[dropcap]ఎ[/dropcap]క్కడికి పోయిందో ఆ పండగ సందడి
ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడే హడావిడీ
ఉగాదిని కూడ కబ్జా చేశాయి కదా
ఎన్నికలు
కోయిల కూతల్లో కూడా కోటిగొంతులలో
ఓటేయమని వినయపూర్వక ప్రార్థన
అవిశ్రాంతంగా వినిపిస్తోంది…
విసిగిస్తోంది
తెల్లగా విచ్చుకోవలసిన మామిడి పూత
రాజకీయ పార్టీల రంగులు రంజుగా
పులుముకొని
పంచరంగుల్లో పకపకా నవ్వుతోంది
శుభాకాంక్షలు చెప్పుకునే పరిచయాలు
గెలుపు గుర్రమెవరనే పందాలు కాస్తున్నాయి
లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
అలాయ్ బలాయ్ కౌగిలింతలలో
బలాన్ని ప్రదర్శించేందుకు యావ
బలగంతో కలుపుకునే తోవ
స్పష్టమవుతుంది.
పలచగా జారిపోయే పచ్చడి పులుపు
షడ్రుచుల సంగమాన్ని విదిలించి
దులిపేసుకుని, మ్యానిఫెస్టో తీయదనాన్ని
మదినిండా నింపేసుకుంది.
పంచాంగ శ్రవణంలోని
ఆదాయ వ్యయాలూ, రాజపూజ్య అవమానాలు
వ్యక్తి గతాన్ని, ఒంటరిగానే వదిలేసి
రాజకీయపు భవితత్వాన్ని
బట్టబయలు చేస్తున్నాయి
ఉగాది పండుగ ఒక్క ఏడాది
మంచి చెడులకు, తలుపు తీసి సాదరంగా
స్వాగతం పలికితే, ఎన్నికల పండగ మాత్రం
ఐదేళ్ళ ఏలుబడికి ఆశల ఆకాంక్షల వేడుకలకు
తెర లేపుతానంటోంది
అహా…
ఉగాదిని కూడా కబ్జా చేశాయి కదా ఎన్నికలు.