తిరుమలేశుని సన్నిధిలో… -11

0
5

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

60 ఏళ్ళ నాటి తిరుపతి:

[dropcap]1[/dropcap]960 ప్రాంతాలలో తిరుపతికి బ్రాడ్‌గేజ్ మార్గం లేదు. రేణిగుంట జంక్షన్‌లో దిగి బస్సులలోనో, మీటర్ గేజ్ రైలులోనో తిరుపతి కెళ్ళేవారు. రైల్వే స్టేషన్ పక్కనే వున్న విష్ణు నివాస ప్రాంతంలో తిరుపతి నుండి తిరుమల వెళ్ళే  బస్సులు వుండేవి.  ఆ బస్సులను దేవస్థానమే నడిపేది. అందులో టిక్కెట్ సంపాదించడానికి పెద్ద పెద్ద కంపార్టుమెంట్లలో జనం కూచొని వుండేవారు. బస్సుల సంఖ్య కూడా పరిమితంగా వుండడం వల్ల కొంత అసౌకర్యంగా వుండేది.

దేవస్థాన రవాణా విభాగంలో బస్ కండక్టర్లు, డ్రైవర్లు పనిచేసేవారు. ఏవో కోరికలతో రవాణా సిబ్బంది సమ్మె చాలా రోజులు చేశారు. తర్వాత ఈ గొడవ ఎందుకని దేవస్థానం రవాణా సౌకర్యాన్ని ఏ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి.కి అప్పగించింది. అయితే దేవస్థానంలో ప్రత్యేకంగా రవాణా విభాగం వుంది. కార్లు, వ్యాన్లు, బస్సులు అధిక సంఖ్యలో ఉన్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనాలకు ఎదురుగా ఈ రవాణా విభాగం పనిచేస్తోంది. 2010 వరకూ ఈ విభాగ పర్యవేక్షణకు ఆర్.టి.సి. నుండి జనరల్ మేనేజర్ హోదా గల అధికారి డిప్యుటేషన్‌పై రెండు లేదా మూడు సంవత్సరాలు పని చేసి తిరిగి తమ స్వస్థానాలకు వెళ్ళేవారు. 2010 తర్వాత శేషారెడ్డి పూర్తికాలం మేనేజర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి పని చేస్తున్నారు. అధికార్లకు కార్లు, కొండమీదికి దేవస్థానం సామాగ్రి చేరవేసే వ్యాన్లు, బస్సులు ఇందులో భాగం.

డిప్యుటేషన్‌పై అధికారులు:

తిరుమల తిరుపతి దేవస్థానం 1933 వరకు మహంతుల అధికారంలో కొనసాగింది. ఆ తరువాత మదరాసు శాసనసభ ఒక ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పాలకమండలితో పని చేయనారంభించింది. ఇందులో పని చేసే ఉన్నతాధికారులు వివిధ శాఖల నుండి డిప్యూటేషన్‌పై రెండు లేదా మూడు సంవత్సరాలు పని చేసి ఆ తరువాత స్వస్థానాలకు వెళ్ళిపోతారు. అలా వచ్చే అధికారులలో ప్రథమ స్థానం – కార్యనిర్వహణాధికారిది (ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు). ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన ఐఎఎస్ అధికారులలో సీనియర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టుకు పంపుతుంది. ప్రధాన కార్యదర్శి హోదా గల అధికారులు కూడా ఈ పదవిని గౌరవప్రదంగా భావిస్తారు. దైవ సన్నిధి కావడమే విశేషం.

