విశ్వనాథ మార్గము-1

1
4

[box type=’note’ fontsize=’16’] విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కోవెల సుప్రసన్నాచార్య గారు రచించిన వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. ‘విశ్వనాథ మార్గము‘ అనే వ్యాసం మొదటి భాగం ఇది. [/box]

[dropcap]వి[/dropcap]శ్వనాథ మార్గాన్ని నిర్దేశించే ప్రయత్నం చేస్తూ ‘ఆద్యతనాంధ్రకవి ప్రపంచ నిర్మాత’ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి –

నా మార్గంబును గాదు శిష్యుడయినన్ నాతాత ముత్తాతలం
దే మార్గంబును కాదు వానిదేదియో?

అని జిజ్ఞాసను ప్రకటించారు. ‘నన్నయ్యకవి పెట్టినాడు కదా తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష, భిక్షమ్ములో భిక్ష పెట్టి శ్రీనాథాది కవుల కెల్లరకు తిక్కన మనీషి’ అన్నప్పుడు ఆయన తన తాత ముత్తాతలను పేర్కొన్నారు. విశ్వనాథ మూలాలు ఇంకా లోతులలోకి దిగి వెదికితే తప్ప దొరికే అవకాశం లేదు.

I

జాగ్రత్స్వప్న సుషుప్తులలో జాగ్రదావస్థ విచారణకు హేతువుకు విశ్లేషణకు స్థానమైతే స్వప్నం వీటిని బాహిరవెట్టి అవచేతననొంది అవ్యక్తంలో నుంచి, సమష్టి అవ్యక్తంలో నుంచి తెచ్చిన ఆనుభవాలకు రూపం కల్పిస్తుంది. కవితా ప్రపంచంలో, కళాసృజనలోకంలో మూలాధారం ఈ స్వప్న లోకమే. కవి జాగ్రదావస్థ నుంచి విముక్తుడై అవచేతనతో అనుసంధానం కల్పించుకున్నప్పుడే అతనిలోకి బింబాలు, ప్రతీకలు ప్రాగ్రూపాలు తెరలు తెరలుగా పొంగివస్తాయి. వాటికి జాగ్రదవస్థలోని భావసంపుటికీ అనుసంధానం చేయటంచేత కళా సృజన ఏర్పడుతుంది. అందుకే ఆధునిక సాహిత్య విచారణలో ఈ మనోలోక సమష్టిని అధ్యయనం చేయడం ప్రధానాంశమైంది.

ఎంత త్వరలో మనోలోకం లోతులలోకి పోగలగడమనేది ఆ రచయిత జాగ్రద హంతను మరచిపోగల లక్షణంలో ఉంటుంది. జాగ్రదావస్థను అతుక్కుని ఉండే రచయిత సమకాలీన అంశాలను దాటిపోలేడు. ఆ రచన కూడా ఆ విధంగా కాలపరిధికి బద్ధమై ఉంటుంది. ఏ సృజనాత్మక స్థితిలో తాను విశ్వచైతన్యంలో తన చైతన్యాన్ని అనుసంధించగలగడం సాధ్యమో; భాష, దేశ జాతి మానవతా పరిధులగుదాటి విశ్వ చైతన్యంలో ఐక్యభావం పొందుతాడో అప్పుడే విశ్వలయ ఆతని రచనలోకి జలపాతం లాగానో, ఉప్పొంగే ఊట లాగానో, అవతరణనో, ఉద్గమాన్నో పొందుతుంది.

వాల్మీకి భాషాసంక్రాంత ఋణాన్నీ సత్కావ్య రేఖా సామగ్రి ఋణాన్నీ ఈ సంసారం తీర్చగలదా అని ప్రశ్నించి కవి, భారతీయ కవిలోక మూలచైతన్యాన్ని పట్టుకొన్నాడు. సర్వ కావ్యవాక్కు ఆతని వదనసీమ నుండి జన్మించింది. ఇదేదో ప్రశంసా వాక్యం కాదు. వాల్మీకి కథలో ఉన్న ధార్మిక మత భావాలకు ద్వైతా ద్వైత విచారణలు ఉండనే ఉన్నాయి. తర్కం ఉన్నది. మతం ఒక వ్యవస్థను ఏర్పరచ వచ్చును. తత్త్వం దాని చుట్టూ ఒక తాత్త్విక జగత్తును నిర్మించవచ్చును. కాని వాల్మీకి సృజన ఈ పరిధులకు పరిమితులకు ఒదిగేది కాదేమో. ఆందుకే ‘యావత్ స్థాంస్యతి గిరియః …. తావద్రామాయణ కథా’ అనడం,

యూంగ్ చెప్పిన ఆనిమా, ఆనిమస్ తత్వాలు ప్రజాపతి శతరూపలు, ఆడమ్ ఈవ్‌లు, ఈ కథల వెనుక ఉన్న మౌలిక తత్త్వం గిరికుమారుని ప్రేమగీతాలలో ప్రణయ ప్రబంధమై విరిసింది. ఆనిమా ఆనిమస్‌లు వాళ్ల చుట్టూ స్వర్గ నరక లోకాలు, ఉద్యానాలు, చెట్లు, పూలు, పండ్లు, నదులు, పాములు, పర్వతాలు, కోకిలలు, చిలుకలు ఇవన్నీ ఆదిమ ప్రపంచంలోని అంశాలు. ఈ అంశాలే కథలు కథలుగా సహజాతాల ఒత్తిడిలో రూపాలు మార్చుకుంటూ తిరిగి తిరిగి వస్తూనే ఉంటవి. ఈ పునః పునరనుసంధానంలోనే మానవుడు వర్తమాన సంక్షోభంలో నుంచి విముక్తుడై విశ్వ తాదాత్మ్య దశకు చేరుకుంటాడు. ఏ కథకైనా ఇదే పరమార్థం.

కథలో పైకి కనిపించే అంశం ఊరికే పొర మాత్రమే. లోతులలోకి వెళ్లేకొద్దీ మౌలికాంశాల మార్గం ఒక్కొక్కటీ పొరలు తొరగుతూ బీజం దొరుకుతుంది. ఇది ఆధునిక సాహిత్యానుసంధానం చేసేవాళ్లు గుర్తుంచుకోవలసిన అంశం. ఇది వదలి వాచ్యార్థాన్ని ప్రధానంగా సమకాలపు పంజరాల్లో బంధించి పెడితే తత్త్వాన్ని గుర్తించడం అసాధ్యం.

‘రసము వేయి రెట్లు గొప్పది. నవ కథాధృతిని మించి’, ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అన్నప్పుడు కల్పవృక్షావతారికలో విశ్వనాథ నిర్దేశించిన అంశం ఇది. కథ అప్పుడు చెప్పబడుతుంది. రసము అనుభవ లోకంలోకి ప్రవేశించి సాధారణీకరణం పొందిన వేళ లభించేది. సాధారణీకరణంలో కథ ప్రాథమిక రూపాలు తొలగిపోయి ఆదిమ చైతన్య స్ఫురణ గలుగడం రససిద్ధాంతవేత్తలు వెయ్యేండ్ల క్రిందనే స్పష్టంగా తెలియజేశారు.

