కందుకూరి వీరేశలింగంపై శతవర్ధంతి సంచిక

0
4

[dropcap]మ[/dropcap]తమౌఢ్యంలో కూరుకుపోయి మూఢ విశ్వాసాలతో, మూఢాచారాలతో విలవిలలాడుతున్న మన సమాజాన్ని వాటి నుంచి బంధ విముక్తం చేసి, ఒక శాస్త్రీయమైన, నాగరికమైన, మానవీయమైన సమాజంగా మార్చాలని ఆయన ఉద్యమించారు. స్త్రీల అణచివేత, అస్పృశ్యత వంటి దుర్మార్గాల మీద ఉద్యమించారు. స్త్రీలను చదివించడం, బాల్య వివాహాలను, అసమ వివాహాలను నిరోధించడం, వితంతువులకు మళ్ళీ పెండ్లి చేయడం, అవినీతి, లంచగొండితనాన్ని వ్యతిరేకించడం, పెళ్ళిళ్లలో దుబారా ఖర్చులను విమర్శించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.

సంస్కరణ కార్యకలాపాల్లో పూర్తిగా మునిపోయినప్పటికీ ఆయన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు ఆద్యుడిగా నిలిచారు. శతాధిక గ్రంథకర్త. సంస్కృతం, ఆంగ్లం నుండి నాటకానువాదాలు, నవల, జీవితచరిత్రలు, ప్రహసనాలు, బాల సాహిత్యం, స్త్రీల ఆరోగ్య విషయాలు, ప్రకృతి శాస్త్ర రచనలు, మానవ బుద్ధి వికాసానికి దోహదపడే శాస్త్రగ్రంథాలు, మొట్టమొదటి ‘స్వీయచరిత్ర’ కూడా ఆయనే రాశారు. తెలుగు సమాజమునకు, సాహిత్యమునకు వారు చేసిన సేవలు ఎనలేనివి. కందుకూరి వారు ఆనాటి మదరాసు మహానగరంలో 27-5-1919న కాలధర్మం చెందారు. అందుకని చెన్నై నగరంలోని చెన్నపురి తెలుగు వాణి సంస్థ ఆయన శతవర్ధంతిని 31-10-2018న ఘనంగా నిర్వహించారు. అలాగే డా॥ తూమాటి సంజీవరావు గారి సంపాదకత్వంలో ‘క్రాంతదర్శి : కందుకూరి’ పేరిట సంచికను వెలువరించడం ఎంతో సంతోషదాయకం.

ఇందులో మొదటి విబాగం కందుకూరి సాహితీతత్త్వం. దీనిలో ముందుగా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, గార్లపాటి దామోదర నాయుడు – కందుకూరి రచనలను పరిచయం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు కరుణావిలమైన సన్నివేశానికి తగినట్లుగా లలితమైన శైలిలో వ్రాసిన అధిక్షేప ఖండకావ్యం ‘సరస్వతీ నారద విలాపం’ అని ఆచార్య కె. సర్వోత్తమరావు తెలియజేశారు. కందుకూరి ‘స్వీయచరిత్ర’ చదివినప్పుడు, ఆయన జీవితమే కాదు, ఆనాటి సామాజిక చరిత్ర గురించి మనకు అవగాహన కలుగుతుందని ఆచార్య సి. మృణాళిని అభిప్రాయం. ‘కందుకూరి స్మృతి – ఆవశ్యకత’ గురించి ఎం. శ్రీనివాసరావు గారు తెలియజేయగా, కందుకూరిని ‘గద్యతిక్కన’గా నాగభైరవ ఆదినారాయణగారు నిరూపించారు. నాటక రచనను కూడ వీరేశలింగం సంఘ సంస్కరణకు, అందులోనూ స్త్రీ అభ్యుదయానికి సాధనంగానే ఎందుకున్నారని ఆచార్య గోగినేని యోగ ప్రభావతి దేవి; కందుకూరి వ్యాసాలయినా, ఉపన్యాసాలయినా సామాజిక అంశాల్ని దృష్టిలో పెట్టుకుని వెలువరించినవేనని గుమ్మా సాంబశివరావుగారు తెలియజేశారు. ‘కందుకురి తులనాత్మక దృష్టి’ని ఆచార్య జి. అరుణకుమారి వివరించగా, ‘అధిక్షేప ప్రబంధం అభాగ్యోపాఖ్యానం’ అని వెలుదంద నిత్యానందరావు, ‘రాజశేఖర చరిత్రము’ గురించి డా. నిర్మలా పళనివేలు, ‘సత్యవతీ చరిత్రము’ గురించి శ్రీమతి జగద్ధాత్రి, ‘ప్రబంధ కవిత్వం’ గురించి భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, ‘కందుకూరి ప్రహసనములు’ గురించి డా. వై. సుభాషిణి, ‘కందుకూరి దృష్టిలో శకునములు’ గురించి డా. యువశ్రీ, ‘కందుకూరి – జాషువాల కలయిక’ గురించి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ తెలియజేశారు.

