ఓ సెన్సిబుల్ డైరక్టర్… మనసుని తాకిన ఆయన సినిమాలు

0
3

[dropcap]నే[/dropcap]ను థియేటర్‌కి వెళ్ళి సినిమాలు చూసేది తక్కువే. కానీ అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా వీలు చిక్కినప్పుడు సినిమాలు చూస్తాను. కొన్ని కొత్త సినిమాలు చూస్తాను, కొన్ని పాతవి మళ్ళీ చూస్తాను. లేదా మిత్రులెవరైనా చూడమని చెప్పిన సినిమాలు నాకు కుదిరినప్పుడు చూస్తాను.

ఆమధ్య అమేజాన్ ప్రైమ్‌లో ‘ఆటగదరా శివా‘ అనే సినిమా చూశాను. నాకు నచ్చడంతో దాని గురించి రాయాలనుకున్నాను. కాని వెంటనే రాయలేకపోవడం, ఇతరత్రా పనులలో లీనమైపోవడంతో ఆ అలోచన మరుగున పడింది. ఈమధ్య కలిసిన మిత్రుడు మళ్ళీ ఆ సినిమా ప్రస్తావన తేవడంతో, రాయాలనిపించింది. కానీ అప్పటికే చాలామంది ఆ సినిమా గురించి రాసేసారు, నేను కొత్తగా రాసేదేముంటుంది అనుకున్నాను. అప్పుడొచ్చింది ఈ ఆలోచన! ఈ ఒక్క సినిమా గురించే కాకుండా ఈ చిత్ర దర్శకుడు తీసిన సినిమాలలో నాకు నచ్చినవాటి గురించి రాస్తే బాగుంటుందని!

హృదయాలని తాకేలా, కొండొకొచో మనసులు కలవరపడేలా, ఆలోచించేలా సినిమాలు తీస్తారు చంద్ర సిద్ధార్థ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో ఎంఎ చేసిన ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా ప్రస్తావిస్తాను (ఆయా సినిమాలను సమీక్షించడం నా ఉద్దేశం కాదు, అవి నాకెందుకు నచ్చాయో చెప్పడమే నా ప్రయత్నం).

***

‘ఆటగదరా శివా’ సినిమా ‘రామ రామ రే’ అనే కన్నడ చిత్రం ఆధారంగా రూపొందింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ పారిపోవడం, ఆ క్రమంలో అతన్ని ఉరి తీయాల్సిన తలారికే తటస్థపడడం, అతని జీపులో వారి ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే మనుషులు! మనుషులన్నాకా, రకరకాల భావోద్వేగాలుంటాయి కదా! మనుషుల్లోని మంచీ, చెడూ; ఎవడేమయిపోతే మాకేం అనుకునే మనస్తత్వం, తోటివారికి సాయం చేయాలనుకునే స్వభావం… మానవ జీవనంలోని పలు పార్శ్వాలు తెరపై వ్యక్తమవుతాయి. అవినీతిపరుడైన పోలీస్ అధికారి, పారిపోయి పెళ్ళి చేసుకుందామనుకునే ప్రేమికులు, వారిని వెంటాడే ఇద్దరి కుటుంబాలు, ఇద్దరు తాగుబోతులు, భార్య ప్రసవానికి సెలవుపై ఇంటికి వచ్చిన సైనికుడు… ఇలా వీరంతా తలారికి తారసపడతారు. తలారిగా నటించిన దొడ్డన్న పలు ఉద్వేగాలను ప్రశంసనీయంగా ప్రదర్శించాడు. ప్రధాన పాత్రధారి, ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నటించిన ఉదయ్ శంకర్, సైనికుడిగా నటించిన సందేశ్ తమ పరిధుల మేరకు నటించారు. భార్య ప్రసవానికి ఇంటికొస్తున్న సైనికుడు, తన తమ్ముడిని వదినకి ఏం కావాలో చూసుకోమంటాడు. కాని అతను ఇంటికి వస్తున్న దారిలో భార్య, తల్లీ ఇబ్బందులు పడుతూ కనిపించడం; తలారి వారికి సాయం చేయడం తెలుసుకున్న సైనికుడు ఇంటికి వెళ్ళగానే తమ్ముడి మీద చేయి చేసుకుంటాడు. వదినకి మంచినీళ్ళ కోసమే వెళ్ళాను అని తమ్ముడు చెప్తున్నా వినడు… ప్రసవం జరిగి, భార్యా బిడ్డా క్షేమమని తెలిసాకా తమ్ముడిని క్షమాపణ అడగడానికి వెళ్ళిన తీరుని బాగా చూపించారు. సంభాషణలు చిత్రకథనాన్ని ఎలివేట్ చేసేట్టుగా ఉన్నాయి. “గొప్ప సాయం అంటూ ఉండదు మనవడా, గొప్ప మనసు ఉంటుంది”, “ముందు క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు, క్షమించినవాడే బలవంతుడు”, “చావు విముక్తి, బ్రతుకు తృప్తి” వంటి ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్ రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. బీజాపూర్, మహారాష్ట్ర సరిహద్దులో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. భావోద్వేగాల ప్రయాణం అయిన ఈ చిత్రం చూడడం ముగిసాకా, చాలా ఆలోచనలను రేకెత్తిస్తుంది. మంచి సినిమా చూశామన్న భావన కలుగుతుంది.

