వచో నైశిత్యమ్

0
3

[dropcap]ఆ[/dropcap]దివారం! సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఆవుతోంది. భోజనం చేసి విశ్రమిద్దామనుకుంటూ ఉండగా ఊడిపడ్డాడు సుబ్బారావు. అతడు మా హెడ్డాఫీసులో పని చేస్తున్నాడు. ఇద్దరం కలసి చదువుకున్నాం. ఒకే సంస్థలో పనిచేయడం యాదృచ్ఛికమో, కాకతాళీయమో-ఏదైనా అనుకోవచ్చు! మనిషి కంగారులో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

“అరే! వస్తున్నట్టు ఫోనైనా చెయ్యలేదు. ఆదివారం కదా. ఎక్కడికైనా వెళ్ళివుంటే ఇబ్బంది పడేవాడివి” అంటూ ఎదురెళ్ళేను. రెండు బస్సులు మారాలి మరి అతడు మా ఇంటికి రావడానికి.

“కంగారులో ఫోను చేసి రావాలని తట్టలేదు. సరే కానీ, ఇప్పుడు నా కొంప మునిగేటట్టుంది” అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు దిగులుగా ముఖం పెట్టి.

నేనూ కూర్చుంటూ, “నీ ఇల్లు మూసీనది ఒడ్డున లేదే మునిగి పోవడానికి. అయినా, మూసీలో నీళ్ళు ఎక్కడున్నాయని?” అన్నాను నవ్వుతూ, అతణ్ణి కాస్త ఉత్సాహపరచాలనే తలంపుతో…

భార్యామణి నీళ్ళ గ్లాసుతో పరతెంచి సుబ్బారావు కందించింది. “అన్నయ్య ఏదో ఆపదలో ఉంటే మీరూ, మీ జోకులూ!” అంటూ సున్నితంగా మందలించింది నన్ను.

“బాగా చెప్పావమ్మా” గటగటా నీళ్ళు త్రాగేసి ఖాళీ గ్లాసు మా ఆవిడకి అందిస్తూ అన్నాడు సుబ్బారావు.

ఆవిడ గ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. “సరే కానీ, రా యిలా వచ్చి కూర్చో” అంటూ నా పక్కన కుర్చోమని సైగ చేశాను.

“అదిగో, మళ్ళా నీ భాషా పైత్యాన్నంతా నామీద ప్రయోగిస్తున్నావ్!” అంటూ లేచి వచ్చి నా పక్కన కూలబడ్డాడు.

ఒకసారి సూటిగా చూశానతణ్ణి.

“అయ్యో, ఇప్పుడేమన్నాని ఇంతకీ? నా పక్కన కూర్చోమన్నాను ఫ్యాన్ గాలి బాగా తగుల్తుందని” అన్నాను అయోమయంగా ముఖం పెట్టి.

“అదే… రాయిలా వచ్చి కూర్చో, రప్పలా వచ్చి కూర్చోమనడాన్ని ఏమనాలో మరి?” అన్నాడు ఉక్రోషంగా.

“రామ.. రామ! అదా నీ విశ్లేషణ? రామ అన్నా బూతు మాట్లాడేనని వాదించేటట్టున్నావ్! నువ్వూ – నీ విశ్లేషణా పైత్యమూ! పైగా నాది భాషా పైత్యమనే నింద ఒకటీ! సరే, ఏం ఆపద వాటిల్లిందో వాక్రుచ్చు!” అన్నాను అతడి భుజం మీద చెయ్యి వేసి కాస్త ఓదార్పు ధోరణిలో.

“ఈ గుంట నా ఉద్యోగానికేదో ఎసరు పెట్టేటట్టుంది” అన్నాడు అక్కసుగా. అతడి నోటంట ఇటువంటి తిట్లు అలవోకగా ఊడిపడడం సాధారణమే! కొత్తవారికి ఎబ్బెట్టుగా ఉండవచ్చేమో కాని మాకు అలవాటైపోయింది అతడి ధోరణి.

“ఎవరు? ఏమిటి?” అన్నాను సదరు వ్యక్తికి అతడిచ్చిన నామధేయాన్ని ఉటకించకుండా జాగ్రత్త పడుతూ.

“అదే ఎమ్డీ గారి పి.ఏ. సుందరి!” అన్నాడు.

“నువ్విలా తీర్థానికి తీర్థం – ప్రసాదానికి ప్రసాదంలా కాకుండా సవివరంగా చెప్పు.” అన్నాను కాస్త మందలింపు ధోరణిలో..