ఐఎఎస్ అధికారుల నుండి తిరుమలలో పనిచేసేందుకు ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని, తిరుపతిలో పనిచేసేందుకు ఒక జె.ఇ.ఓ.ని రాష్ట్ర ప్రభుత్వం డెప్యుటేషన్‌పై పంపుతుంది. ఇన్‌కమ్‌టాక్స్ లేదా ఇతర అకౌంట్స్ విభాగాల అధికారులను ఎఫ్‌ఎ అండ్ సిఎఓ గా ఎంపికజేస్తారు. అలానే అటవీశాఖ అధికారిని ఫారెస్ట్ కన్సర్వేటర్ గాను, జుడిషియల్ విభాగం అధికారిని లా ఆఫీసర్ గాను, రెవిన్యూ శాఖ (ఆర్‌డిఓ క్యాడర్) అధికారిని ఎస్టేట్ ఆఫీసర్ గాను, పోలీసు శాఖ వారిని చీఫ్ విజిలెన్స్ అధికారి గాను, విద్యాశాఖ వారిని విద్యాశాఖాధికారి గాను నియమిస్తారు. ప్రజా సంబంధాల శాఖాధికారిని సమాచార శాఖ నుంచి ఎంపిక చేస్తారు. ఇటీవలి కాలంలో విద్యాశాఖ, ప్రజా సంబంధాలు, ప్రింటింగ్ ప్రెస్ విభాగాలకు దేవస్థానం అధికారులనే నియమిస్తున్నారు. ప్రస్తుతం (2019) ఏ.కే. సింఘాల్ 25వ కార్యనిర్వహణ అధికారి.

దేవస్థాన పూర్వస్థితి:

1966 జనవరి నాటి సప్తగిరి మాసపత్రిక సంచిక నా పరిశోధన సమయంలో కంటబడింది. 1950లో సప్తగిరి మాస పత్రిక ప్రారంభించారు. పాత సత్రాలు (ఒకటో నెంబర్‌లో) దాని కార్యాలయం ఉండేది. నేను ఎం.ఏ. విద్యార్థిగా 1965 జూన్‌లో ఈ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కాట్రపాటి సుబ్బారావు దాని సంపాదకులు. ఆయన 30 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 1966 సప్తగిరి సంచికలో విశేషాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ నంబరు 4487తో తిరుమల తిరుపతి దేవస్థానం జర్నల్ పేరుతో 1950లో ⅛ డెమ్మీ సైజులో ఈ పత్రిక వెలువడింది. వెల 25  పైసలు. ఈ మాసపత్రికలో ఆంగ్లం, తెలుగు, తమిళ భాషలలో వ్యాసాలు వచ్చాయి. సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక పత్రికగా ఇది వెలువడింది. తర్వాతి కాలంలో రామమూర్తి సంపాదకులు. ఆపై సి. శైలకుమార్ ప్రధాన సంపాదకులు. ప్రస్తుతం 2019 ఏప్రిల్ నాటికి రాధా రమణ ప్రధాన సంపాదకులు. అంతర్జాలంలో కూడా ఈ పత్రిక లభ్యం. వివిధ భాషలలో ఈ పత్రిక వస్తోంది. ఆధ్యాత్మిక సమాచారంతో బాటు, కలర్ ఫోటోలతో సర్వాంగ సుందరంగా ఈ పత్రిక వస్తోంది. చందాదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

వింత వింత విశేషాలు:

1965 డిసెంబర్‌లో తిరుమలకు ప్రయాణించిన భక్తుల వివరాలివి: దేవస్థానం బస్సులలో – 1,72,000 (లక్షా డెబ్బయి రెండు వేలు), కార్లలో – 32,320, మోటారు సైకిళ్లపై 149 మంది. ఇటీవలి కాలంలో ప్రైవేటు వ్యక్తుల జీపులు, కార్లు, ఇతర వాహనాలు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. 1944లో (ఏప్రిల్) తొలి ఘాట్ రోడ్డు మెలికలతో నిర్మించారు. చాలా సినిమాలలో ఈ ఘాట్ రోడ్డ దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. రాకపోకలు రెండిటికీ ఇదే ఘాట్ రోడ్డు రెండు దశాబ్దులుగా వాడుకలో వుంది.

రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం తరువాత తిరుమలకు వెళ్లే బస్సులు ఈ మార్గంలో వెళుతున్నాయి. తిరుపతికి తిరుమల నుండి వచ్చే బస్సులు పాత ఘాట్ రోడ్డుపై నడుస్తున్నాయి. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఏదైనా అంతరాయం ఎప్పుడైనా కలుగుతుంది. స్వామివారి కరుణ వల్ల ఏనాడు ఘాట్ రోడ్డులో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి యాత్రికులు మరణించలేదు. బస్సు సగభాగం అంచునకు చేరిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు కారు ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం లేదు. అలానే తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజు మూడు లక్షల మంది జనం చేరినా ఎక్కడా తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరగకపోవడం దైవ కృప. మరి స్వామి వరద హస్తం ఉంది గదా!

