రాజకీయ వివాహం-20

0
4

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది చివరి భాగం. [/box]

అధ్యాయం- 20

[dropcap]“ధ[/dropcap]రణికోట బ్లాస్టింగ్స్‌ను సమర్ధవంతంగా అరికట్టారు రాష్ట్రీయ జనసమాజ్ నేత రాహుల్ పురుషోత్తమ రెడ్డి, తమ ఒంతుగా ఆయనకు సహకరించిన ప్రియాంక, సిబిఐ ఆఫీసర్స్ జగదీశ్వరరావు, చక్రధర్. ఈ సందర్భంగా వెలుగు చూసిన అంశాలు రాష్ట్ర భవిష్యత్తుపై గంపెడు ఆశలు పెట్టుకున్న అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.

జె.హెచ్.పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న సిద్ధార్థకు దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జోగేశ్వరరావుగారి చాపర్ క్రాష్ వెనక హస్తం ఉందనే విషయం తమదగ్గర ఉన్న ఋజువులతో సహా సిబిఐవారు పకడ్బందీగా రిపోర్ట్ తయ్యారు చేసిన పక్షంలో సుప్రీంకోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఈ సాయంత్రమే అతడిని తీహార్ సెంట్రల్ జైలుకు తరలించడం జరుగుతుంది. ఈ విషయం గతంలో హడావిడిగా తయ్యారు చేసిన జోగేశ్వరరావు గారి చాపర క్రాష్‌కు సంబంధించిన డాక్టర్ రామకృష్ణ త్యాగీ రిపోర్ట్‌ను కోర్టు కొట్టిపాడేసింది, ఇందుకుగాను రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ అలసత్వాన్ని మందలించింది.

ఈ రామకృష్ణ త్యాగీ మరెవరో కాదు గతంలో విజయనగరం కలెక్టర్‌గా చేసిన అశోక్ త్యాగీకి సొంత అన్నయ్య అవుతాడు అని సిబిఐ తెలుసుకోగలిగింది. తన పెదనాన్న సహకారంతో ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగకుండా తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండే విధంగా సిద్ధార్థ చేయ్యగలిగాడని సిబిఐ తమ కొత్త నివేదికలో రుజువులతో సహా నిరూపించింది.

అందుకు డాక్టర్ రామకృష్ణగారికి ఐదు సంవత్సరాలు కారాగార శిక్ష, నకునారెడ్డి గణేష్‌ల మరణానికి సహకరించిన భవానీ త్యాగీ మరియు జానీ అనబడే వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాలు కారాగార శిక్షవెయ్యడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా జె.హెచ్. పార్టీ నేత నకునారెడ్డి గారి మరణాన్ని ఇంకా సంబంధం ఉన్న మాజీ కేంద్రమంత్రి నాచిరెడ్డి భార్య ఆక్సిడెంట్.

రాహుల్ రెడ్డి స్నేహితుడు గణేష్ కేసులను కూడా తమదగ్గరున్న ఆధారాలతో సిద్ధార్థతో లింక్ చెయ్యగలిగారు సిబిఐ వారు. కలెక్టర్ అశోక్ త్యాగీ సంతానమైన సిద్ధార్థ, భవానీలు తమ తండ్రి మరణానికి గత ఎన్నికల సమయంలో ఇరుపార్టీల నేతలూ కారణమని భావించి ప్రతీకారంగా ఈ కాన్స్పిరసీలకు పాల్పడినట్లుగా సిబిఐ వారు తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. తన తండ్రి అశోక్ త్యాగీ మరణించే సమయానికి సిద్ధార్థ ఆల్ ఇండియా సివిల్స్‌లో టాపర్‌గా ఉత్తీర్ణుడయ్యాడు.

అయితే వ్యవస్థపై అకారణమైన ద్వేషం ఏర్పరుచుకున్న సిద్ధార్థ తన తెలివితేటలతో తను ఎవరనే విషయం బయట ప్రపంచానికి తెలీకుండా ఒక కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకుని ఎవరికీ అనుమానం రాని విధంగా ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు.

ఈ సందర్భంగా సిబిఐకి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ జగదీశ్వరరావు ఆయన అసిస్టెంట్ చక్రధర్‌లు కనబరిచిన తెలివితేటలు, శ్రమ అభినందనీయమని అభిప్రాయపడ్డారు కేంద్ర హోం మంత్రి. ఈ కేసులలో తన ఒంతు సహకారం అందించి ముంబై హోటల్ లోని వీడియోను ప్రజలకు అందేలా చేసిన సుదర్శన్‌ను కూడా ఆయన మెచ్చుకున్నారు.”

ఒక ప్రముఖ టీవీ ఛానెల్ చెప్తున్న న్యూస్‌ను ఆఖరిసారిగా ప్రచారానికి వెళ్తోన్న ప్రియాంక రెప్పార్పకుండా చూస్తోంది. ప్రతీసారిలాగ ఈసారి ఆమె ప్రత్యేకంగా ఎటువంటి స్పీచ్ తయారు చేసుకోలేదు, తన మనసులో ఏమనిపిస్తే అదే మాట్లాడదాం అని నిర్ణయించుకుంది. ఆరోజు సాయంత్రం హడావిడిగా ధరణికోటకు తాను రాహుల్‌తో కలిపి పరుగు తీయడం, అక్కడ తాను భవానీతో కలిపి ఘర్షణ పడడం, ఆ సందర్భంగా రాహుల్ వర్గం సిద్ధార్థ వర్గానికీ అక్కడ జరిగిన భీకరపోరాటం, సంభవించిన ప్రాణ నష్టం, ఆ తరువాత సిద్ధార్థ్‌ను జైలుకు తరలించడం ఇవన్నీ ఒక సినిమాలోని దృశ్యాలకు మల్లే ఆ టీవీ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు.

తాను ఇప్పటికీ సిద్ధార్థ విషయం నమ్మలేకపోతోంది. ఒకమనిషిలో బయటవారికి తెలీకుండానే ఈరకమైన కర్కశత్వం ఉంటుందన్న ఊహే ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలు ఇప్పుడు తమనుంచి ఏమి ఆశిస్తున్నారో ఆమెకు అర్థం కావడంలేదు. సిద్ధార్థ జోగేశ్వరరావు, నకునారెడ్డిల పై చేసిన వ్యాఖ్యలు తమని దెబ్బతీస్తాయేమో అని ఆమె భయపడింది.

ఈ సమయంలో ప్రజల దృష్టి ఏ విధంగా ఉండబోతోందో ఆమె అంచనా వెయ్యలేకపోయింది. ఈ దెబ్బతో సిద్ధార్థ ప్రభావం పూర్తిగా రాష్ట్రప్రజలపై పూర్తిగా తుడిచుపెట్టుకుపోయినట్లే అని ఆమెకు అనిపించింది, అయినప్పటికీ వారు తమ రాష్ట్రీయ జనసమాజ్‌ను ఏ విధంగా స్వీకరిస్తారో అని ఆమె ఆలోచిస్తోంది.

తనకు మొట్టమొదటిసారి సిద్ధార్థతో ఏషియన్ కాలేజ్‌లో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది, ఆ సమయంలో తనకి సిద్ధార్థ ఉద్దేశం తెలియకపోయినప్పటికీ ఒకరకంగా తాను రాజకీయాల్లోకి రావడానికి ఆ చర్చే మూలం అయ్యింది అని ఆమెకు అనిపించింది. ఎంతసేపు ఆలోచించినా దీనికి పరిష్కారం లేదని ఆమెకు అనిపించింది.

అయితే ఏది జరిగినా తన మంచికే అనుకోవడం వలన ఉపయోగం ఉంటుందని అనుభవం ద్వారా అర్థం అయ్యింది ఆమెకు. రాహుల్ ఈ విషయంలో తనకు పెద్దగా సహాయపడతాడు అని ఆమెకు అనిపించలేదు. తామిద్దరూ తెలుసుకున్న కఠినమైన నిజాలతో తనెంత దారుణమైన మనోవేదన అనుభవించిందో రాహుల్ కూడా అంతే ఎక్కువ అనుభవించాడు కానీ అంతకన్నా తక్కువేమీ కాదు. సిధ్ధార్థ ఇద్దరినీ ఒకే స్థాయిలో నష్టపరిచాడు.

