[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]
10. వేదాల్లో కాలమాన విజ్ఞానం
10.0 కాలమానం:
[dropcap]కిం[/dropcap]దటి అధ్యాయంలో మనం వేదాల్లో గల యజ్ఞవిజ్ఞాన విషయాలను గూర్చికొంత తెలుసుకున్నాం. ఇప్పుడు వేదాల్లో గల కాలమాన విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో వైదిక ఋషులందించిన విజ్ఞాన విషయాలెన్నో ఉన్నాయి. వారు మనకందించిన ముఖ్యమైన విజ్ఞానం కాలమాన విజ్ఞానం. కాలం యొక్క గణన ఏ విధంగా గ్రహించాలన్నది మన ఋషులకు తప్ప ఇంకే ఇతర దేశాల్లో వారికి తెలియదు. ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుని కాలమానం, ప్రపంచ సృష్టికర్తగా బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన కాలం, సృష్టి జరిగినప్పటినుంచి ఇప్పటివరకు గడచిన కాలం, బహ్మకు సహాయకులుగా ఉన్నమనువుల సంఖ్య, మన్వంతరాల కాలం మొదలైన విషయాలు తెలుసుకుందాం.
10.1 కాలచక్రపరిభ్రమణం:
అనంతమైన బ్రహ్మంలో, కాలం కూడా అనంతమే. ఐతే ప్రపంచ సృష్టి విషయంలో మటుకూ కాలానికి కూడా ఆది, మధ్య, అంతం ఉంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ కాలం ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. మార్పులు చేర్పులతో చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే తిరిగే కాలచక్రం. ఈ కాలాన్ని కొలవడానికి మన భారతీయ శాస్త్రాల్లో ఎన్నో కొలమానాలు (కొలతలు) ఉన్నాయి. వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి. కాలగణనలో కల్పాన్ని అతి పెద్దదిగా తీసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మ యొక్క సృష్టి మొదలై అంతమయ్యేవరకు పట్టే కాలాన్ని ‘కల్పం’ అంటారు. ఇది ఒక ఆవృతమన్నమాట. అంటే సృష్టి, స్థితి, లయలన్న కార్యాలన్నీ ఇందులోకే వస్తాయి. అవి తెలుసుకుందాం.
1. కొలమానాలు:
మనకి ఎన్నోరకాల కొలమానాలున్నాయి. ఉదాహరణకి భూమిని కొలవాలంటే అంగుళం, జాన, బెత్తె, అడుగు, గజం నుంచి యోజనం వరకు ఉన్నాయి. బరువును కొలవాలంటే వీసం నుండి వీసె, బారువు, మణుగు మొదలైనవి ఉన్నాయి. ద్రవపదార్థాలను కొలవాలంటే ఉద్ధరిణె నుండి గిద్దె, శేరు, మానిక, కుంచం మొదలైనవెన్నోఉన్నాయి. శబ్దపరంగా గూడా కొలమానముంది. మాట్లాడే భాషలోని పదాల్లో గల ఒక్కో శబ్దం యొక్క నిడివిని కొలవడానికి గూడా మన శాస్త్రాల్లో లెక్కలున్నాయి. వర్ణాలను గాని,శబ్దాలను గాని పలకాలంటే ఒక కాలపరిమితి ఉంది. వర్ణోచ్చారణ కాలనికి ఒక పేరు పెట్టారు ‘మాత్ర’ అని. దాని ప్రకారం పొట్టి అచ్చులకు, పొడవాటి అచ్చులకు, హల్లులకు ఉచ్చారణ కాలాన్ని నిర్ణయించారు ఈ కింది విధంగా:
పొట్టి అచ్చులు | అ ఇ ఉ ఎ ఒ | 1 మాత్ర | 256 లవములు |
పొడవాటి అచ్చులు | ఆఈఊఏఓఐఔ | 2మాత్రలు | 512 లవములు |
హల్లులు | అర్ధ మాత్ర | 1/2 మాత్ర | 126 లవములు |
‘లవ’మన్న దాన్ని అత్యంత సూక్ష్మమైన కాలంగా చెప్తారు. దీన్నే ‘కాల పరమాణువు” అని కూడా అంటారు. తామరపూల రేకులను ఒక కట్టగా చేసి సూదితో గుచ్చితే ఒక్క రేకుదళం గుచ్చడానికి ఎంతకాలం పడుతుందో దాన్ని ‘లవ’మంటారు. ఇదే సూక్ష్మతమ కాలం (శబ్దపరంగా కాలపరమాణువు). అలాగే కాలాన్ని కొలవడానికి తృటి, క్షణం, విఘడియ, ఘడియ అని వాడుతుంటాం. ఎన్ని రకాల కాలాలున్నాయో వాటన్నిటికీ గూడా మనవద్ద సరైన పేర్లున్నాయి. అంటే కాలాల్ని కొలవడానికి రకరకాల కొలమానాలున్నాయి. అతిపెద్ద కాలాన్ని కల్పం అంటారని తెలుసుకున్నాం. అలాగే చిన్నచిన్నకాలాలు గూడా ఉంటాయి. వాటికి పేర్లు స్మృతులననుసరించి ఒకలాగ, జ్యోతిష శాస్త్రాలననుసరించి ఇంకోలాగ ఉంటాయి. మన సంస్కృతిలోనున్నట్లు పేర్లు ఇంకో సంస్కృతిలో ఉండకపోవచ్చు. ఐనా కంగారు పడక్కరలేదు. అన్నీ బాగా అర్థమౌతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
2. కాల లక్షణాలు ( శ్రీ మహాభాగవతముననుసరించి) :
- పరమాణువు = ఇది అత్యంత సూక్ష్మకాలం. కంటికి గూడా కనిపించదు.
