[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]ఆ[/dropcap] మధ్య ఒక యువతి తాను పనిచేస్తున్న రంగంలో స్త్రీల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై తన నిరసనని తెలియజేస్తు నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసింది.
ఒక్కసారిగా మీడియా కెమెరాలన్ని అత్యుత్సాహంగా అక్కడ చేరి దీక్షగా పనిచేసేయి. జనమంతా ఉలిక్కిపడ్డారు. ఎవరి ఆలోచనా విధానానికి తగినట్లుగా వారు ఆ సంఘటనని తిలకించడం, వ్యాఖ్యానించడం జరిగింది. అది వేరే విషయం! అంతకు ముందొకసారి ఎక్కడో తీవ్రమైన అత్యాచారం జరిగినపుడు ఆ వూరి స్త్రీలందరూ తీవ్రంగా గర్హిస్తూ నగ్నంగా రోడ్డు మీదకొచ్చి తమ నిరసనని తెలియజేసేరు.
నిజమే! ఒక ముక్కుపచ్చలారని బిడ్డని లేకుండా, వృద్ధురాలని లేకుండా స్త్రీ జాతి అయితే చాలు – ఏ పశుపక్ష్య జాతిలోనూ లేని విధంగా అతి నీచంగా అత్యాచారం చేస్తుండడం, ఆ పైన హత్య చేయడం యావత్ స్త్రీ జాతిని కుదిపేస్తున్న అంశం. అందుకోసం స్త్రీలు ఉద్రేకులై కోపంతో రగిలిపోతూ జరుగుతున్న అకృత్యాలపై ఏ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ‘ఈ రక్త మాంస ఖండాలపైనేగా మీ దృష్టి’ అంటూ ఛీత్కారంతో ఆ ప్రదర్శన చేసారు. వంటి మీద వస్త్రం కాస్తా తొలగితేనే కుంచించుకుపోయే స్త్రీమూర్తులు ఆ విధంగా వివస్త్రలయి రోడ్లమీదకి వచ్చారంటే ఎంతగా కదిలిపోయారో – వూహించుకోవచ్చు.
మొదట ఆదిమానవుడు నగ్నంగానే తిరిగాడు. నాగరికత తెలిసి మెదడు పని చేయడం మొదలయ్యేక శరీరాన్ని దాచుకోవడం తెలిసింది. మొదట ఆకులతోనూ, నార వస్త్రాలతోను; ఆలోచనా శక్తి పెరిగే కొలదీ రకరకాల వస్త్రాలు తయారుచేసి శరీరాన్ని కప్పుకోవడం మొదలుపెట్టేడు. ఆ తెలివితేటలతోనే స్త్రీలని మరింత కప్పేసి, ముసుగుల్లో దాచేసాడు.
అయినంత మాత్రాన ఏమి ఆగుతోంది? మనిషి నాగరికత పెరిగే కొలది అతి నీచంగా తయారయి అకృత్యాలకు పాల్పడుతున్నాడు. పసి బిడ్డల్ని కూడా తన అకృత్యాల పాలు చేసి చంపుతున్నాడు. ఈ వార్తలు విని విని, గుండె చెరువయి, నిరసించి, నినదించి, అరచి గగ్గోలు పెట్టి, కవిత్వాలు రాసి, కథలల్లి, సొమ్మసిల్లి ఆనక ఇంత పౌడరు రాసుకుని మన పనుల్లో మనం పడిపోతున్నాం.
పురుషాధిక్యతతో, పురుష బావజాలంతో కరడుకట్టిన నేతలు వినోదం చూస్తు కూర్చున్నారే గాని ఏ మాత్రం చలించి సరైన విధానంలో చర్యలు తీసుకోనేలేదు.
నిరసన తెలియజేయడానికి నగ్న ప్రదర్శన ఎంత వరకు వుపయోగపడుతుందో నాకు తెలియదు కాని నా చదువుకునే రోజుల్లో జరిగిన రెండు సంఘటనలు చెబుతాను.
