సమాంతరం-3

0
4

[box type=’note’ fontsize=’16’] సైన్స్ ఫిక్షన్ ఫాంటసీలోని పారలల్ యూనివర్స్ భావన ఆధారంగా డా. చిత్తర్వు మధు రచించిన కథ “సమాంతరం“. ఇది మూడవ భాగం. మొదటి భాగం, రెండవ భాగం ఈ లింక్‍లలో చదవవచ్చు. [/box]

[dropcap]I[/dropcap]n to the unknown… and known…

చుట్టూ కాంతి రేఖలు నిలువు గీతల్లా…

ఎదురుగా వలయాలుగా నక్షత్ర పుంజాలూ…

తాను ఒక సాగిపోయిన స్ఫాగేట్టీ ముక్కలా, ఒక చీకటి వలయం గిరగిరా తిరగుతుంటే, దాని మధ్య నుండి ఒక వెలుతురు దారిలో సన్నగా సాగిపోయిన సేమ్యా ముక్కలా…

ఆ ప్రయాణం అనంతంగా సాగినట్లు మళ్లీ క్షణంలో అంతం అయినట్లు అనిపించి చివరకి ఒక పెద్ద నిశ్శబ్దపు విస్ఫోటనంతో నేలమీద పడ్డాడు.

ఆ నేలా ఈ నేల లాగానే వుంది. ఆ చెట్లూ ఇక్కడి చెట్లలానే, ఆ కొండలూ రోడ్లూ భవనాలూ, దారులూ ఇక్కడివి లాగానే వున్నాయి.

“హాయ్ కామ్రేడ్! స్వాగతం! ఎలా వుంది నీ వార్మ్ హోల్‌లో కాంతివేగంతో పయనం? కొంచెం సేపు ‘ల్యాగ్ పీరియడ్’ వుంటుంది. సేద దీర్చుకో!”

లేచి నిల్చున్నాడు. ఆ ప్రయాణం ఓ “జమేవ్యూ!” ఎప్పుడూ చూడనిదిలా వుంటే…

సుబ్రావ్‌కి ఆ ప్రదేశం, ఆ ప్రపంచం ఇదివరకే వచ్చినట్లు “దిజా వ్యూ” అనుభవం లా వుంది.

తను ఒక విశాలమైన మైదానంలో వున్నాడు.

నేల మీద నుంచి లేచి దుమ్ము దులుపుకుని నిల్చున్నాడు.

ఒక వృద్ధుడూ, సైనిక దుస్తులలో వున్న మరో వ్యక్తీ, తన వంకే చూస్తున్నారు.

“సుబ్రతో ఎలా వున్నావు?” దయగల పలకరింపు. వృద్ధుడు తెల్లటి గడ్డం మీసాలతో, భుజాలదాకా వేలాడే బంగారు రంగు కేశాలతో తెల్లని తళతళలాడే పొడుగాటి దుస్తులతో విజ్ఞాని లాగ వున్నాడు.

సైనికుడు ఆలివ్ గ్రీన్ బట్టలతో ఎర్రటోపీ, కోరమీసాలతో లేజర్ గన్ ధరించి హుందాగా, కఠినంగా వున్నాడు.

“నేనెక్కడ వున్నాను? నా పేరు సుబ్రతో కాదు! నేను మీ ప్రపంచానికి ఎలా వచ్చాను? ఇది నిజంగా మరో ప్రపంచమా? లేక మతి భ్రమించిన నా భ్రమా?” అడిగాడు సుబ్రావ్. “దాహంగా కూడా వుంది. నాకు నీళ్ళు కావాలి.” ఇంతలో అక్కడికి వేగంగా ఒక జీప్ లాంటి వాహనం వచ్చింది.

“పద! మన కార్యాలయానికి! అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. నీకేం జ్ఞాపకం రావటం లేదని అర్థం అయింది.”

***

కొన్ని గంటల తర్వత విశాలమైన సైనికాధికారుల కార్యాలయంలో…

“సమాంతర విశ్వం అంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఈ సిద్ధాంతాలు, నువ్వున్న భూమిలోని 21వ శతాబ్దంలో ఇప్పుడే చర్చిస్తున్నారు” వృద్ధుడు చెప్పసాగాడు.

