[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
శ్లోకం:
శోచన్తో ఽవనతై ర్న రాధిపభయా
ద్ధిక్శబ్దగర్భై ర్ముఖై
ర్మా మగ్రాసనతో ఽవకృష్ట మవశం
యే దృష్టవన్తః పురా
తే పశ్యన్తి తథైవ సంప్రతి జనా
నన్దం మయా సాన్వయం
సింహే నేవ గజేన్ద్రా మద్రిశిఖరాత్
సింహాసనా త్పాతితమ్. -12
అర్థం:
పురా=పూర్వం (వెనుకటి కాలంలో), యే=ఎవరైతే, నరాధిప+భయాత్=రాజభయం కారణంగా, అవనతైః+ధిక్‌శబ్ద+గర్భైః+ముఖైః=ఛీత్కారాన్ని లోపలే అణగించుకొని, ముఖాలు దించుకొని, శోచంతః=ఆలోచనలో పడి, అగ్రాసనతః=ఉన్నతాసనం నుంచి, అవశం+మామ్=నిస్సహాయంగా ఉన్న నన్ను, అవకృష్టః=లాగివేయబడిన నన్ను, దృష్టవన్తః=చూస్తు ఉండిపోయిన, తే+జనా=ఆ మనుషులు, సంప్రతి=ఇప్పుడు, సింహేన=సింహం (చేత), అద్రి+శిఖరాత్=కొండకొమ్ము నుంచి, గజేంద్రః+ఇవ=ఏనుగును (పడలాగిన) విధంగా, మయా=నేను (నా చేత), అన్వయేన+సహ (సాన్వయం)=కులం మొత్తంగా, సింహాసనాత్=సింహాసనం నుంచి, పాతతం=పడత్రోయడాన్ని (పడత్రోయబడడాన్ని), పశ్యన్తి=చూస్తున్నారు. (పడిపోయేలాగ చేయడం).
అలంకారం:
“మయా గజేంద్ర ఇవ సింహాసనాత్ పాతితమ్” అని ఇవ ప్రయోగం కారణంగా ఉపమాలంకారం.
వృత్తం:
శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు
వ్యాఖ్య:
ఒకప్పుడు చాణక్యుడు ఎత్తుపీట మీద కూర్చుని వుంటే నందులు అతడిని క్రిందకు లాగిపడవేసి అవమానించారు. ఆ సమయంలో అక్కడ వున్న ఎవరూ, రాజభయం వల్ల నోరెత్తి ఒక్క మాట మాట్లాడకుండా ఛీత్కరించుకుని, తలలు వంచుకున్నారు. మరి యీనాడో! – చాణక్యుడు, కొండకొమ్ము నుంచి ఏనుగును పడత్రోసినట్టు సింహాసనం నుంచి మొత్తం నందవంశాన్నే క్రిందకు లాగి పడవేయగా వాళ్ళే, ( ఆ మనుషులే) చూస్తున్నారు.
“నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు…” అని ఆధునిక తెలుగు కవి శ్రీశ్రీ ఒక కవితలో చెప్పిన మాట ఇక్కడ గుర్తుకు వస్తుంది.
చాణక్య: సో ఽహ మిదానీం అవసిత పత్రిజ్ఞాభారో ఽపి,
వృషలా పేక్షయా శస్త్రం ధారయామి. యేన మయా…
అర్థం:
ఇదానీం=ఇప్పుడు, అవసిత+ప్రతిజ్ఞాభారః+అపి=నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న వాడినైనప్పటికీ, సః+అహం=అటువంటి నేను, వృషల+అపేక్షయా=శూద్రరాజు చంద్రగుప్తుడి కోసం, శస్త్రం+ధారయామి=ఆయుధం చేపడుతున్నాను.