పై చూపు తొలగినప్పుడే లోపలి వెలుగు విచ్చుకుంటుంది. ధ్యాన వేళలో ఇంద్రియోపసంహరణం చేయడం ఇందుకే. వేయిపడగలలో ఒక గుడ్డివాడికి ఒక కుంటివాడు విద్యుద్దీపాలు వచ్చినయ్యని చెప్పి వాటిని చూపినప్పుడు వెలుగేది అంటే నీవు గ్రుడ్డివాడవు నీకెట్లా కన్పిస్తుందని అందరూ వెక్కిరిస్తారు అతన్ని. అతడేమో వీళ్లు పిచ్చివాళ్లు అనుకుంటాడు. వాళ్ళు అందరూ బాహిరమైన వెలుగులలోబడి ఆంతర లోకాన్ని విస్మరించారు. మూలంనుండి బాహిరింపబడ్డారు. కళ్ళు మూసుకొని ప్రశాంతిని అందుకోలేక బహిర్జగత్తులోని అల్లకల్లోలంలో, అశాంతిలో, సమన్వయలోపంలో విభ్రమం పొందుతున్నారు. ఈ విషయాన్ని తుమ్మపూడి కోటీశ్వరరావు పూర్వమే వ్యాఖ్యానించారు.

వాల్మీకి వ్యక్తావ్యక జగత్తులకు కల్పించిన సంధానం భారతీయ సాహిత్య అనుసంధానానికి మూలసూత్రం. వల్మీకంలో అవ్యక్తంగా ఉన్న వాక్కు మూలాధారం నుండి ఉద్గతమై వైఖరీదశను పొందటానికి అంతఃకరణ చైతన్యం చిత్త, ఆహంకార, బుద్ధి, మనస్సులస్తరాల నుండి ఎదిగి వచ్చింది. ఆ విషయమై చతుర్ముఖుడై న బ్రహ్మ ‘మచ్ఛందా దేవ తే బ్రహ్మన్, నిస్సృతేయం సరస్వతీ’ అన్న మాటకు గమ్యం. కల్పవృక్షంలో సీతారాముల వ్యక్తా వ్యక్తముల సమాహరణభావం పొందినవారు. ‘ఏపునమంటినుండి ఉదయించిన మైధిలి మింటినుండి ఆవాపముగొన్న రాఘవుడు (బాల-కల్యాణ-180). ఈ ఇద్దరూ దావా పృధివిల వలె సంగమించారు, ఇది విశ్వనాథ రామకథకు ఇచ్చిన తీర్పు. రామకథ విశ్వకథ అయింది.

రామకథ చెప్పిన వాల్మీకి యింకొకప్పుడు కోకిల. ఈ కోకిల ‘ఆరుహ్య కవితా శాభాం కూజతి’. ఈ మధుర మధురాక్షరముల శ్రుతివల్లనే ఆ కోకిలను గుర్తించటం. ఈ అవ్యక్తం కోసం వ్యక్తం పడే ఆవేదన సుందరకాండలో ఆంజనేయునితో శ్రీ రామచంద్రుడు ‘మధురా మధురాలాపా కిమాహ మమ భామినీ’ అన్నప్పుడు తెలియవస్తుంది. అందుకే రామాయణం ‘సీతాయాః చరితం మహత్’.

ఆ కోకిల ఎంత లోతులలో ఉన్నదో కల్పవృక్షం నిరూపించింది. ‘చుఱ చుఱ నెఱ్ఱనై చూచెడి చివురాకు, చివురాకు వెనుక పొంచిన లతాంత బాణుండు విసరగా పట్టిన పిడిబాకు, పిడిబాకు రివ్వున విసర దూసి చన్న సవ్వడితోని సన్న నిపికివాకు’, (అచ్చర కూడా పికివాకుతో మేళవించి సన్న గొంతు రాగముతోడ కులుకుతుంది.) అందువల్లనే ఒకేసారి గీతికా రసవార్ధి పొంగిన తరంగము, అచ్చరయు రెండుకన్నులలోనూ హృదయములోనూ ఆవిష్కృతమైనవి.

ఈ కోకిల ప్రకృతి గర్భంలో బీజభూతంగా ఉన్న ‘కామం’. అదే ఇతర రూపాలలో కవిత్వం, సౌందర్యం, అప్సరలు, శిల్పం మరేదైనా మరేదైనా. ఈ కోకిల తోటి జంట చిలుక. చిలుక చైతన్యంతో విధించిన మార్గంలో తీర్చబడ్డ అంశం. జాగ్రచ్చైతన్యావిష్కారం. ఒకటి మార్గమూ, రెండోది దేశి సంప్రదాయము. జానపదము – లేఖ్యము, మౌఖికము – నాగరకము, అనాగరకము – హేతువు, స్ఫురణ – శాస్త్రము, స్మృతి – ఫురుషుడు, ప్రకృతి – వస్తువు, ప్రతీక – ప్రత్యక్షము, అనుమానము – కల్పితకథ, ఆద్యకథ – శివశక్తులు ఇలా జంటలు జంటలుగా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. (స్మృతి అన్నప్పుడు ప్రాచీన స్మృతి సంపుటమని అర్థం) ‘కోకిలమ్మ పెళ్ళి’ లోనే ఈ మూలసూత్రాన్ని అందుకునే ప్రయత్నం జరిగినది.

అందుకే విశ్వామిత్రుడు ‘అసలు కోకిలయేమొ నాకర్థమయ్యే’ నంటాడు. ఈ అసలు కోకిలను వెదుక్కోవడంలో అతడు తన ఆంతర్యం లోతులలోకి చాలా ఆంతరాలు చీల్చుకుంటూ వెళ్లవలసి వచ్చింది. కామధేనువును కోరి క్రోధ వివశుడు కావడం తొలిమెట్టు. తన వ్యక్తిత్వాన్ని వ్యష్టిని సమష్టికంటే అధికమైనదిగా భావించి అహంతతో తాండవించే లక్షణం రెండోది. మూడవది కారుణ్యాది ఉత్తమ పురుష భావాలు పొంది శునశ్శేఫుని రక్షించినప్పుడు త్యాగవీరంతో స్వపుత్రులనే శపించే దశ. తరువాత తనలోని అచ్చమైన మూలవస్తువు శతరూప- ఈవ్- మేనక రూపంలో ఆవిర్భవించింది.

