[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]
[dropcap]“వ[/dropcap]సూ!” గట్టిగా అరిచాడు.
“ఎందుకలా అరుస్తావు?… నేను ఏమైనా కాని మాట అన్నానా?… కలలు కనకూడదా? నేరమా?”
“యస్! ముమ్మాటికి నేరమే… అటు చూడు రెస్టారెంట్ ఓనరు… హీరోలా తయారై… కూర్చోని… నవ్వుతూ స్మార్ట్ ఫోనులో ఏదో చూస్తున్నాడు… ఇటు చూడు సప్లయర్… ప్లేట్ నిండా టిఫిన్స్ పెట్టుకొని ఎక్కడ పడిపోతాయో అన్నట్లు జాగ్రత్తగా నడుస్తూ… కష్టమర్స్‌కి టిఫిన్స్ సప్లయి చేస్తున్నాడు… పక్కకు చూడు… అతను ఎంగిలి ప్లేటులు అన్నీ తీస్తూ… టేబుల్ క్లీన్ చేస్తున్నాడు… నేను చెప్పిన ముగ్గురు కలలు కంటూనే ఉండి ఉంటారు… రెస్టారెంట్ ఓనరు దీని కన్నా పెద్ద రెస్టారెంట్ మరొకటి ప్రారంభించాలని, సప్లయర్ ఎప్పటికైనా నేను ఒక రెస్టారెంట్ పెట్టాలని… ఇక మూడో వాడు… ఎన్నాళ్లు ఎంగిలి ప్లేటులు ఎత్తడం కనీసం సప్లయర్ అయినా అయితే బాగుండును… లేదా లాటరీలో డబ్బు వస్తే హోటలైనా పెట్టేయాలని… నేను చెప్పినట్లు కాకపోయినా… ఏదో ఒక కల ఫ్యూచర్ బాగుండాలి, ఏదో ఒకటి చేయాలని కలలు కంటూనే ఉండి ఉంటారు…” అన్నాడు దేవ్.
చిరాగ్గా, కోపంగా అంది – “ఏంటి నువ్వు చెప్పేది?… వాళ్లు తప్పేం చేయడం లేదు… ప్రతీ మనిషికి హక్కు కలలు కనడానికి ఉంది.”
“కలలు కనడానికి హక్కు ఉంది… కాని ఎంత మందికి ఆ కలలు నెరవేరుతాయి…”
“పెట్రోలు బంక్‌లో పెట్రోలు పోసేవాడు కలలు కని అనిల్ అంబానీ అయిపోడు… చాయ్ అమ్మేవాడు కలలు కని ప్రధాని అయిపోలేడు.”
“అబ్బబ్బ… నీ లాజిక్‌కి ఓ దణ్ణం… అయితే ఎవరూ కలలు కనకూడదంటావా?” అంది కోపంగా…
“ఆఁ… కలలు కనకూడదు… ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది… కలలు కని జరగకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఎందుకు… సూసైడ్ చేసుకోవడమెందుకు… నా మటుకు నేను ఇప్పడే కాదు ఎప్పుడూ కలలు కనను… అందుకే ఎమ్.సెట్.లో సీటు రాకపోయినా… హాయిగా డిగ్రీలో చేరిపోతాను…”
“ఏంటి డిగ్రీలోనా… మైగాడ్ లాంగ్ టర్మ్ చేయవా” అంది కంగారుగా.
“లాంగ్ టెర్మ్ లేదు, షార్ట్ టర్మ్ లేదు… ”
“అది కాదురా!… ఒక్క ఏడాది ట్రై చెయ్యి… ఈసారి నీకు సీటు వస్తుంది” అని ఫ్రెండ్స్ అందరూ అన్నారు…
“నెవర్!… చస్తే అలా చేయను…”
“ఏంటి దేవ్! నీ మొండితనం… ఆఫ్ట్‌రాల్ డిగ్రీ చేస్తావా?” అంది వసుంధర…
ఆశ్చర్యంగా, చిన్నగా నవ్వుతూ “ఆఫ్ట్‌రాల్ డిగ్రీ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్లందరూ ఆఫ్ట్‌రాలా?”