ఇదే తన జీవితంలో ఆఖరిసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది అని ఎందుకో ఆమె అభిప్రాయపడింది. ఆ ఆఖరి సభను ఈ అల్లర్లు అన్నిటికీ వేడుకగా నిలిచిన ధరణికోట ప్రాంతం దగ్గరే జరపడానికి రాహుల్ నూతన పార్టీలో మిగిలిన వారు నిర్ణయించారు. ఇప్పుడు ఇంక చంద్రశేఖర్ గురించి జనసమాజ్ పార్టీ గురించి పట్టించుకునే నాధుడే లేదు, ఆయన కూడా పెద్దగా పట్టనట్లు ఉన్నాడు. ఒక విధంగా చూస్తే కనుక కూడా పైకి బాహాటంగా చెప్పకపోయినా రాహుల్‌ను మెచ్చుకుంటున్నట్లుగానే అనిపిస్తుంది.

రాష్ట్ర ప్రజలు అందరూ తన సమాధానం కోసమే ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం మీద చాలామంది అనుకున్నట్లుగా తానింకా రాజకీయంగా భూస్థాపితం అయిపోలేదు అన్నవిషయం ఋజువు చెయ్యాల్సిన సమయం ఆసన్నమైనది. అతి తక్కువ సమయంలో అతి చిన్న వయసులో ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలు ఎదుర్కున్న వారిలో తానూ రాహుల్ మొదటి స్థానంలో ఉంటారేమో అని ఆమెకు అనిపించింది. ఇటువంటి ఎన్నో ఆలోచనలతో ఆమె రోజు సభలో ప్రసంగించింది.

దాదాపు విశాఖపట్నం జిల్లా మొత్తం అదే ప్రదేశంలో సమావేశం అయినట్లు ఉంది. భారీ బందోబస్తు నడుమ జరుగుతున్న ఆ సభను ప్రతీ టీవీ ఛానెల్ వారూ మొత్తం కార్యక్రమాలు అన్నిటికీ స్వస్తి పలికి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొంతమంది అభిమానులు ఆ సందడి అంతా కొన్నిచోట్ల సినిమా హాళ్లలో ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయాలు రాహుల్, ప్రియాంక వాళ్లకు తెలీదు, లేదంటే ఇలాంటి ప్రయత్నాలు మానుకోమని కనీసం వాళ్లకి నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు.

రాహుల్‌తో కలిపి అందరూ తమ వంతుగా ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను, దాని వెనక ఉన్న కథను, తమ అభిప్రాయాలనూ, అనుభవాలనూ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకున్నారు.

“ఇప్పటివరకూ జరిగిన సంఘటనల గురించి చర్చించడానికి, లేదా అందులో నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి నేను ముందు రాలేదు. ఈరోజు నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి, మీరందరూ ఎంతో పెద్దమనసు చేసుకుని మీకష్టాలు తీరుస్తారు అనే ఉద్దేశంతో ఒక మంచి నాయకుడు వస్తాడు అనే ఆశతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి రావడం నిజంగా హర్షణీయం. మన హనుమంతరావుగారు అందుకు అన్ని విధాలా అర్హులే అని నాతో పాటు మా పార్టీ మొత్తం భావిస్తుంది” ఆమె మాట్లాడడం మొదలుపెట్టగానే అంతమంది ప్రజలు ఉన్నా కానీ అక్కడ సూది పడితే వినిపించే అంత నిశ్శబ్దం అలుముకుని ఉంది, మొత్తం రాష్ట్రం అంతా ఆసక్తిగా వింటోంది.

“మొదటిగా నేను సిధ్ధార్థతో నాకున్న పరిచయం గురించి చెప్పాలి. మీ అందరికీ తెలిసో లేదో కానీ నిజానికి నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యకారణం సిధ్ధార్థ” అక్కడ చిన్నగా గుసగుసలు వినపడ్డాయి.

“అవును మీరు విన్నది నిజమే నేను రాజకీయాల్లోకి రావడానికి అతనే నాకు మార్గదర్శి. కాకపోతే మొదటినుంచీ అతని గురించి తెలుసుకోలేకపోవడం అతను మన ప్రియతమ నాయకుడు జోగేశ్వరరావు గారితో కలిపి నా తండ్రిని కూడా వ్యక్తిగతమైన కారణాలతో హత్య చేస్తాడు అని గ్రహించ లేకపోవడం నిజంగా అతని గొప్పతనమో నా అమాయకత్వమో నాకు అర్థం కాదు.

అతను చాలా తెలివైనవాడు, మేధావి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను తనకు నచ్చినట్లుగా ప్రవర్తింపజేసుకునే సామర్థ్యం అతనికుంది, అయితే రావణాసురుడు ఎన్నో విషయాల్లో రాముడికన్నా చాలా గొప్పవాడు అయినా కానీ అంతిమంగా ఓటమి పాలయ్యాడు, దానికి కారణం ఏమిటని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు, నా స్వీయానుభవం ప్రకారం శక్తిమంతుల శక్తిని అంచనా వేయలేకపోవడం కూడా మన బలహీనతల్లోకి వస్తుంది.

అతను చేసినది సభ్య సమాజం హర్షించకపోయినా కానీ అతను అలా చెయ్యడం ద్వారా మనకి ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధించాడు అని నాకు అనిపిస్తోంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ప్రతీ మనిషిలోనూ తాను అనుకున్నది సాధించగలిగిన శక్తి ఉంటుంది, దాన్ని అన్వేషించి సానపెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంది.

అదే నేను రాజకీయాల్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ అనునిత్యం జపించే నినాదం పాటించే జీవన విధానం. ఆ ఆలోచనకు రూపాంతరమే నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కనస్ట్రక్టివ్ ఫోర్స్, ఇది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన టెరిటోరియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు అనుసంధానమై పనిచేస్తోంది అని చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.

ఎంతోమంది యువకులు, పెద్దలు, పదవీవిరమణ చేసిన మహానుభావులు ఈ సంస్థల్లో స్వచ్చందంగా చేరి తమ ఒంతుగా తమకు చేతనైన సహాయం ప్రభుత్వానికి చేస్తున్నారు. ఇలా చెయ్యమని వారికి ఎవరూ చెప్పలేదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

నీ ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, వాడలో, ఊరిలో, జిల్లాలో చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదులు చెయ్యడం నిన్నటిమాట. నీ ఇంట్లో చెత్తకు నీ బాధ్యత ఎంతవరకూ ఉంది, దానిని నువ్వు ఏ విధంగా ఇతరుల అవసరం లేకుండా సక్రమమైన పధ్దతిలో రీసైకిల్ చేయగలవు, ఈ విషయంలో నీ సహకారం సమాజానికి ఎంతవరకూ ఉంటుంది, ఇది నేటి మాట.

ఇక్కడ చెత్త అంటే కేవలం వ్యర్ధపదార్ధం అని మాత్రమే అర్థం కాదు. స్వామీ వివేకానందుని మాటల్లో చెప్పాలంటే మనకి అడ్డంకిగా ఉండి మనను నిరాశ నిస్పృహలకు లోను చేసే ప్రతీ ఒక్క ఆలోచన వ్యర్థం కిందే లెక్క, సాకారాత్మకమైన ఆలోచనకి ఉన్న బలం ఈప్రపంచంలో దేనికీ లేదు.ఇలాంటి వాటిని ఎదుర్కొని ముందుకు సాగడంలో ఈ ఐదేళ్ల కాలంలో మనం తొంబై శాతం కృతకృత్యులయ్యాము అని చెప్పడం అతిశయోక్తి కాదు.ఇది నేను అంటున్న మాట కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, రాజకీయ దురంధరులు, సామాజిక ఉద్యమకారులు మన రాష్ట్రం వేపు చూసి అంటున్న మాట.

