ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-12

1
4

[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]

[dropcap]ఉ[/dropcap]దయం 10.45 గంటలు.

సూర్యకిరణం పరావర్తిత ప్రక్రియకి లోనై కళ్ళని జిగేల్‌మన్పించే న్యూఇయర్ రూపాయి నాణెంలా మిల మిలా మెరిసిపోతోంది అంబేద్కర్ వీధి మలుపులోని ఓ తెలుపురంగు బిల్డింగ్.

ఆ భవనానికి అమర్చబడిన అతి పెద్ద బోర్డ్‌పై ‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్’ అనే అక్షరాలు కొత్త వందరూపాయల నోటు మీద అక్షరాల్లా తళ తళ లాడుతన్నాయి.

లైట్ స్కై బ్లూ కలర్ మారుతూ జెన్ గేటు దాటుకుంటూ ఆ బ్యాంకు ఆవరణలోకి ప్రవేశించింది. పార్కింగ్ ప్లేస్ల్‌లో సుతిమెత్తగా ఆగిందా కారు. ముందు సీట్లోంచి బయటకు దిగిన అసిస్టెంట్ హుటాహుటిన వచ్చి కారు బ్యాక్ డోర్ తెరిచాడు. హుందాగా బయటకు పాదం మోపాడొక వ్యక్తి. ధవళ వస్తాలతో మెరిసిపోతున్నాడు. అతను షణ్ముగం!

తెలియని ఆందోళన ఎదని ఆవహిస్తున్నా అతని పెదాలపై మొలిచిన చిరునవ్వు మాత్రం వాడిపోవడం లేదు. పాండవీయానికి ఆ రోజు ఇచ్చిన మాట కోసమే… కేవలం మాట నిలుపుకోవడానికే… అంత టెన్షన్‌లోనూ మాట తప్పని మనిషిగా… ఎమౌంట్ డిపాజిట్ చేయడానికి షణ్ముగం స్వయంగా ఆ బ్యాంక్ ఛాయలకు వచ్చాడు. కారు దిగిన షణ్ముగం పరుగులు తీసినంత వేగిరంగా బ్యాంక్ ప్రాగణంలోకి హడావిడిగా అడుగులు చేశాడు.

సూట్‌కేస్ చేతబట్టుకొని అసిస్టెంట్ అతని వెంట కదిలాడు.

బ్యాంక్‌లోకి ఎంటరయ్యాక వరుసగా నాలుగు కౌంటర్స్ దర్శనమిస్తాయి. అవి దాటితే వాటిని ఆనుకొని, గ్లాస్ వాల్స్ ఫిక్స్ చేయబడిన గది వుంటుంది. అదే బ్యాంక్ మేనేజర్ రూమ్.

పాండవీయంతో కలిపి మొత్తం సిబ్బంది పదిమంది వున్నారు. ఒకరిద్దరి రాకపోకలు తప్ప కష్టమర్ల రద్దీ పెరగలేదు.

అదిగో అప్పుడు – రెప్పపాటు కాలంలో జరిగాందా సంఘటన!

స్కూటర్ పార్కింగ్ చేసి వచ్చిన వసంత్‌తో పాటు బ్యాంక్ వైపు కదులుతున్నాడు అఖిల్. ప్రధాన ద్వారం మెట్లెక్కబోతూ వెనక్కి తిరిగి చూసిన అసిస్టెంట్ దృష్టిలో పడిందా దృశ్యం. అఖిల్ రాకను గమనించిన ఆ వ్యక్తి చప్పున షణ్ముగం చెవిలో ఏదో చెప్పాడు.

ముందుకి అడుగు వేయబోతున్న వాడల్లా అది విని షణ్ముగం నివ్వెరపోయాడొక్క క్షణం. తల వెనక్కి తిప్పి చూశాడు. ఆ సమయంలో అఖిల్ అక్కడ దర్శనమివ్వడంతో షాకయ్యాడు. పక్కన బాంబ్ పడినట్టు అదిరిపడ్డాడు!

అఖిల్‌ని కిడ్నాప్ చేసి దాచేయమని తన మనుషుల్ని అటు స్కూల్‌కి పంపి తానిటు వచ్చాడు షణ్ముగం.

కాని అఖిల్‌ని స్కూల్ మాన్పించి తన వెంట ఆఫీసుకి తీసుకువెళ్లాడు వసంత్. వెంటనే అక్కడి నుండి బ్యాంక్‌కి తీసుకు వచ్చాడు. స్కూల్‌కి, ఇంటికి వెళ్ళిన మునుషులు కుర్రాడి జాడ కన్పించక పోవడంతో రిక్త హస్తాలతో వెనక్కి మరలి వచ్చారని షణ్ముగానికి తెలీదు. అందుకే అఖిల్ అక్కడ అగుపించడంతో ఆశ్చర్యపోతున్నాడతను.

తన తొట్రుపాటుని కప్పిపుచ్చుకుంటూ తిరిగి ముందుకే కదిలాడు షణ్ముగం. షణ్ముగం వచ్చిన రోజునే వసంత్ బ్యాంక్‌కి రావండం… అది ఒకే సమయం కావడం… వెంట అఖిల్ ఉండడం… అవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయాయి!

అప్పుడు జరిగింది మరొక సంఘటన. అత్యంత ఆకస్మికంగా!

సడెన్‌గా బ్యాంకు లోపలకి దూసుకు వచ్చి ఆగిందో కమాండర్ జీప్. అందులో నుండి నులుగురు దుండగులు దిగారు. చూడ్డానికి మొరటుగా కన్పిస్తున్నారు. నల్లటి మాస్కుల్ని ముఖాలకి ధరించారు. కళ్ళు మాత్రం ఓపెన్‌గా వున్నాయి.