ఆ నలుగురు‘ సినిమానే చెబుతుంది చంద్ర సిద్ధార్థ ఎంత సెన్సిబుల్ డైరెక్టరో. ఆ సినిమా గురించి ఈ వ్యాసంలో రాయడం చర్విత చర్వణమే. ‘ఆటగదరా శివా’ సినిమా చంద్ర సిద్ధార్థ సెన్సిబిలిటీని మరోసారి నిరూపిస్తుంది. ఈ  సినిమా చూశాక చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు మరోసారి చూశాను.

***

అందరి బంధువయా” సినిమాని అంతకుముందు నాలుగైదు సార్లు చూసుంటాను. డబ్బే ప్రధానమనుకునే యువతీ (హీరోయిన్), డబ్బు కన్నా మనుషులు, వారి ఆప్యాయతలు ముఖ్యమనుకునే యువకుడు (హీరో) ఒకే ఆఫీసులో పనిచేయడం, హీరోయిన్ ఇంట్లో హీరో అద్దెకి దిగడం, తన ఆలోచనా విధానంతో తోటివారిలో మార్పు తేవాలని ప్రయత్నించే హీరో నైజం… ప్రేక్షకులను సినిమాలో లీనం చేస్తాయి. పద్మప్రియ, శర్వానంద్, సీనియర్ నరేష్‌ల నటన సినిమాకి ప్రాణం పోసింది.

బలభద్రపాత్రుని రమణి గారి కథ, సంభాషణలకి చంద్ర సిద్ధార్థ గారి ప్రతిభ తోడయి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చంద్ర సిద్ధార్థ సినిమాలలో ప్రేక్షకులు ఆశించే చక్కని సంభాషణలు, భావోద్వేగాల వ్యక్తీకరణ ఈ సినిమాలోనూ ఉన్నాయి. “పిల్లలకి పెద్దలంటే ఉండాల్సింది భయం కాదు, ప్రేమ”, “మతం అంటే మనసు”, “నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం.. పశువుకింత గ్రాసం.. సాటి మనిషికింత సాయం.. ఇంతకు మించిన పూజ ఏ మతం చెబుతుందమ్మా….”, “వారసత్వం అంటే రక్తం కాదు… సుగుణాలు” వంటి కొన్ని డైలాగులు చాలా కాలం గుర్తుండిపోతాయి. అందరికీ వడ్డీలకి అప్పులిచ్చి, కర్కశుడిగా ముద్రపడిన జంగయ్య పాత్రధారి చనిపోతూ పలికే మాటలు, ఆ సన్నివేశం  హృదయాలని తాకుతాయి. మానవీయ విలువలని చాటిన సినిమా ఇది.

