[dropcap]జీ[/dropcap]వితం చుట్టూ ఆలోచనలు పరిభ్రమిస్తున్నప్పుడల్లా
మదిలో కొత్తచివుళ్ళు మొగ్గ తొడుగుతూనే ఉంటాయి
కాలానికి పూచిన చిగురులు ఆలోచన లోచనాలు
ఆలోచనల చుట్టూ మనస్సు ముసురుకున్నప్పుడల్లా
ఉప్పొంగే భావాలు ఉల్లాసంగా ఉరకలేస్తూనే ఉంటాయి
ఆకాశంలో రివ్వున ఎగిరే విహంగాలు ఆలోచనతరంగాలు
కాలంతో మనసు మౌనంగా బాసలు చేసినప్పుడల్లా
భావతంత్రులు సున్నితంగా ఎదను మీటుతూనే ఉంటాయి
మనసు సరోవరంలో పూచిన పుష్పాలు ఆలోచనలు
మదిలోని ఆలోచనల మూటను విప్పినప్పుడల్లా
కొత్తఆశలు పక్షిరెక్కల్లా రెపరెపలాడుతూనే ఉంటాయి
స్వేచ్ఛగా ఎగిరిపడే ఉత్తుంగతరంగాలు ఆలోచనలు
అనంతమైన అంతరంగాన్ని ఆవిష్కరించినప్పుడల్లా
కరిగిపోయే కలలన్నీ ఎగిసిపడుతూనే ఉంటాయి
మదిసాగరంలో ఎగిసిపడే జలపాతాలు ఆలోచనలు