మార్పు అంత త్వరగా వీలు పడదు అని గొంతు చించుకుని అరిచే ప్రతీఒక్కరికీ ఇదొక చెంపపెట్టు లాంటి సమాధానం.ఈరోజు రాహుల్ చాలా మంచివాడు, అతనికి వోట్ వెయ్యండి, హనుమంత రావు గారు చాలా మంచివారు ఆయనను ముఖ్యమంత్రిని చెయ్యండి, నాచిరెడ్డి గారిని మీ వోట్ వేసి గెలిపించండి అని మిమ్మల్ని అడగడానికి రాలేదు.

ప్రభుత్వం ఏదైనా పరిణతి చెందిన నేటి ప్రజల ఆలోచనా విధానంతో అభివృద్ధి సాధ్యం అని నాకు గట్టినమ్మకం ఉంది. ఇంతకాలం మన ప్రజల భూములతో, జీవితాలతో ఆడుకున్న అందరి ఆటలకు కాలం చెల్లింది. తన కుమారుని చేతుల్లో భూషణరావు మరణంతో వారిద్దరి కథా ముగిసింది. కనుక మా ప్రభుత్వం తరఫున నేను ప్రజలకు హామీ ఇస్తున్నది ఏంటంటే అన్ని రంగాల్లోనూ లోతైన పరిశోధన జరిగి సమగ్రమైన నివేదిక అందేవరకూ, ఈ ప్రాజెక్ట్ విషయంలో భూమిని కోల్పోయిన ఎంతోమంది నుండి సంపూర్ణంగా మద్దతు లభించే వరకూ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగదు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.

దీనికి కొత్తవారూ పాతవారు, పెద్దలూ చిన్నలూ అని తేడాలేకుండా మా రాష్ట్రీయ జనసమాజ్ పార్టీలో ప్రతీ ఒక్కరూ అంగీకారం తెలుపుతున్నారు. ఇక్కడున్న ప్రజలయొక్క బాధలను మా నాన్నగారు జీవించిఉన్న సమయంలో నేను కళ్ళారా చూసాను. వీరిని సమాధాన పరచడానికి, ఆ సమయంలో ప్రభుత్వంతో మాట్లాడలేక ఆయన ఎంత మనోవేదన అనుభవించేవారో నాకు తెలుసు, ఇటువంటి బాధలు కూడా కొంతవరకూ ఆయన మరణానికి కారణం, తన చివర రోజులలో ఆయన ఈ విషయమై ఎంతగానో కుంగిపోయారు” ఆ క్షణంలో ఆమె గొంతు కొద్దిగా గాద్గదికం అయ్యింది.

“ఈ కుట్రలూ కుతంత్రాలు, రాజకీయాలు ఇవన్నీ ఎవరికి అవసరం, అసలు ప్రజలకు సేవ చెయ్యడానికి ప్రభుత్వం ఒక్కటే మార్గం అని నాకు అనిపించడం లేదు. ప్రతీ ఒక్క పౌరునికీ ఆ హక్కూ బాధ్యతా రెండూ ఉన్నాయి. అటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టిన రోజున మనకింక ఈ రాజకీయాలతో పని ఉండదు. నిజమైన అభివృద్ది ప్రతీ ఒక్క పౌరునికీ స్వతంత్రంగా లభిస్తుంది” సుదీర్ఘంగా కొనసాగిన ఆమె ప్రసంగం విన్న ప్రజలు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తరువాత ఆ ప్రదేశం మొత్తం హర్షాతిరేకాలతో దద్దరిల్లిపోయింది.

“యువ నేత ప్రియాంక జిందాబాద్”

“రాహుల్ రెడ్డి జిందాబాద్”

“హనుమంతరావు జిందాబాద్”

“రాష్ట్రీయ జనసమాజ్ జిందాబాద్”

అన్న నినాదాలతో మారుమ్రోగిపోయింది. అందరూ ఆమెను ఎంతగానో అభిమానించారు, తాను ఎంతో కాలంగా గుండెల్లో దాచుకున్న బాధను ఆమె ఈరోజు బయటపెట్టినట్టు అయ్యింది. ప్రజల ముఖంలో ఒకరకమైన సంతృప్తి వ్యక్తమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఈ వేడుకను టీవీల్లోనూ ఇతర మాధ్యమాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చూసినవారు అందరిలోనూ ఆనందం ఉప్పొంగి ఉరకలు వేసింది.

అందరూ ఉత్సాహంగా గోల చేస్తూ గెంతులు వెయ్యడం ప్రారంభించారు. ముఖ్యంగా యువతీ యువకులను ఆ సందర్భంగా అదుపు చెయ్యడం చాలా కష్టమైపోయింది. అక్కడొక నూతన శఖం ఆవిష్కృతమైన భావన అందరిలో కలిగింది. ఇప్పటివరకూ స్తబ్దంగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా చైతన్యవంతం అయ్యింది. మొత్తమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. టీవీ చానెల్స్ వాళ్ళు ఆమె ఇచ్చిన ఉపన్యాసంలోని కొన్ని కొన్ని కొటేషన్లను ముఖ్యాంశాలుగా ప్రసారం చేస్తున్నారు, దీని ద్వారా ఆమెకు మరింత ప్రాచుర్యం పెరిగింది అని చెప్పవచ్చు. ఆమె అందరికన్నా ఆఖరిగా మాట్లాడడంతో ఆనాటి సభ అక్కడితో ముగిసింది. రాహుల్, హనుమంతరావు గారు వీరి అందరికన్నా ఆమె మాట్లాడినడానికి ఎక్కువ స్పందన రావడంతో పిన్నలూ, పెద్దలూ అని తేడాలేకుండా అందరూ ఆమెను అభినందించారు. రాహుల్ పెద్దగా స్పందించలేదు కానీ అతని కళ్ళను బట్టి అతని భావాలను అర్థం చేసుకోవచ్చు.

“చాలా రోజులనుంచి మనసులో దాచుకున్న దావానలం లాగ ఉంది నీ ప్రసంగం” తన దగ్గరకు వచ్చి ఆమెను అభినందిస్తూ అన్నాడు. ఆమె కృతజ్ఞతా పూర్వకంగా నవ్వింది

“అస్సలు నువ్వు ఇంత బాగా మాట్లాడగలవని నేను ఎప్పుడూ అనుకోలేదు. దీనికి నీకు ఎక్కడ నుంచి ప్రేరణ లభించింది” తాము అక్కడ నుండి గెస్ట్ హౌస్‌కి వెళ్తున్న దారిలో ఆమెతో అన్నాడు నాచిరెడ్డి.

వారు ఆనాటికి అక్కడే విశ్రమించి రేపు ఉదయాన ఫ్లైట్‌కి హైదరాబాద్ వెళ్తారు. రాహుల్ కూడా తమతోపాటు అదే కారులో ఉన్నాడు. హనుమంతరావు గారు ఏదో అవసరం ఉండి ఆ రోజుకే హైదరాబాద్ చేరుకున్నారు.ఇంకొక మూడు రోజులలో జరగబోయే ఎన్నికల్లో నేటి సభతో దాదాపుగా రాష్ట్రీయ జనసమాజ్ పార్టీ వారి విజయం ఖాయం అని అన్ని టీవీ ఛానెల్ వాళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా వారు ఘంటాపదించారు.

“మనమున్న పరిస్థితులే నాకు ఇన్స్పిరేషన్ సర్. అసలు నిజానికి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు ఒకపక్కన బాధగానే ఉంది” డ్రైవర్‌ను పంపించేసి కార్ రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రియాంక అతని పక్కన కూర్చుని ఉంది,వెనకసీట్లో నాచిరెడ్డి ఉన్నాడు.