- అణువు = 2 పరమాణువులు.
- త్రసరేణువు= 3 అణువులు.
- త్రుటి = 3 త్రసరేణువులు.
- వేధ = 100 త్రుటులు.
- లవము = 3 వేధలు.
- నిమేషం = 3 లవములు.
- క్షణం = 3 నిమేషాలు.
- కాష్ఠ = 5 క్షణాలు= 15 నిమేషాలు.
- లఘువు = 10 కాష్ఠలు.
- నాడి = 15 లఘువులు.
- ముహూర్తం = 2 నాడులు.
- యామం/ప్రహరం = 6 లేక 7 నాడులు.
- పూట = 4 యామాలు (జాములు) = (పగలు 4 జాములు రాత్రి 4 జాములు).
- రోజు = 2 పూటలు=1 పగలు+1 రాత్రి=30 ముహూర్తాలు= 8 జాములు.
- పక్షం= 15రోజులు= శుక్ల పక్షం/ కృష్ణ పక్షం
- నెల = 30 రోజులు = 2 పక్షాలు (శుక్ల పక్షం+ కృష్ణ పక్షం).
- ఋతువు = 2 నెలలు.
- అయనం= 6 నెలలు ( ఉత్తరాయణం/దక్షిణాయణం).
- సంవత్సరం= 2 అయనాలు = 12 నెలలు= 6 ఋతువులు.
- జ్యోతిషశాస్త్రాన్ననుసరించి 6 ప్రాణకాలాలు=1 విఘడియ.
60 విఘడియలు=1ఘడియ. 60 ఘడియలు = 1 రోజు.
యుగాలు మొదలైన వాటి గురించి ముందుముందు తెలుసుకుందాం.
10.2 సృష్టి ప్రారంభకాలం :
భారతీయ శాస్త్రాల్లో ప్రాచీన ఋషులు మనకందించిన సృష్టి గురించిన సరైన లెక్కలున్నాయి. ఈ ప్రపంచం అనాదిగా ఉంది. సృష్టి జరిగి ఎంతో కాలమైంది. ఎందరో బ్రహ్మలు గతించారు. ఎన్నో కల్పాలు గడిచాయి. అవేవీ లెక్కకు అందవు. కానీ ప్రస్తుత బ్రహ్మగారి కాలం, ఆయన చేసిన ప్రపంచ సృష్టికి ఒక లెక్క ఉంది. మనందరికి తెలుసు, పురాణాల్లో బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలోంచి ఉద్భవించాడని. తను ఎందుకోసం పుట్టాడో తెలీక విచారిస్తూ ఉండగా ‘తపః’ అన్న శబ్దం వినిపించి కొంతకాలం తపస్సు చేసాడు. తర్వాత ప్రపంచ సృష్టి చేసాడు. బ్రహ్మ పుట్టినప్పటి నుండి గూడా ఉన్న కాలం గురించిన లెక్కలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఆ లెక్కను మన విద్వాంసులు రోజూ పూజ చేసేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటారు. “ఆద్య బ్రహ్మ ద్వితీయ పరార్దే …. శ్వేతవరాహకల్పే…కలియుగే…ప్రథమపాదే…” ఇలా నడుస్తుంది.
మన శాస్త్రాల్లో మానవలోకం గురించేకాక పితృలోకం, దేవతాలోకం మొదలైనవాటి కాలమానాల గురించి కూడా ఉన్నాయి. మానవుల్లో గనక 100 సంవత్సరాలు జీవిస్తే దాన్ని పూర్ణాయుషు అంటారు. అలాగే బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్ణాయుషు. కానీ మన కాలానికి బ్రహ్మగారి కాలానికి ఎంతో తేడా ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుత బ్రహ్మగారి వయస్సు. 51 సంవత్సరాల, 1 నెల, 1 పక్షం, 1 రోజు, 2వ యామం, 3వ ముహూర్తం. అంటే త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మగారి వయసు 51 ఏళ్ళేనన్నమాట. ఆయన ఇంకా మధ్యవయస్కుడే. కానీ ఆయనను మన వాళ్ళు చలనచిత్రాల్లో ఎంతో వృద్ధుడిగా చూపిస్తారు, తెల్లగడ్డాలు పెట్టి. నిజానికి దేవతలు ఎప్పడూ యవ్వనంలో 30 ఏళ్ళ వయసులోనున్నట్లు ఉంటారుట. అందుకే వారిని త్రిదశులు అంటారు.
10.3 కాల నిర్ణయాల్ని ఎలా చేసేవారు?
