలో జరిగే సంఘర్షణలను సాటి స్త్రీకి చెప్పుకోవడానికే ఎక్కువ ఉత్సుకతను చూపిస్తుంటుంది. ప్రతి స్త్రీ జీవితంలో ఏదో ఒక కాలంలో లైంగిక వివక్షకు గురై వుంటుంది. దాన్ని అభివ్యక్తీకరించడానికి ఆమెకు చాలా పరిమితులు వుంటాయి. పనిచేసే ప్రదేశాలలో స్త్రీ, పురుషునితో పాటు సమానంగా పనిచేస్తుంది. కాని పురుషుడితో, స్త్రీ అనేక వివక్షలకు లోనైప్పటికీ, ఆమెపై అదనంగా లైంగిక వివక్ష వుంటుంది.

వ్యక్తిగత ఆస్తిగా స్త్రీని చూడటం మొదలైనప్పటి నుండి అనేక రకాల లైంగిక వివక్షలు, దురాచారాలు స్త్రీలపై ఎక్కువయ్యాయి. సతీసహగమనం ఇందులో అతి భయంకరమైనది. స్త్రీ, పురుష సంబంధాలలో అనేక మార్పులు జరిగిన తర్వాత చివరకి అది దంపతీ సంబంధాలుగా కుటుంబ రూపం తీసుకుంది. స్త్రీ పురుషుడి ఆస్ధిని కాపాడటంలో భాగంగా సంతానాన్ని కనవలసి వచ్చింది. పురుషుడి అవసరాలను తీర్చడానికి మాత్రమే స్త్రీని ఉపయోగించారు. పరలోక అవసరాల కోసం స్త్రీని ఉపయోగించుకునే దురాచారమే సతిసహగమనం. వ్యక్తి మరణిస్తే అతని వస్తువులతో పాటు ఖననం చేసేవారు. స్త్రీ కూడా ఒక వస్తువని భావించే ఆనాటి సామాజిక సంస్కృతి స్త్రీని సైతం చితిమంటల్లో తోయడానికి ప్రేరేపించింది. ఆటవిక యుగంలోని మానవుని మూర్ఖవిశ్వాసాలు ఆధునిక సమాజంలోను సతీసహగమనం రీతిలో వుండటానికి కారణం ఇక్కడ వున్న వ్యవస్థలోని లోపాలే. సతీసహగమనాన్ని నిషేధించలాని పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడంతో అది నిషేధించబడింది. వితంతులైన ఆడవాళ్లను పెళ్లిచేసుకోకూడదు అనే అనైతిక ఆచారం కూడా ప్రశ్నించబడింది. ఆనాటి సమాజంలో ఇవే కథా వస్తువులుగా తొలితరం కథా రచయితలు ఎన్నుకొన్నారు.

లైంగికత్వం

స్త్రీ, పురుషుల మధ్య ఒక ఆకర్షణ వుంటుంది. వీరిమధ్య అనుబంధం వుంటుంది. ప్రత్యేకంగా ఇద్దరు స్త్రీ, పురుషులను దగ్గర చేసే మానసిక, స్వీయ స్పందనలు వుంటాయి. వీరిద్దరి ఒప్పందం మేరకు లైంగిక సంబంధాలు ఏర్పడతాయి. ప్రకృతిపరంగా లింగ భేదము వున్నప్పటికీ లైంగికతకు ఇద్దరి సమ్మతి అవసరం. అంటే ఇక్కడ అసమానతకు తావులేదు. ఈ సమానత్వం నుండే అసమానత్వం క్రమేపి బలపడింది. ఈ వైరుధ్యమే స్త్రీని పురుషుని నుండి, సమాజం నుండి చివరకి తన శరీరం నుండి తననే వేరుచేసే క్రూరస్థాయికి చేరింది. ఆదిమ సమాజంలో లైంగిక సంబంధాలు వున్నప్పటికీ వారికి ఉత్పత్తి, పునరుత్పత్తి, సంతానం లాంటి అంశాలపై సరైన భావజాలం రూపుదిద్దుకోలేదు. అందువల్ల స్త్రీ, పురుష సంబంధాల్లో బేధం లేకుండా వుండేది. పైపెచ్చు పునరుత్పత్తి నిచ్చే శక్తి ఒక్క స్త్రీ వల్లే సాధ్యమనే అవగాహన వుండేది. దానివల్ల ఆమె దేవతను చేశారు. ఆమె అంగాలను పూజించడం మెదలుపెట్టారు. గర్భం దాల్చినపుడు, బహీస్టు సమయంలోను ఆమె ఉత్పత్తికి దూరం చేయబడింది. సంతానం కల్గినపుడు వారి ఆలనాపాలనా కోసం కూడా తను పురుషుడి మీద ఆధారపడాల్సి వచ్చేది. పునరుత్పత్తి ప్రక్రియ ప్రకృతి సహజ సిద్ధమైనప్పటికీ, సమాజాభివృద్ధికి కారణమైనప్పటికి అది ఆమె బలహీనతగానే తర్వాత సమాజం గుర్తించింది. ఉత్పత్తి రంగంలో పురుషుడు పై చేయి సాధించడానికి ఉపయోగపడింది. భూస్వామ్య వ్యవస్ధలో ఉత్పత్తి ప్రక్రియపై పురుషుడిది పై చేయి అయింది. ఆర్ధికపెత్తనము పురుషుడు తీసుకున్నాడు. స్త్రీ పునరుత్పత్తి శ్రమను, పిల్లల పెంపకం శ్రమను విలువ లేనిదిగా చేశారు.