***

బలభద్రపాత్రుని రమణిగారి నవల ‘నీకూ నాకూ మధ్య’కి సినిమా రూపం ‘మధుమాసం‘. కుటుంబ విలువలనీ, మారుతున్న బంధాలని, నడవడిక మార్చుకుని సన్మార్గంలోని వచ్చే వ్యక్తుల జీవితాలను చూపిన సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. రామానాయుడు నిర్మించారు. ప్రేమంటే గిట్టని వ్యక్తి సంజయ్ (సుమంత్), ప్రేమే కుటుంబాలకు బలమని నమ్మే హంస (స్నేహ) నాయికానాయకులు. విచ్చలవిడిగా ఉంటూ, ప్రేమా పెళ్ళి ట్రాష్ అనుకుని, చివర్లో తన తప్పు గ్రహించి మారే మాయ (పార్వతి మెల్టన్)ల చుట్టూ కథ నడుస్తుంది. మనుషుల జీవితాలలో డబ్బు ముఖ్యమైపోయి కుటుంబ బంధాలు ఎలా బలహీనమవుతున్నాయో, కొందరు కుటుంబ సభ్యుల స్వార్థం కారణంగా మనసులెలా విరిగిపోతాయో ఈ సినిమా చెబుతుంది. “మనుషుల బలహీనతల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది”, “నాన్నా, నాకు ప్రేమంటే ఏమిటో తెలియదు, ఇక ప్రేమించానని ఎలా చెబుతాను?”, “అది ప్రేమ కాదు, తను కావాలనుకున్నది కావాలనుకున్నప్పుడు అందాలి. అది పంతం”, “మంచి పనులు చేయడానికి మనసుండాలి కాని, మగాడే అయ్యుండక్కర్లేదు”, “పెళ్ళనేది గడిచిపోయిన జీవితం గురించి కాదు, గడపాల్సిన జీవితం గురించి”, “ప్రేమంటే మనకిష్టమైన మనిషిని దక్కించుకోడం కాదు, తను దూరమైనా తను బావుండాలని కోరుకోడం, అందుకు ప్రయత్నించడం” వంటి సంభాషణలు అలరిస్తాయి. అసభ్యత, అశ్లీలతా లేని విధంగా రూపొందించిన ఈ సినిమాకి ఉత్తమ కథా రచయిత్రిగా రమణి గారికి నంది బహుమతి వచ్చింది. చక్కని ఫ్యామిలీ మూవీ ఇది!

***

ఈ దర్శకుడే తీసిన “ఏమో గుర్రం ఎగరావచ్చు” సినిమాలో ఆయన ముద్రేమీ నాకు కనిపించలేదు. ఆశావహ దృక్పథం ఉంటే ఎంతటి అవరోధాన్నయినా అధిగమించవచ్చుననే ఇతివృత్తం ఈ కథది. కాని సినిమాగా ఆకట్టుకోడంలో విఫలమైనట్టు నాకనిపించింది. ఆయన సినిమాలలో ఉండే సెన్సిబిలిటిస్ ఏవీ ఇందులో లేవనిపించింది.

***

డబ్బు పట్ల మనుషులకుండే వ్యామోహాన్ని అత్యంత సహజంగా చూపిన చిత్రం ‘ఇదీ సంగతి‘. ఒక రైలు ప్రమాదం జరుగుతుంది, ప్రయాణీకులని రక్షించవలసింది పోయి, చుట్టుపక్కల వాళ్ళంతా చేతికందిన వస్తువులు పట్టుకుపోతారు, క్షత్రగాత్రుల డబ్బు, నగలు గుంజుకుంటారు. ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేసే సత్యమూర్తి (అబ్బాస్) ట్రైన్ యాక్సిడెంట్‌ని కవర్ చేయడానికి వెళ్ళి, ఒక ఎసి కంపార్ట్‌మెంట్‍లోని ఓ ప్రయాణీకుడినుండి ఓ సూట్‌కేస్ ఎత్తుకొచ్చేస్తాడు. అందులో కోట్ల విలువజేసే వజ్రాలున్నాయని తర్వాత తెలుస్తుంది. ఈ లోపు ఆ వజ్రాల గురించి తెలుసుకున్న అతని భార్య స్వరాజ్యం (టబు) భర్తకి తెలియకుండా వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటుంది. ఆ వజ్రాలు ఒక కీలకపదవిలో ఉన్న రాజకీయ నాయకుడివి కావడంతో అక్కడ్నించి వాటి కోసం వేట మొదలవుతుంది. సత్యమూర్తి, స్వరాజ్యంలకి ఇబ్బందులెదురవుతాయి. వాటి గురించి తెలిసిన వాళ్ళంతా వాటా కొస్తారు. చివరికి ఆ వజ్రాలను తిరుమల హుండీలో వేయడంతో కథ ముగుస్తుంది. సినిమా ప్రారంభ సన్నివేశమే – “లెక్కపెట్టుకోలేనంత డబ్బు ఇవ్వు స్వామీ” అని టబు దేవుడిని ప్రార్థించడంతో మొదలవుతుంది. టైటిల్స్ పడుతున్నప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‍లోనే సినిమాలో ఏం చూపించబోతున్నారో తెలిసిపోతుంది. మనుషుల్లోని అవినీతి, దగాకోరుతనం, స్వార్థం, దురాశ, చెడు అన్నింటినీ ఒకే సినిమాలో చూపించడం కొంత నెగటివ్‌గా అనిపిస్తుంది, జీర్ణించుకోడం కొంచెం కష్టమవుతుంది. ఇదొక డార్క్ కామెడీ మూవీ!