“ఈ విశ్వం ఒకటే కాదు, సమాంతర విశ్వాలు అంటే “మల్టీవెర్స్” ఎన్నో వున్నాయి. మా విశ్వంలో భారతదేశానికి స్వతంత్రం రాగానే కమ్యూనిస్ట్ విప్లవం రావడం, ఆ రకంగా దేశం పురోగతి సాధించడం జరిగిపోయింది. కాని నాకు తెలిసి నువ్వు జీవిస్తున్న భారతదేశంలో అన్యాయాలు, నియంతృత్వం, దోపిడీ విధానాలు పెరిగిపోవడం మేం గమనించగలిగాం… అందుకే నిన్ను ఆ విశ్వంలోకి పంపి…”

“ఆగండి! అక్కడ నాకొక జీవితం… భార్యా, పిల్లలూ, ఉద్యోగం, విధులూ అన్నీ వున్నాయి. నేను మీరు పంపిన సుబ్రతోని కాను.”

“అవును! కాని నీలాంటి మరొక వ్యక్తిని ఇక్కడ నుంచి పంపిస్తే అతన్ని నువ్వు సహజంగా ఉండే ఆకర్షణ.. ‘affinity’ వల్ల చూడగలిగావ్, చంపగలిగావ్!

ఇలా అణువు కంటే చిన్నవైన ‘God particles’ విశ్వమంతా పొరలు పొరలుగా వ్యాపించి అనేక రూపాలతో వివిధ విశ్వాలు ఏర్పడివున్నాయి.”

సుబ్రావ్కి ఆ రాత్రి క్వాంటమ్ ఫిజిక్స్, స్క్రోడింగర్ చెప్పిన ‘పిల్లి సిద్ధాంతం’ దగ్గర నుంచి సూపర్‌పొజిషన్, హ్యు ఎవరెట్స్ సిద్ధాంతాలూ, ఒక పొరపై మరొక పొరగా ఏర్పడే విశ్వంలో, సృష్టిలోని కాలం అనే నాలుగు కొలతలు కాక మొత్తం వున్న పదకొండు కొలతలూ… ఇలాంటివన్నీ తలనొప్పి వచ్చేదాకా చెబుతూనే వున్నాడు ఆయన చిరునవ్వుతో.

“నాలుగు వైపులా మూసి వున్న ఒక అట్టపెట్టలో పిల్లిని పెట్టి, అదే పెట్టెలో కొద్ది కొద్దిగా విడుదలై చంపేసే విషపు మందుని వదిలే పరికరం కూడా పెట్టి ఆ బాక్స్ మూసేయ్!

నువ్వు ఆ బాక్స్‌ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? పిల్లి బతికైనా వుండచ్చు. చనిపోయి అయినా వుండచ్చు.

తెరవగానే పిల్లి బయటపడింది సజీవంగా. అంటే నిజం ఒక్కటే కనిపిస్తుంది. దానిని సూపర్‌పొజిషన్ అంటారు. తెరవనంత సేపూ ఎన్నో సాధ్యాసాధ్యాలు.

ఇక హ్యు ఎవరెట్స్, స్ట్రింగ్ థియరీ… మిషియో కాకూ.. మీ భూమిలోని పాపులర్ సైన్స్ శాస్త్రజ్ఞుడు. ఒక Large Hadron Collider తో అణువులు భేదించి సౌరకుటుంబం చుట్టూ తిరిగేటట్లు చేస్తే సమాంతర విశ్వంలోకి వెళ్ళే వార్మ్‌హోల్ లాంటి శక్తిని సృష్టించవచ్చు… అని ప్రతిపాదించాడు. మేం ఎప్పుడో అది సృష్టించగలిగాం.”

సుబ్రావ్ ఆయనకి నమస్కరించి అన్నాడు “అయ్యా నాకు సైన్స్ రాదు. నేను ఈ అనంత విశ్వంలో ఒక పిపీలికాన్ని. నా బోటి పిపీలికాలు మరిన్ని వుండచ్చు. నాకిక చాలు. నా ప్రపంచానికి నన్ను పోనీండి. ఆ దేశంలో నన్ను ఒక పిచ్చివాడిని అనుకుంటున్నారు!” ఇన్నాళ్ళ అతని వేదన అదుపు లేని రోదనలా బయటపడింది. ఏడవసాగాడు.

