స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ అండ్ స్ప్రింగ్

2
3

[box type=’note’ fontsize=’16’] “మనసు యొక్క పచ్చి వగరు అపక్వ పక్వ స్థాయిలను బట్టి మనిషి చర్యలు ప్రతిచర్యలను ఋతువులను ప్రతీకగా చిత్రీకరించి వ్యాఖ్యానించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా” అంటున్నారు కొరియన్ మూవీ ‘స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ అండ్ స్ప్రింగ్’  గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.[/box]

[dropcap]మా[/dropcap]నవ జీవనగతిలోని వివిధ దశలలో వివిధ స్థితులలో మనసు యొక్క పచ్చి వగరు అపక్వ పక్వ స్థాయిలను బట్టి మనిషి చర్యలు ప్రతిచర్యలను ఈ కాలచక్రపుగతిలో చువ్వలుగా తిరుగుతున్న ఋతువులను ప్రతీకగా చిత్రీకరించి వ్యాఖ్యానించడానికి చేసిన ఒక మంచి ప్రయత్నమే ఈ సినిమా.

బహుశా తాత్కాలిక స్పందనలను దాటిన స్థాయి ఉన్నవారు ఎన్నోరకాలుగా ఈ విషయాన్ని మానవాళికి తమ రచనల ద్వారా చెప్పడానికి తమ తమ శైలులలో  ప్రయత్నించే ఉన్నారు.

ఒక నీరవారణ్యంలో ఒక ప్రశాంతమైన లోయ. మధ్యలో ఒక నీటికొలను. ఆ కొలను మధ్యలో ఒక గది గల చిన్న ఆశ్రమము. అది ఒక బౌద్ధగురువు నివాసము. చాలా అందమైన ఈ ప్రదేశంలోనే మొత్తం సినిమా అంతా చిత్రీకరించారు. ముఖ్య పాత్రలు రెండే. బౌద్ధగురువు, అతని శిష్యుడు. అంతేకాక ఈ సినిమాకు ఆధారం అయిన బౌద్ధ తత్వం ఒక అదృశ్యపాత్రగా చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలోని కొన్ని విశేషమైన విషయాలు

౧. సౌందర్యం రాసిపోసిన ఈ లోయలోని కొలను, అందులోని ఆవాసాన్ని టాప్ లెవెల్ , ఐ లెవెల్ వంటి రకరకాల యాంగిల్స్‌లో అందంగా చూపించిన దర్శకుడు, ఫోటోగ్రఫీ నిర్వాహకులు ఎంతైనా అభినందనీయులు. ప్రతీ ఫ్రేమూ ఒక అందమైన , ఎంతో అందమైన లాండ్ స్కేప్ పెయింటింగ్‌లా కళ్ళను తిప్పనివ్వని ఆకర్షణతో ఉంటుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి ఈ సినిమా ఎన్నిసార్లైనా చూడవచ్చు.

౨. ముఖ్యమైన రెండు పాత్రలు గాక ఇంకో నాలుగైదు పాత్రలున్నప్పటికీ మొత్తం సంభాషణలను, మాటలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  మాటలతో తక్కువ, చిత్రీకరణతో ఎక్కువగా దర్శకుడు తాను చెప్పదలచుకున్న దాన్ని చక్కగా చెప్పాడు.

౩. నవ్యత, కుతూహలము, ఆనందము, అనుభవము గల జీవితదశలు వసంతముగా, ఉగ్రత, వ్యగ్రత, ఉడుముపట్టుదల, లక్ష్యనిర్దేశాలు, స్వార్థ సంకుచిత దృష్టికోణాలు గల కాలము గ్రీష్మముగా, ఆశనిరాశల అంతర్యుద్ధాలు, అలసట, అన్వేషణల దశ autumn గా, అలజడులన్నీ తగ్గి నిరాసక్తత, నిర్లిప్తత, నిర్వేదాల దశ winter గా చూపించారు. మళ్ళీ చక్రభ్రమణం మొదలు అవుతుంది. కొనసాగుతూనే ఉంటుంది.