వ్యవసాయాన్ని కనుగొన్న సమాజం విత్తనం గొప్పతనాన్ని గుర్తించింది. అలాగే స్త్రీ పునరుత్పత్తికి పురుషుడు కారణమనే అవగాహనకు వచ్చింది. ఇది అసలు పురుషుడు లేనిదే పునరుత్పత్తి అసాధ్యమనే భావనకు దారితీసింది. వ్యవసాయంలో అధిక ఉత్పత్తి మిగులు సంపదను సృష్టించింది. ఇది వ్యక్తిగత ఆస్ధికి దారితీసింది. ఈ ఆస్ధి కాపాడుకోవడానికి పోలీసు, రాజ్యం అవసరమయ్యాయి. అలాగే తన వారసత్వానికి ఆస్ధిని అందించడానికి సంతానం అవసరమయింది. ఇది స్త్రీ లైంగికత్వంపై అదుపుకు దారితీసింది. స్త్రీకి పవిత్రత ఆపాదించబడింది. శీల పవిత్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉత్పత్తిలో మిగులు, శారీరకంగా పురుషుడు బలంగా వుండటం, స్త్రీకి వున్న ప్రకృతిపరమైన కారణాలు స్త్రీ, పురుషుల మధ్య శ్రమ విభజనను ప్రవేశపెట్టింది. దేవతగా పూజించబడిన స్త్రీ తర్వాతి క్రమంలో వేశ్యగా పరిగణించబడింది. బహీస్టు సమయంలో అంటరానిదయింది. లైంగిక జంతువుగా పరిగణించబడిన స్త్రీ, చివరకి మరింత అథమంగా పిల్లల్ని కనిపెంచే యంత్రంగా, లైంగిక జంతువుగా దిగజారింది.

తన సహజమైన లైంగికసంబంధాల నుండి స్త్రీ వేరుచేయబడింది. తను ఇష్టంగా లైంగిక సంబంధాలను ఎంచుకోవడం, నెరుపుకోవడం పోయింది. నైతక విలువల పేరిట భూస్వామ్య పురుషాధిక్యత భావజాలం వల్ల కృత్రిమ సంబంధాలల్లోకి నెట్టబడింది. అది పెళ్లి పేరిట ఆమెకు ప్రతిబంధకమైంది. పెళ్లి తన ఇష్టానుసారం కాకుండా పెద్దల నిర్ణయంతో జరగడం ప్రారంభమైంది. పురుషుని ఆనందానికి మాత్రమే స్త్రీ శరీరం ఉపయోగపడుతూ వచ్చింది. అందుకే స్త్రీ శరీరాన్ని వర్ణించడానికే కొన్ని లక్షల పై చిలుకు సాహిత్యం అవతరించింది. రాచరిక, భూస్వామ్య సంస్కృతిలో వచ్చిన సాహిత్యమంతా స్త్రీ శరీరం చుట్టూనే తిరిగింది. సనాతన సంస్కృతి పేరుతో వచ్చిన భావజాలం స్త్రీ తన సౌందర్యం ద్వారా భర్తను ఆకట్టుకోవాలని, పని ద్వారా పురుషున్ని సంతృప్తి పరచాలని చెప్పింది. పెట్టుబడి ప్రవేశంతో స్త్రీ శరీరం వ్యాపారానికి ఉపయోగించడం మొదలైంది. స్త్రీ అందాన్ని వ్యాపారాభివృద్ధికి ఉపయోగనారంభించారు. పురుషుని ఆనందానికి, పని వత్తిడి నుండి ఉపశమనానికి, వినోదానికి స్త్రీ శరీరాన్ని ఉపయోగించడం ఆరంభించారు. ఈ ప్రహసనం వేల సంవత్సరాల నుండి జరుగుతూ వస్తూనే వుంది. చివరకి తన కన్న పిల్లలపైనే స్త్రీకి హక్కు లేకుండా పోయింది.