“ఎమ్డీగారు అమెరికాలో ఉండగా ప్రాజెక్టు మనకే వస్తున్నందున గెస్టుహౌసులో గత ఆదివారం సెలిబ్రేట్ చేసుకున్నాం గర్తుందా? ఆ పార్టీలో ఆమె కూడా రెండు పెగ్గులు జిన్ లాగించింది, నువ్వు చూశావో లేదో. ఆ మత్తులో ఏం ఊహించేసుకుందో ఏమో! ఆమెను నేను తిట్టేనని నిన్న ఎమ్డీగారు ఆఫీసుకి రాగానే ఆయన చెవిలో ఊదేసినట్టుంది. ఆమె మీద ఈగని కాదుకదా దోమనైనా వాలనివ్వడు ఈ మహానుభావుడు! నన్ను నిన్న మధ్యాహ్నం తన చాంబర్లోకి పిలిచి ఏదో మిషతో చెడామడా తిట్టేశాడు. సాయంత్రం పీ.వో. చెప్తున్నాడు నామీద ఎమ్డీగారు చాలా కోపంగా ఉన్నారట. కారణం అడుగుతే అసలు విషయం బయటపెట్టేడు” అన్నాడు ఆయాస పడుతూ.

“ఒక మాట అనాలంటే రెండు బూతు మాటలు చేరుస్తావ్. ఇంతకీ ఏమనేశావేంటి ఆమెను?” అన్నాను అసహనంగా.

“నా పిండాకూడు! నేను ఆమెని అనడమేమిటి?” అన్నాడు తన సహజ ధోరణిలో,

“మరి ఊరికే ఎందుకలా కంప్లయింట్ చేస్తుంది? ఏదో ఊతపదం వాడేసుంటావ్. గుర్తుచేసుకో.” అన్నాను.

“నా శ్రాద్ధం! నేను మందు కొట్టను, నీకు తెలుసుగా మైకంలో ఏదో అనేశాననుకోడానికి” కసురుకున్నాడు.

“భోజనాలకి లేవండిక” అంటూ వచ్చింది శ్రీమతి.

“భోంచేస్తూ మాట్లాడుకుందాం. కలసి భోంచేద్దాం, రా!” అన్నాను సోఫాలోంచి లేస్తూ.

“ఈ మాట వెంకటేష్ వింటే తన మరో సినిమాకి ఈ టైటిల్ సెలక్ట్ చేసేస్తాడు.” అన్నాడు నన్ననుసరిస్తూ,

“ఏ టైటిల్?” అన్నాను చేతులు కడుక్కుంటూ.

“కలసి భోంచేద్దాం, రా!”

“ఇదిగో, ఇలాంటి విశ్లేషణా పరిజ్ఞానంతోనే ఆమెనేదో అనేసుంటావ్.” అన్నాను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ.

భోజనం చేస్తూ ఎన్నిసార్లడిగినా తానేమీ అనలేదనే చెప్పేడు. అతడి వాలకం చూస్తుంటే నాకూ నిజమనిపించింది. అయినా, ఆమెను తిట్టవలసిన సందర్భమేమీ లేదాయె.

“సరే, నేను రేపు ఎలాగూ మీ ఆఫీసుకొస్తాను. అప్పుడామెను అడుగుతాను. ఏమీ దిగులు పడకు. ఎమ్డీగారితో కూడా మాట్లాడుతాను. అయినా, ఒక్కసారి క్రిందటి ఆదివారం పార్టీ గుర్తు చేసుకో. అమెతో ఏమేం మాట్లాడేవో పునశ్చరణ చేసుకో” అన్నాను చేతులు కడుక్కుంటూ.

“ఆయనేమీ అనలేదు బాబూ అంటూంటే మళ్ళా ఆయన్నే అనుమానిస్తారేమిటండీ? ” అంది మా ఆవిడ వక్కపొడి డబ్బా అందిస్తూ,

“బాగా చెప్పేవమ్మా. వీడికి నామీదనే అనుమానం. ఎంత చెప్పినా వినడు చూడు.” అన్నాడు సుబ్బారావు తానూ లేస్తూ.

“నీమీద అనుమానం కాదు. రేపు ఆమెతోనూ, ఎమ్డీగారితోనూ మాట్లాడే ముందు నీ వెర్షన్ పూర్తిగా వినాలని” అన్నాను వక్కపొడి నోట్లో వేసుకుంటూ.

చెయ్యి కడుక్కుని వచ్చి నా పక్కనే చతికిలబడ్డాడు. నాకిదో పెద్ద సస్పెన్స్ అయికూర్చుంది.