అక్కడ పరుగు పందెం జరగుతోంది అన్నంత వేగంగా ముందుకి దుమికారు.

ఒకడి చేతిలోని ఏకే 47 నల్లత్రాచులా మెరుస్తోంది. వాళ్ళకి నాయకుడిలా వున్నట్టున్నాడతను. అతను ముందుకి కదలితే అనుసరించారు మిగతా ముగ్గురు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కో రకపు మారణాయుధం కర్కశంగా కదులుతోంది.

బ్యాంక్ ప్రధాన ద్వారాన్ని చేరుకున్నారు వసంత్ – అఖిల్‌లు. ఆ ఇద్దరినీ రఫ్‌గా పక్కకి నెట్టేసుకుంటూ వేగంగా లోపలికి దూసుకుపోయారు.

షణ్ముగం రాక తెలిసి పాండవీయం తన సీట్లోంచి లేచాడు. అతనికి ఎదురు వెళ్ళి స్వాగతిద్దామని అడుగు కదపబోయాడు. షణ్ముగం కౌంటర్లని దాటుకుంటూ, మేనేజర్ గది ముందికి చేరబోతున్నాడు.

అతని కంటే ముందే వాయివేగంతో మేనేజర్ గదిలోకి దుండగుడు చొరబడ్డారు. పాండవీయాన్ని సమీపించి అతని తల దగ్గర ఏకే 47ని గురి చూసి పెట్టాడు.

వెంటనే ఆ బ్యాంక్ గోడల్ని ప్రతిధ్వనింప చేస్తూ విన్పించిందతని కంఠం.

“ఎవ్వరూ కదలవద్దు. కదిలితే ప్రాణాలు దక్కవు. మాక్కావాల్సింది మేం పట్టుకుపోతాం. ప్లీజ్, అంత వరకూ ఎవరూ కదలవద్దు.”

ఈలోగా మిగతా ముగ్గురు దృఢకాయులు బ్యాంక్ సిబ్బందిని, కస్టమర్లను, క్షణంలో ట్రాప్ చేశారు. ఆ ఆగంతకుల ఘాతుక చర్యకి కోపంతో ఎర్రబడింది షణ్ముగం ముఖం. ఆవేశంతో ఊగిపోతూ ఉద్రేకంగా కదలబోయాడు.

తిరిగి మ్రోగింది కర్కశగొంతు.

“మేనేజర్ సజీవంగా వుండాలంటే… ప్లీజ్ డోంట్ మూవ్” ఏకే 47 కొనని పాండవీయం తలకి మరింత బలంగా నొక్కుతూ అరిచాడు.

టక్కున ఆగిపోయాడు షణ్ముగం. కోపాన్ని అణుచుకుంటూ.

ఉత్కంఠ భరితంగా… సినిమాల్లోని దృశ్యాల్లా… చక చకా జరిగి పోయాయి సన్నివేశాలు.

ఎవ్వరూ ఊహించలేదు. ఇలా జరుగుతుందని. ఊపిరి సలపనివ్వని స్థితి క్షణంలో నెలకొంటుందని. అప్పటికే ప్రధానద్వారం దాటి కౌంటర్స్ వైపు వచ్చాడు వసంత్. ఆగంతకుల ఆకస్మిక దాడికి బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడు.

అఖిల్ కూడా!

లోపల జరుగుతున్న దృశ్యాల్ని చూసి అఖిల్ కొయ్యబారిపోయాడు. కళ్ళు చిట్లించి చూస్తూ తల విదిల్చాడొక్కసారిగా. సెకనులో జరగిపోయిందా ఘటన! అత్యంత అనూహ్యంగా.

అఖిల్ ముఖం వివర్ణమయ్యింది. ముక్కు పుటాలదరసాగాయి. కళ్ళల్లోంచి వింత కాంతి ప్రసరిస్తోంది. శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి. అక్కడున్న వాళ్ళంతా గగుర్పాటుతో అఖిల్ వైపు చూస్తూండిపోయారు. జరుగుతున్న దేమిటో అర్థం కాక అయోమయంగా ఊపిరి బిగపట్టారు.

దుండగులు చికాగ్గా ముఖం చిట్లించారు.

అఖిల్‌లో క్షణ క్షణానికీ జరుగుతున్న అనూహ్యమైన మార్పుల్ని చూసి ఆనందిస్తోంది ఒక్కరే! పాండవీయం. అతని కళ్లు మెరిశాయి.

ఆ చిన్నారి, మెదడులోకి సంకేతాలేవో ఇంజక్టవుతుంటే… మస్తిష్కపు పొరలు రాపిడికి ఉండచుట్టుకుంటూ… భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్దతరంగాల హోరు!

కళ్ళు మూసి వేదనగా కణతల్ని తన చిట్టి చేతుల్తో నొక్కుకుంటూ బిగ్గరగా అరిచాడు -‘వొద్దొద్ద’ని.

అఖిల్ వింత ప్రవర్తనని జీర్ణించుకోలేక పోతున్నారు బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరూ. విస్మయానికి లోనయ్యారు.

స్ప్లిట్ సెకండ్ అనంతరం అతడి వదనంలో ప్రశాంతత. తేజోవంతమైన పవిత్రత… ఒక మునిలా… మహర్షిలా… గోచరిస్తున్నాపుడు.

కంటి పొరల ముందు అస్పష్టపు దృశ్యాలేవో లీలగా కదలాడుతుంటే – నెమ్మదిగా, నెమ్మదిగా నెమ్మదిగా… తనను మరచి పెదాలు విప్పాడు.