పిల్లలు పుట్టుకతో సమానత్వం కల్గివుంటారు. పెరిగే క్రమంలో వారిని సామాజిక వాతావరణం స్త్రీగా, పురుషుడిగా మారుస్తుంది. పితృస్వామ్య సంస్కృతిలో ఆడపిల్ల, మగవానికి అణిగిమణిగి వుండాలని బోధిస్తుంది. పెద్దమనిషి అయినప్పటి నుండి ఆమెను ఇళ్లనే జైళ్లో బంధీ చేసే కార్యక్రమం మొదలువుతుంది. సామాజిక ఉత్పత్తి నుండి, రాజీకీయ ఆలోచనలనుండి, వాస్తవ చైతన్యం నుండి ఆమె గెంటివేయబడి లైంగిక వస్తువుగా వుంచబడుతుంది. తన శరీరాన్ని చూసి తానే సిగ్గుపడే పరిస్ధితికి నెట్టబడుతుంది. తన శరీరం తనని పదే పదే అవమానానికి గురిచేస్తుందనే అభిప్రాయానికి నెట్టబడుతుంది. కొన్ని ఆలయాలలో రజస్వల అయిన స్త్రీలు ప్రవేశించరాదనే షరతు స్త్రీ శరీరాన్ని అవమానానికి గురిచేసినట్టే. మతం, కులం, సామాజిక వాతావరణం ఇటువంటి నైతిక విలువలనే పెంపొందిస్తున్నాయి.

స్త్రీల విషయంలో సామాజిక శాస్త్రవేత్తల వ్యాఖ్యానం

నూతన సాంకేతికత పెరిగేకొద్దీ శాస్త్రీయ జ్ఞానం పెరుగుతున్నప్పటికీ స్త్రీపై వివక్ష పెరుగుతూనే వుంది. ఇది పెరగడానికి సనాతన సంప్రదాయం పేరుతో చెలామణీ అవుతున్న భావజాలమే ప్రధానకారణం. స్త్రీ పుట్టుకతోనే బలహీనురాలనే దృక్పధాన్ని పెంచుతున్నారు. స్త్రీ శరీర నిర్మాణం పునురుత్పతికి మాత్రమే నిర్దేశించబడింది. ఆమె దానికోసమే ప్రయత్నించాలి కాని, రాజకీయాల్లోకి, ఉత్పత్తి రంగాల్లోకి సామాజిక వ్యవస్ధలోని అనేక రంగాల్లోకి ఆమె ప్రవేశించకూడదనే దురభిప్రాయాన్ని రుద్దుతున్నారు. అలాగే స్త్రీ మెదడు, పురుషుని కన్నా చిన్నదని, శరీర బరువు తక్కువని అందుకే బలహీనురాలని ప్రచారం చేస్తున్నారు. సహజమైన సంబంధాలను గుర్తించనిరాకరించే ప్రయత్నంలో భాగంగానే జీవశాస్త్ర వేత్తలు ఈ ప్రచారం చేస్తున్నారు. ప్రకృతిపరంగా వచ్చే నిర్మాణాలు వాటికవే ప్రత్యేకమైనవి, విలక్షమైనవి, అద్భుతమైనవి. అంతేకాని బలహీనమైనవి కావు.

ఫ్రాయిడ్‌ వంటి సైకాలజిస్టులు  సమాజంలో అప్పటికే స్ధిరీకరించబడ్డ పురుషాధిక్యత భావజాలంతో  వెలువరించిన ఆలోచనలు స్త్రీని మరింత బలహీనురాలిని చేశాయి. స్త్రీ శరీరం ప్రాతిపదికనే కాదు, మానసికంగానే తాను అల్పురాలని భావించుకుంటుందని చెప్పారు. అల్పత్వభావన రుద్దింది కాదని అది స్త్రీ తనకు తానే భావించుకుంటుందని చెప్పారు. అందువల్ల పురుషాధిక్యత కుట్ర లేదని తీర్మానించే ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుండే లైంగిక ఆలోచనల ద్వారా తండ్రి సంరక్షణలో, పెళ్లి అయిన తర్వాత భర్త సంరక్షణలో వుండటానికి స్త్రీ ఇష్టపడుతుందని సైకాలజిస్టులు చెప్పారు. తన అల్పత్వాన్ని అధిగమించడానికి పిల్లల్ని కని మాతృత్వ భావన అతి గొప్పదని, తద్వారా తాను అధికురాలనే ఆలోచన స్త్రీ చేస్తుందని మనోవైజ్ఞానికులు సెలవిస్తున్నారు. ఇది సమాజంలో జెండర్‌ మధ్య అసమానత్వం లేదని చెప్పడానికి వాదించినట్టు కనబడుతుంది. లైంగిక సంబంధాలు జంతువులకు వున్నట్లే, మనుషుల్లోను వుంటాయని ఇది సామాజిక వాతావరణానికి, విలువలకి సంబంధం లేదని ఫ్రాయిడ్‌ వాదించాడు. తద్వారా లైంగిక సంబంధాలు నెరపడం విషయంలో సామాజిక విలువలకు ప్రాధాన్యత లేదని తేల్చడానికి ప్రయత్నించాడు. సామాజిక పరిణామ క్రమంలో స్త్రీకి భావనలు ఉద్భవించలేదని, స్వతహాగా వాటికవే వచ్చే భావనలని ఫ్రాయిడ్‌ చెప్పాడు.