“పార్టీలో ఆమెను కలసిన సందర్భమూ, ఏం మాట్లాడేవో ఒక్కసారి గుర్తుచేసుకుని వల్లించు చెప్తాను” అన్నాను అతడి మాటల్లో ఏమైనా తప్పిదం దోర్లిందేమోననే శంకతో.

ఒక్కక్షణం మౌనం వహించి అన్నాడు, “నేను సాఫ్ట్ డ్రింక్ తాగుతూండగా వచ్చి గ్లాస్ అందించబోయింది. వద్దని సైగ చేశాను. అంతకుమించి అమెతో మాట్లాడితే ఒట్టు!” అన్నాడు ఖరాఖండిగా.

“ఆమెకు నువ్వు తాగవని తెలుసుగా. నీకు గ్లాసు ఎలా అఫర్ చేసింది?” అన్నాను పెర్రీ మేసన్‍లా పోజుపెట్టి.

“ఏమో! అప్పటికే జిన్ గారు కొంత కడుపులో ప్రవేశించారుగా! ఆ ఎఫెక్టేమో!” అన్నాడు గుంభనగా.

“సరే, నేను రేపు ఆఫీసుకొచ్చి మాట్లాడుతాను. దిగులు పడకు” అని భరోసా అయితే ఇచ్చేశాను గాని మనసంతా అయోమయంగా ఉంది. అతడు వాడే పడికట్టు పదాల కందరూ అలవాటు పడిపోయిన వాళ్ళే ఆఫీసులో. సీరియస్‌గా తీసుకోరు. అయినా, ఆమెతో అసలు మాట్లాడలేదంటున్నాడు. మరీ ఏదో తీవ్రమైన పదజాలం కాకపోతే ఆమె అఫెండవ్వదు.

కొంతసేపు కూర్చున్నాక సుబ్బారావు వెళ్ళిపోయాడు.

ఈ ఇష్యూ నాకొక సంకటంగా మారింది. సుమారు ఒక రోజంతా ఈ అనిశ్చిత పరిస్థితిలో కొనసాగాలి! ఆలోచిస్తూ కూర్చున్నాను సుబ్బారావు మాట విరుపులు తలచుకుంటూ.

ఓ రోజు “ఈ కలం మీదేనాండీ. క్యాంటీన్లో మరచిపోయారు” అని పాపం ఒక కొలీగ్ అతడి కలాన్ని తెచ్చి ఇస్తే, “ఔను, మాదిగా!” అంటూ జేబులో పెట్టుకున్నాడు. దానికతడు బాధ పడ్డాడని నాకు తర్వాత తెలిసింది..

“నన్ను పిలిచేరా సార్?” అని ఓ జూనియర్ అసిస్టెంట్ ఓ సారి అతడి ఎదురుగా నిలబడితే, “నిన్నేరా! మరి” అంటే అతడు నొచ్చుకుని నాతో కంప్లయింట్ చేశాడు.

“అతడి ఉద్దేశం నిన్ను ‘రా’ అని సంబోధించడం కాదు బాబూ, ‘నిన్నే! రా మరి!’ అనడం సొంపది” అని సర్ది చెప్పాను.

***

మర్నాడు బ్రాంచి కెళ్లకుండా సరాసరి హెడ్డాఫీసు కెళ్ళాను.

తన రూమ్‌లో కూర్చుని ఏదో పని కంప్యూటర్లో చేసుకుంటోంది సుందరి. నన్ను చూసి లేచి నిలబడి పలుకరించింది.

“మీతో ఓ విషయం మాట్లాడాలి, సుందరి గారూ” అన్నాను ఆమెకెదురుగా కూర్చుని డైరెక్ట్‌గా ఇష్యూలో కొచ్చేస్తూ, అదేదో తేలే వరకూ నాలో ఉత్సుకత పెరిగిపోతోంది మరి!

“చెప్పండి సార్.” అంది తను చేసుకుంటున్న పనిని ఆపి.

“మా సుబ్బారావు మొన్న పార్టీలో మిమ్మల్నేమైనా అన్నాడా? మీరు చాలా బాధపడుతున్నారని విన్నాను” అన్నాను మెల్లగా.

ఆమె నన్నోసారి సూటిగా చూసి తల దించుకుంది. పలుచని నీటిపొర కూడా చేరింది కంటిలో. నాకర్థమైపోయింది. వీడు దమాయించేస్తున్నాడు కాని ఏదో దౌర్భాగ్యపు పదప్రయోగం చేసేవుంటాడు.

