మిర్చీ తో చర్చ-26: ప్రేమ – మిర్చీ… ఒకటే-8

0
6

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]”లో[/dropcap]నకడుగెట్టచ్చాండీ?”

మామిడి తాండ్రని ఒకపక్క నుండి లాగి పట్టినట్లు ఆ కంఠం ఆ వాక్యాన్ని అలా లాగి డోర్ దగ్గర నిలిపివేసినట్లుంది.

“అలా కూర్చోండి” చెప్పాను.

చొక్కాకి పైన రెండు బొత్తాలు అలా గాలికి వదిలేసాడు. సోఫాలో కూర్చున్నాడు. సుందరం లోపలినుండి వస్తూ ఆయన్ని కొద్దిగా అనుమానంగా చూసాడు. యాభై మూడు సంవత్సరాల వయసుండవచ్చు అనిపించింది.

“చెప్పండి” సుందరం అన్నాడు.

“నన్ను చిరంజీవి అంటారండీ సారు”

“ఓ. చెప్పండి చిరంజీవి గారూ!”

“కాలనీలోని మిర్చీ బండీ అతను మీ అడ్రస్సు చెప్పాడండీ”

“ఓహో”

“ఏదో మిర్చీ కౌన్సిలింగ్ చేస్తారట గదండీ?”

“అవునండీ”

“రాజమండ్రి సారు మాది”

“గుడ్”

“పాప ఈ ఊళ్ళో ఉద్యోగం సారూ”

“శభాష్”

“అమ్మడు కదిలితే కవిలిపోతుంది సారూ”

“అవునాండీ?”

“అవునండీ. నిలబడితే నలిగిపోతుండేదండి”

“ఓ”

“మరండీ… అల్లా ఎక్కువ సేపు కూర్చుంటేనాండీ, మరి, కండిపోతుందండీ”

“బాగా నాజూకుగా పెరిగిందన్నమాట!”

“అదేనండీ. ప్రపంచం తెలియదండీ అస్సలా! అమ్మడు ఈ ఊరుకొచ్చిందంటే నేను రెండు రోజులు భోజనం చెయ్యలేదండీ, వాళ్ళ అమ్మ…”

“మూడు రోజులు ముద్ద ముట్టనే లేదన్నమాట!”

“లేదండీ సారూ… ముద్ద మాట అలా ఉంచండి, అస్సలా మాటే బొత్తిగా పడిపోయిందన్నమాటండీ”

“అయ్యో… బాగా అటాచ్ అయి ఉన్నారు!”

“మరండీ”

“ఇప్పుడు సమస్య ఏంటండీ?”

“సమస్యంటే మరండీ, అలాక్కాదండీ. మిర్చీ బజ్జీలు మరీ ఎక్కువగా తినేస్తోంది సారూ!”

సుందరం నోరు అలాగే ఆగిపోయింది.

“అన్యాయం సార్! మిర్చీ బజ్జీలు ఎక్కువగా తినడం అనేది సమస్య ఎందుకవుతుంది? పైగా మీరు ఆ మాట ఎక్కడ చెబుతున్నారు? మా జీవనాధారం మిర్చీ!”

“అయ్యో మీరు తప్పుగా అనుకోకండి సారూ! ఆ మాటకొస్తే నేను మిర్చీ బజ్జీ అస్తమాను తింటూనే ఉంటాను. గోకవరం బస్‌స్టాప్‌లో అమ్మే మిర్చీలలో ముప్పావు వంతు నేనే తింటాను సారూ!”

“శభాష్”

“అమ్మాయికి ప్రపంచం తెలియదండీ”

“రంగనాయకి బదులు అమాయకి అనుకుందాం”

“అనుకోవటం కాదు సారూ, అనేద్దాం”

“శుభం భూయాత్!”

“అలాగ”

“ఇంతకీ మీ బాధేమిటి?”

“మిర్చీ బజ్జీలు ఎగబడి తినేస్తున్నదన్న మాటండీ”

“అది అసలు సమస్యే కాదని ఇప్పుడే చెప్పాను”

“అలాక్కాదు సారు. అదివరకు తినేది కాదు”

“ఓహో”

“అలాగండీ! ఒంటరితనం వల్ల ఇల్లా ఇలాంటివి ఎక్కువగా తినేస్తున్నదనే బాధ నులిపురుగులా నమిలేస్తున్నదన్నమాటండీ”

“ఊ… అర్థమవుతోంది”

“మిర్చీ బజ్జీకి ఇంత డిమాండు ఉంటుందని నాకు తెలియదు”

“బహుశా మీరు సరైన మిర్చీ బజ్జీ ఎన్నడూ తినలేదనుకుంటాను. లక్షలాది ప్రజలు మక్కువతో తింటారు మిర్చీ బజ్జీలు”

“ఛా”

“అవును మరి. మనిషి బాధలో మందు సేవిస్తాడు, సుఖంలోనూ గ్లాసు తిరగేసి త్రాగుతాడు. మిర్చీ కూడా అంతే. కోపంలో నములుతాడు, భార్య మీద విసుగ్గా ఉంటే భారీగా తింటాడు, మంచి వార్త వింటే మరొకరికి పెట్టి మరీ తింటాడు”

“మా అమ్మాయి అమాయకురాలు”

“కరెక్ట్”

“ఎక్కువగా ఒంటరిగానే తింటోంది”

“ఇంతకీ అసలు సమస్య?”