సామాజిక శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా లైంగికత్వం గురించి చెప్పారు. వ్యక్తిగత ఆస్ధి ఏర్పడినప్పటి నుండే స్త్రీ ఆస్ధిగా పరిగణించబడింది. ఈ ఆస్ధి పురుషుడి అదుపులో వుంచడానికే నైతిక విలువలు సమాజంలో చెలామణిలోకి వచ్చాయి. స్త్రీపై లైంగిక అదుపు, ఆధిపత్యం పురుషుడి చేతుల్లోకి సామాజిక నిర్మాణాల్లో భాగంగా రప్పించబడింది. ఉత్పత్తి కార్యక్రమాల్లో స్త్రీ శ్రమ సమాజానికి అవసరమైంది. మరింత మిగులు సంపదను సృష్టించడానికి వ్యవస్ధకు ఇది అవసరం. భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్ధలోను పునరుత్పతికి మాత్రమే పరిమితమైన స్త్రీ, ఆర్ధిక ఉత్పత్తిలోను భాగం అయింది. తద్వారా ఆమెను లైంగిక జంతువుగానే చూసే దృష్టి తగ్గింది. లైంగికతకు వర్గ స్వభావం వుంది. ధనికవర్గ స్త్రీలపై లైంగికత అదుపు సాధ్యమైనప్పటికీ, కష్టపడే, శ్రమచేసే స్త్రీల విషయంలో లైంగికత అదుపు అసాధ్యమైంది. ఈ భావన పురుషాధిక్యత భావజాలానికే ఇబ్బందిగా పరిగణించే అవకాశముంది. అందుకే శ్రామికమహిళ విషయంలో పితృస్వామికభావజాలం ప్రభావం తక్కువుగా వుంది. ఉత్పతిలో భాగం చేయబడ్డ మహిళ కేవలం పునరుత్పతికే పరిమితం కాలేదు, సామాజిక అభివృద్ధికి దోహదపడింది. అందుకే ప్రేమించడం, సేవించడం, ఓర్పుగా వుండటం, పిల్లల్ని పెంచడం స్త్రీలకున్న గొప్పలక్షణాలుగా కీర్తించబడ్డాయి. తద్వారా వాటినుండి పురుషుడు మినహాయింపబడటానికి తాపత్రయపడ్డాడు. ఆమెను లైంగికవస్తువుగా స్ధిరికరింపజేయడానికి ప్రయత్నం చేశాడు. సమాజంలో వచ్చిన వివిధ దశలు సహజ సంబంధాలను గుర్తించ నిరాకరించాయి. పురుషుడి ఆధిక్యానికి ఉపయోగపడే విధంగానే స్త్రీ లైంగికతను నిర్వచించాయి. లైంగికతను సహజ అవసరంగా గుర్తించ నిరాకరించాయి. ఈ సహజత్వం సమాజంలో సమానత్వ సంబంధాలు నెలకొన్నప్పుడే జరుగుతుంది. స్త్రీ శరీరాన్ని, ఆలోచనలను స్వేచ్చగా వినియోగించుకునే వాతావరణం రావలసి వుంది.

చలం కథల్లో స్త్రీ

స్త్రీకి శరీరం వుంది దానికి వ్యాయామం కావాలి అని చలం అన్నాడు. పురుషాధిక్యతను వ్యతిరేకించే ధోరణిలోనే చలం శశిరేఖ, మైదానం లాంటి నవలల రాశాడు. స్త్రీకి స్వాతంత్రం రావడం అంటే తన మెదడుకు పని చెప్పాలని, ఆమె హృదయానికి అనుభవం ఇవ్వాలని చెప్పాడు. ఉన్నతమైన ప్రేమ గురించి చెపుతూ స్త్రీ అవసరమైతే తన భర్త నుండి లేచిపోవడంలో తప్పు లేదని చెప్పాడు. వివాహమే స్త్రీ లైంగికతపై పురుషుడికి పెత్తనం ఇస్తుందని చలం భావించాడు. అందుకే వివాహితలు కాపురం ఇష్టం లేకపోతే, తమ సహజమైన శరీర వాంఛలు తీరకపోతే, ప్రేమించిన పరాయి పురుషుడికోసం భర్తను వదులుకోవడం తప్పు లేదని తన సాహిత్యంలో చెప్పాడు. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా, హాయిగా జీవించవచ్చని చెప్పాడు. మైదానంలోను రాజేశ్వరి లేచిపోయి ప్రేమించిన వ్యక్తితో హాయిగా వున్నట్టు చెప్పబడింది. ఆమె గర్భం ధరిస్తుంది. ఆమెకు పిల్లలు పుట్టితే ఆమె బాధ్యత ఏమనిగాని, ప్రేమించిన వ్యక్తికి పిల్లల పెంపకంలో వున్న బాధ్యతను చెప్పలేదు. పిల్లల తల్లిదండ్రులుగా సమాజానికి ఎవరు పరిచయం అవుతారో చెప్పలేదు. కథ సుఖాంతం తర్వాత వారికి ఎదురయ్యే కష్టాలను చలం చెప్పలేదు.

