[dropcap]ఏ[/dropcap]డాదికోసారి
సరికొత్తగా ఏతెంచే
నవవత్సర ఉగాది
సర్వజన మంగళమయ
ఆకాంక్షలకు ప్రతీక…
ఉగాది సామాజిక హితైషి
ఉగాది మానవ సహవాసి…
ధైర్యాన్నీ స్థైర్యాన్నీ
పుష్కలంగా అందించే దేవత…
సత్కర్మ క్రియలకు
ఉద్యుక్తుల్ని చేసే మానవత…
ఉగాది…నిరాశా నిస్పృహల్ని
మటుమాయం చేసే సంహర్త…
ఒక ఉద్దేశ్యంతో ఉత్తేజంతో
అడుగులు వేయించే రూపకర్త…
ఉగాది కొత్త వస్త్రాల్లో కనిపించే
పరిచిత పాత స్నేహమే…
ఉగాది…ఆటుపోట్లని భరించి
ధరించిన అనుభవ దేహమే…
పేరు ఏదైనా
మీ క్షేమాన్ని సదా కోరుకునే
సహృదయ శ్రేయోభిలాషి…
శ్రీ వికారి గా పరిచయమౌతోన్న
ఈ తెలుగు వెలుగుల దీపిక
నవ్యాంధ్ర ప్రజల అభ్యున్నతికై
ఓ కోకిల కుహూరాగమై
షడ్రుచుల మేళవింపై
కొత్తగా పచ్చగా హత్తుకోవాలని
ఆశావహ అభ్యర్థన
కవిగా వినమ్ర నివేదన.