మ్యూజిక్ టీచర్ : వొక అపస్వరం

0
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని సన్నివేశాలు, మధ్య మధ్య కవితాత్మక సంభాషణలు విడివిడిగా చూస్తే నచ్చుతాయి గాని యేకసూత్రత లోపించి అసంతృప్తి కలుగుతుంది” అంటున్నారు పరేష్. ఎన్. దోషి ‘మ్యూజిక్ టీచర్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య థియేటర్లలో విడుదల కోసం కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి మాధ్యమాల ద్వారా కొన్ని సినెమాలు తీసి విడుదల చేస్తున్నారు. అలాంటివి అన్నీ బాగుంటాయని అనను, కాని కొంత స్వేచ్చతో తీయడం వలన ఆకర్షిస్తాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన “మ్యూజిక్ టీచర్” గురించి నాలుగు మాటలు.

బేని మాధవ్ (మానవ్ కౌల్) వొక నడివయసు సంగీతం మేష్టారు. తల్లి, చెల్లెలుతో సిమ్లా లో వుంటాడు. భుక్తి కోసం సంగీతం పాఠాలు చెప్పడం, అప్పుడప్పుడు హోటెళ్ళలో పాటలు పాడడం చేస్తూ వుంటాడు. తండ్రి పేరు పొందిన సంగీత విద్వాంసుడు. కాని బేనికి మాత్రం సినెమా సంగీతం యెక్కువ ఇష్టం. ముంబైలో కొన్నాళ్ళు ఆ ప్రయత్నాలు కూడా చేసి వుంటాడు. కాని అతనికి కాలం కలిసి రాదు. అలాంటి సమయంలో జ్యోత్స్న (అమృతా బాగ్చి) అనే అమ్మాయికి సంగీత పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఆ పాఠాలు వాళ్ళిద్దరినీ మరింత దగ్గర చేస్తాయి. ఆమెకు లోకం పట్టదు, అతన్నే చేసుకుని ఆ లోయల్లోనే జీవితమంతా సంగీత స్వరాల మధ్య గడిచిపోవాలని కోరిక. చిత్రం మొత్తం కనబడే ఆ అందమైన ప్రకృతి లాంటి స్వభావం గల అమ్మాయి. కాని అతని మనసులో ఆ లోయలకి దూరంగా ముంబై లో సినెమా ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలని వుంటుంది. వొకసారి అనుకోకుండా ఆమెకు వొక సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆమెకు ఇలాంటివి అస్సలు ఇష్టం వుండదు. కాని అతను బలవంత పెడతాడు. ఆమె గనక అందరి కళ్ళల్లో మంచి గాయనిగా పడితే, ముంబైలో అవకాశాలకు బాట వేసినట్టవుతుంది అనుకుంటాడు. ఆమెకు పాట నేర్పి, పోటీలో బలవంతంగా నెడతాడు. అనుకున్నట్టుగానే ఆమె పాట అందరినీ ఆకర్షించి ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వస్తుంది. ఆమె తల్లిదండ్రులు సంతోషిస్తారు. అతను కూడా సంతోషిస్తాడు. ఆమెకు బాలీవుడ్ లో నిలదొక్కుకునే అవకాశం వస్తే తనకూ మంచి దశ వస్తుందని మనసులోపల వో భావం. కాని ఆమెకు ఇష్టం వుండదు, సంతోషించదు. ఆ పేరు, ఆర్భాటమూ వొద్దు పెళ్ళి చేసుకుని ఈ ప్రకృతి నడుమ పాటలాగా జీవితాన్ని గడిపేద్దాం అంటుంది. అతను వినడు. చివరికి ఆమె ముంబై కి వెళ్ళి అక్కడ గాయనిగా పేరు తెచ్చుకుంటుంది, స్టార్ అవుతుంది.

ఇది గడిచి యెనిమిది యేళ్ళు. అతను పంపిన సందేశాలకు, లేఖలకు జవాబు రాదు. అవే ట్యూషన్లు, అదే జీవితం. చెల్లెలి పెళ్ళి కుదురుతుంది. ముందు 25 న అనుకుంటారు పెళ్ళి. కాని 14న వొక సంగీత సభకు జ్యోత్స్న వస్తుందని చెప్పి, ఆమెను అవాయిడ్ చేయడానికి పెళ్ళి అదే రోజున పెట్టుకుంటాడు.