***

అప్పుడప్పుడు‘ సినిమాలో ధనవంతుల పిల్లలయిన సందీప్ (రాజా), రాధిక (శ్రియా రెడ్డి)లకు పెద్దలు వివాహం చేస్తారు. పెళ్ళయ్యాకా, వాళ్ళిద్దరూ విడిగా ఓ పెద్ద ఇంట్లో కాపురముంటారు. మొదట్లో బావున్నా, తరవాత అపార్థాలు మొదలై, తాము ఒకరికొకరు సరిపోమని నిర్ణయించుకుంటారు. విడాకులకి దరఖాస్తు చేసుకుంటారు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక వివాహానికి హాజరై అక్కడ ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఇద్దరికీ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ క్రమంలో విడాకులు మంజూరవుతాయి. వాళ్ళిద్దరికి వేరేవాళ్ళతో మళ్ళీ పెళ్ళి చేయడానికి ఇరువైపుల పెద్దలు సిద్ధమవుతారు. కథలో ముఖ్యపాత్రలైన మరో వృద్ధ జంట (కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ) ఒకరితో ఒకరు నడుచుకునే తీరు వీళ్ళల్లో మార్పు తెచ్చి మళ్ళీ దగ్గరవడంతో కథ ముగుస్తుంది. “అంకుల్ మంచి తాగుబోతున్నమాట… మంచి తాగుబోతు కాదమ్మా… పచ్చి తాగుబోతు అనాలి”; “అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి పూర్తిగా అర్థం చేసుకున్నారనుకో, వాళ్ళింక పెళ్ళేం చేసుకుంటారు? అందుకే అర్థమయీ కానట్టుండడమే బెస్ట్. ఒకరికొనరు తెలుసుకోడానికి ఇద్దరిలో ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది”, “పెళ్లనేది రెండు మనసులు జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తామని చేసుకునే ప్రమాణం” వంటి డైలాగులు బావుంటాయి. ‘ఇదిగో ఇపుడే’ అనే పాట వినడానికీ, చూడడానికీ బావుంటుంది.

***

ఈ సినిమాలు నాకు నచ్చాయి కాబట్టి అందరికీ నచ్చాలనేం లేదు. మానవ సంబంధాలు, ఎమోషన్స్‌తో కూడిన సినిమాలు నచ్చేవారికి ఇవి కూడా నచ్చే అవకాశం ఉంది.

ఈ తెలుగు దర్శకుడు మొదటిసారి దర్శకత్వం వహించినది ఇంగ్లీషు సినిమా కావడం విశేషం! ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ నవలను సినిమాగా అదే పేరుతో 2001లో సినిమాగా తీశారు చంద్రసిద్ధార్థ. తెలుగులో దర్శకునిగా మొదటి చిత్రం ‘అప్పుడప్పుడు’. నిర్మాతగా ‘నిరంతరం’, ‘హౌస్‌ఫుల్’ అనే సినిమాలు తీశారు. మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. పలు జ్యూరీలలో సభ్యుడిగా ఉన్నారు.

ఎంత ఘర్షణకు లోనైతే అంత వేగంగా వెలుగు వైపు పయనించినట్టే” అనే చంద్ర సిద్ధార్థ గారి పుట్టినరోజు ఈ రోజు (12 మే). ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన మరెన్నో చక్కని చిత్రాలని మనకి అందిస్తారని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here