మానవుడు తనలో చీల్చుకుంటూ వెళ్ళుతూ తన స్త్రీ భావరూప కందాన్ని వెతుక్కుంటూ పోవడం, దానివలననే దాని స్వరూపాన్ని అవలోకించడంవల్ల ఒక రకమైన విడుదల కలుగుతుంది, ఈ ‘అసలు కోకిల’ తెలియడం అంటే సృషికి మూలమైన ‘ఆనిమ’ను గుర్తించడం అన్న మాట. తెరచిరాజు నవలలో సారథి తనలో అభినయ వేళ (మోహినీ రుక్మాంగద) స్ఫురించిన భావధార. ‘ఈమె యెవ్వరు? నా మనస్సులో నున్న స్త్రీ వాంఛ కాంతాకృతి పొంది నా యెదుటవచ్చి నిలుచుండెనా?’ అని వర్ణించినాడు. అభినయ వేళలో అతని హృదయములో నిజముగా నొక స్త్రీమూరి సమావిర్బవించుచున్నట్లే, ఆతని మేని కండల యూర్ధ్వచలనము భావించెను. అతని మొగములో మధురసృష్టి చేయు ప్రజాపతి యొక్క ఒక సమాధి స్థితి కనిపించెను. కల్పవృక్షంలో కామదేవుడైన మన్మథుని వర్ణిస్తూ ‘మరల సృష్టి యొనర్చు మహిత ప్రాతర్వేళ బ్రహ్మ దేవుని ఊహ వంటివాడు!’ (రా. క . బాల. 170) అని వర్ణిస్తాడు. దీనినే మరొక పార్శ్వం నుంచి శృంగార వీథిలోని శ్రీకృష్ణ దేవుని నిర్వేదంలో నిరూపించాడు. అష్టమహిషులు, రాధ, కుబ్ద ఇత్యాదిగా ఎందరైనా ఆయన కామ వాంఛా దృష్టికి చాలడంలేదు. ఏ ‘మాయా’ సమానీతమో గానీ ఆశ యొకండు ఆయన హృదయ కమలాన్ని వేధిస్తూనే ఉన్నది. రుక్మిణి గృహంలో ఉన్నప్పుడు సత్యభామను గూర్చిన కోరిక, అక్కడ మరొక యామెను గూర్చిన వాంఛ ఇలా నిలచీ నిలువక తీగసాగుతున్నది. రుక్మిణీ దేవి ఆకాశమై సత్యభామ జ్యోతిరంగనయై మిగిలిన మహిషులార్వురు వాయు దేవతా రూపములైనా ఆయనకు లగింపు జరగలేదు. రాధా కుబ్జలతో సంగమించినా ఆయనలోనున్న వాంఛ తుదముట్టలేదు. రాధ రసమై జలమైంది. కుబ్జ గంధవతియై పృథ్వియైంది. ఇది పంచభూతముల అట్టడుగున దిగి వచ్చిన సంకల్ప బీజము. ఆయన కనుల చివర నీలరేఖయే ప్రకృతిలోని వస్తువులలో చేసిన భావనయే ఆయనకు కామినియై కనిపించింది. బడబాగ్ని వంటి చుంబనాదికములతో వారికి లజ్జ లేక దిసమొలలతో సంచరించారు. మనస్సు లేని దేహములతో లైంగిక శక్తి పెనగొన్న చైతన్యంతో వారి సంగమం అన్ని మర్యాదలను అతిక్రమించింది.

సంకల్ప బీజము దిగివచ్చి జడ ప్రకృతిలో ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ కోశాల నుంచి జారి ప్రాణమయ భౌతిక పరిమితులలో సంచరించటం ఈ ఇతివృత్తం. ఆద్యమైన కామస్వరూపం ఇది. నీవెవరవని ఆయన అడగటం ఆమె ‘మాయలాడ’ అనబోయి సగమనగానే మాయవా తెలిసే అన్నాడు. ఈ తెలియడం స్వ స్వరూపావగాహన. చీకటి గుహలోకి వెళ్ళి తన్ను తాను కోల్పోయి మూలం దొరికి మళ్ళీ స్వభావ జ్ఞానం పొందిన స్థితి యిది. అప్పటిస్థితి మళ్ళీ తొలిస్పదం కలిగిన ప్రజాపతి దశ. ‘సోఽకామయత బహుస్యాం ప్రజాయేయేతి’ అన్నప్పటిది. అప్పుడు స్వామికి ‘అను జగదీశు నేత్రములనాడికి సూర్యుడు చంద్రుడున్’ వినూతనముగ ఫాలంమీద ఒక కన్ను మొలచింది. దాని కాంతివల్ల లోపలికి, బయటకు వేళ్ళుచాచి కొమ్మలతో పెరిగిఉన్న పెద్దచెట్టు వంటి ఈ మోహవ్యూహం నశించింది. స్వామి బోధాయిత మూర్తియైనాడు. ననసుధాయిత బ్రహ్మము నైనాడు. ఆతడే అన్నీ, ఏదీ కాదు. సృష్టితో తాదాత్మ్యము, విముక్తీ ఏకకాలంలో సంభవించినవని తాత్పర్యం. మళ్ళీ ఆయన ప్రజాపతి ‘తత్ర్పభుదృగంతపు వెన్నెల సర్వమై చనున్’ పంచకోశములను ఆవరించి వాటికి వెలిగా కూడ నిలువగలిగినవాడు.

ఋష్యశృంగునికి వారకాంతలు కలిగించిన కామభావ ప్రబోధం మరొక విలక్షణ దృశ్యం. వారు పాడినప్పుడు ‘తనగొంతులోన నూరు నినాదము ఆపూర్వ, నినదితంబులు వచ్చి నిట్టి బొడిచి’ – మొదలుగా వర్ణన అతణ్ణి కుదిపివేసింది. వాళ్ళ నాట్యం నాలుగు సముద్రాలు ఒకేసారి వచ్చి ముంచినట్లయింది. ‘ఆనిమ’ అతనిలో గొప్పగా మరో లోక రహస్య వికృతిగా కొనసాగింది.

విశ్వనాథ రచనా ప్రపంచంలో ఆది కామ దేవత యొక్క రూపాల శతాధికంగా అపూర్వ వైవిధ్యంతో కనిపిస్తాయి. అనుకూల ప్రతికూల రూపాలు కూడా విభిన్న సంస్కార శ్రేణిలో దర్శనమిస్తాయి. శూర్పణఖను అరణ్యకాండలో పరిచయం చేస్తూ కవి ‘విరిసి మన్మధరాజు బిట్టావులించిన ఆకాశమది రూపమందే’ననగ ఇత్యాది వర్ణన కామ భావము యొక్క వికృత దశను నిరూపించేది. తెరచిరాజులో జమీందారు పైకి ఏకపత్నీ వ్రతుడని ఎంతగా ప్రచారం చేయించుకున్నా కేవలం గోముఖ వ్యాఘ్రం, ఆ పులికి స్త్రీ రుచి తెలుసు. అందుకే ‘గాయములేని దేహము మీదనే నెత్తురు చూచుచుండెను, అనావిద్దంరత్నం అన్న కాళిదాసు కూడా సుకుమారంగానైనా ఈ భావస్ఫరణ కలిగిస్తున్నాడు.

‘అల అరుంధతియును, నహల్యయును కోసలాత్మ జాతయును మూవురి ఆననముల
కన్నను పవిత్రమగు శృంగారభావ మొడిసిపట్టిన ముఖచంద్రుడొకడు తోచె’
‘దృగింద్రీయ గత పరమార్థమగుచు హృదయ దఘ్నమై రక్త యరీనిలీన
వేగ మాధుర్య పరసీమల్లె గసేషి తార్థ సంపాదియై దర్శనాధ్వ మొసగే’

(రామా. కల్ప. బాల. ధమస్)

ఇది శ్రీ రామునిలో కలిగిన ప్రథమ శృంగార భావ స్పందం. సీతాదేవి దర్శనంలో ఆయన మూడు బింబములను దర్శించి వాటికి పైగా పూర్ణతమమైన దేవీ దర్శనాన్ని పొందినాడు.

