జీవన రమణీయం-55

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]రవింద్ గారు అప్పుడు ‘హేపీ’ సినిమా తీస్తున్నారు. కరుణాకర్ డైరక్టర్. అప్పటికే ‘తొలిప్రేమ’తో బాగా పేరు తెచ్చుకున్నవాడు. అతడు తమిళియన్ కాబట్టి, చైన్నై నుండి తన అసిస్టెంట్ డైరక్టర్లనీ, కో-డైరక్టర్లనీ తెచ్చుకున్నాడు.

అరవింద్ గారు తన వైపు నుండి ఒక అసిస్టెంట్ డైరక్టర్‍ని పంపిస్తున్నారని కరుణాకర్‌కి చెప్పి రవిని సెట్‌కి పంపించారు. అసలు డైరక్టర్‌తో మాట్లాడే ఛాన్స్ రాలేదు మొదట్లో, కారణం అతను తమిళంలోనే మాట్లాడుతూ, తన వాళ్ళకి పనులు చెప్తుండేవాడు! మనవాడికి తమిళం రాదు!

తర్వాత రవిని వ్యాన్ ఎక్కించుకోకుండా వెళ్ళిపోవడం, ఇతను ఆ మారుమూల ప్రదేశానికి సిటీ బస్సు ఎక్కి, కొంత దూరం నడిచి ఆలస్యంగా వెళ్ళేసరికీ, లేట్ అయిపోయేది. ‘నిర్మాత గారి కేండిడేట్ కదా, ఎప్పుడైనా రావచ్చు’ అని సూటీపోటీగా మిగతా వాళ్ళు మాట్లాడేవారుట… ‘వచ్చావుగా… లంచ్ చెయ్యి’ అని. తమిళులు కట్టుగా వుండేవారు. రవికి ఇదంతా కష్టంగా వున్నా నాతో చెప్పలేదు. ఒకరోజు నేను ఫోన్ చేసి, “డైరక్టర్‌ని నీ పనితో ఒప్పించు… పంపించినందుకు నా మంచి పేరు తీసుకురా…” అన్నప్పుడు, చెప్పలేక, చెప్పలేక “అసలు డైరక్టర్‌కి నేను ఒకడ్ని వున్నాననే తెలీదు” అని తనని వాళ్ళు చేర్చుకోవడం లేదని కక్కేసాడు.

నేను అరవింద్ గారితో ఈ విషయం వున్నది వున్నట్టు చెప్పేసాను! దాంతో ఆయన మేనేజర్‌లని పిలిచి, “రవి అనే కొత్త కుర్రాడ్ని పంపాను… అతని అడ్రస్ కనుక్కుని రోజూ ఇంటి దగ్గర పికప్ చేసుకోండి. కరుణాకర్‌కి చెప్పండి, నేను పంపించాననీ, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ అప్పజెప్పమనీ” అన్నారట.

ఆ మేనేజర్లకి అర్థం అయ్యేది కాదు, ఏదైనా సరే, అంత చిన్న విషయాలు అరవింద్ గారి దాకా ఎలా వెళ్తున్నాయనీ… ఆయన ఎందుకు పట్టించుకుంటున్నారనీ?…

అలా రవి ఎంటర్ అయి, ఆ తర్వాత కరుణాకర్ ఏ పనైనా, “రవీ… నువ్వే చెయ్యాలి” అని డిపెండ్ అయ్యేట్టు, మంచి పేరు తెచ్చుకున్నాడు.

అరవింద్ గారు అంత కూల్ ఏం కాదు! ఏ చిరాకొచ్చినా, అందరినీ తిట్టడం, వెంటనే కోపం తెచ్చుకోవడం తరచూ జరిగేదిట. ఓ సారి బన్నీ ‘హేపీ’కి డబ్బింగ్ చెప్తూ, “వన్ మోర్… వన్ మోర్..” అంటుంటే అవతల టైం అయిపోతోందని టీ తాగుతూ, కప్పు విసిరికొట్టారట.

ఇంకోసారి రవి, లోపల అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పి, అర్జెంటుగా చెన్నై వెళ్ళిపోతే, ఎడిటర్… “బాబూ ఒకే షాట్‌కి చెప్పారు… రెండోది చెప్పలేదు తొందర్లో…” అంటే, అరవింద్ గారు “డబ్బింగ్ చెప్పిచ్చింది ఎవరు?” అన్నారుట. “రవి సార్” అన్నాడుట. ఈయన డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే, రవి సోఫాలో నిద్రపోతూ కనిపించాడట తెల్లవారు ఝామున. ఈయన తట్టి, “నాన్నా రవీ…” అని లేపి, రవి ఈయన్ని నిద్ర లేచి చూసి జడుకుసుని వణికిపోతే, “బన్నీతో ఎన్ని షాట్‌లకి డబ్బింగ్ చెప్పించావు? ఆ ఆడియో టేప్స్ చూపిస్తావా?” అనగానే, “ఎందుకైనా మంచిదని డైరక్టర్క్ అక్కర్లేదు అన్నవి కూడా చెప్పించానండీ” అని లేచి చూపిస్తే, ఆనందపడి భుజం తట్టి, “నాకు తెలుసయ్యా, తను పొరపాటు చెయ్యడనీ” అన్నారట! అలా రవి నేను పంపినందుకు నా పేరు నిలబెట్టాడు.

ఇంతలో నా ‘మధుమాసం’ సినిమా పని మొదలవడంతో, నేనెళ్ళి రామానాయుడి గారిని “నా తరఫున ఓ అసిస్టెంట్ డైరక్టర్‍కి పని ఇవ్వండి. చంద్ర సిద్ధార్థ్‌కి ఆ విషయం చెప్పండి” అన్నాను.