మేము కాలేజి చదువుల కొచ్చేక మా నాన్నగారు ఉద్యోగం చేసే ఊరిలో సరైన కాలేజీలు లేక మా అమ్మమ్మగారి వూరు వచ్చేం. కొన్ని రోజులు అక్కడ వున్నా, మా చదువులకి ఉమ్మడి కుటుంబాల మధ్య అంత వీలుగా వుండడం లేదని గమనించి మా అమ్మగారు వేరే చోట యిల్లు తీసుకున్నారు. మేము తీసుకున్న యిల్లు బాగానే వున్నా, అది ఆ వీధికి కొద్దిగా చివర కావడంతో మా ఇంటికి కొద్దిగా అవతలగా కొంతమంది శ్రామికులు, రిక్షావాళ్ళు కాపురాలు ఉండేవారు. మా వీధి కూడలిలో ఒక కొళాయి (నల్లా) వుండేది. వాళ్ళంతా అక్కడికి నీళ్ళు పట్టుకోవడానికి ప్రొద్దుటా, సాయంత్రం బిందెలు తీసుకుని వచ్చేవారు. ఇక రెండు పూటలా చెప్పలేని గోల! తిట్లు, కొట్టుకోవడాలు! అరుపులు, కేకలూ! మా యింటికి ఆ మూలాలోనే మా స్టడీ రూమ్ ఉండేది. ఇక మాకు చెప్పలేని న్యూసెన్స్‌గా వుండేది. ఆ నల్లా ఎదురుగా కొద్దిగా ఎత్తరుగుల యిల్లుండేది. ఆ యింట్లో ఆ పేట మహారాణీ వుండేది. మెడలో అడ్డిగ, ముక్కుకి రెండు వైపులా ముక్కుపుడకలూ, చేతినిండా మోచేతి వరకు, రంగు రంగుల గాజులు, నుదుటిమీద పచ్చబొట్టూ, దర్జా ఒలకబోస్తూ అరుగెక్కి కూర్చుని లెక్చర్లిస్తూ ఎవరెవరు ముందు నీళ్ళు పట్టుకోవాలో చెప్పి శాసిస్తూండేది.
మాకావిణ్ణి చూస్తే కాళ్ళల్లో వణుకు. గబగబా తలదించుకుని వడివడిగా ఆవిణ్ణి దాటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. పాపం, ఆవిడ మమ్మల్నేమీ అనేది కాదు. మా యింటి పక్కనే మా తాసీల్దారు మామయ్య మేడ వుందేది. అందువల్ల “పాపలూ, కాలేజీకా?” అని నవ్వి పలకరించేది. అయినా అది మాకు ఘోరమైన తిట్టులానే అనిపించి భయంగా పరిగెత్తినట్లు వెళ్ళిపోయేవాళ్ళం. కారణం ఆమె నల్లా దగ్గర మాట్లాడే బూతు పురాణమే!
ఒకరోజు ఈమెకూ మరొకామెకూ ఘోరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆవిడ నీళ్ళకి రాగానే ఆమె బిందెని ఫుట్‌బాల్‌లా తన్ని ఈవిడ తగాదాకి దిగింది. కారణం ఈవిడ వడ్డీకి డబ్బులిచ్చిందట. ఆవిడ వడ్డీ కట్టడం లేదట. ఆ తగాదా సాగి సాగి వినలేని, వినరాని మాటలతో యుద్ధం సాగింది. ఆడవాళ్ళ అంబులపొదిలో మాటలయిపోయాయి. చేతులతో దాడి ప్రారంభించారు. ఒకరి కొప్పొకరు పీకేసుకున్నారు. గాజులు బద్దలు కొట్టేసుకున్నారు. చివరికి యుద్ధం పరాకాష్టకొచ్చింది. మేం పిల్లలం కాబట్టి కొంత భయంతోను, కొంత వినోదంగానూ తొంగి చూసి నవ్వుకుంటున్నాం.
సరిగ్గా అప్పుడే అనుకోని దారుణ సంఘటన జరిగింది. సదరు లేడీ డాన్ అప్పు తీసుకున్నావిడ చీర లాగేసి చంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది. అందరూ నిర్ఘాంతపోయేరు. గబగబా ఎవరిళ్ళలోకి వాళ్ళు పరిగెత్తేరు. కాని ఈవిడ మాత్రం “ఈ ఘోరం చూశారా?” అంటూ వీధంతా ‘లెఫ్ట్ రైట్’ చేసుకుంటూ నిటారుగా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ దెబ్బకి మేం ఆ యిల్లు ఖాళీ చేసి తిరిగి అమ్మమ్మ గారింటి దగ్గర మరో యిల్లు అద్దెకు తీసుకున్నాం.