యేన మయా=ఏ నా చేతనైతే… (ఏ నేనైతే…)
శ్లోకం:
సముత్ఖాతా నన్దా
నవ హృదయరోగా ఇవ భువః,
కృతా మౌర్యే లక్ష్మీః
సరసి నళినీవ స్థిరపదా।
ద్వయోః సారం తుల్యం
ద్వితయ మభియుక్తేన మనసా
ఫలం కోప ప్రీత్యో
ర్ద్విషతి చ విభ క్తం సుహృది చ॥ – 13
అర్థం:
హృదయరోగాః+ఇవ= గుండె జబ్బుల వలె, నన్దాః=(నవ)నందులు, భువః=భూమి నుంచి (వలన), సం+ఉత్ఖాతాః=దుంపనాశమయ్యారు (చేయబడ్డారు), సరసి=చెరువులో, నళినీ+ఇవ=తామరపువ్వుల మాదిరి, మౌర్యే లక్ష్మీః= ముర కొడుకు చంద్రగుప్తుడి వైభవం, స్థిరపదా+కృతా=దృఢపరచడమైంది, (నేను చేశాను), అభియుక్తేన+మనసా=సుస్థిర సంకల్పంతో, కోప, ప్రీత్యోః+ద్వయోః సారం+ద్వితయంఫలం=ఒక పక్క కోపం, ఒక ప్రక్క ప్రేమ అనే రెండిటి ఫలాల సారం, ద్విషది+చ=శత్రువు యందు, సుహృది+చ=స్నేహితుడి యందు, తుల్యం=సరిసమంగా, విభక్తం=పంచడమైంది (పంచబడింది).
వృత్తం:
శిఖరిణి వృత్తం. య – మ – న – స – భ – లగ గణాలు.
అలంకారం:
“హృదయరోగాః ఇవ”, – “సరసినళినీవ” అని – ఉపమా వాచకం. ‘ఇవ’తో అనుసంధానించడం కారణంగా ఉపమాలంకారం.
వ్యాఖ్య:
శత్రువులైన నందుల్ని నాశనం చెయ్యడమూ, మౌర్య లక్ష్మిని సుస్థిరపరచడమూ, అనే పనులు పూర్తయ్యాయి. శత్రువులకు శిక్షనీ, మిత్రుడికి స్థిరత్వాన్ని కల్పించడమనే రెండు ఫలాలు సరిసమంగా పంచడం పూర్తయ్యింది. (ద్విషది కోపః – సుహృది ప్రీతిః).
చాణక్యుడిక్కడ ‘వృషలాపేక్ష’ కారణంగా ఇంకా రాచకార్యాలు వదలదలచుకోలేదు సుమా! అని – ఇంకా తన పని పూర్తి కాలేదన్న సూచనను మరోసారి దృఢపరుస్తున్నాడు.
చాణక్య:
అథవా అగృహీతే రాక్షసే, కి మత్ఖాతం నన్దవంశస్య,
కింవా స్థైర్యం ఉత్పాదితం చన్ద్రగుప్తలక్ష్మ్యాః ? (విచిన్త్య)
అహో! రాక్షసస్య నన్దవంశే నిరతిశయో భక్తి గుణః! స
ఖలు కస్మింశ్చిదపి జీవతి నన్దాన్వయావయవే
వృషలస్య సాచివ్యం గ్రాహయితుం న శక్యతే।
త దభి యోగం ప్రతి నిరుద్యోగః శక్యో నావ –
స్థాపయితుమ్। అస్మాభి రన యైవ బుద్ధ్యా
తపోవనగతో ఽపి ఘాతిత స్తపస్వీ
నన్దవంశీయః సర్వార్థ సిద్ధిః। యావ దసౌ
మలయ కేతు మఞ్గీకృ త్యాస్మదుచ్ఛేదాయ
విపుల తరం ప్రయత్న ము పదర్శయ త్యేవ।
(ప్రత్యక్షవ దాకాశే లక్ష్యం బద్ధ్వా), సాధు!
అమాత్య రాక్షస సాధు! సాధు శ్రోత్రియ!
సాధు! సాధు! మన్త్రిబృహస్పతే సాధు!