వృద్ధుడు తల పంకించి మిలిటరీ మనిషి కేసి చూశాడు.

“భోజనం చేసి విశ్రాంతి తీసుకో. రేపు నిన్ను సుప్రీం కమాండర్ దగ్గరకి తీసుకుని వెళ్తాం.”

***

మనో ఫలకం మీద కంప్యూటర్ తెరలోని దృశ్యాలలాగ సంఘటనలు. ప్రతి సంఘటనకీ ఒక జలదరింపు. తన బాల్యం, చదువు,. లీలగా కనిపించే తల్లిదండ్రీ రూపాలు, స్కూలు, యూనివర్శీటీ విద్య.

రోజూ జెండా వందనం. నేర్పించిన సిద్ధాంతాలూ! యూనివర్శిటీ చదువు! ఆ తర్వాత మిలిటరీ ఎకాడమీ. ఆయుధాలతోనూ, లేకుండా కూడా యుద్ధం చేసే శిక్షణ.

“శత్రువుని చంపాలి! అదే నీ ఫోకస్.”

ఆ కదిలిపోయే దృశ్యాల వెనక ఆమె. కొండ పక్కన పచ్చని చెట్లు పొలాల మధ్య తన ఇల్లు. గ్రామంలో వ్యవసాయ కూలీలు పొలం పనులు చేస్తూ పాడే పాటలు.

“ఉండు, అది వేరే భాషలా వుంది.”

ఇంగ్లీష్! రష్యన్, చైనీస్, తెలుగు… కాదు. ఏదో తనకి తెలిసీ తెలియని భాష.

అన్నిటికీ మధ్య ఆమె. ఆమె…

ఒకసారి వీడ్కోలు చెబుతోంది.

ఆ కళ్ళలో నీలి మేఘాల నీడలు.

“జాతికి నా జీవితం అంకింతం. సుబ్రతో మై లవ్. మై కామ్రేడ్. తిరిగి రాకపోతే నా కోసం ఒక దీపం వెలిగించు! మన కుమారుడిని… ప్రేమఫలాన్ని… యోధుడిగా చేయ్!”

“వొద్దు! వొద్దు! వెళ్ళద్దు! మనం పారిపోదాం! నిన్ను వదిలి నేనుండలేను!”

“తప్పదు! సుబ్రతో! సుప్రీం కమాండర్ ఆనతి! రిపబ్లిక్ కోసం ప్రాణాలు ఇస్తున్నాననే తృప్తి!” గాఢమైన పరిష్వంగంలో మనసుని ముక్కలు చేసే అనుభూతి.

తృళ్ళిపడి లేచి కూర్చున్నాడు నిద్రలో సుబ్రావ్. ఈ జ్ఞాపకాల ద్వంద్వ అనుభవాల దాడి మెదడుని మొద్దుబారుస్తోంది.

ఇప్పుడు తల వెనక భాగంలో నొప్పి అనిపించింది. తడుముకున్నాడు. చిన్న గాయం. చాలా చిన్న సూదిని మెదడులోని జ్ఞాపక శక్తిని నియంత్రించే టెంపోరో ఆక్సిపిటల్ లోబ్‌లో గుచ్చినట్లు అర్థమైంది.

“సుబ్రావ్.. నీవొక భయంకర పద్మవ్యూహంలోకి వెళ్తున్నావ్. వారి శాస్త్ర ప్రగతి మనకంటే వంద రెట్లు మించి వుంది. నీ జ్ఞాపకాలను ఛిన్నాభిన్నం చేయగలరు. నీ జ్ఞాపకాల్నే మార్చగలరు!”

ఇది ఎక్కడి సందేశం! సుబ్రావ్‌కి నిజంగానే తనకి పిచ్చా అని అనుమానం వస్తుండగానే….

కల్నల్ రాకేష్ అధికారీ ముఖం లీలగా కనబడసాగింది.

