అతులితమాధురీమహిమ

1
4

[box type=’note’ fontsize=’16’] “ధూర్జటి కవిత్వశైలిలో, ముఖ్యంగా సీసపద్యాల్లో పాదాంత క్రియాపదాలు కనిపిస్తాయి. జనపదాలలో వినిపించే శబ్దాలతో అపురూపమైన శోభను తీసుకురావడంలో కవి సిద్ధహస్తుడు. ఇక ఆయన కవిత్వపు నడత – సువర్ణముఖరీప్రవాహహసదృశం” అంటున్నారు అంటున్నారు రవి ఇ.ఎన్.వి.అతులితమాధురీమహిమ” వ్యాసంలో. [/box]

[dropcap]క[/dropcap]విత్వం – అంటే ఏమిటి?

ఈ ప్రశ్నకు కొన్ని వందల సమాధానాలు ఉన్నాయని మనకు తెలుసు. తరతరాలుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకబడుతూనే ఉంది.

కవిత్వమొక ఆత్మదర్శన విద్య.

కవిత్వమొక ఉత్తమ సంస్కారసూచి.

కవిత్వమొక సుభాషితావళి, సన్మార్గదర్శని.

కవిత్వం మధురమైన, మనోహరమైన భావసంచయం.

కవిత్వం సమాజశ్రేయోసంధాయకం.

కవిత్వమొక చమత్కారం.

కవిత్వమొక తీరని దాహం.

కవిత్వానికి విభిన్న తలాల్లో విభిన్నమైన నిర్వచనాలు చెబుతూనే ఉన్నారు. సామాజికులే కాక, ఆలంకారికులు కూడా కావ్యాన్ని ఒక స్త్రీ అని, అమెకో అందమైన తనువే కాక ఆత్మ కూడా ఉండాలని, కావ్యాత్మ అంటే, లావణ్యానికి అతిరిక్తమైన మానసికమైన ఆహ్లాదకత్వమని రకరకాల ప్రతిపాదనలు చేశారు.

ఈ ప్రస్థానంలో ప్రబంధయుగాన్ని మనం కవిత్వపు మధ్యయుగంగా భావించవచ్చు. ఈ యుగంలో కవిత్వాన్ని అటు ఋష్యాశ్రమాలకు పరిమితం చెయ్యలేదు, అలాగని కవిత్వాన్ని సమాజవిప్లవాలకు ఉపయోగించనూ లేదు. అటూ యిటూ కాని ధోరణులకు సరిగ్గా మధ్యకాలం ప్రబంధకాలం. కవిత్వం ద్వారా భావ మాధుర్యాన్ని, భాషయొక్క సొబగును ఉద్యోతిస్తూనే, సుభాషితాలను ప్రస్తావించటం ఆ కాలాన జరిగింది. ఈ ప్రబంధయుగంలో మాధుర్యం అనగానే గుర్తొచ్చే కవులలో ప్రముఖుడు – ధూర్జటి కవి.

స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో

యతులిత ’మాధురీ’ మహిమ?”

ఒకానొక నిండు సభలో శ్రీకృష్ణరాయల వారు ధూర్జటి కవిని గురించి ప్రశంసిస్తూ ఇలా పలికాడని మనం పలుమార్లు చదువుకున్నాం. సినిమాలలో చూశాం.  “శ్రేష్ఠుడైన ఆంధ్రకవి ధూర్జటి కవిత్వం ఇంత మధురంగా ఉండటానికి కారణమేమిటి?”

ఆ ప్రశ్నకు తెనాలి రామకృష్ణుడు చెప్పిన సమాధానం కూడా విన్నాం.

హా! తెలిసెన్భువనైకమోహనో

ద్ధత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారి సం

తత మధురాధరోదిత సుధారసధారలు గ్రోలుటం జుమీ.”