కుతః…
అర్థం:
అథవా=కాకపోతే, రాక్షసే+అగృహీతే=రాక్షసమంత్రి పట్టుబడకుండా, నందవంశస్య+ఉత్ఖాతమ్=నందకులాన్ని దుంపనాశం చెయ్యడమనేది, కిమ్=ఏమి జరిగినట్టు? చంద్రగుప్త లక్ష్మ్యౌః= చంద్రగుప్తుడి వైభవానికి, కిం+వ+స్థైర్యం+ఉత్పాదితం?=ఏమి నిలకడ ఏర్పడినట్టు? (విచిన్త్య=ఆలోచించి), నందవంశే=నందకులం విషయంలో, రాక్షసస్య=రాక్షసమంత్రికి, నిరతిశయః=సాటిలేని, అహో+భక్తి గుణః=ఆహా! ఎంతటి భక్తి!, నందాన్వయ+అవయనే=నందవంశపు కుదురులో, కస్మింశ్చిత్+అపి+సః+ఖలు+జీవతి (సతి)=ఏ ఒక్కడు బ్రతికి ఉన్నా, వృషలస్య=చంద్రగుప్తుడికి, (రాక్షసమంత్రిణః)+సాచివ్యం=రాక్షసుడు మంత్రి కావడమనేది (అట్టి ఉద్దేశం), గ్రాహయితుం=ఊహించడానికి (కూడా), న+శక్యతే=సాధ్యపడదు, తత్=అందువల్ల, అభియోగం+ప్రతి=(చంద్రగుప్తుడి పట్ల) నేరం ఎంచడం విషయంలో, నిరుద్యోగః= (రాక్షసమంత్రిని) ఊరుకోబెట్టి (అతడి ప్రయత్నాలను విరమింపజేసి), అవస్థాపయితుం=ఆపడం, న+శక్యః=సాధ్యం కాదు.
అనయా బుద్దా+ఏవ=ఈ ఉద్దేశంతోనే, అస్మాభిః=మేము (మా చేత), తపోవనగతః+అపి=తపస్సు నిమిత్తం అడవికి పోయినప్పటికీ, తపస్వీ+నందవంశీయః+సర్వార్థసిద్ధిః=పాపం, నందవంశం వాడైన సర్వార్థసిద్ధి (ని), ఘాతితః=చంపిచాము. (చంపబడ్డాడు), యావత్=ఎంతో, అసౌ=ఈ, ఈ రాక్షసమంత్రి, మలయకేతుం+అంగీకృత్య= (పర్వతక పుత్రుడైన) మలయకేతుణ్ణి చేరదీసి, అస్మత్+ఉచ్ఛేదాయ=మమ్మల్ని కడతేర్చడం కోసం (కొరకు), విపులతరం+ప్రయత్నం=గట్టి ప్రయత్నం, ఉపదర్శయతి+ఏవ=కనబరుస్తునే ఉన్నాడు (ప్రత్యక్షవత్=అతడు ఎదుట ఉన్నట్టే ఊహించుకుని), ఆకాశే+లక్ష్యంబద్ధ్వా= ఆకాశంలోనే దృష్టి నిలిపి) సాధు=బాగుందయ్యా! అమాత్యం రాక్షస=రాక్షసమంత్రీ!, సాధు=బాగుంది. సాధు=చాలా బాగుంది!, శ్రోత్రియం=నిష్ఠాగరిష్ఠుడా!, సాధు=బాగుందయ్యా!,మంత్రిబృహస్పతే!=ఓహోయ్, బుద్ధికి బృహస్పతీ!, సాధు=చాలా బాగుంది.
కుతః=ఎందుకంటే…
వ్యాఖ్య:
చాణక్యుడిక్కడ తన బలం, రాక్షసమంత్రి బలం, బేరీజు వేసుకుంటున్నాడు. రాక్షసమంత్రిని ఎలాగైనా లొంగదీసి తన మిత్రుడు చంద్రగుప్తుడికి మంత్రిని చేయాలని చాణక్యుడి వ్యూహం. జరిగినవీ, జరగనివీ, పరిస్థితుల్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నాడు. రాక్షసమంత్రి పట్ల ఆరాధనా భావం ఉంది. అయితే – తగు జాగ్రత్త కూడా ఉంది. నందవంశం పట్ల రాక్షసమంత్రికి ఎంతటి భక్తి అంటే – ఆ వంశంలో ఏ ఒక్కడు మిగిలినా, తమని అతడు సాధించక వదలడు. అందుకే నిర్దాక్షిణ్యంగా సర్వార్థసిద్ధిని (రాజరికం వదిలేసి అడవులు పట్టిపోయినా) వేటాడి చంపించవలసివచ్చింది.