“ఇది ఒక ప్రమాదకరమైన మిషన్ అనుకో… నా విజ్ఞానానికి మించినది. నిన్ను పంపడానికి ఒకే కారణం. నీలాంటి నువ్వు ఒక్కడివే, నీ DNA అతని DNA ఒకటే కాని… ఆత్మలూ జ్ఞాపకాలూ వేరు…”

సుబ్రావ్ లేచి నిల్చున్నాడు.

“డాడీ కమ్ బ్యాక్ సూన్!” కొడుకు గొంతు.

“జాగ్రత్త అండీ!” భార్య గొంతు. ఎక్కడో అనంత లోకాల్నుంచి.

తలుపు తెరుచుకుంది.

“గుడ్ మార్నింగ్ సుబ్రతో… నిద్ర బాగా పట్టిందా. ఒక గంటలో రెడీ అయితే సుప్రీం కమాండర్ దగ్గరకు వెళ్దాం. నిన్ను చూడాలని అనుకున్నారు ఆయన. 10.30 గంటలకి ఎపాయింట్మెంట్.”

“ఓకే సార్” శాల్యూట్ చేశాడు. కుడి చెయ్యి గాలిలో ముందుకి సాగి పిడికిలి బిగించి.

వృద్ధుడు సంతోషంగా నవ్వాడు.

“నువ్వు మా ప్రపంచం వాడివే! ఇప్పుడు ఇక్కడి పధ్ధతులన్నీ నీకు వచ్చేశాయి. వార్మ్‌హోల్ ప్రయాణం, జ్ఞాపకాల సంక్షోభం నుంచి బయట పడ్డావ్! నీ మెమరీ స్కాన్ చేశాం! నీ నిద్ర కూడా మానిటర్ చేశాం!”

“ఎస్ సార్! మన రిపబ్లిక్ సేవకి పునరంకితమవుతాను!”

“పద, బ్రేక్‌ఫాస్ట్‌కి.”

***

“పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ భారత్” రాజధాని ఎంతో అధునాతనంగా, విశాలమైన రోడ్లతో, ఎత్తైన బహుళ అంతస్థుల భవనాలతో, రోడ్డుకి కొంచెం ఎత్తుగా పోయే డ్రైవర్ లేని కార్లతో, అద్భుతంగా భవిష్యత్ ఊహాచిత్రంలా వుంది.

భవనాలపై పెద్ద పెద్ద నాయకుల ఫోటోలు ప్రకటనలలోని దృశ్యాలు చాలా పెద్ద ప్రమాణంలో రంగులలో హోలోగ్రామ్లా కనబడుతున్నాయి. ప్రభాత కాంతిలోనూ అవి వివిధ వర్ణాలతో మెరుస్తున్నాయి.

అతన్ని ఎక్కించుకున్న మిలటరీ వాహనం అతి వేగంగా ప్రయాణించి అధ్యక్షుడి కార్యాలయ భవనం ముందు ఆగింది.

సుబ్రావ్ దిగాడు.

విశాలమైన లాన్స్ లోంచి ఎర్రని తివాచీ పరిచిన దారి. అటూ ఇటూ అందంగా కత్తిరించిన ఖర్జూర వృక్షాలు.

సింహద్వారం వద్ద ఎర్రని దుస్తుల రక్షణాధికారులు శాల్యూట్ చేశారు.

అదే కుడిచేయి ముందుకు చాచి… పూర్వపు యూరప్ ఖండంలో నాజీ శాల్యూట్ల లాగా.

“కామ్రేడ్ సేతుపతికి జయమగు గాక!”

“ఫీల్డ్ మార్షల్ సుప్రీం కమాండర్ సేతుపతి. జీవిత కాలపు అధ్యక్షుడిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. మన ప్రణామాలన్నీ ఆయనకే వుండాలి” వృద్ధ శాస్త్రజ్ఞుడు అన్నాడు. “ఆయన నిన్ను త్వరలో కలుస్తారు.”

ద్వారం లోపల సెక్యూరిటీ చెక్. మళ్లీ మెటల్ డిటెక్టర్ లాంటి దానితో స్కాన్! తన అస్థిపంజరం కనిపించింది తెరమీద.