మరోవైపు స్త్రీని కుటుంబ బాధ్యతల నుండి తప్పించడానికి చలం ప్రయత్నించాడు. స్త్రీకి లైంగిక స్వేచ్ఛతో పాటు పునరుత్పత్తి స్వేచ్ఛను ఇచ్చాడు. అంటే చలం స్త్రీ పిల్లలను ఇష్టమైతేనే కనొచ్చు. అలా అని అందరూ స్త్రీలు పిల్లల్ని కనకుండా వుంటే సామాజిక అభివృద్ధి ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తుంది. పెళ్లితో సంభంధం లేకుండా పిల్లల్ని కనే హక్కు స్త్రీలకుండాలని చలం భావించాడు. వితంతువు అనే కథలో చలం ఇదే విషయాన్ని చెప్పాడు. ఆర్గుమ్యెంటు కథలో స్త్రీకి అబార్షన్‌ చేసుకునే హక్కు వుండాలని వాదించాడు. ఇప్పటికే భారత్‌లో అబార్షన్‌ చేసుకోవడం చట్టరీత్యా నేరం. స్త్రీ, పురుష సంబంధాలు సామాజిక సంబంధాలతో ముడిపడి వుంటాయి. ఈ విషయాన్ని చలం విస్మరించాడు. వాటిని వ్యక్తిగత సంబంధాలగానే చూశాడు. స్త్రీ లైంగికత్వంపై అదుపుకు సామాజిక కారణాలు వున్నాయని చలం విశ్లేషించాడు. అయినంత మాత్రాన స్త్రీ ఇంటి పనికి, పునరుత్పత్తికి, ఉత్పత్తిలో భాగం కావడానికి ప్రయత్నించనవసరం లేదని, తన లైంగిక స్వేచ్ఛ కోసం వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోవచ్చని చలం చెప్పాడు. స్త్రీని సామాజిక బాధ్యత నుండే తప్పించే ప్రయత్నం చేశాడు.

కొకు కథల్లో స్త్రీ

నిజంగానే స్త్రీ శరీరం మీద పురుషుడికి అదుపు వుంటుందా, వీరి మధ్య లైంగిక అసమానతలు వున్నాయా, భర్త పిలిస్తేనే భార్య రావటం వుంది గాని, భార్య పిలిచినా భర్త శారీరకంగా కలుస్తున్నాడా. ఈ అంశాలను స్పృశిస్తూ కొడవగంటి కుటుంబరావు చాల కథలు రాశారు. అందులో అర్ధాంగి ఒకటి. సామాజిక పరిణామాల్లో భాగంగా వచ్చిన సమాజంలో వచ్చిన మార్పులను పార్వతీశం గ్రహిస్తాడు. పార్వతీశం కొంతమేరకు చైతన్యాన్ని కలిగివుంటాడు. భార్యను కేవలం లైంగిక వస్తువుగా చూడకూడదని అనుకుంటాడు. సమాజంలో స్త్రీ అణిగిమణిగి వుండాలనే విలువలను వ్యతిరేకిస్తూ అభ్యుదయ భావాలను కల్గివుంటాడు. కథలో భార్య శకుంతల పెద్దగా చదువుకోలేదు. ఆమె పుట్టిన, పెరిగిన వాతావరణం కార్యేషు దాసి, శయనేషు రంభ అనే పద్ధతిలోనే వుంది. ఆమె ప్రాపంచిక ధృక్పధం అంతా పతియే ప్రత్యక్ష దైవం అనే తరహాలో వుంటుంది. పార్వతీశం భార్యను చైతన్యపరచాలని ప్రయత్నిస్తుంటాడు. కాని ఆమె అతనికి సహకరించదు. స్త్రీ భూస్వామ్య, పితృస్వామిక సంస్కృతిలో కూరకపోయి అనేక అవమానాలకు, లైంగికవివక్షలకు లోనౌతూ అదే నిజమైన జీవితం అని నమ్ముతుంది అనడానికి అర్ధాంగి కథలో శకుంతల మంచి ఉదాహరణ.