మన ప్రాచీన ఖగోళశాస్త్రజ్ఞులు ఆకాశంలోని నక్షత్ర, గ్రహసంచారాలను బట్టి ఖచ్చితమైన కాలనిర్ణయాల్ని చేసారు. అందువల్లే వారు నిముషాల్లాంటి సూక్ష్మకాలాల్ని గూడా చెప్పగలిగేవారు. అవి తెలుసుకొని విదేశీ ఖగోళ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. మనకు కనిపించే సూర్యుడు తన సౌరమండలానికి సంబంధించిన తక్కిన గ్రహాలను ఆకర్షిస్తాడని అందరికీ తెలుసు. సూర్యుడికేగాక ఇతరగ్రహాలకి గూడా ఆకర్షణశక్తి ఉన్నదని మన వేదాల్లోఉంది. గ్రహం అంటేనే ఆకర్షించేదని అర్థం. అదేగాక ఈ సూర్యునికి ఆకర్షకుడెవరో, ఏ మార్గం గుండా తిరుగుతున్నాడో, పరిభ్రమణ కాలమెంతోనన్న విషయాలు గూడా మన వేదాల్లో ఉన్నాయి. వాటిని దర్శించిన ఋషులు గూడా ఉన్నారు. ఈ విషయాలు కేవలం మన శాస్త్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలంటే మనం కాలమానాల్లో గల తేడాలేమిటో నన్నవి తెలుసుకోవాలి. ఆకాశమెంతో విశాలమైంది. ఈ ఆకాశంలో మన ఊహకందని ఎన్నో బ్రహ్మాండాలు, విశ్వాలు, లోకాలున్నాయి. వాటిల్లో కాలమానాలన్నీ ఒక్కలాగ వుండవు. భారతీయ జ్యోతిష గణితాల్లో మానవలోకానికి మాత్రమే కాక మానవులకి కనిపించని ఇతర లోకాలకు గూడా సమన్వయించేలాగా కాలమానాలు సరిపుచ్చబడ్డాయి. ముందుగా కాలమానాల గురించి తెలుసుకుని, తరవాత కొన్ని లోకాలకు సంబంధించిన కాలమానాల్లో గల తేడాల గురించిన వివరాల్ని తెలుసుకుందాం.
10.4 కాలమానాలు 9 రకాలు:
కాలమానాల్లో 9 రకాలున్నాయి. అవి: నక్షత్ర, చాంద్ర, సావన, సౌర, బార్హస్పత్య, పితృ, దివ్య, ప్రాజాపత్య, బ్రహ్మ మానాలు. పాజాపత్య, బ్రహ్మ మానాలతో మన భూలోకవాసులకు పనిలేదు. బ్రహ్మపాజాపత్య మానాలంటే బ్రహ్మ ప్రజాపతుల లోకాలకు సంబంధించిన కాలమానాలు. ఈ రెండూ తీసేస్తే మిగిలిన 7 మానాలనే మనవాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ మానాలగూర్చి తెలుసుకుందాం.
1.నక్షత్ర మానం: మనకు 27 నక్షత్రాలున్నాయి అశ్వని మొదలు రేవతీ నక్షత్రం వరకూ. ఈ 27 నక్షత్రాల్లో రోజుకో నక్షత్రం చొప్పున చంద్రుడు తిరుగుతుంటాడు. అంటే ఒక్కో రోజు ఒక్కో నక్షత్రం వద్ద ఉంటాడు. అందుకు ఈ 27 రోజులకూ నాక్షత్రమాసమని పేరు. ఇలాంటివి 12 మాసాలైతే ఒక నాక్షత్రసంవత్సరమని పేరు.
2.చాంద్రమానం: చాంద్రమానమంటే అమావాస్య నుండి మరల అమావాస్య వచ్చే వరకు పట్టే కాలం. అమావాస్యనాడు సూర్యునితో కలిసి చంద్రుడుంటాడు. దీనివల్లనే తిథులన్నీ ఏర్పడుతున్నాయి. చంద్రుని కళలు అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి నుండి పెరుగుతూ, 15వ రోజైన పూర్ణిమ నాడు పూర్తి కళలతో ఉండి, పూర్ణిమ మరునాడు వచ్చే పాడ్యమి నుండి తరుగుతూ ఉంటాయి. మరల 15వ రోజైన అమావాస్యనాడు చంద్రుడు కళరహితంగా ఉంటాడు. వీట్లనే శుక్ల పక్షమి, కృష్ణ పక్షమి అంటారు. ఇలా 30 తిథులేర్పడతాయి – పాడ్యమి, విదియ, తదియ మొదలైనవి. ఈ తిథులవల్లే సూర్యచంద్రుల మధ్యగల అంతరం తెలుస్తుంది.
3.సావన మానం: భూమి ఒక్కసారి తనచుట్టూ తాను తిరిగే ఆత్మప్రదక్షిణకాలం. సూర్యోదయం నుండి మరల మరునాడు సూర్యోదయం అయ్యేవరకూ పట్టేకాలం.
