నీలమత పురాణం – 19

0
4

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కః ప్రజాపతి రుహిష్టః కశ్యపశ్చ ప్రజాపతిః

తేనాసౌ నిర్మితో దేశః కశ్మీరాఖ్యో భవిష్యతి

కం వారి హరిణా యస్మాహేనా దస్మాద పాకృతమ్

కశ్మీరాఖ్యం తతో పశ్య నామ లోకే భవిష్యతి

ప్రజాపతిని ‘క’ అంటారు. కశ్యపుడు ప్రజాపతి. కశ్యప నిర్మితమైన ఈ ప్రాంతాన్ని కశ్మీరమంటారు. బలరాముడు ఇక్కడి నుంచి నీటిని తన హలంతో పైకి వచ్చేట్టు చేశాడు కాబట్టి ఇది కశ్మీర దేశం.

మనుషులు నాగుల దేశంలోకి వచ్చి ఉంటారు కాబట్టి వారు నాగులను పూజించాలనీ, గౌరవించాలని ఆదేశించిన విష్ణుమూర్తి, కశ్యపుడి వల్ల నిర్మితమన ఆ దేశానికి ‘కశ్మీర దేశం’ అన్న పేరును సుస్థిరం చేశాడు. ఇలా ఆ ప్రాంతానికి కాశ్మీరం అన్న పేరు వచ్చింది.

అదృష్టం ఏమిటంటే, కశ్మీరం కొన్ని వందల సంవత్సరాలు తురకల ఆధిక్యంలో ఉన్నా పేరు మార్పిడికి గురి కాలేదు. దాంతో ఈనాటికీ మనం కశ్మీరు ప్రాచీనతను స్మరించుకునే వీలు చిక్కుతుంది. భగవంతుడు విష్ణువు వచించినట్లు కశ్మీరులో పిశాచాలు బలహీనమవుతాయి. తాత్కాలికంగా వారు శక్తిమంతులయినా వారి విజయం తాత్కాలికమే.

యై వోమా సైవ కశ్మీరా యస్మాత్తస్మాద్భుజలగం

విశోకెత్యాభివిఖ్యాతా భ్రామితా చ తథా మయా

స్త్రీరూపధారిణీ భూత్వా వృద్ధతీర్థే నివస్థితి

కశ్మీరం ఉమాదేవితో సమానం. కాబట్టి కశ్మీరాన్ని నేను రక్షిస్తూ ఉంటాను. ఉమాదేవి స్త్రీ రూపం ధరించి వృద్ధ తీర్థంలో నివసిస్తుంది.

ఈ శ్లోకం రాజ తరంగిణిలో కల్హణుడు శ్రీకృష్ణుడితో అనిపించిన ‘కశ్మీరాః  పార్వతీ’ శ్లోకానికి ప్రేరణ అనిపిస్తుంది. కశ్మీర రాజును సంహరించిన తరువాత కశ్మీరాన్ని ఆక్రమించమని ప్రోత్సహించిన మంత్రులతో శ్రీకృష్ణుడు “కశ్మీరం పార్వతితో సమానం. కశ్మీరం వైపు కన్నెత్తి చూడడం పాపం” అంటాడు. ఆరంభం నుంచి కశ్మీరం భారతదేశ ధార్మికతలో, మనస్తత్వంలో ఆక్రమించిన ప్రత్యేక స్థానాన్ని స్పష్టం చేస్తుంది కశ్మీరం పార్వతి అన్న భావన. కైలాసం శివుడు అయితే కశ్మీరం పార్వతి. ఈ రకంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతము భగవన్మయమై, పవిత్రమై భారతీయులందరికీ అత్యంత పూజనీయమైనది. ఇది అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పాశ్చాత్య భావనలను సిద్ధాంతాలను భారతదేశానికి అన్వయించి చూపి భారతీయుల అజ్ఞానాన్ని ఎత్తి చూపించాలని ప్రయత్నించే వారంతా గమనించాల్సిన అంశం ఇది.

