మిర్చీ తో చర్చ-24: ప్రేమ – మిర్చీ… ఒకటే-6

0
4

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]”అ[/dropcap]లా చూస్తారేంటి? నేను సింహాన్ని, నరసింహాన్ని.”

కళ్ళు పెద్దవి చేసాను. నిజమే. నీటుగా టక్ చేసుకుని ఓ టై కట్టుకుని చక్కని మెరుస్తున్న నల్లటి షూలు తొడిగాడు. నల్లటి బ్యాగ్ భుజాన తగిలించాడు. బ్యాగ్ పక్కనపెట్టి దర్జాగా కూర్చున్నాడు.

“బ్యాగ్‌లో ఏముంటుంది?” అడిగాను.

“ప్రస్తుతం రెండు పుస్తకాలు పెట్టాను. ఎవరూ తెరిచి చూడరని అనుకుంటున్నాను.”

సుందరం వచ్చాడు. అతన్ని కిందా మీదా చూసి కూర్చున్నాడు.

“కనిపించేదే ప్రపంచం సార్. పచ్చి మిరపకాయ చుట్టూతా ఆ పిండి ఎందుకు చుట్టాలి? ఇదే ప్రపంచం.”

“అంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కొరుక్కుని తినాలి. అదేనా మీ ఆలోచన?”

“ఎంత మాటండీ? అది పెళ్ళి తరువాత ఎలాగో జరుగుతుంది, జరగాలి కూడాను. చూసారు? పెళ్ళి విషయంలో కతికితే అతకదు అంటారు. ఎందుకో తెలుసా?”

సింహం పెళ్ళి విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. ముందుకు జరిగాడు.

“ఎందుకు సార్?”

“పెళ్ళయిన ఓ పదిమంది మగవారి మెదడులను ఎంచుకుని ఓ పరిశోధనా సంస్థ వారు ఇటీవల కొన్ని పరీక్షలు నిర్వహించారు.”

“వెరీ గుడ్”

“కొన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు.”

“ఓ. ఏవిటి సార్ అవి?”

“మొదటిది, అసలు మెదడులోని నరాలు అలా ఒకసారి కనిపించి, తరువాత మాయమైపోయి అలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాయట.”

సింహం ఎందుకో తల మీద చెయ్యిపెట్టుకున్నాడు.

“అరె! మీకు ఇంకా పెళ్ళి కాలేదు. ఈ పని తరువాత ఎన్నిసార్లైనా చెయ్యవచ్చు. శాస్త్రంలో కూడా ఒకరి నెత్తిమీద ఒకరు చేతులు ఇందుకే పెట్టెయ్యమంటారు పెద్దలు. మెదదు మీద ప్రభావం కోసం అన్నమాట!”

“సార్ మీరు నన్ను భయపెడుతున్నారు.”

“తప్పు మిర్చీ కారంగా ఉంటుందని అందరికీ తెలుసు. అయినా తింటాం.”

“కరెక్ట్. మరీ బాగా లేకపోతే ఓ ముక్క కొరికి పారేస్తాం.”

“అదే తమాషా! పెళ్ళిలో అది కుదరదు. పూర్తిగా తినాలి, కళ్ళల్లోంచి నీరు కారుతున్నా వెర్రి మొహం వేసుకుని అందంగా నవ్వాలి. మింగుడు పడనివన్నీ దిగమింగాలి. చూసారూ, పెళ్ళనేది పెద్ద దగా.”

“నేను ప్రేమించాను.”

“కరెక్ట్.”

“పెళ్ళయిన వారి మెదడులో కనిపించిన రెండవ ప్రక్రియ గురించి చెప్పలేదు.”

“యస్. సింపుల్. పెళ్ళయిన మగవాళ్ళ మెదడు కేవలం నిద్రలోనే పనిచేస్తుందని నిర్ధారించారు. ఇదెలా ఉంది?”

సింహం ఆలోచిస్తున్నాడు.

“మరి ప్రేమిస్తున్న వారి మీద ఇలాంటి పరిశోధనలు జరగవా?”

“సింహం! అసలు ప్రేమ అనేదే ఒక పరిశోధన. మరొకరి మీద కాదు, మన మీదనే.”