4.సౌరమానం: సూర్యుడు మేషరాశి నుండి మీనరాశి వరకూ తిరగడానికి పట్టేకాలం. వాట్లనే సంక్రమణాలంటారు. సూర్యుడు12 రాశుల్లోను 12 మాసాలూ సంచరిస్తాడు. ఉదా: మనకు సంక్రాంతి పండగ సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడం వల్ల వస్తుంది. అందుకే దాన్ని మకర సంక్రాంతి అంటాం.
- బార్హస్పత్యమానం (గురుమానం): బృహస్పతి ( గురుగ్రహం) ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి ప్రవేశించడానికి పట్టే కాలం. గురుగ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి 12 నెలలు తీసుకుంటుంది. ఆ కాలాల్లోనే కొన్ని పవిత్రనదులకు పుష్కరాలొస్తాయి. ఉదా: గురుగ్రహం సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరినదికి పుష్కరాలొస్తాయి, కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణానదికి పుష్కరాలొస్తాయి.
- పితృమానం: చాంద్రమానంలో ఏర్పడే శుక్ల,కృష్ణ పక్షాలు రెండూ కలిసి పితృ దేవతలకు ఒకరోజుతోసమానం. శుక్లపక్షమి పగటితో, కృష్ణపక్షమి రాత్రితో సమానం. మనకు ఒక చాంద్రమాసమైతే, అది పితృ లోకంలో ఒకరోజుతో సమానం.
- దివ్యమానం: దీన్నే దేవమానమని గూడా అంటారు. మనకు సౌరమానంవల్ల కలిగే ఉత్తరాయణ దక్షిణాయణ కాలాలు రెండూ కలిసి దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలకు మన ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి అన్నమాట. మనకి ఒక సంవత్సరమైతే దేవతలకు ఒక రోజన్నమాట.. ఈ 7మానాలనూ ఉపయోగించుకుంటూ వేదవేత్తలు వారి శ్రాత, స్మార్త కర్మలను కొనసాగిస్తుంటారు. ఇప్పుడు ప్రాజాపత్య, బ్రహ్మమానాల గురించి తెలుసుకుందాం.
10.5 అద్భుతమైన ప్రాజాపత్య బ్రహ్మ మానాలు:
ఈ ప్రాజాపత్య (ప్రజాపతి), బ్రహ్మమానాల గురించి అద్భుతమైన విషయాలు వేదాల్లో ఉన్నాయి. ఈ మానాలతో మన భూలోకవాసులకు పనిలేదని చెప్పుకున్నాం, ఎందుకంటే ఇవి బ్రహ్మాండానికి సంబంధించినవి. ఈ రెండూ గాక, పైన చెప్పిన మిగతా 7 మానాలు, విడివిడిగా భూమి, సూర్య, చంద్ర, గురుల యొక్క గతులననుసరించి నిరూపింప బడినాయి. ప్రాజాపత్య, బ్రహ్మమానాలు మటుకూ మొత్తం సౌరకుటుంబం యొక్క గతిననుసరించి ఉన్నాయి.
- ప్రాజాపత్యమానం: సూర్యుడ్ని ఆకర్షిస్తున్నది ప్రద్యుమ్న గోళం. అందుకు ఈ సౌరకుటుంబమంతా కలిసి ఒక్కసారి సూర్యుడ్ని ఆకర్షిస్తున్న ప్రద్యుమ్న గోళం చుట్టూ తిరిగి రావడానికి ఒక మహాయుగం పడుతుంది. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగమవుతుంది. అంటే నలభై మూడు లక్షల, ఇరవైవేల (43,20,000) సంవత్సరాలు ఒక మహాయుగమంటే. ఇలాటి 71 మహాయుగాలు + ఒక కృతయుగసంధి కలిసి ఒక మన్వంతరం. ఇదే ప్రజాపతి లోకానికి ఒకరోజు. మన మానవ సంవత్సరాలతో పోల్చి చూస్తే 30 కోట్ల, 84 లక్షల,48 వేల (30,84,48,000) సంవత్సరాలు.
- బ్రహ్మమానం: 14 మన్వంతరాలు ఒక కృతయుగసంధి కలిసి బ్రహ్మకు ఒక పగలు. ఇదే సృష్టి కల్పమంటే. ఇంతేకాలం బ్రహ్మకు ఒకరాత్రిగూడా. ప్రద్యుమ్నగోళాన్ని ఆకర్షిస్తున్నది సంకర్షణగోళం. ఈ ప్రద్యుమ్నగోళం తనకు సంబంధించిన ఇతర గోళాలతోను, మన సౌరకుటుంబంతోను కలిసి తనను ఆకర్షిస్తున్న సంకర్షణ గోళం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేకాలం బ్రహ్మమానం ప్రకారం బ్రహ్మకు ఒక పగలు. అంటే బ్రహ్మగారి సృష్టి కల్పమన్నమాట. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి వేదాల్లో. ఆధునిక ఖగోళశాస్త్రజ్ఞులు గూడా దూరదర్శిని సాయంతో చూసి మన సౌరమండలం హెర్క్యులస్ మండలంలోని ఒక నక్షత్రం వైపుగా ప్రయాణం సాగిస్తున్నదని చెప్తున్నారు. ఈ కాలమాన విషయాలన్నీ ఇంకా విపులంగా ముందుముందు తెలుసుకుందాం. ఇప్పుడు యుగాల విభజన ఎలా ఉంటుంది, బ్రహ్మమానమంటే ఏమిటన్న విషయాలు తెలుసుకుందాం.