“హీ ఈజ్ క్లీన్! కాని అతని శరీరం చుట్టూ ఒక కాంతివలయం Aura లా వుంది. అవి ఎలక్టాన్స్ కావచ్చు, ఫోటాన్స్ కావచ్చు. బోసన్స్ కావచ్చు. ఏం చేద్దాం?” అడిగాడు సెక్యూరిటీ.

“దాని వల్ల సెక్యూరిటీ సమస్యలున్నాయా?” అడిగాడు వృద్ధుడు. ఆయన భృకుటి ముడతపడింది, కళ్ళు చిట్లించాడు. “మనకి సుప్రీం రక్షణ చాలా ముఖ్యం.”

సెక్యూరిటీ ఆఫీసర్లు ఇద్దరు పక్కన వున్న అద్దాల మధ్యలో వున్న కంప్యూటర్ కీబోర్డ్ మీద పది నిమషాలు బహుశా ‘సెర్చ్’ చేశారు.

“ఇది మన ప్రపంచ జీవరాశులకయితే కనబడని ఎనర్జీ వలయం. ఇది ఒక బహిర్ విశ్వం లేక సుదూర విశ్వం నుంచి వచ్చిన వారికి వుండచ్చు అని యూనివర్సల్ కంప్యూటర్ తెలియజేస్తోంది.”

సుబ్రావ్ అరిచాడు “నేను చెప్పేందే రైట్. నేను ఇక్కడి వాడిని కాదు. నేను సుబ్రతో అని మభ్యపెడుతున్నారు!”

ఒక ఇబ్బందికరమైన మౌనం. ఆ విశాలమైన హాలులో దూరంగా దర్బార్ లాంటి వేదిక ముందు అమర్చి వున్న సోఫాలు వున్నాయి.

“డీఏక్టివేట్ హిమ్” అన్నాడు వ్రృధ్ధుడు.

సెక్యూరిటీ ఆఫీసర్ “అది ఎలా చేయాలో మాకు తెలీదు. అతను ఎలాంటి సెక్యూరిటీ రిస్కో మాకు తెలీదు. ఇది ‘సుప్రీం’కి భద్రతా సమస్య.”

వృద్ధుడు ఒక నిశ్చయానికి వచ్చినట్లు దృఢంగా మాట్లాడాడు.

“ఇతను నిరపాయమైన వ్యక్తి! నేను చెక్ చేశాను. ఇతను సుబ్రతో అయినా కాకపోయినా మన ప్రపంచానికి అనువుగా మార్చుకున్నాను. పోనీండి!”

సుబ్రావ్ మెదడు వెనక పొరల్లో ఏదో స్వరాలు వినిపిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.

“అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు!” ఎక్కడో మరో ప్రపంచంలో తెల్లని గోడల మధ్య వెలుతురులో రాకేష్ అధికారీ కోరలు తిరిగిన మీసాలు, ప్రతి మాట పట్టి పట్టి పలికే కటువైన స్వరం. ఆ జ్ఞాపకం గోడ బయట వున్న ఒక బోర్డ్ దగ్గర ఆగిపోయింది.

“డీ-బ్రీఫింగ్ ఛాంబర్”

“సుప్రీం కమాండర్ వస్తున్నారు!” గంభీరమైన కంఠస్వరంతో కనబడని స్పీకర్లలోంచి ప్రకటన.

“సుబ్రతో! సుప్రీం నిన్ను ఇప్పుడు చూస్తారు! జాగ్రత్త! లాంగ్ లివ్ రిపబ్లిక్! జై సేతుపతీ!” ఒక మిలిటరీ కమాండర్ నినదిస్తున్నాడు.

వేదిక వెనక నుంచి తలుపు తెరుచుకుంది. ఎర్రని తెర తొలిగి సుప్రీం కమాండర్ సేతుపతి… ఇంకా ఎన్ని పేర్లున్నాయో! బయటకు వచ్చాడు.

లావుగా వున్నాడు. అంత పొడుగూ కాదు, పొట్టీ కాదు. గ్రీన్ యూనిఫారం నిండా మెడల్స్. ఎర్రని టోపీ మీద మెరిసే నక్షత్రం. అతను రాగానే సుమారు డజను మంది సైనికాధికారులు వేదిక మీద అటు ఇటు నిలబడి శాల్యూట్ చేశారు.

