వీడ్కోలు సభ

0
3

[dropcap]పొ[/dropcap]ద్దు గూకింది. చీకటి ముదురుతున్నది. నేను నడిచే దారెంట దయ్యాల మర్రిలాంటి వేప చెట్టు గుబురుగా ఉండి, ఆకు, పూతతో ఒరుగుతూ గాలికి కదులుతున్నది. వేపచెట్టు క్రింద పట్టపగలు కూడా చలువ పందిరి లాంటి నీడ. రాత్రి దాని క్రింద నడుస్తుంటే చిమ్మచీకటిలా అనిపిస్తుంటది. రాత్రయ్యే సరికి ఆ చీకటిన పది, ఇరవై కట్టెల పొయ్యిలు. దూరం నుంచి చూస్తే ఆకాశాన కనిపించే కదులుతున్న చుక్కల్లా అనిపిస్తది. ఆ మసక వెలుగున నడిచాను. ఔను, ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు ‘పుల్లిందల జయరావ్’ పదవీ విరమణ వీడ్కోలు సభ ఉంది. ఈ వీధి చివర మలుపుననే నాతో ఆఫీసులో పనిచేసే శివయ్య ఉండేది. నేనూ, శివయ్య ఆయన క్రింద చాలా కాలం పని చేశాం. కలిసి కాదు, విడివిడిగా.

‘సభ ఉంది కదా, నువ్ వెళ్ళేటప్పుడు కేక వేయి. నేను వస్తా’ అనడంతో అటుగా నడుస్తున్నాను. ఆయనేంటో నాకు కూడా తెలుసు గనక అంతగా వెళ్లాలనిపించలేదు.

చెట్టు దాటాక కాస్త ఎడంగా ఐలయ్య బజ్జీల బండి కనిపించింది. బండి చుట్టూరా ఈగల్లా కాకున్నా బాగానే ముసురుకుని వేడివేడిగా తీసిచ్చిన బజ్జీలను ఆకులలో పెట్టుకొని ఆవురావురుమంటూ తింటున్న జనం. ఈ ఐలయ్యను నేను పాతికేళ్ళనుంచీ చూస్తున్నాను. పెళ్ళీ పెటాకులు లేకుండా పొట్ట చేత పట్టుకుని వచ్చినోడు ఈ వ్యాపారం ప్రారంభించాక పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పోరగాళ్ళను కన్నాడు. అందులో చిన్నోడు చేతి క్రింద పని చేస్తుంటే, పెద్దోడు ప్రభుత్వ దవాఖానలో ఏదో నౌకరీ చేస్తున్నట్లుంది. సాయంత్రం ఐదింటికి ప్రారంభించి, రాత్రి పదింటి దాకా అదే క్రతువున ఋషిలా తన పని తాను చేస్తూ తోపుడు బండి తోసుకుంటూ ఇంటికి వెళ్లేవాడు. మరి ఇతనికి రిటైర్మెంటు లేదా? ఐలయ్య వయస్సూ అరవైలో పడింది అనుకుంటూ ఉండగా “రెండియ్యవయ్యా పోతాను, అరే పైసలు ఇచ్చి ఏ కాలమాయే” అంటున్నాడొకడు.

“ఇస్తూనే ఉన్నాగా మల్లయ్యా, ఊరికే ఉన్నానా? నువ్వు చూస్తానే ఉంటివి గదా. ఈ వాయిలో నీకే ఇస్తా” అని మిషన్‌లా పని తాను చేసుకుంటూనే చెప్పాడు. బజ్జీల కోసం చుట్టూరా ఉన్న జనం ఆరాటం చూసిన తరువాత నాకూ నోరూరింది. ఆగాను. అయినా ఐలయ్య చేతి బజ్జీలను తినాలనిపించనిదెవరికి? కానీ, ఆ గుంపు ఒత్తిడి చూశాక తినాలనిపించినా వెంటనే కుదిరే పని కాదని నడిచాను. నడుస్తూ బాట వైపు చూశాను. అప్పుడే వీధి దీపాలు వెలుగుతున్నాయి.

“మల్లయ్యా చచ్చిందాకా వ్యవసాయమే చేస్తావా” ఎల్లయ్య అడిగాడు. “అయినా కొన్ని బ్రతుకులు అంతే, చావు తోనే వచ్చేది ఆ వెసులుబాటు” అని వాయి తీయడంలో నిమగ్నమయ్యాడు ఐలయ్య.