శకుంతలకు శారీరక వాంఛలు వస్తాయా రావా అనే సందేహం పార్వతీశానికి వస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ అతనే ఆమెను దగ్గరికి తీసుకునేవాడు. కనీసం ఆమె స్వతంత్రించి అతని చేయిను కూడా తాకే ప్రయత్నం చేయదు. శకుంతల తన శరీరం భర్త సుఖానికేనని, తన శ్రమ కుటుంబానికేనని భావిస్తుంది. తనకంటూ ఒక ఆనందం, అభిప్రాయం ప్రత్యేకంగా వుండాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తుంది. పార్వతీశం భార్యకు సమానవిలువ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే, ఆమె తను ప్రస్తుతం వున్న లౌకిక వ్యవహారమే బాగుందని, నిజమైనదనే నమ్ముతుంటుంది. ఈ నేపధ్యంలో పార్వతీశం అంతర్గతంగా ఘర్షణకు గురౌతాడు. ఈ క్రమంలో అతను శకుంతలకు కనువిప్పు కలిగించడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. శకుంతల మీద లైంగిక పెత్తనం చెలాయించడం మొదలుపెడతాడు. ఆమెకు భర్త కేవలం తన శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడనే స్పృహను కల్గిస్తాడు. చివరకు ఆమెలో మార్పును తీసుకువస్తాడు.

స్త్రీలు చైతన్యవంతులుగా లేకపోయినా, అసమానత్వం గురించి ప్రశ్నించకపోయినా, అటువంటి స్త్రీలతో కాపురం చాలా ఇబ్బందికరంగా వుంటుందని కొకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మూస పోసిన ధోరణిలోనే కాపురాలు చేయడం, తరాలు మారినా స్త్రీ చైతన్యంలో మార్పు రావడం లేదని కొకు భావన. అందుకే కొకు అనాదిగా స్త్రీని అవమానించిన పురుషుడే స్త్రీలో చైతన్యాన్ని తీసుకురావలసి వుందని పరోక్షంగా కథలో చెప్పాడు. కుటుంబం యూనిట్‌గా తీసుకుని ప్రతి భర్త, తన భార్యను చైతన్యవంతం చేసి, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను తొలగించుకుంటే సమాజంలో కూడా అసమానతలు పోతాయనే భావన కొకులో వుంది. కుటుంబరావుకు స్త్రీ పై లైంగిక అదుపుకు, పురుషుడి పెత్తనానికి, ఆమెకు ఆర్ధిక పెత్తనం లేకపోవడానికి గల మూల కారణాలు తెలుసు. అందుకే ఆయన కథలు సమస్యను యధాతధంగా ఉటంకిస్తూనే, పరిష్కారాన్ని కూడా తన కథలో చూపడం చేస్తాడు. విన్నూతమైన, భిన్న రకాల వస్తువులను, శిల్ప చాతుర్యాన్ని కథల్లో ప్రతిఫలించిన గొప్ప రచయిత కొకు.

రంగనాయకమ్మ కథల్లో స్త్రీ

రంగనాయకమ్మ మార్స్కిస్టు రచయిత, విమర్శకురాలు. స్త్రీలు చైతన్యవంతులు ఎందుకు కావాలో చాలా రచనల్లో చెప్పింది. లైంగికత్వం, లైంగిక స్వేచ్ఛ, ఫెమినిజం లాంటి అంశాల్లో చాలా రచనలు చేసింది. కొంతకాలం నవలా, కథా రచన చేసి తర్వాత వ్యాస రచనకు, మార్స్కిజాన్ని ప్రచారం చేయడానికి తన జీవితాన్ని వెచ్చించింది. జానకి నవల ప్రసిద్ధమైన నవల. జానకి ఏ విధంగా పురుషాధిపత్యానికి, భూస్వామ్య విలువలకు బలైందో చెప్పింది. ఏ విధంగా శారీరక, మానసిక హింసలకు గురైందో చెప్పింది. స్త్రీ, పురుషులు మధ్య ఆర్ధిక సంబంధాలే ఎక్కువుగా వుంటున్నాయి. దీనివల్ల భర్త, ఎంతసేపటికీ భార్య తరుపు వారు ఎంత డబ్బు ఇస్తారనే యావతోనే వుంటాడు. భార్యను తన్నడం, తిట్టడం, లైంగికంగా వేధించడం భర్త హక్కు అన్నట్టు జానకిలో జానకి భర్త ప్రవర్తిస్తాడు. స్త్రీ తన బాల్యంలో తండ్రి నియంత్రణలో వుంటుంది. తనకు వయసు వచ్చి పెరిగిన తర్వాత, పెళ్లైన తర్వాత భర్త అదుపులో వుంటుంది. ఆమెకు ముసలి వయసు వచ్చిన తర్వాత ఆమెపై కుమారులు పెత్తనం చేస్తారు. ఈ విధంగా తన జీవితంలో ఆద్యంతం ఆమె పర పరుషుడి నియంత్రణలోనే వుంటుంది. ఆమె తన ఇష్టాలను ప్రదర్శించడానికి, కోర్కెలను తీర్చుకోవడానికి తనకు ఎక్కడా అవకాశం వుండదు.

