[dropcap]వై[/dropcap]ష్ణవి.. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. చదువుల్లో చురుకైన అమ్మాయి.
ఆ రోజు.. సోమవారం.. సమయం ఆరున్నర గంటలు.. సూర్యోదయం అవుతుంది.. హేమంత రుతువు .. సన్నగా మంచు కురుస్తుంది. వరండాలోకి వచ్చి నిలబడింది.
బాలభానుడి నులివెచ్చని కిరణాలు జగతి అంతటా పరుచుకుంటున్నాయి. అరవిరిసిన గులాబీలపై కురిసిన మంచుబిందువులు .. మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి. చల్లని గాలి రివ్వున వీస్తుంది.
మందారాలు ..చల్లని చలిగాలి చెలికాడు ముద్దాడుతుంటే .. తన్మయానికి లోనవుతూ ..అందంగా అటూ ఇటూ కదులుతూ .. చెలికాడికి తమ హర్షాన్ని తెలియజేస్తున్నట్లుగా .. ఆ ప్రాంతమంతా సుమధుర పరిమళాలని వెదజల్లుతున్నాయి.
పచ్చని పచ్చికపై నడుస్తుంది వైష్ణవి. పచ్చని పచ్చికపై నిలుచున్న మంచిబిందువుల్ని పాదాలు సృశిస్తుంటే .. చక్కలిగింతలు పెడుతున్నట్లుగా తన్మయంగా అనిపిస్తుంది.
ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు కదులుతూ పెరట్లో వున్న ఊయలలో కూర్చుంది. దగ్గరలో వున్న ఎర్రని గులాబీని చేతుల్లో కి తీసుకుని పెదవుల దగ్గరకి చేర్చి గులాబీని ముద్దాడింది. అందమైన గులాబీని ముద్దాడిన తన పెదవులపై చిరునవ్వు సమ్మోహనంగా నాట్యమాడింది.
తను సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే అయినా తనెప్పుడూ అలా ఫీల్ అవ్వదు. కాలేజ్‌లో అందరితో స్నేహంగా వుంటుంది. అందుకే కాలేజ్ లో ఫ్రండ్స్ అందరూ తనని ఇష్టపడతారు ..అభిమానిస్తారు..!
జాగింగ్‌కి సమయం అవుతుండంటూ అన్నయ్య, నాన్న పిలుస్తుంటే “వస్తున్నా డాడీ ..” అంటూ ముందుకు కదిలింది వైష్ణవి.
* * *
తమ కాలేజ్‌లో జరుగుతున్న ఇంటర్ కాలేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి ఫ్రెండ్స్‌తో కలసి వెళుతుంది వైష్ణవి.
రాష్టవ్యాప్తంగా వచ్చిన కాలేజీలు పార్టిసిపేట్ చేసిన ఆ పోటీలో వైష్ణవి వాళ్ళ కాలేజ్ సెమీఫైనల్స్‌కి చేరుకుంది.
గత యేడాది జరిగిన పోటీలలో ‘రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ‘ లీగ్స్ దశలోనే నిష్క్రమించింది.
వైష్ణవి, పల్లవి, స్వాతి, శ్రీజ ..నలుగుగు ఓ బ్యాచ్‌గా వుంటారెప్పుడు… నలుగురు ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తున్నారు. అర్జున్ తమ కాలేజ్ స్టూడెంట్ ..మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్! అతడు గ్రౌండ్‌లో యాక్టివ్‌గా మూవ్ అవుతున్నాడు.
బాల్ కదలికను సునిశితంగా పరిశీలిస్తూ ..ప్రత్యబ్ది గోల్ పోస్ట్ వైపు వేగంగా బాల్‌ని తీసుకువెళుతున్నాడు.
ప్రత్యర్థి టీం మెంబర్స్ అతడి వేగాన్ని, బాల్ మూవ్ చేసే విధానాన్ని నిరోధించలేకపోతున్నారు.
స్టూడెంట్స్ అరుపులు, కేకలు, విజిల్స్ మధ్య అతడు చెలరేగి పోతున్నాడు.
ఆకాశ్‌కి అతడిపై జలసీగా వుంది. అతడు తన టీం మేట్ అయినా .. సరిగ్గా అర్జున్‌కి సహకరించడం లేదు.
