ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 6

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

భద్ర! వర్ణ యేదానీం స్వనియోగ వృత్తాన్తమ్ అపి వృషల మనురక్తాః ప్రకృతయః?

అర్థం:

భద్ర=నాయనా!, ఇదానీమ్=ఇప్పుడిక, స్వ+నియోగ+వృత్తాన్తమ్=నీకప్పగించిన పని గురించి, వర్ణయ=విశదంగా చెప్పు, ప్రకృతయః=ప్రజలు, అపివృషలమ్+అనురక్తాః?= చంద్రగుప్తుడిని ఇష్టపడుతున్నారా?

చరః:

అహ ఇం, అజ్జేణ ఖు తేసు తేసు విరాఆకారణేసు పరిహరి అన్తేసు సుగుహీదనామహేఏ దేవే చన్దఉత్తే దిఢంఅణురత్తా ఓ పకిదిఓ। కిన్దు ఉణ అత్తి ఎత్థ ణఅరే అమచ్చరక్ఖసేణ సహ పఢమం సముప్పణ్ణ సిణేహ బహుమాణా తిణ్ణి పురసా దేవస్స చన్దసిరిణో సిరిం ణ సహన్ది॥

(అథ కిం, ఆర్యేణ ఖలు తేషు తేషు విరాగకారణేషు పరిహ్రియమాణేషు సుగృహీతనామధేయే దేవే చన్ద్రగుప్తే దృఢ మనురక్తాః ప్రకృతయః। కిం తు పునరస్త్యత్ర నగరే అమాత్య రాక్షసేన సహ ప్రథమం సముత్పన్న స్నేహబహుమానా స్త్రయః పురుషాః। దేవస్య చన్దశ్రియః శ్రియం న సహన్తే॥)

అర్థం:

అథకిమ్=అవును, ఆర్యేణ=తమరు (తమరి చేత), తేషు తేషు+విరాగ కారణేషు=ఆయా అనిష్ట కారణాలను (కారణాల విషయంలో), పరిహ్రియమాణేషు=తొలగించడం ఎప్పటికప్పుడు చేస్తుండగా (చేయబడుతుండగా), సుగృహీతనామధేయే=సుప్రసిద్ధుడైన, దేవే+చన్ద్రగుప్తే=చంద్రగుప్త ప్రభువునందు, ప్రకృతయః=ప్రజలు, దృఢం+అనురక్తాః+(భవన్తి)=గాఢంగా ప్రేమ చూపిస్తున్నారు (అనురాగంతో ఉన్నారు), కిం తు = ఇక చెప్పవలసినదేమంటే, అస్తి+అత్ర+నగరే=ఈ పాటలీపుత్ర నగరంలో, రాక్షసేన+సహ=రాక్షసమంత్రి పట్ల (విషయమైతే), సం+ఉత్పన్న+స్నేహ+బహుమానాః=స్నేహాభిమానాలు గల, త్రయః+పురుషాః=ముగ్గురు వ్యక్తులు, (సన్తి)=ఉన్నారు. (వారు) దేవస్య+చన్ద్రశ్రియః=ప్రభువైన చంద్రగుప్త శ్రీమంతుని, శ్రియం=వైభవాన్ని, న+సహన్తే= భరించలేకుండా ఉన్నారు.

చాణక్యః:

(సక్రోధమ్) ననువక్తవ్యం స్వజీవితం న సహన్త ఇతి। భద్ర, అపి జ్ఞాయన్తే నామధేయతః?

అర్థం:

(స+క్రోధమ్=కోపంగా), స్వజీవితం+న+సనన్తే+ఇతి= (వారు) తమ బతుకు భరించలేకుండా ఉన్నారనీ, వ్యక్తవ్యం=చెప్పాలి, భద్ర=నాయనా, నామధేయతః=వారి పేర్లు ఏమిటో, అపి+జ్ఞాయన్తే?= తెలిసివచ్చాయా?

చరః:

కహం అజాణిఅ ణామహేయా అజ్జస్స ణివేదిఅన్తి. (కథ మజ్ఞాతనామ ధేయా ఆర్యస్య నివేద్యన్తే!)