“లాంగ్ లివ్ రిపబ్లిక్!” ఈ సారి సుప్రీం గొంతు.

“అందరికీశుభోదయం! అభినందనలు!”

“శుభోదయం కమాండర్!”

“మరిప్పుడు నా ప్రియతమ ఆఫీసర్ సుబ్రతోని పిలవండి. జాతీయ పతకం, అసామాన్య సాహసానికి గౌరవం ఇవ్వవల్సివుంది.”

“కామ్రేడ్ మేజర్ సుబ్రతో ముఖర్జీ! ప్లీజ్ కమ్ టూ ది డయాస్!”

ఓ క్షణం నిశ్శబ్దంలో సుబ్రావ్ మెదడులో వంద విస్ఫోటనాలు.

గాలి వేగం… ఎలక్ట్రాన్స్ లేక కాంతి అణువులు ఫోటాన్స్ కదిలినట్టు మెరుపులా కదిలాడు.

సుప్రీం కమాండర్ గొంతు చుట్టూ ఉక్కు కండరాల చేతులు బిగుసుకున్నాయి. ఆయన క్రింద పడిపోయి మూలగసాగాడు. మరుక్షణం ఆయన ముక్కులో నుంచి, నోటిలో నుంచి రక్తం నురగలా రాసాగింది.

సుబ్రావ్, కాంతివేగంతోనే అనాలి, వెనుదిరిగాడు.

స్థాణువులై నిలబడిన ఆర్మీ కమాండర్స్ హడావిడిగా ఏదో భాషలో అరవసాగారు. అర్ధరాత్రి మొరిగే కుక్కలా సైరన్ ఒక్కటి మ్రోగసాగింది.

ద్వారం బయట ముసలి విజ్ఞాని తెల్లని గడ్డాలు మీసాలు గాలిలో అలలుగా ఎగురుతుండగా “సుబ్రావ్, సుబ్రావ్ నువ్వు పొరపాటు చేశావ్” అంటుండగానే ఆయన రూపం వెలుతురు చారలుగా సాగిపోసాగింది.

సమావేశ మందిరంలో పెద్ద ప్రేలుడు సంభవించింది. నీలి ఎరుపు మంటలు అతని వెనక ఆకాశంలోకి చిమ్మాయి.

దారి పొడుగునా స్థంభాలకి కట్టి వున్న తెరల మీద ఎమర్జెన్సీ… మేటర్, ఏంటి మేటర్ మాలిక్యులర్ ఎక్స్‌ప్లోజన్ అని ఎర్రని అక్షరాలు మెరుస్తూనే వున్నాయి.

అతను పరుగెడుతునే వున్నాడు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లా మెదడులో ఏవో సూచనలు కనిపిస్తున్నాయి.

రాజధాని మెయిన్ రోడ్… దూరంగా దూరంగా…

అతను పరుగెడుతూనే వున్నాడు. అతనికి ఎదురుగా ఫైరింజనులు, ఆర్మీ ట్రక్స్ ప్రభుత్వ భవనం వైపు వెళ్ళిపోతున్నాయి.

‘గెలాక్టిక్ రిసెర్చి సెంటర్’, ‘లార్జ్ హెడ్రాన్ కొలైడర్’ అన్న పెద్ద బోర్డున్న భవనం ముందు ఆగి. ద్వారానికి పక్కవున్న కంప్యూటర్ మీటలు నొక్కసాగాడు.

ద్వారం తెర్చుకోలేదు.

ఈ సారి అరచేయి ఖచ్చితంగా అంటే చేతిముద్ర మీద వేసి, కన్ను బొమ్మ లో నుంచి తన కుడికన్నుతో చూశాడు.

రెటీనల్ స్కానింగ్, ఫింగర్ ప్రింట్ స్కానింగ్.

ఒక రోబో గొంతు అంది. “సుబ్రతో వెల్‌కమ్… లాగిన్ టైం 11-45 AM సెంట్రల్ టైమ్.”

