పులులను చూసి వాత పెట్టుకున్న నక్క : “కలంక్”

0
3

[box type=’note’ fontsize=’16’] “యెంత హంగూ ఆర్భాటమూ వున్నా, ఆత్మ లోపించిన సినిమా” అంటున్నారు పరేష్. ఎన్. దోషి ‘కలంక్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఇ[/dropcap]దివరకు 2 స్టేట్స్ అందించిన అభిషేక్ వర్మన్ రెండో చిత్రం ఇది. మొదటి చిత్రంలో అతని పని ఆశావహంగా వున్నా, రెండో చిత్రానికి వచ్చే సరికి నిరుత్సాహ పరుస్తుంది. చిత్రం మొదలు కావడమే గొప్ప సెట్టింగుల మధ్య అదిరిపోయే కాస్ట్యూంలలో అందంగా వుంటూ మనం సంజయ్ లీలా భన్సాలి చిత్రానికి గాని వచ్చామా అనిపిస్తుంది. కాని అది యెంతో సేపు నిలవదు. యెందుకంటే నేను సంజయ్ చిత్రాలని ద్వేషిస్తూ, ప్రేమిస్తూ చూస్తాను. అవసరానికి మించిన అందం ఊపిరి ఆడనివ్వదు. అలాగని చూడకుండా వుండనూ లేను. వొక్క ఫ్రేం లో వచ్చే ప్రతి చిన్న వస్తువునూ చాలా జాగ్రత్తగా యెంపిక చేసి మరీ అక్కడ పెడతాడు. ప్రతి ఫ్రేమూ వొక పేంటింగ్ లా వుంటుంది. అంతవరకు సామ్యం ఇందులోనూ కనిపిస్తుంది. Thanks to chiefly Binod Pradhan. కాని దీన్ని మించి సంజయ్ ది కథ చెప్పడంలో, పాత్రల చిత్రీకరణలో ఆరితేరిన చేయి. ఆ పాత్రల స్వభావంతో విభేదించినా అవి నిజంగా వున్న మనుషుల్లాగా మన కళ్ళెదుట వస్తారు. సరే, ఆ పోలిక కాస్త యువ దర్శకుడి పట్ల అన్యాయమైన పోలిక అనుకుని కాసేపు మరచి పోదాము. ఆనవాయితీగా కథను క్లుప్తంగా చూద్దాం.

కథాకాలం 1944. స్థలం లాహోర్ నగరానికి బయట వో ఊహాజనిత స్థలం హుస్నాబాద్. వేశ్యా వాడలను ఆనుకుని కమ్మరోళ్ళ కార్ఖానాలు. మరో పక్క జమీందారులు అనతగ్గ చౌధరీల కుటుంబం. ఆ ఇంటి కోడలు సత్య (సోనాక్షి సిన్‌హా) కేన్సర్తో బాధపడుతూ చావుకు దగ్గర్లో వుంటుంది. తన తర్వాత భర్త సుఖం కోసం ఆమె రాజస్థాన్ నుంచి రూప్ (ఆలియా భట్) ను అతి కష్టం మీద ఒప్పించి తన భర్త దేవ్ (ఆదిత్య రాయ్ కపూర్) కు రెండో భార్య గా తెస్తుంది. రూప్ కూడా పేదరికానికి తలొగ్గి వొప్పుకోవాల్సి వస్తుంది, అదీ తన చెల్లెళ్ళ సుఖం కోసం. వేశ్యా వాడలో మేడం బహారా బేగుం (మాధురీ దీక్షిత్) నాట్యం అయితే మానేసింది కాని, సంగీతం పాఠాలు చెబుతుంటుంది. ఆమెకు దేవ్ తండ్రి బలరాజ్ చౌధరి (సంజయ్ దత్) ల అక్రమ సంతానమే జఫర్ (వరుణ్ ధవన్). భంగ పడ్డ ప్రేమికురాలుగా బేగం, అక్రమ సంతానంగా సమాజం నుంచి తిరస్కారాలు అవమానాలు పడ్డ మనిషిగా జఫర్ లోపల్లోపల జ్వలిస్తూ వుంటారు. రూప్ తన ఆగిపోయిన సంగీత శిక్షణను కొనసాగించడానికి బేగం దగ్గర జేరుతుంది. అక్కడ తారసపడిన జఫర్ పట్ల క్రమంగా ఆకర్షితురాలై దగ్గరవుతుంది. దేవ్ నడుపుతున్న పత్రికలో యెప్పుడూ దేశం అఖండంగా వుండాలని సూచించే వార్తలు ప్రచురిస్తుంటాడు. మరో పక్క దేశంలో విభజన జరిగే సూచనలు బల పడుతున్నాయి. హుస్నాబాద్ లో ఆధిక్యంలో వున్న ముస్లింల సమూహం నాయకుడు అబ్దుల్ ఖాన్ (కుణాల్ ఖేము) దేవ్ ని అతని వార్తా పత్రికని శత్రువుగా ప్రకటిస్తాడు. ఆంగ్లేయులు తలుస్తున్నట్టు లాహోర్ లో గనక స్టీల్ ఫేక్టరి వస్తే కమ్మరి సమూహమ మొత్తం నిరాధారులవుతారు అని భయపడతాడు. బలరాజ్ కారణంగా తనకు సమాజంలో అవమానాలు యెదురయ్యాయని, ప్రతీకారంగా ఆ యింటి కోడలు రూప్ ను వలలో వేసుకోవాలని జఫర్ ఆలోచన. అది ప్రేమగా యెప్పుడు మారిందో అర్థం కాకముందే చాలా జరిగిపోతుంటుంది. వొక కథ చెప్తానని చాలా చెప్పేశానా? అవును ఇది చాలా కథలు కలిపిన ఖిచడీ కథ. ఓపిక వుంటే టీవీ లో వచ్చినప్పుడు చూడండి.