ఈ స్వగతంలో – “నందాన్వయావయవే” అనే ప్రయోగానికి బదులు “నందాన్వవాయే” అంటే అర్థం మరింత తేటగా ఉండగలదని నేలటూరి రామదాసయ్యంగారి సవరణ.
శ్రోత్రియ పద నిర్వచనం:
జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః
సంస్కారా ద్విజ ఉచ్యతే।
విద్యయా యాతి విప్రత్వం,
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే॥
పుట్టుక వల్ల బ్రాహ్మణుడు, ఉపనయనాది సంస్కారం వల్ల ద్విజుడు, చదువు వల్ల విప్రుడు, ఈ మూడూ కలిసిన వాడు శ్రోత్రియుడు అని అర్థం.
శ్లోకం:
ఐశ్వర్యా దన పేత మీశ్వర మయం
లోకోఽర్థత సేవతే
తం గచ్ఛ న్త్యను యే విపత్తిషు పున
స్తే తత్ప్రతిష్ఠాశయా
భర్తు ల్యే ప్రల యేఽపి పూర్వసుకృతా
సఞ్గేన నిస్సఞ్గయా
భక్త్యా కార్యధురం వహన్తి బహవ
స్తే దుర్లభా స్త్వాదృశాః – 14
అర్థం:
అయం+లోకః=ఈ ప్రపంచం (యీ జనం), అర్థతః=ధనకాంక్ష వల్ల, ఐశ్వర్యాత్+అనపేతం=వైభవం తొలగిపోని, ఈశ్వరం=ప్రభువును, సేవతే=ఆశ్రయించి నడుస్తుంటుంది, యే=ఎవరైతే, విపత్తిషు=ఆపదలలో, తమ్=ఆ ప్రభువును, అనుగచ్ఛంతి=తోడుగా అనుసరిస్తూంటారో, తే=వారు, పునః=మళ్ళీ, తత్+ప్రతిష్ఠ+ఆశయా=అతడు మళ్ళీ నిలదొక్కుకోవలనే ఆశతో, (సేవన్తే=సేవిస్తూంటారు), త్వాదృశాః=నీవంటివాళ్ళు (రాక్షసమంత్రిని గురించి), కృతినః=పుణ్యాత్ములు (ధన్యులు), ప్రళయే+అపిః=మహా విపత్తులో సహితం, పూర్వసుకృత+అసఞ్గేన=పూర్వపు ఆత్మీయానుబంధంతో, నిఃసంగయా+భక్త్యా=నిస్స్వార్థ బుద్ధితో, భర్తుః = ప్రభువు (యొక్క), కార్యధురాం=పనిభారాన్ని, వహన్తి=మోస్తూంటారు, తే=అట్టివారు, దుర్లభాః=చాలా అరుదుగా ఉంటుంటారు.
అలంకారం:
కావ్యలింగం అలంకారం. (సమర్థనీయ స్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్’ అని – కువలయానందం). నిస్స్వార్థ సేవకు – పునఃప్రతిష్ఠాశ నిఃసంగభక్తి కారణంగా సమర్థించడం వల్ల ఈ అలంకారం.
వృత్తం:
శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు
వ్యాఖ్య:
సాధారణంగా లోకం తీరు ‘పసిడి కల్గువాని బానిస కొడుకులు’ అని వేమన యోగి యీసడించిన తరహాగానే ఉంటుంది. ప్రభువు సంపదతో తులతూగుతూ ఉంటే చుట్టు ఆశ్రితులే ఆశ్రితులు! – అదే గనుక లేకపోతే ఒక్కడూ ఉండడు. (ఈ ఆధునిక కాలపు రాజకీయాలలో ఇది మరీ నిజం). అలాకాక తన ప్రభువు మళ్ళీ పుంజుకుని సుస్థిరుడు కావాలని ఆశిస్తూ, వదిలిపోకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు. అటువంటి అరుదైన వ్యక్తి, అసలైన శ్రోత్రియుడు కనుకనే రాక్షసమంత్రి తన మిత్రుడికి మంత్రి కావాలని చాణక్యుడి ఆశ. అందుకే మెచ్చుకోలు. (అతడు తన్ను బద్ధ శత్రువుగా భావిస్తున్నప్పటికీ!). ఈ శ్లోకంలో ‘కృతినః’ (ధన్యులు) అనే పాఠానికి ‘బహవః’ అనే పాఠాంతరం ఉంది.