అర్థం:

అజ్ఞాత+నామధేయాః= పేర్లు తెలియకుండా (తెలియబడకుండా), ఆర్యస్య+నివేద్యత్= అయ్యగారికి, పేరు తెలుసుకోకుండా చెప్పడమా? (చెప్పబడతారా?)

చాణక్యః:

తేన హి శ్రోతు మిచ్ఛామి

అర్థం:

(అయితే) తేన+హి+శ్రోతుం+ఇచ్ఛామి= అదేమిటో వినాలని వుంది.

చరః:

సుణాదు అజ్జో। పఢమం దావ అజ్జస్స రిపుపక్ఖే బద్ధపక్ఖవాదో ఖవణఓ జీవసిద్దీ। (శృణో త్వార్యః  ప్రథమం తావత్ ఆర్యస్య రివుపక్షే బద్ధపక్షపాతః క్షపణకో జీవసిద్ధిః)

అర్థం:

ఆర్యః+శ్రుణోతు=అయ్యా, వినండి; ప్రథమం+తావత్=మొట్టమొదటివాడెవడంటే, ఆర్య+రిపు+పక్షే=అయ్యగారి శత్రుపక్షంలో, బద్ధ+పక్షపాతః=గట్టి పక్షపాతం గల, క్షపణకః జీవసిద్ధిః=జీవసిద్ధి అనే సన్న్యాసి!

చాణక్యః:

(సహర్షమ్ ఆత్మగతమ్) అస్మద్రిపుపక్షే బద్ధ పక్షపాతః క్షపణకః!

అర్థం:

క్షపణకః+అస్మాత్+రిపుపక్షే+బద్ధపక్షపాతః!= సన్న్యాసి (జీవసిద్ధి) మన శత్రుపక్షం పట్ల పక్షపాతంతో ఉన్నాడా!! (ఉండడమా?)

చరః:

జీవసిద్ధి నామ సో జేణ సా అమచ్చరక్ఖసప్పఉత్తా విసకణ్ణా దేవే పవ్వదీసరే సమావేసిదా. (జీవసిద్ది ర్నామ స యేన సా అమాత్యరాక్షసప్రయుక్తా విషకన్యా దేవే పర్వతేశ్వరే సమావేశితా)

అర్థం:

జీవసిద్ధిః+నామ= జీవసిద్ధి అంటే (ఎవరనుకుంటున్నారు?), యేన=ఎవడైతే (ఎవని చేతనైతే), అమాత్య+రాక్షస+ప్రయుక్తా+విషకన్యా=రాక్షసమంత్రి (చేత) ప్రయోగించిన (ప్రయోగించబడిన) ఆ విషకన్య(ను), దేవే+పర్వతేశ్వరే=పర్వతేశ్వర ప్రభువుతో (మీద), సమావేశితా=కలిపినవాడు (కల్పించబడింది). (జీవసిద్ధి, రాక్షసమంత్రి ప్రయోగించడానికి ఉద్దేశించిన విషకన్యను, పర్వతేశ్వర ప్రభువుతో కలిపాడు).

వ్యాఖ్య:

ఈ విషయాన్ని చాణక్యుడు ఇంతకుముందే తన ఆత్మగతమ్ ద్వారా బయటపెట్టాడు. రాక్షసమంత్రి విషకన్యను చంద్రగుప్తుడిపై ప్రయోగించడానికి సిద్ధం చేయిస్తే చాణక్యుడు రహస్య మంత్రాంగం పన్ని ఆమెను పర్వతేశ్వరుడి మీద ప్రయోగించేలా చేశాడు. ఇందుకు సాధనం జీవసిద్ధియే అయ్యాడు.

చాణక్యః:

(స్వగతమ్) జీవసిద్ధి రేష తావ ద స్మత్ప్రణిధిః। (ప్రకాశమ్) భద్ర, అధాపరః కః?