అంతలోనే గంభీరంగా మారిపోయాడు. అప్పటికే పూర్తిగా ట్రాన్స్‌ లోకి వెళ్ళిపోయాడా కుర్రాడు.

గంతలో జరిగిన మనీ మనీ బ్యాంక్ దోపిడీ గురించి చెప్పుకుపోతున్నాడు కళ్ళకు కట్టినట్లు. సజీవ రూపకల్పన ఆతృతని ఆవిష్కరపరుస్తూ.

షణ్ముగం ముఖం కందిపోయింది. ఆపాద మస్తకం షణ్ముగం వణికిపోతున్నాడు.

అఖిల్ చెప్పేది – కన్రెప్పలార్పకుండా… చూస్తున్నట్టు… వింటుండి పోయారంతా.

***

ఆకస్మికంగా తనకి అందిన రిపోర్ట్‌ని స్వయంగా ఛేదించడానికి ఉద్రేకంగా బయల్దేరాడు యస్సై వేదవ్యాస్. శకుంతల ఆచూకీ దొరకలేదు. వెంటనే నేరుగా ద్వివేది ఇంటికి వెళ్ళాడు.

అక్కడ… ఆయన… గదిలో… ద్వివేది కణతలకి రివాల్వర్ ఆన్చి నిలబడి వుంది గృహలక్ష్మి ఏజన్సీస్ ఛైర్మన్ మహిళా మండలి వర్కింగ్ ప్రెసిడెంట్ శకుంతల.

ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు వేద. నులివెచ్చని ఊపిరి శ్వాసకోశంలోనే ఆవిరవుతున్న ఫీలింగ్. విపరీతమైన కలవరపాటుకి లోనయ్యాడతను. లోపలికి అడుగిడబోయిన వాడల్లా సిక్స్త్ సెన్స్ హెచ్చరికతో టక్కున ఆగిపోయాడు. గుమ్మానికి ఆవల చాటుగా నిలబడ్డాడు. వాళ్ళిద్దరు మాత్రం అతడికి కనిపిస్తున్నారు.

వేదవ్యాస్ ఊహించని విపరీత సన్నివేశమది. చేష్టలుడిగిన వాడిలా అచేతనంగా ఉండిపోయాడు.

ద్వివేది గుండెలోతుల్లో ఉత్పన్నమైన భయం అణువణువూ పాకి స్వేదబిందువుల్లాగా రూపుదిద్దుకొని అతడి శరీరాన్ని తడిపి ముద్ద చేస్తోంది. నిస్సహాయంగా ఉండిపోయిందా ఎయిర్ కూల్ గది. వెలసిపోయిన వర్ణ చిత్రంలా వెలవెలబోయి వున్నాడు ద్వివేది.

శకుంతల కంఠంలో వూపిరి పోసుకున్న శబ్దతరంగాలు గాలిపొరల్ని చీల్చుకుంటూ వేదవ్యాస్ కర్ణభేరిని ప్రకంపింప చేశాయి. చురుగ్గా లోపలకి కదలబోయిన వేద మంత్రం వేసినట్టు స్తంభించి పోయాడు. ఆమె చెప్పబోయేది విందామని. వేద చేతివేళ్ళ స్పర్శకి తృళ్ళిపడ్డ టేప్ నోరుతెరుచుకుందతని పాకెట్‌లో.

“యస్సై వేదవ్యాస్ నీడ నీమీద పడింది. నీ కదలికల్ని పసికడ్తున్నాడతను. నీ వలన చిప్ దొంగిలించబడ్డాక, అది బలపడింది. ఆ అనుమానం మా దాకా విస్తరించక ముందే నీ అడ్డు తొలగిపోవాలి. యస్సైకి నీవు చిక్కితే నీతో పాటు మా ఉనికి బయటపడే అవకాశం ఉంది. అందుకే నీవు ప్రాణాలతో ఉండడం ఇరువర్గాలకీ మంచిది కాదు.”

శకుంతల కంఠధ్వని నిశ్శబ్దంగా రికార్డయి పోతోంది టేప్‌లో.

పాలిపోయింది ద్వివేది వదనం. కంఠం వణుకుతుంటే అదురుతున్న పెదాలు కదలబోయాయి. ఏదో చెప్పాలని మనసు విప్పాలని.

“ప్లీజ్ కదలవద్దు, నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు పోతాయి. నీవు చెప్పే కబుర్లు వింటూ కూర్చునే టైమ్ నాకు లేదు” పిడుగులా ఉరిమింది శకుంతల.

స్ల్పిట్ సెకండ్ నిశ్శబ్దం. తిరిగి కదిలింది ఆమె కంఠం ఉద్వేగంగా.

“మనీ మనీ బ్యాంక్ దోపిడీకి ముందు నుండీ మాకు అన్ని విధాలుగా సహాకరిస్తూ వచ్చావు. థాంక్స్ ఫార్ యువర్ కో-ఆపరేషన్. నేనూ షణ్ముగం కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాం. ఎయిర్ టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. ఈ పని ఎప్పుడో చేద్దామంటే ఇండియా ఇండియా అంటూ షణ్ముగం నా మాట పట్టించుకోలేదు. కొంత కాలం అనంతరం అమెరికాలో సెటిల్ అవుతాం. ఇన్నాళ్టిటికి మా నిష్క్రమణకి రంగం సిద్ధమైంది.