మా చిన్నతనంలో అది అతి దారుణమైన విషయం!
చాలా రోజులు మనసులోంచి చెరిగిపోలేదు. తలచుకున్నప్పుడు బాధగానూ, ఆశ్చర్యంగానూ వుండేది.
సరే! ఇక్కడ మరో సంఘటన!
మా యింటి పక్కన ఒక డాబా యిల్లుండేది. ఆ యింట్లో వాళ్ళెవరూ మాకు కనిపించేవారు కాదు. మాటలు కొద్దిగా వినిపిస్తూండేవి.
నాది టెక్నికల్ స్టడీ కావటం వలన నేను చాల సేపు మెలకువగా వుండి రికార్డు వర్కు, ప్లాటింగ్ యిత్యాదివన్నీ చేసుకుంటూ కూర్చుండేదాన్ని. మిగతావారంతా ఆర్ట్స్ కాలేజీవాళ్ళు కాబట్టి త్వరగా పడుకునేవారు.
నేను మా యింటి సైడ్ వరండాలో చదువుకునేదాన్ని.
అప్పుడు మా పక్కింటి కిటికీలోంచి కొన్ని మాటలు వినిపిస్తూండేవి.
అందులో ఒక ముసలాయనకి ఆయన కూతుళ్ళు భోజనం పెడుతూ సాగిస్తున్న మాటలవి.
ఆయనేదో గొణిగేవాడు. అందులో ఒకమ్మాయి ఎంత వయసుంటుందో తెలియదు. “నాన్నగారండీ, మీకసలు బుద్ధి, సిగ్గూ లేవండి. ఎన్నిసార్లు చెప్పినా అంతేనండి. తమ్ముడికయితే డబ్బులొస్తాయండి, మా కయితే వుండవండి” అనేది.
“అవునండి. వంటి మీద చీరలు చిరిగిపోతుంటే ఒకటీ కొనకండి. ఆడికయితే మాత్రం కట్టలు పంపి సదివిస్తారండి. ఎదవ జన్మండి మీది!”
ఆ వయసులో నాకు వారి సమస్య కన్నా, వాళ్ళు తండ్రిని అండీ అంటూ తిడుతున్న మాటలు విని నవ్వొచ్చేది. తెల్లవారి మా అమ్మగారికి చెప్పి నవ్వేదాన్ని.
“ష్! అలా నవ్వకూడదు” అని మందలించేవారు మా అమ్మ.
ఏదైనా పెళ్ళి వూరేగింపు గాని, తిరునాళ్ళ ఊరేగింపు గాని లైట్లతో ఆ వీధిలో వెళ్తే వాళ్ళ డాబా మీద దబదబా శబ్దం వినిపించేది. మనుషులు కనిపించేవారు కాదు. నేను ఆసక్తిగా గమనిస్తే వాళ్ళు మోకాళ్ళ మీద పాకుతు పేరాపెట్ వాల్ కన్నాల్లోంచి ఆ ఊరేగింపుని చూస్తున్నారని అర్థమయ్యింది.
“ఎందుకలా? ఘోషానా?” అర్థమయ్యేది కాదు.
అందులో ఒక్కమ్మాయి మాత్రమే బయట పనులకి వెళ్తుండేది. ఆ అమ్మాయే కూరగాయలూ అవీ తెస్తుండేది.
ఇద్దరు కొడుకులు వుండేవారు. వాళ్ళిద్దరూ వైజాగ్‌లో మెడిసిన్ చదువుతున్నారట. శెలవలకి వచ్చి టిప్‌టాప్‌గా తయారయి వెళ్తుండేవారు.
ఒక రోజు చెప్పలేని ఘోరం జరిగిపోయింది.
ఆ యింట్లో రెండు ఆత్మహత్యలు జరిగేయి.
వాళ్ళిద్దరూ ఆడపిల్లలు!
నిజానికి వాళ్ళకి వయసు నలభై దాటే వుంటుంది.