“హా; తెలిసింది. జగదేకసుందరీమణులు, సుకుమారులు అయిన వేశ్యాస్త్రీల యొక్క అధర సుధారసం గ్రోలటమే, ఆయన కవిత్వ మాధుర్యానికి కారణము”

అదొక చాటువు. ఆ పద్యం ద్వారా ధూర్జటి వేశ్యాలంపటుడన్న వార్త బయలుదేరింది. అనూచానంగా కొన్ని కథలూ పుట్టినై. ఆ కథల దాటున, చాటువుల మాటున, ధూర్జటికవి  కవిత్వానుశీలనం కప్పబడిపోయింది. ఈ చాటువార్త వ్యవహారాన్ని, కథలను పక్కన పెట్టి కవి రచించిన కాళహస్తి మహాత్మ్య కావ్యాన్ని, అందులోని పద్యాలను చవి చూస్తే, రాయలవారి పలుకులకు నిజమైన అర్థం స్పష్టంగానే బోధపడుతుంది. తెలుగుభాష తాలూకు సొగసు సారాన్ని తీసి, తన భావాల సోయగాన్ని ప్రోది చేసి,  ధూర్జటికవి – పద్యాలు అనబడే రత్నచషకాలలో నింపాడు. అదే రాయలవారు చెప్పిన ‘అతులిత మాధురీ మహిమ’.

ప్రాచీన ఆలంకారికుడైన ’వామనుడు’ కావ్యం అంటే ఇలా నిర్వచించినాడు. ‘అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్యమ్’ . దోషాలు లేనిది, గుణములతో కూడినది, అలంకారములు కలిగినది అయిన శబ్దార్థములు కలది – కావ్యం. ఇక్కడ గమనార్హమైన విషయమేమంటే కావ్యంలో శబ్దమూ, అర్థమూ రెండున్నూ ముఖ్యములే. రెండింటి సొబగునూ పట్టించుకొనవలసిందే. కొందరు ఆధునికులు – కావ్యంలో భావమే ముఖ్యం, శబ్దగుణాలకు ప్రాముఖ్యత లేదు అనే వాదం చేస్తుంటారు. పొసగని మాట! భాష ఎలా ఉన్నా, ’భావమే ముఖ్యం అన్నది, వస్త్రాలు ఉన్నా లేకునా స్త్రీ శరీరమే ముఖ్యం’ అనేటంత దూష్యమని పుట్టపర్తి నారాయణాచార్యులు అన్న ఆధునిక కవివిమర్శకుడు విమర్శిస్తూ అంటారు.

శబ్దార్థాలు రెండున్నూ ఎంతగా ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తాయో,కవనంలో ఆ తళతళల మెఱుపు ఎలా ఉంటుందో తెలియాలంటే – ధూర్జటికవి రచించిన కాళహస్తి మహాత్మ్యము కావ్యాన్ని తెఱచి చూస్తే చాలు. ఆ కావ్యంలో కొన్ని చవులూరే పద్యాల రుచులను ఎత్తి చూపడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. నిజానికి ధూర్జటి కవి విషయంలో ఇటువంటి అరకొర ప్రయత్నం అసమర్థమైనదనే చెప్పుకోవాలి. అడుగడుగునా చవులూరే రచనలు ఆయనవి. ఆయన చెప్పే కథాలక్షణం వినూత్నమైనదే. మొత్తం కావ్యాన్ని వ్యాఖ్యాన సహితంగా చదువుకోవడం తప్ప మారు మార్గం లేదు. అయితే దురదృష్టం కొద్దీ అటువంటి టీకాతాత్పర్యవ్యాఖ్యానం ఈ కావ్యానికి వచ్చినట్టు లేదు. ప్రాచుర్యంలో ఉన్న ఒకట్రెండు పుస్తకాలలో – వావిళ్ళ వారి ప్రతిలో లఘుటీక మాత్రమే ఉంటే, అంతకు మునుపు ప్రచురితమైన కొత్తపల్లి అన్నపూర్ణమ్మ గారి ప్రచురణలోనూ కొన్ని శబ్దాలకు అర్థాలు మాత్రమే ఇచ్చారు.  నేడు మనం మ్లేచ్ఛవిద్యాప్రభావజనిత మేధాతిశయులైనాము. స్వభాషాభిమానానికి అర్థం తెలియక అపమార్గం పట్టి యున్నాం. ఇప్పటి కాలానికి ’గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ నన్న ఆశతో, అసమర్థమైనా ఆశతో ఈ చిన్ని ప్రయత్నం!

కాళహస్తి మహాత్మ్యము ద్వితీయాశ్వాసం. వాణీవిధాతల కూరిమి ఘట్టం. ఈ ఘట్టంలో వాణిని ధూర్జటికవి ఎంత రమణీయంగా వర్ణిస్తున్నాడో చూడండి.