తమ జట్టు గెలిస్తే ..ఆట తాలూకు క్రెడిట్ పూర్తిగా అతడే తీసుకుంటాడేమోనని చిరాగ్గ వుంది ఆకాశ్‌కి!
ఫస్ట్ హాఫ్‌లో ఏ జట్టు గోల్ సాధించలేదు.
సెకండ్ హాఫ్‌లో.. కోచ్ సూచన మేరకు టీం కెప్టెన్ అయిన ఆకాశ్ తప్పనిసరి పరిస్థితులలో అర్జున్‌కి సహకరిస్తున్నాడు. వీలైతే తనే గోల్ సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆట చివరి పది నిమిషాలవరకు ఏ జట్టు గోల్ సాధించలేదు.
ప్రత్యర్థి జట్టు గత యేడాది ట్రోఫీ విన్నర్! హోరహోరీ గా జరుగుతుంది ఆట. స్టేడియం ఆంతా ఆసక్తిగా మ్యాచ్ చూస్తున్నారు. ఉత్కంటభరితంగా జరుగుతున్న ఆ మ్యాచ్‌లో చివరి పదినిమిషాల్లో జరిగింది అద్భుతం ..
అర్జున్ ఇచ్చిన బలమైన కిక్‌ని నిరోధిచలేక పోయాడు ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్. జరుగుతుందేంటో అర్దమయ్యేలోపు.. మరో గోల్ సాధించాడు అర్జున్. ఆట ముగిసింది!
2-0 గోల్స్ తో ‘రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ‘ ఆపోజిట్ టీం పై ఘనవిజయం సాధించిది.
..తమ జట్టు గెలిచిన ఆనందంలో ఇక అర్జున్‌ని అభినందించక తప్పలేదు ఆకాశ్‌కి!
“యు ఆర్ గ్రేట్ అర్జున్!” మనస్సులోనే అనుకుంది వైష్ణవి.
అందరూ గెలిచిన టీంని అభినదించారు.
బైక్ స్టాండ్ దగ్గరకి వెళ్ళిన ఆకాశ్.. తన బైక్ తీసుకుని గ్రౌండ్ దగ్గరకి వచ్చాడు. బైక్ ఎక్కి కూర్చుంది వైష్ణవి. “Congratulations అన్నయ్యా” అంది.
“Thank you… వైష్ణవి “అన్నాడు చిరునవ్వుతో …
* * *
అర్ధరాత్రి పన్నెండు గంటలకి హఠాత్తుగా మెలుకువ వచ్చింది అర్జున్‌కి. చుట్టూ చూశాడు. తల్లి కనిపించలేదు. తండ్రి అతడి చిన్నతనంలోనే, తను ఆరవ తరగతి చదువుతుండగా కోల్పోయాడు.
నాటి నుండి అతడికి తల్లీ తండ్రి ..సర్వస్వం అమ్మే!
డిగ్రీ చదువుకున్న సౌజన్య ఓ ప్రైవేట్ స్కుల్ లో టీచర్‌గా వర్క్ చేస్తుంది .
‘అమ్మ ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్ళి వుంటుంది ‘ అనుకుంటూ బయటకి వెళ్ళి చూశాడు.
“అమ్మా…” అంటూ పిలిచాడు. ఎటువంటి స్పందన లేదు.
స్నేహితుడు విజయ్‌కి ఫోన్ చేసాడు. జరిగింది చెప్పాడు.
ఇద్దరూ కలసి అర్ధరాత్రి తెలిసినవాళ్ళ అందరి ఇళ్ళకు వెళ్ళారు. అమ్మ జాడ తెలియకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు అర్జున్.
విజయ్ “అమ్మ.. ఎక్కడికి వెళ్ళిందో తప్పకుండా ఉదయానికల్లా తెలుస్తుంది, అధైర్యపడవద్దు” అంటూ స్నేహితుడు చెబుతుంటే కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.
ఉదయం ఎనిమిది గంటలకి కూడా సౌజన్య ఎక్కడ వుందో మిత్రులిద్దరూ తెలుసుకోలేక పోయారు.
ఉదయం పదకొండుగంటలకి ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ వుంది.
