అడవి దున్న

0
4

[dropcap]ఆ[/dropcap] అడవిలో ఓ దున్న…
ఆ రోజు…
ఆ దున్న పాలిట – ముందు మృత్యువు, వెనుక శత్రువు…
అది అడకత్తెరలో పోకచెక్క
ఆ కత్తెర మనిషి చేసిన మామూలు కత్తెర కాదు

ఆ రోజు – కాలం, దాని ప్రాణం కొరకు –
ప్రత్యేకంగా రూపొందిన విశేషాంగాల కత్తెర…
మ్యూజియంలోని విశేషాంగాల అడకత్తెర కాదు
మ్యూజియంలోని అడకత్తెర అర్ధనారీశ్వర అంగాలు గలది
అక అంగం స్త్రీది – ఒక అంగం పురుషుడిది
ఆ రెండు అర్ధాంగాలు కలిస్తేనే కార్యసాధన జరుగుతుంది –
పోకచెక్క వక్కవౌతుంది.

కానీ ఈ అడకత్తెర దానికి భిన్నం
ఏ ఒక్క అంగమైనా చాలు కార్యసాధనకు –
స్వపరాగ సంపర్కంలోని కార్యసాధనలా…

ఆ అడవిలో ఓ నీటి మడుగు
ఆ అడవిలో ఓ మొసలి…
మడుగు ఒడ్దు మీద ఓ సింహాల గుంపు
మడుగు నీటి అంచుల మీద ఆ దున్న…

సూర్యుడు తన రథాన్ని అధిరోహిస్తూనే ఈ దృశ్యం కనబడింది
దున్న మడుగు నీటి అంచుకు మీంచి ఒడ్డుకెళ్తే సింహాల గుంపు –
కంచం కడ పిల్లి గాచినట్లు
దున్న మడుగు నీటి అంచుకు మీంచి లోనికెళ్తే – మొసలి ఈతలు!
కలిసి వచ్చువేళ ఘనులే దురల్పులు…
మృత్యువు కోరలు చాచే వేళ…

దున్న – మడుగు నీటి అంచు వలయం మీద –
అటు మృత్యువు, ఇటు శత్రువు – సరిహద్దు రేఖ మీద…
దున్న నిలకడన్నది లేక నీటి అంచుల వలయం మీద
నీటి అంచునుంచి ఒడ్డు వేపు వస్తే సింహాల గుంపు –
నీటిలోనికి వెళ్తే మొసలి మృత్యువు…
ముందు నుయ్యి, వెనక గొయ్యి.

ఒడ్డు నుంచి సింహాలు వస్తుంటే దున్న నీటి అంచు నుంచి నీళ్ళలోకి
మొసలి దాపులకు వస్తుంటే దున్న నీటి అంచులకు…
ఒడ్డు నుంచి సింహాలు – నీటి నుంచి మొసలి –
దున్న నిలకడన్నది లేక పరుగులు…
ప్రాణాలకై పరుగులు, పరుగులు… అలసి… అలసి…

అధికార – ప్రతిపక్షాలు, మార్చి మార్చి
ప్రజానీకం బ్రతుకులను ఉచ్చుల బిగింపులు…
కర్మసాక్షి తన పగటి ‘షిప్టు’ కాలమంతా దున్న పోరాటమే…
కర్మసాక్షి తన పగటి ‘షిప్టు’ దిగి,
పగ్గాల్ని సంధ్యారాని చేతుల కందించాడు.
సంధ్యారాణి కాంచిన దృశ్యం కూడా
దున్న తన ప్రాణ రక్షణ పోరాటమే…
సంధ్యారాణి కాలగమన రథాన్ని నిశీధ కన్య కప్పగించింది…
నిశీకన్య గాఢాంధకార గొంగళిని కప్పుకొంది…
దున్న కళ్ళకు ఏమీ ఆనడం లేదు…
సింహాలు కాపు కాస్తున్నాయా?
దున్నకు తెలియదు…
సింహాల కళ్ళు నెలపొడుపులే…
ఒక వేళ దున్న కళ్ళు పున్నమి చంద్రులైతే?…
తమకే మోసం… దున్న బాకులు తమ డొక్కల్లోకి దిగుతవి…
ఈతలు నేర్చిన యోగము చే దిరుగక వుంటే?…
యముని గెలువవలెను సమయమెరిగి…
సింహాలు దున్న ముందర నుండి, కాస్తంత దూరం నుండి
అటూ యిటూ తిరుగాడాయి…
చడీ చప్పుళ్ళు చేయలేదు పిల్లుల్లా…
దున్న నుండి ఏమీ అలికిడ్లు వినరాలేదు…
అంటే, దున్న తమని చూడ్డం లేదన్నట్లే గదా!
దున్నకి ఏమీ కన్పించడం లేదన్నట్లే గదా!
దున్న గుడ్డిదన్నట్లే గదా!
సింహాల గుంపు దున్న శరీరం మీద పడ్డది –
గబ్బిలాలన్నీ కల్సి గండభేరుండం మీద పడ్డట్లుగా…
అరుణోదయం ఆదిగా – అమావాస్య చీకట్ల కాలం వరకూ
ప్రాణాలకై పొరాడి,
నిలకడన్నది లేక పరుగెత్తి, పరుగెత్తి, అలసి, సొలసి
రోజంతా నిలబెట్టుకున్న ప్రాణాల్ని
రాత్రి తెచ్చిన చీకటి తోడేసింది…
ఇన్నేండ్ల నీ జీవాల్ని – సింహాలు క్షణాల్లో హరించాయి…
కుమ్మరి కొక ఏడు – గుదియకు నొకనాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here