అహల్య:

కామభావముల స్రోతమే. వ్యవస్థలో ఒదిగిన ఆమె సంకల్ప స్థాయిలో కొంచెము చ్యుతి పొందింది. కళామయ మైన ఆమె చైతన్యం మన స్సంయమాది విధానంలో ఓడిపోయింది. అయితే ఆమె పశ్చాత్తాపం ఆ స్థితినుంచి ఉజ్జ్వలమైన పాతివ్రత్యభావ పరిధి లోకి తిరిగి తెచ్చి నిలబెట్టింది. ఒక క్షాళనలాంటి దశ లోనుంచి ఆమె తపస్సు కొనసాగింది.

అరుంధతి:

ఈమె పాతివ్రత్య భావ ప్రతీక. ‘అంగనాజన్మ చారితార్థ్యాచరణము అవయవంబుల గన్న పుణ్యముల ప్రోవరుంధతీ దేవి ఏ మునీంద్రుని గృహంబు వెలుగు’ అని వశిష్ఠుని గూర్చిన కవిపరిచయం ఆమె వెలుగు.

కోసలాత్మజాత:

ఈమె తల్లి. మాతృభావ ప్రతీక. ఆదిప్రతీకయైన కశ్యపునితోడి సృష్టికారణమైన ‘అదితి’. ఈమె లేనిది సృష్టి లేదు. శ్రీరామునిగన్న జగన్మాత. దివ్వత్వావిర్భావం యిక్కడనే సంభవించింది. ఈమెకు వ్యతిరేక ముఖం దితి. అనుకూల వ్యతిరేక పార్శ్వాలలో సృష్టి వ్యవహారం సాగిస్తూ ఉన్నారు వాళ్లిద్దరూ. అమృతమూ, హాలాహలమూ వీళ్లలో నుంచే ఉద్భవిస్తవి. అదితి, దితీ యిద్దరికి వేరొక ఆదిమమైన జంట వినతా కద్రువలు. వినత రెక్కలతోటి ఆకాశంలోకి ఎగిరే పక్షులకూ, కద్రువ భూమిమీద నుండి పాతాళానికి క్రుంగిపోయే పాములకూ తల్లులు. సృష్టి యొక్క ఊర్ధ్వగ ఆధోగ ప్రవృత్తులు వీరివల్ల వ్యక్తమౌతున్నవి. కైకసి కూడ దితి కద్రువల మరోరూపం, శ్రీరాముని దర్శనంలో కనిపించిన సీత ఆద్యాశక్తి. ఆమె శ్రీదేవి. ‘భ్రమరవాసిని’లో రణరంభ. మహాలక్ష్మి. ఆమె అనుగ్రహించి ఇస్తే లోకంలో రసలోక రామణీయక మూర్తి గా ఆవిర్భవించిన వ్యక్తి అమృత ప్రభ. వేయిపడగలలో కశ్యప ప్రజాపతి స్థానం రామేశ్వర శాస్త్రిది. ఆయనలోనుండి వచ్చిన ప్రవృత్తి ధర్మం వెంట వచ్చిన శృంగార కేంద్రం అరుంధతి. వసిష్ఠారుంధతుల ప్రాగ్రూపాల మరొక జంట ఆరుంధతీ ధర్మారావులు.

అందువల్లనే సీతాదేవి ఆ మువ్వురి పరిధిని అతిక్రమించినది, పవిత్రమైనది. పాతివ్రత్యాన్ని ‘చేతో మోహ కుల్యానదీ మర్యాదాకృతి తీర్చుయోగమిది’ అని వ్యాఖ్యానించింది. లోకంలో ఉన్న వ్యతిరేక ముఖమైన దైత్యగుణాన్ని విశ్లేథం చేసి ఆ స్థానంలో దైవగుణాన్ని స్థాపించేందుకు మూల ప్రకృతి యొక జడస్థితికి ప్రతీకయైన లంకానగరానికి ఆమె వెళ్ళింది. సీతా రావణుల సంఘర్షణకు అదే మూలం. కల్ప వృక్ష కేంద్ర స్థానం.

సీతా రాముల సంగమం ప్రథమ సృష్టి యొక్క అకలుషస్పందం. ‘ఆహిత రామ పుష్కర దయాహత లక్షణ సీత కోటి వర్షాహత సర్వసాగర సరస్సరిదానత భావమందుచో’ సర్వసాగర సరస్సరిదానత భావము సృష్ట్యాదిలో ఎలా ఉండి ఉంటుంది! ఎంతటి అర్థవంతమైన భావబింబం ఇది. దీనికి సమాంతర మైన అనుభవాన్నే రచయిత ముఖలింగంలో పొందాడు స్వయంగా. ఆ ముఖలింగమును దర్శించటానికి పోయినపుడు వంశధారానది పొంగి రాకపోకలకు ఆటంకమైనది. ‘ఆంధ్రప్రశస్తి’లో ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ

ఏ పరజన్మలో కలసి యేమొక తల్లియు బిడ్డమైతిమో
నాపయి ఈ ధరాస్థలికి నాటిన ప్రేమ మరెంతయో కదా
తేపకు వంశధార పఱతెంచి దిశాఖిల మార్గ రోధియై
ఈ పయనమ్ము నన్ను చననీయక నిల్పుకొనెం దనంతటన్

ప్రకృతి తాదాత్మ్యాన్ని పొందించి తనలో పొదువుకున్నది. ఇక్కడ వంశధారా శబ్దం అవచేతనానుభవానికి లోనుచేసే మానవుల పూర్వస్మృతి సంపుటమైన సమష్టి అవచేతనను స్ఫురింపజేస్తున్నది. కల్యాణఖండంలోని అనుభవానికి మరొక అంచుగా ఉపసంహరణ ఖండంలో మళ్లీ శ్రీరాముడు ఇలా అంటున్నాడు.

‘నెలత సృష్టికి నేల సగము, వీరము సగమ్ముగానయి నెగడినట్లు,
పైన మన మిద్దఱము నున్న పగిదిగాగ కానుపించుచున్నది కాదె’…

ఆద్య జీవబింబాలతో సంధానపరచుకోవడం ఇక్కడ ప్రధానాంశం. ఆది స్త్రీ భావ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- ‘ఈ ఆడది సీత కోరక మహాసుర సంహరణంబు లేదా యా యాడది లేక లేదు జగమంచు ఇదంతయు నేన చేసితిన్’ అని సర్వభావ కర్తృత్వాన్ని స్థాపిస్తుంది. ‘న చేత్ ఏవం దేవః న ఖలు కుశలః స్పందితుమపి’ అని సౌందర్యలహరి.