“బాబోయ్! నీతో వాదించలేను… ఏది జరిగినా జరగపోయినా జానేదేవ్ అంటావని తెలుసు కాని… కెరియర్‌కి సంబంధిచిన విషయంలో కూడ ఇంత కేర్‌లెస్‌గా ప్రవర్తిస్తావని అనుకోలేదు” అంది.
“అసలు ఏంటి ఇది పార్టీయా?… కాదు” అన్నాడు చిరాగ్గా వాసుదేవ్…
“వసూ!… కొద్ది రోజులు వదిలేయ్!… ఆలోచించుకోనీ వాడిని…” అని ఫ్రెండ్స్ అన్నారు…
‘అది కరక్టే!… తిక్కలోడు!… నాలుగు రోజులు కానీయ్… అప్పుడు వీడిని లాంగ్ టర్మ్ చేయడానికి ఒప్పించాలి… సచ్చినోడు… తనంటే ఇష్టమే!… అందరి కన్నా తనతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడు…’ అందుకే ఒకసారి అడిగేసింది.
“దేవ్! నీ బెస్ట్ ఫ్రెండ్‌ని నేనే కదా?” అని.
“ష్యూర్! ఎందుకా డౌటు వచ్చింది?”
“ఎందుకు అంటే ఏం చెప్పను?… శతకోటి లింగాల్లో బోడి లింగాన్నినేమో అని…?”
ఫక్కున నవ్వి అన్నాడు.
“నీ మాటలు నవ్వు తెప్పిస్తాయి… నీతో మాట్లాడుతుంటే రిలీఫ్‌గా ఉంటుంది.”
పొంగిపోయింది వసుంధర… “ఒరే పిచ్చి మొద్దూ అదే లవ్… నీ నోటితో I Love you చెప్పే వరకు… నేను చెప్పను… ఒక వేళ చెప్పాననుకో… చీప్ అయిపోతాను” అని అనుకుంది మనసులో.
“ఏయ్!… వసూ!… ఏమిటా పరధ్యానం ఏంటాలోచిస్తున్నావ్!… దేవ్ చెప్పింది కరక్టే… మనం బోలెడు డబ్బులు పోసి గోల్డ్ ఫేషియల్, ఏవేవో చేయించుకున్నాం… వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా?…” అంది బాధగా కోమలి…
“ఎందుకు” అంది కోపంగా… వసుంధర.
“ఎందుకేమిటి… నువ్వు రెండుసార్లు ముఖం వాష్ చేసికొనేసరికి… మేకప్ అంతాపోయింది… మేము బస్‌స్టాండ్‌లో నిలబడి, బస్సు ఎక్కి వచ్చేటప్పటికి చెమట పట్టి మేకప్ అంతా పోయింది” అంది రమణికుమారి.
ఫ్రెండ్స్ అందరూ పలగబడి నవ్వడంతో అమ్మాయిలంతా ముఖాలు చిన్న బుచ్చుకున్నారు.
కోపంగా వాసుదేవ్ వైపు చూసి నవ్వింది చూసి… “నవ్వింది చాలు. నీతో సీరియస్‌గా డిస్కస్ చేయాలి… ఎప్పుడూ కలుద్దాం” అంది వాసుదేవ్ దగ్గరగా వచ్చి వసుంధర.
“సీరియస్‌గానా, ఐతే రాను… ” అన్నాడు నవ్వుతూ…
***
“నోరు ముయ్యవే!… నీ మాటలు నమ్మడానికి నేను వెర్రి వెంగళప్పని కాను, ఇంట్లో ఎప్పుడు అప్పలమ్మలా ఉంటావ్!… బయటకు రాగానే అప్సరసలా తయారవుతావు. ఎవడి కోసమే ఈ తయారు. ఎవడో ఒకడు ఉండి ఉంటాడు. నాకు తెలియకుండా వాడు మనల్ని ఫాలో అవుతున్నాడా?”… అని గట్టిగా, ఆవేశంగా వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చున్న భర్త… భార్య మీద కేకలు వేయడం చూసి… కంగారుగా అంది భార్య…
“ఛ!… ఛ!… ఎవరికోసమో ఎందుకు తయారవుతానండి?… బయటకు వచ్చాము కదా? అని మంచి చీర కట్టుకొని తయారయ్యాను.”
