[dropcap]రా[/dropcap]లిన ఆకుల కన్నీటిని మరిపించి
చిగురాకుల పన్నీటిని చిలకరిస్తూ
వచ్చింది మైమరపింపజేసే నవ వసంతం
జగతిలోన అందాలన్నీ తనకే స్వంతం
వసంతం అందించే సందేశం విను సోదరా
ఇది వింటే బతుకులో అలజడి లేనే లేదురా.
1.
నీపై నీకు నమ్మకముంటే – నీ గొంతు నీ స్వంతమయితే
ఏ మూల నుండి కూత కూసిన – కోయిన గానమై తీరుతుంది.
ఎవడో తొక్కేసేడని – ఇంకెవడో నీ గొంతు నొక్కేసేడని
నిన్ను నువ్వు మెచ్చుకుని – నీలో నువ్వే పొంగిపోకు మిత్రమా.
అందరికీ వీనుల విందుగ కోయిల గానం నీవైతే
జగమంతా నీదవుతుంది – నీ అహమే మాయం అవుతుంది.
2.
రంగు రంగుల పూవులెన్నైనా – పరిమళాల వానలొక్కటే
ఏ తోటలో ఏ విరి విరబూసినా – తుమ్మెద ప్రేమల తీరులొక్కటే
నీలో నీలో నిజమైన ప్రతిభుంటే – ప్రశంసలు వాటంతటవే చుట్టుముడతాయి
సత్కారాల విరహంలో వ్యామోహంలో మునిగిపోయి అలసిపోకు మిత్రమా
నీ అలోచనలు సమాజం కోసం నిలబడితే
నీ విజ్ఞానం ప్రజల పక్షమై నిలిస్తే
వాడిపోయే దండలు కాదు, ఎన్నెన్నో గుండెలు నీవవుతాయి
వన్నె చెదరని గుండెలెన్నెన్నో నీవవుతాయి.
3.
మంటలు రేపే వేసవి లోనే కమ్మని చెరుకుల తీయదనాలు
చెమటలు పోసే ఉక్కపోతలో – ప్రకృతి చిక్కని సువాసనలు
జరిగినదంతా మంచే కాదు – జరగనిదంతా చెడు కాదు
నువ్వేది కోరితే అదే జరగటం కాల ప్రవాహం ధర్మం కాదు
వేడిమి నుంచి వేదన నుంచి దూరంగా పారిపోకు నేస్తమా
కష్టం వెనకే సుఖముంటుంది.
ప్రకృతి నీదీ నాదీ అందరిదీ – వికృతిపై మనసేల
ప్రకృతితో పెరగాలి నేస్తమా – ప్రకృతివై నిలవాలి నేస్తమా.