వశిష్ఠుడు అరుంధతి శరీరాన్ని నూరుసార్లు దహించి మళ్లీ నిలబెట్టినాడన్నా, తల్లియైన రేణుకను పరశురాముడు ఛిన్నమస్తకను చేసినాడన్నా, రావణుని తలలను వందసార్లు శ్రీ రాముడు భేదించినాడన్నా ఈ ఆదిస్పందాన్ని సంస్కరిస్తూ పోవువరకే. కామము ఆహంకారమైనప్పుడు రావణుని తత్త్వం ఏర్పడ్డది. అందుకే వాడు ఆది మిథనాన్ని విడదీసి ధర్మవ్యత్యయాన్ని కల్పించాలని ప్రయత్నం చేశాడు. ‘ఆన్నూ, కామమనంగ సృష్టి ప్రథమాహంకారమే జానకీ’ అని విషయాన్ని తేల్చి వేశాడు.

విశ్వనాథ రచనలో ఈ ఆది కామప్రతీక యొక్క అనుకూల వ్యతిరేక ప్రాగ్రూప సృష్టి అనంతంగా కొనసాగింది. భిన్న భిన్న స్తరాలలో ఈ వ్యక్తులు స్త్రీ పురుష రూపాలలో ఆవిష్కరింపబడ్డారు.

సీత, రణరంభ, అమృత ప్రభ వంటి మూర్తులతో పాటు గిరిక శశిరేఖలు రస లోకంలో దివ్యా దివ్య భూమికలలో వ్యక్తమైన ప్రణయోపాసికలు. అహల్య మార్గంలో తాము గుడుసుళ్లు పడ్డ వాళ్లు ఏకవీర, మంగమ్మ, రత్నావళి వంటివాళ్ళు, గిరికకు మరొక ప్రతిరూపం చందవోలు రాణిలోని సరోజలోచన.

వ్యతిరేక ముఖంలో కామభావము యొక్క తీవ్రావిష్కరణం కల్పవృక్షంలో శూర్పణఖ ఆయితే నవలా ప్రపంచంలో సోఫియా (ఆఱు నదులు) మహేశ్వరి (నాస్తిక ధూమము) బాణావతిలో కామపిశాచము ఇలా పేర్కొనవచ్చు.

పురుష ప్రకృతిలో రావణు డెట్లాగో వ్యతిరేక ముఖంలో ఉన్న కామోన్మత్తులు – స్వర్గానికి నిచ్చెనలలో వామదేవుడు, పులిమ్రుగ్గులో సుశర్మ, పురాణవైరము నవలా మాలికలో జయద్రధుడు మిహిరకులుడు పరిశీలించదగినవాళ్లు.

ఈ కామమన్న మద్దిని మొదలంట దహించే ప్రయత్నం విశ్వనాథ రచనలలో తొలినుండీ కానవస్తున్నది. దాన్ని శ్రీకృష్ణదేవుని నిర్వేదములో, తెరచి రాజులో, కల్పవృక్షంలో స్పష్టంగా నిరూపిస్తాడు. ఏకవీరలో ఆంతరమైన సంఘర్షణాత్మకంగా నిరూపిస్తాడు. ఏకవీరలోని ఈ ఘర్షణ నారీ ప్రకృతికి దర్పణం పడుతుంది. అయితే ఆమెలో ఉన్న ధర్మ ప్రాగ్రూపం – అమృతం ‘ఆరుంజే విరుంబు’ అన్న మాట వల్లిస్తూ అవచేతనతో సంబంధాన్ని అనుసంధిస్తుంది. శరీరం హఠాదావేశంలో వీరభూపతి స్పర్శ పొందినప్పుడు ఆమె రెండై సుందరేశ్వరుని ఆవేశానికి ఉపకరణంగానూ వీర భూపతి చేత స్పృష్టమై చ్యుతగా నిలిచింది. ఘర్షణ వల్ల పొందిన ధర్మాధర్మ సంధి పాగ్రూపం. తెరచిరాజు లో ‘ఆధీ’ అని సారథిని ప్రతీక చేసి ఆతనిలోని ఈ మూలాన్ని నాటకంలో పెకలించే ప్రయత్నం నిరూపిస్తాడు. సారథి ఒక చోట ‘మాయ అనగా స్త్రీ. స్త్రీ యందున్న పురుషుని ఆశయే’ ……. ‘మాయ అన్న అరటి చెట్టు గెల వేసిన పిమ్మట కొట్టివేసినను దానిచుట్టునున్న పిలకలు గూడా చెట్లుగా పెరుగును. అందుకే ‘కవితా రూప తపస్సు చేసెద’నని చెప్పుతూ ‘హరింపజేయుటకు మా రోడ్తున్ జుమీ’ అంటాడు. మాయ….. దాని ప్రధాన లక్షణము స్త్రీ’ అంటాడు.

II

‘బ్రహ్మలోకమునందు బ్రహ్మ సరస్సు ఉన్నదట. అ సరస్సు నాశ్రయించి యామె యుండునట. అచ్చటినుండి నదీ రూపమున ప్రవహించుచున్నది. ఆ సరస్సు స్వరూపమేమి?… … బ్రహ్మ పదార్థమనగా ననంత చైతన్యము ఇవియన్నియు నెచటినుండి సముద్భవించుచున్నవో, అట్టిచోటు, తన్మహా చైతన్యమున నున్న యొక కొటారు అనవచ్చును. … వాగ్దేవి యనగా సరస్వతి అచటినుండి ప్రవహించుచున్నది’. (కావ్యానందము 2,3 పే) ఆధునిక మనశ్శాస్త్రం చెప్పే సమష్టి అవచైతన్య భూమికీ ఈ బ్రహ్మ సరస్సుకూ అభేదమే బ్రహ్మ బృహత్ శబ్దము సమష్టి తత్త్వాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఇది కొటారు అవడంచేత ప్రాచీన ప్రాచీనానుభవాలు అన్నీ అక్కడ కేంద్రీకృతమౌతూ మాతో వున్నాయని భావం, ప్రాగ్గాథలు (మిథ్స్, ప్రాగ్రూపాలు అన్నీ ఆ చోటునుంచీ సాగివచ్చే అంశాలే.

విశ్వనాథ భావించిన ఈ బ్రహ్మ సరస్సు సృజనశక్తికి మూల కేంద్రం. కవి సృజనోన్ముఖుడు కాగానే అతని మనస్సు ఈ సరస్సుదాకా అనుసంధానం పొందే ప్రయత్నం చేస్తుంది, తన జాగ్రన్మనస్సును దాటి అవచేతనను దాటి, సుప్త చేతనను దాటితేనే ఈ బ్రహ్మ సరస్పుతోడి సంపర్కం యేర్పడుతుంది. జాగ్రద్దశను అంటి పెట్టుకుని ఉండే రచయిత లోలోతులలోకి పోలేడు. ఎప్పుడూ సృజన భూముల పొలిమేరలలో నుంచి జాగ్రద్దశ కు తిరిగి తిరిగి వస్తూ పుంటాడు. ఆవిష్టుడైన రచయిత తన్ను తాను మరచిపోయి ఈ మూడు దశలలో నుంచి సాగిపోయి తురీయ దశకు చేరుకుంటాడు. జాగ్రద్దశ తోడి సంకెల సమకాలీనత తోడ, తన వైయక్తిక పరిమితులతోడ ఉండే అనుబంధాన్ని నిలిపి ఉంచుతుంది, నేలవీడని మొక్కలాంటిది ఈ దశ. రెక్కలు చాచి తీరికగా గాలిలో తేలిపోయెడి అంచవంటి స్థితికి రావడానికి జాగ్రద్దశా సంపర్కాన్ని వదలుకోవలసి ఉంటుంది. సర్కస్‌లో ఊయెలల ఆటలో తానుపట్టిన ఊయెల వదలితే తప్ప మరొక ఊయల అందుకోలేడు. అద్భుతాన్ని సృష్టించలేడు. ఏ నిమిష శతాంశమో ఒకటి వదలి రెండవది అందుకోని సంధిదశ ఉంటుందేమో.