10.6 యుగాల విభజన:.
మన శాస్త్రాల్లో మానవలోకం గురించే గాక పితృ, దేవతాలోకాలు మొదలైనవి ఉన్నాయి, వాటికి సంబంధించిన కాలమానాలున్నాయని తెలుసుకున్నాం. ఉదా: దేవమానం ప్రకారం మానవలోకంలో 1 సంవత్సరం అంటే దేవతలకు 1 రోజు అన్నమాట. ఇంక బ్రహ్మమానం ప్రకారం మానవలోకంలో ఎన్ని యుగాలు గడిస్తే బ్రహ్మకి ఒక్కరోజుకు సరిపోతుందో తెలుసుకుందాం. ముందర యుగాలని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఒకమహాయుగాన్ని 4 యుగాలుగా విభజిస్తారు. ఈ కిందివిధంగా :
కృత- ఒక మహాయుగంలోని 4 దశాంశాలు,
త్రేత- ఒక మహాయుగంలోని 3 దశాంశాలు,
ద్వాపర-ఒక మహాయుగంలోని 2 దశాంశాలు
కలి – ఒక మహాయుగంలోని 1 దశాంశం
ప్రతి యుగంలోనూ 12వ వంతు ఆదిసంధి అని, అంతే అంతిమ సంధి అని ఉంటాయి. ఇంక బ్రహ్మమాన వివరాల్లోకి వెళదాం.
10.7 బ్రహ్మకాలమానం:
ప్రపంచంలో జీవసృష్టి అంతా బ్రహ్మదేవుడి వల్ల జరిగిందని మన శాస్త్రాల్లోవుంది. ఆ బ్రహ్మ సృష్టి ఎప్పుడు ప్రారంభించాడో తెలుసుకోవాలంటే బ్రహ్మయొక్క కాలమానం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మకు ఒకరోజు అంటే ఒక పగలు, ఒక రాత్రి. ఇలాంటి రోజులతో కూడిన 100 సంవత్సరాలు బ్రహ్మకు పూర్ణాయుష్షు. ఈ పగటి పూటను కల్పం అంటారు. అంటే పగటి పూటనే ఆయన సృష్టి అంతా సాగుతుంది. రాత్రిపూట జరగదు. దాన్ని క్షయకల్పం అంటారు. ఈ కల్పంలో (పగటిపూటలో) 14 మనువులు సృజియింపబడి బ్రహ్మకు జీవకోటి సృష్టికి సాయపడతారు. బ్రహ్మయొక్క పూర్ణాయుష్షు 100 సంవత్సరాలని ‘పర’ అంటారు. దానిలో సగాన్ని ‘పరార్థం’ అంటారు. సంకల్పంలో చెప్పుకున్నాం – ‘ఆద్యబ్రహ్మ ద్వితీయపరార్దే’ అంటే బ్రహ్మాగారికి 50 ఏళ్ళు గడిచాయి. 100 = 50 + 50 (2 పదార్థాలు) – ఇప్పుడు రెండవ పరార్ధం జరుగుతోంది. అంటే ఆయన ఆయుష్షును గురించి గూడా మనవద్ద లెక్కలున్నాయి. ఆయన వయస్సు ఇప్పుడు: 51 సంవత్సరాల, 1 నెల, 1 పక్షం, 1 రోజు, 2 వ యామం, 3వ ముహూర్తం. దీన్ని బట్టి ఎంతమంది మనువులు గతించారో గూడా చెప్పవచ్చు.
- బ్రహ్మదేవుని కాలమానం:
ఒక దేవసంవత్సరం 360 మానవ సంవత్సరాలకు సమానం.
దేవ సంవత్సరాలు | మానవ సంవత్సరాలు | |
1. కృతయుగం | 4800×360 | =17,28,000 |
2. త్రేతాయుగం | 3600×360 | =12,96,000 |
3. ద్వాపరయుగం | 2400×360 | = 8,64,000 |
4. కలియుగం | 1200×360 | = 4,32,000 |
1 మానవ సంవత్సరం … 1 దేవతా దినం
360 దేవతా దినాలు … 1 దేవ సంవత్సరం
12000 దేవతా సంవత్సరాలు…1 మహాయుగం
1000 మహాయుగాలు … బ్రహ్మకు 1 పగలు
1000 మహాయుగాలు … బ్రహ్మకు 1 రాత్రి
100 బ్రహ్మ సంవత్సరాలు…
బ్రహ్మగారి ఆయుర్దాయం 1 బ్రహ్మ జీవితకాలం… నారాయణునికి 1 నిశ్వాసం
2. ప్రస్తుత చతుర్ముఖ బ్రహ్మగారి వయస్సు (మానవ సంవత్సరాల్లో):
కృతయుగం … 17,28,000
త్రేతాయుగం … 12,96,000
ద్వాపరయుగం… 8,64,000
కలియుగం … 4,32,000
ఒక చతుర్యుగం… 43,20,000 సంవత్సరాలు = ఒక మహాయుగం
1000 చతుర్యుగాలు …4,32,00,00,000 … బ్రహ్మకు1 పగలు = 14 మన్వంతరాలు = 1 కల్పం
1000 చతుర్యుగాలు … 4,32,00,00,000 … బ్రహ్మకు 1 రాత్రి
1 బ్రహ్మదినం… 8,64,00,00,000 సంవత్సరాలు. (మానవ సంవత్సరాలు)
100 బ్రహ్మసంవత్సరాలు … 100x365x8,64,00,00,000… =3,15,36,000 కోట్ల సంవత్సరాల (సంవత్సరానికి 365 రోజుల ప్రకారం)..