సీ.

మోము పున్నమచందమామ వెన్నెలఁ గాయ

          డెందంపుఁ గెందమ్మి క్రిందుపడునొ

వాలుఁ జూపనియెడు వేలుపుఱేని కై

          దువ చాయగట్టు గట్టవియఁ బడునొ

కొప్పను చీఁకటి గుంపు కప్పుకొనంగఁ

          దలఁపు తెర్వరి త్రోవఁ దప్పి పడునొ

రాయంచ నడపుల రాయడిఁ దాల్మి తా

          మరతూఁడు దుమురుగా మరలఁబడునొ

 గీ.

నలువ తనుఁ గొల్వవచ్చిన పలుకుఁజెలువ

చెలువ మరయుచు వలరాజు చిలుకుములికిఁ

దలఁకి మిన్నక యొక కొంత తడవు నిలిచె

మునులు తమతమ మొగములు గనుఁగొనంగ. (2.10)

మోము = ముఖము; పున్నమిచందమామ = పౌర్ణమిచంద్రుని; వెన్నెలన్ కాయ = వెన్నెలను చిలుకగా;  (బ్రహ్మ) డెందంపు = హృదయపు; కెందమ్మి = ఎర్రతామర; క్రిందుపడునొ = వశమగునో!  వాలున్ చూపు = క్రీగంటిచూపు; అనియెడు = అనెడు; వేలుపుఱేని కైదువ = ఇంద్రుని ఆయుధము (వజ్రాయుధము) యొక్క; చాయగట్టు = నిగనిగలు; కట్టు అవియపడునొ =  బ్రద్దలగునో!  కొప్పు అను = శిఖపై కూర్చిన కొప్పు అనే: చీకటి గుంపు = రాత్రి యొక్క అంధకారత్వము; కప్పుకొనంగన్ = ముసురుకొనంగా; తలపు తెర్వరి = ఆమెనే (మనసున తలచిన) ఆలోచన యను బాటసారి; త్రోవన్ తప్పి పడునో = మార్గమును తప్పి పోవునో యేమో!  రాయంచ = రాజహంసల; నడపుల = గమనముల; రాయడిన్ = అలజడిని; తాల్మి = శాంతముగా; తామరతూడు దుమురుగా = తామరతూటి ముక్కలుగా/పుప్పొడిగా; మరలన్ పడునొ = భావిస్తాడా?

నలువ = చతుర్ముఖుడు- బ్రహ్మ; తనున్ కొల్వ వచ్చిన = తనను సేవింపగా వచ్చిన; పలుకున్ చెలువన్ = పలుకుల చెలి;  చెలువము = ప్రేమను; అరయుచు = తెలిసికొని;  వలరాజు = మన్మథుని; చిలుకు ములికిన్ = వాడియైన అమ్ముచేత; తలఁకి = వివశుడై, ధైర్యము చెడి; మిన్నక = మాటాడక; యొక కొంత తడవు = ఒకింత సేపు; మునులు = ఋషులు; తమ తమ మొగములు = తమ మొఖాలను; కనుంగొనంగ = చూచుకొనుచుండగా;  నిలిచె = నిలిచెను;

తాత్పర్యం:

వాణి మగని వద్దకు నిండు సభలో మెల్లగా నడుచుకుంటూ వస్తూంది. అలా వస్తుంటే –

ఆమె మోము పున్నమినాటి చందమామలా వెన్నెల చిలికింది. – ఆ చందమామను చూచి మగడు విధాత హృదయమనే ఎఱుపు తామరపువ్వు ముడుచుకుందా? (ఆకాశాన చందమామ వికసించగానే తామర ముడుచుకుంటుంది. శారదాదేవి ముఖమనే పున్నమిచందమామను చూచి, బ్రహ్మ యొక్క హృదయమనే కెందమ్మి జారిందట!)  ఆమె క్రీగంటి చూపుకు ఇంద్రుని వజ్రాయుధం నిగనిగలు బ్రద్దలయినవేమో ? ఆమె కొప్పు తాలూకు (నలుపు) అంధకారం ముసురుకోగా, ఆమెను మనసున నిలిపిన పాంథుడు మార్గాన్ని మరచి వెళ్ళెనేమో? ఆమె రాయంచనడకల వల్ల రేగిన ధూళిని – పుప్పొడిగా భావిస్తూ ఉండునేమో? ఇలా చతుర్ముఖుడు బ్రహ్మను చేరవచ్చిన జాణ యొక్క చెలువమును చూచి, మన్మధబాణోపహతుడై ,  వివశుడై,  మునులు తమ తమ ముఖాలు చూసుకుంటుంటే – స్థంభీభూతుడై నిలిచాడు.