“నోరుముయ్యవే!… ఒక్కనాడైనా ఇంట్లో ఇలా అందంగా తయారయ్యావా? పిచ్చిదానిలా కనబడతావు… నాకు నీ మీద ఎప్పటి నుండో అనుమానం ఉంది?”
“ఏవండీ!… ప్లీజ్!… ఇంట్లో బోలెడు పనితో అలసిపోయి ఉంటాను… అయినా… మీరిలా అనుమానిస్తుంటే చాలా బాధగా ఉంటుంది” అంది కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా…
గభాలున ఫ్రెండ్స్ మధ్య నుంచి లేచి “చూడండి… ఎందుకుతన్ని కళ్ల వేళ్లా బ్రతిమిలాడతారు. వదిలేయండి. మీరు ఎంత చెప్పినా నమ్మే మనిషిలా నాకనిపించడం లేదు. జీవితాంతం అతనితో ఇలానే నరకం అనుభవిస్తూ బ్రతకాలంటే బ్రతకండి… లేదా?… ఛ!… ఛ!… వీడితో మాటలు పడుతూ జీవితాంతం ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు అనుకుంటే వెంటనే డైవర్స్ ఇచ్చేయిండి…” అని వాసుదేవ్ అనగానే కోపంగా చూసి, “నువ్వెవరివోయ్!… సలహాలివ్వడానికి… నీ కెంత ధైర్యం… నా ఎదుటే నా పెళ్లానికి డైవర్స్ ఇవ్వమని చెబుతావా?” అని వాసుదేవ్ మీదకు రాబోతున్న భర్త చెయ్యి గభాలున గట్టిగా లాగి పట్టకొని “ఆ అబ్బాయి చెప్పింది కరక్ట్… నీలాంటి అనుమానం భర్తతో బ్రతకడం నరకం… మంచి సలహా ఇచ్చాడు… నా మొద్దు మొఖానికి ఐడియా రానే లేదు… థాంక్స్ అండి… ఇక పదండి ఇంటికి… ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి!… ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి… నన్ను రోజూ మీ మాటలతో, చేతలతో హింసించారో, అబ్బాయి చెప్పినట్లు డైవర్స్ ఇచ్చేస్తాను… మిమ్మల్ని ఊరికినే వదిలి పెట్టను… గృహహింస… ఏఏ కేసులు ఉన్నాయో అన్ని తెలుసుకొని ఆ కేసులన్నీ మీ మీద పెట్టి జైలుకి పంపకపోతే నా పేరు పంకజం కాదు” అని రయ్‌మని అక్కడ నుండి వెళుతూ, గభాలున వెనక్కి తిరిగి “థాంక్స్ అండీ నా కళ్లు తెరిపించారు” అంది.
“ఎంత పని చేసావురా?… పిల్లి లాంటి దానిని పులిని చేసావు” అని కోపంగా వాసుదేవ్ వైపు చూసి, కంగారుగా…. “పంకజం… పంకజం… ఆగు… అయ్యో ఆటో ఎక్కేస్తున్నావా” అని గబగబా అడుగులు వేయసాగాడు.
ఫ్రెండ్స్ అందరూ… కంగారుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
“పాపం రా!… భార్యాభర్తల మధ్య గొడవ పెట్టావు” అన్నాడు కార్తీక్…
“ఉచిత సలహాలు బాగానే ఇస్తావు…” అంది కోపంగా వసుంధర.
