[box type=’note’ fontsize=’16’] “చదవడానికి ప్రయత్నించాలే గాని ప్రతీ మనిషి ఓ పాఠం. ప్రతీ జీవితం ఓ గ్రంథం” అంటూ అలనాటి హాకీ దిగ్గజం శ్రీ రఘ్‌బీర్ సింగ్ భోలా వ్యక్తిత్వాన్ని ఈ వ్యాసంలో ఆవిష్కరిస్తున్నారు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు. [/box]
శ్లో:కౌసల్యాగర్భసంజాతం
అహల్యా శాపవిమోచకం
జానకీ ప్రాణనాథంచ
సీతారామం నమామ్యహం (వాల్మీకి రామాయణం)
[dropcap]శ్రీ[/dropcap] రఘ్‌బీర్ సింగ్ భోలా గారి జీవిత చరిత్ర సంగ్రహంగా.
చదవడానికి ప్రయత్నించాలే గాని ప్రతీ మనిషి ఓ పాఠం. ప్రతీ జీవితం ఓ గ్రంథం. ఈ ప్రపంచమే ఓ అత్యుత్తమ విశ్వవిద్యాలయం. మనో నేత్రం తెరచి చూస్తే మన చుట్టూ ఎందరో మహానుభావులు. ఎందరో మహావ్యక్తులు.
సుమారు 63 సంవత్సరాల క్రితం హాకీ ప్రపంచానికి ఓ పాఠంలా వినిపించి, ఓ గ్రంథంలా కనిపించి, విశ్వవిద్యాలయంలా అనిపించిన ఓ మహోన్నతమైన వ్యక్తి శ్రీ రఘ్‌బీర్ సింగ్ భోలా. కొండ అద్దమందు కొంచెమై ఉండుననునట్లుగా శ్రీ భోలా నిజంగా భోళామనిషే.
మనదేశంలో హాకీ ఆటకు, రాజకీయాలకు మధ్య ఒక అత్యంత సామీప్యత ఉంది. రెండింటిలోనూ ఎక్కువగా పాలుపంచుకుంటున్నారు. రెండిటికి ప్రజలతో అధిక సంబంధం వుంది. రెండూ ప్రశంసలకు, అపహాస్యానికి పాత్రమౌతాయి.
అకుంటిత దీక్ష, ఏకాగ్రత, అంకిత భావం అన్ని అంశాలను తనలో పుణికి పుచ్చుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకున్న విశిష్ట వ్యక్తి శ్రీ రఘ్‌బీర్ సింగ్ భోలా. కఠోర పరిశ్రమ, సాధించాలన్న పట్టుదల రెండూ సమపాళ్ళలో మూర్తీభవించిన వ్యక్తి భోలా.
హాకీ క్రీడా రంగంలో నేటి తరానికి ఒక ఆరాధ్య దైవంగా మారిపోయారు శ్రీ భోలా. ఆయన మరణం మన భారత దేశానికే హాకీ క్రీడారంగానికీ ఓ తీరని లోటు. ది 21-01-2019 సోమవారం నాడు ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచి తిరిగి రాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఈ వార్త హాకీ ప్రియుల గుండెలకు ఏదో తెలియని మనస్తాపానికి గురిచేసింది.
ఆయన మన పూర్వపు టీంలో ఒలంపిక్ క్రీడాకారుడుగానే గాకుండా ఆనాడు భారతదేశ సెలక్ట్ గ్రూప్ కేప్టెన్‌గా కూడా రాణించారు.
వారికి 92 సంవత్సరాలు. అనగా అధిక మాసాలతో లెక్కిస్తే 100 సంవత్సరాలు జీవించారని భావించవచ్చు. కుటుంబంలో వారి భార్య శ్రీమతి కమల, ముగ్గురు కుమార్తలు, నలుగురు మనమలు గల వసుదైక కుటుంబం.
శ్రీ భోలా 1956 మరియి 1960 భారత హాకీ టీమ్ తరఫున రెండు పర్యాయములు ఒలంపిక్‌లో పాల్గొని వరుసగా బంగారు మరియి వెండి పతకాలను సాధించారు.