“బాధా ఎందుకు” అర్థం కానట్లుగా అడిగాడు నాచిరెడ్డి

“ఒక్క సిద్ధార్థ గురించి మాత్రమే కాదు, నేను చెప్పిన చాలా విషయాలు జగద్విదితాలే అయినా తిరిగి వారు నానోటి నుండి వినాలి అనుకుంటున్నారు అంటే దానికి బాధగా ఉండదా. నిజాన్నిఎవరూ మభ్యపెట్టలేరు అని తెలిసిన జనానికి తమ మీద కన్నా అవతలి వ్యక్తి చెప్పేదాని మీద నమ్మకం ఉండడం బాధాకరమైన విషయం కాదంటారా” చెప్పింది ప్రియాంక. మిర్రర్‌లో నుండి ఆమె వంక చూసి చిన్నగా భుజాలెగరేసాడు నాచిరెడ్డి.

“ఏమైనా కానీ నువ్వు ఈరోజు చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచావు” మళ్ళీ ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాడు నాచిరెడ్డి. రాహుల్ ఇదేమి పట్టనట్లుగా డ్రైవింగ్ మీద దృష్టిపెట్టాడు.

***

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రీయ జనసమాజ్ పార్టీ ఒక ప్రభంజనం మాదిరి వోటర్ల మనసులను కొల్లగొట్టి, వారి నమ్మకాన్ని చూరుగొని మిగిలిన అన్నీ పార్టీలనూ పక్కకి నెట్టి ప్రథమ స్థానంలో నిలిచి జయకేతనాన్ని ఎగరవేసింది. ఈ సునామీలో జనసమాజ్ పార్టీతో కలిపి అన్ని చిన్నా చితకా పార్టీలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి.

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎనభై శాతం వోటింగ్ జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే జె.హెచ్. పార్టీలో మాత్రం ఆరుగురు అభ్యర్ధులు గెలిచారు, వారిలో ప్రియాంక ఉన్న సమయంలో చేరిన కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు. వారి ఈ విజయానికి కారణం ప్రసాద్ గారి చలవ అని ఆయన పైన ప్రజలకున్న నమ్మకం అని ప్రియాంక గ్రహించింది.ఎన్నికల తరువాత ప్రసాద్ గారిని వ్యక్తిగతంగా కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించింది.

మొదటి నుంచీ నకునారెడ్డికి విధేయుడైన ప్రసాద్ ఆమె మాటను కాదనలేకపోయాడు, తన ఎమ్మెల్యేలతో కలిసి ఆర్జేఎస్‌పీలో చేరిపోయాడు, దీనిని ప్రజలు అర్థం చేసుకోగలిగారు. రాష్ట్రీయ జన సమాజ్ పార్టీకి ప్రియాంక, రాహుల్ పార్టీ అని ముద్దుగా ప్రజలు పేరు పెట్టుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో వారు నిలబెట్టిన ప్రతీ ఒక్క అభ్యర్దినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు ప్రజలు.

ఎన్టీఆర్ గారి తరువాత మళ్ళీ ఈ స్థాయిలో సంపూర్ణంగా ప్రజల మద్దతు సాధించుకోగలిగినది, ఏకీకృత అభిప్రాయానికి ప్రజలను తీసుకురాగలిగినది కేవలం రాష్ట్రీయజనసమాజ్ పార్టీ మాత్రమే అని పత్రికలు అన్నీ వేనోళ్ళా పోగిడాయి. తమ పార్టీకి కనీసం ఒక్క సీట్ కూడా రాకపోవడం జనసమాజ్ పార్టీకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు, కేంద్రం మొత్తం అయోమయంలో ఉన్నది.

“ఇది పార్టీ విజయమో, ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తి విజయమో కాదు, ప్రజలందరూ కావాలి అని కోరుకున్న విజయం, దీన్ని ఏ ఒక్కరికో ఆపాదించడం సబబు కాదు. ఈ విజయంతో మా పార్టీపైన బాధ్యత మరింత పెరిగింది అని నేను భావిస్తున్నాను. మాపైన ఎంతో నమ్మకం పెట్టి మమ్మల్ని ఇంత ఘనంగా గెలిపించిన ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుంది. మేము ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చడానికి మా పార్టీ సాయశక్తులా కృషి చేస్తుంది” ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా ప్రతినిధులను, ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడాడు రాహుల్.

ఒక్కసారిగా ఆ ప్రదేశం హర్షధ్వానాలతో నిండిపోయింది. అదే వేదిక మీద ఉన్న హనుమంతరావు కూడా మాట్లాడాడు

“మా పిల్లగాడు రాహుల్ చెప్పినట్లుగా మా ప్రభుత్వం ఎప్పుడూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. మీకు ఎటువంటి సమస్య వచ్చిన ఏ క్షణంలో అయినా నాకు అంటే నా ఒక్కడికే కాదు మా పార్టీలో ఎవరికైనా కానీ తెలపండి, మీ సమస్య ఎంత కష్టమైనదైనా మరి శక్తి వంచన లేకుండా పరిష్కారం చూపిస్తాం అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ భూమి అనే మా పార్టీ ఎజెండాకి మేము కట్టుబడి ఉన్నాము, తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవ తీసుకుంటున్నాను. ఇంక మన పిల్లకాయి ప్రియాంక మాట్లాడుతుంది” అని ఆమె వైపు చూసాడు హనుమంతరావు. అదే వేదిక మీద నాచిరెడ్డి కూడా కూర్చుని ఉన్నాడు.

“నేను చెప్పదలచుకున్నది అంతా ఎన్నికల ముందే మా మేనిఫెస్టోతోనే చెప్పేసాను అని నా అభిప్రాయం. నాతో పాటుగా మా పార్టీలో ఎంతో మంది పెద్దలు చెప్పిన విషయాలను, గత ఐదు సంవత్సరాలుగా చేసిన పనులపై నమ్మకం, గౌరవం ఉంచి మమ్మల్ని అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము.

ఇంక మాటల సమయం అయిపోయింది ఇప్పుడు చేతలు ప్రారంభించాల్సిన సమయం అసన్నమైనది, మీ అందరి సహాయ సహకారాలతో అన్ని రంగాలలోనూ అభివృద్ది చెందిన ప్రాంతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం అని నాకు గట్టి నమ్మకం ఉంది” ఆమె లైవ్‌లో చెప్తున్న మాటలను కొంతమంది యువతీ యువకులు ఫేస్బుక్ లో ‘ప్రియాంక సేస్’ అనే హాష్ టాగ్‌తో కొటేషన్ల లాగ పెడుతున్నారు.

ఇంతలో ఒక టీవీ ఛానల్ యాంకర్ ఆమెను అడిగింది “మేడం, ఇప్పటికి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు అని ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి మేమందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాహుల్ ప్రియాంకల వివాహం ఎప్పుడు మేడం” ఆమె ధైర్యంగా ఆ ప్రశ్న అడగడంతో అక్కడంతా ఒక్కసారిగా సందడి మొదలయ్యింది, అందరూ అరుపులూ గోలలతో ఉత్సాహంగా ఉన్నారు.

వారిద్దరి వివాహం నిశ్చయం అవ్వడం అయితే మీడియా వారి ముందర చెప్పారు కానీ, ఎప్పుడు జరుగుతుందని ఇప్పటివరకూ వాళ్ళిద్దరిలో ఎవరూ బయటపడలేదు. అంతమందిలో ఒక్కసారిగా తనని ప్రశ్నించే సరికి ప్రియాంకకు అప్రయత్నంగా సిగ్గు ముంచుకు వచ్చింది, అయితే ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడింది. అక్కడున్న వాళ్ళందరూ

‘మ్యారేజ్ డేట్ చెప్పాలి’ ‘మ్యారేజ్ డేట్ చెప్పాలి’

అంటూ గొడవ గొడవ చేస్తున్నారు, కొంత సేపు వేదిక మీద ఉన్నవారు కూడా ఈ హంగామానూ, ఉత్సాహాన్ని ఆస్వాదించారు.

తరువాత హనుమంతరావు రాహుల్ ని పక్కకి పిలిచి “అబ్బయ్యా, ఇక ఈ పోరగాళ్ళు ఊరుకునే మల్లే లేరు కానీ, అమ్మి ఎలాగో ఆడపిల్ల కదా సేప్పలేదు. ఆ డేటో గీటో ఏందో ఒకటి నువ్వే సెప్పేయ్ అబ్బయ్యా. ఆళ్ళతో పాటు మీ పెళ్లి ఎప్పుడో తెల్సుకోవాలని నాకు కూడా మాంచి హుషారుగా ఉంది” రహస్యంగా అన్నాడు.