సంవత్సరానికి 360 రోజులనుకుంటే=100x360x8,64,00,00,000= 3,11,040,000,000,000 సంవత్సరాలు.
3. సృష్టి ప్రారంభ కాలం నుండి నేటి (2019-20) వరకు గడచిన కాలం:
బ్రహ్మ సృష్టికి పూర్వం క్షయకల్పాంతంలోనే ధ్యానంలో కొంతకాలం గడపి గ్రహ, నక్షత్ర, దేవ, దైత్యాది సకల చరాచరాన్ని సృష్టించాడు. ఆ కాలాన్ని గూడ కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే బ్రహ్మకు సర్వం సృష్టించడంలో ఎంత కాలం పట్టిందో తెలుస్తుంది: ప్రస్తుత కల్పాది నుండి బ్రహ్మకు గడచిన కాలం=197,29,49,120 సంవత్సరాలు. బ్రహ్మ ధ్యానంలో గడపిన కాలం = 1,70,64,000 సంవత్సరాలు. సృష్టి ప్రారంభమై ఇప్పటికి గడచిన కాలం = 199,00,13,120 మానవ సంవత్సరాలు. అంటే సృష్టి ప్రారంభమై ఇప్పటికి 199 కోట్ల, 00 లక్షల, 13వేల 120 సౌర సంవత్సరాల కాలమైందన్నమాట (నూటతొంభై తొమ్మిది కోట్ల పదమూడువేల, నూట ఇరవై సంవత్సరాలు). ఐతే బ్రహ్మసృష్టి కాలగణన ప్రారంభించింది మటుకు ప్రస్తుత కల్పాదినుండి, అంటే ఈ శ్వేతవరాహకల్పాది( ప్రస్తుత కల్పాది) నుండి జరిగింది. శ్రీ కోట వెంకటాచలంగారు, ఆయన కుమారుడైన శ్రీకోట నిత్యానందశాస్త్రి గార్ల పరిశోధనల ఆధారంగా ఈ లెక్కలు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కల విషయంలో కొన్ని పొరపాట్లు ఆంగ్లేయుల వల్ల జరిగాయి. ఈ పొరపాట్లు మన పంచాంగాల్లో గూడా చోటు చేసుకున్నాయి. వాటిని సరిదిద్దడానికి వీరిద్దరూ పరిశోధనలుచేసి మనకు సరైన సమాచారాన్నందించారు.
4.బ్రహ్మసృష్టికాలగణన ప్రారంభించిన సుముహూర్తం:
ఆకాశంలో సూర్యాది సప్త గ్రహాల యొక్క సంచారం మీద ఆధారపడి సృష్టికాలం గణించబడుతోంది. బ్రహ్మదేవుడు ధ్యానం చాలించి కళ్ళు తెరచి సృష్టి కాలగణన ప్రారంభించిన సుమూహూర్తం – ఈ శ్వేతవరాహకల్పాది( ప్రస్తుత కల్పాది): “ప్రమాది నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం.”
సౌరమానం ప్రకారం ఆరోజున సూర్యాది సప్తగ్రహాలన్నీ మీనరాశిని వదిలి, మేషరాశిలో ప్రవేశించాయి. చాంద్రమానం ప్రకారం ఈ సప్తగ్రహాలు రేవతీనక్షత్రం దాటి అశ్వని నక్షత్రంలో ప్రవేశించాయి. ఆ ప్రత్యేకమైన రోజున ఈ రెండూ ఒకేసారి జరిగాయిట. ఆప్పటినుచి సృష్టికాలగణన ప్రారంభమైంది. ఇప్పటికి 197,29,49,120 సంవత్సరాలు.
5.ఈ సుముహూర్తం గురించి ఎవరు మనకు తెలిపారు?
ప్రస్తుతం మనం వైవశ్వత మన్వంతరంలోని 28వ మహాయుగానికి చెందిన కలియుగంలో ఉన్నాం. వైవశ్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కృతయుగం ఇంకా 1200 సంIIలకు ముగుస్తుందనగా లంకాద్వీపాధిపతియైన మయుడు సృష్ట్యాది నుండి కృతయుగాంతానికి లెక్కవేసి అప్పటి వరకూ 197,07,84,000 సంవత్సరాలు గడిచాయి అని తను రచించిన సూర్యసిద్ధాంతంలో చెప్పాడు. ఆయన 21,61,200 సంవత్సరాల కిందటి కాలంనాటి వాడు. ఈ మయుడు (మయాసురుడు) కృతయుగాంతాన గ్రహగతుల రహస్యాలు తెలుసుకోవడానికి సూర్యుని గూర్చి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు తన అంశ పురుషుని ఆదేశించాడు ఈ విషయాలు మయునికి ఉపదేశించమని, ఆ విధంగా మయుడు జ్ఞానాన్ని సంపాదించి ‘సూర్యసిద్ధాంతం’ అన్న గ్రంథం రచించాడు. ఇప్పుడు మన్వంతరాల గురించి తెలుసుకుందాం.