జానకి విముక్తి నవల తెలుగు సమాజంలో విస్తృత చర్చకు తెరలేపింది. వ్యక్తిగత ఆస్తి పితృస్వామిక వ్యవస్ధకు పునాది లాంటిది. ఇదే ఆర్ధిక అసమానతలను సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించింది. వ్యవస్ధలో ఇటువంటి వైరుధ్యాల వల్ల స్త్రీ లైంగికతపై అదుపును, అధికారాన్ని పురుషుడు చెలాయిస్తున్నాడు. జానకి విముక్తి నవల్లో సమాజంలో వ్యవస్థీకృతమైన అనేక అంశాలు స్త్రీని ఎలా వివ్షపూరితంగా చూపిస్తాయో చెప్పింది. వాటి నుండి విముక్తి పొందనడానికి జానకికి రచయిత ఒక మార్గం చూపారు.

ఓల్గా కధల్లో స్త్రీ

ఓల్గా ఫెమినిస్టు మేధావిగా ప్రసిద్దురాలు. సమాజం మొత్తాన్ని అవగాహనలోకి తీసుకోకుండా కేవలం స్త్రీ సమస్యను మాత్రమే అవగాహనలోకి తీసుకోవడంలో సమస్య తీవత్ర పెరుగుతుందే కాని తరగదు. కాని ఓల్గా రాసిన చాలా కథలు స్త్రీ సమస్యలకు సంబంధించినవే. స్త్రీపై జరుగుతున్న లైంగిక వివక్ష చట్రంలోనే వ్యవస్ధలో వున్న అన్ని సమస్యలను పరిశీలించాలనే అవగాహన ఫెమినిస్టు రచయితలకు వుంటుంది. మహిళల్లో చైతన్యం పెరుగుతోంది. మహిళా కథా రచయితలు సమాజంలో వేగంగా వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తున్నారు. వీళ్లు కథల్లో చేస్తున్న కొన్ని కొత్త లైంగిక స్వేచ్ఛకు సంబంధించిన ప్రయోగాలను విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా వుంది. స్త్రీ, పురుషుల మధ్య మానవ సంబంధాలు, లైంగిక సంబంధాలు ఎలా వుండాలనే ప్రధాన ఇతివృత్తంగా ఓల్గా ప్రయోగం అనే కథను చూడచ్చు. ఓల్గా కథల్లో స్త్రీ ఎక్కువుగా మధ్యతరగతి వర్గానికి చెందినదై వుంటుంది.ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్య్రంతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో వుంటుంది.

ప్రయోగం కథలో ప్రస్తుతమున్న వివాహ వ్యవస్ధను సునంద వ్యతిరేకిస్తుంది. నరేంద్ర, సునంద ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగులు. నరేంద్ర సునందను పెళ్లిచేసుకుందాం అంటాడు. సునంద పెళ్లి వద్దు, అవసరమైనపుడు కావలంటే, ఇద్దరం ఇష్టపడితే శారీరకంగా కలుద్దాం అంటుంది. వివాహ వ్యవస్ధలో అనేక అసమానతలు వున్నాయని ఆ వ్యవస్ధలో కూరకపోతే స్త్రీకి స్వేచ్చ వుండదని సునంద అభిప్రాయం. అందుకే కొత్త ప్రతిపాదనను ముందుకు తీసకువచ్చింది. ఈ ప్రతిపాదన తప్పు అనే వాదించే వాళ్లే ఎక్కువుగా వున్నారు. పిల్లల్ని కనడం, వారిని పెంచడం పెద్ద బాధ్యతగా సునంద భావిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లల బాధ్యత మొత్తం సునంద మీదే పడుతుందనే అవగాహనలో భాగంగా అలా అంటుంది. ప్రస్తుత వ్యవస్ధలోనే సునంద పరిష్కారం వెతుక్కోవడం వల్ల ఇటువంటి పరిస్ధితి వచ్చి వుంటుంది. స్త్రీ లైంగిక వివక్ష అనే సామాజిక సమస్యకు సునంద తనకున్న పరిధిలో వ్యక్తిగత అభిప్రాయన్ని వెలువరించింది. ఈ తరహా కథలను ఓల్గా చాలా రాసింది. ఓల్గా కథలు సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు లేవదీశాయి.