ఇంక ఎక్కువ సేపు వారితో వాదించడం ఇష్టం లేక “మీ అందరూ కోరుకుంటున్నట్లుగా, అంటే మీతోపాటు మేము కూడా కోరుకుంటున్నాం అనుకోండి అది వేరే విషయం..” చెప్పాడు రాహుల్. చిన్నగా నవ్వులు వినిపించాయి.

“మా వివాహం వచ్చే నెలలో జరుగుతుంది, దానికి మీతోపాటుగా రాష్ట్రంలోని ప్రజలందరూ ఆహ్వానితులే. త్వరలోనే వేదిక ఫిక్స్ చేసి ఆ వివరాలతో మీ ముందుంటాం, భోజనాలకి మాత్రం రావడం మర్చిపోకండి” అందరూ ఘోల్లుమని నవ్వారు.

రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో పదవులు నిర్వహించబోయే ఒక నూతన జంట, కొత్త రాజకీయ శకంతో మొత్తం రాష్ట్రం అంతా చాలా ఆహ్లాదంగా నూతనత్వాన్ని సంతరించుకుని ఉంది. తరువాత నాచిరెడ్డి కూడా కొంతసేపు మాట్లాడాడు, మొట్టమొదటిసారి తన బావ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తేజా కూడా అత్యధిక మెజారిటీతో గెలిచాడు.

అతను కూడా పార్టీలో ఉన్న తక్కువ కాలమే అయినా ఎంతో నిజాయితీతో కష్టపడ్డాడు, తన శ్రమకు తగిన ఫలితాన్ని అందించిన ప్రజలకు మనస్పూర్తిగా ప్రణామం తెలియజేసుకున్నాడు. అందరూ ఒక ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లుగా ఉంది అక్కడ వాతావరణం. మరొక వారం రోజులలో ప్రమాణ స్వీకారం పనులు అన్నీ పూర్తయిపోయాయి.

రాహుల్ తన పోర్ట్ఫోలియో ఐన హోం మంత్రిత్వశాఖను తిరిగి ఎంచుకుని, దానికి తోడుగా పరిశ్రమల విభాగాన్ని కూడా చేర్చుకున్నాడు. అందరూ అనుకున్నట్లుగానే హనుమంతరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. నాచిరెడ్డికి నీటిపారుదల శాఖ అందించబడింది. ప్రియాంకకు ఐటీ,మానవవనరుల శాఖతో పాటు కొత్తగా స్థాపించబడిన టెరిటోరియల్ డెవలప్మెంట్ శాఖ కూడా అందించడం జరిగింది.

గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సమయంలో రాహుల్ ఆయనకు అడ్డుపడి ఆయనను అభ్యర్దిస్తున్నట్లుగా “ఇలా అడ్డుపడుతున్నందుకు క్షమించండి సార్, తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయమన్నా చేస్తున్న ఈ ప్రతిజ్ఞ అన్నా నాకెంతో గౌరవం ఉంది. కానీ మనం ఇప్పటివరకూ దీన్ని మనసావాచా కర్మణా పాటిస్తున్నట్లుగా నాకు అనిపించడం లేదు, అందుకే నేను ఈరోజు ఎంతో పురాతనమైన ఈ శాసనాన్ని గౌరవంతో పక్కన పెట్టి, మన ప్రజలకు మనస్పూర్తిగా ప్రమాణం చెయ్యడానికి తమరి అనుమతి కోరుతున్నాను” అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించి ఉంది. రాహుల్ విజ్ఞప్తికి అంగీకారసూచకంగా తలూపారు గవర్నర్ గారు.

“రాహుల్ పురుషోత్తమ రెడ్డి అనే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీని వీడక, మనస్సాక్షికి లోనై, కార్యోన్ముఖుడినై యుండి సర్వకాల సర్వావస్తల నందూ ప్రజలకు సహాయపడతానని, ప్రజల మంచి కొరకు నా నిర్ణయానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తానని ఎటువంటి ఆపద ఎదురైనా నాకన్నా ముందర ప్రజల గురించి ఆలోచిస్తానని, ఈ రాష్ట్రానికి మంత్రిగా నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. మన దేశ రాజ్యాంగాల పైన, చట్టాల పైన అమితమైన గౌరవం, విశ్వాసం, విధేయత కలిగి ఉండి, వాటిని అనుసరించి శరణార్థులకు తగిన రీతిలో న్యాయం చేస్తానని ఆత్మసాక్షిగా, ప్రజలందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” రాహుల్ తన ప్రతిజ్ఞ ముగించగానే ప్రజలందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేసారు.

ఆ నాటి సాయంత్రం ఒక టీవీ ఛానెల్ వాళ్ళు రాష్ట్రప్రజల సంబరానికి తమ ఛానల్ వేదికగా ఉండేలాగా చర్యలు తీసుకుని, ముఖ్య అతిధులుగా రాహుల్, ప్రియాంకలను కూడా ఆహ్వానించారు. హనుమంతరావు గారిని ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రజల ఆనందాన్ని నిరుత్సాహపరచడం ఇష్టంలేక రాహుల్, ప్రియాంకలు ఆ వేడుకకు జంటగా హాజరయ్యారు.

అందరి ముఖాల్లో కొత్తజంటను చూసిన ఆనందం తొంగిచూస్తోంది. ప్రియాంకకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అయినా ఆమె బయటపడలేదు. ఆ సందడిలో అక్కడ భారీ ఎత్తున మందు గుండు సామాగ్రి పేల్చారు. ఆ పార్టీకి నాచిరెడ్డి తేజా కూడా వచ్చారు. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా తమ వివాహం విషయం చర్చలోకి వచ్చింది, అయితే ఈసారి ఎక్కువ సమయం నిలవలేదు.

వారు ఇద్దరూ ఏమైనా అనుకుంటారేమో అని ఎవరూ కూడా వారిని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఇంక ఎక్కువ సమయం వృధా చేసి లాభం లేదని గ్రహించిన రాహుల్ మరుసటి రోజు ప్రియాంకతో చర్చించి ఆమె అనుమతితో తమ వివాహం ఘడియలను ఖరారు చేసాడు. ఎప్పుడెప్పుడా అని మొత్తం ప్రజలందరూ ఎంతో ఆత్రుత ఎదురు చూస్తున్న ఆ శుభముహూర్తం రానే వచ్చింది.

ప్రియాంక కోరిక మీదట వివాహం అంతా శాస్త్రోక్తంగా పెద్దగా హడావిడి లేకుండా తమ కుటుంబాలు సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగింది. ఆ తరువాత రిసెప్షన్ మాత్రం ప్రపంచంలోనే ఎక్కడా జరగనంత గ్రాండ్‌గా జరిగింది. దేశంలో ఉన్న అన్ని సినిమా రంగాల నుండి ప్రముఖ తారలు, పారిశ్రామికవేత్తలూ, ఇతర రాష్ట్రాల నాయకులూ, లెక్కలేనంతమంది అభిమానులు హాజరయిన ఆ వేడుక చాలా అట్టహాసంగా జరిగింది.

అక్కడకు సుదర్శన్, చక్రధర్, జగదీశ్వరరావు వీళ్ళతో పాటుగా ప్రముఖ రచయిత ఆదిత్య నారాయణ కూడా హాజరయ్యాడు. ముఖ్యంగా వీరందరినీ రాహుల్, ప్రియాంకలు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. యథావిధిగా అక్కడ మీడియా ప్రతినిధుల హల్చల్ మొదలయ్యింది. కనిపించిన ప్రతీ ఒక్క ప్రముఖుడినీ పేరుపేరునా పలకరించి ఈ వేడుక గురించి వారి స్పందన తెలియజేస్తూ నూతన వదూవరులకు శుభాకాంక్షలు అందజేయ్యాలని కోరుతున్నారు.

