మిర్చీ తో చర్చ-23: ప్రేమ – మిర్చీ… ఒకటే-5

0
4

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]”సుం[/dropcap]దరం సార్ కావాలి” ఎవరో తలుపు దగ్గర నిలబడి అంటున్నారు.

“నేనే” అన్నాడు సుందరం.

అతను చేతిలోని వీక్లీని రజనీ పంథాలో చిత్రంగా పట్టుకుని అదోలా నవ్వాడు.

“ఏం కావాలి నీకు?”

“నాకేటి కావలేటీ?” అంటూ వీక్లీ ప్రక్కన పారేసాడు.

“అలాక్కాదు, నాతో ఏంటి పని?”

సోఫా దగ్గరకొచ్చి మరో చూపు చూసాడు.

“ఈడ కూకుంటే ఏటైనా అనేసుకుంటావేటి?”

“ఏమీ అనుకోను”

తుండు గుడ్డతో గట్టిగా దులిపేసి కూర్చున్నాడు.

“చెప్పు”

“విజయ్‌నగర్ కాలనీ బస్ స్టాప్ ఒకటున్నదని తెల్దేటి?”

“తెలుసు”

“ఆడ మిర్చీ బండి ఎవరిదనుకున్నావేటి?”

“ఓహో. మిర్చీ బజ్జీలు అమ్ముకుంటావన్న మాట. అయితే మాకు ఆప్తుడవు”

“ఎలాగ?”

“అంటే బాగా కావలసినవాడివని అర్థం!”

“నీకేటి కావాల? నాకు సెడ్డ సమస్యగున్నాది ఇయ్యాల”

“ఏవైంది?”

“ఆడెవడో సింహంట, ఆడెనక ఇద్దరమ్మాయిలు పడిపోనారు”

ఇద్దరం ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నాం.

“అయితే నీకేవైంది?”

“మరదె! ఆ ఇద్దరమ్మాయిలెవరుకున్నావేటి?”

“ఎవరు?”

“ఓ అమ్మాయి సన్నగా ఒయ్యారాలు తిరిగి పచ్చి మిర్చీలాగుంటది”

“రెండో అమ్మాయి?”

“ఈ అమ్మాయి కూడా… పెటపెటలాడుతూ… కాదు, ఎండు మిర్చీలా టప టపలాడుతూ ఉంటది. ఆడ పోలీసు కదా?”

“ఓ… ఇంతకీ నీకేవైంది?”

“ఉండలగ! ఆ ఇంజినీరు నీ పేరు చెప్పేసినాడు”

నాకు నవ్వు ఆగలేదు. నరసింహం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర బాగానే పోషిస్తున్నాడన్న మాట.

“అవునూ… ఆ ఇద్దరూ అతన్ని ఇష్టపడితే నీకేంటి సమస్య?”

“పోలీసు పిల్ల నన్ను అక్కడి నుండి ఎల్లిపోమంటున్నాది. మరి ఆ పిల్లేమో ఆడ నుండి కదిలితే సంపేత్తానంటది. ఏటి సెయ్యమంటావేటి?”

“నన్నడిగితే ఎలా? నాకేంటి సంబంధం?”

“అలగంటవేటి? నువ్వు కదా ఆ ఇంజినీరికి మిర్చీ కుట్ర సెప్పినాది?”

“మిర్చీ కుట్రా? జాగ్రత్త! మాటలు జాగ్రత్తగా రానీ! డామేజీ దావా వేసేస్తాను జాగ్రత్త. మిర్చీ ఏ రోజూ కుట్ర పన్నదు. ధర్మబద్ధంగా నడుచుకుంటుంది”

“ఏదో అనేసినాను. పోలీసమ్మను ఎలగెదుర్కొనేది? నా యాపారం సొమ్మసిల్లిపోనాది. ఏదో సెప్పు మరి”

ఇంతలో మిర్చీ ప్లేటు వచ్చింది.

“ఏటిది? నాకు మిర్చీ పెట్టేత్తావేటి?”

“తప్పడు. సలహా కావాలంటే ఇక్కడ ఫీజుంటుంది”

“సాలా సెడ్డ పనిది. నా యాపారంలో ఏలెట్టి నన్నే డబ్బుడుగుతున్నావేటి?”

“నీ వ్యాపారంతో నాకేంటయ్యా పని?”

“నువ్వు గాదేటి? ప్రేమా, మిర్చీ అని మా సెడ్డ కబుర్లు సెప్పి, ఇంజినీరుని, నన్ను ఇరికించినవ్వు”

“అపచారం. మిర్చీ మీద ఒట్టు.  మిర్చీ తింటూ అమ్మాయికి ఆశ చూపించామన్నాం. అంత మటుకే. పైగా దాని వల్ల వ్యాపారం పెరుగుతుంది అని అనుకున్నాం”

అతను ఓ మిర్చీ కొరికాడు.

“ఇలగున్నదేటి?”

“ఏవైంది?”

“సప్పగుంది”

“అవును మరి. నువ్వు నడి బజారులో అమ్ముతాను. మేము నడుము కదలకుండా కూర్చుని అమ్ముకుంటాం”

“నా సంగతి ఏటి సేసినావు?”