సత్యనారాయణగారి రచనా వైఖరి తెలిసినవారికి ఈ విషయం సులభంగా బోధపడుతుంది. ఆయన రచన ప్రారంభించగానే ఒకానొక పారవశ్య దశ లోకి జారిపోయేవారు. అంతకుపూర్వం ఆయన ఏదైనా వస్తువు గూర్చికాని మరొక దానినిగూర్చి గానీ ఊహించి ఉన్నా దానితో సంబంధం లేకుండా ఆకస్మికంగా రచన శబ్దార్థ సన్నివేశాన్ని పొంది జలపాతంగా దూకివచ్చేది. Every letter I must say is an automatic outburst of the mood in which I will be placed. This is a wounder to me and I am never able analyse of to this state of my mind. (విమర్శిని, 2-9వ పే)

కొన్ని మారులు కల్పవృక్ష రచనా వేళలో కొన్ని నవలలు చెప్పుతూ వున్న వేళలో ఉన్న ఈ రచయితకు ఈ విషయం ప్రత్యక్షానుభవమే. మనతో సామాన్య వ్యవహారం చేస్తూనే మాట్లాడుతూ, తిరుగుతూనే ఇరవై, ముప్పై పద్యాలు మనస్సులో రూపొందించి ఒకేసారి కాగితం మీద పెట్టడం జరిగేది.

మానవ చైతన్యపు లోతులలో ప్రాగ్రూప ప్రదర్శకాంశాలైన ఒత్తిడులతో వెలువడే అంశాలు సమష్టి స్వప్నాలవంటివి. కవిత్వమొక జాగ్రత్స్వప్నమని చెప్పిన విశ్వనాథ ఈ భావమును సంపూర్ణముగా నెరిగినవాడు. భావకవిత్వం కవిస్వప్నమైతే ఇతిహాసం ఆ జాతి స్వప్నం.

కిన్నెరసాని పాటల ఆముఖంలో రచయిత తన లోతులలోకి పోయే ప్రక్రమాన్ని యిలా వర్ణించాడు:

వనములను దాటి వెన్నెల బయలు దాటి
తోటలను దాటి దుర్గమాద్రులను దాటి
పులుల అడుగుల అడుగులు కలుపుకొంచు
‘రాళ్లవాగు’ దాటి పథాంతరములు దాటి
అచట కిన్నెరసాని –
నాయాత్మయందు
యిప్పటికి దాని సంగీతమే నదించు.

తన ఆత్మ యింతగా ప్రయాణం చేసి కిన్నెర సంగీతం చేరువకు వచ్చింది. ‘ఆ భయంకరాటవుల మధ్యమున యందు, ఆ మహా వ్యాఘ్ర పాద చిహ్నముల యందు ఆ కుటిల మార్గములయందు – ఇవి మూడు దశలు. ఇవి దాటాక ‘అమృత శాంతమైన గీతిక కిన్నెరసాని మ్రోయు’ ఇది సర్వ ప్రకృతి అనుభవము కావటం వల్ల బహుకాలంమీద పొంగులుడిగి శమించినది కావటం చేత అమృతమైంది, శాంతమైందీ. అవ్యక్తపుదారులలోని సంచారం కావటంవలన శబ్దమును దాటి కవిలోని సంగీతాత్మ కలలు కన్నది. ‘ఇప్పటికి దాని సంగీతమే నదించు’. తరువాత ఎప్పుడో షష్టిపూర్తి రోజులలో రచించిన పాము పాటలో ‘తెలుంగు కవి జగచ్చంద్రుని’ సంగీతాత్మను ప్రసక్తం చేశారు.

ఇది కారణంగా విశ్వనాథ రచనలో వైయక్తికానుభవాల పరిధులు అంతరించినవి. సమకాలీన సృష్టి అప్రధానమైంది. విశ్వచైతన్య బృహద్విలాసాలకు ఆయన సృష్టికి మూలవస్తువు బింబాలు, ప్రతీకలు, అలంకారాలు వస్తువు, ఆలంబనోద్దీపన విభావాలు అన్నీ ఆ తొలి కొటారునించి వెలువడి వచ్చేవే. ఆయన రచనలలో వర్తమాన కథకూ, ప్రాక్కథకూ విభజన రేఖ తొలగిపోయింది. ఏకవీర ఎంత మానుష కథయో అంత వేగై నదీ కథ. కిన్నెరసానిలో నదీ పర్వతాలు, మోయు తుమ్మెదలో మోదులవాగు అన్నీ అనుభవద్వారాలే. చెలియలికట్టలో రత్నావళి- సీతారామయ్య రంగడు ఒక త్రిభుజమైతే, సముద్రం. బైరాగి. తుఫాను ఇది మరొక ప్రాకృతిక త్రిభుజం. ఈ బైరాగి ‘మనసు గుఱ్ఱములోరి మనిషీ’ అంటూ పాడి మరొక చోట అంధభిక్షువై పూర్మజన్మ తీరాలకు తన దాశరథీ శతక పద్యం ద్వారా ప్రయాణం చేయిస్తాడు. రంభ జగత్ సముద్రంలోనుంచి పొంగివచ్చిన సౌందర్య భావ ప్రతీక. శుకునితో ఇలా అంటుంది. ‘భావము లేల చంపుటకు బాల్పడే దీ ప్రతి చంపు వెంట హత్యావధి చేరుచున్నది కదా’. అయినా అతన్ని చక్కగా అంచనా వేస్తుంది.

‘తను వొకచోట నుండియు సదాగతి యుక్తుడ వంత రానలో
చనములు మూసియున్ నిఖిల సాక్షివి పల్కకయున్ సమస్త భా
వ నిలయ బుద్ది వీని యను భావనలో సహజ స్వయం ప్రతా
రణ మొనగూడి యున్న యది రా’

ఇక్కడ ప్రతారణము ఈ వైరుధ్యాన్ని అనుసంధిస్తూనే దానిని దాటడమని తెలుసుకోవాలి. గుఱ్ఱము ప్రాణశక్తియై అశ్వమేధాశ్వమై, మనస్సై కానవస్తుంది. ఏకవీర మనస్సులో గుఱ్ఱపు వాళ్ల పిల్లయై, ఏకవీరలోని ప్రాణశక్తికి దారి తప్పకుండా కాస్తుంటుంది.