శ్రీ భోలా ఆనాటి అవిభాజ్య పాకిస్తాన్ లోని ముల్తాన్ అనే గ్రామంలో 21 ఆగష్ట్ 1927 నాడు జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతదేశ వైమానిక దళంలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తునే, 1953లో ప్రప్రథమంగా హాకీ ఆటలో ప్రవేశించారు. తరువాత 1954లో వైమానిక దళం తరఫున యు.కె. క్రౌన్‌ఫీల్డ్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.
ఏరోనాటికల్ ఇంజనీర్‌గా 26 సంవత్సరాలు భారత వైమానిక దళంలో విధులు నిర్వహించి 1978లో పదవీ విరమణ గావించారు.
శ్రీ భోలా గారు 2000లో భారత ప్రభుత్వం వారి జీవిత సాఫల్య ‘అర్జున్’ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఘనంగా అందుకున్నారు.
శ్రీ భోలా వారి ఒలంపిక్ క్రీడానంతరం కూడా వారి సహ-క్రీడాకారులతో మంచి సంబంధాలను కొనసాగించారు.
సుమారు 9 సంవత్సరాల పాటు వీరు జాతీయ హాకీ సెలక్టర్‌గా బాధ్యతలను నిర్వహించారు. అంతేగాకుండా అంతర్జాతీయ హాకీ ఆటకి అంపైర్‌గా కూడా సేవలు అందించారు.
‘ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్’ వారి ఆదేశానుసారం 5 సంవత్సరములకు పైబడి అంపైర్‌గా సేవలు అందించారు.
వీరు భారత జాతీయ హాకీ టీమ్‌కు టీం మేనేజరుగా అనేక అంతర్జాతీయ విదేశీయానాలను దిగ్విజయంగా సంపూర్తి చేశారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు హాకీ జట్టు పరిశీలకునిగా 1990 వరకు బాధ్యతలు నిర్వహించారు.
1994 ప్రపంచ హాకీ కప్ మరియు 1998 ఆసియన్ గేమ్స్‌లో కూడా సేవలు అందించారు.
మొన్నటి 2000 సంవత్సరం వరకు భారతదేశంలో హాకీ సెమినార్లు, వర్క్‌షాపులు వారి సొంత ఖర్చులతో నిర్వహించిన హాకీ నేస్తం. చివరకు అనారోగ్య పరిస్థితుల కారణంగా శరీరం సహకరించకపోవడం వలన మంచంపై ఉండి హాకీని టీవికే పరిమితమైనారు. అయినా ఇంటి నుంచే ఎవరికైనా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఫోన్ ద్వారా సేవలు అందించేవారు.
వీరి మరణ వార్త విని FIH అధ్యక్షులు ఎన్. భాత్రా – శ్రీ భోలా గారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసారు. వారి మాటలలోనే – “నేను శ్రీ రఘ్‌బీర్ సింగ్ భోలా గారి మరణవార్త విని నిశ్చేష్టుడనైనాను. వారు భారత హాకీ టీం గ్రూప్ కాప్టెన్‌గానే కాకుండా, విశ్రాంత క్రీడా విద్యార్థిగా హాకీకి అత్యున్నత సేవలనందిచిన మేరునగధీరుడు. తనకు చేతనైనంత వరకూ, ఏ విషయంలోనైనా ఇతరులకు సాయపడడంలో అందరికంటే ముందే ప్రథమశ్రేణిలో ఉండే ఓ మహా క్రీడాకారుడు. ఆయన ఆత్మకు శాంతి కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని తన సంతాప సందేశాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ వారి మృతి చిహ్నంగా దేశంలో ఏదో ఒక స్టేడియం గ్రౌండ్‌కి రఘ్‌బీర్ సింగ్ భోలా సంస్మరణ స్టేడియంగా పేరు పెట్టాలని పెక్కు మంది హాకీ క్రీడాకారుల కోరిక.
“వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి।
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ” (భగవత్ గీత)
భావం: మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరమును పొందును.