ఎన్.జి.రంగా, డా. డి. ఆంజనేయులు రాసిన ఆంగ్ల వ్యాసాల పునర్ముద్రణలతో రెండవ విభాగమైన ‘కందుకూరి సామాజికతత్త్వం’ మొదలవుతుంది. డా. కట్టమంచి రామలింగారెడ్ది 1919లో వ్రాసిన వ్యాసంలో పంతులు గారు తమ సంస్కరణోద్యమానికి ఆయుధంగా సాహిత్యాన్ని వాడుకున్నారని, పాశ్చాత్య సాహితీవేత్తలలో వోల్టేర్‌తో వీరిని పోల్చవచ్చని అభిప్రాయపడినారు. కందుకూరి కాలంలో సంస్కరణ నేపథ్యంలో సంఘానికి సాహిత్యానికి వున్న సంబంధం సందర్శించటమయింది. కందుకూరి సాహిత్యం వస్తు దృష్టి, విలువల దృష్టితో చూడదగ్గ విమర్శ సూత్రంగా స్పష్టమయిందంటూ ఆచార్య కొలకలూరి ఇనాక్ తమ ‘సంస్కరణ సాహిత్య విమర్శ’లో పేర్కొన్నారు. ‘సంస్కరణ కళా సంరంభకులు’గా కోలవెన్ను మలయవాసిని కొనియాడగా, ఎల్.ఆర్.స్వామి కందుకూరి సమకాలికులుగా మలయాళ సమాజంలో బ్రతికి సంస్కరణోద్యమం చేపట్టిన ముగ్గురు మలయాళ సమాజ సంస్కర్తల గురించి తెలియజేశారు. కందుకూరి వీరేశలింగంపై బ్రహ్మసమాజం ప్రభావాన్ని డా. కనుపర్తి విజయబక్ష్, కందుకూరి స్త్రీ జనోద్ధరణపై పారేపల్లి సూర్యకుమారి, కందుకూరి సామాజిక విప్లవంపై డా. త్యాగదుర్గం మౌని రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. కందుకూరిని ‘నవయుగ వైతాళికుడు’గా డా. జాగర్లమూడి శ్యామసుందరశాస్త్రి, ‘జాతి వైతాళిక గీతిక’గా డా. మిరియాల గౌతమ్, ‘సంఘం తన రణరంగమైన కందుకూరి’ని రామతీర్థ, ‘కందుకూరి కలలదారి’ని డా. చిల్లర భవానీదేవి, ‘ఆడు మలయాళం’లోని అంతర్గత సంస్కారాన్ని డా. జె.కనకదుర్గ వివరించారు. ‘సమకాలిక భాషలపై, వ్యక్తులపై వీరేశలింగం ప్రభావం’ అని ఆచార్య శ్రీమతి జయప్రకాశ్ రాసిన వ్యాసం, వీరేశలింగంలో నాళం కృష్ణారావుకున్న విభేదాలను తెలియజేసిన సింగిశెట్టి లక్ష్మీనారాయణ వ్యాసం వైవిధ్యభరితంగా వుంది. కొన్ని కొత్త విషయాలను తెలియజేసాయి.

‘కందుకూరి రచనలు – దృష్టి’ అనే మూడవ విబాగంలో కందుకూరి రచించిన ‘అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము’, ’60 బాల్య వివాహములు, మానుష ధర్మము’ అనే రచనలను ఇచ్చారు. 1889లో మద్రాసులో భారతీయ సంఘ సంస్కరణ 12వ జాతీయ సదస్సులో కందుకూరి చేసిన అధ్యక్షోపన్యాసాన్ని, అనువాదంతో సహా ఇందులో చేర్చారు. దీనితో పాటు సంఘసంస్కర్తగా వీరేశలింగం గురించి రామతీర్థ రాసిన ఆంగ్ల వ్యాసం కూడా ఇందులో వుంది.

‘కందుకూరి నివాళి’ అనే నాల్గవ విభాగంలో పడకొండుమంది కీర్తిశేషులైన ప్రముఖ కవి, పందితులు రాసిన స్మృతి కవితలున్నాయి. ఇందులో కాళోజీ కందుకూరిని ‘కర్మయోగి’ అని, కొండవీటి వెంకటకవి ‘మహాత్మా’ అని, రాయప్రోలు ‘మహర్షి’ యనీ, సి.  నారాయణ రెడ్ది ‘మణిదీపం’ అని కొనియాడారు. తొమ్మిది మంది ప్రముఖులు అయిదవ విభాగంలో ‘శత వర్ధంతి విశేషాల’ను తెలియజేయడంతో సంచిక ముగుస్తుంది. యుగపురుషుడిగా కీర్తింపబడిన కందుకూరి వీరేశలింగం పంతులు జీవితోద్యమ సాహిత్యాలను నేటి తరం చదవడానికి ఈ సంచిక తప్పకుండా దోహదం చేస్తుంది. సంపాదకుడిగా తూమాటి సంజీవరావు కృషి ప్రశంసనీయం.

***

క్రాంతదర్శి : కందుకూరి (శర వర్ధంతి)
సంపాదకులు: డా॥ తూమాటి సంజీవరావు,
పేజీలు: 394
వెల: రూ. 450/-
ప్రతులకు: సంపాదకులు, సెల్‌: 98844 46208

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here