ఆందోళనగా పోలీస్ స్టేషన్ వైపు నడిచారు.
“అర్జున్! జరిగిందంతా ఆకాశ్‌కి చెబుదామా?” అడిగాడు విజయ్.
“అమ్మకేమీ కాదు. తను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళివుంటుంది. రాత్రి నేను పడుకునేటప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడింది కూడా!
అలాగే నన్ను ఆటలో బాగా ఆడమంటూ తను చదివిన, ఎందరో ఫుట్‌బాల్ విజేతలు తొలినాళ్ళలో ఎదుర్కున్న పరాజయాల గురించి .. నాలో స్ఫూర్తి రగిలేలా చక్కని విషయాలు చెప్పింది.
నాటి డీగో మారిడోనా నుండి నేటి ఫుట్ బాల్ జగజ్జేతలు రొనాల్డో, మెస్సీల వంటి వారి గురించి చెప్పింది.”
వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుని వూరి చివర వున్న చెరువుదగ్గర ఓ ఆడమనిషి మృతదేహం వున్నట్లు తమకు కబురు అందిందని అందుకే బయలుదేరుతున్నామని చెప్పారు పోలీసువాళ్ళు.
కళ్ళనిండా నిండిన కన్నీటిని తుడుచుకుంటూ అర్జున్… స్నేహితుడు, పోలీసులతో కలసి ఆ చెరువువైపు బయలుదేరాడు. చెరువును సమీపిస్తుంటే అర్జున్‌కి దుఃఖం ఆగలేదు. అయినా గుండె నిబ్బరం చేసుకుని జీప్ దిగాడు.
పోలీసులు రావడంతో అప్పటి వరకూ గుమి గూడి వున్న ప్రజలు ప్రక్కకి జరిగారు. ఆ మృతదేహం తన తల్లి కాదు.
…అంటే అమ్మ ఎక్కడికి వెళ్ళి వుంటుంది? ..ఇలాగే అమ్మకేమైనా అయిందా?
విజయ్‌ని పట్టుకుని మౌనంగా వుండిపోయాడు కొద్దిసేపు!
అప్పుడు సమయం తొమ్మిదిగంటలు.. విజయ్ కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నట్లుగా ..
“పద అర్జున్! ఆటకి కనీసం ఒక గంట ముందుగా వుండాలి. అమ్మకేమీ కాదు. నువ్వు ఆటలో పాల్గొను. నేను అమ్మకోసం ప్రయత్నిస్తాను” అంటుంటే..
ఫైనల్ మ్యాచ్‌కి వేదికైన విశాఖ స్టేడియం వైపు దొరికిన బస్ పట్టుకుని బయలుదేరారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న యువకులు, పెద్దలు, పిల్లలతో స్టేడియం అంతా కోలాహలంగా వుంది.
“ఏమైది అర్జున్? ఆలస్యంగా వచ్చావు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది. ఇందాకే తెలిసింది నాకు ..అమ్మ కనిపించడం లేదని?” ఆందోళనగా అడుగుతున్న ఆకాశ్‌తో జరిగిందంతా సింపుల్‌గా వివరించాడు.
“కమాన్ డ్రస్సప్ అవ్వు” అంటూ డ్రెస్సింగ్ రూంకి వెళ్ళమంటూ తను టాస్ కోసమని ఆపోజిట్ టీం కెప్టెన్‌తో కలసి స్టేడియం లోకి నడిచాడు.
తన డ్రెస్సులో వున్న ఓ కాగితం చదవగానే అతడి నుదుటి పై చెమటలు పట్టాయి. పరుగెత్తుకుంటూ వెళ్ళాడు స్టేడియంలో వున్న స్నేహితుడి దగ్గరకి. ఇద్దరూ కలసి కొద్ది క్షణాలు మాట్లాడుకున్నారు. కొద్ది సమయం సంశయంతో స్తాణువై నిలబడిపోయాడు.
“అమ్మని వాళ్ళేమైనా చేస్తారేమోరా విజయ్! నేను ఈ ఆట ఆడలేను” అన్నాడు నిరాశగా..