హైదరాబాద్ నోవోటెల్ హోటల్‌లో జరుగుతున్న ఆ వేడుక అన్ని ప్రముఖ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది, ఈ వేడుకకు కూడా ఎన్నికలకు వచ్చినంత స్పందన రావడం వారు ఊహించలేకపోయారు. హనుమంతరావుగారు వయసులో కొంచెం పెద్దవారు అవ్వడం వలన అందరికన్నా ముందుగా వచ్చి వారిద్దరినీ ఆశీర్వదించి

 “పిల్లకాయలూ నూరేళ్ళు సల్లగా ఉండండి. మన ప్రజలకు ఆ మల్లేనే సేవ చెయ్యాలి మరి. ఉంటా” ఎంత హడావిడిగా వచ్చారో అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

“చాలా విషయాల్లో మీ అభిప్రాయాలు మార్చుకున్నట్లు ఉన్నారు” రిసెప్షన్ దగ్గర తమతో ఫోటో దిగుతున్న సమయంలో ఆదిత్య నారాయణను అడిగింది ప్రియాంక.

“అభిప్రాయలు ఏమున్నాయి మేడం, నిమిషానికి ఒకటి ఏర్పరుచుకోవచ్చు, కానీ వాటిని ఎంత కాలం కాపాడుకుంటాం అన్నదానిమీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది” చెప్పాడు ఆదిత్య నారాయణ

“హహ, ఒకే సార్, ఈ వేడుకకి వచ్చినందుకు మా ఇద్దరి తరఫునా ధన్యవాదాలు. ఇదైపోగానే ఎక్కడికీ వెళ్ళిపోకండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం” ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించింది ప్రియాంక, ఆమె అభ్యర్ధనను కాదనలేక ఆయన సరే అన్నాడు ఆయన.

కానీ రాహుల్ ఇదేమీ పట్టనట్లుగా ఉన్నాడు, మొదటినుంచీ అతనికి ఆదిత్యనారాయణ అన్నా, ఆయన రాసే సాహిత్యం అన్నా పెద్దగా మంచి అభిప్రాయం లేదు, అది ప్రజలను నిర్వీర్యం చేసే విధంగా ఉంటుంది అని అతని భావం. ఒక్కక్కరుగా అతిధులందరూ ఆ వేడుక నుండి సెలవు తీసుకుంటున్నారు.

అదంతా పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు అయ్యింది. రాహుల్, ప్రియాంకల కోరిక మీదట వారితో పాటుగా కొంతమంది మిత్రులకు హోటల్ వారు ప్రత్యేకంగా ఒక విశాలమైన హాల్‌లో డిన్నర్ ఏర్పాటు చేసారు, అక్కడకి వారిద్దరికీ అత్యంత సన్నిహితులు అయిన వారిని మాత్రమే ఆహ్వానించారు.

వారిలో బ్యాక్ ఎండ్ మీడియా యజమాని సుదర్శన్, ఇరిగేషన్ మంత్రి నాచిరెడ్డి అతని బావమరిది తమ పార్టీలో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తేజా, ప్రసాద్ గారు, తమ ఇద్దరి తండ్రుల గురించిన వివరాలు వెలుగులోకి తీసుకువచ్చేలా చేసిన సిబిఐ ఆఫీసర్స్ జగదీశ్వరరావు చక్రధర్, తనను ఎంతగానో అభిమానించే తన ఆత్మీయ స్నేహితురాలు శ్వేత మరియు ఆదిత్య నారాయణ వీళ్ళందరూ ఉన్నారు.

వాళ్ళందరూ ఒక విశాలమైన రౌండ్ టేబుల్‌పై ఆసీనులై ఉన్నారు. ప్రియాంక రాహుల్ ఒక వైపుగా కూర్చుని ఉన్నారు. సుదర్శన్, నాచిరెడ్డి, తేజా ఇంకా శ్వేతా ఒక వైపు కూర్చోగా, మరొక వైపు ప్రసాద్ గారు, ఆదిత్య నారాయణ, చక్రధర్, జగదీశ్వరరావు, మరొక వైపు కూర్చున్నారు. యూనిఫారాలలో ఉన్న నలుగురు వెయిటర్లు వినయంగా వారికి కావలసినవి అన్నీ అందేలా చూస్తున్నారు, దూరంగా ఒక మేనేజర్ వెళ్ళని పర్యవేక్షిస్తున్నాడు, బయట సెక్యూరిటీ కూడా భారీగానే ఉంది.

“వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ జీవితంలో కూడా భాగస్వాములు కావడం చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ విషయంలో మీరిద్దరూ చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. టూ ది న్యూలీ మేరీడ్ కపుల్” అని తన చేతిలో ఉన్న గ్లాస్ పైకి ఎట్టి చెప్పాడు సుదర్శన్. దానికి అంగీకారసూచకంగా అందరూ తమతమ దగ్గర ఉన్న గ్లాసులు ఎత్తి ‘హియర్ హియర్’ అని అన్నారు.

“అబ్బా మీరు ఊరుకోండి సుదర్శన్ గారు, మేమే కాదు ప్రపంచంలో చాలామంది వృత్తితో పాటు వృత్తి ద్వారానే ఏకయ్యేవారు కూడా ఉన్నారు కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, ఐ మీన్ మెడికల్ డాక్టర్స్ నాట్ పీహెచ్‌డీ” అని ఆదిత్య నారాయణ వైపు చూసింది. ఆయనలో ఎటువంటి స్పందనా లేదు, ఆయన అవివాహితుడు.

“అయినా పీహెచ్‌డీ డాక్టర్స్‌కి పెళ్లి చేసుకునే అవకాశం లేదే బాబూ. ఎందుకంటే ఆడవారికైనా మొగవారికైనా ఆ పీహెచ్‌డీ పూర్తయ్యే లోపే ఏజ్ దాటిపోతుంది, లేదా వివాహం మీద ఆసక్తి చచ్చిపోతుంది” శ్వేత అన్న మాటలకు అందరూ ఒక్కసారిగా ఘోల్లుమని నవ్వారు. ప్రియాంక ఆదిత్య నారాయణ వంక చూసింది, ఆయన ఏమైనా దెబ్బతిని ఉంటాడేమో అని కానీ ఆయనలో అలాంటి ఛాయలేమీ కనిపించలేదు.

ఎవరికీ తెలీదు కానీ ఆయనను ఇక్కడికి పిలిపించడానికి ప్రియాంకకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ధరణికోట ఏరియాలో మాత్రమే కాకుండా అక్కడకి దగ్గరలోని నాయుడుపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణకు వారి నిర్ణయాలను ప్రభావితం చెయ్యడానికి ఆయనెంతో ఉపయోగపడతాడు. ఆయనను ఒక్కడినీ దూరంగా ఉంచడం వలన లాభం లేదని ఆలోచించిన ప్రియాంక ఆయనను తమతో చేరడానికి ఆహ్వానించింది. అయితే రాహుల్ మాత్రం ఆ విషయంలో ఆమెకు ఔనని కాదని ఎటువంటి సమాధానం చెప్పలేదు, ప్రస్తుతానికి తొందరపడాల్సిన అవసరం లేదని రాహుల్ అభిప్రాయం.

“మీ లవ్ స్టొరీ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉంది సార్. మా అందరికీ మీరు ప్రొఫెషనల్ గానే తెలుసుకానీ వ్యక్తిగతంగా మీతో మాట్లాడడం ఇదే మొదటిసారి కదా, అందుకనే దానిగురించి మాకు కొంచెం వివరిస్తారా” అడిగాడు చక్రధర్.