“వాడికి రాత్రికి పస్తే… నోటిలో నాలిక లేనట్లు కనిపించిన ఆవిడ నీ మాటలతో కాళిక అయింది” అన్నాడు ఫణి…
“అలానే కావాలి!… వాడేం భర్త… రోగ్… పాపం బయటకు వచ్చిందని కాస్త తయారయితే అనుమానిస్తాడా?…” అన్నాడు కోపంగా…
“ఒరేయ్!… నువ్వు ప్రతీది కేర్‌లేస్‌గా తీసుకొని జానేదేవ్ అంటావు… వివాహబంధం ఎలా తేలికగా తీసుకోమంటావ్…”
ఈసారి కోపంగా అన్నాడు.
“మనం సంపాదించిన ఆస్తులు… అంతస్తులు చివరికి ఇంట్లో వాడే వస్తువులు కూడా అలానే ఉంటాయి. కాని మనిషికి ఉన్నది ఒక్కటే జీవితం… చూస్తుండగానే పెద్దవాళ్ళమయిపోయి, ముసలి వాళ్లమయిపోయి… చెట్టుకు పండిన పండు నేల రాలినట్లు ఎప్పుడో ఒక్కప్పుడు… గభాలున మన ప్రాణం పోతుంది. అలాంటప్పుడు బ్రతికిన కొన్నాళ్లయినా కక్షలు, కావేశాలు, గొడవలు అల్లరులు… లేకుండా… నాకు ఇది కావాలని, అది కావాలని… గొంతెమ్మ కోరికలు కోరుతూ మనం ఎందుకు నలిగిపోవాలి… ఏది జరిగినా పాజిటివ్‌గా తీసుకొని జానేదేవ్ అనుకుంటే… హాయిగా బ్రతికినన్నాళ్లు బ్రతికేయచ్చు.”
విస్మయంగా వాసుదేవ్ వైపు చూసింది వసుంధర “అందుకేరా… నువ్వుంటే ఇష్టం… ఇష్టం కాదు ప్రాణం… నిన్ను నేను వదలను…” అని చిరునవ్వుతో మనసులో అనుకంది వసుంధర.
“పాపం చూడరా… ఎలా భర్తని విదిలించి కొడుతుందో? ఇంత వరకు బెల్లం కొట్టిన రాయిలా ఉన్న ఆవిడ నీ మాటలు బాగా తలకెక్కించుకొని తిరగబడ్డ పులిలా అయింది. పాపం చుట్టుకుంటుంది రా!… భార్యాభర్తల మధ్య అగ్గిపుల్ల గీసావ్!… నువ్వంటే ప్రతీ విషయాన్ని Deepగా తీసుకోవు. Don’t care అన్నట్లు ఉంటావు” అన్నడు కార్తీక్.
“బాగా చెప్పావు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు…” అన్నాడు నవ్వుతూ ఫణి.
“అలా అంటారు ఏమిటి?… దేవ్ చెప్పింది కరక్టే! అసలు మీరెవరూ దేవ్‌ని అర్థం చేసుకోలేదు…” కోపంగా అంది వసుంధర.
అందరూ ఆశ్చర్యంగా వసుంధర వైపు చూసి… ఫకాలున నవ్వి… “అవునవును… నీకొక్కదానికే దేవ్ అర్థం అవుతాడు…”
వాతావరణం తేలికపడుతుండడంతో అందరూ కబుర్లు చెప్పకుంటూ పార్టీ చేసుకున్నారు.