వసతి సౌకర్యం:

తిరుమలకు నిత్యం 70 వేల నుండి లక్ష మంది దాకా భక్తులు దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తారు. 1966 నాటికి తిరుమలపై వసతి సౌకర్యాలు పరిమితం. యాత్రికులు పరిమిత సంఖ్యలో వచ్చేవారు. మహాద్వారం గుండా దర్శనం చేసుకునేవారు. రాను రాను యాత్రికుల సంఖ్య పెరిగింది. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటవ మార్గం ప్రారంభించారు. అప్పటినుండి మహాద్వార దర్శనం భక్తులకు లేదు. పీఠాధిపతులకు, రాష్ట్రపతి, గవర్నర్ల వంటి ప్రముఖులకు మహాద్వార దర్శనం ప్రత్యేకంగా కల్పించారు. 2019 మార్చి నెలలో ఈ సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు తదితరులకు కల్పిస్తూ ప్రభుత్వాదేశాలు జారీ చేశారు. ఒకప్పుడు తిరుమల సత్రాలు, కాటేజీలు పరిమిత సంఖ్యలో ఉండేవి. గత రెండు దశాబ్దులలో వివిధ సంస్థలకు, దాతలకు కాటేజీల నిర్మాణానికి అనుమతి లభించింది. కొండ మీద నివసించేవారికి వేరే ప్రాంతాలలో గృహ వసతి కల్పించారు. వివిధ పీఠాలు, ఆశ్రమాలు వసతి గృహాలు ఏర్పాటు చేసుకొని అద్దె పద్ధతిపై భక్తులకు అందిస్తున్నాయి. తిరుమల కొండపై 1966లో నివసిస్తున్న జనాభా సంఖ్య 5,100.

ఆదాయం:

హుండీ ఆదాయం గత దశాబ్ది కాలంలో గణనీయంగా పెరిగింది. నిత్యం కోటి రూపాయలు సగటున హుండీ ఆదాయంగా లభిస్తోంది. 1965 డిసెంబరు మాసంలో వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయ వివరాలను 1966 జనవరి సప్తగిరి సంచికలో ప్రచురించారు. ఆసక్తికరమైన ఆ వివరాలివి:

ఆలయము నెలసరి ఆదాయం (రూపాయలలో)
1. తిరుమల ఆలయం 11,96,285
2. తిరుచానూరు పద్మావతి అమ్మవారు 3,862
3. తిరుపతి గోవిందరాజస్వామి 10,953
4. తిరుపతి శ్రీ కోదండరామస్వామి 696
5. తిరుపతి కపిలేశ్వర స్వామి 686
వెరసి దేవస్థానం మొత్తం ఆదాయం 12,12,482

ప్రస్తుత దేవస్థాన ఆదాయంతో పోలిస్తే దేవస్థానం నెలసరి ఆదాయం ఆనాడు 12 లక్షలకు పరిమితం కావడం ఆశ్చర్యజనకం.

మరో విశేషం – 1964  డిసెంబరు మాస ఆదాయం.

ఆలయము        ఆదాయం (రూపాయలలో)
1. తిరుమల 9,13,397
2. తిరుచానూరు 3,844
3. గోవిందరాజస్వామి 9,863
4. శ్రీ కోదండరామస్వామి 677
5. కపిలేశ్వర స్వామి 672
మొత్తం 9,33,454

ఇతర ఆలయాలతో పోలిస్తే అన్నగారు గోవిందరాజ స్వామి ఆలయ ఆదాయం కొంత మెరుగు. దానికి కారణం భక్తులు ముందుగా తిరుపతిలో గోవిందరాజస్వామిని దర్శించి తృణమో, ఫణమో హుండీలో సమర్పించడమే. రామాలయానికి వెళ్ళే భక్తుల సంఖ్య పరిమితం. ఈ విధంగా 60 ఏళ్ళ నాటి తిరుమల – తిరుపతి ముఖచిత్రం ఆశ్చర్యజనకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here