[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]క[/dropcap]శ్మీరును హరుడిలో భాగంగా పార్వతి అంశగా భావించమనడంలో ఎంతో ఆలోచన దాగుంది.
భారతీయ ధర్మంలో ప్రతీదీ దైవంతో ముడిపడి ఉంటుంది. ధర్మం, దైవం వేరు కాదు. పాశ్చాత్య దేశాలలో State వేరు, Religion వేరు. భారతదేశంలో ఈ రెండు పడుగులో పేకలా కలిసిపోయి ఉంటాయి. అందుకే పాశ్చాత్యుల దేశభక్తి భౌగోళిక సరిహద్దులపై ఆధారపడి ఉంటే, భారతీయ దేశభక్తి ధర్మసంబంధి. ఈ తేడా గ్రహించని వారు తప్పటడుగు వేసినట్టే. మౌలికంగా అవగాహన చేసుకోవటంలోనే పొరపాటు ఉంటే ఆ తరువాత ఎలాంటి తీర్మానాలు చేసినా, తీర్మానాలకు సమర్థనగా ఎన్ని ఋజువులు చూపించినా, అవి వ్యర్థమే. పునాదులు సరిగ్గా లేని భవనాన్ని పాలరాతితో కట్టినా, మణిమరకత మాణిక్యాలు పొదిగినా ఎలా స్థిరంగా ఉండదో, మౌలిక అవగాహనలో పొరపాటు జరిగిన తరువాత ఎన్ని తీర్మానాలు చేసినా వ్యర్థమే. భారతీయ ధర్మానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఈ రకమైన పొరపాట్లు జరిగాయి. రాజు దైవాంశగా భావించడం వల్ల భారతీయులకు రాజభక్తి తప్ప దేశభక్తి భావన లేదు అని భావించడం కూడా ఇలాంటి పొరపాటు భావనే.
కశ్మీరు రాజు శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు. కశ్మీరును ఆక్రమించమని శ్రీకృష్ణుడిపై మంత్రులు ఒత్తిడి తెస్తారు. మామూలుగా అయితే రాజు రాజ్యం ఆక్రమించాల్సిందే. కానీ భారతీయులు దేన్నయినా ఆక్రమించాలని ఆశించరు. తనది కాని దాన్ని ఆశించకూడదు అన్నది దైవ నిర్దేశం. దీనికి తోడు కశ్మీరం పార్వతి. కాబట్టి రాజు లేకున్నా కశ్మీరును కశ్మీరీయులకే అప్పగించాడు శ్రీకృష్ణుడు. అదీ భారతీయ ధర్మం! ఇలాంటి సంఘటన ఇతర ఏ నాగరికతలోనూ కనబడదు. ఇదొక్కటే కాదు, ఇలాంటి సంఘటనలు భారతదేశ చరిత్రలో అనేకం కనిపిస్తాయి. దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అయిష్టంగా రాజ్యభారం స్వీకరించి, రాజ్యంలో పరిస్థితులు చక్కబెట్టి, వయసుడిన తరువాత ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువయిపోయిన రాజు, వారసులు లేరు కాబట్టి వేరే దేశం నుండి అర్హత ఉన్న వ్యక్తిని ఆహ్వానించి అతడికి రాజ్యం కట్టబెట్టే అపూర్వమైన, అద్భుతమైన సంఘటన కేవలం బారతదేశంలోనే సాధ్యం. కశ్మీరుకు చెందిన రాజు ‘సంధిమతి’ ఇందుకు ఉదాహరణ. ఎలాంటి అహం, వ్యామోహం లేకుండా తన వయసయిపోయిందని గ్రహించి మరో వ్యక్తిని ఆహ్వానించి రాజ్యం కట్టబెట్టాడీ ఆధ్యాత్మిక రారాజు సంధిమతి.
ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ప్రాధాన్యం దైవాన్ని మించి ధర్మానికే అని స్పష్టం చేస్తాయి. రాజు పని పాలించడం విష్ణువులా. అప్పుడే అతడిది దైవాంశ, లేకపోతే రాక్షసుడే ఆ రాజు. అందుకే దుష్ట రాజులపై ప్రజలౌ విప్లవాలు లేవదీసిన గాథలు, తరిమి తరిమి కొట్టిన గాథలు భారతదేశ చరిత్రలో బోలెడు. అంతేకాదు, తురుష్కులు భారతదేశంలో ప్రవేశించిన తరువాత, అనేకులు తురుష్కుల సైన్యంలో చేరారు. హిందువులయిన మరాఠాలతో తురుష్కసేనల తరఫున పోరాడారు. కానీ ఎప్పుడయితే అహంకారంతో ముస్లిం రాజులు దేవాలయాలను ధ్వంసం చేశారో, అప్పుడు తురుష్కుల సైన్యంలోని హిందువులు తిరుగుబాట్లు చేశారు. అక్కడ రాజభక్తి అన్న భావన లేదు. అలాగే రాజు హిందువయినా, అధర్మంగా వ్యవహరించినప్పుదు రాజుకు బుద్ధి చెప్పడంలో ‘రాజు విష్ణువు అంశ’ అనే ఆలోచన అడ్డం రాదు. ఇలాంటి సంఘటనలు భారతీయులకు ధర్మమే ప్రాధాన్యం అన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఎప్పుడయితే ఆధునిక యుగంలో దైవం ధర్మం, పాశ్చాత్యుల ఆలోచనా విధానాలను అనుసరించి వేరు చేశారో, అప్పటి నుండి సమస్యలు అంతవరకూ లేనివి మొదలయ్యాయి.
కథం సతీ శచీ గంగా అదితీర్యమునా దితిః।
సరిత్త్యా మహా సంప్రాప్తా యా చ దేవీ కరీషిణీ॥
కశ్మీరు పార్వతి. అక్కడ సకల దేవతలు నదుల రూపం ధరించి ప్రవహిస్తూ దేశాన్ని పవిత్రం చేస్తున్నారు. ఇదంతా విన్న గోవిందుడికి అనుమానం వచ్చింది.
“సతి, శచి, గంగ, అదితి, యమున, దితి, కరీషిణీ దేవతలు నదుల రూపం ఎలా ధరించారు?” అని అడిగాడు.
రావలసిన అనుమానమే. దేవతలు నదుల రూపం ధరించటం ఎందుకు? కశ్మీరం పార్వతి అంటే సరిపోదా? మళ్ళీ ఇతర దేవతలు నదులుగా మారాల్సిన అవసరం ఏమిటి?
(ఇంకా ఉంది)