ముగింపు

స్త్రీ స్వేచ్ఛకు సంబంధించి చాలా కథలే వచ్చాయి. కథా రచయితలకు వున్న ప్రాపంచిక దృక్పథం ద్వారా వాళ్లు సున్నితమైన కథా వస్తువును ఎంచుకున్నారు. వైవిధ్యబరితమైన శిల్పాన్ని ఉపయోగించారు. కథలో గమనం, నడక, ఎత్తుగడ, ముగింపు ద్వారా రచయితలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే వీళ్లు చేసిన కథా సృజన అంతిమంగా సమాజానికి ఉపయోగపడిందా లేదా అనే అంశాన్ని పాఠకుడు గమనిస్తాడు. స్త్రీ స్వేచ్ఛకు లైంగికత ప్రాధానమైనదని, స్త్రీ తన ఇష్టానుసారం లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చని కొంతమంది రచయితలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పురుషుడు చేస్తున్న అరాచకాలను స్త్రీలు చేస్తే తప్పేంటని తమ కథల్లో చెప్పిన వారు ఉన్నారు. పురుషుడు బాధ్యత లేకుండా వుంటున్నాడు. అతను ప్రేమ పేరుతో రెండో పెళ్లి చేసుకున్నా, వుంచుకున్నా అతన్ని గొప్పతనంగా చూపిన రచనలు వచ్చాయి. స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు పురుషుడ్ని పూర్తిగా బాధ్యతలనుండి విడదీయకూడదు. లైంగిక స్వేచ్ఛ పేరుతో వివాహం లేకుండానే సహజీవనం ద్వారా కలిసి వుండవచ్చు అనే ఆలోచనలు ప్రస్తుత సమాజంలో వున్నాయి. మెట్రో పాలిటన్‌ పట్టణాల్లో డేటింగ్‌ పేరుతో ఇప్పటికే వివాహ వ్యవస్ధకు వెలుపల కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. కుటుంబం పట్ల, స్త్రీ పట్ల, సమాజం పట్ల పురుషుడికి, స్త్రీకి ఇరువురికి బాధ్యత వుండాలి. అలా ఇద్దరూ బాధ్యత లేకుండా లైంగిక స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి లైంగిక సంబంధాలను నెరపడం వల్ల సామాజిక సంబంధాలు చెడిపోతాయి. ఇష్టం లేకుండా విడాకులు తీసుకోవచ్చు. తర్వాత ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. లేదా కలిసి వుండవచ్చు. ఇప్పుడున్న వివాహా వ్యవస్ధలో అనేక రకాల అసమానతలు వున్నాయి. అసమానతలు లేని సహజీవనం రావలసి వుంది. ఈ జీవనం స్త్రీ, పురుషులిరువురికి సమాన బాధ్యతలను, సమాన గౌరవాన్ని ఇవ్వాలి. చట్టబద్దమైన హక్కుల్ని కల్పించాలి.

సమాజంలో వైరుధ్యాలు వచ్చినప్పుడల్లా కొత్త విలువలు బయలుదేరుతాయి. ఇది నిరంతరం మారుతూ వుంటుంది. ఇది ఎప్పుడూ ఆధిపత్యవర్గాలకు అనుగుణంగా వుంటుంది. సమాజంలో నివసిస్తున్న సబ్బన్న వర్గాలమీద ఈ నైతిక విలువలు చట్టబద్దంగానే రుద్దబడతాయి. ఈ విలువలు సమాజానికి హాని చేస్తే ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజలు కలిగివుండాలి. నైతిక విలువలు శాశ్వతం కావు. స్త్రీ, పురుషుల కేవలం వ్యక్తులు కాదు. వారు సమాజంలో భాగంగా వుంటారు. వీరద్దరి మధ్య వున్న లైంగిక, మానవ సంబంధాలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. సరైన నైతిక విలువలు వున్నప్పుడే ఆ వ్యక్తికి సమాజం పట్ల, కుటుంబం పట్ల సరైన అవగాహన వుంటుంది. అసమానత్వాన్ని పోగొట్టాలంటే ప్రజాస్వామ్యయిత భావాలు అవసరం. ఉత్పత్తి సంబంధాలు మారుతున్నప్పడల్లా ఉపరితలంలోని నైతిక విలువలు, వ్యక్తి స్వేచ్ఛ మారుతుండటం మనం గమనిస్తున్నాం. సంస్కృతి, భిన్న భావజాలాలు కూడా నైతిక విలువలను మార్చే ప్రయత్నం చేస్తాయి. సంఘ నిర్మాణం పట్ల వ్యతిరేకత వున్నంత మాత్రాన మొత్తం సమాజం మీదే ద్వేషం పెంచుకుంటే ఉపయోగం లేదు. సమాజ నిర్మాణాన్ని మార్చడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో రచయిత తన వంతు ఆలోచలను కథా రూపంలో విరివిగా రాయాలి. శాస్త్రీయమైన, హేతుబద్దమైన ఆలోచనలు సాహిత్యంలో రావాలంటే కథనే బలమైన సాధనంగా ఎంచుకోవాలి. దీనికి రచయితకి సరైన ప్రాంపంచిక ధృక్పథం అవసరమౌతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here