౪. బౌద్ధ తత్వాన్ని బోధిస్తున్న రీతిలో సినిమా తీశారు. కోరికలు దుఃఖానికి మూలం అని బౌద్ధం చెప్తుంది. ఇక్కడ కోరిక అంటే లౌకికపరమైన అన్ని కోరికలూ. ధనము, అధికారము, వంశము, స్వదేహమూ మొదలైన అన్నిటిమీదా ఉండే లోభమోహాల వల్లే దుఃఖాలు ప్రాప్తిస్తాయి అని. కోరిక స్వార్థాన్నీ, స్వార్థము పగనూ/నాశనాన్ని ప్రేరేపిస్తాయని బౌద్ధ గురువు చెప్తాడు. వీటన్నిటిలో స్త్రీపురుష కామము ఒకటి మాత్రమే దర్శకుడు తీసుకున్నాడు. గురువు చెప్పిన క్రమంగానే అంతా జరుగుతుంది మూవీలో.

౫. ఆవాసం నుంచి అడవికి గానీ నగరానికి గానీ వెళ్ళాలంటే పడవలోనే వెళ్ళాలి. కానీ చాలా సార్లు గురువు పడవ లేకుండానే వచ్చేసినట్టు చూపారు. ఒకటిసార్లు గురువు ఆదేశానుసారం పడవ కదలిక ఉన్నట్లూ చూపించారు. ఇది బౌద్ధ గురువు మహిమలుగా చూపించినట్టుంది.

౬. ఆవాసం లోపలా, కొలను ప్రవేశం దగ్గరా తలుపులు ఉంటాయి. అటూ ఇటూ గోడలేమీ ఉండవు. కానీ ప్రతిసారీ అందరూ ఆ తలుపులు తీసి అందులోంచే వెళ్ళి మళ్ళీ తలుపులు మూస్తుంటారు. దీనిద్వారా ఏ విషయంలోనైనా, ఎవరిజీవితంలోనైనా మనం సరైన పద్ధతిలోనే, తగుమాత్రంగానే, హద్దులలో ఉంటూ మాత్రమే జోక్యం చేసుకోగలం అని సింబాలిక్ గా చెప్తున్నట్టు అనిపించింది. బాగుంది.

౭. తూకం వేసినట్టు ఎక్కడ ఎంత కావాలో అంతే నటించారు నటులు. అక్కడక్కడా కొన్ని దృశ్యాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి గానీ అనవసరమైన సీను ఒక్కటి కూడా లేదు.

౮. శిష్యుడు అంతరంగ ప్రశాంతత చేకూరడానికి గురువు ఆజ్ఞ మేరకు బౌద్ధ ధర్మం లోని ప్రజ్ఞాపారమిత సూత్రాన్ని చెక్క నేల మీద చెక్కడం, అతన్ని పట్టుకోడానికి వచ్చిన డిటెక్టివ్ లు కూడా అర్థం చేసుకొని సహకరించడం విశేషం.

గురువు తన అంత్యకాలం సమీపించిందని తెలుసుకొని సమాధి చెందుతాడు. మనకు బృందావన సమాధులు తెలుసు. ఈ మూవీలో గురువు తన ప్రాణాలు స్వచ్ఛందంగా వదిలేయడానికి అవలంబించిన పద్ధతి బహుశా ఆ యా దేశ ప్రాంతాలకు చెందినదై ఉండొచ్చు. కొత్తగా ఉంది.

తరువాత చివరి winter దశకొచ్చిన శిష్యుడు ప్రాపంచిక జీవితంలోని తన భాగమైన సుఖదుఃఖాలను అనుభవించి, విరాగుడై గురువు వదలిపెట్టి వెళ్ళిన యోగసాధనల క్రమాలను ఒక పాత పుస్తకాన్ననుసరిస్తూ కొనసాగిస్తుండగా ఒక అజ్ఞాత స్త్రీ తన శిశువును ఇక్కడ వదిలిపెట్టి మరణించడంతో మళ్ళీ గురుశిష్య సహజీవనం కాలచక్రగమనాన్ని పునరావృత్తి చేస్తుంది, మళ్ళీ అవే నవ్యతలు, కుతూహలాలు, అవివేకతలతో సహా. యుగాల తరబడి మానవ ప్రస్థానంకూడా ఇలాగే జరుగుతోంది అని చాలా మంది తెలుసుకోలేరు (ఇప్పుడు కూడా ఇలాంటి ధోరణులా, ఇంత విజ్ఞానాల తర్వాత ఇంత మూర్ఖత్వాలా అని వాపోయే వారు ముఖ్యంగా తెలుసుకోండి). ఆ అజ్ఞాత స్త్రీ గురించి కూడా అవసరమైనంత మేరకే కథలో ఉంటుంది.

గొప్ప విదేశీ చిత్రాలలో ఇది ఒకటి. వీలు కుదిరితే తప్పక చూడదగ్గది. నెట్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో దొరుకుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here