రాహుల్ ఏదో చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగానే శ్వేత మధ్యలో కలిపించుకుని “నేను చెప్తాను, నేను చెప్తాను” అని గట్టిగా గోల చేసింది, అందరూ ఆసక్తిగా ఆ సందడిని గమనిస్తున్నారు. రాహుల్ నిస్సహాయంగా ప్రియాంక వైపు చూసాడు, ఆమె కూడా శ్వేతను నియంత్రించడం తన వల్ల కాదు అన్నట్లుగా ముఖం పెట్టింది. ఇంక శ్వేతను వారించి ప్రయోజనం లేదని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆమె ఏమి చెప్తుందా అని అందరితోపాటుగా ఎదురు చూస్తున్నాడు

 “అస్సలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి, గట్టిపడడానికి కూడా ముఖ్యకారణం నేనే”

“అవునా ఎలా ఎలా. ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగుందే చెప్పండి” చక్రధర్ తమ ఈడువాడే అవ్వడంతో కుతూహలంగా శ్వేతను అడిగాడు. అటువంటి ప్రోత్సాహం కోసమే ఎదురు చూస్తున్న శ్వేత ఇంక ఆగకుండా మాట్లాడుతోంది.

 “ఒకసారి మేము ముగ్గురం కలిపి ఇనార్బిట్ మాల్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, దారిలో మేడంగారి కార్ పంక్చర్ అయ్యింది. అప్పుడు హీరోగారు బైక్ మీద ఆపద్బాంధవుడి లాగ ఎంట్రీ ఇచ్చారు. అబ్బ అస్సలు ఆ లుక్స్, ఆ బైక్ దిగే స్టైల్ చూడాలి, కేవలం ఈ చిన్నవాటిలికే హోల్ స్టేట్ మొత్తం ఫ్లాట్ అయిపోతుందంటే నమ్మండి. మరి నేనెందుకు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటాను” మధ్యలో వారి స్పందన కోసం కొంచెం వేచిచూసింది

“మరి మీరేమి చేసారు” అడిగాడు చక్రధర్

“ఏముంది కొంచెం సేపు డిస్కషన్స్ తరువాత ముగ్గురం కలిపి ఒకే బైక్ మీద వెళ్ళాము. ఆ అంత సమయంలో రాహుల్ మాట్లాడుతుంటే ప్రియాంక కళ్ళలో జెలసీ నేను కనిపెట్టగలిగాను, కాకపోతే తెలీనట్లుగా నటించాను అంతే. వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలీకుండానే ఒకరిపై ఒకరు ప్రేమతో ఉన్నారనే విషయం నాకు అర్థం అయ్యింది.

అప్పుడు వెదర్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది, అంతే బైక్ పోనివ్వగానే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఒక్కసారి రాహుల్‌ని వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాను” ప్రియాంక వైపు చూస్తూ ఆమెను టీజ్ చేస్తున్నట్లుగా అంది శ్వేత.

“ఇంక ఆపుతావా నీ సోది, పాపం పెద్దవాళ్ళు అంతా నీ గోల భరించలేకపోతున్నారు” ఆమెను మందలిస్తున్నట్లుగా అన్నది ప్రియాంక.

“ఆ ఎందుకాపాలమ్మా అయినా పెద్దవాళ్ళు అందరికీ ఈ విషయాలు తెలీవా ఏంటి? అందులోనూ నేను చెప్పినదాంట్లో ఏమైనా అబద్ధం ఉందా, నేను రాహుల్‌ని కౌగిలించుకోగానే నువ్వు నన్ను గట్టిగా తలమీద మొట్టలేదు. అప్పుడు బొప్పి కూడా కట్టింది, కానీ ప్రేమలో ఇవన్నీ మామూలే అని సరిపెట్టుకున్నాను” ఆమె తల రాసుకుంటూ చెప్పిన తీరును బట్టి అందరూ పగలబడి నవ్వారు.

ఆ సమయంలో తాను ప్రియాంకను ఇనార్బిట్ మాల్‌లో కలుసుకోవడం కూడా గుర్తు చేసుకుని చిన్నగా తనలో తాను నవ్వుకున్నాడు నాచిరెడ్డి. కాసేపు అక్కడున్న వారందరూ తమ తమ వృత్తినీ, వ్యాపార జీవితాన్ని పక్కన పెట్టి వసుధైక కుటుంబం లాగ కలిసిపోయి ఆ సమయాన్ని ఆనందిస్తున్నారు. కొంతసమయం తరువాత సుదర్శన్ అడిగాడు.

“నాదొక చిన్న సందేహం ఉంది రాహుల్ గారు. చాలా కాలం నుంచీ అడుగుదాం అనుకుంటున్నాను ఇన్ఫాక్ట్ మీ మ్యారేజ్ అనౌన్స్ చేసినప్పుడే నాకు అనిపించింది కాని ఆ సమయంలో మీ పొలిటికల్ కెరీర్‌ని ఎఫెక్ట్ చేస్తునది నేను అడగలేదు. మీరు ఏమీ అనుకోకూడదు” తాను చెప్పదలచుకున్న డానికి ఉపోద్ఘాతంగా అన్నాడు

“నో ప్రాబ్లెం చెప్పండి, మనం ఎంత ఓపెన్‌గా ఉంటే అంత మంచిది అందులోనూ సిద్ధార్థకి శిక్ష పడడానికి మీరు చేసిన సహాయం మరువలేనిది. అటువంటి నయవంచకుడిని పట్టించినందుకు నేను మీరు ఏమడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు” రాహుల్ అన్నాడు. ప్రియాంక తమతో కలిసిన తరువాత చాలా సార్లు అనేక విషయాల్లో రాహుల్ సుదర్శన్‌తో కలవడం అతని సహాయం తీసుకోవడం జరిగింది. అందుకే వారిమధ్య సత్సంబంధాలు ఉన్నాయి కూడా

“నా అంచనా ప్రకారం అప్పటి జె.హెచ్. పార్టీ నేత అయిన ప్రియాంక పై సిబిఐ ప్రెజర్స్ ఎక్కువైపోవడం, ఒక పక్కనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో అనూహ్యంగా మీ వివాహం తెరపైకి రావడం రాష్ట్రం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది,అంటే మీది వివాహామా? రాజకీయమా?” సూటిగా అడిగాడు సుదర్శన్.

“రెండూ కాదు దానికొక కొత్త మాట ఉంది. పరస్పర వైరుధ్య భావాలు కలిగిన రెండు శక్తులు ఒకే లక్ష్యం కోసం, అదే ప్రజలందరి మేలు కోరి, వ్యతిరేకతను దూరం చెయ్యడానికి ఎకమవ్వడం అన్నది చాలా ఉన్నతమైన చర్య. ఇదే నేను వీళ్ళ వివాహం విషయంలో గమనించిన గొప్ప అంశం. మీకు కావాలంటే నేనే ఆ మాట చెప్తాను వినండి ఇది ‘రాజకీయ వివాహం’”

మొట్టమొదటిసారిగాతన గొంతు విప్పాడు ఆదిత్య నారాయణ. అందరూ ఆయన చెప్పినది నిశ్శబ్దంగా విన్నారు, సుదర్శన్ తను అడిగినదానికి సమాధానం లభించినట్లుగా భావించాడు. అక్కడితో వారి సమావేశం కూడా ముగింపునకు చేరుకుంది. అందరి ముఖాల్లో ఒకరకమైన సంతృప్తి కనిపించింది, ఎవరి ప్రదేశాలకు చేరుకోవడం ప్రారంభించారు. ఆరోజు రాత్రి కొత్తజంటకు అదే హోటల్‌లో సూట్ రూమ్ ఏర్పాటు చెయ్యబడింది. ఒక్కక్కరిగా మిత్రులందరినీ సాగనంపి ఆఖరిగా ఆదిత్య నారాయణతో కరచాలనం చేసాడు రాహుల్, ప్రియాంక కూడా అతనితోనే ఉంది.

“మా అభ్యర్ధన మీదట మీరు ఇక్కడికి వచ్చినందుకు మా ఇద్దరి తరఫునా నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్. మీలాంటి మేధావులు ప్రజా జీవనం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం కలిగినవారితో ఇంతకాలం కలవలేకపోయినందుకు నేను చాలా చింతిస్తున్నాను” నిజాయితీగా ఆయనతో అన్నాడు రాహుల్. అతనికి ఆదిత్య నారాయణ నచ్చడం ప్రియాంకకి చాలా ఆనందం కలిగించింది, తాను అనుకున్న విధంగా జరుగుతున్నందుకు ఆమె ఎంతో సంతోషించింది.