ఏదో ఆలోచన వచ్చినట్లుగా విజయ్ “అమ్మకేమీ కాదు! మనస్సులో ఆందోళనలు పక్కన పెట్టి.. నువ్వు బయలుదేరు. ఆల్ ది బెస్ట్” అన్నాడు.
ఆ కాగితం విజయ్‌కి అందించి ఆటకి సమయం అవడంతో స్టేడియంలోకి ప్రవేశించాడు అర్జున్ .
ఆ కాగితంలో వున్న వార్నింగ్ మరొక్కసారి చదువుకున్నాడు విజయ్.
“అర్జున్! మీ అమ్మ మా వద్ద క్షేమంగా వుంది. నువ్వు ఫైనల్ మ్యాచ్ ఆడవద్దు. ఆడావంటే నీ తల్లి నీకు ప్రాణాలతో దక్కదు. తల్లి కావాలో, మ్యాచ్ కావాలో నిర్ణయించుకో.
నువ్వు మ్యాచ్ లో దిగిగిన కొద్ది నిమిషాల్లో నీ తల్లి ప్రాణాలు గాల్లో తేలిపోతాయి. నువ్వు మ్యాచ్‌లో పాల్గొనకపోతే సాయంత్రం అయ్యే సరికి మీ అమ్మ నీ ఇంటిగుమ్మం ముందు వుంటుంది. మ్యాచ్ కావాలా? అమ్మ కావాలో…. తేల్చుకో..! “
ఇక ఆలస్యం చేయలేదు విజయ్, తాను అనుకున్న ఆలోచనని అమలుపరచడానికి వేగంగా అక్కడి నుండి కదిలాడు.
ఆట ప్రారంభమయింది. మొత్తం 28 టీంలు పాల్గొన్న ఆ టోర్నమెంట్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం విజేతలుగా నిలిచిన టీం కి ఎన్నో ప్రొత్సాహకాలు వుంటాయి.
ఈ సంవత్సరం ఫైనల్‌కి చేరిన రెండు టీంలు కూడా స్థానిక కాలేజ్ లు కావడం, అందునా ఆ కాలేజ్‌ల వ్యవస్థాపకులు రాజకీయంగా కూడా ప్రత్యర్థులు కావడం.. ఆటలో మరింత టెన్షన్‌కి కారణం అయ్యింది.
ఈ సంవత్సరం క్యాష్ ప్రైజ్ 50 లక్షలకి చేరడంతో పోటీ మరింత తీవ్రంగా మారడానికి మరోకాణం.
నాగేంద్ర … ప్రత్యర్థి టీం కెప్టెన్ !
అతడు ఒక్కడే మ్యాచ్ ని గెలిపించుకు రాగల సత్తా కలిగిన వాడు.
మెలితిరిగిన కండలతో యాక్టివ్‌గా వుంటాడు. నాగేంద్ర ఫస్ట్ కిక్ తో ఆట ప్రారంభించాడు. బంతిని వెంబడించిన ఆకాశ్ మొదటి పదినిమిషాల్లో నే తొలి గోల్ సాధించి తన టీంని చైతన్యపరిచాడు. కాస్త డల్‌గా ఆడుతున్న అర్జున్ వైపుగా బాల్‌ని తరలించాడు నాగేంద్ర.
మరి కొద్ది సమయం లోనే రెండోగోల్ సాధించాడు నాగేంద్ర.
ఫస్ట్ హాఫ్ పుర్తయ్యే సమయానికి నాగేంద్ర టీం 2-1 గోల్స్ తో ముందంజలో వుంది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యింది.
కోచ్, ఆకాశ్ సూచన మేరకు ప్రక్కన కూర్చున్నాడు అర్జున్. అతడి కళ్ళు స్టేడియం అంతా గాలిస్తున్నాయి.. విజయ్ ఏమైనా కనిపిస్తాడేమోనని!
దూరం నుండి చేయి ఊపుతున్న వైష్ణవి ని గమనించాడు. ఆట తిరిగి ప్రారంభం కాగానే .. 3-1 స్కోర్‌తో నాగేంద్ర టీం విజయం దిశగా వుంటుంది. స్టేడియం అంతా నాగేంద్ర టీం గెలవాలంటూ బ్యానర్స్ ఊపుతున్నారు.