“సారీ, సుందరి గారూ. అతడేమన్నాడో చెప్తారా? ఏమీ అనలేదని దమాయించేస్తున్నాడు.” అన్నాను ఆమె పట్ల సానుభూతి ప్రకటిస్తూ,

“ఆ మాటలు నేను చెప్పలేను సర్. ఓ.యస్. గారినడగండి” అంది రుమాలుతో కళ్ళెత్తుకుంటూ.

“బాధ పడకండి. నేను క్షమాపణ చెప్పిస్తాను అతడిచేత. మనం అంతా ఓ కుటుంబ సభ్యులలా ఉంటున్నాం. ఏదో అపశ్రుతి చోటు చేసుకుంది” అని ఆమెను ఊరడించి ఓ.యస్. గారి వద్దకు నడిచాను.

ఓ.యస్. గారు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయాను. ఆ రోజు సుబ్బారావు శెలవు పెట్టి బ్రతికిపోయాడు. ఉండివుంటే దులిపేసేవాణ్ణి. ఇంత దుర్భాష మాట్లాడి ఏమీ అనలేదంటాడే!

ఎమ్డీగారి చాంబర్లోకెళ్ళి అమెరికా ప్రాజెక్ట్ సంపాదించినందుకు ఆయనని అభినందించి బ్రాంచికెళ్ళకుండా ఎకాఎకి సుబ్బారావు ఇంటికి బయలుదేరాను.

***

ఒక రోజంతా నా బుఱ్ఱలో కావలసినంత అనిశ్చిత స్థితి కలిగించి, చేసిన వెధవపని చేసేసి హాయిగా ఫ్యాన్ క్రింద పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు నేను వెళ్ళేసరికి! ఒళ్ళు మండిపోయింది నాకు.

“చేసిన ఘనకార్యం చేసేసి ఏమీ ఎరగనట్టు ‘రాముడు మంచి బాలుడు’ మార్కు పోజ్ పెడతావా?” అన్నాను కాస్త కోపంగా.

నా వాలకం చూసి గాభరా పడ్డాడు. “ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? ఆమెను నేనేమీ అనలేదంటే నమ్మవేమిటీ?” అన్నాడు లేచి కూర్చుని విస్తుపోతూ.

సోఫాలో కూర్చుంటూ అతడన్న మాటలు ఉటంకించాను. “నారాయణా! అంతమాటంటానా? నువ్వైనా ఎలా నమ్మేవ్?” అన్నాడు దైన్యంగా.

“ఏదో కర్టెసీకి ఆమె డ్రింక్ ఆఫర్ చేసిందే అనుకో, అంత మాటలంటావా?” అన్నాను.

ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ముఖం పెట్టి, “ఆగాగు. చెప్తాను ఏం జరిగిందో” అన్నాడు.

నేను సస్పెన్స్ భరించలేకపోతున్నాను. ఏం చెప్తాడో అని చెవులు రిక్కించి వినడానికి సిద్దపడ్డాను.

అతడు చెప్పడం ప్రారంభించాడు.

“అప్పుడే మన కొలీగ్ సుభ్రమణ్యం ఫోన్ చేశాడు అతడింటినుండి. కావలిస్తే అతడ్ని అడుగు చెప్తాడు. సుందరం కంపెనీలో వాడి ఫ్రండొకడున్నాడు. అమెరికా ప్రాజెక్టు వాడి కంపెనీకే వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నాడన్నాడు. దానికి నేను ‘ఛాలెంజా?’ అన్నాను. అప్పటికే జిన్ను ప్రభావం కొంత ఆమెలో వుండడమూ, ఆమె ఆఫర్ చేస్తున్న గ్లాసుని నేను ఫోనులైనులో ఉంటూ తిరస్కరించడం… నేను వాడిన పదాలు ఆమెకు ‘ఛా!లం..?’ గా వినబడ్డాయన్నమాట! ఫోన్లో సుబ్రహ్మణ్యం అంటున్న మాటలు ఆమెకు వినబడవు కదా! నా మాటలే వినబడ్డాయన్నమాట!” అన్నాడు అదోలా ముఖం పెట్టి.

తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. “ఈ వచో నైశిత్యం ఎంత దారుణంగా పరిణమించిందో! చూశావా, ఇకనుండైనా నీ మాట విరుపులు కట్టిపెట్టు” అన్నాను.

టీ కప్పులో తుఫాను సమసిపోయింది!

“రేపు మీ ఆఫీసుకి నేనూ వస్తాను. ఆమెకు ఈ విషయం చెప్పి ఊరడిద్దాం.” అంటూ లేచాను.

తలమీదనున్న పెనుభారం తొలగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here