“నేను ఏమీ చెయ్యలేను. మీరూ మీరూ తేల్చుకోండి”

“ఏటి తేల్చుకునేది? నాలుగింటికల్లా కర్ర పుచ్చుకుని బండి కాడకొచ్చి నిలబడి పోతున్నది ఆడ పోలీసు. సెడ్డ సికాకుగుంది”

“ఓ నాలుగు బజ్జీలు ఇచ్చి నమస్కారం పెట్టుకో”

“ఓ బాగా సెప్పేసినావ్వు. ఆ పని చాలా సార్లు అయిపోనాది. పీకలదాకా మెక్కేది పోలీసు పైడితల్లి!”

“మరి వెళ్ళిపొమ్మన్ని చెబుతోందెందుకు? మిర్చీలు నచ్చలేదా?”

“మా సెడ్డ మాటది! నా మిర్చీ కొరకనోడికి కోరికలే పుట్టవు”

“శభాష్! ఆడ పోలీసుకి కోరికలు ఎక్కువగా పుట్టినట్లున్నాయి”

“కోరిక మాట కాదు. ఆ బస్సులోంచి దిగే పిల్లతో ఈ ఇంజనీరు గాడు మిర్చీ తినగూడదంటుంది. ఎవడో చిల్లంగి చేసినట్టున్నాడు తల్లికి!”

“అసూయ. మిర్చీ బజ్జీలోని గింజ నాలుకకు అడుగున తగిలినప్పుడు మిర్చీ లోంచి కారం బయటపడ్డట్టు ఆడవాళ్ళ అసూయ లోంచి జుయ్‌మంటూ నిజమైన ప్రేమ రాకెట్‌లా పైకి వస్తుంది”

“ఆ రాకెట్‌ను నా మీద పోనిత్తానంటదేటి?”

“నీ పేరు…”

“నూకా”

“చూడు నూకా! రాకీలాగుంది పేరు. ప్రేమ వ్యవహారాలలో ముక్కోణపు పోటీ సర్వసాధారణం”

“ఏటి? మా ఊళ్ళో మొన్న జరిగిన ఎన్నికల్లాటిదేటి?”

“కరెక్ట్. రాజ్ కపూర్ నుంచి ఏ దర్శకుడిని తీసుకున్నా ప్రేమను ముక్కోణం లోంచి పరిశీలించారు”

“నీకో సంగతి సెప్పాలనుంది”

“చెప్పేయ్!”

“ఆడ పోలీసు నన్ను సిరుతపులి సూసినట్లు సూసేస్తున్నది”

“వెరీ గుడ్”

“ఏటి ఎరీ గుడ్? కట్టం మీద సేతులు కట్టేసుకుంటున్నానన్న మాటండి. కింద తడిసిపోతన్నాది”

“ఓర్చుకోవాలి. మిర్చీ నేర్పే మొదటి పాఠం ఓర్పు!”

“పొట్టలోకి పెట్టి ఓర్పు కావాలంటావేటి? రేపు కనిపిత్తే కోసుకు తింటననేసినాది!”

“నాదో అనుమానం”

“ఏటి? నీక్కూడానేటి?”

“అలాక్కాదు… రాకీ…”

“నూకా…”

“కరెక్ట్. చూడు నూకా! ఈ ఆడ పోలీసు నిన్ను ప్రేమిస్తోందేమో?”

“ఓలమ్మో! ఎంత మాటనేసినవ్వు?”

“పెళ్ళయిందేటి?”

“పెళ్ళి కాలేదు”

“ఎందుకని?”

“అదేటి? మిర్చీ బండికి పెళ్ళేటి?”

“కాదు. నాకెందుకో నీకు కళ్యాణ ఘడియలు వచ్చినట్లు అనిపిస్తోంది”

“ఏటన్నావు? అదంత ఎందుకులే కానీ ముందు సావు గురించి సెప్పు”

“సింపుల్. రేపు ఓ మాట చెప్పు”

“ఏంటి? ప్రేమించానని సెప్పమంటావేటి?”

“లేదు. ఆ ఇంజనీరు బిడ్డకి పనికిమాలిన బజ్జీలు ఇస్తానని చెప్పు”

“అలగన్నావేటి? ఆడ పోలీసు ఆడినే గదా కోరుకుంటున్నాది?”

“అందుకనే! ఆ ఇంజనీరు ఆ బస్సు లోంచి దిగే పిల్లకి అవే ఇస్తాడని చెప్పు. దాంతో ఆ పిల్ల చెప్పు తీస్తుంది!”

“అర్థమైపోనాది. ఆడ పోలీసు గంతులేత్తది!”

“కానీ పాపం ఆ కుర్రాడికి మంచి బజ్జీయే ఇవ్వు”

“ఎందుకలగా?”

“ప్రేమకు అడ్డు రాకూడదు. ఆడ పోలీసును నమ్మించు ప్రస్తుతానికి”

అతను లేచాడు. డబ్బులిచ్చి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు.

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here