మలుపు అవతల ఎవరో వస్తున్న జాడ కన్పించింది. ఆ వస్తున్నది శివయ్య కాదు కదా అనుకుని కళ్ళు చికిలించి చూశాను. దగ్గర కొచ్చిందాకా ఆ వస్తున్నది శివయ్యో కాదో అర్థమై చావలే. దగ్గరకు రాగానే గుర్తుపట్టాను. నేను నౌకరిన చేరినప్పుడు తను కుడువా ఉన్నోడే. నలభై ఏళ్లుగా వ్యవసాయ కూలీ గానే రెక్కల నమ్ముకొని పని చేస్తున్నాడు. ఈ మధ్యన రెండెకరాలు కౌలుకు తీసుకుని ప్రత్తి వేసి అప్పుల పాలయ్యాడు. ఆరుగాలం నేలను నమ్మి కష్టం చేస్తున్నందుకు ఒళ్ళూ దసిలింది, పళ్ళూ ద‌సిలినయి. వీటికి తోడు మోకాళ్ళ కలకలు. ‘పాపం వీళ్ళకు రిటైర్మెంట్ ఉండదు, నూకలు చెల్లినప్పుడు తప్ప. ఆయన్నొదిలేద్దాం. రోజువారి పని కోసం రోడ్డెక్కే భత్యం గాళ్ళ సంగతేంటి?’ అనుకుంటూ ఎదురుపడ్డ రోశయ్యని పలకరించి నడిచాను. నేను శివయ్య ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి మరో పది నిమిషాలు పట్టింది. వాడి ఇంటి ముందు చేరి “రామానుజం” అని పిలిచాను. “ఎవరూ” అంటూ ఆడ గొంతు వినిపించింది. “ఎవరూ” అంటూ రామానుజం బయటకు వచ్చాడు. ఈయన శివయ్య తోడల్లుడు. ఆయిల్ మిల్లులో పనిచేస్తుంటాడు. శివయ్యా, ఇతను కలిసి ఒకే ఇంట్లో ఉంటారు.

‘నేను’ అన్నాను.

“ఓ మీరా! రండి” అంది శివయ్య ఇల్లాలు నవ్వుతూ ఎదురొచ్చి. ఈయన భార్య కుదురైన మనిషి. అదృష్టం కొద్దీ అతనికి దొరికింది. బాగా ఓపికస్తురాలు. ఖాళీ దొరికినప్పుడల్లా మిషన్ మీద రవికలు, లంగాలు కుడుతూ ఉంటుంది.

“నేను రావడం కాదు, వాణ్ణి పిలువు. మా సార్ వీడ్కోలు సభ ఉంది. వెళదామనుకున్నాం” అన్నాను.

“వస్తున్నా రా” అని చొక్కా గుండీలు పెట్టుకుంటూ బయటికి వచ్చాడు శివయ్య. కరెంటు వెలుతురున నున్నగా గీసుకున్న అతని గడ్డం మెరిసింది. నాకు నవ్వూ, కోపం రెండూ వచ్చాయి. శవ జాగరణ లాంటి సభకు వెళుతూ కూడా ముస్తాబు. “ఏందిరా, ఏందీ సోకు? లగ్నం పిల్లను చూసేందుకు పోవటం లేదు కదా! మన నడినెత్తిన ఎక్కి పెత్తనం చేసినోడ్ని సాగనంపడానికి కదరా పోయేది” అన్నాను నవ్వుతూ.

“అవుననుకో, అయినా సభ కదా. మందీ మార్బలం వస్తారు కదా. నలుగురిన కాస్త శుభ్రంగా కనిపిస్తే బాగని” అంటూ నడిచాడు. మేము నడుస్తూ ఉండగా మా ఆఫీసులో పనిచేసే స్వీపరు పోలమ్మ కలిసింది.

“శివయ్యా, మా ముసలోళ్లకి ఇంత ‘పిడస’ వేసి వస్తున్నా. అందుకే ఇంత లేటు అయింది” అంది.

“అయితే మానెలే. ఆడ మునిగిపోయే తంతేముంది?” అని అనుకుంటూ నడుస్తూనే ఉన్నాం.