భారతదేశంలో ప్రతిదీ ధర్మంతో ముడిపడి ఉంటుంది. ధర్మం లేనిదే ఈ దేశంలో ఏమీ లేదు. కశ్మీరం పార్వతితో సమానం. బద్రీనాథ్ కేదార్నాథ్‌లు విష్ణుమయం. వారణాసి అత్యంత పవిత్రం. ద్వారక కృష్ణమయం. పూరి జగన్నాథమయం. భువనేశ్వర్ లింగరాజసదనం. కలకత్తా కాళిక. ముంబై లక్ష్మీదేవి. మైసూర్ చాముండేశ్వరి దేవి. కేరళ పరశురామ నిర్మితం. కంచి, తంజావూరు, మధుర, రామేశ్వరం అత్యంత పవిత్రం. ఇలా దేశంలోని ప్రతి ప్రాంతం ఏదో ఒక రూపంలో ధార్మికంగా అత్యంత పవిత్రం మాత్రమే కాదు, అది అందరిదీ. అంటే, ధర్మ భావన అన్ని అడ్డంకులనూ, ప్రతిబంధకాలనూ సంకుచితాలను దాటి ఈ దేశ ప్రజలను, పూలకు దారం అల్లి ఒక చోట కూర్చిన్నట్టు ఏకత్రితం చేస్తుందన్నమాట.  ప్రధాన పవిత్ర ప్రదేశాలే కాదు, చిన్న వూళ్ళు, కుగ్రామాలు కూడా గ్రామదేవతలతో, గ్రామదేవతలతో, ఇతర దేవీ దేవతల ఆలయాలతో పవిత్ర ప్రదేశాలుగా అలరారుతాయి. ప్రత్యేకమయిన స్థలపురాణాలుంటాయి. ఈ రకంగా ప్రతిచిన్న గ్రామం కూడా ఏదో ఓ రూపంలో ప్రధాన పవిత్రస్థలాలతో సంబంధం కలిగివుంటాయి. అంటే చిన్న కాలువలు, పెద్ద నదులతో కలిసి, పెద్ద నదులు, ఇంకా పెద్ద నదీజలాలతో కలిసి, మహానదులనేర్పాటు చేసి జలం సర్వం సముద్రంలో కలిసి అనంతపాథోరాశి అయినట్టు… దేశమంతా ధార్మికంగా ఒక మహాసాగరంగా నిలుస్తుంది. ఇదీ భారతీయ ధార్మిక సమాజం..ఇదే భారతీయసమాజంలో పాశ్చాత్య దేశభక్తి భావనను మించి ఎదిగిన ధర్మభక్తి భావన.  ఇక్కడ దేశ భావనకి పాశ్చాత్యుల నిర్వచనం ప్రకారం ప్రాధాన్యం లేదు, ప్రాధాన్యం ధర్మానికే. అధర్మపరులు రాక్షసులు. ధార్మికులు దేవతలు. అందుకే ఋషి సంతానమైన తాటకి, రావణాసుర, శూర్పణఖలు రాక్షసులు అయ్యారు. మానవ సంతానమైన రాముడు, వానరుడైన హనుమంతుడు దైవాలయ్యారు. ఇక్కడ ధర్మం దైవం. ధర్మం దేశం. ధర్మమే సర్వం. ఇది అర్థం చేసుకోలేనివారు భారతదేశం అన్న భావన స్వాతంత్రానికి పూర్వం లేదు అని భావిస్తారు, వాదిస్తారు, ప్రచారం చేస్తారు. పాశ్చాత్య భావనా బద్ధులైన వారికి నమస్కారం చేస్తూ, సమస్త భారతదేశంలో విస్తరిల్లి ప్రజలను ఒకటిగా నిలిపిన భారతీయ ధార్మికతకు ప్రణమిల్లుతూ ముందుకు సాగుదాం.

కశ్మీరు ఉమాదేవికి ప్రతిరూపం అని చెప్పిన విష్ణువు కాశ్మీరులో వాసుకి నివసిస్తాడని చెప్తాడు. నీలుడిని కూడా కశ్మీరులో నివసించమని ఆదేశిస్తారు .

“నాగులారా, ఈ పవిత్ర స్థలంలో నాగుల రాజు నాగరాజు వాసుకి నివసిస్తాడు. అతడిని పూజించండి. వాసుకి నా అంశ. వాసుకి ఆజ్ఞలను ధిక్కరించినవాడు నా కోపాన్ని భరించాల్సి వస్తుంది. నా చేతిలో నాశనమైపోతారు వారు. నాగులు ‘భోగవతి’ అన్న నగరంలో ఉంటారు. వాసుకి భోగవతిలో ఉంటాడు” అలా ఆజ్ఞాపించిన విష్ణువు నివాసానికి వెళ్లి పోయాడు.