ఈ పద్యం మొత్తమంతానూ జానుతెనుగు!  ఈ సీసపద్యంలో దాదాపు ప్రతి పాదంలో (అరపాదంలో కూడా) ప్రాసయతిని నిలపటం గమనార్హం. ఇది సీసపద్యపు తొలినాళ్ల ధోరణి. కొంతలో కొంత యిది గేయపు నడత. బ్రహ్మ కమలసంభవుడు, కమలాసనుడే కాదు, ఆయన హృదయం కూడా కమలమే! ఆ కమలం – తన చెలువ యొక్క పున్నమిచందమామ వెన్నెల దెబ్బకు క్రిందుపడినదట!  – ఇది పద్యం మొదటి పాదం. ఈ పద్యపద్మపు నడత కూడా, పద్యపు భావం అన్న వెన్నెలకు చొక్కి, పరవశించి, క్రిందుపడినట్లుగానే భాసిస్తూంది ! ఆమె కొప్పు అనే చీకటి కప్పుకోగా, తలపులబాటసారి త్రోవ తప్పి పోతాడుట!

ప్రబంధకవుల వర్ణనల్లో ఉపమానాలు, ఉత్ప్రేక్ష్యల గురించి చెప్పనవసరం లేదు. ఆ అలంకారాల్లో ఒకరిని మించి మరొకరు. ఈయన ఉపమాలంకాలే కాదు, ఆయా కవిత్వ వస్తువులను ఉపమిస్తూ పరిణామాన్ని కూడా చెబుతున్నాడు! ఇక ఈ కవి పదసంపద – లెక్కలేనిది! పున్నమిచందమామవేలుపుఱేడువలపుఱేనికైదువతలఁపుతెర్వరిపలుకుఁజెలువచిలుకుములికి – ఒక్క పద్యంలో ఇన్ని అచ్చతెనుఁగు సమాసాలను నిలిపాడు కవి. సాధారణంగా కవిసమయాలకు సంబంధించిన ఈ సరంజామాను కవులు పారంపరికంగా తీసుకోవడం కద్దు. అయితే ధూర్జటి ఈ సమాసాలను ఎంత స్వతంత్రంగా, వినూత్నంగా కూర్చాడో చూడవచ్చు. సంస్కృతంలో మాఘకవి గురించి ఒక అభాణకం ఉంది. ’మాఘే సంతి త్రయోగుణాః’ అని. ధూర్జటి కవికీ అటువంటిది ఒకటి చెప్పాలేమో. ఈ కవి శైలిలో అల్లసాని పెద్దన సుధామయోక్తులు, భట్టుమూర్తి నవ్యత, తెనాలి వాని పదగుంఫనం ముప్పేటలుగా అల్లుకున్నట్టు కనిపిస్తాయి.

వాణి – ఆలంబన విభావంగాను, ఆవిడ నడక, కొప్పు మొదలైనవి ఉద్దీపన విభావాలు గాను, తలంకడం అనుభావం,  స్థంభీభూతుడు కావడం వ్యభిచరీభావం. వెరసి ఈ పద్యం రతి స్థాయీభావాత్మకమైన శృంగారరసధ్వని.

ఆపై దంపతులిద్దరూ శృంగారకేళిలో విహరింపసాగినారు.

.

తోరపుఁ గోరిక ల్నగవు తోడి మొగంబునుజిక్కువడ్డ శృం

గారపుఁ గొప్పుక్రొంజెమట గాఱెడు గందముసందడించు ని

ట్టూరుపు గాడ్పువేడుకల నుబ్బెడు దేహముసోలఁ జూపునొ

ప్పారుట గాని నల్వకొక యప్పుడు నూరట లేదు కూటమిన్. (2.11)

తాత్పర్యం: పెచ్చరిల్లిన కోర్కెలతో చిరునగవులు చిలుకుతున్న జంట ముఖములు, చిక్కువడిన శృంగారపు కొప్పు, చెక్కిళ్ళలో స్వేదము, నిట్టూరుపుల సందడి, వేడుకలతో పొంగుతున్న కాయం, సోగకళ్ళ చూపులు – ఇవన్నీ ఒప్పారుతూ ఉన్నాయి కానీ వారి సంగమానికి తెరిపి మాత్రం లేదు.