***
మోటారు బైక్ వేసుకుని స్వీట్స్ షాపు దగ్గరకు వెళ్లి స్వీట్స్, ఐస్ క్రీమ్ కొని రిటర్న్‌వుతుండగా ఆ వీధిలోనే ఉండే గుర్నాధం కనబడి, దేవ్ చేతిలో స్వీట్స్, ఐస్ క్రీమ్ చూసి నవ్వుతూ… “కంగ్రాట్యులేషన్స్ వాసుదేవ్!… మీ నాన్న పేరు నిలబెట్టావు… త్వరలో డాక్టర్ కాబోతున్నావు. ప్రొద్దునుండి ఒకటే మీ నాన్నకి ఫోను చేసాను. ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది… ఎమ్.సెట్‌లో ర్యాంక్ వచ్చిందా అని కనుక్కుందామని, వస్తే విషెస్ చెబుదామని… సంతోషం! మీ నాన్నతో చెప్పు రేపు మీ ఇంటికి వచ్చి కలుస్తానని” అని అనగానే “మీకా శ్రమ అక్కరలేదంకుల్!… నాకు మెడిసిన్‌లో సీటు రాలేదు” అని దేవ్ అనగానే ఆశ్చర్యంగా… “మరి… మరి నీ చేతిలో స్వీట్ల్… ఐస్ క్రీమ్‌లు” అన్నాడు.
“ఏంటంకుల్!… ఎమ్.సెట్.లో సీటు రానివాళ్లందరూ… స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినకూడదా” అన్నాడు వాసుదేవ్!…
“అది కాదు… కాని… సరేలే… సీట్ రాలేదని, ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం… సూసైడ్‌లు చేసుకోవడం, ఇంట్లోంచి పారిపోవడాలు లాంటివి చేయకుండా… గుండెని దిటవు పరుచుకొని… నీలా ఉండడం కూడా ఒకందుకు మంచిదే!”…
“అంకుల్!… మీరన్నట్లు నేనేం గుండెని దిటవు పరచుకోలేదు… ఒక్క మాట అడుగుతాను సూటిగా చెప్పండి.”
“యాభై ఏళ్లు ఆంటీ మీతో కలిసి జీవితాన్ని పంచుకుంది. సడన్‌గా చనిపోయింది… మీరు ఎంతో గ్రాండ్‌గా… నాన్‌వెజ్‌తో సహా భోజనాలు పెట్టి, వచ్చిన వాళ్లందరికి గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు… అన్నట్లు మీ అబ్బాయి మందు తాగే వాళ్లకి మందు కూడా ఇచ్చారు… యాభై ఏళ్లు అనుబంధం! ప్రాణం విడిచి, కనిపించని లోకాలకి వెళ్లిపోతే, ఏడుస్తూ బాధపడుతూ ఉండకుండా… అంత గ్రాండ్‌గా ఫంక్షన్ చేసినప్పుడు ఆఫ్టరాల్ ఎమ్.సెట్‌లో సీటు రాకపోతే స్వీట్లు తినకూడదంటారా?”…
గుర్నాధంతో పాటు ఆ షాప్‌లో ఉన్నవాళ్లందరూ తెల్లబోయి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
***
మోటారు బైక్ రయ్‌మని పోతుంది. సడన్‌గా సిగ్నల్ పడడంతో కస్సున మోటారు బైక్ ఆగడం… బైక్ ప్రక్కనే ఆగి ఉన్న కారులోంచి మూలుగులు వినిపించి గభాలున ప్రక్కకు తిరిగి కారు వైపు చూసాడు వాసుదేవ్.
క్లోజ్ చేసి ఉన్న కారు కిటికీలో నుండి అమ్మాయిలను కదలకుండా రెండు వైపుల బలమైన మనషులు పట్టుకొని ఉండడం చూసి అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్లున్నారన్న ఆలోచన వచ్చినంతలోనే గ్రీన్ సిగ్నల్ రావడంతో కారు రయ్‌మని వెళ్లిపోసాగింది.
కారు స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా కారులో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారన్నది అర్థం అయిపోయింది వాసుదేవ్‌కి…
అమ్మాయిలను ఎలాగైనా రక్షించాలి… అలోచన వచ్చింనంతనే… కారున వెంబడించాడు… కారుని వెంబడిస్తుంది మోటార్ బైక్ అని కిడ్నాపర్‌లు కారుని మరింత వేగం పెంచి కారుని పోనివ్వసాగారు.