అర్థం:

(స్వగతమ్=తనలో), ఏషః+తావత్+జీవసిద్ధిః=ఈ జీవసిద్ధి అయితే, అస్మత్+ఫణిధిః (ఏవ)=మా గూఢచారే!!, (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, అధ+అపరః+కః=ఇంక రెండోవాడెవడు?

చరః:

అజ్జ, అవరో వి అమచ్చరక్ఖసస్స పిఅవఅస్సో కాయత్థో సఅడదాసో ణామ. (ఆర్య, అపరో ఽపి ఆమాత్య రాక్షసస్య ప్రియవయస్యః కాయస్థః శకటదాసో నామ॥)

అర్థం:

ఆర్య=అయ్యా, అపరః+అపి=మరొకడు కూడా, అమాత్య రాక్షసస్య=రాక్షసమంత్రి (యొక్క), ప్రియవయస్యః=అనుంగు చెలికాడు, శకటదాసః+నామ+కాయస్థః=శకటదాసు అనే కరణ కులం వాడు.

చాణక్యః:

(విహస్య, ఆత్మగతమ్) కాయస్థ ఇతి లఘ్వీ మాత్రా తధాపి న యుక్తం ప్రాకృత మపి రిపు మవజ్ఞాతుమ్. తస్మిన్ మయా సుహృచ్ఛద్మనా సిద్ధార్థకః వినిక్షిప్తః! (ప్రకాశమ్) భద్ర, తృతీయం శ్రోతు మిచ్ఛామి.

అర్థం:

(విహస్య=నవ్వి, ఆత్మగతమ్=తనలో), కాయస్థః+ఇతి=కరణం వాడైతే, లఘ్వీమాత్రా=పిపీలికం గాడు (చాలా చిన్నవాడు), తధా+అపి=అయినప్పటికీ, ప్రాకృతం+అపి=పట్టించుకోదగివాడైనా (వాడినైనా), రిపుం+అవజ్ఞాతుం=శత్రువును ఉపేక్షించడం, న+యుక్తం=తగదు, తస్మిన్=వాడి విషయంలో (వాడిపై), సుహృత్+ఛద్మనా=స్నేహితుడనే మారు వేషంతో, సిద్ధార్థకః= సిద్ధార్థుడు, మయా+వినిక్షిప్తః=నా ద్వారా నియోగించబడ్డాడు (నేను ఏర్పాటు చేశాను), (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, తృతీయ=మూడవవాడెవరో (గురించి),శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

చరః:

తిదీయో వి అమచ్చరక్ఖసస్స దుదీయం హిఅఅం, పుప్పఉర ణివాసీ మణిఆర సెట్ఠీ చన్దణదాసో ణామ, జస్స గేహే కళత్తం ణ్ణాసీకదుఅ అమచ్ఛరక్ఖసో ణఅరాదో అవక్కన్తో!

(తృతీయో ఽపి అమాత్యరాక్షసస్య ద్వితీయం హృదయం పుష్పపుర నివాసీ మణికార శ్రేష్ఠీ చన్దనదాసో నామ। యస్య గే హే కళత్రం న్యాసీకృత్య అమాత్యరాక్షసో నగరా దపక్రాన్తః)

అర్థం:

తృతీయ+అపి=మూడవ వ్యక్తి కూడా, అమాత్య+రాక్షసస్య=రాక్షసమంత్రి (యొక్క), ద్వితీయం+హృదయం=రెండవ గుండెకాయ (అనదగిన), పుష్పపుర+నివాసీ=పాటలీపుత్ర నివాసి, మణికారశ్రేష్ఠీ=రత్నవర్తకుడు, చన్దనదాసః+నామ=చన్దనదాసు అనే పేరింటివాడు. – (ఎలా చెప్పగలవంటారేమో), యస్య+గేహే (అస్య+గేహే)= అతడి ఇంట్లోనే, కళత్రం+న్యాసీకృత్య=తన భార్యను అట్టేపెట్టి, అమాత్య+రాక్షసః=రాక్షసమంత్రి, నగరాత్+అపక్రాన్తః=నగరం దాటిపోయాడు (నగరం నుంచి ఉడాయించాడు).