పోతే బ్యాంక్ దోపిడీలో మిగిలిన ఒకే ఒక్క సాక్ష్యం నీ వూపిరి! భారతదేశం విడిచి పెడ్తూ.. దాన్ని మాతో పాటుగా తీసుకు వెళ్ళాలని మా ఆకాంక్ష…”

ఆ చివరి వాక్యం విన్న మరుక్షణం…

టేపు నోరు నొక్కేసి, మెరుపు వేగంతో ముందుకు దూకాడు వేద.

అప్పటికే ఆలస్యమైపోయింది.

ట్రిగ్గర్‌ని సుతిమెత్తగా ప్రెస్ చేసిందామె చూపుడు వేలు. సైలెన్సర్ అమర్చబడ్డ ఆ రివాల్వర్ మృత్యుద్వారం నుండి ఒకటి.. రెండు.. మూడు.. వరుసగా ఆరు రౌండ్స్..  ద్వివేది మస్తిష్కాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయాయి బుల్లెట్స్. రెప్పపాటు కాలంలో జరిగిపోయిందా సంఘటన. అరవడానికి తెరవబడిన ద్వివేది పెదాలు కేక బయటకు దుమికి రాక ముందే తిరిగి చప్పున మూసుకు పోయాయి.

విద్యుత్ తరంగాలు ఊపిరితో కలిసిపోయి అణువణువులో అలజడి రేపి అతలాకుతలం చేసినట్లు జలదరించిందా వేద ఒళ్ళు.

అవినీతి పునాది అంచుల మీద నిజాయితీని బిల్డప్ చేసి లోకాన్ని అమాయకంగా నమ్మించిన ది గ్రేట్ పోలీసాఫీసర్ సి.ఐ. ద్వివేది కుప్పకూలిపోయాడు రక్తపు మడుగులో నిర్జీవంగా.

చురకైన పాదరసపు అణువుల్లా వేద అడుగులు కదిలాయి అత్యంత వేగంగా.

మెత్తని అతని అడుగల చప్పుడు శకుంతల పాము చెవుల్ని చేరక ముందే ఆమె తలని స్పర్శించింది రివాల్వర్ వెచ్చగా.

గగుర్పాటుతో తలపంకించిందామె. ఎదురుగా ఉగ్రనరసింహుడై వేద.

ప్రకంపించి పోయింది నిలువెల్లా. ఆమె చేతి వేళ్ళు వణికాయి. ద్వివేది ప్రాణాలు బలిగొన్న రివాల్వర్‌ని అప్రయత్నంగా జారవిడిచింది.

శకుంతల ఊహించనిది వేద ఆగమనం.

బిల బిల మంటూ సాయుధలైన పదిమంది పోలీసులు ఊపిరి సలుపు కోనివ్వనంత వేగంగా ఆమెని చుట్టుముట్టారు.

రివాల్వర్‌ని పాకెట్‌లో దోపుకుంటూ, తన పై ఆఫీసర్ సి.ఐ. ద్వివేది మృతదేహం కేసి జాలిగా చూశాడు యస్సై వేదవ్యాస్.

మచ్చలేనిదని భ్రమింపజేసిన ఆయన జీవిత ఘట్టం… పోలీసు డిపార్ట్‌మెంటుకే మాయని మచ్చగా మిగిలి… అర్ధంతరంగా ముగిసిపోయింది.

అపుడప్పుడూ ద్వివేది తనతో అంటూ వుండే ఓ మంచి మాట వేదకి గుర్తు వచ్చిందా క్షణంలో.

“జీవితం జీవితకాలం మాత్రమే వుంటుంది. ఒక మంచి పేరు ఎప్పటికీ, మరెప్పటికీ…. శాశ్వతంగా నిలచి వుంటుంది.”

ఆ మాట మారి, మరోలా ప్రతిధ్వనించినట్లు అన్పించింది వేదకి.

“జీవితం జీవితకాలం మాత్రమే వుంటుంది. ఒక చెడ్డ పేరు ఎప్పటికీ మరెప్పటికీ…. శాశ్వతంగా నిలచి వుంటుంది.”

వేద హృదిలోంచి –

ఓ కన్నీటి బొట్టు నేల రాలింది.

***

మనీ మనీ బ్యాంక్ దోపిడీ ఘట్టం గురించి చెప్పడం పూర్తి చేసి ఆయాసంతో ఆగిపోయాడు అఖిల్. శరీరమంతా ఎవరో కుదిపేసినట్లు ఊగిపోతుంది.

అప్పటి వరకూ అఖిల్ చెప్పిన ప్రతి విషయాన్ని భద్రంగా తనలో నిక్షిప్తం చేసుకున్న అత్యంత శక్తివంతమైన మైక్రోఫోన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా దాన్ని అఖిల్‌కి ఎటాచ్ చేసివుంచాడు వ్యాస్.

సంచలనం రేకెత్తించిన మనీ మనీ బ్యాంక్ దోపిడీకి పాల్పడింది షణ్ముగం అండ్ శకుంతల అనే నిజం తెలిసి…. అప్రయత్నంగా నోరు తెరిచారంతా.

ముచ్చెమటలు పోసాయి షణ్ముగానికి. టెన్షన్‌తో గుండె వూగి పోతోంది.

సంకేతాలు అఖిల్ మెదడుకి అందడం ఆగిపోయాయి. భారంగా కణతల్ని నొక్కుకున్నాడు. అతడి ముఖంలోచి వింత తేజస్సు క్రమక్రమంగా మాయమయ్యింది. వదనం వర్ణరహిత హరివిల్లు అయ్యింది.

నీటి కాగితం మీద అలలకలాలు రచిస్తోన్న కడలి హృదయ ఘోషకి ప్రతిరూపమై పోయింది పాండవీయం అతరంగం. ఊపిరి ఆడడం లేదతనికి.