ఇది వీళ్ళిద్దరి కథ అయితే, కొన్ని ఉపకథలు. అతని మిత్రుడి చెల్లెలు వొక ప్రమాదంలో భర్తను కోల్పోయి వుంటుంది. ఆ మిత్రుడేమో రాజకీయాలలో ప్రవేశించి యెదుగుతున్నవాడు. బేనికి ఉద్యోగం ఇప్పించాలని, ఆ విధంగా సాయపడాలని అనుకుంటాడు. కాని బేని ఆ సహాయాన్ని అపార్థం చేసుకుంటాడు. మరో ఉపకథ గీత (దివ్యా దత్తా) ది. ఆమె వివాహం అయితే అయ్యింది. కాని భర్త ఢిల్లిలోనే వుంటూ అక్కడే మరొక అమ్మాయిని చేసుకుని వుండి పోతాడు. తన తండ్రిని కూడా పట్టించుకోని అతను తండ్రిని కూడా గీత దగ్గరికి పంపించేస్తాడు. కొడుకు మీద ప్రేమ చావక, యెప్పుడూ అతని ఫోన్ కాల్ గురించే యెదురు చూస్తూ అలానే ఊపిరి వదులుతాడు ఆ పెద్దాయన. గీత, బేని దగ్గరవుతారు కాని, బేని మనసులో ఇంకా జ్యోత్స్న వుందని ఆమె తప్పుకుంటుంది.

కథకు ముగింపు యేమిటి? అతను జ్యోత్స్నను కలుస్తాడా? వాళ్ళిద్దరూ వొకటవుతారా అన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.

తల్లిగా నీనా గుప్తా, చెల్లెలు ఉర్మి గా నీహారికా, గీత గా దివ్యా దత్తా బాగా చేశారు. కాని అందరికంటే ఆకర్షణీయంగా వున్నది అమాయకపు అమృతా బాగ్చి నే. మానవ్ కౌల్ విషయానికి వస్తే కొంత అసంతృప్తి కలుగుతుంది. బార్ లో మిత్రుడితో వాదన లాంటి కొన్ని సన్నివేశాలలో బాగా చేసినప్పటికీ, ఆ పాత్ర వ్యక్తిత్వానికున్న అనేక ఛాయలను అతను సమర్థవంతంగా చేయలేదనిపిస్తుంది. దర్శకుడు సార్థక్ దాస్గుప్తా కూడా కొంత కారణం. ఆ పాత్రకు వున్న నకారాత్మక నీడలను నొక్కి పెట్టి వొక అపూర్వ ప్రేమ కథలా మలచడానికి ప్రయత్నించాడు. తనకు బాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు కావాలని, అది తన శిష్యురాలి ద్వారా నైనా సరే అనుకోవడం, ఆ స్వార్థం, అది జరగనప్పుడు కలిగే నిరాశ, గింజుకోవడాలు, గుంజాటన ఇలా చాలా చూపించాలి. అన్నిటికీ వొకే బ్లాంక్ ఎక్స్ప్రెషన్. ఆ కోణాల మీద పెట్ట వలసినంత శ్రధ్ధ పెట్టకపోవడం అరుదుగా దొరికే అవకాశాన్ని జారవిడుచుకున్నట్టే. పోనీ పాత కాలం నాటి అభిమాన్ చిత్రం లాంటి మనస్తత్వ పరిశీలన వుందా అంటే అదీ లేదు.

అయినా ఈ చిత్రంలో జమ్ము ప్రకృతి దృశ్యాలు (కౌశిక్ మండల్ చాయాగ్రహణం), మంచి పాటలు ముఖ్యంగా పాపొఁ స్వరంలో బాగా నచ్చుతాయి. నీనా గుప్తా వొక టిపికల్ తల్లిగా, దివ్యా దుత్తా అనవసరమైన మిస్టిక్ గా, గంభీరంగా చూపించడం, మధ్య మధ్య కవితాత్మక సంభాషణలు. విడివిడిగా చూస్తే నచ్చుతాయి గాని యేకసూత్రత లోపించి అసంతృప్తి కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here