‘రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ‘ స్టుడెంట్స్ నిరుత్సాహంగా ఓటమిని అంగీకరించడానికి సిద్దపడ్డారు.
గత చాలా పోటీలలో తమ జట్టు లీగ్స్ దశ లోనే వెనుదిరిగింది.. ఈసారి తమజట్టు ఫైనల్ దాకా చేరుకోవడమే గ్రేట్ అనుకుంటున్నారు. ఆ దశలో కూడా తమ కాలేజ్ టీం గెలవాలని కోరుకుంటుంది వైష్ణవి.
వైష్ణవి మనస్సంతా ఆందోళనగా వుంది. అర్జున్ ఆటలో దిగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తుంది.
ఆట కొద్దిసమయం ఆగింది. ఆకాశ్ నేరుగా కోచ్ దగ్గరకి వచ్చాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. ఆట తిరిగి ప్రారంభమయ్యింది. బాల్‌ని వేగంగా, మెరుపులా ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు తరలిస్తున్నాడు అర్జున్.
గోల్ కీపర్ అలర్ట్ అయ్యేసరికి రెండు గోల్స్ సాధించాడు అర్జున్. అంతే స్టేడియం అంతా ఒక్కసారిగా గోల ప్రారంభయ్యింది.
“కమాన్.. అర్జున్” అర్జున్ పేరు స్టేడియం అంతా మారుమ్రోగుతుంది.
3-3 స్కోర్స్ తో ఇరు జట్లు సమంగా వున్నాయి.
మరోసారి బాల్‌ని చేరుకున్న అర్జున్ వేగంగా మెరుపులా తన టీం మేట్స్‌కి బాల్ అందిస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు కదులుతున్నాడు.
అప్పుడు నాగేంద్ర బాల్‌కి ఇచ్చిన కిక్ అర్జున్‌ని టార్గెట్ చేస్తూ ఇవ్వడంతో అర్జున్ ఎగిరి కిందపడ్డాడు. మోచేతికి బలమైన గాయం అయ్యింది. నిజానికి ఆ దెబ్బ తలకి తగలవలసింది. ధారగా రక్తం కారడంతో కొద్దిసేపు ఆట ఆగింది.
సమయం మరో పది నిమిషాలే మిగిలి వుంటుంది.
“అర్జున్ నువ్వు ప్రక్కన కూర్చో” అన్నాడు ఆకాశ్.
కోచ్ కూడా అతడినే సమర్థించడంతో అర్జున్‌కి ఏం చేయాలో తెలియదు. ఒకసారి అటూ ఇటూ పరిగెత్తి మోచేతికి అయిన గాయాన్ని, నెప్పిని లెక్క చేయకుండా బాడీ మూమెంట్ చూపించాడు.
ఆట తిరిగి ప్రారంభమయింది.
బాల్ ఆకాశ్ టీం కి అందకుండా కిక్ ఇస్తూ.. గోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నాగేంద్ర !
మరో రెండునిమిషాలు మాత్రమే సమయం మిగిలివుంది.
స్టేడియం వైపు పరిశీనగా చూస్తాడు అర్జున్. “కమాన్ అర్జున్” అన్నట్లుగా.. తన మిత్రుల అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి అతడికి.
విజయ్ రెండు చేతులు ఊపుతూ ఏదో సైగ చేశాడు. వైష్ణవి తనని సెమీఫైనల్స్‌లో అభిననందించిన క్షణాలు అతడి కళ్ళముందు ఓ క్షణం పాటు కదిలాయి.
అంతే సునామీలా దూసుకువస్తున్న అతడి వేగాన్ని… అస్సలేం జరుగుతుందో నాగేంద్ర టీం మెంబర్స్ అర్థం చేసుకునేసరికి అతడు తన టీం మేట్స్‌తో కలసి ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు బాల్ తరలించడమే కాకుండా… మెరుపులా బాల్‌కి కిక్ ఇస్తూ .. ఆటలో చివరి నిమిషంలో గోల్ సాధించాడు అర్జున్.
4-3 స్కోర్ తో ‘రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ‘ విక్టరీ సాధించింది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది.