మేం సభ దగ్గరకు వచ్చాము, గబగబా నడుస్తూ. మైకు వినిపిస్తుంది. సభలోకెళ్ళి వెనక కుర్చీలో కూర్చున్నాం. తాము ఎక్కడ కూర్చున్నా, అట్టడుగు నౌకరులకు ఉంటే గుర్తింపు ఏంటి? అనుకుంటూ స్టేజి వైపు పార చూశాడు శివయ్య. అక్కడ శంకరయ్య హడావిడి పడుతూ కనిపించాడు.

‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా వీడు ఒకడు. ఆఫీసులో ఎలాంటి సందర్భం వచ్చినా ఈ భూభాగం బాధ్యతనంతా తన భుజాలపైనే మోస్తున్నట్టు మాలావు ఇదై పోతుంటాడు’. వీని సంగతి తెలుసు కనక తమలో తాము నవ్వుకుంటూ వెళుతుంటారు. ఇంతలో అనసూయమ్మ మైక్ అందుకుంది. మగరాయుడిలాగా చేతులు జాడిస్తూ, తనలో తాను నవ్వుకొంటూ సభికులను బాగా ఆనందింపచేస్తానన్న ధీమా ఆమెలో కన్పడుతుంది. ఉద్యోగస్తులలో యూనియన్ పరంగా ఈవిడ ఆడ ప్రతినిధి. కాస్తో కూస్తో మాటకారి. ఏ సభన మైకు దొరికినా త్వరగా వదలదు. ప్రేక్షకులు ఆవిడ హావభావాలనూ, ఒంటి విరుపులను చూడడం తప్ప ఆవిడ చెప్పేది మాత్రం వినే వారికి ముక్క కూడా అర్థం కాదు. మాట తీరున అంత వేగం, ‘ఉసి’ ఉంటుంది. “మనం ఉద్యోగాన చేరిందే సమాజానికి అంతో, ఇంతో సేవ చేయడానికి. అందుకు జీత భత్యాలు తీసుకుంటున్నామనుకోండి. తీసుకోక తప్పదు. మనకీ కుటుంబాలు ఉన్నయి. మనకీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి” అని పెద్దగా నవ్వి, “నేను కూడా ఈ ఆఫీసుకు వచ్చి ఆరు సంవత్సరాలు ఈ జనవరికి” అని అనసూయమ్మ అనగానే ‘ఇది ఎవడడిగాడు? బదిలీ లేకుండా ఇంకో పదేళ్లు ఉండు’ అనుకున్నాడు శివయ్య విసుగ్గా.

జయరావ్‌ను చూపుతూ “వచ్చినప్పటినుంచి నేను ఈయనను చూస్తూనే ఉన్నాను” అంది.

‘ఎదర సీటే కదా, తల ఎత్తితే కన్పిస్తాడు’ అనుకొన్నాను నేను.

“ఈయన పద్ధతే వేరు. నాకు నిజం చెప్పాలని ఉంది” అనగానే, ‘అమ్మా నీ చేత మైక్ ఉంది, నువ్వు ఏం చెప్పినా వినేందుకు గుండెదిటవు చేసుకునే వచ్చాం. రోట్లో తల పెట్టాక ముడ్డిగంతలు తప్పవు కదా’ అని నవ్వుకున్నాం.

“మనకు తెలిసిన అద్భుత శక్తులనూ లేని భగవంతుడికి అంటగట్టి దేవాధిదేవుడవని నమ్మించి నిన్ను ఆరాధ్యున్ని చేశారు. ఇది బాగుంది అనుకొన్నాడు దేవుడు. అనుకోవడంతో ఆగక చచ్చే, చంపే స్థితి తను చేతుల్లోనే ఉందని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే దానికి దేవుని చాలూళం గమనించి, వీళ్లు తయారు చేసి, చివరకు ఆయనను కూడా బానిసను చేశారు. అలాంటివాడు కాదు మన జయరావ్. ప్రలోభాలకు లొంగక ఆదర్శంగా నిలిచాడు. ఆయన మన నుంచి వెళ్లిపోవడం చాలా వెలితిగా ఉంది” అని ఆగగానే, ‘కళ్ళు తుడుచుకోకు, ముక్కు చీదేవ్, ఆగు’ అనుకొన్నాడు శివయ్య భయంగా చూస్తూ.