“ఏంటి అన్నా! బచ్చాగాడిలా ఉన్నాడు. వాడికి భయపడేది ఏమిటి?… మనలో ఒక్కడు ఒంటి చేత్తో వాడిని… ఎత్తి అవతల పడేయవచ్చు… ” అని కారు డ్రైవింగ్ చేస్తున్న రంగడు అన్నాడు.
“అది కాదురా!… మనం ఇప్పటి దాకా ఎన్ని కిడ్నాప్‌లు చేయలేదు… ఎవరి కంటయినా పడ్డామా?… కంట్లో నలకే పడింది… ఏం కాదులే, అని ఊరుకుంటామా? ఒక వేళ ఊరుకున్నా… కంట్లోంచి నలక తీసేంత వరకు కళ్ల వెంట నీళ్లు వస్తూనే ఉంటాయి… గరగర లాడుతూనే ఉంటుంది…”
“అయితే ఇప్పుడేం చేయమంటావు…” అన్నాడు రంగడు.
“వాడెవడో… కాస్త ఉడుకు రక్తం ఉన్న బచ్చాగాడు… మనం అటు ఇటు కారుని తీసుకుపోతుంటే పెట్రోలు బొక్క అని వాడే ఇంటికి పోతాడు…”
“కరెక్టుగా చెప్పావు…” అని నవ్వాడు మరో కిడ్నాపర్.
కారు రయ్ మని పోతూనే ఉంది… కారుని వెంబడిస్తూనే ఉన్నాడు వాసుదేవ్.
కారులో అమ్మయిలు, నోటికి ప్లాస్టర్, చెతులకు తాళ్లతో కట్టి వేయడంతో గింజుకుంటూ, అరవడానికి ప్రయత్నించసాగారు.
“మీరు ఇలా అల్లరి చేసారో బొంబాయి రెడ్ లైట్ ఎరియాకి కాదు… డైరెక్ట్‌గా పైకిపోతారు” అని కిడ్నాపర్లు కోపంగా అనడం వెళుతున్న కారుకి అడ్డంగా మోటారు బైక్ వచ్చి ఆగడంతో సడన్ బ్రేకుతో కారు ఆగింది…
అందరూ షాక్ తిన్నారు.
మోటారు బైక్ దిగి… మోటార్ బైక్ హేండిల్‌కి పెట్టి ఉన్న కవర్లను చూస్తూ “అరరె!… బట్టర్ ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయింది… మా అమ్మకి బట్టర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం… మా అమ్మ లాగే నాకు ఇష్టం… మా ఇద్దరికి ఒకే వీక్‌నెస్!… ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేం… ఈ సోదంతా ఎందుకు కాని… కరిగిపోతుంది… ముందు తిననియ్యండి…” అని గబగబా తినసాగాడు వాసుదేవ్ !
అప్పటికే కారు దిగి వాసుదేవ్ మాటలు విన్న కిడ్నాపర్లు ఆశ్చర్యంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని…
“నీకైమైనా మెంటలా? ఐస్ క్రీమ్ తింటావో? ఐస్ ముక్కలు తింటావో మాకెందుకు?… అడ్డంగా బైక్ ఎందుకురా పెట్టావు?… కళ్లు మూసుకొని రమ్‌మని మేము వెళ్లిపోతే ఈ పాటికి నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. పోనిలే బచ్చాగాడు బుద్ది లేకుండా బైక్ అపాడు… ఒక్క చాన్స్ ఇద్దాం అని కారు ఆపాం!… బైక్ తీయ్!… తీయకపోయావో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి…” అన్నాడు కిడ్నాపర్…
పకపకా నవ్వాడు వాసుదేవ్!… గబగబా ఐస్ క్రీమ్ తినేసి… “హమ్మయ్య బలం వచ్చేసింది ఎందుకనుకున్నావు?… నేను తిన్న ఐస్ క్రీమ్‌లో రెండు గ్లాసుల పాలున్నాయి. ఇది అమూల్ ఐస్ క్రీమ్…”
“నోరుమూయ్యరా!… నీకు మెంటలా? ఏంటి?… అసలు ఇంత వరకు నీలాంటి వాడితో మాట్లాడడం బుద్ధి తక్కువ” అని ఒక్క నిముషం కోపంగా చూసి… “ఇంకా చూస్తావు ఏమిటి?… తుపాకి గురి పెడితేనే కాని… వీడు భయపడడు… ప్రాణాలు గాలిలో పోతాయి అని తెలిసిన మరుక్షణం వాడే పరిగెత్తుతాడు… ఏ మనిషికైనా ప్రాణభయం ఉంటుంది” అని కిడ్నాపర్ తుపాకి గురి పెట్టాడు…
“వన్ మినిట్” అని గట్టిగా అన్నాడు వాసుదేవ్!
