దిశ-1: ఎటు పోతున్నాం?

0
3

[box type=’note’ fontsize=’16’] “ఇతరుల లాగా కాకుండా ఎవరికి తగిన, నచ్చిన విధంగా వారు ఉంటే అనుకున్నది సాధించటం, గమ్యం చేరటం చాలా సహజంగా జరిగిపోతుంది” అంటున్నారు అనంతలక్ష్మి ఈ వారం ‘దిశ‘ కాలమ్‌లో. [/box]

[dropcap]అం[/dropcap]దరం నడుస్తూనే ఉన్నాం. ఉంటాం కూడా. ఆగితే ఏముంది?…… కనుక సాగుతూనే ఉంటాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వెడుతున్నది ఎటువైపు? అన్నదే చాలా మందికి తెలియదు. లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. అదెప్పుడు కుదురుతుంది? మన గమ్యం ఏమిటో తెలిసినప్పుడు. అది తెలుసుకోటానికి జీవిత కాలం పడుతుంది చాలామందికి. అదొక్కటి తెలిస్తే సఫలీకృతులైనట్టే. అందరికీ ఒకటే లక్ష్యం లేదా గమ్యం, లేదా ఆశయం ఉండవు. మనిషి జీవలక్షణాన్ననుసరించి మారుతూ ఉంటాయి.

కాని, ప్రస్తుతం తీరు గమనిస్తే ఎక్కువ మంది గొర్రెలే. మనకి తగినదా? ఉపయోగ పడుతుందా? అని ఆలోచించే వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. ఎంత సేపు ఎవరినో అనుకరించటం, కొన్ని సందర్భాలలో అంటే తమకి ఎక్కువ ఇబ్బంది కానప్పుడు అనుసరించటం చేస్తూ ఉంటారు. దీనినే గొర్రెపోతు మనస్తత్వం అంటారు. ఈ మాట అనగానే కోపం వచ్చేస్తుంది. తప్పు లేదు. రావాలి కూడా! మనుషులందరిలో వారు పరిణామక్రమంలో దాటి వచ్చిన జంతులక్షణాలు ఛాయామాత్రంగా ఉంటాయని కదా డార్విన్ మహాశయుడి ఉవాచ. అయితే ఎవరిలో ఏ జంతులక్షణాలు ఏ మాత్రంగా ఉన్నాయన్నది గమనిస్తే అర్థమవుతుంది. ఎక్కువ మందిలో కనపడేది మాత్రం ఈ గొర్రెపోతు మనస్తత్వం.

ఎవరో ఒక ప్రముఖ సినిమా నటుడో, నటో, క్రీడాకారుడో, రాజకీయ నాయకుడో – ఎవరో ఒక ప్రముఖ వ్యక్తిని గుడ్డిగా అనుకరించటం యువతరం లక్షణంగా కనపడుతోంది. అనుకరణ నేర్చుకోవటానికి మొదటి మెట్టు అని ఒప్పుకోవాలి. కాని, అక్కడితో ఆగిపోతే మొదటి మెట్టుమీదే ఉండటం జరుగుతుంది. పై మెట్టుకి వెళ్ళం కదా! తల వంచుకుని గుడ్డిగా వెడుతుంటే అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు. వెళ్ళేది ఎక్కడికో అంతకంటే తెలియదు. గమ్యం తెలిసి వెళ్ళటం మంచిది కదా! ఊహ తెలియని రోజుల్లో అమ్మో నాన్నో తీసుకు వెడుతుంటే ఎక్కడికి అని అడిగినవాళ్లే స్వంత తెలివి కాస్త తెల్లారగానే అగమ్యంగా వెళ్ళటం మొదలు పెడతారు. అందుకే చిన్నతనం నుంచి పిల్లలని “వాళ్ళ లాగా ఉండు”, “వీళ్ళ లాగా ఉండు” అని అనటం అంత మంచిది కాదు. అంటే పిల్లలు గొర్రెల్లాగా తయారు కావటానికి పెద్దలు కూడా ఆ విధంగానే ఉండటం కారణం.

తన తోటి ఉద్యోగి ఇల్లు కట్టుకుంటే తానూ కట్టుకుందామనుకుంటాడు. అప్పటిదాకా ఇంకా మంచి ఇల్లు అద్దెకి తీసుకుందామన్న భావనే ఉంటుంది. అదే విధంగా ఎదురింటి వాళ్ళు కొనుక్కున్న టీవీ లాంటిదే కొనుక్కోవాలని తపన పడుతూ ఉంటారు. పక్కింటి ఇల్లాలు కట్టుకున్న చీర వంటిది కొనుక్కుంటే కానీ నిద్ర పట్టదు. సినిమా తారలు వాడిన వస్తువులే వాడాలనుకుంటారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే చదువుల విషయం కూడా అంతే అవటం శోచనీయం. నా పై అధికారి కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కనుక నా పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదవాలి. అంతే! వాళ్ళకి అది ఇష్టమున్నదో లేదో అవసరం లేదు. ఎవరో చేశారు కనుక మేము కూడా చెయ్యాలి. ఎవరి పిల్లలో క్రికెట్‌లో రాణించి పేరు తెచ్చుకున్నారు. ఇంకేముంది? మర్నాడే పిల్లవాణ్ణి క్రికెట్‌లో చేర్చటం. వాడేమో నాకు ఫుట్‌బాల్ ఇష్టమో అని మొత్తుకుంటున్నా సరే! అందరి పిల్లలు అమెరికా వెడుతున్నారు కనుక “మేరా భారత్ మహాన్” అంటున్నా వినిపించుకోకుండా ఎన్‌ఆర్‌ఏ (నాన్ రెసిడెంట్ అమెరికన్) లాగా పెంచటం. ఇతరుల లాగా కాకుండా ఎవరికి తగిన, నచ్చిన విధంగా వారు ఉంటే అనుకున్నది సాధించటం, గమ్యం చేరటం చాలా సహజంగా జరిగిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here