‘మనీ మనీ బ్యాంక్‌ని దోచిందే కాక, ఇదే బ్యాంక్‌లో డిపాజిట్స్ చేయడానికి ఎంత మెలోడ్రామా ఆడగలిగాడు షణ్ముగం’ అనుకున్నాడు.

అఖిల్ అంతర్గత అలజడి క్రమేపీ దూరం అవుతుంటే క్షణంలో మునుపటిలా మారిపోయాడు.

గాలిలో కన్పించని అస్పష్టపు అక్షరాల్ని చదవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అదో మాదిరి ఫీలింగ్ కనబరుస్తున్నాడు వసంత్.

షణ్ముగం అలజడి నుండి తేరుకోలేదు. తను కలలో కూడా ఊహిచనదీ సంఘటన.

స్వయంగా దోపిడీ చేసిన బ్యాంకు ప్రాంగణంలోనే తాను నేరస్థుడిగా వెల్లడి అయ్యానన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు.

నేరం చేసిన స్థలంలోనే ఆచూకీ బహిర్గతమవ్వడం… బహుశా నేర చరిత్రలోనే ప్రప్రథమమేమో!

అది వాస్తవరూపం దాల్చుకుండా తను తప్పించుకోవాలి. ‘ఇక్కడ నుండి త్వరగా బయటపడితే… శకుంతలని కలిసి నేరుగా ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళిపోవడమే. ఆ తర్వాత వేద కాదు కదా… ఆ వేద బ్రహ్మ సైతం నా ఆచూకీ కనుకోలేడు’ అలా ఆలోచనల్ని మస్తిష్కంలో మలచుకుంటున్నాడు షణ్ముగం.

అగంతకుల నాయకుడు తన వైఖరిని మార్చుకుంటున్నట్లు…. పాండవీయం తలకి ఆన్చబడిన ఏకే 47ని తొలగించి… షణ్ముగం వైపుకి కదలబోయాడు.

ఇంతలో రెప్పపాటు కాలం కంటే అత్యంత వేగంగా జరిగి పోయిందోక సంఘటన.

గుండె గదుల్ని ప్రతిధ్వనింప చేస్తూ బాంబ్ ప్రేలుళ్ళు విన్పించాయి.

తృళ్ళిపడ్డారంతా!

చెయిన్ సిస్టమ్‌లా వరుసగా విన్పిస్తున్న ఆ శబ్దాలు… అత్యంత సమీపంలో… బ్యాంక్ ప్రాంగణం నుండి అని గ్రహించి… భయవిహ్వలురయ్యారంతా.

దుండగల నాయకుడు షణ్ముగం వైపుకి అడుగు వేయబోతున్న వాడల్లా…. మంత్రించినట్టు టక్కున ఆగిపోయాడు.

బ్యాంక్‌లోకి చొరబడడానికి…. వేదకి ఆ సమయం చాలు!

అందరూ ప్రేలుళ్ళ శబ్దాల్ని వినడంలో నిమగ్నమై వున్నారు.

పేలినవి డమ్మీ బాంబులని వాళ్ళు గ్రహించే లోపునే… గాలి పొరల్ని చీల్చుకుంటూ… వాయువేగంతో… లోపలకి దూసుకు వచ్చాడు వేద. అతని వెంటే సిబ్బంది.

ఆ దుండగులు చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటంటే బ్యాంకు ప్రధాన ద్వారాలు మూయకపోవడం. బిలబిలమంటూ సైనిక పటాలాలు యుధ్ధ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు సుమారు వందమంది పోలీసులు లోపలికి దూసుకు రావడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారంతా. తమ మారణాయుధాలకి పని కల్పిచాలన్న ఆలోచనే తాత్కాలికంగా విస్మరించి… బొమ్మల్లా నిలబడి పోయారు దుండగులు…

ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు వ్యాస్.

ఊహించని విధంగా చుట్టి ముట్టిన… ఊపిరాడకుండా చేసిన పోలీసు బలగాలకి తమ మారణాయుధాల్ని స్వాధీనపరచక తప్పలేదు దుండగులకు. షణ్ముగంతో సహా దుండగుల్ని పోలీసు జీప్ ఎక్కించారు.

గజ గజా వణుకుతూ నిలబడి వున్న అఖిల్‌ని ప్రేమతో ముద్దాడి ఆక్కున చేర్చుకున్నాడు వసంత్.

యుద్ధ పర్వం పరిసమాప్తమయ్యింది!

సాక్ష్యాధారాలు లేకుండా, కేవలం చిన్న పిల్లవాడి కథనం ఆధారంగా వేద తనని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకవెళ్తున్నడో అర్థం కాలేదు షణ్ముగానికి.

పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన అనంతరం అక్కడ శకుంతల కన్పించాక విషయం తెలిసి వచ్చిందతనికి.

***

ఇంటికి వచ్చాక బ్యాంక్‌లో జరిగిందంతా నివేదితకి వివరించి చెప్పాడు వసంత్.

అది విన్నాక నివేదిత చేసిన మొట్టమొదటి పని – అఖిల్ మెడలోని తాయత్తు వుందో లేదోనని చూడడం!

స్వామీజీ కట్టిన తాయెత్తు ఆ కుర్రాడి మెడలో క…న…బ…డ…లే…దు…

తాయెత్తు ఏమైంది కొడుకుని అడిగిందామె.

మొదట నసిగాడు. తర్వాత తల్లి రెట్టించి అడిగేసరికి గుటకలు మింగుతూ విషయం చెప్పాడు.