తన నకలు సుబ్రతో చేతి ప్రింట్ కూడా తన లాంటిదే.

పరుగెట్టాడు.

చాలా పెద్ద సొరంగం.

అటు ఇటూ తెల్ల కోట్ల శాస్త్రజ్ఞులు. చివరగా వున్న ఒక గాజు అద్దాల గది.

“అర్జెంట్! మిషన్! నన్ను… వెంటనే పంపండి!” అంటూ కోఆర్డినేట్లు చెప్పాడు.. “భూమి.. 160 27 లాటిట్యుడ్, 230 14 లాంగిట్యూడ్”.

ఒక తెర వెలిగింది.

మీసాల కమాండర్ మాట్లాడుతున్నాడు.

“పర్మిషన్ గ్రాంటెడ్! అతన్ని శూన్యంలోకి తోసేయండి! అతనికి లార్జ్ హెడ్రాన్ కోలైడర్ లోకి ప్రవేశం అనుమతించారు. ఇది మిలిటరీ కౌన్సిల్ ఆజ్ఞ!”

***

“పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ భారత్.” ప్రభుత్వ భవనం. నాయకుడి మరణం.

ఒక్కక్కరే మిలిటరీ కమాండర్స్ శవం చుట్టూ మూగారు. కొందరు భావోద్రేకంతో “లాంగ్ లివ్ సుప్రీం కమాండర్!” అనీ, కొందరు ఆశ్చర్యంతోనూ “జై మార్షల్ సేతుపతీ!” అని నినాదాలు అంటున్నారు.

“హంతకుడిని పట్టుకుని శిక్షించాలి. అతను మనవాడు కానే కాదు. ఏదో కుట్ర జరిగింది.” ఒక యువ జనరల్ అరుస్తున్నాడు.

మరుక్షణం అతన్ని ఎవరో వెనక్కి లాగారు. అతను స్థబ్దుడైపోయాడు.

వృద్దుడు వెండి రంగు కలిసిన తెల్లటి జుట్టు, గడ్డం, మీసాలు మెరిసిపోతుండగా ద్వారం నుంచి అరిచాడు.

“సైలెన్స్! మిలిటరీ కౌన్సిల్ సమావేశంలో కొత్త సుప్రీం కమాండర్ ఎన్నిక జరగాలి. వెంటనే ఈ వార్త బయటకి పొక్కకూడదు. మన రిపబ్లిక్‌లో అల్లకల్లోలాలు, అరాచకం రాకూడదు. ఇదంతా ఎవరికీ తెలియకూడదు.”

“నేను చెబుతునే వున్నాను – మేటర్, ఏంటీమ్యాటర్ సమాంతర విశ్వాల్లో ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు వాడకూడదని. సుప్రీం వినలేదు.”

అందరిలో సీనియర్‌గా కనిపిస్తున్న ఐదు నక్షత్రాల జనరల్ గొణిగాడు! “చాలా దురదృష్టం.”

ఇప్పుడు వాళ్ళందరికీ మార్గదర్శి అయిన వృద్ధుడు గంభీరంగా నవ్వుతున్నాడు.

“మార్షల్ జయసేన్! నువ్వే ప్రస్తుతం సుప్రీం కమాండర్‌గా ఎన్నుకోబడుతున్నావ్. సుప్రీం ఈజ్ డెడ్! లాంగ్ లివ్ సుప్రీం!”

ఓ క్షణం నిర్ఘాంతపోయిన సైనికాధికారులు హర్షధ్వనాలు చేస్తూ “జయసేన్ జయహో! లాంగ్ లివ్ సేతుపతీ! విక్టరీ టు పీపుల్సు రిపబ్లిక్!” అని గాలిలో ముందుకి చేతులు చాచి శాల్యూట్ చేస్తూ నిలబడ్డారు.

“ఆఫీసర్స్… బయటకి పరుగెత్తండి. ఇక్కడ విస్ఫోటనం జరుగుతుంది. నిప్పుని ఆర్పాలి. తర్వాత రాజకీయ అధికారం మార్పిడి జరుగుతుంది. హర్రీ ఆప్…”

వారంతా బయటకు రాగానే ఆ భవనంలో పేలుడు, మంటలు చెలరేగాయి. దూరాన్నించి ఫైరింజను మోతలు వినిపించి దగ్గరకి వచ్చేదాకా మిలిటరీ కౌన్సిల్ సభ్యులు అక్కడే ఎగసే మంటల్ని చూస్తూ నిలబడిపోయారు.