చాణక్య: అతః ఏవ అస్మాకం త్వత్సంగ్రహే యత్నః కథమసౌ
వృషలస్య సాచివ్య గ్రహణేన సానుగ్రహఃస్యాత్
ఇతి – కుతః…
శ్లోకం:
అప్రాజ్జేన చ కాతరేన చ గుణః
స్యా ద్భక్తియుక్తేన కః?
ప్రజ్ఞావిక్రమశాలినోఽపి హి భవేత్
కిం భక్తి హీనాత్ ఫలం?
ప్రజ్ఞావిక్రమభక్తయః సముదితా
యేషాం గుణా భూతయే
తే భృత్యా నృపతేః కళత్ర మిత్రరే
సంపత్సు చాపత్సు చ – 15
అర్థం:
అతః+ఏవ=అందువల్లనే (నిస్సంగ ప్రభుభక్తి వల్లనే) త్వత్+సంగ్రహే=నిన్ను మా వైపు తిప్పుకోవడానికి, అస్మాకం+యత్నః= మా ప్రయత్నం, కుతః=ఎందుకంటావా,
శ్లోకార్థం:
భక్తియుక్తేన=భక్తి కలిగి, కాతరేణ+చ=భయస్వబావం కలిగి (ఉండడం చేత), అప్రాజ్ఞేన+చ=తెలివితక్కువతనం కూడా (కలిగిన వాడితో), కః+గుణ+తస్యాత్=ఏమి ప్రయోజనం ఉంటుంది? ప్రజ్ఞావిక్రమశాలినః+అపి=నేర్పు, వీరత్వం కలవాడైనా, భక్తిహీనాత్=భక్తి లేనివాడివల్ల, కిమ్+ఫలం+భవేత్+హి=ఏమి ఫలితం ఉంటుంది గనుక!, యేషా=ఎవరికి, ప్రజ్ఞా+విక్రమ+భక్తయః=ప్రజ్ఞ, విక్రమం, భక్తి అనే మూడు గుణాలు, సముదితాః= ఒక్క చోట కలిసి ఉంటాయో, తే=అట్టి, భృత్యాః=సేవకులు, భూతయే+భవన్తి=వైభవ కారకులు అవుతారు, ఇతరే=తక్కినవారు, సంపత్సు+చ=సంపద ఉన్న కాలంలోనూ, విపత్సు+చ=ఆపదలు చుట్టుముట్టిన కాలంలోనూ, కళత్రమ్+ఇవ=భార్య లాంటి వాళ్ళు.
అలంకారం:
అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం). ఈ శ్లోకంలో ‘తే భృత్యాః నృపతేః’; ‘కళత్ర మిత్రరే సంతత్సు చ’ అని యోగ్య సేవకుడి లక్షణాలకు ప్రోద్బలకంగా భార్య ప్రస్తావన తెచ్చి, అర్థాంతరాన్ని సూచించడం గమనించవచ్చు.
వృత్తం:
శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు
వ్యాఖ్య:
ప్రభువు పట్ల నిజమైన సేవా భావం కల వ్యక్తి ఎలా ఉండాలో చాణక్యుడు విశదం చేస్తున్నాడు. ఒకరకం: భక్తి ఉంటుంది, నేర్పు ఉండదు; భయస్థుడు కూడా – అయితే ఏం ప్రయోజనం? రెండవ రకం: వీరత్వం, నేర్పు ఉన్నాయి. భక్తి లేదు. ఇటువంటి వ్యక్తి వల్ల కూడా ప్రయోజనం శూన్యం. భక్తి, నేర్పు, వీరత్వం మూడూ ఒక్క చోట కలిసి ఉండడం ముఖ్యం. వైభవం, సంపదలు పెరుగుతాయి. అటువంటి సేవకులు శ్రేష్ఠులు. అలా కాని పక్షంలో ఒక బంధంగా భార్య, జీవితంలో భాగస్వామిని అయిన తీరుగా వుంటుంది (సేవకుడి సేవ).
(సశేషం)