“మరే, మరే మొన్న ఆదివారం రోజున తాయెత్తులో ఏముందో స్వయంగా తెలుసుకుందామని దాన్ని పగలగొట్టాను. విప్పి లోపల చూశాను. స్వామీజీ చెప్పినట్లు హనుమంతుని ఫోటో చిన్నగా వుంది. మళ్ళీ దాన్ని కట్టుకోవడం రాలేదు నాకు. నీవు కోప్పడతావేమోనని తిరిగి స్కూల్ బ్యాగ్‌లో దాచేశాను. బ్యాగ్‌లో వుందది. తీసుకురానా?” భయపడుతూ అడిగాడు అఖిల్.

“వద్దులే” అంది.

కొడుకుని మళ్ళీ ప్రశ్నించక ఆలోచనల్లో పడిపోయింది.

ఆదివారం నాడు తాయెత్తు తీసేశాడు. యస్సై అఖల్‌ని తనకి తెలియకుండా బ్యాంక్‌కి తీసుకువెళ్ళింది అంతక్రితం బుధవారం. అప్పుడా తాయెత్తు వాడి మెడలోనే వుంది. అందుకనే అఖిల్ ఆ రోజు బ్యాంక్‌లో గతం తాలుకు ఏ సంఘటనని కూడా చెప్పలేకపోయాడా? ఈ రోజు వాడి మెడలో తాయెత్తు లేకపోవడంతో బ్యాంకు దోపిడీని బయటపెట్టగలిగాడా? లేదా కాకతాళీయంగా జరిగిపోయిందా? తన పరంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తోంది నివేదిత. ఎంత ఆలోచించినా తన అభిప్రాయం వాస్తవమేనన్న నిర్ధారణకి మటుకు రాలేకపోయింది.

***

“మనీ మనీ బ్యాంక్ దోపిడీకి వ్వూహరచన చేసింది సి.ఐ. ద్వివేది. అధికారికంగా పలుకుబడిని ఉపయోగించుకోవాలని అతడిని బెదిరించి మరీ ఈ పనికి ఒప్పించాను. శకుంతల సహకారంతో పథకాన్ని అమలు పరిచాను. నేననుకున్నది సాధించాను. చేసింది, చేయించేది అంతా నేనే. ఇదే నా సింగిల్ స్టేట్‌మెంట్” చాలా కామ్‌గా తన నేరాన్ని ఒప్పుకున్నాడు షణ్ముగం.

నేరంలో భాగస్థుడైన హతుడు ద్వివేది… హంతకురాలు శకుంతల… ప్రధాన నేరస్థుడు షణ్ముగంలకు తగిన శిక్షలు విధించడానికి కోర్టులో రంగం సిద్ధమవుతోంది.

***

బ్యాంక్ దోపిడీదారుల ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం బ్యాంక్ ప్రకటించిన పారితోషికం మొత్తాన్ని అఖిల్ విహార్ రాజ్ తరపున వసంత్‌కి అందేటట్లు జాగ్రత్తపడ్డాడు వేదవ్యాస్.

అఖిల్ లోని అదీంద్రియ శక్తిని ఎలివేట్ చేస్తూ వివిధ పత్రికల్లో వ్యాస పరంపరలు ప్రారంభమయ్యాయి. టీవి చానల్స్ అన్నీ ఆ కుర్రాడి ఇంటర్వ్యూని ప్రసారం చేయడానకి పోటీలు పడ్డాయి.

ప్రపంచంలో నేడు – ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా, అఖిల్ విహారి రాజ్ పేరే మారుమ్రోగిపోతోంది.

***

ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వులతో డి.యస్పీగా ప్రమోషన్ పొందాడు వేదవ్యాస్.

ప్రముఖ సైకియాట్రిస్ట్ శ్రీమతి జమునాదేవిని అఖిల్ వాళ్ళింటికి పిలిపించాడు వేద. ముందు హాల్లో సమావేశమయ్యారు.

వేద, వసంత్ నివేదిత… ఇలా అందరూ అఖిల్‌లో తమకు గల అనుభవాల్ని వివరించారు.

ఆ కుర్రాడి మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది జమునాదేవి.

“మీరు చెప్పిన విషయాల్ని బట్టి చూస్తే ఎనిమిదేళ్ళ పిల్లల మనస్తత్వంలానే మామూల్ కండిషన్‌లోనే వుంది ఈ కుర్రాడి మనోప్రవృత్తి. వాస్తవానికి మిగతా వయస్సు పిల్లలకంటే ఈ ఎనిమిది సంవత్సరాల పిల్లల కోరికలు ఒక్కసారి వాళ్ళ నేర్పుకి మించిపోయి వుంటాయి. ఉదాహరణకి పెద్ద విమానం చేసి ఎగుర వేయాలనీ, పెద్ద పెద్ద పడవల్ని తయారు చేసి కాలువల్లో వదలాలనీ… ఇలా తమ కోరికల్ని అపుడపుడూ వెలిబుచ్చుతుంటారు.

అందుకే బెలూన్‌లతో గాలిలో ఎగరాలనే ఉత్సుకతో ఆనాడు ఆ సాహసం చేశాడు అఖిల్. ఆరు ఏడు వయసుగల పిల్లల ఆలోచనల్ని పోలిస్తే ఇంటి చుట్టూ ఉండే వాతావరణాన్ని మించి పోవు. ఎనిమిదేళ్ల పిల్లలు అలా కాదు.