***

మళ్ళీ వెలుతురు తీగల మధ్య స్ఫాగేట్టీలాగా..

మళ్ళీ చీకటి వలయంలో వెలుగు దారి. వర్టిగో. స్పృహ తప్పడం.

జీవితంలోని దృశ్యాలన్నీ కలగలుపుగా కళ్ళముందు తెరలు తెరలుగా కదిలిపోతుండగా.

ఆ విశ్వపు అద్భుత ప్రగతి ఐన లార్జ్ హెడ్రాన్ కొలైడర్లో నుంచి అణువు కంటే చిన్నగా ఇంకా చిన్నగా అయి… అద్యశ్యం అయిపోయాడు సుబ్రావ్…!

***

అర్ధరాత్రి..

విజయవాడ జాతీయ రహదారిలో… చీకటి గూడెం 4 కి.మీ,విజయవాడ 125 కి.మీ అన్న బోర్డు దగ్గర ఓ వెలుతురు మెరిసింది. మిణుగురు పురుగుల వలయంలా ఒక ఆకారం మెల్లగా చీకట్లో ఘనీభవించింది.

పూర్తి నగ్నంగా కండలు తిరిగిన దేహంతో శిశువులా ముడుచుకుపోయి వున్న మగ ఆకారం లేచి నిలబడింది.

అతనికి… వర్టిగో. తలనొప్పి. ఒళ్ళుతూలడం.

అప్పుడే దూరంగా పొదలలో మిలిటరీ జీప్ లైట్లు వెలిగాయి.

ఇద్దరు అర్మీ ఆఫీసర్లు వేగంగా టార్చ్లైట్లు ఫోకస్ చేసుకుంటూ అతన్ని చేరుకున్నారు.

“వెల్‌కమ్ బ్యాక్ ఆఫీసర్ సుబ్రావ్! హోప్ యు ఆర్ ఫైన్ ఆఫ్టర్ ది జర్నీ.”

అతను తూలుతూ అటెన్షన్లో నిలబడ్డాడు.

“శాల్యూట్ రాకేష్ ఆధికారీ సార్! రిపోర్టింగ్ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్! శత్రువుని విజయవంతంగా తుదముట్టించాను! తిరిగి వచ్చాను!”

“మిషన్ సక్సెస్” ఇంటలిజెన్స్ విభాగం అధిపతి రాకేష్ తన పక్క ఆఫీసర్‌తో అన్నాడు. “సుబ్రావ్ అద్భుతంగా సాహసం చేశాడు. అతనికి లాగ్ పీరియడ్లో చికిత్స అవసరం. ముందు మిలిటరీ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి. డీ బ్రీఫింగ్! ఆ తర్వాత అతని భార్యా, కొడుకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చెయ్యండి. అతన్ని వాళ్ళకి చూపించండి. ఇదంతా టాప్ సీక్రెట్! ఆ తర్వాత అతన్ని హైటెక్ సిటీ మెంటల్ ఆసుపత్రికే తరలించాలి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతన్ని పూర్తిగా వేరే బాధ్యతలలోకి పంపిస్తాం. ఇప్పటికయితే అతను మానసిక రోగే అని చెప్పాలి.”

“ఎస్ సర్! జై హింద్!”

నిశీధిలో జాతీయ రహదారి మీద మిలిటరీ వాహనం వేగంగా దూసుకుపోయింది.

***

చీకటి గూడెం అన్న బోర్డు దగ్గర మళ్ళీ దట్టమైన నిశిరాత్రి అలుముకుంది. ఎర్రటి మిణుగురుల్లా రోడ్డు పక్కనున్న రిఫ్లెక్టర్లు మెరుస్తూన్నాయి. కాంతి పడినప్పుడల్లా మెరుస్తాయి.

మరో విశ్వానికి ప్రవేశ మార్గంలా.

*** *** *** *** ***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here