రంగుల హేల 14: అరకొర జ్ఞానం

0
3

[box type=’note’ fontsize=’16’] “ఈ జీవితాన్ని యావరేజ్ విద్యార్థిలా, అనుభవ పాఠాలు మననం చేసుకుంటూ లాగెయ్యాలి తప్ప కొత్త కొత్త ఆధ్యాత్మిక సిద్ధాంతాలు చదివి సరికొత్త జ్ఞానాన్ని సముపార్జించడం ప్రమాదం” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]చి[/dropcap]న్నప్పటినుండీ మనందరిదీ పాజిటివ్ మైండ్. నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ, అంతా మన మంచికే అనేస్కునే మైండ్ సెట్. మాయా బజారు, యమగోల లాంటి హాస్య చిత్రాలు, కన్యాశుల్కం లాంటి నాటకాలు చూసి నవ్వుకునే సరదా, సరదా టైపు. అందరూ మంచివారే, మంచి మనసులు, పాల మనసులు, తేనే మనసులు, కలిసిన మనసులు లాంటి సినిమాలు చూసిన ఫలితం అయి ఉండొచ్చు.

జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, మనకి ఏది లాభదాయకమో అని నిరంతరం వేయికళ్లతో రీసెర్చ్ చేసుకుంటూ, చుట్టుపక్కల జనాలు మనకి అన్యాయం చేస్తారేమో అని ఊహించి మనల్ని మనమే బహుపరాక్ అనుకుంటూ బతకడం మనకస్సలు నచ్చదు. దానికి బోల్డంత బుర్ర వాడాలి, సమయం వెచ్చించాలి. అబ్బే! మనకి అంత తీరికుండదు కదా! దాంతో, జీవన యానంలో తగలవలసిన ఎదురు దెబ్బలు, పడవలసిన అగచాట్లు, తినవలసిన మొట్టికాయలు మన కోటాలో శుభ్రంగా పడిపోయాయి. అంతా క్షవరం అయ్యాక కాస్త తెలివిని బలవంతంగా అరువు తెచ్చుకోక తప్పలేదు. అయినా సహజ స్వభావం తోక వంకర లాగా మనల్ని వదలదు, పిల్లలు కూడా పెద్ద వాళ్ళయిపోయి ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అని మన మీద విసుక్కున్నా కానీ.

ఎవరైనా వచ్చి కబుర్లు చెబుతూ కూర్చుంటే గతంలో వాళ్ళు మన వెనక అన్న మాటలూ, మనకి వ్యక్తిగతంగా నష్ట పెట్టిన సంగతులూ మర్చిపోయి ఇప్పుడే ఇంటర్లో చేరిన విద్యార్థిలా గలగలా లోకాభిరామాయణం మాట్లాడెయ్యడం మన కలవాటు. అంటే మనది షార్ట్ టైం మెమరీ అన్నమాట.

కొంత కాలం నా ఫ్లాట్‌లో నాతో ఉంటూ ఒక సహోద్యోగిని నా ఒరిజినల్ మొబైల్ ఛార్జర్స్ రెండు సార్లు కొట్టేసినా బెనిఫిట్ అఫ్ డౌట్ కింద వదిలేసా. ఆ తర్వాత ఆమెతో కలిసి ఒక ఆడిట్ పని మీద వైజాగ్ వెళ్ళినప్పుడు ఆమె మరొకసారి నా పర్స్ మీద దాడి చేసి వెయ్యిన్నర కొట్టేసింది. అప్పుడు అలెర్ట్ అయిపోయి ఆ తర్వాత టూర్‌లో తగిన జాగ్రత్త తీసుకుని నా పర్స్‌ని నిరంతరం అంటే వాష్ రూమ్‌లో కూడా నా దగ్గరే పెట్టుకుని కాపాడుకున్నా.

ఇలా ఎంతో కొంత తెలివి మరియు తేటలతో జీవనాన్ని కాస్త జాగ్రత్తగా సాగిస్తూ ఉన్నాను. సరిగ్గా ఆ సమయంలో నా సాహితీ మిత్రుడొకాయన ఒక పుస్తకం ఇచ్చాడు. దానిని ఫాలో అవ్వమని సలహా కూడా పడేసాడు. దాని పేరు విపస్సనా ధ్యానం. దాన్లో ఇలా రాసి ఉంది.