చాలా కాలం క్రిందట జరిగిన వాటి గురించి, ప్రపంచంలోని ఇతరుల గురించి తెలుసుకోవాలనే అభిలాషని సహజంగా వ్యక్తపరుస్తారు” ఎనిమిది సంవత్సరాల పిల్లల మనస్తత్వాన్ని ఎన్‌లైజ్ చేసి చెప్పింది జమునా దేవి, అఖిల్ వయసు ఎనిమిది కనుక.

జమునాదేవి అఖిల్‌ని ప్రక్క గదిలోకి తీసుకు వెళ్ళింది. ఆ కుర్రాడితో పర్సనల్‌గా మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ అమాయకంగా సమాధానాలిచ్చాడు వాడు. ఆ కుర్రాడిలో అసాధారణత్వం ఏదీ అగుపించలేదామెకు. హాల్లోకి తిరిగి వచ్చిన అనంతరం వాళ్ళ ముందర అదే భావన వ్యక్తీకరించిందామె.

“మామూలు సమయాల్లో సాధారణంగానే వుంటాడు. కానీ జరిగిపోయిన సంఘటనల్ని చెప్పాల్సిన సమయంలోనే అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శస్తుంటాడు. అదే మాకు అంతు చిక్కడం లేదు. ఎందుకలా జరుగుతోంది?” ప్రశ్నించింది నివేదిత.

బదులుగా పెదవులు విప్పింది జమునాదేవి.

“వైద్య శాస్త్రానికి అందని కథలాంటి ఒక వాస్తవం చెబుతా వినండి. ఫిలిప్పీన్ దేశంలో ఆ మధ్య ఒక ‘చిత్రమైన చికిత్స’ మొదలయ్యింది. దీని పేరు ‘ఫెయిత్ హీలింగ్’. వెయ్యికి పైగా వైద్యులతో చికిత్సని చేస్తున్నారు. ఫెయిత్ హీలింగ్ అంటే… ఎనస్థీషియా వంటి మత్తు మందులు ఏవీ ఇవ్వకండా కేవలం రోగికి విశ్వాసం కలిగించి వ్యాధిని నయం చేయడం.

ఈ ఫెయిత్ హీలింగ్ చిత్రమైన చికిత్సతో ఎలాంటి పరికారాలు లేకుండా… తొడుగులు (గ్లవ్స్) చేతులకి ధరింపకుండా… కేవలం గోళ్ళతోనే శరీరాన్ని చీల్చి తగిన శస్త్ర చికిత్స చేసి తర్వాత కుట్లు వేస్తారు. చూడ్డానికిది ఇబ్బందే అయినా ఎలాంటి సెప్టిక్ కాకుండా గాయం పూర్తిగా నయమవడం ఊహకందని విషయమే. చికిత్సకి ముందు అరగంట సేపు దైవ ప్రార్థనలు జరిపాక ఈ పెయిత్ హీలింగ్‌ని మొదలెడతారు… చికిత్స విజయవంతం కావడం కేవలం దైవ సహయమేనంటాడు డాక్టర్ గెర్ప్ ఛెసి. ప్రపంచ వైద్యులందర్నీ అబ్బురపరుస్తోంది ఈ చికిత్సా విధానం.

ఇప్పుడీ విషయం మీకెందుకు చెప్పానంటే దైవ సహాయం అనే పదం ఇంపార్టెన్స్ గురించి తెలియాలని.”

“మీ అబిప్రాయం ప్రకారం ఈ కుర్రాడిలోని అద్భుత శక్తికి కారణం దైవలీల అంటారా?” అడిగాడు డియస్పీ వేదవ్యాస్.

“నేను చెప్పింది నా స్వంత అభిప్రాయం కాదు. విద్యావేత్తలు, వైద్యులు, మానసిక తత్త్వవేత్తలు… ఇలా ఎందరో దేవుడిపై భారం వేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి” అంటూ ఆగింది.

అందరూ మౌనంగా ఉన్నారు. తిరిగి చెప్పసాగింది.

“శాస్త్రీయంగా చెప్పాలంటే గర్భంలో వున్నపుడే శిశువులు అన్నిటికీ స్పందిస్తారని ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఒక పరిశోధన వలన బయటపడింది. గర్భస్థ శిశువు సంగీతానికి స్పందించగలడని సిడ్నీలోని రాయల్ హాస్పిటర్‌కి చెందిన డాక్టర్లు వెల్లడించారు. వీరు కొంత మంది పిల్లలపై ప్రయోగాలు నిర్వహించి గర్భంలో ఉన్నప్పుడు వివిధ సంగీత బాణీలు విన్న పిల్లలు అలా వినని పిల్లల కంటే ఎక్కువ మేధా శక్తిని ప్రదర్శించినట్లు కనుగొన్నారు. దాంతో గర్భంలో వున్నపుడే శిశువులు వివిధ శబ్ధాలను వినగలగడమే కాకుండా వాటికి స్పందిస్తారని ఈ పరిశోధకులు తెల్సుకున్నారు. ఈ స్పందనలే వారిలోని ఉన్నత ప్రజ్ఞకి తోడ్పడతాయని ఒక అభిప్రాయానికి వచ్చారు.

అందుకే పుట్టుకకి పూర్వం జరిగే తొమ్మిది నెలల అభివృద్ధే ఆ తర్వాత జరిగే అభివృద్ధికి పునాది అవుతుంది.

అదే విదంగా –

గర్భంలో ఉన్నప్పుడే అఖిల్‌కి ఈ అతీంద్రియ శక్తి వచ్చి ఉంటుంది! అది ఇప్పుడు, ఈ ఎనిమిదేళ్ళ వయస్సులో పునః ప్రేరితమై ఉంటుంది. ఎనిమిది సంవత్సరాలు దాటాక పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అసలే లేకుండా పోతుందా అని.”