స్వర్గానికి నిచ్చెనలలో పర్వతము శయనిస్తున్న మహాపురుషుడై ఎదురుదాడిని తట్టుకోలేక నిదురపోయిన భారతీయ చైతన్యాన్ని స్ఫురింపజేస్తుంది

‘నీరథము’లో అప్రతిహతమైన ఈశ్వరుని రథం వస్తువైతే లోకంలోకి దిగి వచ్చిన రథం ఒక ధర్మ నిర్వహణలో తనవారని ఎదుటివారని భేదమెరుగని మాధవ వర్మ రథం ఆంధ్రపశస్త్రిలో దర్శనమిస్తుంది. ‘చందవోలు రాణి’లో నేరెళ్ల బావి ప్రసక్తి వస్తుంది. ఇది పురాణాలలో కానవచ్చే గుహ కావచ్చు, ‘నిహితం గుహాయాం ‘ హృదయ గుహలో స్ఫురించే తేజస్సు సుబ్రహ్మణ్యము.

ధర్మచక్రములోని చక్రము చక్రం అంచులో బడి పరిభ్రమిస్తున్న జీవుణ్ణి కేంద్రందాకా లాగికొని పోతున్నది.

కల్పవృక్షంలో శార్జం ప్రధాన ప్రతీక ఐంది. ‘శార్జధను శ్చటులోగ్రశృంగ గుంఫనములు లేనిచో గురుతు వట్టియయుండరు. సర్వ దేవతల్’ – దశరథ యజ్ఞ సమయంలో తన బహకల్ప నిత్యమగు తాపసీరూపున వచ్చినాడు నారాయణుడు. అది ఈశ్వరుని ప్రాగ్రూపము. ఆయనను స్తుతించే దేవతలు ఆయనకూ, ఆయన ధనుస్సుకూ జంటగా నమస్కరించినారు. తొలిముని బుజమ్ము పై నొప్పె తొలిధనుస్సు. ఈ ధనుస్సు కల్పవృక్షంలో ముఖ్యంగా యుద్ధకాండలో తన విలక్షణతను చూపిస్తుంది. శ్రీరామచంద్రుడు లంకలో అల్లెత్రాడు మోయించినప్పటి ధ్వనిని కవి ఐదు పద్యాలలో (సంశయ.204-208) వర్ణిస్తాడు. అక్కడ యుగాలనాటి స్మృతియే వస్తువు.

“పరగ బుద్ధియందు ప్రత్యగ్రమైయున్న శార్జకంఠరవము సంతరించి మృదుల రీతి వీణ మీటిన యట్లుగా నార్చె రామచంద్రు డల్లెత్రాడు’. ఆ నాదం విన్నప్పుడు లక్ష్మణుడే ఆశ్చర్యం చెందాడు.

‘అరయన్ మున్నెఱుగంగ నగ్రజు ధనుర్జ్యా నిస్స్వనంబుల్ దిశాం
బర నానాణు విభేదనోద్దుర వినిస్స్వానంబు సౌమిత్రి భూ
పర మోద్య న్నవరావమున్ విని ప్రభు ప్రావీణ్య ధారా నిరం
తర నూత్నత్వమునందు గాంచె దశకంఠచ్ఛే దనారంభముల్’

బాలకాండలో నుంచి యుద్ధకాండదాకా లంకె వేశాడు. కథలో శార్జధనుశ్చటులోగ్రశృంగ గుంఫనానికి, గోపురాన్ని పడగొట్టే ముందు చేసిన జ్యానినాదం ‘ధారాకచ్ఛపీనాద సుందరము’, ‘దైత్య జన హృత్సమ్మోద భీదాయి’గా నున్నదట. దైత్యులందరికీ పగతోపాటు ఆంతర్యంలో రామునిచేత చావవలెననే తీయని కోరిక.

వేయిపడగలలో కథ ఎంత మానుషమో అంత ప్రతీకాత్మకం. ఆదీ అంతగా ప్రాగ్రూప చైతన్య సంకలితం. పాక్కథా లక్షణ లక్షితం. గుప్త విద్యా ప్రకాశకం. నానా శాస్త్ర విజ్ఞాన సంకలితం. యోగ దీపిక మధురభక్తి పారిజాతం. ఎన్నో అంతస్తులలో సాక్షాత్కరించుకోవలసిన ఆధునిక మహేతిహాసం.

గిరిక కథలో భాగవతగంగ పొంగెత్తింది. కల్యాణోత్సవాలలో వెన్నెలలు, అవతార పారమార్థ్యాన్ని వ్యాఖ్యానించాయి. గణాచారి కాలానికి దూతిక అయింది. పసరిక ప్రకృతి అకలుషమయిన స్థితిని వ్యంజింపజేసే విశిష్ట వ్యక్తి. సామరస్యం ప్రకృతిలో నిలువబడటం ప్రకృతికీ పసరికకూ పాణం. సామరస్యం కోల్పోయి నాగరకతా కృత్రిమ మాయా యుద్ధంలో ప్రకృతి అసహాయగా, ఒంటరిగా మానవుని క్రౌర్యానికి లక్ష్యంగా నిలబడింది. ఈ దృష్టిలో సామరస్యం తొలగి పోయి వికలమయిన ప్రకృతి వేయిపడగలలో వస్తువయింది.

వేయిపడగల పాము సుబ్రహ్మణ్యేశ్వరుడు మూలమైన సృష్టి ద్రవ్యం, దాని లోని ప్రథమ స్పందం ఏనుగులు, చెట్లు, పాములు, కోతులు, మబ్బులు; వరద పొంగులు, మఱ్ఱిచెట్టు, ఋతువులు, దివారాత్రాలు… ఇలా వేయిపడగలలో తమ వంతు పాత్రను నిర్వహించని ప్రకృతి ద్రవ్యం ఏది? మానుష ప్రపంచంలో ఎన్ని జంటలు అనుకూల వ్యతిరేక రూపాలు, ఈ దృష్టితో ఆ ఒక్క రచనకు ఎంతో వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది.

విశ్వనాథ భావించిన ప్రపంచంలో ఒక ఆదిమత ఉన్నది. ఒక అకృత్రిమత ఉన్నది. ఒక ఆనంతత ఉన్నది. అనంతకాల సాంతత్యం ఉన్నది, మేధ రాక్షసమై , నాగరకత శాపమై, దుఃఖసంక్రాంతమై పరస్పర విశ్వాసము, ఆర్ద్రత లోపించిన మానవ సమాజం ఎడల అపారమైన కారుణ్యం ఉన్నది. అది తమసానదీ తీరంలో బోయ క్రౌంచపక్షిని కొట్టినప్పుడు వాల్మీకికి కలిగిన దుఃఖం వంటిది, కవి కాబట్టి కరగి, వాగై నీరై ప్రవహించాడు. ‘ఈవు రసాకృతి కావున ఈ వైఖరి ప్రవహించితి’,

ఇలాంటి విశ్వలయానుబంధంగా గుండె చప్పుళ్లు నెరపే వ్యక్తికి బుద్ధి చేత నిర్మితాలైన ఏ సిద్దాంతాలూ, తత్త్వదృష్టి, ఆలోచనా తమ పరిమితులలో బంధించలేవు. కళాసిద్దాంతాలు కూడా తమ పరిమితులను ఛేదించి ముందుకు వస్తే గానీ విశ్వనాథను ఇముడించుకోగల సార్థకత వాటికి లభించదు.