ముందు నచ్చిన విషయాలు చెప్పుకుందాం. అమితాభ్ భట్టాచార్య పాటలకు ప్రీతం సంగీతం బాగుంది. Kalank nahi ishq hai kaajal piya అని పాటలో వొక వాక్యం. అంటే ప్రేమ వో మరక కాదు కంటికి అలంకరణ అయిన కాటుకే అని. ఇంత మంచి వూహకు తగ్గట్టుగా కథ (శివాని బతీజా) అల్లలేదు, పాత్రలు తీర్చిదిద్దలేదు. సరోజ్ ఖాన్, రెమో దిసూజా ల కోరియోగ్రఫీలో కొన్ని డాన్సులు బాగున్నాయి. అయితే మాధురి నాట్యంలో ఇదివరకటి మేజిక్ తగ్గింది. సినెమాలో ఆర్ట్ వర్క్, సెట్టింగులు, దుస్తులు అన్నీ అందంగా వున్నాయి. 1944 కాలానికి యెంత దగ్గరగా వున్నాయి అని ఆలోచించవద్దు. చాయాగ్రహణం బాగుంది. కెమెరా వెనుక వున్నది బినోద్ ప్రధాన్ మరి (1942 ఎ లవ్ స్టోరి, దేవ్‌దాస్ వగైరా). ఇక నటన విషయానికి వస్తే పాత్రలో యెన్ని లోపాలున్నా యెలా వున్నా ఆలియా భట్ కి చాలా బాగా నటించడం అలవాటైపోయింది. ఆమె తర్వాత బాగా చేసిన నటుడు కుణాల్ ఖెము. మిగతా వారి గురించి చెప్పుకోతగ్గది పెద్దగా లేదు. వరుణ్ డాన్సులలో ప్రతిభ కనబరుస్తాడు, తిరిగిన కండల ప్రదర్శన బాగా చేస్తాడు. ఆదిత్య సినెమా మొత్తం వొకే భావప్రకటనతో లాక్కొచ్చినా వొక సన్నివేశంలో కళ్ళల్లో ఆశ్చర్యాన్ని పలికించి మనలను ఆశ్చర్యపరుస్తాడు. ఇక మాధురి నిరాశ పరచడంలో ఆమె కంటె ఆమె పాత్ర తీర్చి దిద్దిన విధానం, దర్శకత్వం వీటిని తప్పు పట్టాలి. ఆమె మేకప్పును కూడా. చాలా పాత సినిమాలు మొఘలేఆజం, పాకీజా లాంటివి ఇప్పటికీ మనకు గుర్తుండిపోయాయి. వాటిలోని సంభాషణలు కవితాత్మక ఉర్దూలో వుండి ఆ నటులు అందంగా పలకడం, మనకు కంఠతా వచ్చేయడం సహజంగా జరిగిపోయింది. హుసేన్ దలాల్ సంభాషణలు చదివితే, ఆ పాత్రల నోటంట వింటే బానే వున్నాయనిపిస్తుంది. కాని అసలైనదేదో లోపించినట్టు, ఉప్పులేని వంటకం లాగా అనిపిస్తుంది. అన్ని సంభారాలూ అందుబాటులో వున్నా చేయి తిరిగిన మనిషే ఘుమఘుమలాడే వంటకాన్ని చేయగలడు మరి. దగా పడ్డ వెలయాలుగా మాధురి దీక్షిత్ పాత్ర, అక్రమ సంతానంగా వరుణ్ ధవన్ పాత్ర నిజానికి చాలా బలమైన పాత్రలు. కాని వాటిని చక్కగా మలచలేదు. కేవలం అలంకారంలో మాధురి పాకీజా లోని మీనా కుమారి లా కనిపిస్తుంది, అంతే. పాత్ర అంతకంటే ముందుకెళ్ళదు. ఇక మహేష్ భట్ వొక్కడే అక్రమ సంతానం ఈ సమాజంలో, తన అంతరంగంలో యెన్ని సంఘర్షణలు పడతాడో కొన్ని చిత్రాలలో చూపించాడు. ఇందులో జఫర్ పాత్ర నామమాత్రంగా ఆ పని చేస్తుంది. మనం వొక్క రూప్ పాత్ర తప్ప మరే పాత్రతోనూ మమేకం కాలేము.