“విపాసనా ధ్యానం యొక్క లక్ష్యం ప్రపంచాన్ని ఉన్న దానిని ఉన్నట్లు చూడడం. బకెట్‌ను బకెట్‌గా చూడాలి. అలా కాకుండా దానిపై మన మనసును రుద్ది అంటే మన ఉద్దేశాలను, దృష్టులను, సిద్ధాంతాలను, ఇష్టాఇష్టాలను, రాగద్వేషాలను, మంచి చెడులను, అంద-అంద వికారాలను, ఉపయోగ – నిరుపయోగాలను, అవసర – అనవసరాలను, ఎక్కువ తక్కువలను, దానితో మన పూర్వ సంబంధాలను ఆ బకెట్‌కి జోడించి దాన్ని రంగుటద్దాల్లోంచి చూస్తుంటాం. అలా మన మైండ్ కండిషన్ అయ్యింది. అలాగే జడ్జిమెంట్ చేస్తాం. ఇవే వేల్యూ జడ్జిమెంట్స్ అంటే, రంగుటద్దాలే విలువలు.

వాటిని తొలగించి చూడడమే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. రంగుటద్దాలు తొలగించినప్పుడు, మనసు అద్దమవుతుంది. అప్పుడు ఆ బకెట్ నీ బక్కెట్టుగా, నా బక్కెట్టుగా, ఖరీదైన బక్కెట్టుగా, నాయనమ్మ బక్కెట్టుగా, గతానుభవాలతో కూడిన బక్కెట్టుగా, కాలిమీద పడి గాయం చేసిన బక్కెట్టుగా కాకుండా కేవలం బకెట్‌గా కనిపిస్తుంది.

మనసు తుడిచిన అద్దమైనపుడు వివేకంతో కూడిన ప్రజ్ఞ వెలువడుతుంది. ఆ జ్ఞానపు వెలుగులో తీసుకునే నిర్ణయం శుద్ధంగా ఉంటుంది. అదే ఆచరణీయం.”

ఇది చదివాను. మళ్ళీ మళ్ళీ చదివాను. అంతే. నా సహజ స్వభావం మళ్ళీ నాకొచ్చేసింది. తోకని సీదా చేసి కట్టిన కర్ర ఊడిపోయింది. ఈ సారి ఆ సదరు సహోద్యోగిని మరోసారి ఆఫీస్ పని మీద పోయినప్పుడు నాతో ప్రయాణం చేసి నా రూమ్‌మేట్ అయ్యింది. అప్పుడు నేను విపస్సనా ధ్యానాన్ని గుర్తు చేసుకుని నా కొలీగ్‌ని, నా ఛార్జర్స్ కొట్టేసిన కొలీగ్‌గా కాక, నా పర్సు కొట్టేసిన కొలీగ్‌గా కాక కేవలం నా సంస్థలో నాతో పనిచేస్తున్న సహ ఉద్యోగినిగా మాత్రమే చూడాలి అని నిర్ణయం తీసుకున్నాను. రంగుటద్దాలు వాడకూడదనుకున్నాను. ఆ విధంగా పరిశుద్ధమై నిశ్చింతగా ఉండిపోయాను.

అంతే! మరొకసారి నా పర్స్ శ్రీ మద్రమారమణ గోవిందో హరి అయిపోయింది. నా మిత్రుడిచ్చిన ధ్యాన యోగం వల్ల నా అజాగ్రత్త వల్ల, గత అనుభవంతో నేను నేర్చుకున్న పాఠం మర్చిపోవడం వల్ల హ్యాండ్ బాగ్‌ని ఇదివరకటిలా సురక్షిత స్థలాల్లో ఉంచక పోవడం వల్ల నా కొలీగ్ ఈ సారి ఏడున్నర వేలు కొట్టేసింది.

ఆ దుర్ఘటనని ఎవరికీ చెప్పుకునే ధైర్యం కూడా నాకు లేకపోయింది. ఎవరూ జాలి పడరు. పైగా తిట్లు పడటం గ్యారంటీ. అది మరీ దుర్భరం కదా. నీతి ఏంటంటే ఏదో ఈ జీవితాన్ని యావరేజ్ విద్యార్థిలా, అనుభవ పాఠాలు మననం చేసుకుంటూ లాగెయ్యాలి తప్ప కొత్త కొత్త ఆధ్యాత్మిక సిద్ధాంతాలు చదివి సరికొత్త జ్ఞానాన్ని సముపార్జించడం ప్రమాదం సుమీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here