వారి వెంట వచ్చిన రామోజీ, “శివుడూ, ఈయన చాలా సంపాదించారని అంటారు కదరా. పెద్ద సంబంధాలు చూసి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. స్వంత ఇల్లు ఉంది. జూబ్లీహిల్స్‌లో టు బెడ్ రూమ్ ఫ్లాట్ ఉందట. దానికి పాతిక వేలు అద్దె వస్తుందట. ముందు ముందు పెన్షనూ బాగానే వస్తుంది” అనగానే, “ఏం మాయరోగం? అసలు వీడు ఎవడికి సేవ చేసాడని ఈ వీడ్కోలు సభ? బల్ల కింద చెయ్యి పెట్టి తెలివిగా సంపాదించినందుకా? పక్క మీద రోజూ అలరిస్తూన్నా మొగుడు ‘హరీ!’ అన్నట్టు బాధ! పైగా వీడు చేయాల్సిన సేవ ఏదో మిగిలిపోయినట్టు అసలేందీ అబద్దాలు? అసలు ఈ ప్రభుత్వ కార్యాలయాలలో ఎవడు ఎలా నౌకరీ వెలగబెడుతున్నదీ మనకు తెలియదా?  ఛ… ఛ… తలచుకుంటేనే సిగ్గయితుంది. అయినా ఇంత తిని బయటపడేదానికి ఈ సొదంతా వినడం దేనికి?” అని లేస్తూ, “అరె! వీడేమైనా మంచి గంధం చెట్టు నరికే గొడ్డలా? దాని సుగంధం అంటుకోవడానికి? టైము అయిపోయిందాకా ఉద్యోగపు సుఖాలే కాక లేని వాటిని కూడా కల్పించుకుని అనుభవించాడు భ్రష్టుడు. కొంచెం నవ్వు మొహంతో మాటకారి కనుక చెయ్యాల్సిన అప్రాచ్యపు పనులన్నీ మన కళ్ళెదుటే చేశాడు గదా. దీనికి సన్మానాలెందుకు? ఉద్యోగ విరమణ అయిన తర్వాత, పై ఆదాయం పోయిందని వాడేడేస్తుంటే?” అని “ఇక పోదాం పద, ఈ సొద మనకెందుకు?” అని లేచాడు శివయ్య.

“భోజనాలున్నయి కదా! ఎట్టాగూ వచ్చినం, తిని పోదాం” అన్నాడు రామోజి.

“అట్టనే. మనం డొక్క మాడ్చుకోవడమెందుకు?” అని భోజనశాలవైపు చూశాడు. కొందరు భోం చేస్తూ కనబడ్డారక్కడ. “ఎవరేం చెప్పినా, ఎవడు చేసింది వారింటనే ఉంటది” అని లేచాడు.

భోజనశాలకు వెళ్ళి, భోజనం చేసి బయటకొస్తుండగా జయరావ్ తన గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

అది చూశాకా, ఓ ముచ్చట గుర్తుకొస్తున్నదన్నాడు రామోజి. చెప్పమని అడిగాడు శివుడు.

“శాంతమ్మ అని ఓ నడికారు మనిషి (త్రుంటి వగరు అంతగా తగ్గనిది) వస్తే దాని మాటలకూ, హొయలకూ మెలికలు తిరిగిపోయి, దాన్ని వెంటేసుకుని పట్నం బోయి నాలుగు దినాలుండి దాని ఇలాఖా వానికి ఈయన పరిధిన ఉన్న ప్రభుత్వ భూమిని ఎకరంన్నర అరవై సంవత్సరాలకు లీజుకు ఇప్పించిండు. అతి తక్కువ ధరకు. దాంట్లోనేమో గ్రానైట్ ఉంది. వాడు అయిదారేళ్లలో కుబేరుడయిండు. దాన్లో నలభై పైసల వాటా వీడికి వచ్చిందంట. దాని మీద కొంత రచ్చ కూడా అయింది. రాజకీయ బ్రోకర్లను డబ్బుతో తడిపి, కాళ్ళా వేళ్ళా పడి దాని జోలికి ఎవరూ రాకుండా చేసుకొన్నాడు. అప్పుడే కదా జూబ్లీహిల్స్‌న టు బెడ్ రూమ్ ఫ్లాట్‌ను బిడ్డ పేరున కొన్నది. అంతేనా, ఇంకో దాని వెంటపడి గవర్నమెంటు నేలను వీడబ్బ సొమ్ములాగా దానికీ ఇచ్చిండనుకొంటున్నారు. కోక గినక వాలుగా కనక కనబడితే, కోడిపుంజు లెక్కన కేరటం మొదలుపెడతడు. చిత్తకార్తె కుక్క వీటి కంటే నయం” అని నవ్వాడు అదోలాగయి.