భావ కవిత్వం. సంప్రదాయ కవిత్వం తెలుగు సంస్కృత భాషాశైలుల భేదాలు కొన్ని కొన్ని అద్బుతోపమానాదులు, బ్రాహ్మణోద్యమం, జాతీయభావం, వర్ణ వ్యవస్థ, పాశ్చాత్య భారతీయ సంస్కృతులు ఇలా ఎన్నో పరిమితులలో ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన తెలుగు పాఠక లోకం యింకా ఆయన సంపూర్ణ వైఖరిని పట్టుకోనే లేదని చెప్పాలి.

రచనా వేళలో తనను గూర్చి తాను చెప్పుకొన్నట్లు జాగ్రదవస్థలో చేసిన భావ సంచయం ఏదీ తన రచనా వేళలో నిర్దిష్టస్థానంలో కుదురుకోదని చెప్పిన అంశం చాలా ప్రధానమైంది. ఇక్కడ తొలిదశలో రచయిత తన్ను తాను అభావంగా చేసుకుంటాడు, మనస్సు ద్వారాలను తెరచి ఉంచుతాడు. ఉన్మనీ భావధారలకు రూపం కట్టిస్తూవుంటాడు కృష్ణశాస్త్రి విశ్వనాథను గూర్చి చెబుతూ ‘నామతం నా సంప్రదాయమంటాడు. ఇవి మీ మనస్సుకు ఉన్నాయిగాని మీ హృదయానికి కవితాత్మకు లేవంటాను. ఈ లోకాన్ని చూస్తే ఈయనకు అసంతృప్తి, ఏదో నవ నిర్మాణం చేయాలనే ఆయన కూడా కోరుతున్నాడు, లోకాన్ని ముందుకు నడిపిస్తున్నాడనే నేననుకుంటున్నాను. అన్ని మార్గాలలో ఆయన ఓ బాటసారి’ అని ఆయన సర్వతోముఖ చైతన్య స్ఫురణను గూర్చి చెప్పారు. అందువల్లనే విశ్వనాథ ఈనాటికీ ఎంత ప్రచురంగా చదువబడే రచయితో అంతగా అర్థంకాని రచయిత. తెలుగు సాహిత్య విమర్శ అంతా వర్తమాన భావపరిమితుల సంకలనంచేత ఆచ్ఛాదింపబడి ఉన్నది. ఈ కాలపరిమితులను బద్దలుకొట్టి విశ్వజనీనతను ఆశ్రయిస్తే తప్ప ఆయన సాహిత్యం మనకు ఆస్వాద్యమానం కాదు. కావలసింది మన విమర్శ కూడా. బాలదశను దాటి యౌవనమును, ప్రౌఢిని సంతరించుకోవాలి చేతో దర్శనా మార్జనం చేసికోవాలి. ‘నాస్త్యేవ గతి ర్యనథా’.

‘తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని చవులూరి చవులూరి జలముల్ల ప్రోవులే కదిలేను కిన్నెరా’ ఇది ఆ సాహిత్య సూత్రం అందుకునే ఒక తాళంచెవి. అర్ధ శతాబ్దానికి ముందే అడవి బాపిరాజు 1988లో ఆయన సాహిత్యాన్ని గూర్చి ఇలా అన్నారు. ‘ఆ మహా ప్రవాహ సజీవ జీవనంలో దాని నరికట్టడానికి చేతులనిండా మట్టి తెచ్చి వేసినా దానికి అభ్యంతరం ఉండదు. ఇతోధిక వేగంతో పొంగేతి మధుర నృత్యం చేస్తూ దివ్య స్వప్న విహారం చేస్తూ సాగిపోతూనే ఉంటుంది అనంత సాగరాభి ముఖంగా (విమర్శిని-2). అనంత సాగరాభిముఖంగా సాగిపోయే ఈ ప్రవాహాన్ని దాని జన్మస్థానంలో నిలదీసి లేదా ఏ ఒక ఘట్టంలోనో అంచనా వేసి చూస్తే అది ఎలా మనస్సు కెక్కుతుంది.

III

విశ్వనాథ కాల్పనికోద్యమపు తొట్లెలో జన్మించినా అక్కణ్ణించి వెంటనే దూరంగా వెళ్ళిపోయినాడు. తాత తాతలనాటి కథలు త్రవ్విపోస్తానని చెప్పవలసి వచ్చింది. వ్యక్తినీ, దేశాన్నీ, జాతినీ ఆవరించిన పరిధులను అతిక్రమించకపోతే ఆయన ఊపిరి పీల్చుకోలేడు. ‘ఈ ఆనిరాధ్వమెల్ల నినదించెడి మువ్వల మ్రోత దూరమైపోయిన గోతతిన్ పిలుచు పోలిక యేడొ వినిస్వనించెడిన్’. ఈ దూరమైపోయిన గోతతిని వెతుక్కుంటూ బ్రహ్మ సరస్సు తీరాలకు చేరుకొంటున్నాడు. ఈయన యొక్క ఈ విషయం గుర్తించని విమర్శలో కావ్యాన్ని కవి ప్రత్యక్ష జీవనానుభవముగా విశ్లేషించే ధోరణి ఉన్నది. ‘ఉర్విలోన మహాకవి యోగివంటివాడు సర్వమ్ము భావనా వధిగ జూచు, అల్పులంలోబోలెనదియెల్ల ననుభవించే ననుకొనుట పట్టి సామాన్యమైన మాట’ అంటారు. ఇక్కడ యోగి కవి. తన చైతన్యాన్ని బృహచ్చైతన్యంతో అనుసంధించుకోవటం జరుగుతుంది. దీనినే కాళిదాసు ‘పర్యుత్సుకో భవతి’ అన్నాడు. పెత్రునిచేవ అన్న సోవియట్ విమర్శకురాలు విశ్వనాథను గూర్చి ‘సమరస తాత్త్విక భావన మానవుడికి ప్రకృతికీగల ఐక్యత వీరి కృతులలో అంతర్గతమై ఉన్నవి అన్నది. (విమర్శిని, 2-423). గుంటూరు శేషేంద్రశర్మ ‘క్రమశః రామాయణ కల్పవృక్షం చేరేసరికి ఆయన భావ కవిత్వమనే మహా రమణీయ సృష్టి రాశిని చాప చుట్టి మోసుకుపోయి పూర్వకవితాబ్దిలో విసిరిపారేశిన సంహారకర్తగా రౌద్రావతారమూర్తిగా భాసిస్తాడు, విశ్వనాథ తరువాత భావకవిత్వం లేదు. భస్మమయి పోయింది’. (విమర్శిని, 4-116).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here