10.8 మన్వంతరాలు:
బ్రహ్మగారి సృష్టి కల్పంలో ఆయనకు సహాయకంగా 14 మంది మనువులు, అంటే ప్రజాపతులుంటారు. ఇంతమంది మనువుల్లో ఒక్కక్కరికి ఎంతకాలం పడుతుందోనని తెలిపే లెక్కలు గూడా మనవద్ద ఉన్నాయి. శ్రీ కోట వెంకటాచలంగారి పరిశోధనలో ఈ వివరాలున్నాయి. ఆ విషయాలు తెలుసుకుందాం.
- మన్వంతరకాలం:
కోటవేంకటాచలంగారి వివరణప్రకారం మన్వంతరమంటే 71మహాయుగాలకి 1 కృతయుగ ప్రమాణ సంవత్సర కాలసంధి కలపాలి ఈ కింది విధంగా: 1 మహాయుగం = 43,20,000 మానవ సంవత్సరాలు. 71 మహాయుగాలు=43,20,000 x 71 =30,67,20,000 + 1 కృతయుగ కాలప్రమాణం = 17,28,000 = 1 మన్వంతరం (మానవ సంవత్సరాల్లో) = 30,84,48,000 సంవత్సరాలు. ఇదీ ఒక మనువుకు పట్టే పని కాలం మన మానవ సంవత్సరాల్లో లేక మన సౌర మానం ప్రకారం. ఇన్ని మానవ సంవత్సరాలైతే ప్రజాపతిలోకంలో ఒకరోజన్నమాట.14 మన్వంతరాలు ఒక కృతయుగసంధి కలిసి బ్రహ్మకు ఒక పగలు. ఇదే సృష్టి కల్పమంటే. ఇదీ మన ప్రాచీన ఖగోళ గణితశాస్త్రజ్ఞుల కాలగణన విధానం. ఇప్పుడు 14 మన్వంతరాల్లో వచ్చే సంధికాలాల లెక్క చూద్దాం.
- సంధికాలాలు:
14 మంది మనువులకి 15 సంధికాలాలు వస్తాయి. దానిప్రకారం చూద్దాం: 14 మంది మనువులు = 14X30,67,20,000 = 4294080000 + 15 సంధికాలాలు= 15 X 17,28,000 15 X 17,28,000 = 25920000 బ్రహ్మసృష్టి కాలం(పగలు) మానవ సంవత్సరాల్లో = 4320000000 సంవత్సరాలు.
- బ్రహ్మకాలమానం ప్రకారం ఒక్కో మనువుకి పట్టేకాలంఎంతో చూద్దాం: బ్రహ్మకు 1 పగలు ఒక కల్పం అనుకుంటే అది మనకు లాగా 12 గం||లు అనుకుంటే (పగలు పొద్దున 6 గం||ల నుండి సాయంత్రం 6 గం||ల వరకు లెక్కవేసుకుంటే ఒక మనువు, బ్రహ్మకాలమానం ప్రకారం ఈకింద చూపినంత కాలం పనిచేస్తాడు:
(12 X 60 ÷ 14) = (720 ÷ 14) = 51.4 నిమిషాలు
మానవ కాలమానం ప్రకారం లెక్కిస్తే బ్రహ్మ యొక్క పగటిపూట కాలాన్ని ఆయనకు సహాయకంగా ఉండే 14 మంది మనువులకూ సమానంగా పంచితే ఒక్కో మనువుకూ పట్టే కాలం యొక్క లెక్క వస్తుంది: 4,32,00,00,000/14= 30,85,71,429 (30.857) కోట్ల మానవ సంవత్సరాలు. ఈ లెక్కప్రకారం ఒక్కో మన్వంతరమంటే 30 కోట్ల 85లక్షల సంవత్సరాల పైనే ఉంటుంది. ఈ లెక్కకు,ఇందాకిచ్చిన లెక్కకు పెద్ద తేడా లేదు.
- బ్రహ్మగారి మొదటి పరార్ధంలో ఎంతమంది మనువులు పనిచేసారు?
ప్రస్తుత బ్రహ్మగారి వయస్సు గురించి ముందరచెప్పుకున్నాం: 51 సం, 1 నెల, 1 పక్షం, 1 రోజు, 2వ యామం, 3వ ముహూర్తం. దీని ప్రకారం బ్రహ్మగారి మొదటి పరార్ధంలో ఎంతమంది మనువులు పనిచేసారో చూద్దాం:
మొదటి పరార్దం = 50 సంవత్సరాలు: సంవత్సరానికి 365 రోజుల ప్రకారం:
50 x 365 = 18250 రోజులు.