చాణక్యః:

(ఆత్మగతమ్) నూనం సుహృత్తమః। న హ్యనాత్మ సదృశేషు రాక్షసః కళత్రం న్యాసీకరిప్యతి। (ప్రకాశమ్) భద్ర, చన్దనదాసస్య గృహే రాక్షసేన కళత్రం న్యాసీకృత మితి కథ మవగమ్యతే?

అర్థం:

(ఆత్మగతమ్=తనలో), సుహృత్తమః+నూనం=బహుశా చాలా గొప్ప స్నేహితుడే అయి ఉండాలి (సందేహం లేదు). రాక్షసః=రాక్షసమంత్రి, అనాత్మ (న+ఆత్మ) సదృశేషు=తనవాడు అని నమ్మని వారి యందు (వారి దగ్గర), కళత్రం+న+న్యాసీకరిష్యతి=భార్యను ఉంచడు, (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, చన్దనదాసస్య+గృహే=చందనదాసు ఇంట్లో, రాక్షసేన+కళత్రం+న్యాసీకృతం+ఇతి=రాక్షసుడు (చేత) తన భార్యను ఉంచాడని, కథం+అవగమ్యతే=ఎలా తెలిసింది (తెలియబడింది?).

చరః:

అజ్జ, ఇఅం ఆఞ్గుళీఅముద్దా ఆజ్జం అవగదత్థం కరిస్సది. (ఆర్య ఇయ మఞ్గుళి ముద్రా ఆర్య మవగతార్థం కరిష్యతి.)

(ఇ త్యర్ప యతి)

అర్థం:

ఆర్య=అయ్యా, ఇయం+అఞ్గుళిముద్రా=ఈ ‘వ్రేలి’ ఉంగరం, అవగతార్థం+ఆర్యం+కరిష్యతి=ఆ అయ్యగారి ఆచూకీ తెలియజెపుతోంది. (ఇతి+అర్పయతి= అని (చెప్పి) చేతిలో పెట్టాడు).

చాణక్యః:

(ముద్రా మవలోక్య గృహీత్వా రాక్షసస్య నామ వాచయతి। సహర్షం స్వగతమ్) నను వక్తవ్యం రాక్షస ఏవ అస్మదఞ్గుళిప్రణయీ సంవృత్త ఇతి। (ప్రకాశమ్) భద్ర, అఞ్గుళి ముద్రాధిగమం విస్తరేణ శ్రోతు మిచ్ఛామి.

అర్థం:

(ముద్రాం=ఉంగరాన్ని, అవలోక్యా=చూచి, గృహీత్వాం=తీసుకుని, రాక్షసస్య నామ+వాచయతి=రాక్షసుని (యొక్క) పేరును చదివాడు (పలికాడు), సహర్షమ్=ఆనందంగా, స్వగతమ్=తనలో), రాక్షసః+ఏవ=స్వయంగా రాక్షసుడే, అస్మత్ అఞ్గుళి+ప్రణయీ+ఇతి=నా వ్రేలిని వరించాడు, సంవృత్తః=(నా చేతికి చిక్కి) కూర్చున్నాడు, నమ+వ్యక్తత్వం=అని చెప్పుకోవాలి, (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, అఞ్గుళిముద్రా+అధిగమ=ఈ ఉంగరం నీకు చేరిన వైనం, విస్తరేణ=వివరంగా, శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

వ్యాఖ్య:

ఇప్పుడు ఈ చారుడు చెప్పే ఈ విశేషం యీ నాటకానికి కీలకమైనది. ఈ రాక్షసమంత్రి ఉంగరం ఆధారంగానే చాణక్యుడు చాలా కథ నడిపిస్తాడు. ఈ నాటకానికి ‘ముద్రారాక్షసమ్’ అనే పేరు కూడా యీ కీలక సందర్భ సూచకంగానే సార్థకమైంది. ‘రాక్షసస్య ముద్రామధికృత్యకృతో గ్రంథః ఇతి – ముద్రారాక్షసమ్’.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here