“ఛా”

“అవును. చూసారా? ప్రేమ పేరుతో మీరు మీ దుస్తులు ఎలా మార్చేసారా?”

“కరెక్ట్.”

“కతికితే అతకనిది పెళ్ళి.”

“కరెక్ట్.”

“అసలు ఎంత కొరికినా కొరుకుడు పడనిది ప్రేమ”

“పాయింట్‌కి వచ్చారు.”

“చెప్పండి.”

“నేను బస్‌స్టాప్‌కి వచ్చేసరికి ఆడ పోలీసు అప్పటికే వచ్చి ఆడపులిలా నా వైపు వచ్చి నిలబడుతోంది.”

“వెరీ గుడ్”

“ఏంటి వెరీ గుడ్డు? కాళ్ళు వొణుకుతున్నాయి.”

“శభాష్ అది ప్రేమలో అందరూ మెచ్చుకునే ప్రక్రియ. నత్తితో మాట్లాడేవారు బాగా తెలివిగలవారంటారు.”

“కాళ్ళల్లో వొణుకు వున్నవారు ఎంతో ధైర్యవంతులన్న మాట.”

“ఛా”

“అవును. ఇంతకీ ఏవంటుంది పోలీసు?

“ఏమీ అనదు.”

“చూసారా? ప్రేమకీ, మూగమనసుకీ అన్యోన్యమైన సంబంధం ఉంటుంది.”

“ఏమీ అనదు కానీ ఓ సైగ చేస్తుంది.”

“శభాష్! టైగర్లు కూడా మాట్లాడవు. సైగలు చేసుకుని మన ముందరికి దూకుతాయి.”

“ఏంటీ? ప్రేమలోకే?”

“అవును. ఇంతకీ దేనికి సైగ చేస్తుంది ఆడ పోలీసు?”

 “మిర్చీ బండి వైపు”

“ఓ – అక్కడ బాగుంటుంది.”

“ఏంటి సార్ బాగుండేది? ఆ మిర్చీ వాడు రేటు పెంచాడు. నేనేదో సంపాదిస్తున్నానని అందరూ అనుకుంటారు.”

“సంఫాదించడం లేదా?”

“ఛా! ఈ డ్రెస్సు కూడా ఎవరిదో!”

“మరి ఎలా?”

“అదే మరి. జేబులో ఉన్నదంతా ఆడ పోలీసుకి కొని పెట్టే మిర్చీ బజ్జీలకయిపోతోంది. మూడు నిముషాలలో ఆరు బజ్జీలు కొరుక్కుని తినేస్తోంది. ఇది నాకు కొరుకుడు పడడం లేదు. అంతే కాదు, అవి చూపిస్తూ నన్ను భయంకరంగా చూస్తుంది. కలకత్తా కాళిలాగా!”

“భయపడకూడదు. చల్లని తల్లి!”

“ఇంతలో బస్సు వస్తుంది.”

“వెరీ గుడ్”

“అందులోంచి నేను ప్రేమించిన అమ్మాయి దిగుతుంది. ఆమెకు తోడు మరో అమ్మాయి.”

“బాగుంది. మీ జీవితం యావత్తూ ప్రేమమయం.”

“ఇదేంటి కొత్తగా?”

“మీరు ఒకళ్ళని ప్రేమిస్తున్నారు.”

“తిరుగులేదు.”

“మిమ్మల్ని ఒకరు ప్రేమిస్తున్నారు.”

ముందరికి వంగాడు సింహం.

“ఎవరది?”

“ఆడ పోలీసు.”

వెంటనే వెనక్కి జారి అలాగే కిందకి జారిపోయాడు.

“అన్యాయం సార్. ఏదో మిర్చీ సలహా ఇస్తారనుకుంటే ఇలాంటి పని చేస్తారా?”

“అదేవన్నమాట?”

“అవును సార్, పోలీసు ప్రేమ గుంటూరు మిరపకాయ సార్. వాటి మీదుగా పయనించిన గాలి తగిలితే చాలు సార్, ఏకంగా గొంగళి పురుగులు గట్టిగా ఆలింగనం చేసుకున్నట్లుంటుంది.”

“తొందర పడుతున్నారు సింహం గారూ!”

“నేను నా ఈ కథకు స్వస్తి చెబుతున్నారు సార్, జీవితం మీద ఆశగల వాడిని. తలచుకుంటేనే గబ్బర్ గాడు ఖైనీ నములుతున్న సీను ముందరుంటోంది.”