దేవతలు, ఋషులు, నాగులు, గంధర్వులు వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. నాటినుండి సంవత్సరంలో ఆరు నెలలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసించడం ఆరంభించారు. మరో ఆరు నెలలు పచ్చి మాంసం తినే పిశాచాలు నివసిస్తాయి.

మనుషులు ఆహార ధాన్యాలు మూటగట్టుకొని ఆరు నెలల తర్వాత వెళ్ళిపోతారు. మళ్లీ చైత్రమాసం పౌర్ణమి రోజున తిరిగి వస్తారు.

గమనిస్తే, ఈనాటికి పాలకులు ఆరు నెలలకోమారు చలికాలంలో జమ్మూకి రాజధానిని తరలిస్తారు. ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర ఫలితాల వల్ల చలికాలంలో కూడా ప్రజలు కశ్మీర్‌లో జీవించగలుగుతున్నారు. అప్పటి కాలంలో మంచు విపరీతంగా కురిసేది. మనుషులు ఆ ఆరు నెలలు కశ్మీర్‌లో నివసించడం కష్టంగా ఉండేది. అదీ ఈ ఆరు నెలల నియమం వెనుక ఉన్న కారణం.

కశ్మీర్లో మానవులు నాగులు కలిసి మెలిసి జీవించడం చూసిన కశ్యపుడు సంతోషించాడు. కేశవుడిని ప్రార్థించాడు. కశ్మీరాన్ని పవిత్రం చేయమని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. కశ్యపుడి ప్రార్థనను మన్నించిన దేవతల జనని అదితి కూడా ‘త్రికోటి’ అనే నదిగా ప్రవహిస్తూ కాశ్మీరును పరిశుద్ధం చేయడం ఆరంభించింది. కశ్యపుడి ప్రార్థన ప్రకారం ఇంద్రుడి భార్య శచీదేవి కూడా ‘హర్షపథ’గా మారింది. కశ్యపుడి సలహా ప్రకారం దితి ‘చంద్రావతి’ నదిగా ప్రవహిస్తోంది. యమున కొద్ది భాగాన్ని ‘వితస్త’గా ప్రవహింపచేయడం ఆరంభించింది. అంతా కశ్యపుడి ఆజ్ఞానుసారం దేవతల తల్లులు, దేవతలు, ఋషిపత్నులు పవిత్ర నదులై కాశ్మీరంలో ప్రవహించటం ప్రారంభించాయి.

ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది. సాధారణంగా మనలో మన పూర్వీకుల వైజ్ఞానిక విజ్ఞానంపై చులకన అభిప్రాయం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు… ప్రతిదాని గురించి చులకన అభిప్రాయం ఉంది. అన్నీ కట్టుకథలని, కల్లబొల్లి కబుర్లని అనుకుంటాం. కానీ ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను – మన ప్రాచీన గ్రంథాలలో పొందుపరిచిన విషయాలను పక్క పక్కనపెట్టి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి అందించిన సమాచారం, విమానాలు హెలికాప్టర్లలో ఎగురుతూ అత్యాధునిక పరికరాల ఆధారంగా సేకరించి విశ్లేషించి తేలిన అంశాల ఆధారంగా తెలుసుకున్న విషయాలు; ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా సాంకేతిక పరికరాలు లేకుండా ఆనాటి ఋషులు తెలిపిన సత్యాలు దాదాపు ఒకటే కావడం విశేషం. వారికి జాగ్రఫీ తెలియదు, జియాలజీ తెలియదు, వాటి సూత్రాలు అప్పటికి లేవు. కార్టోగ్రఫీ తెలియదు. అయినా సరే వారు తమ శ్లోకాలలో ద్వారా ప్రకటించిన సత్యాలు, పదాలతో గీసిన చిత్రాలు – ఆధునిక శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్న సత్యాలతో సరిపోతాయి. ఇది ఎలా సాధ్యం అయింది? అంటే మనము అనుకుంటున్నంత అజ్ఞానంలో లేరన్న మాట. వారిని అజ్ఞానులు అనుకుంటున్న మనమే అజ్ఞానులమన్న మాట.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here