అందరూ తమని అభినందిస్తుంటే.. అందరికీ థ్యాక్స్ చెబుతూ పరిగెత్తుతూ స్నేహితుడు విజయ్ దగ్గరకి వెళ్ళాడు.
విజయ్ పోలీసులతో వున్నాడు అక్కడ..! కొద్ది దూరంలో వున్న తల్లి దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళి “అమ్మా..” అని పిలుస్తూ తల్లిని కౌగిలించుకున్నాడు.
“కంగ్రాట్స్ రా అర్జున్” అమ్మ మాటలు విని సంతోషంగా విజయ్ దగ్గరకి వెళ్ళాడు.
విజయ్ మిత్రుడ్ని ఉద్దేశించి చెప్పాడు – “నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళక .. నేను ఆట రిఫరీ గారి దగ్గరకి వెళ్ళాను. ఆయన అనుమతితో.. నేను, సి.ఐ క్రాంతికుమార్ గారు ఇద్దరం సి.సి. కెమేరాలో నిక్షిప్తమైన మీ డ్రెస్సింగ్ రూం వీడియోస్ చూసాము. నువ్వు ధరించిన నెంబరు గల డ్రెస్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని వీడియోలో గుర్తించాము. వాడిని పట్టుకుని సి.ఐ గారు నాలుగు తగిలిస్తే వాడు మొదట నాకేమీ తెలియదని బుకాయించాడు. తరువాత అమ్మనెక్కడ దాచారో చెప్పాడు.
ఇదంతా ఎవరు చేస్తున్నారని వాడి పోన్ కాల్ డేటా అంతా పరిశీలించాము. ఇదంతా నాగేంద్ర చేసిన పని. నువ్వు ఈ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళు తేలికగా గెలవవచ్చని ఊహించారు. అందుకే నిన్ను ఎలాగైనా ఆడకుండా చేయాలని ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. ఇదంతా చేసింది నాగేంద్రని ఇప్పుడే తెలిసింది.”
మిత్రుడు విజయ్ చెప్పిన మాటలు విని ‘నిజమా?’ అనుకున్నాడు.
కానీ పోలీసులు అతడి చేతులకు బేడీలు వేసి తీసుకువెళుతుంటే అప్పుడు నాగేంద్ర వైపు చూశాడు. నాగేంద్ర దగ్గరకి వెళ్ళాడు.
“ఆటని ఆటలా చూడాలి. గ్రౌండ్‌లో వున్నంతసేపు మాత్రమే మనం ప్రత్యర్థులం. బయటకు వచ్చాక అందరం స్నేహితులమే. కాని నువ్వు చేసిన పని వల్ల నేను ఎంతో మానసిక క్షోభకి గురయ్యాను. ఇక ముందెప్పుడూ ఇలా చేయవద్దు” అన్నాడు.
తన తప్పును అంగీకరిస్తున్నట్లుగా “సారీ అర్జున్!” అంటుండగా పోలీసులు అతడిని తమ జీపువైపు నడిపించారు.
ఆకాశ్, వైష్ణవి.. వాళ్ళ నాన్నగారు విశ్వనాధం, జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్.. అందరూ అతడిని మనస్పుర్తిగా అభినందించారు.
ఆకాశ్, తన టీం మేట్స్‌తో కలసి స్టేడియం మధ్యలో ట్రోఫీ… అర్జున్ తీసుకుంటుంటే తృప్తిగా నవ్వుకుంది వైష్ణవి.
కుమారుడి విజయాన్ని కళ్ళరా చూడలేకపోయినా.. ఎందరో ప్రముఖుల సమక్షంలో అర్జున్ ట్రొఫీ అందుకోవడం సౌజన్యకి ఎంతో సంతోషం కలిగించగా.. ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఆనందబాష్పాలు కళ్లలో నిలిచిపోయాయి.
‘మ్యాన్ ఆఫ్ ద టోర్నెమెంట్’ అంటూ అర్జున్ పేరు ప్రకటించగానే… విశాఖ స్టేడియం చప్పట్లతో మారుమ్రోగింది.
విజేత.. అన్న పదానికి నిలువెత్తు రూపంగా నిలిచిన తన కుమారుడిని మనస్సులోనే అభినందించింది సౌజన్య.