నేను చూడలేదు గాని వాళ్ళిద్దరూ నిక్కర్లూ, జాకెట్లు వేసుకుని ఒకే చీర చుట్టుకున్నారట. అక్కడ దొరికిన వారు రాసిన ఆఖరి వుత్తరాన్ని బట్టి తెలిసిందేమిటంటే వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు. అన్నగార్ల నిక్కర్లు వేసుకుని, పాత చొక్కాలు వేసుకుని ఇంట్లో తిరుగుతారట. ఉన్న ఒక్క చీర బయటకి వచ్చినప్పుడు చెల్లెలు కట్టుకుంటుందట. ఆ తండ్రి దుర్మార్గుడు. మగపిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తూ, ఆడపిల్లలని చదివించకుండా, పెళ్ళిళ్ళు చేయకుండా, బయటకి రానివ్వకుండా ఉంచేసాడు. ఆ అన్నలు కూడా దుర్మార్గులు. తమ స్వార్థమే చూసుకున్నారు. వారు రాసిన ఉత్తరంలో ఆఖరి వాక్యం చదివితే ఎవరికయినా కన్నీళ్ళు సుళ్ళు తిరుగుతాయి. “దయచేసి మా వంటి మీద ఈ చీర తీయకండి. ఈ చీర చిరిగిపోయే దశకొచ్చింది. అందుకే పరువు కోసం చచ్చిపోతున్నాం. అందుకే మా వంటి మీద చీర అలానే వుంచండి” అని. ఇది నిజం. ఆ సంగతి తెలిసి వీధి వీధి ఏడ్చారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కాలం మారింది. పరువు మర్యాదల అర్థాలు మారాయి. ఒకరు తమ హక్కుల కోసం వంటి మీద బట్టలు తీసి నగ్న ప్రదర్శన చేస్తే, మరొకరు దాని కోసమే ప్రాణం తీసుకున్నారు.
మొత్తంగా చూస్తే అనాదిగా స్త్రీలను వివక్షతో చూడటం, వారికి జరిగిన అమర్యాదకి వంకరగా నవ్వుకోవడం లేదా అది వారి లోపం అన్నట్టుగా లెక్చర్లు దంచడం పరిపాటయిపోయింది.
దేశంలో సగం జనాభా వున్న స్త్రీలు తమకి జరుగుతున్న అన్యాయానికి అడ్దుకట్ట ఎందుకు వేయలేకపోతున్నారు? దుర్మార్గులకి శిక్షలు ఎందుకు వేయించలేకపోతున్నారు? ఊరికే ఉద్యమాల వలన పనులు చేసే నాయకులు, పరిపాలకులు మనకి ఎప్పుడు వున్నారు!
మన ఓటు లేకపోతే ఏ నాయకుడూ గెలవలేడు!
ఇప్పుడా సమయ మాసన్నమైంది.
ఎవరు కులమత వివక్షలకి అతీతులో, స్త్రీల మాన సంరక్షణ నిజాయితీగా ఎవరు చేయగలరో, ఎవరు దుర్మార్గుల భరతం పడతారో వారికి మనమంతా ఓటు వేసి గెలిపించాలి.
ఏ గాజులకో, కుంకుమ భరిణులకో, ఓ చీరెకో, బిందెకో కక్కుర్తి పడి ఓటు వేయడం కాదు.
మొట్టమొదట ఏ నాయకుడైనా చేయవలసిన పని స్త్రీలపైనా, పసిబిడ్డలపైనా అఘాయిత్యం చేసిన దుర్మార్గుడ్ని తమవాడని చూడకుండా శిక్షించాలి. అసెంబ్లీలలోనూ, పార్లమెంటులోనూ రౌడీలని కూర్చోబెట్టి పరిపాలించడం కాదు. చట్టాల్ని లోబరుచుకుని నేరస్థుల్ని బయట తిరగనివ్వడం కాదు.
అలా కాని పక్షంలో మనమే ప్రదర్శనలు చేసినా నవ్వులపాలు కావడం తప్ప, ప్రయోజనం వుండదు.
స్త్రీని నగ్నంగా చూసి విరక్తి చెంది యోగి వేమనలయ్యే పురుష పుంగవులెవరూ లేరని మనం గ్రహించగల్గాలి!
అలా కాని నాడు మనల్ని మరెవరూ రక్షించలేరు!