“ఇప్పటికే ‘ఆ నలుగురు’కి చేసినవాళ్ళని నలుగుర్ని తెచ్చాడు” అన్నారు.

“తప్పదు… ఇతనికి పని బాగా తెలుసు” అన్నాను.

ఆయన ఆలోచించి, “వాడు తప్పులు చేస్తే నిన్ను పిలిచి తిడ్తాను. వాడి జీతం నీ రెమ్యునరేషన్‌లో కట్ చేస్తాను” అన్నారు.

“సరే! నా రెమ్యునరేషన్ ఎంత సార్?” అన్నాను.

ఆయన బాగా నవ్వారు “ఆ విషయం అడగాలని కూడా నీకు తట్టిందా?” అని.

నా రెమ్యునరేషన్ ఎంతో నాకు సినిమా పూర్తి అయ్యేదాక నిజంగా తెలీదు. ప్రతీ నెలా 50,000/- చెక్ ఫస్ట్ తారీఖు రోజున ఎకౌంటెంట్ రమేష్ వెంటపడి ఇచ్చేవాడు. సినిమా పూర్తి అయ్యాకా కూడా రెండు నెలలు ఇంటికి పంపించారు. ఆయన ఎంత అని ఫిక్స్ అయ్యారో అది డివైడ్ చేసి నెల జీతంలా ఇచ్చేవారు!

చంద్ర సిద్ధార్థ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్స్‌లో ఒకతను సీనియర్ హరికృష్ణ. తర్వాత గోగు, ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమాలన్నింటీకీ తనే కో-డైరక్టర్‌గా ‘సైరా’ వరకూ చేసి, నెట్‌ఫ్లిక్స్‌లో ‘శివగామి’కి ఆర్కా వాళ్ళకి చేస్తూ బిజీగా వున్నాడు.  ఇంకొకతను మంజూ…. ఇతను రాంగోపాల్ వర్మ దగ్గరున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’కి మొన్న చాలా భాగం డైరక్ట్ చేసాడు. ‘మధుమాసం’ టైమ్‌లో మంజుకి హరీష్ శంకర్, అన్నింట్లో సపోర్టింగ్ రోల్స్ వేసే రవికాంత్ అనే డాక్టర్ కమ్ ఆర్టిస్ట్ రూమ్‌మేట్స్. గోగు పేరు కూడా రవి. ఇతను మొదటిసారి కలిసినప్పుడే వెడ్డింగ్ కార్డ్‌తో వచ్చి, పెళ్ళికి పిలిచి, వైఫ్ పేరు సంతోషి అని చెప్పాడు. ఇప్పుడు మా రవికాంత్‌ కూడా వచ్చి చేరాడు.

‘బాస్’ సినిమాకి పని చేసేటప్పుడు, గుండు చేయించుకుని, అమాయకమైన మొహంతో ఒక అబ్బాయిని కెమేరామెన్ శివ… తీసుకొచ్చి ఆదిత్య దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా పెట్టాడు కదా! తర్వాత ఇతనూ పెద్ద డైరక్టర్ అయ్యాడు… ఆ అబ్బాయి డైరక్టర్ లేనప్పుడు మాకు కొన్ని స్కిట్స్ చేసి చూపించి, తను రాసానని చెప్తే, మేం పడీ పడీ నవ్వే వాళ్ళం. తర్వాత ఆదిత్యతో నేను “ఇతనిలో మంచి రైటర్ వున్నాడు… కానీ కొద్దిగా సానపట్టాలి… ఒక కామెడీ ట్రాక్ రాయిద్దాం” అని చెప్పేదాన్ని.

అలా అనిల్ రావిపూడి అనే అబ్బాయి ‘బాస్’కే కాకుండా, నా ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’కి కూడా కామెడీ ట్రాక్ రాసి, చివరికి రామానాయుడిగారితో నాకు చివరి చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా’కి కూడా రాసి, ఇప్పుడు వరుస హిట్స్ ఇస్తున్న పెద్ద దర్శకుడయ్యాడు. అతనిని తీసుకువెళ్ళి నా అసిస్టెంట్‌గా అసోసియేట్ మెంబర్‌షిప్ కూడా ఇప్పించింది నేనే! మొదటి సినిమా కోసం సురేష్ కాంపౌండ్ చుట్టూ చాలా తిరిగి, రానాని హీరోగా పెట్టి తియ్యాలని, కుదరక చివరికి నందమూరి కళ్యాణ్‌రామ్‌కి కథ చెప్పి ‘పటాస్’ తీసాడు. డివైడ్ టాక్ లేకుండా అది హిట్ అయింది. తర్వాత దిల్ రాజు గారు అవకాశం ఇస్తే, ‘సుప్రీం’ సాయిధరమ్‌తేజ్‌తో, ఆ తర్వాత ‘రాజా ది గ్రేట్’ రవితేజతో తీసి, ఇప్పుడు ఫ్రెష్‌గా ‘F2’ తీసి వరుస హిట్స్ ఇస్తూ, నా కథ తర్వాత తీస్తానని చెప్పి, మహేష్‌బాబు పిలిస్తే, అతనిని డైరక్ట్ చెయ్యడంలో బిజీగా వున్నాడు.

ఇండస్ట్రీలో నా చెయ్యి చాలా మంచిదని తెలిసిన వాళ్ళు అంటుంటారు. అవును, ఇంకో అసిస్టెంట్ వెంకటేష్ కుడుములని కూడా తేజా దగ్గర రిక్వెస్ట్ చేసి పెడ్తే, ఇప్పుడు ‘ఛలో’తో  హిట్ ఇచ్చాడు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here