ఇద్దరు కిడ్నాపర్లు ఫకాలున నవ్వారు.
“ప్రాణం పోతుందనగానే బచ్చాగాడికి భయం పట్టుకుంది.”
సినిమాల్లో… సీరియల్లో పోలీసులు అంతా అయిపోయినాక వస్తున్నట్లు చూపెడతారు కాని… కారుని వెంబడిస్తూనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయినా ఇంకా రాలేదేం?
“ఎంత సేపు ఆలోచిస్తావురా?… బైక్ తీయ్” అన్నారు కిడ్నాపర్లు…
“ఇప్పటికి వరకు ప్రాణం మీద తీపి లేదు కాని మీరున్నాక ఆలోచిస్తున్నాను…”
“ఎలా ఉందిరా ఒళ్లు… మేమైనా వెర్రి వెంగళప్పలం అనుకుంటున్నావా?”
“అలా ఎందుకు అనుకుంటాను… పాపం ఆడపిల్లలు… వాళ్లు వట్టి అమాయకులు… మీరు వట్టి వెధవలు…” అని వాసుదేవ్ అంటుడగానే…
కోపంతో ఊగిపోతూ తుపాకీ గురి చూసేంతలో తప్పించుకొని వాళ్లతో కలబడ్డాడు… కిడ్నాపర్ చేతిలో నుండి… తుపాకి క్రింద పడింది… దానిని గభాలున… వాసుదేవ్ అందుకొని… కిడ్నాపర్లను బెదిరిస్తూ…గబగబా కారు దగ్గరకు నడిచి కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ వైపు… తుపాకీ గురిపెడుతూ… గభాలున కారు డోరు తెలిచి “కమాన్ దిగండి…క్విక్” అన్నాడు వాసుదేవ్ అమ్మయిలను ఉద్దేశించి…
బిలబిలమంటూ అమ్మయిలు దిగారు… కిడ్నాపర్‌లవైపు తుపాకి చూపెడుతూనే… అమ్మాయిల చేతికట్లు విప్పతుండగానే గభాలున వచ్చి కిడ్నాపర్లు… వాసుదేవ్ చేతిలో తుపాకిని లాక్కున్నారు…
కంగారుగా అన్నాడు వాసుదేవ్…
“మీరందరూ పారిపోండి… వీళ్ల సంగతి నేను చూసుకుంటాను.”
అంతలో… కిడ్నాపర్లు వాసుదేవ్‌ని షూట్ చేయబోయారు… మెరుపు వేగంతో ప్రక్కకు తప్పించుకున్నాడు. వాసుదేవ్, కిడ్నాపర్ల మధ్య పోరాటం జరిగింది… గభాలున కిడ్నాపర్ వాసుదేవ్ వైపు గురిపెట్టడంతో తప్పించుకోబోయడు కాని…బుల్లెట్ వాసుదేవ్ చేతికి తగిలింది…
పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ సైరన్ మోగిస్తూ వచ్చింది.