ఇది యే అమరుక శతకానికో, శృంగారతిలక కావ్యానికో తెనుగులా భాసిస్తూంది.

 అటుపై బ్రహ్మకు, శారదకూ నూర్గురు అసురులు జన్మించారు. వాళ్ళు దుర్వర్తనులై, భూమిపై జనులను, మహర్షులను, అందరినీ బాధపెడుతున్నారు. వారిని నశింపజేయటానికి బ్రహ్మ ’ఉగ్రుడు’ అనే మరొక పుత్రుణ్ణి సృష్టించి, వాని ద్వారా, వాని సోదరులైన రక్కసులను సంహరింపజేశాడు. ఈ బ్రహ్మహత్యాపాతకం నుండి రక్షించుకొనడానికి బ్రహ్మ తపస్సు చేస్తే, ఈశ్వరుడాయనను కరుణించాడని తర్వాతి కథ.

శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము – కొన్ని కథల సమాహారం. ఈ కథలను కవి నాందిలో ప్రస్తావించాడు. ఆ కథలలో, మాయాజంగముడు, శ్రీ – అనే సాలీడు కథ, కాళము – సర్పము కథ, హస్తి – యేనుగు కథ, తిన్నడు అనే కిరాతుని కథ, నత్కీరుని కథ, ఇద్దరు వేశ్యకుమార్తెల కథ, ఆయా పాత్రలకు ఆయా రూపాలు రావటానికి గల కారణాలు వంటివి ఉన్నాయి. కావ్యం అంతా పరమేశ్వరభక్తిప్రబోధకం. పురవర్ణనల్లో, నదీనదాలు, సాయం సమయాలు ఇత్యాది అష్టాదశ ప్రబంధసహజ వర్ణనలన్నీ సహజభావబంధురాలు. పనికట్టుకుని చేసిన వర్ణనల వలే ఉండవు. ఈయన ప్రబంధనిబంధనను మన్నిస్తూనే, వర్ణనావిస్తృతి కథను దాటిపోవనీకుండా తీర్చిదిద్దాడు. కథాగమనానికి, రసోత్కర్షకు అనూచానంగా కవి వర్ణనలను గుప్పించినాడు.

కాళహస్తి – అన్న పేరుకు సంబంధించిన ఈ ఉదంతంలోని పద్యాలు చూడండి. ఓ ఏనుగు, ఓ సర్పము ఒకదానికి తెలియక మరొకటి అడవిని ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాయి. ఏనుగు చేసిన పూజాద్రవ్యాలను తోసివేసి సర్పం – ఏవో మణిమాణిక్యాలతో రాత్రిని వచ్చి లింగాన్ని పూజిస్తోంది. ఆపై పగటిపూట ఏనుగు స్వచ్ఛమైన జలాన్ని, సురర్ణముఖరిలో పూచిన పూలను తెచ్చి, పాము తెచ్చిన మణులను తోసి పూజిస్తోంది. ఇలా అనుదినం జరుగుతోంది. తన పూజకు ఆటంకం కలిగిస్తున్నదెవరో, దాని అంతు చూడాలని ఏనుగు తలపోసింది.

సీ.

పిడియేనుఁగుల వెంటఁబడిపోక యుడుగని

          వెడవిల్తు వేఁడిమి విడుపుఁ జూప

కరమున నుదకంబు కడుఁ జల్లుకొనకున్నఁ

          దెమలని మిహిరదాహము దొలంగ

సరసునఁ జొచ్చి తామరతూండ్లు మెసఁగక

          మానని యాఁకటి మంట లేక

సింహపోతములు ఘోషింపఁ బుట్టిన భయా

          తంకాగ్ని తహతహ గ్రుంకఁ బార

గీ.