“ఆలోచించండి. మీ ప్రేమ కరెక్ట్ అని చెప్పటానికి ఇదొక నిదర్శనం. ఆడ పోలీసు అలాగే ఉంటుంది. ఆమె ప్రక్కన మీరు ప్రేమించిన అమ్మాయిని నిలబెట్టి మీలో మరుగున పడి వున్న ప్రేమకు పంఫుకొట్టండి. ప్రపంచం సరికొత్తగా దర్శనమిస్తుంది.”

ఆలోచిస్తున్నాడు సింహం.

“కనిపించిందా? అద్దీ. ఇంతకీ ఈ అమ్మాయి బస్సు దిగి ఏం చేస్తుంది? ఆడ పోలీసు లాగా సైగలు చెయ్యదా?”

“నో…” అంటూ సింహం లేచాడు. మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. “… తన స్నేహితురాలితో కలిసి అడుగులో అడుగు వేస్తూ వస్తుంది.”

“గుడ్”

“తల ఇలా వంచి ఉంటుంది.”

“మంచి లక్షణం.”

“నాకు నాలుగు అడుగుల దూరంలో ఇద్దరూ ఆగిపోతారు.”

“మర్యాద అంటారు.”

“ఒకళ్ళ నొకళ్ళు చూసుకుంటారు.”

“అంటే అప్పటికే ప్రేమ మిర్చీ… కాదు ప్రేమ మీద చర్చ జరిగిందని అర్థం.”

“నన్ను విచిత్రంగా చూస్తారు.”

“అంటే?”

“స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారనుకోండి.”

“తరువత?”

“సూటిగా మిర్చీబండీ వైపు వెళతారు.”

సుందరం లేచి నిలబడ్డాడు. సింహం చేతులు కలిపాడు. భుజం తట్టాడు.

“మన ప్లాన్ ఫలించింది. అన్ని నదులూ సాగరం వైపు వెళతాయి సార్. ప్రేమకు సంబంధించిన అన్ని ఆలోచనలూ మిర్చీ బజ్జీ దగ్గరకు వచ్చి అలా ఆగిపోతాయి.”

“అవును. అక్కడ ఆగుతారు. చేరో ప్లేటు తింటారు.”

“అలా తింటున్నప్పుడు మిమ్మల్ని చూస్తారా?”

“నెవర్. ఫోన్లో ఏదేదో చూసుకుంటూ ఉంటారు. ఆడ పోలీసు వాళ్ళతో కలిసి మరో ప్లేటు తినేస్తుంది.”

“రాక్షసి”

“అదీ సంగతి. ఆ మిర్చీబండీ వాడు ఆ ముగ్గురు వాళ్ళలో వాళ్ళు తెగ జోకులేసుకుని నవ్వుకుంటుంటే నా దగ్గరకొచ్చి వాళ్ళు అలా తింటుండగానే డబ్బులు తీసుకుంటాడు. మధ్యలో ఆడ పోలీసు ఒక్కసారి నన్ను చూస్తుంది.”

“అది మంచి పరిణామమే.”

“నా బొంద సార్! నేను డబ్బులు ఇస్తున్నానా లేదా అని చెకింగ్ సార్! ఎలా?”

“తప్పదు సింహంగారూ… ఇది ఒక మజిలీ. అంత మాత్రమే. కథ తప్పకుండా ముందరకి వెళుతుంది. ఏవంటారు?”

“నాకు మీ మీద అనుమానంగా ఉంది.”

సుందరం కూర్చున్నాడు.

“నో ప్రాబ్లమ్. ప్రేమ అనే రుచిలో అనుమానం అనేది ఇలాయిచీ లాంటిది. చెప్పండి.”

“మీరు నన్ను వాడుకుని మిర్చీ వ్యాపారం బాగా చేసుకుంటున్నారని అనిపిస్తోంది.”

“తప్పు లేదు. మీకలా అనిపించడం సహజం. ప్రేమలో త్యాగం కూడా ఉంటుంది. మీ కథ పూర్తయిన తర్వాత మిర్చీ ఎంత త్యాగం చేసిందో మీకు తెలిసిపోతుంది.”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here