పోలీసులను చూసి కిడ్నాపర్లు పరిగెత్తారు…
ఎంతో దూరం పరిగెత్తిన అమ్మయిలు బుల్లెట్ సౌండ్‌కి వెనక్కి తిరిగి చూసి… “అన్నా!… అయ్యో! అన్నకి బుల్లెట్ తగిలిందని” అమ్మాయిలందరూ వాసుదేవ్ చుట్టూ చేరి కళ్లనిండా నీళ్లతో… “అన్నా!… నీకేం జరగదు” అని… ఏడుస్తూ కంగారు పడసాగారు…
అప్పటికి అంబులెన్స్ రావడం… వాసుదేవ్‌ని అందులో ఎక్కించడం… కూడా అమ్మాయిలు ఎక్కడం చూసి “మీరెక్కడికమ్మా… పోలీసు స్టేషనుకి పదండి… మీ వాళ్లకి ఫోను చేసి… మిమ్మల్ని వాళ్లకి అప్పగించాలి” అన్నాడు పెట్రోలింగ్ డ్రైవర్…
“లేదంకుల్… అన్నకి ప్రాణభయం లేదని డాక్టర్ చెబితేనే మేము ఇంటికి వెళతాం… ఈ రోజు అన్నయ్య కిడ్నాపర్లకి భయపడకుండా… మమ్ములను కాపాడాడు” అని ఒక అమ్మాయి ఏడుస్తూ అంది…
హాస్పటల్‌లో.. దేవ్ చేతి నుండి బులెట్ బయటకు తీసారు డాక్టర్లు… విషయం తెలిసి కంగారుగా హస్పటల్‌కి వెళ్లారు నింజనరావు, సుమిత్ర…
అన్ని చానల్స్ విలేఖరులు… పేపర్ల వాళ్లతో హాస్పటల్ నిండిపోయింది.
“ఎంత పని చేసాడండి… ఉత్తప్పుడల్లా ఎప్పుడు చూసినా… న్యూస్ చానల్స్ అన్నీ చూస్తుంటారు… ఎదురింటి రామారావుగారు చెప్పేవరకు మన వాసుదేవ్‌కి ఇంత ఘోరం జరిగిందని తెలుసుకోలేకపోయాం…” అని కన్నీళ్లు పెట్టుకోసాగింది సుమిత్ర.
“ఏం మాట్లాడుతున్నావో నీకర్థమవుతుందా?… నాకం తెలుసు? వాడు కొత్త అవతారం ఎత్తుతాడని. పౌరుడిగా… సహాయం చేయాలనుకుంటే… బోలెడు హెల్ప్ లైనులు ఉన్నాయి… ఆ పని చేయవచ్చు కదా?” అన్నాడు…
“సార్!… మీరు వాసుదేవ్ పేరంట్సా…” అని చానల్స్ వాళ్దరూ చుట్టుముట్టి… ప్రశ్నల వర్షం కురిపించసాగారు…
“సార్!… యువర్ సన్ ఈజ్ గ్రేట్!… ఒక్కడు ప్రాణాలకు తెగించి కిడ్నాపర్ల చెరనుండి నలుగురు అమ్మాయిలను కాపాడాడు… మొదటి నుండి మీ అబ్బాయి ధైర్యసాహసాల్ని ఇలానే ప్రదర్శిస్తుంటాడా?…”
కంగారుగా నిరంజనరావు అటు ఇటు చూసి “అదేం లేదు… ఇలాంటి సాహసాలు చేస్తాడని ఇప్పటి వరకు నాకు తెలియదు.”
“అలా అంటారేమిటండి… మా దేవ్ మనసు బంగారం… వాడికి మాయామర్మం తెలియదు” అని సుమిత్ర అంటుండగానే…
“అది కాదు మేడమ్!… కిడ్నాపర్లల చెర నుండి ప్రాణాలకు తెగించి ఒక్కడే అమ్మాయిలను కాపాడాడు… He is great… మీ అబ్బాయి గురించి చెప్పండి” అన్నాడు ఒక చానల్ అతను.
కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ హాస్పటల్‌లో వాసుదేవ్ రూమ్ వైపు చూడసాగింది.
(సశేషం)