కెట్టి వెట్టలుఁ దనమీఁద నెక్కలేక

పంచబంగాళమై పోవఁ బ్రాణలింగ

పూజనావిఘ్నమునయందుఁ బుట్టినట్టి

చింతయన్ వేఁకి దనలోను చేసికొనియె. (2.125)

తాత్పర్యం: ఆడు ఏనుగుల వెంటపడి పోకుండా, తీరని మన్మథబాధను సహిస్తూ, తోండంతో ఎంతగా నీటిని చల్లుకున్నా, ఆరని ఎండపోటును భరిస్తూ, సరస్సులో తామరతూండ్ల ఆహారం తీసుకోక, తన ఆకలి మంటలను ఓర్చుకుంటూ, సింహపు పిల్లల ఘర్జనలచేత పుట్టిన భయాన్ని అణుచుకుంటూ, ఏ రకమైన వేడిని లెక్కచేయక చెల్లాచెదరు చేస్తూ, ప్రాణలింగము యొక్క పూజకు ఆటంకం కలుగగా పుట్టిన చింతవల్ల వచ్చిన జ్వరాన్ని తనలో నిలుపుకున్నది ఏనుగు.

ఈ పద్యాన్ని వీలైతే ఓ సారి గొంతెత్తి చదువుకుంటే – భాషాసౌందర్యం ఎలా తళుకులీనుతుందో తెలుస్తుంది. పిడియేనుఁగుల వెంటఁబడిపోక యుడుగని వెడవిల్తు వేఁడిమి విడుపుఁ జూప’ – ‘డ’ కార ఆవృత్తి ఎంత పరవశంగా ఉంది చూడండి! ఈ పద్యంలో యేనుగు దైన్యాన్ని, పట్టుదలను చెబుతున్నాడు కవి. సాధారణంగా, ’ర’ కారం శృంగారదోహదకారి యని, ‘ట’ గణం శృంగారరస విరోధి యని ఆలంకారికుడైన మమ్మటభట్టు కావ్యప్రకాశం అనే గ్రంథంలో ఉద్యోతిస్తాడు. ఈ పద్యంలో ఆ చిన్ని సూచనను కవి ఎంత అలవోకగా ఉపయోగించాడో ఆశ్చర్యం వేస్తుంది.

ఈ వ్యాసంలో మొదట ధూర్జటి కవి యొక్క శృంగారరసధ్వనిని చూశాము. ఇక్కడ దైన్యాన్ని, అందునా ఓ వన్యమృగమైన ఏనుగు యొక్క ఆర్తియుతమైన భక్తిని కళ్ళకు కట్టించేలా చేశాడు కవి.

ధూర్జటి కవనంలో కనిపించే ప్రత్యేకతలు – జీవకళతో తీర్చిదిద్దిన పాత్రలు, ఆ పాత్రల హృదయావేగపు అద్భుత చిత్రణ. కవిత్వశైలిలో, ముఖ్యంగా సీసపద్యాల్లో పాదాంత క్రియాపదాలు కనిపిస్తాయి. జనపదాలలో వినిపించే శబ్దాలను ఆయన ఇబ్బడిముబ్బడిగా ప్రయోగించడం కద్దు. ఈ శబ్దాలతో అపురూపమైన శోభను తీసుకురావడంలో కవి సిద్ధహస్తుడు. ఇక ఆయన కవిత్వపు నడత – సువర్ణముఖరీప్రవాహహసదృశం.

పంచబంగాళమై పోవు (చెల్లాచెదరు), వెట్టలువేఁకి (జ్వరము), పిడియేనుగులు (ఆడుయేనుగులు), మిహిరదాహము

పైని సీసపద్యంలో ఈ శబ్దాల నవనవోన్మేషత గమనార్హం. ఈ ఘట్టం చివర్న, ఈ వన్యప్రాణులిద్దరికీ పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించటం మనకు తెలుసు.

అటువంటి పదబంధాలను కవి రాశులు రాశులుగా ఈ కావ్యంలో కుప్పపోశాడు. క్రింది సూర్యోదయవర్ణనను గమనించండి.

.