మిగతా ముగ్గురూ ఆసక్తిగా వింటున్నారు. వేదవ్యాస్ పోలీసు బుర్రకే సైన్స్ విషయాలు అచ్చెరవు కలిగిస్తున్నాయి. వసంత్‌కి విషయాలన్నీ కొత్తగా గమ్మత్తుగా అన్పిస్తున్నాయి.

జమునాదేవి తిరిగి చెప్పసాగింది.

“మహాభారతంలోని అభిమన్యుని కథ మనకందరికీ తెలుసు, గర్భస్థ శిశువుగా నేర్చుకున్న పద్మవ్యూహం మహాభారత సంగ్రామ సమయంలో అభిమన్యునికి ఉపయోగపడింది. అలాగే అఖిల్‌కి అబ్బిన అద్భుత శక్తి గోదావరి ఖనిలో చిన్న పిల్లవాడి హత్య, మనీ మనీ బ్యాంక్ దోపిడీ లాంటి సంచలన రహస్యాలు బట్టబయలు చేయడానకి ఉపయోగిచబడింది. ఇదంతా దైవ ప్రేరణ అనుకోవాల్సి ఉంటుంది.”

“ఖచ్చితంగా దీనికి రీజన్ లేదంటారా?” అడిగాడు వసంత్ క్యూరియాసిటీగా.

మిగతా ఇద్దరూ ఆమె వంక చూశారు.

అఖిల్ వింటున్నాడు బుద్ధిగా. అర్థమై, కాకుండా వున్నాయి జమునాదేవి చెప్పే విషయాలు.

“లేకేం వుంది. అభిమన్యుని కథ చాలా వరకు శాస్త్రీయంగా యథార్థమే నంటున్నారు పరిశోధకులు మానసిక శాస్త్రవేత్తలు.

ఒక తల్లి గర్భంలో పిండం 6 నెలల వరకే పెరిగి అవయవలన్నీ ఏర్పరుచుకునే స్థితికి చేరుకుంటుంది. 7వ నెలలోకి ప్రవేశించినప్పటి నుండి బయటి శబ్దాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది.

తల్లి గర్భంలో ఉండగానే ఆలోచనలతో పాటు వాటిని ప్రేరేపించే పంచేద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధంగా వుంటాయి. అదిగో మానవుడి ఆలోచనా శక్తి అప్పుడే… తల్లి గర్బంలో ఉండగానే మొదలవుతుంది.

అయితే ఎప్పుడైతే గర్భస్థ శిశువు భూమ్మీద పడుతుందో వెంటనే వాటన్నింటిని మరచి పోతుంది. అందుకే ఆ విషయాలు ఏవీ మానవులకు గుర్తుండడంలేదు. ఏ కొద్ది మంది మహనీయులకో… అభిమన్యుడి లాంటి వారికో.. అఖిల్ వంటి వారికో… ఆ స్మృతి అలాగే నిలిచిపోతుంది. అద్భుతాల్ని సృష్టింపచేస్తుంది. దట్సాల్!

ఆసక్తిగా వింటున్నారందరు. క్షణకాల మనంతరం గొంతు విప్పింది మళ్ళీ.

“నా విశ్లేషణ ప్రకారం నివేదిత గర్భవతిగా ఉన్నపుడు గడిచిన సంఘటనని ఎవరి ద్వారా వినడమో, చదవడమో చేసి వుంటుంది. ఇదే విషయాన్ని గర్భస్థ శిశువుగా వున్న అఖిల్ వినడం జరిగి వుంటుంది. బహుశా అలా అతనిలో ఈ అద్భుత శక్తి అనూహ్యంగా క్రియేట్ అయ్యంటుంది.”

పై విషయాన్ని నిర్ధారించడానికి నివేదితని ప్రశ్నించింది. ఎంత ప్రయత్నించినా నివేదితకు ఆ సమయంలో ఏవీ గుర్తుకు రాలేదు.

“అఖిల్ లోని అద్భుత శక్తి ఇలాగే శాశ్వతంగా నిలిచి వుంటుందంటారా?” ప్రశ్నించాడు వసంత్.

“వుయ్ కాంట్ సే” అంటూ ఆగి, “ఈ టాపిక్ గురించి ఇంత కంటే చర్చించాల్సిందేమీ లేదు” అంటూ ముగించిందామె.

***

ఆ రోజు – అఖిల్ విహారీ రాజ్ పుట్టిన రోజు. మిగతా పుట్టిన రోజులకీ ఈ బర్త్‌డేకీ విశిష్టమైన తేడా వుంది. ఎందుకంటే అది ఆ కుర్రాడికి తొమ్మిదవ బర్త్‌‌‌డే. నిన్నటితో ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి వాడికి.

ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ జమునాదేవి విశ్లేషణ ప్రకారం అఖిల్ లోని అద్భుత శక్తి ఎనిమిదేళ్ళతోనే అంతమవ్వాలి. తొమ్మిదివ ఏట ప్రవేశించిన అఖిల్‌లో తిరిగి ఆ శక్తి పునరావృత్తం కాకుంటే… ఇక శాశ్వతంగా అతనా శక్తిని కోల్పోయినట్లే.

అందుకే ఈ తొమ్మిదేళ్ళ వయసు పూర్తయ్యే వరకూ ప్రతి నిమిషం అఖిల్‌ని కనిపెట్టుకుని ఉండాలని వసంత్, నివేదిత నిశ్చయించుకున్నారు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here