“డోంట్ వర్రీ యంగ్ బాయ్, యు కం ఫ్రం ఏ జెనరేషన్ వేర్ యు డోంట్ హావ్ టూ రిగ్రెట్ అబౌట్ ఎనీథింగ్. భవిష్యత్తు అంతా మీదే, హనుమంతరావుగారు, ప్రసాద్ గారు, నాచిరెడ్డి గారు ఇలాంటి పెద్దలందరి సహకారంతో మీరు మన రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తమ కాళ్ళమీద తాము నిలబడే శక్తిని అందించగలుగుతారు అని నేను ధృడంగా నమ్ముతున్నాను. ఏ సమయంలోనైనా నా నుండి ఎటువంటి సహాయం కావాలన్నా వెనుకాడకండి అని నా మనవి” తను కూడా వారిని ప్రోత్సాహిస్తున్నట్లుగా చెప్పాడు ఆదిత్య నారాయణ. మరి కొంత సమయం తరువాత ఆయన కూడా అక్కడ నుంచి నిష్క్రమించాడు. ఆ మరుసటి రోజు రాహుల్ ప్రియాంకలు ఒక అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు అటెండ్ అవ్వడానికి యూరోప్ పయనమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది.

ఉపసంహారం

దుర్భేధ్యమైన తీహార్ జైలు చాలా నిశ్శబ్దంగా ఉంది, దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఆ ప్రదేశంలో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే అంత రీతిలో రాక్షసవలయం ఏర్పరచబడి ఉంది. దేశంలో హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన వాళ్ళందరూ, తీవ్రవాదులూ, కరుడుగట్టిన హంతకులకు, రాజకీయపరమైన నేరాలకు పాల్పడినవారు, మనీ ఏమ్బెజెల్మెంట్ తదితర విషయాల్లో నేరస్తులకు అక్కడే శిక్ష విధించి వారిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే సహజంగాగానే అటువంటి ప్రవృత్తి నరనరాల్లో ఇంకిపోయిన నేరస్తులకు ఆ నాలుగుగోడలు మరింత నిర్వీర్యం చేసి తమలోని రాక్షసత్వాన్ని ప్రజ్వలింపజేస్తాయి. రోజురోజుకీ పెరుగుతున్న నేరప్రవృత్తితో అక్కడకి చేరేవారి సంఖ్య అధికం అయిపోతుంది, అక్కడున్న తొమ్మిది జైళ్లలో పరిణతికి మించి నేరస్తులు ఉంటున్నారు. వివిధరకాలైన నేరాలకు పాల్పడిన వారు అక్కడకు చేరిన తరువాత కూడా తమ ప్రవృత్తి మార్చుకోకుండా అక్కడే ముఠాలను స్థాపించి అక్కడనుంచే బయటవారికి కావలసిన అసాంఘిక చర్యలు చేస్తూ ఉంటారు.

వారికి రాజకీయపరమైన అండదండలు కూడా ఉంటాయి. అటువంటి ముఠాలు దాదాపు ముప్పై వరకూ అక్కడ ఉన్నాయి, కాకపోతే అక్కడ అధికారులు ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తారు అలాంటిదేమీ లేనట్లుగా బుకాయిస్తారు. కొత్తగా ఆ ప్రదేశంలోకి శిక్ష అనుభవించడానికి వచ్చినవాళ్ళు ఏదో ఒక ముఠాలో చేరవలసిందే లేదంటే ముఠా తగాదాలలో అది వారి ప్రాణాలకే హాని కలిగిస్తుంది. అటువంటి సంఘటనలు అక్కడ చాలానే జరుగుతూ ఉంటాయి.

ముఠాలో సభ్యులకు వారి వారి స్థాయిని బట్టి సెల్ ఫోన్, ఇంటి నుండి ప్రత్యేకంగా ఆహరం తెప్పించుకునే అవకాశం, దుప్పట్లు, మాదకద్రవ్యాలు, ఇతర ఖైదీల నుండి లైంగిక దాడులు జరగకుండా రక్షణా ఇటువంటి సదుపాయాలూ కలిగిస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఈ ముఠాలన్నీ మాఫియా లాంటి వ్యవస్థలాగ తయ్యారయ్యి తమ పనులు చాకచక్యంగా చేస్తున్నాయి.

సాధారణంగా ఈ ముఠాలన్నీ తమతమ నాయకుడి పేరుతో చలామణీ అవుతూ ఉంటాయి కిట్టూ తివారీ, ఇస్మాయిల్ భాయి, చౌదరీ గ్యాంగ్ ఇలాగ అన్నమాట. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి, దైవ చింతనా పాపభీతి కలిగించడానికి తరచుగా ఆధ్యాత్మిక గురువులతో ప్రసంగాలు, మెడిటేషన్ క్లాసెస్ జరిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఖైదీలు వాటిమీద పెద్దగా శ్రద్ధ చూపించరు, పైగా అక్కడ కొంతమందిలో తీహార్ ఖైదీలు అనిపించుకోవడమే ఘనత, అప్పుడే ప్రజలకు తమ పట్ల భయం ఉంటుంది అనే ఒక భావం ఉంది. ఇటువంటి పరిస్థితులను, ఈ ముఠాలను అణగదొక్కడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, అయితే పెరుగుతున్న నేరస్తుల సంఖ్యాబలం దృష్ట్యా వారు ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ఆర్టికల్‌ను చదవడం పూర్తిచేసాడు సిద్ధార్థ. అతను తీహార్ జైలుకి తరలగంచబడి ఇప్పటికి మూడు నెలలు కావొస్తోంది.

రాహుల్ పార్టీ విజయం సాధించడం, హనుమంతరావు ముఖ్యమంత్రి కావడం, రాహుల్ ప్రియాంకలు ఇద్దరూ పర్యటనలలో బిజీగా ఉండడం అంతా తను ఇక్కడినుండి తెలుసుకుంటూనే ఉన్నాడు. తన చరిత్ర తెలిసి ఉండడం వల్ల అక్కడ ఉన్న గ్యాంగ్స్ ఎవరూ తనని అడ్డుకునే ధైర్యం చెయ్యలేకపోయారు. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసిన వారెవరో తీహార్ యొక్క ముఠాలనూ అక్కడ భీతావాహ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా కనిపించేలా రాసాడు. ఇక్కడ నుండి మన రాష్ట్రానికి సంబంధించిన ముఠాలు కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాయి.

“మీరు ఇక్కడ నుండి బయటపడదాం అనుకుంటున్నారా” తన పక్క సెల్ నుంచి ఒక స్వరం చాలా మంద్ర స్థాయిలో ధ్వనించింది.

తాను ఇక్కడికి వచ్చి ఇంతకాలం అయినా ఒక్కసారి కూడా ఎవరూ తనని పలకరించలేదు, అలాంటిది ఈరోజు డైరెక్ట్‌గా ఎస్కేప్ గురించి మాట్లాడుతున్నారు. సిద్ధార్థకు విచిత్రంగా అనిపించి “మీరు తెలుగు వారా” అడిగాడు.

“అవును నేను తెలుగు వాడినే, కాకపోతే ఇంగ్లాండ్ యూనివర్సిటీలో డాక్టర్ చదివాను, నాకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉండేవి. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ మీకు తెలీకుండానే రవి కిషన్ చౌదరీ గాంగ్ ద్వారా నేను మీ గురించిన వివరాలు మొత్తం తెలుసుకుంటూ వస్తున్నాను. ఇంతకాలం మీలాంటివాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను.

మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు. నాకు తెలిసి మీకు ఇంటర్నేషనల్ చరిస్మా కలిగిన ఫేసు. ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోదాం నేను మీకు సహాయం చేస్తాను. నాతో కలిసి పనిచేస్తారా” అవతలి నుంచి స్వరం వినిపించింది.

 “ఇంతకీ మీ పేరు” అడిగాడు సిద్ధార్థ

“గోపాల కృష్ణ”

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here