1 రోజుకు – 14 మనువులు.
18250 x 14 =2,55,500 మనువులు.
1 నెల = 30 రోజులు + 1 పక్షం = 15 రోజులు + 1 రోజు = 1 రోజు = 46 రోజులు + (2వ యామం+3వ ముహూర్తం) = 46 x 14 = 644 + 6 మనువులు.
- ఈ శ్వేతవరాహ కల్పంలో ఇప్పటి వరకూ మొత్తమెంతమంది మనువులు పనిచేసారు?
2,55,500 + 644 + 6 = 2,56,150 (2 లక్షల 56వేల 150 మంది మనువులు). ప్రస్తుతమున్న వైవశ్వత మనువు 2,56,151వ వాడు. ఐతే సంవత్సరానికి 360 రోజుల ప్రకారం లెక్క వేసుకుంటే 252650 మంది మనువులు వస్తారు. అది గూడా చూద్దాం: 50 x 360=18000 రోజులు.
1 రోజుకు – 14 మనువులు.
18000 x 14 = 2,52,000 మనువులు + 46 x 14 +6 = 650 మనువులు.
మొత్తం మనువులు = 2,52,650
ఈ లెక్కన ప్రస్తుతమున్న వైవశ్వతమనువు 2,52,651వ వాడు.
- ఇప్పటి (2019-2020) కి బ్రహ్మగారి వయసు :
సంవత్సరానికి 360 రోజుల ప్రకారం లెక్క వేసుకుంటే బ్రహ్మగారి పూర్తి ఆయుర్దాయం: 100x360X8,64,00,00,000= 3,11,040,000,000,000 మానవ సంవత్సరాలు. అంటే 3,11,040,00 కోట్ల మానవ సంవత్సరాలు. బ్రహ్మగారి వయసు ఇప్పటికి 1555219729120 మానవ సంవత్సరాలు. ఆయనకింకా 155518027050880 సంవత్సరాలు గడిస్తే నూరేళ్ళూ నిండుతాయి. సంవత్సరానికి 365రోజుల ప్రకారంలెక్క వేసుకుంటే బ్రహ్మగారి పూర్తి ఆయుర్దాయం: 100x365x8,64,00,00,000= 3,15,36000కోట్ల మానవ సంవత్సరాలు. ఈ లెక్కన ఇప్పుడు బ్రహ్మగారికి మిట్టమధ్యాహ్నం జరుగుతోందన్నమాట.
10.9 ఇప్పటివరకూ గడిచిన కాలం :
బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాక ఎన్నో మన్వంతరాలు గడిచాయి. ఇప్పుడు 7వదైన వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఇందులో చాలా యుగాలు గూడా గడిచాయి. ప్రస్తుతం 28వ మహాయుగం జరుగుతోంది. ఇందులో కృత, త్రేత, ద్వాపరాలు గడిచి కలియుగం ప్రధమపాదం నడుస్తోంది. ప్రస్తుతం మనం కలిశకం 5120లోఉన్నాం. ప్రస్తుతం మనకు ఆంగ్ల సంIIల లెక్కల ప్రకారం 2019-20 నడుస్తోంది కాబట్టి దాన్ని కలిశకంలో చెప్పుకోవాలంటే కలిశకం (క.శ.) 5120లో మనమున్నాం. భారతీయులకు అనేక శకాలకు సంబంధించిన కాలనిర్ణయాలున్నాయి. ఉదా: కలిశకం, యుధిష్ఠిరశకం, విక్రమశకం, శాలివాహనశకం మొదలైనవి. కానీ ఆంగ్లేయులపాలనలో ఉన్నప్పటి నుంచి వాడుకులో నున్న వాళ్ళ కాలనిర్ణయ లెక్కలనే మనం వాడుతున్నాం ఇప్పుడు గూడా. అవి వాళ్ళకి సంబంధించిన పేర్లలోనే ( B.C.-బి.సి.,A.D.-ఎ.డి.) ఉన్నాయి. ఐతే వీటిని ఇప్పుడు1. Before Common Era (B.C.E – బి.సి.ఇ. ) సామాన్యశకపూర్వం, 2. Common Era (CE – సి.ఇ.) సామాన్యశకం అంటున్నారు. ఇంక చివరగా వివిధలోకాల్లో గల కాలమానాలపట్టికను ఇవ్వడం జరిగింది ఆసక్తిగల పాఠకుల కోసం.
10.10 వివిధలోకాల్లో గల కాలమానాలపట్టిక:
మన బ్రహ్మాండంలో ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకాల్లో కాలమానాలన్నీ ఒకేలాగ ఉండవు, వాటిల్లో తేడాలుంటాయని తెలుసుకున్నాం. ఇక్కడ మానవ, పితృ, దేవ, బృహస్పతి, ప్రాజాపత్య లోకాల కాలమనాలనే ఇవ్వడం జరిగింది. ఆ వివరాల పట్టికను ఇక్కడ చూద్దాం:
ఇంతటితో కాలమాన వివరాలు చాలిద్దాం. వచ్చే అధ్యాయంలో మనువుల గురించి తెలుసుకుందాం..
(సశేషం)