“ఎలా చెప్పాలి సారూ?”

“నేను చెబుతాను”

“…..”

“సింపుల్. మీ అమ్మాయి ఆకుపచ్చ రంగు సల్వార్ సూటు ఎక్కువగా తొడుక్కుంటుంది కదూ”

“అంత నిక్కచ్చిగా నేను చెప్పలేను సారూ”

“ఎందుకలాగ?”

“మా అమ్మడు అమాయకురాలు సారూ”

“కరెక్ట్”

“నేను అమ్మడు అమాయకత్వాన్ని ఎవరు మోసం చేసారోననే గాభరాలో మిగతావి ఎక్కువగా పట్టించుకోనన్నమాటండీ”

“ఓ… బస్సులోంచి ఓ ఆరుగంటల ప్రాంతంలో దిగుతూ ఉంటుంది”

“ఆ… కావచ్చన్న మాటేనండీ”

“ఊ… ఓ మాటనుకుందాం”

“చెప్పండి సారూ”

“అమ్మడు ప్రేమలో పడింది”

అతను అలా రెండు నిముషాలు కళ్ళు ఆర్పుతూనే ఉండిపోయాడు.

“ఏమైంది సార్?”

“ఏం లేదు సారూ! దిక్కుమాలిన ట్యూబ్‌లైట్ వెలిగి వెలిగి చివరికి పూర్తిగా వెలిగినట్టు ఇలాంటిది విన్నప్పుడు కళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటాయండీ. అంతే అనేస్తారా?”

“తిరుగులేదు. అంతే. అది ఎవరో కూడా చెబుతాను”

“అయ్ బాబోయ్!”

సుందరం నా వైపు తిరిగాడు.

“చూసావా? మన నరసింహం కేసు. ప్రేమికులిద్దరూ మన దగ్గరే ఉన్నారు. మనం దగ్గరుండి పెళ్ళి చేయించాల్సిందే”

అతను నిలబడ్డాడు. సుందరం కూర్చోమన్నాడు.

“చూడండి సార్, సింపుల్. మీ అమ్మడు నమ్ముకొన్న గుమ్మడిపండు మా దగ్గర మిర్చీ మీడియం ద్వారా వచ్చినవాడే”

“సారూ, మా అమ్మాయి అమాయకురాలు.

“కరెక్ట్…”, నన్ను చూసి మెల్లగా అన్నాడు, “కాకపోతే ఈ సింహాన్ని ఎందుకు ప్రేమిస్తుంది?”

“సారూ, ఏదో అనేసారు మళ్ళానూ…”

“ఆ, ఏం లేదు సార్, మనం ఇప్పుడు పెళ్ళి చేసేయ్యాలి. అంతే”

“సారూ… ఆ కుర్రాడిని నేను చూడాలి”

“బాగుంటాడు”

“ఎలాగ?”

“ఇటుప్రక్క నుండి చూస్తే నాకు నచ్చాడు. అటుప్రక్క నుండి చూస్తే ఈయనకు నచ్చాడు”

“నేను స్ట్రేట్‌గా చూసేస్తాను సారూ. మరి నచ్చాలి గదన్నమాటండీ”

“ఓ. అలాగే. మీరొక్కసారి అమ్మడిని ఇలా మా దగ్గరికి తీసుకుని రావాలి”

“ఎందుకండీ?”

“అదేవన్నమాట? మనం పెళ్ళి చేస్తున్నాం”

“ఓ మాటంటాను సారూ”

“చెప్పండి”

“మీరు పెళ్ళిళ్ళ పేరయ్యలు కూడానండీ?”

“పోనీ అలా అనుకోండి. తప్పేముందండీ! మీరు మాట్లాడుకున్న దాంట్లో ఇరవై అయిదు శాతం మాత్రమే మాకు!”

అతను లేచాడు.

“కూర్చోండి”

“కూర్చోను. అసలు… ఈ యవ్వారమంతా మీరు నడిపిస్తున్నారని అర్థమైంది”

“అయ్యో సార్…”

“అమ్మడు పిచ్చ అమాయకురాలు”

“కరెక్ట్. సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తోంది”

“అలాక్కాడు. మా అమ్మడు ఆడ పోలీసు!”

నేను కూర్చున్న కుర్చీ ఎందుకో కొద్దిగా కదిలి క్షణంలో నేల మీదున్నాను.

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here