చీఁకటికాన చిచ్చుభవు చేలకుసుంభముతూర్పుకొండకున్

గూఁకటి రత్నమబ్జరమ కూరిమిపంటచకోరరాజిపే

రాఁకటి మంటశోణకిరణావళి గంటరథాంగకేళికిం

దేఁకువ పెంటమింటఁ జనుదెంచె దినేంద్రుఁడు కాలఘంటయై. (4.97)

తా: చీకటి అన్న అడవి పాలిటి దవాగ్ని, భవుని పైవస్త్రపు ఎఱుపురంగు, తూరుపు కొండ కొప్పున చూడామణి, తామరపూల సంపదకు ఇష్టమైన పంట, వెన్నెలపులువుల గుంపు యొక్క అధికమైన ఆకలి పాలి శత్రువు, సూర్యుని ఎరుపు రంగు కిరణములు అన్న గంట, చక్రవాకపక్షుల క్రీడలకు ధైర్యము నొసగే దోహదకారి అయిన దినకరుడు కాలపు ఘంటలా మింట ఉదయించినాడు.

 భారతదేశ సాహిత్యంలో అనాది నుంచి వస్తున్న కవిసమయాల సాంప్రదాయాలలో చకోరాలు, చక్రవాకాలు ముఖ్యమైనవి. ఈ రెంటినీ కవి ఈ పద్యంలో ఉపయోగించినాడు.  ఇది కొంత అరుదు.

చకోరము = దీనిని వెన్నెల పులుగు అంటారు. ఈ పక్షి వెన్నెలకై పరితపిస్తుంది. ఇది మన పొరుగుదేశమైన పాకిస్తాన్ జాతీయపక్షి. 🙂

చకోరము

రథాంగము = చక్రవాకము; ఇవి జంటగా ఉంటాయి. పగలంతా కలిసి క్రీడిస్తూ, రాత్రి అవగానే వేరు పడి, తిరిగి సూర్యోదయాన కలుసుకుంటాయి. వీటినే జక్కవలు అంటారు. యువతుల కుచములను జక్కవలతో ఉపమిస్తారు కవులు.   (’జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం’ – అన్నమయ్య, కీర్తన – క్షీరాబ్ధి కన్యకకు)

చక్రవాకములు/రథాంగములు/జక్కవలు

మనోహరమైన వృత్త్యనుప్రాసలు, అపురూపమైన తెనుఁగు సమాసాలు, చిక్కని ధార, మనోహరమైన భావం, అద్బుతరసప్రవిష్టమైన నిర్దేశం – పై పద్యంలో చూడవచ్చు.  పద్యపు శైలి సంస్కృతంలో దండి మహాకవి రచించిన దశకుమారచరితమ్ లో ’బ్రహ్మాండచ్ఛత్రదండః..’ అన్న నాంది శ్లోకాన్ని స్ఫురింపజేస్తోంది. దండి శ్లోకపు చివరన కాలదండము, ధూర్జటి పద్యపు అంతమున కాలఘంట రావడం గమనార్హం.

ధూర్జటి పద్యాల్లో అంతటా వినూత్నమైన పదబంధాలు కనిపిస్తాయి, అక్కడక్కడా అన్యదేశ్యాలు ఉన్నాయి.  నత్కీరుడు అన్న శివభక్తుడు తన శాపాన్ని బాపుకోవడానికై యాత్రలు చేస్తున్నాడు.

కం.

ఉణ్ణాముల జగదంబిక,

నణ్ణామల విశ్వనాథు నారాధించెన్;

మణ్ణాసయుఁ బొణ్ణాసయుఁ

బెణ్ణాసయు లేనివారి పెన్నిధులగుటన్(3.185)

తా: అరుణాచలంలోని అపీతకుచాంబను, తిరువణ్ణామల లో విశ్వనాథుని ఆరాధించినాడు. భూమిపైన, పసిడిపైన, స్త్రీలపైన ఆశను వదిలిన వారిని కటాక్షించే ఆ పరమేశ్వరదంపతులను అర్చించినాడు,

ఆ పద్యంలో మణ్ణాస, పొణ్ణాస, పెణ్ణాస – ఈ మూడున్నూ ద్రవిడశబ్దాలుగా అగుపిస్తాయి.  ఇంకా ’మాడబేకుబరాబరి’ ఇత్యాది శబ్దాలూ కద్దు. ఇంకా కవిత్వంలో నాటి కాలపు పొత్తపినాటి ప్రాంత ఆచారాలు, అక్కడి మాండలికం, ఖండశర్కరసంయుతమైన సుమధురమైన పాయసంలా చవులూరిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here