పీరియడ్ చిత్రాలలో వచ్చే వొక చిత్రమైన సమస్యకు నేను అనుకుంటున్న కారణం వొకటి ఆ సమయంలో వున్న స్థితులు, విలువలకు రిలేట్ కాలేకపోవడం. ఇందులోనే కాదు ఇదివరకు కూడా జరిగింది ఇలా. అమృతా ప్రీతం వ్రాసిన నవల “పింజర్” ఆధారంగా తీసిన చిత్రం “పింజర్” లో మనోజ్ బాజ్పేయి, ఊర్మిళా మాటోండ్కర్ లు నటించారు. మనోజ్ చాలా బాగా నటించాడు. కాని ఊర్మిళ అంత బాగా చెయ్యలేకపోయింది. ఆ కథా కాలం కూడా 1947 కు ముందు. అందులో ఆ పాత్ర అపహరించబడుతుంది, కాని తర్వాత విడిచి పెట్టినా ఆమెకు లోక భీతి, పరువూ మర్యాదలు వగైరాల కారణంగా స్వంత ఇంట్లోనే ప్రవేశం వుండదు. ఇప్పటి తరానికి ఆ రకమైన కట్టుబాట్లు ఉన్నప్పుడు ఆ మనిషి పడే ఆవేదనతో రిలేట్ కాలేకపోవడం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె అంత చక్కగా చేయలేక పోయింది. ఇక ఈ చిత్రానికి వస్తే, స్వాతంత్ర్యానికి పూర్వం చిత్రించిన సమాజంలో దేశ భక్తి, స్వాతంత్ర్యం కోసం ఆరాటం వగైరాలు కనబడవు. పాత్రలన్నీ అట్ట ముక్కల్లా తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. యెంత హంగూ ఆర్భాటమూ వున్నా, ఆత్మ లోపిస్తుంది.

చిత్రం నిడివి యెంత పెద్దదంటే కనీసం రెండు ఇంటర్వెల్లులు వుండి, మధ్యలో లేచి వెళ్ళిపోవడానికి థియేటర్లలో వీలుండేలా వుండాలి. దీన్నే సకారాత్మక అనుకూలతతో చెప్పాలంటే ప్రేక్షకుల్లో సహనాన్ని పెంపొందిస్తుంది అనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here