“మా నుంచి ఈయన వెళ్ళిపోడం పూడ్చలేని వెలితి అని చెబుతోంది అనసూయమ్మ. ఆఫీసుకేమో గానీ ఆవిడకు బోలెడు వెలితైనట్టు కన్పించింది. చెప్పేవాడికి లేకున్నా, మనకైనా ఉండాలి గదా, పదా” అన్నాదు కటువుగా శివుడు.

తోవకెక్కి ఇద్దరూ బాటన పడ్దారు. నేనూ వెంట నడిచాను. “అయినా శివుడూ లోగా స్థిరపడ్డది గాక పెన్షన్ కూడా దండిగనే వస్తది కదా, మరి మొగుడ్ని తన్ని తరిమేసిన ముండలా అట్టా మొహం పెడతాడెందుకు?” అడిగాను.

“అదా! సీటు పోయింది గదా. దానితో బల్ల క్రింద చెయ్యి పెట్టే అవకాశం బ్రతికినంత కాలం పాయె. వీడి కడుపు కాల. ఎట్టాటి వాటికి ఊపిరి పోసి ఎట్ల తిన్నాడని. వీడి చాలూళానికి పుట్టి మునిగినట్టు సభ పెడితిరి” అనగానే పెద్దగా నవ్వాడు రామోజి.

ఎదురుగా నలుగురు మనుషులొస్తూ కనిపించారు. ఓ’గడ’కి దుప్పిటిన కట్టి రెండు చివర్లా మోస్తూ వస్తున్నారు. ఊరుకోలేక, “ఎవర్రా, ఏడకి తీసుకుపోతున్నారు?” అడిగాడు శివుడు.

“ఈ కట్టెకి గాలి పోయింది. కాటికి తీసుకుపోతున్నాం” అన్నాడు ముందేపు మోస్తున్నోడు.

“నలుగురున్నారు కద, ఇట్ట తీసుకుపోతన్నరెండి?” అడిగాడు రామోజి.

“ఇది మల్లమ్మ అని ఓ దిక్కుమాలినది.  నిన్ననంగ పోయింది. పొద్దంతా చూశారు. ఇప్పుడు ఇక చూడటం బాగలేక పూడ్చేందుకు తీసుకుపోతున్నాం” అన్నాడు.

“ఏ మల్లమ్మా?” అడిగాడు శివుడు.

“గుడిసేటి మల్లమ్మ. వయసున్నంత కాలం అడినోడికల్లా కాదనకుండా ఒళ్ళప్పగించింది. రోగాల పాలై ఇప్పుడిట్లా చచ్చింది. దీని పొందుకోసం అంగలార్చిన కొడుకులు ఏడున్నరో, ఏమైపోయారో?” అని నడుస్తూనే అన్నాడు.

“మోసుకుపోతున్నరు, కాటి కాద బొంద తవ్వాలి కదా, కాటోడు పైసలు ఇవ్వంది తవ్వనిస్తడ? అవి మీ దగ్గరున్నయా?” అడిగాను.

“ఆడ కింద పెట్టి కాటి కాడ అడుగుదామనే పోతన్నం. ఇప్పటికే వాసన పట్టింది. గుడిసెల మధ్య ఏం ఉంచుతం? కానరాని రోగాలు పుట్టి వాళ్ళు చస్తరు.”

“ఇగో, పైసలు లేకపోతే కాటోడు త్రవ్వనీయడు. తీసుకో” అని శివుడు జేబులో నుంచి డబ్బిచ్చాడు.

“ఇదుంచు. గుంట తవ్వేటప్పుడు అలుపొస్తే సార నీళ్ళకయినా పనికొస్తది” అంటూ రామోజి కూడా కొంత డబ్బిచ్చి, “వాని వీడ్కోలు సభకొచ్చి, దీని వీడ్కోలు చూసినం” అని సణిగిండు.

వాళ్ళు దండమెట్టి నడిచారు.

తప్పు ఆమె చేసింది కాదు, వయసునున్న ఆకలి చేయించింది, దిక్కుమాలిన లోకం అనుకొంటూ విడిపోయాం మిత్రులం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here